అక్షకుమారుడి చావుతో రావణుడి వంశ ధ్వంసన ప్రారంభం
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (30-07-2018)
తన ఐదుగురు సేనానాయకులు, సైన్యంతో సహా యుద్ధంలో మరణించారన్న వార్త విన్న రావణుడు, ఇంకొంచెం
బలవంతుడిని పంపాలని నిర్ణయించుకుంటాడు ఈసారి. అక్షుడనే తనకొడుకు, యుధ్ధగర్వం కలిగి, యుధ్ధానికి
పోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండే భయంకర పరాక్రమవంతుడు. వాడినెంచుకున్న వెంటనే, తండ్రి కంటి
సైగతోనే, యుధ్ధానికి పోవడానికి తయారవుతాడు. బంగారంతో అలంకరించిన విల్లు ధరించి, బ్రాహ్మణుల
హోమాగ్నికెగిరే మంటల్లాంటి అగ్నిలా నిప్పులు కక్కుతూ బయల్దేరాడు యుధ్ధానికి. తన
తపస్సుతో సంపాదించుకున్న రథమెక్కాడు. అది బంగారు,
రత్నసమూహాలతో ప్రకాశిస్తున్న ధ్వజాలు కలిగి, రత్నాలతో నిండిన రథం. ఎనిమిది గుర్రాలు లాగే ఆ రథం, బాలసూర్యుడిలా
వెలుగుతూ, దేవదానవులకు అజేయమై,
ఆకాశంలో శీఘ్రంగా పోగలిగినదై వుంది. యుధ్ధానికి సిధ్ధమైన అక్షకుమారుడు, అంబులపొద, ఎనిమిది కత్తులు, చిల్లకోలలు ధరించి, ఆ రథమెక్కుతాడు.
(ఇంతకు ముందు యుధ్ధానికి వెళ్లినవారు, రథాలు విడిచి, ఆకాశంలో యుద్ధం
చేసారని విన్న అక్షుడు, ఆకాశంలో పోగలిగే రథాన్ని తెచ్చుకున్నాడు)
భూమ్యాకాశాలు దద్దరిల్లే ధ్వనితో, పోగలిగే రథాలు, ఉత్తమ ఏనుగులు, గుర్రాలు, పదాతిదళం వెంటరాగా, బయల్దేరిన అక్షుడు, తోరణం మీద కూర్చున్న బలవంతుడైన హనుమంతుడిని చూసాడు.
ప్రళయకాలాగ్నిలా వున్న వుత్తమ వీరుడిని,
ఆంజనేయుడిని సగౌరవ దృష్టితో చూసి, వాడికున్న వేగంతో వెళ్లగలనన్న పొగరున్న వాడని గ్రహించిన
వాడై, తన శస్త్రాస్త్ర పాండిత్యం, దేహబలం అతడికి
చూపటానికి, గ్రీష్మ సూర్యుడిలా, తీవ్రంగా ఆంజనేయుడిని మూడుబాణాలతో
కొట్టాడు.
అంతటితో ఆగకుండా మీదపడి పదునైన కరకు బాణాలతో, నొప్పి కలిగించడం
మొదలుపెట్టడంతో, దేవతల గుండెలదిరేలా, క్రూరంగా, అక్షుడికి, హనుమంతుడికి యుద్ధం కొనసాగింది. ఒకరికొకరు, ఇద్దరూ
తీసిపోకుండా, భయంకరంగా యుద్ధం చేస్తుంటే,
భూమి కంపించింది. సూర్యుడికాంతి ఆగిపోయింది. గాలి వీచడం
మానింది. కొండలు కదిలాయి. ఆకాశంలో ధ్వని పుట్టింది. సముద్రాలు భయంతో కలవరపడ్డాయి.
ఇలా జరుగుతుంటే, రాక్షస రాకుమారుడు, చిన్నవాడైనా, విషసర్పాల్లాంటి బంగారుకొనగల బాణాలను, మూడింటిని హనుమంతుడిపైకి విసిరాడు. అవి నాటుకుని నెత్తురు
కారుతున్న హనుమంతుడి ముఖం సూర్యబింబాన్ని తలపించింది. అక్షకుమారుడి బాణాలేమో
కిరణాల్లా ప్రకాశించాయి.
ఇది చూసిన ఆంజనేయుడు కోపంతో, తన చూపులతోనే అక్షకుమారుడి సేనలను, వాహనాలను దగ్ధం చేసాడు. అక్షుడుకూడా సూర్యప్రతాపంతో, కొండపై వర్షించే
మేఘంలా, బాణవర్షం కురిపించ సాగాడు. తనను పట్టుకోవాలన్న ధ్యేయంతో వున్న అక్షుడిని
మోసగించి ఆకాశానికెగిరాడు హనుమంతుడు. తప్పించుకున్నాడే! అనుకుంటూ ఆయనపై బాణవర్షం
కురిపించాడు అక్షకుమారుడు. అయినా హనుమంతుడు చిక్కలేదు. అప్పటికీ అక్షుడు వెనుకంజ
వేయలేదు. బాణాలవర్షం కురిపిస్తూనేవున్నాడు. వీడినెట్లా గెలవాలా అని
హనుమంతుడాలోచిస్తుంతె, ఆయన చేతులు కట్టిపడేసి, బాధించుదామనుకున్నాడు
అక్షుడు.
"వీడు చిన్నవాడైనా గొప్ప శూరుడు. బాలభానుడిలా ప్రకాశిస్తున్నాడు. భయంలేదుకాని
ఇలాంటివాడికి కూడా ఆపద రాబోతున్నదే! నామనస్సంగీకరించడంలేదే! వీడి పరాక్రమాన్ని
దేవతలు, యక్షులు, పన్నగులు, మహర్షులు, పొగడుతున్నారే! పోనీ వీడిదృష్టి మళ్లించి మోసం చేద్దామంటే, వీడేమో నన్నే
చూస్తున్నాడే! ఎటుపోతే అటు నాకెదురవుతున్నాడు. పోనుపోను వాడి నేర్పు, తీర్పు, ఓర్పు, పెరుగుతున్నదేకాని
తరగడంలలేదు. రోషంకూడా తగ్గలేదు. వీడు చిన్నవాడని ఉపేక్షిస్తే, యుద్ధంలో నాకు
అవమానం తప్పదు. నేను పిల్లరాక్షసుడి చేతిలో ఓడిపోయానన్న అపకీర్తి కూడా
వస్తుంది" అనుకుంటాడు అక్షకుమారుడి గురించి హనుమంతుడు.
వాడిని మెచ్చుకుంటూ, అక్షుడి పరాక్రమం, వేగం, ప్రతాపం, దేవతాసమూహాలకైనా గుండెలదిరేటట్లు
వున్నాయనుకుంటాడు. అయినా వాడి విలువిద్యా పాటవాన్ని, భుజబల
సంపూర్ణత్వాన్ని సహించాల్సిన పనిలేదని, వాడిని చంపాల్సిందేనని, లేకపోతే,
మండుతున్న అగ్నిని చల్లార్చడం ఎంతకష్టమౌతుందో, ఇదీ అంతే
అవుతుందని తలుస్తాడు. ఇలా ఆలోచిస్తూనే దేహాన్ని పెంచి, రాక్షసకుమారుడిని
చంపే ఉద్దేశ్యంతో, వేగంగా, ఆకాశంలో తిరిగే గుర్రాలను, తన అరిచేతి
దెబ్బతో చంపుతాడు మొదలు. అంతే రథాన్ని విరగ్గొట్టి నేలమీద పడేస్తాడు. రథం విరగడంతో, అక్షుడు కిందకు దిగి విల్లు చేతబట్టుకుని ఆకాశానికి ఎగురుతాడు, దేహాన్ని విడిచి
స్వర్గానికి పోయే మహర్షిలా. ఎగిరి కత్తి చేత్తో పట్టుకుని, హనుమంతుడి
దగ్గరకొచ్చి ఘోరంగా యుద్ధం చేయసాగాడు. ఇకలాభం లేదనుకుంటాడు ఆంజనేయుడు. గరుత్మంతుడు
పాముతోక పట్టుకుని ఈడ్చినట్లు,
వాడికాళ్లు పట్టుకుని, తిప్పి,
వేగంగా బలంకొద్దీ నేలమీద వేసి బాదుతాడు. వాడితల తునకలై, కండలు, నెత్తురు, ఎముకలు, నేలంతా
వ్యాపించాయి. వాడిచావుకు రావణుడి గుండెలు పగిలాయని, దేవతలు, మునులు, యక్షులు, పన్నగులు,
చక్రవర్తులు, మహాత్ములు, ఇంద్రుడు
సంతోషించారు. హనుమంతుడి బలానికి ఆశ్చర్యపోయారు.
బలపరాక్రమమాలలో జయంతుడితో సమానమైన, అక్షకుమారుడిని
చంపిన హనుమంతుడు, ప్రళయకాల యముడిలా బడలిక తీర్చుకునేందుకు, మళ్లీ ద్వార తోరణం మీదకు ఎక్కాడు.
No comments:
Post a Comment