హనుమంతుడిపైకి కింకరులను పంపిన రావణుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (16-07-2018)
గుంపులు-గుంపులుగా ఆకాశంలోకి ఎగిరికూసే పక్షుల ధ్వనులకూ, ధభీలుమని పడిపోతున్న చెట్లచప్పుళ్లకూ, లంకలో వున్న
రాక్షసులందరు భయపడి, దిక్కుతోచక, అదేంటో
తెలియక, ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. కీడును సూచించే ధ్వనులు చేస్తూ, పక్షులు, క్రూరమృగాలు పరుగెత్తసాగాయి. కాపలాకాస్తున్న రాక్షసస్త్రీలు
భయపడి, లేచి, భయంకరమైన కోతి ఆకారాన్ని చూసి, సీత ఏమైపోయిందోనని ఆమె వైపు పరుగెత్తారు. రాక్షసస్త్రీలు
భయపడాలనే హనుమంతుడు, ఘోరమైన, భయంకరమైన ఆ రూపాన్ని ధరించాడు. ఆయన్ను
చూసిన రాక్షసస్త్రీలు సీతాదేవితో:
"సీతా! ఎవడే వీడు? ఎవరికొరకు ఇక్కడకు వచ్చాడే? వీడెవడివాడు? మీరిద్దరేం మాట్లాడుకున్నారు? నువ్వు భయపడకుండా, ఇంతవరకు ఆ కోతి నీతో ఏమన్నదో మాకు చెప్పు" అని
అడుగుతారు. పాముల కాళ్లజాడ పాములకే తెల్సినట్లు, రాక్షసుల జాడ, మాయలు
రాక్షసులకే తెలుస్తాయని జవాబిస్తుంది సీత. ఏ రాక్షసుడు ఏ మాయారూపం ధరించాడోనని, తనమనస్సు కూడా
కలవరపడుతుంది అంటుంది.
(రాక్షస స్త్రీలు, హనుమంతుడిని గురించి సీతాదేవిని అడిగినప్పుడు, తనకు తెలియదని
అబద్ధం చెప్పుతుంది. అయినా అసత్య దోషం ఆమెకు తగలదు. ప్రతిమనిశి, ప్రతినిత్యం, పాటించాల్సిన "యమము" లలో ముఖ్యమయినవి అయిదు. అవి:
"అహింస, సటైం, అస్తేయమ, బ్రహ్మచరయం, అపరిగ్రహం". చివరి నాలుగింటికి
"అహింస" తల్లి. సత్యాదులు దాని బిడ్డలు. నిజం చెప్పడంవల్ల నిరపరాధికి, నిష్కారణంగా హింస
జరుగుతే, జరుగుతుందనుకుంటే, సత్యం చెప్ప రాదు.
అసత్యమాడవచ్చు. ప్రాణంపోతున్న సమయంలో విశ్వామిత్రుడిలాగా దొంగతనం చేసి ప్రాణం
రక్షించుకోవడం తప్పుకాదు. దురుద్దేశ్యం లేని హాస్యమాడేటప్పుడు, స్త్రీల విషయంలో, వివాహ కాలంలో, ప్రాణాపాయ సమయంలో
సర్వస్వం కోల్పోయేటప్పుడు అసత్యం చెప్తే పాపం తగలదు. సత్యం చెప్తే హాని
జరుగుతుందనుకుంటే, అసత్య మాడవచ్చునే కాని, ఆడాలన్న నిర్బంధం మాత్రం లేదు. హనుమంతుడు, సీతాదేవికి
ప్రత్యుపకారం కోరని ఉపకారి, గౌరవ మిత్రుడు, నిరపరాధి, సత్యం చెప్తే, ఆయనకు, తనకు,
ప్రాణహాని కలుగుతుందని భయపడింది. ఆమెకు అసత్య దోషం లేదు).
సీతాదేవిమాటలకు భయపడి కొందరు పరుగెత్తారు. కొందరక్కడే
వుండిపోయారు. కొందరేమో పరుగు-పరుగున రావణుడికి చెప్పటానికి వెళ్లారు. వెళ్లి:
"భయంకరమైన వానరరూపంకల వీరుడొకడు సీతతో మచ్చికగా ముచ్చట్లాడి, అశోకవనంలో వున్నాడు.
వాడు ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, సీతను
వెతికేందుకు వచ్చిన శ్రీరాముడి దూతో, తెల్సుకోవడం కష్టంగా వుంది” అని విన్నవించుకున్నారు
రావణుడికి. రౌద్రాకారంతో విజృంభించిన ఆ కోతి ప్రమదావనాన్నంతా నిర్మూలించి, మృగాలనూ, పక్షులనూ తీగలనూ, చెట్లనూ, నామ రూపాలు లేకుండా చిందరవందర చేసిందికాని సీతాదేవి వున్న ప్రదేశాన్ని తాకనైనా
తాకలేదని కూడా ఫిర్యాదు చేసారు ఆ రాక్షసస్త్రీలు. "సీతాదేవికి రక్షణగా
వుండాలనే వుద్దేశంతోనే, చెట్లన్నీ త్రుంచినా, ఆమె వున్న అశోకవృక్షాన్ని మటుకు ఏమీ చేయలేదు. సీతాసౌఖ్యం కొరకే దాన్ని
పాడుచేయలేదు. నీ వనాన్ని పాడు చేసినందుకు, సీతను
పలుకరించినందుకు, కోతి పొగరు అణిగేటట్లు కఠినంగా దండించు. నువ్వు కోరికపడ్డ ఆడదానితో మరొకరొచ్చి
మాట్లాడినవాడెవరైనా కాని ప్రాణాలతో వుండవచ్చునా?" అని రెచ్చగొట్తారు రాక్షసులు.
ఆమాటలకు మండిపడ్డాడు రావణాసురుడు.
కోపంతో ఊగిపోయాడు రావణుడు. గిరగిరా తిరిగే గుడ్లున్న ఆయన
కళ్లనుండి బొటబొటా రాలిన నీళ్లు, దీపం నుండి మండుతూ, మీద-మీదపడే చమురు బొట్లలాగా కనిపించాయి. మహాగర్వంతో కన్ను, మిన్నుకానని, తనతో సమానమైన కింకరులనేవారిని వెంటనే వెళ్లి, ఆ కోతిని
పట్టుకునిరమ్మని పంపుతాడు. పెద్దపెద్ద కోరలు, మిట్టపళ్లు, కడుపులు, కంటధ్వనులు, వికార
ఆకారాలున్న బలమైన ఆ కింకరులు సమ్మెటల్లాంటి ఆయుధాలు, ఖడ్గాలు
ధరించి, యుధ్ధకాంక్షతో, హనుమంతుడి మీదకొస్తారు. ఎనభైవేలమంది రాక్షసులు ఒక్క మూకగావచ్చి, తోటద్వారం పైనున్న
హనుమంతుడిమీద పడి, బంగారంతో ప్రకాశిస్తున్న గండ్రగొడ్డళ్లతో, కత్తులతో, మండుతున్నబాణాలతో, శూలాలతో,
ఇనుపగుళ్లతో, అడ్డకత్తులతో, చిల్లకోలలతో, ఆయన్ను కొట్తుంటే, కోపంతో ఆయనకూడా దేహాన్ని పెంచుతాడు.
హనుమంతుడి జయఘోష
దేహాన్ని పెంచిన హనుమంతుడు, తోకను ఆడించి, జాడించి, నేలపై కొట్టి, సింహనాదం
చేస్తాడు. ఆ ధ్వనికి లంకంతా ప్రతిధ్వనిస్తుంది. పక్షులు ఆకాశానికెగిరి గుండెలు
పగిలి నేలరాలాయి. "దృఢపరాక్రమం, ధన్యమైన రూపంకల శ్రీరామచంద్రమూర్తికీ, శత్రువులు సంహరించలేని బలమున్న లక్ష్మణుడికీ, రామలక్ష్మణుల రక్షణలో వుండి, తెంపు, పరాక్రమం, కీర్తిగల వానరనాధుడు సుగ్రీవుడికి, జయంకలుగుకాక... జయంకలుగుకాక"
అని స్మరిస్తాడు హనుమంతుడు. (జయ త్సతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: దాసోహం
కోసలేంద్రస్య; నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్-వీటిని జయమంత్రాలంటారు. సర్వకార్య
సిద్ధికి ఈ శ్లోకాలను జపించమన్నారు పెద్దలు. ఇవి నిత్యమూ పఠిం వారిపై
క్షుద్రశక్తులు పనిచేయవని పెద్దలంటారు) సమస్తకళ్యాణ గుణాలవల్ల మనోహరుడైన కోసలదేస
ప్రభువైన రామచంద్రమూర్తికి తాను దాసుడననీ, శత్రు
సంహారకుడైన వాయుపుత్రుడననీ, హనుమంతుడన్న పేరుకలవాడిననీ, వేయిమంది రావణులైనా తనతో యుద్ధంలో సరితూగరనీ,
రాళ్లతో, చెట్లతో శత్రువులను సంహరిస్తాననీ గర్జిస్తాడు. లంకను ధ్వంసం చేసి, రాక్షసులందరినీ
హింసించి, సీతాదేవికి మ్రొక్కి,
రాక్షసులేడుస్తుంటే, కీర్తిమంతుడనై వెళ్తానని అరుస్తాడు.
ఇలాధ్వనించిన హనుమంతుడి మాటలకు భయపడి, సంధ్యాసమయపు మబ్బులాగా దేహాన్ని పెంచుతున్న వానరుడిపై రాజాజ్ఞ
ప్రకారం ఆయుధ వర్షం కురిపించారు కింకరులు. హనుమంతుడప్పుడు ఉద్యానవనంలో దొరికిన ఓ
పెద్ద ఇనుప గుండు తీసుకుని, నోట్లో పాముంచుకుని తిరిగే
గరుత్మంతుడిలాగా గిరగిరా తిరిగి, ఆ రాక్షసులందరినీ ఆ గుండుతో నుగ్గు చేసాడు. ఇలా కింకర
సమూహాన్నంతా చంపి, ఇంకా యుద్ధం చేయాలన్న కోరికతో, జంకూ, గొంకూ లేకుండా, రాక్షసులకు భయంకరంగా కనిపిస్తూ, మళ్లీ తోరణమెక్కి
కూర్చున్నాడాయన. చావగా మిగిలిన ఇతరులు చస్తామన్న భయంతో పరాజితులై రావణుడింట్లో
దూరారు. మాటలు తడపడుతుంటే, తోటి కింకరులందరూ చచ్చారని చెప్పారు రావణుడితో వీరు. తీవ్రమైన కోపంతో, భయంకరంగా, కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, అజేయబలమున్న
ప్రహస్తుడి కొడుకును యుధ్ధానికి పంపుతాడు రావణుడు. వాడిపేరే "జంబుమాలి".
చైత్యప్రాసాదాన్ని విరగదన్నిన హనుమంతుడు
కింకరులందరినీ చంపిన హనుమంతుడు, తోరణంపైనుండి నాలుగు
ప్రక్కలా తేరిపార చూస్తాడు. ఉద్యానవనమంతా తన ప్రతాపానికి దుమ్ము-దుమ్ముగా
అయిపోయినందుకు ఆనందిస్తాడు. అయితే ఆప్రక్కనే, అందం చెడకుండా, మేరుపర్వత శిఖరంతో సమానమైన ఓ మేడను చూసాడు. ఎందుకీ మేడను
పడగొట్టలేదింకా అనుకుంటూ, అది గట్టిగా వూగిపోయేటట్లు దానిమీదకు దూకుతాడు. చూడటానికి ప్రాసాదంలాగా వున్న
ఆమేడ లంకాధిదేవత గుడి. ఆ మేడ శిఖరాన్నెక్కి, దిక్కులు వెదజల్లే కాంతితో, ఉదయించిన సూర్యుడిని పోలి కూర్చున్నాడక్కడ.
(సూర్యోదయమయిందన్న సూచన)
యుధ్ధమంటే ఆసక్తిగల హనుమంతుడు, ఆ మేడంతా
విరగదన్ని, దేవతలు స్తోత్రం చేస్తున్నప్పుడు కనిపించే పారియాత్రపర్వతంలాగా ప్రకాశించాడు.
హనుమంతుడప్పుడు వేగంగా, భరించలేనంత ధ్వని చేస్తుంటే, ఆ ధ్వనికి
రాక్షసమూకల చెవిగూబలు అదిరిపోయాయి. ఆయన సింహనాదానికి వారంతా మూర్ఛపోయారు.
విజయగర్వంతో మరొక్కసారి "జయం-జయం" రాముడికి అని స్మరిస్తూ, వేయిమంది దశకంఠులు కూడా ఒక్క హనుమంతుడికి సరికాదని
గర్జిస్తాడు.
చైత్యపాలకులను చంపిన హనుమంతుడు
హనుమంతుడి సింహనాదాన్ని విన్న దేవాలయం కాపలాదారులు
(చైత్యపాలకులు), కోపాతిశయంతో ఆయన్ను చుట్టుముట్టారు. ఈటెలతో, ఇతర ఆయుధాలతో హనుమంతుడిని నొప్పించసాగారు. గంగలోని
సుడిగుండంలాగా వున్న ఆ రాక్షస మూకపై అమిత కోపంతో,
భయంకరంగా దెబ్బ తీయాలనుకుంటాడు హనుమంతుడు. ఇంతకుముందు వాడిన ఇనుపగుండు చిన్నదని
భావించిన హనుమంతుడు, దేవాలయంలోని ధ్వజస్థంభాన్ని పీకి, కళ్లకు కనిపించకుండా గిరగిరా వేయిసార్లు తిప్పాడు. ఆ
వేడికుదయించిన అగ్నిజ్వాలలు,
గుడిని భస్మం చేసాయి. ఆ తర్వాత కావలి రాక్షసులందరినీ చంపి, ఆకాశంలోకి ఎగిరి, అందరూ
వినపడేటట్లు గట్టిగా చెప్తాడీవిధంగా:
"ఓ లంకావాసులారా! వినండి. నాలాంటి వేలాది వానరులు సుగ్రీవాజ్ఞ ప్రకారం
సీతాదేవిని వెతుకుతున్నారు. వాళ్లంతా నాలాగా బలవంతులే! పది ఏనుగుల బలమున్నవారు
కొందరు, నూరేనుగుల, వెయ్యేనుగుల
బలమున్న వారు మరికొంతమంది, చెప్పలేనంత బలవంతులు ఇంకొందరు, వాయువేగంతో పోగలిగేవారు ఎంతో మంది వున్నారు వాళ్లలో. వీళ్లందరిరి ఆయుధాలు
గోళ్లు, దంతాలు, రాళ్లే! ఇలాంటి
కోటానుకోట్ల, లెక్కించనలవికాని వానరులను తీసుకుని, అమేయబలుడు
సుగ్రీవుడు ఇక్కడకు రాబోతున్నాడు. వచ్చి మిమ్ముల్నందరినీ చంపబోతున్నాడు.
నిష్కారణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నారు మీరందరూ. రావణుడికీ లంకకూ, మీకూ ఇక
రుణానుబంధం తీరినట్లే!".
దీంతో ఇంతవరకు సీతను లంకలో వుంచిన వార్త అంతఃపురానికి
వచ్చేవారికి తప్ప తెలియని ఇతరులకు కూడా తెలుస్తుందిప్పుడు. రహస్యం బయటపడింది.
No comments:
Post a Comment