జంబుమాలిని, మంత్రిపుత్రులను, సేనానాయకులను చంపిన హనుమ
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (23-07-2018)
హనుమంతుడు చైత్య పాలకులను చంపి, అందరూ వినేలా వానర సేన బలం గురించి బిగ్గరగా చెప్తున్న
సమయంలోనే, రావణుడు పంపిన మహాబలశాలి, ప్రహస్తుడి
పుత్రుడు జంబుమాలి అక్కడకు అతివేగంగా వచ్చాడు. ఎర్రటి పూదండలు, ఎర్రటి వస్త్రాలు, కుండలాలు
ధరించాడు. ఇంద్రుడి ధనస్సు లాంటి విల్లును చేత ధరించాడు. కంచరగాడిదలు కట్టిన
రథమెక్కిన జంబుమాలి, బాణాన్ని తీసుకుని, దిక్చక్రం వణికేటట్లు, వింటితాడును మీటుతాడు. తనవైపు వస్తున్న పెద్దదేహంకల వానర వీరుడిని చూసిన ఆ
రాక్షసుడు, తనకు తగిన శత్రువే వీడనుకుని పొంగిపోయాడు. వింటిలో పదిబాణాలు సంధించి, హనుమంతుడి
చేతులమీద, ముఖంపైన, తలమీద అవి
నాటుకునేటట్లు విసురుతాడు.
(బాహుయుద్ధం చేసేవారిని పంపితే కింకరులను చంపినట్లే
చంపుతాడని భయపడ్డ రావణుడు వింటి యుద్ధం చేసేవారిని పంపాడు ఈసారి).
బాణాల దెబ్బతిన్న హనుమంతుడి ముఖం నెత్తుటితో తడిసి, సూర్యకిరణాలకు
వికసించిన శరత్కాలపు తామరపూవులాగా వుందప్పుడు. ఎర్రటి హనుమంతుడి ముఖం ఎర్రటి
నెత్తురు బొట్లతో, ఆకాశాన ఎర్రటి చందనపు బొట్లున్న ఎర్రటి
తామరలాగా వుంది. వరుస వెంట బాణాలు తాకడంతో, కోపగించిన హనుమంతుడు, దగ్గర్లో వున్న ఓ బండరాయినెత్తి వాడిమీదకు విసురుతాడు.
దాన్ని వాడు పదిబాణాలతో తునాతునకలు చేసాడు. హనుమంతుడప్పుడొక చెట్టు పీకి, గిరగిరా
తిప్పుతుంటే దాన్ని వాడు నాలుగు బాణాలతో నరుకుతాడు. ఆ వెంటనే, అయిదుబాణాలతో
భుజాలను, ఒకబాణంతో రొమ్మును,
పదిబాణాలతో స్తనప్రదేశాన్ని కొట్టాడు. మండుతున్న బాణాలతో తగిలిన ఆ దెబ్బలకు, దేహం వేధిస్తుంటే, మునుపటిలాగానే, ఇనుప గుండునొక
దాన్ని తీసుకుని, గిరగిరా తిప్పి వాడి వక్షస్థలాన్ని గురిచూసి కొట్టాడు హనుమంతుడు. ఆ దెబ్బకు, తల ఏదో, మొండెమేదో, చేయి ఎక్కడో, విల్లేమయిందో, మోకాళ్లు ఏమైనాయో? అని గుర్తించలేని
రీతిలో, జంబుమాలి పొడిపొడిగా, ముక్కలు చెక్కలై నేలకూలాడు.
రాధంతో, దానికి కట్టిన కంచర
గాడిదలతో, వాడని, సంధించని బాణాలతో,
వంటిమీదున్న అందమైన ఆభరణాలతో సహా రాక్షసుడు ముద్దగా పడిపోయాడు. చావగా మిగిలిన
కింకరులు జంబుమాలి చచ్చాడని రావణుడికి తెలిపారు. మళ్లీ కోపగించిన రావణుడు, శౌర్య దర్పాల్లో
గొప్పవారని పేరున్న ఏడుగురు మంత్రిపుత్రులను పంపాడు హనుమంతుడిమీదకు.
అగ్నిలాగా మండుతున్న ఆ ఏడుగురు మంత్రిపుత్రులు, ఇల్లువెడలి, విల్లులు, బాణాలు, ఇతర యుధ్ధ సామగ్రి, ఆయుధాలూ తీసుకుని, ఎవరికివారే గెలవాలన్న కోరికతో వచ్చారక్కడకు. బంగారుమయమైన
ధ్వజాలున్న రధాలెక్కి, మేఘాలురిమినట్లు శబ్దంచేస్తూ పోయారు యుధ్ధానికి. కింకరుల మరణవార్త విన్నవారైన
వీరి తల్లులు, వీళ్ల గతేమవుతుందోనని చుట్టపక్కాలతో చెప్పుకుని ఏడ్చారు. ఆ రాక్షసులు
హనుమంతుడిని సమీపిస్తుంటే, వాళ్ల రథచక్రాల ధ్వని ఉరుముల్లాగా,
బాణప్రయోగం వర్షంలాగా అనిపించింది. వాళ్లు మేఘాల్లాగా కమ్ముకున్నప్పటికీ, హనుమంతుడేమీ
కలతపడలేదు. చక్కగా ద్వారం తోరణం మీద కూర్చున్న హనుమంతుడు చావుమూడిన రాక్షసులకు
స్వాగతం చెప్తోన్న మృత్యుదేవతలాగా కనిపిస్తున్నాడా! ఏమో! అన్నట్లున్నాడు. అతి
వేగంగా వస్తున్న వారి బాణాలకు గురికాకుండా, ఆకాశంలోనే తిరగసాగాడు. ఇంద్రధనస్సుతో కూడిన మేఘాల గుంపును
వాయువు చెదరగొట్టినట్లు, హనుమంతుడు రాక్షసులను హెచ్చరిస్తూ కలవరపర్చాడు.
పెద్ద సింహనాదం చేసి, రాక్షసులను
చంపుదామన్న తొందరలో, ఎక్కువ సేపు వీళ్లతో యుద్ధం చేయాల్సిన
అవసరం లేదనుకుంటూ, వాళ్లను అరిచేతుల్తో, కాళ్లతో కొట్టి, గోళ్లతో చీల్చేసాడు. చెవులదిరేటట్లు మరొక్కమారు గర్జించగా, ఆదెబ్బకు, ధ్వనికి, కొందరు చావగా, మిగిలిన కొందరు పారిపోయారు. ఇలా రాక్షసులను చంపిన హనుమంతుడు, వెంటనే
ఉద్యానవనంలోకి పోయి, ఇంకా యుద్ధం చేయాలన్న కోరికతో, మల్లీ తోరణం ఎక్కి కూర్చున్నాడు.
మంత్రికుమారుల మరణవార్త విన్న రావణుడు తన ఐదుగురు
సేనానాయకులైన, విరూపాక్షుడు, దుర్ధరుడు,
యూపాక్షుడు, భాసకర్ణుడు, ప్రహసుడు
అనేవారిని పిల్చి, వారి సమస్త సైన్యంతో వెళ్లి, కోతిని పట్టుకుని తెమ్మంటాడు. కోతేకదా అని అలక్ష్యం చేయకుండా, తగు ప్రయత్నం చేసి, దేశకాల విరోధం
లేకుండే విధంగా కార్యాన్ని నెరవేర్చుకుని రమ్మంటాడు. వాడు నిజమైన కోతికాదనీ, ఇంద్రుడు తపస్సు
చేసి తన్ను జయించాలన్న కోరికతో,
పెద్దభూతాన్ని సృష్టించి పంపాడనీ వాళ్లతో చెప్పాడు.
వాళ్లను పొగుడుతూ: "మీసహాయం వుండవల్లేకదా, నేను
అమితబలవంతులైన నాగులను, కుబేరుడిని, దేవతలను, మహర్షులను, దానవులను యుధ్ధభూమిలో గెల్చాను"
అంటాడు. వాళ్లను ఓడించామన్న కారణంవలనే, తమతో విరోధంగా వున్నారనీ,
పగతీర్చుకోవడానికి సమయంకోసం కాచుకున్నారనీ, తనకు కీడుచేయాలని
తలుస్తున్నారనీ, అంటాడు. తనవలె వారూ దేవవిరోధులేకనుక, వారుపంపిన ఆ కోతిని ఎలాగైనా బంధించి తెమ్మంటాడు.
"ప్రతిదినం తోటల్లో, తోపుల్లో చూసే కోతిలాంటిదిది కాదు. దీన్ని
పరిహాసంగా చూడవద్దు. ఇదిమిక్కిలి కీర్తిపొందిన పరాక్రమం కలది. నేను వాలిని, సుగ్రీవుడిని, జాంబవంతుడిని,
నీలుడిని, ద్వివిదుడిని చూసాను. కాని ఇంతగొప్ప ఆకారం, బుధ్ధిబలం, వారించలేని తేజం వారెవరికీ లేదు. ఏదో
భూతం ఈ వానర రూపంలో, ఏదో పని పెట్టుకుని వచ్చుండాలేకాని, ఇదిమామూలు కోతికాదు. మిమ్మల్ని మానవులు, దేవతలు, రాక్షసులు, ఎవ్వరూ యుద్ధంలో
ఎదిరించలేరని నాకు తెలుసు. అయినా మేమింతవారమని, మాకెదురేమీ లేదని భావించక, మిక్కిలి మెలకువగా యుద్ధం చేయండి. యుద్ధంలో ఎంత బలవంతుడైనా, తానే గెలుస్తానని
చెప్పలేడు. గెలుపు స్థిరంకాదు. బలవంతుడే జయించాలన్న నియమం కూడా ఏదీలేదు. కాబట్టి
ప్రతివీరుడూ, శూరుడూ, తనను
రక్షించుకోవటానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేయాలి" అని రావణుడు ఆజ్ఞాపిస్తూ
చెప్పాడు.
సేనానాయకులు
ఐదుగురు, శ్రేష్టమైన రథాలు, ఏనుగులు, గుర్రాలు, కావలిసినన్నీ
తీసుకుని, కలకల ధ్వని చేస్తూ, విల్లంబులు, బాణాలు, ఆయుధాలు, ధరించి
యుధ్ధానికెళ్తారు.
యుధ్ధానికొస్తున్న సేనానాయకులకు హనుమంతుడు, వీరుడిలా, మండుతూ ఉదయిస్తున్న ప్రకాశించే సూర్యుడిలా, మంచి మనసున్న వాడిలా, గొప్ప ఆకారం కలవాడిలా, గొప్ప వేగంకలవాడిలా, గొప్ప ధైర్యవంతుడిలా, గొప్ప ఉత్సాహం కలవాడిలా కనిపించాడు. కనిపించిన వెంటనే, వాడిలో ఒకడైన
దుర్ధరుడు, అసమానమైన, పదునైన ఐదు పచ్చని బాణాలతో హనుమంతుడి తలకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాధతో
హనుమంతుడు ఆకాశానికి ఎగిరి, భూమి, దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహనాదం
చేసాడు. దానికదిరిన రాక్షసుడు పూర్ణ తేజస్సుతో వంద బాణాలను వానరవీరుడిపై
కురిపిస్తాడు. మేఘాన్ని చెదరగొట్టే వాయువులా, ఆ బాణాలను చిందరవందర చేసి,
శరీరం నొప్పి పుట్తున్నా ఓర్చుకుంటూ, తన దేహాన్ని పెంచి, ఆకాశానికెగిరి, అక్కడనుండి,
కొండమీద పిడుగు పడ్డట్లు దుర్ధరుడి రథంపై దూకుతాడు.
అలా హనుమంతుడు రాక్షసుడి రథం మీద పడడంతో, గుర్రాలు ఎనిమిదీ
చచ్చాయి. బండి విరిగిపోయింది. వాడూ చచ్చాడు. అది చూసిన విరూపాక్షుడు, యూపాక్షుడు కూడా
ఆకాశానికి ఎగిరి, హనుమంతుడి రొమ్ము పగలకొట్టటానికి, బాణాలేస్తారు. వారి వేగాన్ని అణచివేసిన హనుమంతుడు, చటుక్కున భూమి
మీదకొచ్చి, ఒక చెట్టు పీకి, రాక్షసుల మీద వేసాడు. వాళ్లు ఎత్తులో, హనుమంతుడేమో కింద వుండడంతో, ఆ చెట్టు దెబ్బకు వారిద్దరూ చచ్చారు. ఇలా తమవాళ్లు ముగ్గురూ
చావడంతో, అమిత కోపంతో ప్రహసుడు, భాసకర్ణుడు హనుమంతుడిని ఆయుధాలతో, శూలాలతో, పొడవడంతో, ఆంజనేయుడు
నెత్తురుతో తడిసి బాలభానుడిలా ప్రకాశించాడు. ఆ బాధతో, ప్రక్కనే వున్న ఓ
పర్వత శిఖరాన్ని, అందులో వున్న చెట్లతో, పాములతో, మృగాలతోసహా
పెకిలించి ఆ రాక్షసుల మీద మహా వేగంతో విసురుతాడు హనుమంతుడు. ఆ దెబ్బకు ఇద్దరూ
చచ్చి నేలమీద పడ్డారు.
ఇలా సేనానాయకులందరూ చావడంతో మిగిలిన ఏనుగులను, ఏనుగులతో కలిపి గుర్రాలను, గుర్రాలతో సహా భటులను, కొట్టి ఇంద్రుడు
రాక్షసులను చంపినట్లు చంపుతాడు. పోయేదారి లేదన్న రీతిలో ఆయుధ్ధ భూమి చచ్చిన
ఏనుగులతో, గుర్రాలతో, భటుల
సమూహాలతో వ్యాపించాయి. వాటిమధ్యలో, హనుమంతుడు ప్రళయకాల యముడిలా కనిపించి, బడలిక
తీర్చుకునేందుకు మళ్లీ తోరణసీమపైకెక్కి కూర్చున్నాడు.
No comments:
Post a Comment