హనుమ మరలి పోయేందుకు శలవిచ్చిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (09-07-2018)
సీత మాటలువిన్న హనుమంతుడు, రామచంద్రమూర్తి తప్పక ఆమె కష్టాలు తొలగిస్తాడనీ, ఆయన నిజంగా దుఃఖిస్తున్నాడనీ, ఆయన
స్థితి చూసి లక్ష్మణుడు కూడా శుష్కిస్తున్నాడనీ, తాను
ఇవ్వన్నీ ప్రమాణం చేసి చెప్తున్నాననీ, తనమాటలు నమ్మమనీ
అంటాడు. తానెంతో కష్టపడి సీతాదేవిని ఇక్కడ చూడగలిగాననీ, ఇక
ఎంతమాత్రం బాధపడవద్దనీ, ఆమెను చూసేందుకు రాబోతున్న
రాజకుమారులు లంకను నాశనం చేసి, రావణుడిని చంపడం ఆమే త్వరలోనే కళ్లారా చూస్తుందని కూడా
అంటాడు. ఇది జరిగిన తర్వాత సీత తనమగడితో, తన వూరికి పోవడం ఖాయమని కూడా చెప్తాడు హనుమంతుడు.
రామచంద్రమూర్తి గుర్తించే మరో జ్ఞాపిక ఇవ్వమని మళ్లీ
అడుగుతాడు. తానిచ్చిన చూడామణిని మించిన గుర్తేమీలేదని, దానిని చూడగానే
హనుమంతుడు తన దగ్గరకు వచ్చినట్లు నమ్ముతాడనీ సీత చెప్పడంతో, తనింక వెళ్లడానికి
అనుమతినివ్వమంటాడు హనుమంతుడు. ఇలా అంటూనే, తనకు తలవంచి నమస్కరించి నిల్చిన హనుమంతుడు దేహాన్ని పెంచడం, సముద్రాన్ని దాటే ఉత్సాహాన్ని కనపర్చడం కళ్లారా చూసి, ఆ పుణ్యాత్ముడితో
మాట్లాడాలని మళ్లీ అనుకుంటుంది.
(హనుమంతుడు సీతను మొదలు చూసినప్పుడు నమస్కరించలేదు. ఇప్పుడు
నమస్కరిస్తున్నాడు. ఎందుకిలా చేసాడు? వయస్సులో వృధ్ధ స్త్రీలు,
పతిని దేవుడిలాగా కొలిచే పతివ్రతలు నమస్కరించడానికి అర్హులు. పాదాలుపట్టి
మ్రొక్కడాన్ని "అభివాదం" అంటారు. చేతులు జోడించి నమస్కరిస్తే, మ్రొక్కితే, దాన్ని
నమస్కారమంటారు. మొదలు సీతాదేవిని చూసినప్పుడు, ఆమె సీత అవునో-కాదో, తెలియదు. పతివ్రతో, కాదో
తెలియదు. వృధ్ధస్త్రీ కూడా కాదు)
"ఆంజనేయా! రామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడిని, మంత్రులతో సహా సుగ్రీవుడినీ, ఆక్కడున్న
మిగతావారందరినీ, కుశలమడిగానని చెప్పమని" అంటుంది సీతాదేవి. తాను ఈ ఆపత్సముద్రంలో
మునగకుండా, ఎట్లా చెప్పితే రాముడు తన్ను రక్షిస్తాడో, అట్లానే చెప్పమంటుంది. తనుపడ్డ నానాకష్టాలనూ మగడికి
చెప్పమని అంటుంది. వెళ్లిరమ్మనీ, శుభం కలుగుగాక అని
అంటూ సెలవిస్తుంది.
కార్యశేషమాలోచించిన హనుమంతుడు
తనకు శుభమగుగాక, విఘ్నాలు
కలగకుండా వుండుగాక! అని సీతాదేవి అనడంతో, ఆమె దయకు పాత్రుడనైనాననుకుంటాడు హనుమంతుడు. ఇంక తనకేమీ భయం
లేదని, ఉత్తర దిక్కుగా ప్రయాణమై పోవాలనుకుని, చెట్టుచాటు
చేసుకుంటూనే కొంచెం దూరం వెళ్లాడు. ఇంకా చేయాల్సిందేమన్నా వుందా అని
అప్పుడాలోచించడం మొదలెట్టాడు. చేయాల్సినపని కొంచెం మిగిలుంది అనిపించిందాయనకు.
సుగ్రీవుడు సీతను వెతకమనీ, లంకను చూడమనీ, తనకు రెండు
పనులప్పగించాడు. ముఖ్యమైనది సీతను వెతకడం అయిపోయింది. లంకను చూడడం మిగిలి వుంది
ఇంకా! రాత్రివేళలో సరీగ్గా చూడలేదు. లంకను చూడటమంటే,
మిద్దెలు, మేడలు బాగున్నాయని చెప్పడం కాదుకదా! రాక్షసుల
బలాబలాలు బేరీజు వేయడం, రావణుడి అభిప్రాయం తెలుసుకోవడం ఇంకా
జరగలేదు. రావణుడి విషయంలో, అతడి బలగం విషయంలో, ఇదిచేయాలంటే, సామ-దాన-భేదాలు
పనికిరావు. దండోపాయమొక్కటే సరైన మార్గమనుకుంటాడు.
రాక్షసుల్లో తమోగుణం పాలెక్కువ. వాళ్లు మంచిమాటలకు, ధర్మ వాక్యాలకు
సాధువులకు మాదిరి లోబడేవారు కారు. దానగుణంతో చేద్దామంటే వారి దగ్గరే బోలెడు
ధనమున్నది. పరాక్రమవంతులైన వీరిలో భేదోపాయం సాధ్యం కాదు. మిగిలిన దండోపాయమే
ఇప్పటికి తగిన పనిగా తోస్తున్నదని తలుస్తాడు ఆంజనేయుడు. జయాపజయాలు దైవాధీనమైనందున, ఓడిపోతే
కార్యభంగమౌతుందా? ముందు రాముడు, వెనుక సీతాకటాక్షముంటే తనకు పరాజయమెందుకు కలుగుతుంది? తను చేయబోయేది
అధర్మకార్యం కాదు. ధర్మమెందుకు చెడుతుంది? దైవబలామ్, దేహబలామ్, ధర్మబలమున్న తనకు ప్రస్తుతం యుధ్ధమే శరణ్యమనుకుంటాడు హనుమంతుడు. రావణ, రాక్షసుల బలాబలాలను గురించి రామసుగ్రీవులు, తాను మరలిపోగానే, తప్పకుండా
అడుగుతారు. దానికి సరైన ప్రత్యుత్తరమీయాలంటే, రాక్షసుల బలమెంతో, వారెంత
బలవంతులో తెల్సుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే యుద్ధం చెయాల్సిందే. యుధ్ధానికి
ప్రయత్నం చేస్తే ఇంకో మేలుగూడా జరుగుతుంది. రామలక్ష్మణులు సహాయం లేనివారు, ఏమీ చేయలేరని
దురభిప్రాయంతో వున్న రాక్షసుల అపోహ తొలగించాలంటే, సుగ్రీవుడి సహాయముందని ప్రకటించి, యుద్ధం చేసి, కొందరినన్నా చంపాలని అనుకుంటాడు. ఇలా జరుగుతే తక్కినవారు ద్వేషం
వదిలి మెత్తబడటమో, వారిలో వారికి విభేదాలు రావటమో జరుగుతుందనుకుంటాడు.
తాను యుద్ధంచేసి కొందరిని చంపి వేస్తే రామచంద్రమూర్తి పని
సులభం కావచ్చు. కాకపోతే ఆయన సీతాదేవిని చూసి రమ్మన్నాడేకాని, నీతిమాలిన వారితో
నీచకలహానికి దిగమని చెప్పలేదే! అలాగైతే, సీతాదేవి ఏం చెప్పింది? రాముడే రావాలి,
రావణాదులను చంపాలి, తనను తీసుకునిపోవాలనికదా! ఈ సంగతి
చెప్పటమంటే రాక్షసుల బలాబలాల విచారణ జరగాలనే! అంటే ఈ పని నన్ను చేయమని
చెప్పలేదనకూడదు. ఎట్లాగైనా కార్యం సాధించుకుని రావడం ఉత్తమదూత లక్షణం.
చెప్పినపనికి తోడు, అనుబంధమైన పనులన్నీ దూతకృత్యాలే! కాకపోతే అప్పచెప్పిన కార్యానికి అవరోధం
కాకూడదు. ఏ పనైనా ధైర్యం చెడకుండా ఆలోచనతో చేయొచ్చు.
ఎంత చిన్నపనైనా చక్కగా చేయాలని పూనుకుంటే, అది నెరవేరటానికి, ఎన్ని ఉపాయాలు
అవసరమో, అన్నీ వెతికి చేయాలి. రామకార్యంకూడా పలువిధాలుగా చేయటమే మేలనిభావిస్తాడు హనుమంతుడు.
బలంలో తనకు, రాక్షసులకు వున్న భేదాన్ని తెలుసుకొని, రామచంద్రుడి దగ్గరకు పోతే, స్వామి ఆజ్ఞ నెరవేర్చిన బంటని పేరొస్తుందని అనుకుంటాడు.
రావణుడు తనంత బలవంతుడు లేడన్న మదంతో వున్నాడు. ఆ మదమణుగుతేనేగాని వాడు లొంగడు.
కొందరు రాక్షసులను యుధ్ధానికి ఈడ్చి సులభంగా చావకొడ్తే, రావణుడు
యుధ్ధానికొస్తాడు. అప్పుడు వాడిబలమెంతో తేల్చుకుని పోతేమంచిది. వూరికే
తిరిగెళ్లిపోతే, తనసంగతి వాడికెట్లా తెలుస్తుందని భావిస్తాడు.
కాబట్టి ఏదోవిధంగా, రావణుడిని, వాడి మంత్రులను, సైన్యాన్ని,
యుధ్ధానికీడ్చి, దాంతో శత్రువుల బలాబలాలను తెల్సుకుని, వాడి ఆలోచనేమిటో
అర్థం చేసుకోవటమే మంచిదనుకుంటాడు. ఆ తర్వాత అనాయాసంగా, బాధలేకుండా
మరలిపోతే, రామకార్యం చేసినవాడినవుతాననుకుంటాడు. కన్నుల పండుగగా, మనస్సుకు ఇంపుగా, ఇంద్రుడి నందన వనంగా, గొప్పగొప్ప వృక్షాలతో, అందమైన తీగలతో వున్న ఈ
ఉద్యానవనం సొగసుగా వున్నదనీ, దీన్ని ధ్వంసం చేస్తే రావణుడికి కోపం వస్తుందనీ అనుకుంటాడు.
ఈ అశోకవనం కార్చిచ్చుతో కాలినట్లు పాడైపోతే, మండిపడ్డ రావణుడు, ఏనుగులతో సహా తనసైన్యాన్ని యుద్ధం చేయమని తనమీదకు పంపుతాడు.
ఆ శూరులు త్రిశూలాలతోనూ, విల్లంబులతోనూ వస్తే వాళ్లను తునాతునకలు
చేసి సంతోషంగా కిష్కింధకు పోదామని నిర్ణయించుకుంటాడు.
అశోకవనాన్ని పాడుచేసిన హనుమంతుడు
ఇలా ఆలోచించిన హనుమంతుడు
విజృంభించాడు. మహావాయువులాంటి తనతొడలవేగంతో, చెట్లన్నీ కూకటివ్రేళ్లతోసహా పీకి నేలమీద పడేయడం
ఆరంభించాడు. నానారకాల చెట్లతీగలతో, మదించిన
పక్షుల ధ్వనులతో నిండిన ప్రమదావనాన్ని పాడుచేసాడు. క్రీడాపర్వతాలను నేలమట్టం
చేసాడు. క్రీడాసరస్సులను విరగ గొట్టాడు. తెగిన తీగలతో,
విరిగిన చెట్లతో, పాడైన సరస్సులతో, ఆ వనం కార్చిచ్చు
తగిలి కాలిపోయినట్లయింది. తీగలు అల్లుకునేందుకు ఆధారంగా వుండి, భూమిలోదాకా
పాతుకుపోయిన తల్లివ్రేళ్లున్న చెట్లు కూడా పడిపోవడంతో, వాటికొనలందున్న తీగలు దిక్కులేని ఆడవారిలా, భయంతో వణుకుతూ
కనిపించాయి. చెట్లు పడడంతో వాటిసందున వున్న పాములుకూడా నలిగి చచ్చాయి. చెట్టు
తొర్రలు నేలగూలాయి. పొదరిళ్ళు పాడైపోయాయి. రాతి ఇళ్లు నేలపై తూలిపడ్డాయి. ఇదంతా
చూడటానికి ఘోరంగా కనిపించింది. రావణాసురుడి భార్యలకు ప్రమదావనమైన ఉద్యానవనాన్ని
మూలమట్టంగా నాశనంచేసి, సంతోషంతో కయ్యానికి కాలుదువ్వి, యుధ్ధానికెదురు
చూస్తూ ఆ వనం తలవాకిటిమీద కూర్చున్నాడు హనుమంతుడు.
No comments:
Post a Comment