బీజేపీ
ఓడుతుంది....కాంగ్రెస్ గెలవలేదు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక
(28-07-2018)
బిజెపి
నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ
ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన ఘట్టం దేశ రాజకీయాలకు సంబంధించి అనేకు గుణపాఠాలు
నేర్పింది. అనేక అంశాల్లో స్పష్టత కూడా ఇచ్చింది. స్వరాష్ట్రంలో జరుగుతున్న హోదా
పోరులో ఎదురీదుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోతామని తెలిసి
కూడా తమ పార్టీ ఎంపిల ద్వారా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టించారు. సంఖ్యాపరంగా
గెలుపోటములు ముందే నిర్ణయించబడినప్పటికీ, ప్రత్యేక హోదాపై చర్చను
నైతికతకు ముడిపెట్టారు. టిడిపి ఎంపిలు తమ ప్రసంగంలో సైతం దీనిని మెజారిటీ(ఆధిక్యత), మోరాలిటీ(నైతికత)కు మధ్య జరిగిన పోరుగా ప్రస్తావించారు. ఈ చర్చ సందర్భంగా
బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఈ దేశానికి తాము మాత్రమే దిక్కు అని చెప్పుకోవడానికి తమకొచ్చిన అవకాశాన్ని, సమయాన్ని వాడుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధి తన ప్రసంగం ముగిశాక
ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఆలింగనం చేసుకోవడం, దానికి బదులుగా మోడీ కూడా
రాహుల్ ను వెనక్కి పిలిచి కరచాలనం చేయడం అందరం చూశాం. ఈ తతంగం చూసిన వారికి “మనిద్దరం
కలిసి అందరినీ మూర్ఖులను చేద్దాం” అనే నానుడి గుర్తొచ్చింది. దేశంలో కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే ఒకదానికొకటి ప్రత్యామ్నాయమని, వేరెవరికీ చోటు లేదని వారి చర్యలు చెప్పకనే చెప్పాయి.
సభలో సంఖ్యాబలం, అవిశ్వాస తీర్మానం వీగడం లాంటి విషయాలు పక్కనబెడితే ఈ సందర్భంలో ఒకటి మాత్రం
స్పష్టమయింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిజెపి అధికారంలోకి రాలేదని తేలిపోతున్నది.
ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయలేదనే కఠిన వాస్తవం కూడా
స్పష్టమవుతున్నది. 2014 ఎన్నికల్లో బిజెపికి మిత్రపక్షంగా ఉండి, కలిసి పోటీ చేసిన
పార్టీలు ఇప్పుడా పార్టీకి దూరమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకుని పోటీ
చేసిన టిడిపి ఏకంగా బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానమే పెట్టింది. మరో
మిత్రపక్షమైన శివసేన ఓటింగ్ దూరంగా ఉంది. బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నది.
మరో రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ప్రత్యేక హోదా ఇవ్వాలనే టిడిపి డిమాండ్ ను సమర్థించాయి. ఇది బిజెపి
ప్రభుత్వంపై పరోక్షంగా అవిశ్వాసం ప్రకటించడమే. ఇదే సందర్భంలో ఎఐఎడిఎంకె రూపంలో
కొత్త మిత్రపక్షం దొరికడం బిజెపికి కొంతలో కొంత ఊరట. ఈ సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ తనదంటూ
ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఓటింగ్ లో పాల్గొనకుండా అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కు సమదూరంలో ఉంది. స్వయంగా ప్రధానిచే ప్రశంసలు అందుకున్న
టిఆర్ఎస్,
తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడంలో, బిజెపి ఉదాసీనతను గట్టిగా విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అటు
బిజెపికి,
ఇటు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని
కూడగట్టే పనిలో ఉన్న టిఆర్ఎస్ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా అత్యంత
వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
అవిశ్వాస
తీర్మానమనే తంతు ముగిశాక ఇప్పుడు దేశ ప్రజలందరి ముందున్న ప్రశ్న.. తర్వాత ఏం జరుగుతుంది
అనేది. వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగం ఎలా ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. జాతీయ
పార్టీలకు,
ప్రాంతీయ పార్టీలకు విజయావకాశాలు ఎలా ఉంటాయి? వాటి పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది మిలియన్ డాలర్ల
ప్రశ్న అయినప్పటికీ,
సమాధానం లేకపోలేదు. స్పష్టమైన సమాధానమే ఉంది. తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దికాలం క్రితం దేశ ప్రజలకిచ్చిన “ప్రస్తుత రాజకీయ
వ్యవస్థలో గుణాత్మక మార్పు” కోసం ప్రయత్నమనే పిలుపు ఈ సందర్భంగా గమనంలోకి
తీసుకోవాల్సిన అంశం.
అవిశ్వాస
తీర్మానంపై చర్చ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన
అవసరాన్ని నొక్కి చెప్పాయి. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మాట్లాడిన అధికార
పక్షం సభ్యులుగానీ,
వ్యతిరేకించిన ప్రతిపక్షాలు గానీ అసలు విషయాలపై విస్తృతంగా
చర్చించలేకపోయారు. కీలక అంశాలను విస్మరించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం
ప్రకటించడానికి అసలు కారణాలను విపక్షం స్పష్టంగా చెప్పలేకపోయింది. నరేంద్రమోడీతో
సహా అధికార పక్ష సభ్యులు తమ ప్రభుత్వం చేసిందేమిటో దేశ ప్రజలకు వివరించలేకపోయారు.
నాలుగేళ్లలో తాము చేసిన గొప్ప పనులేమీ లేకపోవడం అధికారపక్షానికి బలహీనతగా మారింది.
ఈ దేశానికి ఏమి కావాలి?
వ్యవస్థలో ఎలాంటి మార్పు తేవాలి? అనే విషయాలపై అటు అధికార పక్షంలోని బిజెపి, దాని మిత్రులకు గానీ, ప్రతిపక్షంలోని కాంగ్రెస్, దాని మిత్రులకు గానీ స్పష్టత లేదు. నరేంద్రమోడీ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే, టిఆర్ఎస్ పార్టీ పరిపక్వత గలిగిన పార్టీ అని ప్రశంసించడం లాంటి విషయాలను
మినహాయిస్తే,
వార్షీక బడ్జెట్ ప్రసంగం లాగానే సాగింది.
స్వాతంత్ర్యం
వచ్చి 70 ఏండ్లు పూర్తయినా దేశంలో ప్రజలు ఇంకా కనీస అవసరాల కోసం పోరాడుతూనే ఉన్నారు.
మౌలిక సదుపాయాలే సమకూరలేదు. ఈ అంశాలను, అవిశ్వాసం
సందర్భంగా అటు ప్రతిపక్షాలు గానీ, ఇటు అధికార పక్షం కానీ
సమర్థంగా ప్రస్తావించలేకపోయాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా,
సింగపూర్, తైవాన్, మలేసియా,
ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం,
ఫిలిప్పీన్స్ తదితర ఎన్నో దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే, భారతదేశం ఎందుకు వెనుకబడిపోతుందో, ఈ దేశానికున్న
అవరోధాలేంటో ఇప్పటిదాకా ఈ దేశాన్నేలిన కాంగ్రెస్, బిజెపిలు చెప్పలేకపోయాయి. చెప్పలేని పరిస్థితిలో వుండడం దురదృష్టం.
భారతదేశం
అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణమైన జాతీయ పార్టీలే, అధికారంలో ఉన్న ఆ పార్టీలే అవిశ్వాసం సందర్భంగా మళ్లీ మాట్లాడాయి. కానీ ఆ
పార్టీల్లో ఎవరూ కూడా దేశానికి కావాల్సినందేంటో, తేవాల్సిన సంస్కరణలేంటో విడమరిచి చెప్పలేకపోయారు. దేశ సంపదను ఎలా పెంచుకోవాలో, రాష్ట్రాలు ఎలా శక్తివంతం కావాలో, పేదరికాన్ని ఎలా
తరిమికొట్టాలో,
దేశాభివృద్ధి నమూనాను ఎలా రూపొందించాలో ఎవరూ చెప్పలేదు.
కాంగ్రెస్ కానీ,
బిజెపి కానీ తమ మెదళ్లకు పదును పెట్టి, ఈ సమయానికి దేశానికి ఏమి కావాలనే విషయంలో వినూత్నంగా ఆలోచించే ప్రయత్నం
చేయలేదు. ఒకరిని ఒకరు నిందించుకోవడానికే తమ శక్తినంతా ఉపయోగించుకున్నారు. దేశాన్ని
శక్తివంతం చేయడం,
ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగపరమైన సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు తదితర
అంశాలపై ఏమాత్రం చర్చ జరగలేదు. ఈ విషయాలను జాతీయ రాజకీయ పార్టీలు ప్రస్తావించలేదు.
గుణాత్మక మార్పు కోసం జాతీయ ఎజెండా రూపొందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు పైన పేర్కొన్న అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు వివిధ వేదికల్లో ప్రస్తావిస్తూనే
ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను
ప్రపంచమంతా ఆసక్తిగా వీక్షిస్తున్న సమయంలో జాతీయపార్టీలు ఈ దేశ జౌన్నత్యాన్ని
పెంచే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ప్రస్తుత
పరిస్థితిని పరిశీలిస్తే,
వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమయ్యే
అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. మోడీ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువగా
ఉన్నాయి. గణాంకాలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏ
రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందనే విషయం పరిగణలోకి తీసుకుని, అవి గెలిచే లోక్ సభ స్థానాలు అంచనా వేస్తే కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.
దక్షిణాది
రాష్ట్రాలైన కేరళ,
తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ తో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 165 లోక్ సభ స్థానాలున్నాయి.
వాటిలో బిజెపి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఇక మిగిలిన 378 స్థానాల్లోనే బిజెపి 273 స్థానాలు గెలుచుకోవాలి. ఇది అంత సులభం కాదు. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున
మిత్రపక్షాలు కోల్పోతున్న ఎన్.డి.ఏ. కూటమి బలహీన పడుతున్నది. ఎన్.డి.ఏ. కూటమిగా కూడా
అధికారంలోకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో 38 స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్,
గోవా లాంటి రాష్ట్రాల్లో మాత్రమె బిజెపి చాకచక్యంగా
వ్యవహరించితే,
లబ్ది పొందే అవకాశాలున్నాయి.
ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్,
గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ గఢ్,
మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 100 సీట్లున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం బిజెపికన్నా కాంగ్రెస్ పరిస్థితే
మెరుగ్గా ఉంది. 182 సీట్లున్న ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్,
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేయాల్సి ఉంది. ఈ
రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రాష్ట్రాల్లో
బిజెపి కూడా అంత బలంగా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎటొచ్చీ 101 స్థానాలున్న కేరళ,
కర్ణాటక, పంజాబ్, హర్యానా,
ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో
ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 100 సీట్లున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్,
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. 425 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు,
ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర,
జార్ఖండ్, అస్సాం, పంజాబ్,
బీహార్, జమ్ము కాశ్మీర్, హర్యానా,
కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపితో సంబంధం లేకుండానే ప్రాంతీయ పార్టీలు దాదాపు 275 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఇది మ్యాజిక్
ఫిగర్ కంటే ఎక్కువ.
మొత్తంగా తేలేదేమిటంటే, వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్
పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో
బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న
జాతీయ ఎజెండా అమలయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి, కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని నడిపించే అవకాశాలు కూడా పుష్కలంగా
కనిపిస్తున్నాయి.
ఒక క్రికెటర్ ప్రధాని అవగాలేనిది కేసీఆర్ అవరా ? ఎవరూ గతిలేనపుడు అనామకులు కూడా ప్రధాని అయే చాన్స్ ఉంది.
ReplyDelete