Sunday, November 25, 2018

శ్రీరాముడికి కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన హనుమంతుడు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడికి కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (26-11-2018)
శ్రీరాముడికోరిక ప్రకారం హనుమంతుడు సీతాదేవి చెప్పిన మాటలన్నీ వినిపించాడు. గుర్తుగా చిత్రకాట పర్వతం మీద జరిగిన వృత్తాంతాన్నీ చెప్పాడిట్లా:

"నీతో నిద్రిస్తున్న సీతాదేవి ముందుగా లేచినప్పుడు తటాలున కాకి ఒకటి ఎగిరొచ్చి, ఆమె స్తనం మధ్యలో తన వాడికొనగోళ్లతో తాకింది, గీకింది. నిద్రిస్తున్న ఆమె మేల్కొనడం గమనించిన నీవు ఆమె తొడపై తలపెట్టి నిదురపోయావు.  ఇలానీవు సుఖనిద్రలో వున్నప్పుడు అదేకాకి మళ్లావచ్చి ఆమెను బాధించడం జరిగింది. ఆ ఉత్తమస్త్రీని, సీతాదేవిని, కాకి పలుమార్లు గాయం పడేవిధంగా ముక్కుతో పొడవడం వల్ల ఆమెనుండి వెలువడిన నెత్తురు సరీగ్గా నీమీదపడింది. సీతాదేవి చెప్పిన ఆ వృత్తాంతాన్ని యధాతధంగా ఆమె చెప్పిన మాటల్లోనే నీకు చెప్తా వినమని" అంటాడు హనుమంతుడు. సీతాదేవి చెప్పిన ఆమాటలు:

"పూర్వం చిత్రకూటంలోని, మందాకినీ తీరం దగ్గర నివసిస్తున్నప్పుడు, ఓనాడో కాకి, నన్ను మాంసమనుకుని, తనముక్కుతో పొడవగా, ఓ మట్టిపెళ్లను ఆ తుంటరి కాకిమీద విసిరాను. అయినా అదిపోకపోతే, కోపంతో దాన్ని తరిమి కొట్టటానికి, నా ఒడ్డాణం తీసాను. అప్పుడు నాచీరె జారిపోవడం, నీవు నవ్వడం, సిగ్గుతో నేను ఆయాసపడడం జరిగింది. కాకిముక్కుతో గీకిందన్న కోపం, నువ్వు నవ్వడంతో కలిగిన సిగ్గుతో, ప్రయాసపడి వొచ్చి నీ ఒళ్లో చేరాను. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు కారుతుంటే, నీవు నన్ను ఓదార్చలేదా? అట్లా అలసిపోయి, నిద్ర రాగా, నీ తొడమీద పడుకున్నాను. ఆ వెంటనే నేను లేవగా, నాతొడపైన తలవుంచి నీవు పడుకున్నావు".

"రామచంద్రమూర్తీ! నీవు నిదురించగానే, ముందు బాధపెట్టిన కాకే, నాదగ్గరకొచ్చి, నా స్తనాలను గీరి, ముక్కుతో నాకు బాధకలిగేటట్లు పొడిచింది. ఆ గాయం నుండి రక్తంకారి, ఆబొట్లు నిదురిస్తున్న నీపైన పడ్డాయి. ఆ పాపపు పక్షిపెట్టే బాధ సహించలేక, సుఖంగా నిద్రిస్తున్న నాధుడిని, శ్రీకాంతుడిని, శత్రుమర్దనుడిని, నిన్ను లేపాను. అప్పుడు నీవు లేచి, నా స్తనములందున్న గాయాన్ని చూసి, కోపంతో, ఈ పాపం చేసినవాడెవ్వడో చెప్పు, వాడినిప్పుడే రూపుమాపెదనన్నావు. రోషంతో బుసలు కొట్టే ఐదు తలల పాముతో ఆడుకుంటానికి సాహసించిన వాడెవరని అంటూ, నాకెదురుగా వున్న కాకిని నెత్తురుతో తడిసిన గోళ్లతో చూసావు. నీవు  చూడగానే, కాకిరూపంలో వున్న ఇంద్రుడి కొడుకు, గాలిలాగా కొండ దిగి పరుగెత్తసాగాడు".

"పరుగెడ్తున్న కాకిని చూసి, కోపంతో, దయను వదిలేసి, దర్భాసనంలోని దర్భను తీసి, దాన్నే బ్రహ్మాస్త్రంగా కాకిమీద వేసాడు. (అస్త్రం అంటే మంత్రించి విసిరివేసే ఆయుధం. శస్త్రం అంటే హింసించడానికో, చికిత్సకో ఉద్దేశించబడింది. నియమ నిష్టలుంటేనే అస్త్రం పనిచేస్తుంది. శస్త్రం ఒక పరికరం లాంటిది) ఆ దర్భపోచ ఆకాశంలో పోతున్న కాకిని వెంటాడింది. ఆ కాకి ముల్లోకాలు తిరిగి, ఎంతోమంది శరణు కోరింది. ఇంద్రుడు, బ్రహ్మాది దేవతలు, గొప్ప మహర్షులు, అందరూ దానిని కాపాడలేమని చెప్పారు. వేరేగతిలేక మళ్లీ తిరిగొచ్చి రాముడినే శరణుకోరింది".

"శరణు-శరణని భూమిపై సాగిలబడిన కాకిని చూసి, అది చంపబడాల్సిందే అయినా, దయతల్చి వదిలేసావు. ప్రపంచంలో, ఏ ఒక్కడైనా కాపాడలేకపోయిన ఆ కాకి నీ శరణుజొస్తే, దాన్ని చూసి నీవు, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాదు, ఏమిస్తావని అడిగావు. అది తన కుడి కంటిని తీసుకొమ్మంది. ఆ భయంకర బాణం దాని కుడికన్ను హరించి వేసింది. కాకేమో చావుతప్పి కన్నులొట్టబోగా, రాముడినీ, దశరథుడినీ తలచుకుంటూ, నమస్కరిస్తూ పోయింది".


"నరేంద్రా! నాకు చిన్న బాధకలిగితేనే, ఆ బాధ కలిగించిన కాకిపైన బ్రహ్మాస్త్రం ప్రయోగించావే! నిన్ను తిరస్కరించి, ఇంతకాలం, ఇంతబాధపెట్తున్న ఈ క్రూరుడిని ఎందుకు ఉపేక్షిస్తున్నావు? ఇలా చేస్తే, నీవు నరేంద్రుడవెట్లా అవుతావు? నీనరేంద్రత్వానికి హాని రాదా? జగన్నాధా! నీ బలపరాక్రమ సాహసాలెట్టివో, ఎంతటివో నేనెరుగుదును. తెలియబట్టే నీవు నన్ను తప్పక రక్షిస్తావని నమ్మి వున్నాను. అన్ని గుణాలలో దయాగుణమే శ్రేష్టమని నీవు నాతో చెప్పావుకదా! ఆ దయ బాధపడ్తున్న నామీద ఎందుకు చూపడం లేదు? నిన్ను నాథుడిగాగల నేను అనాధలాగా పడి వున్నానే! ఇలా చేయడం నీకు ధర్మమేనా?"

"హనుమా! సముద్రం లాంటి గాంభీర్యం కలవాడు, ప్రకాశించే పరాక్రమం గలవాడు, శత్రుసంహారంలో సమర్ధుడు, ఇంద్రుడితో సమానమైన రామచంద్ర భూపాలుడు చతుస్సముద్రాలతో నిండిన భూమండలానికి భర్త. ఇలాంటివాడు, అస్త్రవిద్యలో పండితుడు, శ్రేష్టుడు, మంచి బలవంతుడు, మంచి స్వభావం కలవాడూ అయిన రామచంద్రమూర్తికి నామీద కాస్తైనా దయవుంటే, ఎందుకొక్క అస్త్రం సంధించడు? ఉత్తమ దివ్యాస్త్రాలను కలిగి వున్న రాముడు, రాక్షసుల మీద ఎందుకు పదునైన అస్త్రాలు వేయడంలేదు? దేవదానవులు, పన్నగ గంధర్వులు, యుధ్ధభూమిలో ఆయన వంకైనా స్థిరంగా చూడలేరే? ఆట్టివాడు, నామీద ప్రేముంటే, రాక్షసులను చంపడా? దీనికి కారణం ఏమీలేదు....నామీద దయలేకపోవటమే!"

"ఆంజనేయా! రామచంద్రమూర్తి ఉపేక్షచేసినా నన్ను తనతల్లిలాగ చూసుకునే లక్ష్మణుడు, నావలెనే పరతంత్రుడైనా, అన్న అనుమతి తీసుకుని, నన్ను రక్షించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన పగవారిపాలిట యముడే! దోషంకల భార్యలను భర్తలు విడిచిపెట్టవచ్చుగాని, దోషంకలదైనా తల్లిని కొడుకు విడిచి పెట్టవచ్చా? అలాంటిది లక్ష్మణుడు నన్నేల విడిచిపెట్టాడు? అన్నదమ్ములిద్దరూ అగ్ని, వాయువు లాంటివారు. ఎవరూ ఓడించిజాలని సమర్థులు. వారు నన్నుపేక్షించడానికి కొద్దో-గొప్పో నేనుచేసిన దుష్కృతం తప్ప ఇంకే కారణం కనిపించడం లేదు. వాళ్లలో దోషముందని ఎట్లా అనను? వారు సమర్ధులే! నామీద ప్రేమలేనివారు కాదే! కాబట్టి దోషం నాదే! "

 (దివ్యమంగళ విగ్రహడూ, సత్యసంధుడూ, ధర్మజ్ఞుడూ అయిన తన భర్త శ్రీరాముడు, తనను అరణ్యానికి రావద్దని వారిస్తున్న సందర్భంగా ఆయన్ను పురుషకారంలో ఉన్న స్త్రీవి అని సీతమ్మ అనడం భగవదపచారం. వాస్తవానికి భగవదపచారం చిన్నది. ఆ వేళ మాయలేడిని తీసుకురావడానికి వెళ్లిన రాముడు ఎంతకూ తిరిగిరాక, లక్ష్మణా! సీతా! అన్న కేకలు వినిపిస్తున్నప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని తక్షణమే వెళ్లి రాముడిని రక్షించమన్నప్పుడు, లక్ష్మణుడు సీతమ్మను ఒంటరిగా విడిచి వెళ్లడు. అప్పుడు సీతమ్మ విసిగిపోయి లక్ష్మణుడిని దుర్భాషలాడుతుంది. అనరాని మాటలంటుంది. పరమ భాగవతోత్తముడైన లక్ష్మణుడిని అలా నిందించడం భాగవాతపచారం. ఇది భయంకరమైన అపచారం. ఈ రెండు అపచారాలలో రామాపచారం భగవదపచారమే అయినా చిన్నదే. లక్ష్మణాపచారం భాగవతాపచారమైనందున పెద్దది. ఇవి చేసింది సీతమ్మ)

Saturday, November 24, 2018

యుద్ధంలో మరణించిన దూషణుడు, సేనాపతులు, త్రిశిరుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-36 : వనం జ్వాలా నరసింహారావు


యుద్ధంలో మరణించిన దూషణుడు, సేనాపతులు, త్రిశిరుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-36
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (25-11-2018)
         ఐదువేలమంది కఠినదేహాలు, మనస్సు కల రాక్షసులను రామభాద్రుడిని చంపడానికి పంపాడు దూషణుడు. వాళ్ళు వజ్రసమానమైన శూలాలను, ఖడ్గాలను, బాణాలను వర్షంలాగా కురిపిస్తూ రాముడి మీదకు వస్తుంటే, ఆయన పరాక్రమించి తన బాణాలతో వారి ఆయుదాలన్నింటినీ ఖండించాడు. దూషణుడితో సహా సైన్యాన్నంతా దుఃఖ దశకు తీసుకొచ్చాడు. బాణ వర్షంతో వారందరినీ స్నానం చేయించాడు రాముడు. శత్రుసమూహాలను నాశనం చేయగల దూషణుడు కోపగించి వజ్రసమానమైన బాణాలను తనపై ప్రయోగించగా రామభద్రుడు అంతకంటే ఎక్కువ కోపగించాడు. పదునైన కత్తిలాంటి బాణంతో దూషణుడి విల్లు తుంచి, మరో నాలుగు పదునైన బాణాలతో నాలుగు గుర్రాలను చంపి, తరువాత సారథి కంఠాన్ని అర్థ చంద్ర బాణంతో నరికి, మూడు బాణాలు దూషణుడి రొమ్ములో నాటేట్లు రామభద్రుడు చేయగా రాక్షసుడు కూడా ఆయన మీద పడడానికి వచ్చాడు. వస్తున్న వాడి రెండు చేతులను తటాలున రెండు బాణాలతో నరికాడు. రెండు చేతులూ తెగడంతో దూషణుడు కొమ్ములు పెరికిన ఏనుగులాగా చచ్చాడు. చనిపోయిన వాడిని చూసి భూతాలన్నీ మేలు-మేలని శ్రీరామచంద్రుడిని పోగిడాయి.

         ఇంతలో కొందరు రాక్షస వీరులు కోపంతో దేహం తెలియకుండా రామభద్రుడి మీదకు వచ్చారు. స్థూలాక్షుడు పట్టిసాన్ని, మహాకపాలుడు శూలాన్ని, ప్రమాథి భయంకరమైన గండ్ర గొడ్డలిని తీసుకుని చేతులతో తిప్పుకుంటూ రాముదిమీదకు వస్తుంటే, రామభద్రుడు మొదలు పదునైన బాణాలతో మహాకపాలుడి తల నరికాడు. మరో గొప్ప బాణంతో ప్రమాథిని చంపాడు. స్థూలాక్షుడి కళ్లల్లో బాణాలను చొప్పించి, ఐదువేల రాక్షసులను ఒక్కసారే ఐదువేల బాణాలతో ఖండించాడు. ఇది చూసి ఖరుడు, క్షుద్ర మనుష్యులతో దూషణుడు చచ్చాడు కాబట్టి మీరంతా పోయి రామభద్రుడిని చంపమని యోధులను ఆజ్ఞాపించి తానె స్వయంగా యుద్ధానికి దిగాడు.

         కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, దుర్జయుడు, యజ్ఞశత్రుడు, విహంగముడు, రుధిరాశనుడు, సర్పాస్యుడు, పృధుగ్రీవుడు, శ్యేనగామి, కరవీరాక్షుడు, పరుషుడు అనే పన్నెండు మంది సేనానాయకులు ఒక్కసారిగా రామభద్రుడిని ఎదుర్కొని బానవర్షం కురిపించారు. రాముడు వారి బాణాలను ఖండించి వజ్రంతో సమానమైన బానవర్షాలను కురిపించి, వాళ్లను నరికి భూదేవికి బాలి ఇచ్చాడు. ఆ తరువాత నూరు బాణాలతో వందమందిని, వేయి బాణాలతో మరో వేయి మందిని చంపాడు. యుద్ధ భూమి నెత్తుటితో తడిసినట్లు కనిపించింది. మరణించిన దుష్ట రాక్షస సమూహం వెంట్రుకలతో భూమి దర్భల వేదికలాగా కనపడింది. మొత్తం మీద, పద్నాలుగువేల రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన భుజబలంతో చంపాడు. ఇక ఇరు పక్షాలలో మిగిలింది, ఖరుడు, త్రిశిరుడు, రామభద్రుడు మాత్రమే!


         సైన్యమంతా నాశనమైపోవడం చూసిన ఖరుడు రాముడికి అభిముఖంగా పోవడానికి ప్రయత్నించగా, సేనానాయకుడైన త్రిశిరుడు తానుండగా ఇంద్రుడిని గెలిచిన ఖరుడు శత్రువు మీదకు పోవడం మర్యాదా అని ప్రశ్నించాడు. ఇలాంటి ఆలోచన ఖరుడు చేయకూడదనీ, తుచ్చుడైన రాముడిని పట్టుకొని తన బాణాలతో నిమిషంలో నరికి వేస్తానంటాడు. ఈ మాటలు తన విల్లు మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటాడు. “రాముడు నన్నో, నేను రాముడినో చంపడం నిజం. దీన్ని నువ్వు నిలుచుని చూస్తుండు. రాముడు చస్తే నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్లు. నేను చస్తే నువ్వు రాముడి మీదకు యుద్ధానికి పోయి అతడి గర్వం అణచు” అని త్రిశిరుడు చెప్పగా ఖరుడు అలానే చేయమని అంటాడు.

           త్రిశిరుడు మూడు శిఖరాల కొండలాగా రథమెక్కి పోయి రామభద్రుడి మీద జోరున వర్షంలాగా బాణాలు కురిపించి, నీళ్లలో తడిసిన నగారా ధ్వనిలాగా సింహనాదం చేశాడు. రామభద్రుడు కూడా రా-రమ్మంటూ తన విల్లు గిర-గిర తిప్పుతూ కఠిన బాణాలు ధరించి త్రిశిరుడి మీద వేశాడు. వాడు కోపంతో విజృంభించాడు. వారిరువురి మధ్య అద్భుతమైన యుద్ధం సింహానికి, ఏనుగుకూ మధ్య జరిగినట్లు జరిగింది. త్రిశిరుడు మూడు బాణాలను రాముడిపైకి వేశాడు. రాముడు జవాబుగా పద్నాలుగు బాణాలను వాడి రొమ్ముకు గురిచూసి వేశాడు. నాలుగు బాణాలతో గుర్రాలను, ఎనిమిది బాణాలతో సారథిని, ఒక్క దెబ్బతో తెక్కాన్ని తుంచి, భూమి మీదకు దుమకడానికి ప్రయత్నిస్తున్న రాక్షసుడి వక్షాన్ని చీల్చేట్లు తీవ్ర బాణాలను వేయగా వాడు చేష్టలుడిగి ఖండించబడిన శిరస్సుతో నేలకూలాడు.

         త్రిశిరుడు పడిపోవడం చూసిన ఖరుడిని ఆశ్రయించిన సేవకులు, ఇతర రాక్షసులు, రామభద్రుడు ఇక తమల్ని కూడా చంపుతాడనే మహా భయంతో పెద్ద పులిని చూసిన లేళ్ళలాగా నాలుగు దిక్కులా పరుగెత్తారు. తానుండగా వాళ్లకు ఎలాంటి ప్రాణభయం లేదని వాళ్లకు ధైర్యం చెప్పి  వాళ్లందర్నీ పిలుచుకొని వచ్చి నిండు కోపంతో చంద్రుడి మీదకు రాహువు పోయినట్లు రాముడి మీదకు పోయాడు యుద్ధానికి. 

Sunday, November 18, 2018

శ్రీరాముడికి సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడికి సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (19-11-2018)
ఇలా రామసుగ్రీవులు మాట్లాడుకుంటున్నప్పుడు, సింహనాదాలు చేసుకుంటూ వస్తున్న వానరుల కిలకిలారావములు, ఆకాశానికి దగ్గరలోనే వినపడగానే, సుగ్రీవుడు ప్రభువు కూర్చుండే పధ్ధతిలో, తోకను పొడుగ్గా చాచి కూర్చున్నాడు. వారొస్తున్న పద్దతి, ఆధ్వని, కార్య సఫలతను తెలిపే విధంగా వున్నాయి. అంగదుడినీ, ఆంజనేయుడినీ, మనస్సులో తలచుకుంటూ, వానరులు సుగ్రీవుడి దగ్గరగా దిగారు. శ్రీరామచంద్రమూర్తితో హనుమంతుడప్పుడు సీతను గురించి సర్వస్వం తెలియ చెప్పే విధంగా, మూడే-మూడు మాటలంటాడు. "నియత-ప్రాణయుక్త-దేవి" అన్న ఆ మూడు మాటలు వింటూనే, సుగ్రీవుడు రామకార్యం ఫలించిందనీ, తన మాట చెల్లించు కున్నాననీ సంతోషించాడు. శ్రీరామలక్ష్మణులు ప్రీతిగా, ప్రియమైన మాటలు చెప్పిన హనుమంతుడిని ప్రేమగా అలాగే చాలాసేపు చూస్తుండిపోయారు.

("నియత" అంటే పాతివ్రత్య నియమం కలదనీ, "ప్రాణయుక్త" అంటే జీవించి వున్నదనీ, "దేవి" అంటే సీతాదేవి అనీ ఆ మూడు మాటలకర్థం. సీతాదేవి ప్రాణాలతో బ్రతికున్నా, శీలం చెడిందయితే చచ్చినదానితో సమానమైంది కనుక, "శీలం" కలదని “నియత” అని మొదలంటాడు. శీలం కలిగిన విషయం నిజమే! చనిపోతే శీలం వున్నా లాభం ఏమిటి? కాబట్టి జీవించే వున్నదని “ప్రాణయుక్త” అంటాడు. "దేవి" శబ్దం తనకు సీతాదేవి మీదున్న భక్తి, గౌరవం చెప్పటానికే! దేవుడి భార్య దేవి. దేవీ శబ్దం లక్ష్మి పర్యాయపదంగా అష్టోత్తర శతనామావళిలో చెప్పబడింది. రామ, దేవ శబ్దాలు సమానర్థం కలిగున్నవే! తనకామె సాక్షాత్తూ "లక్ష్మీదేవి" లాగా కనపడిందన్న భావన).

వానరులందరూ, రామలక్ష్మణసుగ్రీవుల దగ్గరకు పోయి, నమస్కరించి, సీతాదేవి రావణాసురుడి ఇంట్లో వున్న సంగతి, రాక్షసస్త్రీలు ఆమెను బెదిరిస్తున్న విషయం, రావణుడు పెట్టిన గడువు వ్యవహారామ్, సీతాదేవి పతిభక్తి గురించీ, వివరంగా చెప్పారు. సీతాదేవి క్షేమసమాచారం విన్న శ్రీరాముడు, ఆమె ఎక్కడుంది, ఏంచేస్తున్నది, తన విషయంలో ఏ నియమంతో వుంది, వివరించమని వానరులను అడిగాడు. చూసి వచ్చిన హనుమంతుడినే, ఈ విషయాలన్నీ చెప్పమని మిగిలిన వానరులంటారు. హనుమంతుడప్పుడు, సీతాదేవి వుండే దిక్కుకు తిరిగి, సీతాదేవికి వినయంగా నమస్కరించి, శ్రీరామచంద్రమూర్తితో చెప్పడం మొదలెట్టాడు. ( శుభ కార్యాలకు పనికిరాని దక్షిణ దిశ కూడా, సీతాదేవి వున్న కారణాన, హనుమంతుడికి వందనీయమయింది. అందుకే దక్షిణ దిశ అనకుండా, సీతాదేవి వుండే దిక్కంటాడు వాల్మీకి భగవానుడు, వాసుదాసకవి. మహానుభావులుండే ప్రదేశాలు కూడా పూజ్యనీయమైనవే కద!).

"నూరుయోజనాల సముద్రాన్ని దాటి, సీతను చూసే కోరికతో పోయాను. అక్కడ దేవతల విరోధి రావణాసురుడుండే లంకనే పట్టణముంది. ఆ రాక్షసరాజు ఇంట్లో, ఏకోరికల్లేక, నిన్ను చూద్దామన్న ఒకే ఒక్క కోరికతో, ఊపిరి బిగబట్టుకుని వున్న సీతను చూశాను. మాటలను బట్టి, చేష్టలను బట్టి ఆమెలో ప్రాణముందనుకోవాలే తప్ప, రూపం చూస్తే బ్రతికున్నదానిలాగా అనిపించదు. అలాంటామెను వికార రూపాలున్న రాక్షసస్త్రీలు, ఒకరి తర్వాత ఒకరు బెదిరిస్తుంటే, దుఃఖిస్తున్నది. దుఃఖమంటే ఏమిటో తెలియక, సుఖపడాల్సిన సీత, చెప్పనలవికాని శోకంతో అశోకవనంలో వుంది".

రావణుడి అంతఃపురంలోని చెరలో చిక్కుకున్న సీతాదేవికి కాపలాగా రాక్షసస్త్రీల గుంపులున్నాయి. వెంట్రుకలన్నీ ఒకటిగ అల్లుకునిపోయిన జడతో, కటికనేలపై కూర్చుండే శక్తికూడా లేక, పడుకొని బాధపడుతోంది. సర్వకాల సర్వావస్థలందు నిన్ను ధ్యానించడంలోనే నిమగ్నమయింది. బాధపట్తున్న ఆమెను చూస్తుంటే, శీతాకాలం నాటి తామరతీగలాగా వుంది. దేహం కాంతిచెడి, ప్రాణాలు విడుద్దామని ఆలోచిస్తున్న సీతాదేవిని అదేసమయంలో అతికష్టం మీద చూశాను. నా రాకను ఆమెకు తెలియచేసే వుద్దేశంతో, ఇక్ష్వాకు రాజుకీర్తిని ఆమెను నమ్మించేందుకు, ఆమె వినేటట్లు స్మరించాను".


"మహామహిమగల సీతాదేవి నిన్నే మిగుల నిర్మల స్వభావంతో, మనస్సులోనే స్మరిస్తున్నది. సత్పురుషులను ప్రశంసించే భక్తి, స్వభావం,  పాతివ్రత్యం,  తపస్సు,  ఉపవాసం వదలకుండా, అశోకవనంలో వుంది. ఇది వీరెవ్వరూ నాతో చెప్పిందికాదు. స్వయంగా నాకళ్లతో నేనే చూసాను" అంటూ, తనూ, సీతాదేవీ మాట్లాడామనటానికి గుర్తుగా చిత్రకూట పర్వతంపైన జరిగిన కాకాసుర వృత్తాంతాన్ని చెప్పాడు. చెప్పి," అక్కడ చూసిన సర్వస్వం చెప్పమన్నది సీతాదేవి. చెప్పాను. నెలరోజులెట్లాగో ప్రాణాలు నిలబెట్టుకుంటానన్నది. ఎంత శుష్కించి పోయినా, పతివ్రతా ధర్మాన్ని మాత్రం విడువకుండా, రావణుడింట్లో నిర్బంధంగా జీవిస్తున్నది. ఉన్నదున్నట్లు సర్వం నీకుతెలిపాను. నీవెట్లైనా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేయి" అంటాడు. చెప్పదల్చుకున్నది చెప్పిన తర్వాత, అక్కడున్న వారందరూ నమ్మేటట్లు, సీతాదేవి ఇచ్చిన చూడామణి దివ్య రత్నాన్ని తీసి శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు.

సీతను తలచుకుని, ఆమెను కౌగలించుకున్న రీతిలో, దానిని రొమ్మునకు హత్తుకుని, సీతను తలచుకుంటూ, దుఃఖం పొంగిపొర్లి వస్తుంటే, లక్ష్మణసుగ్రీవులతో ఇలా అంటాడు:

"సుగ్రీవా! మనుష్యులకు అసాధ్యమై, కేవలం దేవతలే ధరించగల, ఈ చూడామణిని చూడగానే, లేగదూడను చూసిన, ఆవులాగా అయిపోయింది నామనస్సు. దీన్ని మామామగారు, సీతాదేవికి వివాహ సమయంలో ఆమె శిరస్సు అలంకరించాడు. శిరస్సున చూడామణితో ఆమె కాంతివంతంగా ప్రకాశించింది. దివ్యమై, సత్పురుష పూజితమై, జలంలో పుట్టిన ఈ చూడామణిని, యజ్ఞం చేస్తున్న మా మామగారికి, ఆయన మీద దయతో, సంతోషంతో ఇంద్రుడు ఇచ్చాడు ఆయనకు. దీనిని చూస్తుంటే, మామామ జనకరాజునూ, తండ్రినీ చూసినట్లు అయింది. సీతాదేవి శిరస్సులో ప్రకాశించే దీనిని చూడగానే సీతాదేవే వచ్చినట్లుగా అనిపిస్తున్నది".

దాహంతో అలమటిస్తూ, దప్పిక గొన్నవాడికి మంచినీళ్లు పోసినట్లు, తనకు సీతాదేవి వాక్యాలను వినిపించమని ఆంజనేయుడితోనూ, సీతాదేవి లేని చూడామణిని చూడటమంటే అంతకంటే గొప్ప దుఃఖమేమన్నా వున్నదా అని లక్ష్మణుడితోనూ అంటాడు శ్రీరాముడు.

"నన్ను విడిచి సీత ఇంకొక నెల రోజులు జీవించి వుంటే, ఆమెకు మరణమేలేదు. ఎన్నిరోజులైనా బ్రతికుంటుంది. ఆ కాటుక కంటిని వదిలి ఒక్కక్షణంకూడా బ్రతికుండలేను. నేను బ్రతికుండాలంటే నన్నామెదగ్గరకు తీసుకొనిపొండి. సీత ఇలా వుందని వినికూడా, ప్రాణాలతో వుండడం నా వశం కాదు.

(అమితంగా దుఃఖించిన రాముడు, అంత దుఃఖంలో కూడా, తనను సీత దగ్గరకు తీసుకు పొమ్మంటాడే కాని, ఆమెనెందుకు తీసుకు రాలేదనికానీ, తీసుకు రమ్మని కానీ అనడు).

తన ఆత్మకు నేను ఈశ్వరుడనని సీత చెప్పిందికాని, నా ఆత్మకు ఆమే “ఈశ్వర-ఈశ్వరి” రెండూ! నామనస్సు, ప్రాణాలు, జీవుడు, ఆమె వశంలోనే వున్నాయి. అలాంటి సీత, భయపడే స్వభావమున్న సీత, ఆ దేవి, దిగులు పుట్టించే మాటలు, దిగులు పుట్టించే రాక్షసస్త్రీల మధ్య ఎట్లా జీవిస్తున్నదోకదా! ఇదెంత అసాధ్యమైన కార్యం? ప్రాణాలతో వున్నా, మేఘాలు కమ్ముకున్న శరత్కాల చంద్రుడిలా కాంతిహీనమైపోలేదా?".

తాను వచ్చి సీత దుఃఖం పోగొట్టలేదని, ఆమె కోపంతో వున్నదా? అని ఆంజనేయుడిని అడుగుతాడు.  రోగికి ఔషధం ఎలానో, అలానే తనకు హనుమంతుడి మాటలంటాడు. తేనెవంటి మాటల స్వభావంకల ఆమె, తన్నొదిలి వుండడంవల్ల, తనను ఉద్దేశించి ఏం చెప్పిందో ఆమాటలే చెప్పమని కోరుతాడు శ్రీరాముడు హనుమంతుడిని.

Saturday, November 17, 2018

సైన్యంతో శ్రీరాముడిని తాకిన ఖరుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-35 : వనం జ్వాలా నరసింహారావు


సైన్యంతో శ్రీరాముడిని తాకిన ఖరుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-35
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (18-11-2018)

         కోపంతో, శత్రు సంహారకుడిలా కనిపిస్తున్న యుద్ధ సన్నద్ధుడైన కోదండధరుడు శ్రీరామభద్రుడిని చూసిన ఖరుడు తన సారథితో ఆయన వున్న ప్రదేశానికి తన రథాన్ని పోనివ్వమన్నాడు. ఆయన అలా చెప్పగానే ఆయన చుట్టూ మూగిన రాక్షసులు సింహనాదాలు చేశారు. ఖరుడు ఆలశ్యం చేయకుండా పదునైన బాణ పరంపరలను విస్తారంగా రాముడి మీదకు వేశాడు. మిగిలిన రాక్షసులందరూ రాముడిని చుట్టుముట్టి గుడియలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, కత్తులు ఆయన మీదికి విసిరారు. శ్రీరాముడు మాత్రం అప్పటిదాకా ఆత్మరక్షణ పరాయణుడై నిలిచాడు. రామభద్రుడిని చంపడానికి రాక్షసులు బాణాలతో, ఏనుగులతో, రథాలతో, ఒక్కసారిగా ఆయన మీద పడ్డారు. అందరూ కలిసి రాముడిమీద బాణాల వర్షం కురిపించారు. (దీనర్థం ప్రధమంగా అపరాధం చేసింది రాక్షసులే). రామభద్రుడు ప్రతిగా, తన బాణ సమూహాలతో వారందరినీ సర్వాయుధాలు లేకుండా చేశాడు. ఆయన తనకు తగిలిన బాణాల వల్ల కొంచెం కూడా వేదన పొందలేదు. దేహం నుండి నెత్తురు కారుతుంటే, సాయంకాల సమయంలోని మేఘాలతో ఆవరించబడిన సూర్యుడిలాగా, అందంగా ప్రకాశించాడు. క్షుద్ర రాక్షస సమూహం శ్రీరామచంద్రమూర్తిని చుట్టుముట్టి ఆయుధాలతో బాదిస్తున్నదే అని దేవతలు, ఋషులు, పరితపించారు. అప్పుడు రామభద్రుడు కోపంతో వింటిని ఆకర్ణాంతం లాగి బాణాలను సంధించాడు.

ఖరుడి సైన్యాన్ని హతం చేసిన శ్రీరాముడు
         అమిత వేగంగా వేసిన సహించనలవి కాని రాముడి బాణాలు రాక్షస గుంపులను దూరి యమపాశాల లాగా, వారి దేహాలను చీల్చి, వారి నెత్తుటి నదుల్లో మునిగి, వెడలి, మండుతున్న అగ్నిజ్వాలల్లాగా ఆకాశానికి ఎగిరిపోయాయి. రామభద్రుడి బాణాలు శత్రువులను తునాతునకలు చేశాయి. వారి శరీర భాగాలు తెగనరకబడి కుప్పలు-తెప్పలుగా పడిపోయాయి. విరోధులు తత్తరపడేట్లు బంగారు సొమ్ములతో అలంకరించబడిన రాక్షసుల గుర్రాలను చంపి, మావటివాళ్ళతో మదించిన ఏనుగులను తునకలు-తునకలు చేసి, రథికులతో, సారథులతో సహా రథ సమూహాలను పదునైన బాణాలతో నరికి, భటుల గుంపులను కూర ముక్కల్లాగా కోసి, సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న రాముడిని చూసి రాక్షస సైన్యం దుఃఖించింది. ఆ రాక్షసుల గుంపులో చాలామంది చావగా, మిగిలిన కొందరు రామభద్రుడి మీదకు దాడికి దిగగా, ఆయన మరింత పదునైన బాణాలతో వారి ఆయుధాలను, తలలను ఒకేసారి నరికి వేశాడు. ఇక మిగిలిన వారంతా దుఃఖపడుతూ ఖరుడి చాటుకు పోయారు భయంతో.


         ధైర్యం కోల్పోయి వెనక్కు వచ్చిన వారందరినీ మళ్లీ ధైర్యం చెప్పి, దూషణుడు రోషంతో రామభద్రుడి మీదకు యుద్ధానికి పోయాడు. ఆయన వెంట ఇంతకు ముందు మరలి వచ్చిన గుంపు కూడా తమ ఆయుధాలు ఖండించబడినందువల్ల  మద్ది-తాటి చెట్లను ఆయుధాలుగా ధరించి రాముడి మీదికి పోయారు. వెనుకంజ వేయకుండా, ఒక్క రాముడిని ఓడించకపొతే అవమానం అంటూ, రాక్షసులు కొంతసేపు యుద్ధం చేశారు. ఈటెలు, కత్తులు, బాణాలు తన మీద వేస్తుంటే, రామభద్రుడు ధనుష్టంకారం చేసి వాళ్ల గుండెలు పగులచేసి, సింహనాదం చేసి, శత్రుసంహారానికి గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. దాని నుండి వెలువడిన అనేక అకారాల భయంకరాస్త్రసమూహం మూలంగా, ఆకాశం చీకట్లు కమ్మింది. రాక్షస సైన్యం తూలి, వాలి, పడి, తునకలు-తునుకలై, పేగులు తెగిపడగా మూర్చపోయి కూలి, పొడి-పొడి అయిపోయి భయంకరంగా నాశనం అయింది. ఇదంతా ఆకాశం నుండి చూసిన దేవతలు సంతోషించారు.

         విరిగిన రథాలను, చచ్చిపడిన శూరులను, నేలవాలిన ధ్వజాలను, గొడుగులను, తెరచిన నోరులను, పరుగిడుతున్న వీరులను, పడిపోయిన ఏనుగులను, దొర్లాడు గుర్రాలను, కోయబడిన చేతులను, విధం చెడ్డ, సర్వం నాసనమైన రాక్షస సైన్యాన్ని చూసిన దూషణుడు మరింతమందిని రాముడిమీడకు పంపాడు.

Friday, November 16, 2018

“From trail-blazer to country’s numero uno, 51 months of KCR Governance with a difference” and “ఇదీ సుపరిపాలన-51 నెలల కేసీఆర్ ప్రభుత్వం”


“From trail-blazer to country’s numero uno, 51 months of KCR Governance with a difference” 

మరియు 
“ఇదీ సుపరిపాలన-51 నెలల కేసీఆర్ ప్రభుత్వం”



By clicking on the following links the two books will be available


http://kinige.com/book/Idi+Suparipalana+51+Nelala+KCR+Prabhutvam


http://kinige.com/book/51+Months+Of+KCR+Governance+With+A+Difference

Sunday, November 11, 2018

సుగ్రీవుడి దగ్గరకు వెళ్లిన అంగదాదులు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సుగ్రీవుడి దగ్గరకు వెళ్లిన అంగదాదులు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (12-11-2018)
తనకు నమస్కరించి కాళ్లమీద పడిన దధిముఖుడిని చూసి, సుగ్రీవుడు, భయపడకుండా, జరిగిందేంటో చెప్పమని అడుగుతాడు. సమాధానంగా, సుగ్రీవుడి తరంలోగానీ, ఆయన అన్న తరంలోగానీ, తండ్రి తరంలోగానీ, మధువనంవైపు కూడా రాని వానరులు, ఇప్పుడు దక్షిణ దిక్కునుండి తిరిగి వస్తూ ఆ వనాన్ని పాడుచేసారని పిర్యాదు చేసాడు. వారక్కడ తేనెతాగారనీ, పళ్ళన్నీ తిన్నారనీ, తాగగా మిగిలిన తేనెను పారపోసారనీ, ఇదేమిటని అడ్డంపోయిన కావలివారిని వెక్కిరించి కొట్టారనీ, చెప్పాడు. వనపాలకులు వెళ్లి బలవంతంగా వానరులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే, వాళ్లు కోపంతో పిడికిళ్లతో గుద్దారనీ, కాళ్లతో కుమ్మారనీ, ముడ్లు చూపారనీ, సుగ్రీవుడు రాజన్న సంగతికూడా మరిచిపోయి ప్రవర్తించారనీ, అన్నాడు. ఇలా ఆయన విన్నవిస్తున్న సమయంలోనే, ఆమాటలువిన్న లక్ష్మణుడు, సుగ్రీవుడితో, వనపాలకుడు ఏమంటున్నాడనీ, ఎందుకు దుఃఖిస్తున్నాడనీ ప్రశ్నిస్తాడు.

జరిగిన సంగతినీ, దధిముఖుడి పిర్యాదునీ, నేర్పుగా లక్ష్మణుడికి వివరిస్తాడు సుగ్రీవుడు. మధువనంలో హనుమంతుడి అండతో, అంగదుడి ప్రోత్సాహంతో, కపులు చేసినపనిని గురించి తనదైన మాటల్లో నేర్పుగా చెప్పాడు. దక్షిణ దిక్కుగా పోయిన వానరసేనకు, ఆలోచన చెప్పేవాడు జాంబవంతుడైనప్పుడు, హనుమంతుడు రక్షకుడైనప్పుడు, ప్రభువేమో అసమానబలుడైన అంగదుడే అయినప్పుడు, వారికప్పచెప్పిన పని సఫలమయిమడనడంలో ఆశ్చర్యం లేదనుకుంటాడు. ఆ విషయమే చెప్పాడు లక్ష్మణుడితో సుగ్రీవుడు. అంగదుడు మొదలయినవారు, ఇతర వానర ప్రముఖులు, మధువనాన్ని కుప్పచేసారనీ, వద్దని అడ్డంపోయిన దధిముఖుడినీ, వనపాలకులనూ కొట్టారని కూడా చెప్పాడు సుగ్రీవుడు. వానరులు సీతాదేవిని చూడకపోయినట్లైతే, బ్రహ్మదత్తమైన మధువనాన్ని కళ్లతో చూసే ధైర్యమైనా వుంటుందా? ఈ మాటలు విన్న రామలక్ష్మణులు సంతోషంతో గగుర్పాటుపడ్డారు.

రామలక్ష్మణులకు ఇలా చెప్పిన సుగ్రీవుడు, దధిముఖుడితో వానరులు మధువనంలో స్వేచ్ఛావిహారం చేసారంటే, వారుమంచి కార్యం సాధించి వుంటారనీ, కాబట్టి వాళ్లను క్షమించాలనీ, క్షమించాననీ అంటాడు. హనుమంతుడు, ఇతరులు ప్రవర్తించిన విధం, సీతాదేవిని చూసేందుకు వారుచేసిన ప్రయత్నం, రామలక్ష్మణుల సన్నిధిలోనే తాను వినదల్చుకున్నానని వానరులందరికీ చెప్పి, వాళ్లను త్వరగా రమ్మని కబురుచేస్తాడు సుగ్రీవుడు. ఇలా చెప్పిన తర్వాత, సంతోషంతో, వికసించిన కళ్లతో, పులకరించిన దేహంతో, కనిపించిన రామలక్ష్మణులను చూసి, సీతాన్వేషణ కార్యం సఫలమయిందికదా అని ఆనందించాడు సుగ్రీవుడు.

రామలక్ష్మణులకు, సుగ్రీవుడికి నమస్కరించిన దధిముఖుడు, పరిచారకులతో ఆకశానికెగిరి, ఎంతవేగంగా వచ్చాడో, అంతేవేగంగా వెళ్లిపోయాడు. మధువనంలో తేనెను నీళ్లతో కలుపుకుని తాగిన వానరులకు, మూత్రం విడిచినందున, అప్పటికి మత్తువదిలింది. ఆ వానరులలో అంగదుడిని గమనించి, అతడి వద్దకువెళ్లి, చేతులు జోడించి నమస్కరించాడు దధిముఖుడు. తాను చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటాడు. వనపాలకులు తెలివితక్కువతనం వల్ల వానరులను అడ్డగించారనీ, ఆ ఉద్యానవనానికి రాజకుమారుడూ, యువరాజూ అయిన అంగదుడే ప్రభువనీ, ఆయన సొమ్ము ఆయన వాడుకుంటే అడ్డగించే అధికారం వీరికెవరికీ లేదని అంటాడు. అజ్ఞానంతో చేసిన తప్పులు క్షమించమని, వాళ్లు ఈ వనంలోకి వచ్చిన వార్తను పిన తండ్రి సుగ్రీవుడికి తెలిపి వచ్చాననీ అంటాడు. తాను సుగ్రీవుడితో వానరులు తప్పుచేసారని చెప్తే, కోపగించుకునేబదులు, సంతోషించి, వాళ్లను త్వరగా రమ్మని కబురంపాడని కూడా చెప్పాడు దధిముఖుడు.


దధిముఖుడు చెప్పిన మాటలు విన్న అంగదుడు వానరులతో, ఈ విషయాలన్నీ రామలక్ష్మణులకు కూడా తెలిసే వుంటాయనీ, ఎట్లాగూ తేనెతాగి అలసట తీర్చుకున్నాం కనుక, ఇక్కడ చేయాల్సిన పనికూడా ఏమీలేదుకనుక, పిన తండ్రిని చూట్టానికి పోదామా అని అడుగుతాడు. "మీ అందరూ ఏది చెప్తే అదే చేద్దాం. పనులు చేయడం విషయంలో నేను మీ అధీనంలో వుంటాను. నేనుమీకు యువరాజునైతే అవ్వొచ్చు. ఆ అధికారం వుందికదానని మీకిష్టం లేని పని చేయమని నేను ఆజ్ఞాపించను. కార్యసాధకులైన మిమ్మల్ని వ్యర్ధమైన ఆజ్ఞలతో పీడించను" అన్న అంగదుడి మాటలకు వానరులంతా సంతోషపడ్డారు. రాజైన ప్రతివాడూ, తానే సర్వం చేస్తాననీ, చేయగలవాడిననీ, మతిచెడ్డవాడిలాగా గర్వపడుతాడుకాని, ప్రభువనేవాడెవ్వడూ, ఈవిధంగా, వినయంగా మాట్లాడడని అనుకుంటారు. ఇలాంటివాళ్లు అరుదుగా వుంటారనీ, ఇతని వినయమే భవిష్యత్తులో గొప్పమేలు చేస్తుందని భావిస్తారు.

అంగదుడి ఆజ్ఞ లేక అడుగెయ్యమనీ, ఏపనైనా ఆయన చెప్పినట్లే చేస్తామనీ, ఆయన చెప్పినట్లే సుగ్రీవుడిని చూడటానికి పోదామనీ వానరులందరూ అంటారు. "సరే" పోదామని అంగదుడనగానే, వానరులు ఆకాశమార్గాన, వేగంగా, యంత్రాలతో చిమ్మిన కొండల్లాగా, గర్జించే మేఘాల్లాగా, సుగ్రీవుడుండే ప్రదేశానికి చేరుకున్నారు. ఇంతలో సీతాదేవి వార్త తెలియరానందున, రామచంద్రమూర్తి సంతాప పడుతుంటాడక్కడ.

సంతాపపడుతున్న శ్రీరామచంద్రుడిని చూసిన సుగ్రీవుడు, ఆయనతో, ఓదార్పు మాటలతోనూ, ధైర్యవచనాలతోనూ, మాట్లాడాడు. "కమలాక్షా! ఊరడిల్లు. వానరులు నిస్సందేహంగా సీతను చూసొచ్చారు. గడువుదాటి కార్యం సాధిన్చకుండా, నా ఎదుటకు వచ్చే ధైర్యం వాళ్లకు లేదు. వెళ్లినపని చేయక వెనక్కువచ్చే పనికిమాలినవాడు కాదు అంగదుడు. కార్యసాధకులు కాకపోతే, తాతతండ్రులు రక్షించుకుంటూ వస్తున్న ఉద్యానవనంలోకి ప్రవేశించడానికి ఎన్ని గుండెలున్డాలి? రఘువరా, కౌసల్యా తనయా! సీతాదేవి వార్త తెలిసింది. ఈకార్యం సాధించగలవాడు హనుమంతుడొక్కడే. ఇతరులకిది దుస్సాధ్యం. ఆ సూర్యుడిలో స్థిరమైన తేజం ఎలా వుంటుందో ఈవానర శ్రేష్టుడిలో, శక్తి, బలం, జ్ఞానం, స్థిరంగా వుంటాయి" అంటాడు సుగ్రీవుడు.

Saturday, November 10, 2018

సీతాలక్ష్మణులను గుహలో పొమ్మని యుద్ధానికి సిద్ధమైన శ్రీరాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-34 : వనం జ్వాలా నరసింహారావు


సీతాలక్ష్మణులను గుహలో పొమ్మని యుద్ధానికి సిద్ధమైన శ్రీరాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-34
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (11-11-2018)
            లక్ష్మణుడు చేయాల్సిన పనేదో చెప్పాడు శ్రీరాముడు ఇలా: “సీతాదేవి ఇక్కడుంటే ఆమెకు వాళ్ళు కీడు కలిగిస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ వుండకూడదు. ఒంటరిగా ఎక్కడికీ పంపకూడదు. నువ్వు ఆమెను పిల్చుకొని, విల్లు-బాణాలు ధరించి దట్టంగా వున్నా చెట్ల గుంపులుకల కొండగుహలోకి పొండి. ఆమెను లోపల వుంచి నువ్వు బయట కాపలాగా వుండు. ప్రయాణం కండి తొందరగా. లేలే. నేనొకపని, నువ్వొకపని చేయాల్సి వుంది. రెండూ ముఖ్యమైనవే కదా?

(వీటినే ఇప్పుడు “సీతమ్మ గుట్టలు” అని అంటారు. రాక్షస సైన్యం తూర్పు ముఖంగా వచ్చింది. సీతాలక్ష్మణులు ఎటి ఒద్దు వెంట ఉత్తర ముఖంగా పోయారు). 

శ్రీరాముడు ఇంకా ఇలా అన్నాడు లక్ష్మణుడితో. “నేను చెప్పిన మాటలకు బదులు చెప్తే నా పాదాలమీద ఒట్టు. యుద్ధ ప్రియా! నువ్వు బలహీనుడవనీ, వీళ్లతో యుద్ధం చేసి గెలవలేవనీ, నిన్నీపనికి ఏర్పాటు చేయలేదు. నువ్వు బలవంతుడివి. శూరుడివి. వీళ్లందరినీ జయించవచ్చు. ఇందులో సందేహంలేదు. అయినా ఈ రాక్షసులను నేనే స్వయంగా చంపాలనుకుంటున్నాను. అంటే తప్ప మరే కారణం లేదు. వాళ్లు రాకముందే బయల్దేరి వెళ్లు. మునులకు వాగ్దానం చేసిన వాడిని నేను. కాబట్టి ప్రథమ ప్రయత్నంగా నేనే యుద్ధానికి పోవడం యశస్కరం. అలా కాకుండా నిన్ను యుద్ధానికి పంపించి నేను చాటుగా వుంటే, రాముడు మాట్లాడేవాడే కాని సమయం వచ్చేసరికి ముఖం తప్పించి, తానూ, తన పెళ్లాం గుహలో దాక్కొని చిన్నవాడిని ముందుకు తోసాడని అంటారు. నువ్వు నన్ను ఇలాంటి అపకీర్తి పాలు చేయవచ్చా? కాబట్టి నేనే యుద్ధానికి పోతాను”.

రామచంద్రమూర్తి చెప్పినట్లే త్వరగా లక్ష్మణుడు తన విల్లు, బాణాలు ధరించి సీతాదేవితో వెళ్ళిపోయాడు. ఇక సీత విచారం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఆ సంతోషంతో యుద్ధ ప్రయత్నం చేశాడు. మండుతున్న అగ్నితో సమానమైన గొప్ప కవచాన్ని తొడుక్కొని, పదునైన బాణాల విల్లు చేత బట్టుకొని, అల్లెతాటి ధ్వనితో దిక్కులు భేదిల్లేట్లు రామచంద్రమూర్తి ఉత్సాహంగా విజృంభించి నిలిచాడు. ఇలా ఉత్సాహంతో యుద్ధ సన్నద్ధుడై నిలిచిన రామభద్రుడిని చూసిన గంధర్వులు, దేవతలు, చారణులు మొదలైన వారు యుద్ధం చూసే కోరికతో ఆకాశంలో నిలుచున్నారు. వారిలో వున్న ఋషులు తమలో తాము మాట్లాడుకుంటూ, మూడులోకాలకు మేలుజరగాలని కోరుకునే గోబ్రాహ్మణులకు శుభం కలగాలని అంటారు. అలానే, చక్రపాణి అయిన విష్ణుమూర్తి దైత్యశ్రేష్టులందరినీ ఎలా జయించాడో, అదే విధంగా, పులస్త్యవంశంలో పుట్టిన భయంకర రాక్షసులందరినీ యుద్ధంలో జయించాలి అని దీవించారు. ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే అనీ, అధర్మవర్తులైన దుష్ట రాక్షసులు పద్నాలుగు వేలమందనీ, యుద్ధం ఎలా జరగనుందోననీ, ధర్మమే జయిస్తుందో, అధర్మమే జయిస్తుమ్దో చూడాలనీ వారంతా ఆశపడ్డారు. కోపాతిశయంతో జగత్సంహార కార్యోన్ముఖుడైన పినాకహస్తుడు రుద్రుడి ఆకారంతో సమానమైన ఆకారాన్ని వహించి భూతాలకు భీతికలిగించే రామభద్రుడి రూపాన్ని చూసి లోకాలు బాధపడ్డాయి. 

రాముడిని చూసిన ఖరుడి సైన్యం
         అప్పుడు గంభీరధ్వనితో, భయంకరమైన కవచాలు, ఆయుధాలు, ధ్వజాలు కల రాక్షససేనలోని భటుల హుమ్మనే కంఠధ్వనులు, విల్లంబుల, అల్లెతాటుల టంటమ్మనే ధ్వనులు, నగారాల భాంభాం అనే ధ్వనులు, రథికుల ధిక్కారాల ధ్వనులు, వాళ్ళు నడిచేటప్పుడు వారి కాళ్ల దభదభ చప్పుళ్లు, అన్నీ కలిసి పెద్ద సంకులమయింది. ఆ ధ్వనికి అడవుల్లోని మృగసమూహం భయపడి నాలుగు దిక్కులా పరుగెత్తి, పరుగెత్తి, ఆ చప్పుడు వినబడని స్థలం చేరి అప్పుడు తిరిగి చూశాయి. అప్పుడు రాక్షస సైన్యం రాముడిని సమీపించగా, యుద్ధపండితుడైన రామభద్రుడు వారందరినీ తేరిపార చూశాడు. రాముడప్పుడు అల్లెతాటిలోని బాణాన్ని సంధించి ప్రయోగానికి సిద్ధంగా వుంచాడు. ప్రళయకాలంలోని అగ్నిహోత్రుడిలాగా మండుతూ దక్షాధ్వరధ్వంసం నాటి శివుడిలాగా చూసేవారికి భయంకర ఆకారంతో కనిపించాడు రాముడు. భయంకరమైన రామభద్రుడి ఆకారం చిఇసి భూతాలు పెద్ద ధ్వనితో సంతోషం చెడి అధికభయంతో తొక్కిసలాడుతూ పరుగెత్తాయి. ధ్వజాలు, విల్లులు, ఆభరణ సమూహం, మండుతున్న అగ్నిలాంటి కవచాలుకల రాక్షససేన సూర్యోదయ సమయంలోని మేఘాల లాగా కనిపించాయి.

         (ఇక్కడ రామచంద్రుడిని ప్రళయకాలవహ్ని అని, దక్షాధ్వరధ్వంసకుడు అని శివుడి ఉపమానాలు చెప్పడమంటే శత్రుసంహారం తధ్యమని చెప్పడమే. రాక్షసులను సూర్యోదయ మేఘాలతో పోల్చడమంటే వారికి అపజయం తధ్యమని కూడాఅర్థం).