Sunday, November 18, 2018

శ్రీరాముడికి సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడికి సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (19-11-2018)
ఇలా రామసుగ్రీవులు మాట్లాడుకుంటున్నప్పుడు, సింహనాదాలు చేసుకుంటూ వస్తున్న వానరుల కిలకిలారావములు, ఆకాశానికి దగ్గరలోనే వినపడగానే, సుగ్రీవుడు ప్రభువు కూర్చుండే పధ్ధతిలో, తోకను పొడుగ్గా చాచి కూర్చున్నాడు. వారొస్తున్న పద్దతి, ఆధ్వని, కార్య సఫలతను తెలిపే విధంగా వున్నాయి. అంగదుడినీ, ఆంజనేయుడినీ, మనస్సులో తలచుకుంటూ, వానరులు సుగ్రీవుడి దగ్గరగా దిగారు. శ్రీరామచంద్రమూర్తితో హనుమంతుడప్పుడు సీతను గురించి సర్వస్వం తెలియ చెప్పే విధంగా, మూడే-మూడు మాటలంటాడు. "నియత-ప్రాణయుక్త-దేవి" అన్న ఆ మూడు మాటలు వింటూనే, సుగ్రీవుడు రామకార్యం ఫలించిందనీ, తన మాట చెల్లించు కున్నాననీ సంతోషించాడు. శ్రీరామలక్ష్మణులు ప్రీతిగా, ప్రియమైన మాటలు చెప్పిన హనుమంతుడిని ప్రేమగా అలాగే చాలాసేపు చూస్తుండిపోయారు.

("నియత" అంటే పాతివ్రత్య నియమం కలదనీ, "ప్రాణయుక్త" అంటే జీవించి వున్నదనీ, "దేవి" అంటే సీతాదేవి అనీ ఆ మూడు మాటలకర్థం. సీతాదేవి ప్రాణాలతో బ్రతికున్నా, శీలం చెడిందయితే చచ్చినదానితో సమానమైంది కనుక, "శీలం" కలదని “నియత” అని మొదలంటాడు. శీలం కలిగిన విషయం నిజమే! చనిపోతే శీలం వున్నా లాభం ఏమిటి? కాబట్టి జీవించే వున్నదని “ప్రాణయుక్త” అంటాడు. "దేవి" శబ్దం తనకు సీతాదేవి మీదున్న భక్తి, గౌరవం చెప్పటానికే! దేవుడి భార్య దేవి. దేవీ శబ్దం లక్ష్మి పర్యాయపదంగా అష్టోత్తర శతనామావళిలో చెప్పబడింది. రామ, దేవ శబ్దాలు సమానర్థం కలిగున్నవే! తనకామె సాక్షాత్తూ "లక్ష్మీదేవి" లాగా కనపడిందన్న భావన).

వానరులందరూ, రామలక్ష్మణసుగ్రీవుల దగ్గరకు పోయి, నమస్కరించి, సీతాదేవి రావణాసురుడి ఇంట్లో వున్న సంగతి, రాక్షసస్త్రీలు ఆమెను బెదిరిస్తున్న విషయం, రావణుడు పెట్టిన గడువు వ్యవహారామ్, సీతాదేవి పతిభక్తి గురించీ, వివరంగా చెప్పారు. సీతాదేవి క్షేమసమాచారం విన్న శ్రీరాముడు, ఆమె ఎక్కడుంది, ఏంచేస్తున్నది, తన విషయంలో ఏ నియమంతో వుంది, వివరించమని వానరులను అడిగాడు. చూసి వచ్చిన హనుమంతుడినే, ఈ విషయాలన్నీ చెప్పమని మిగిలిన వానరులంటారు. హనుమంతుడప్పుడు, సీతాదేవి వుండే దిక్కుకు తిరిగి, సీతాదేవికి వినయంగా నమస్కరించి, శ్రీరామచంద్రమూర్తితో చెప్పడం మొదలెట్టాడు. ( శుభ కార్యాలకు పనికిరాని దక్షిణ దిశ కూడా, సీతాదేవి వున్న కారణాన, హనుమంతుడికి వందనీయమయింది. అందుకే దక్షిణ దిశ అనకుండా, సీతాదేవి వుండే దిక్కంటాడు వాల్మీకి భగవానుడు, వాసుదాసకవి. మహానుభావులుండే ప్రదేశాలు కూడా పూజ్యనీయమైనవే కద!).

"నూరుయోజనాల సముద్రాన్ని దాటి, సీతను చూసే కోరికతో పోయాను. అక్కడ దేవతల విరోధి రావణాసురుడుండే లంకనే పట్టణముంది. ఆ రాక్షసరాజు ఇంట్లో, ఏకోరికల్లేక, నిన్ను చూద్దామన్న ఒకే ఒక్క కోరికతో, ఊపిరి బిగబట్టుకుని వున్న సీతను చూశాను. మాటలను బట్టి, చేష్టలను బట్టి ఆమెలో ప్రాణముందనుకోవాలే తప్ప, రూపం చూస్తే బ్రతికున్నదానిలాగా అనిపించదు. అలాంటామెను వికార రూపాలున్న రాక్షసస్త్రీలు, ఒకరి తర్వాత ఒకరు బెదిరిస్తుంటే, దుఃఖిస్తున్నది. దుఃఖమంటే ఏమిటో తెలియక, సుఖపడాల్సిన సీత, చెప్పనలవికాని శోకంతో అశోకవనంలో వుంది".

రావణుడి అంతఃపురంలోని చెరలో చిక్కుకున్న సీతాదేవికి కాపలాగా రాక్షసస్త్రీల గుంపులున్నాయి. వెంట్రుకలన్నీ ఒకటిగ అల్లుకునిపోయిన జడతో, కటికనేలపై కూర్చుండే శక్తికూడా లేక, పడుకొని బాధపడుతోంది. సర్వకాల సర్వావస్థలందు నిన్ను ధ్యానించడంలోనే నిమగ్నమయింది. బాధపట్తున్న ఆమెను చూస్తుంటే, శీతాకాలం నాటి తామరతీగలాగా వుంది. దేహం కాంతిచెడి, ప్రాణాలు విడుద్దామని ఆలోచిస్తున్న సీతాదేవిని అదేసమయంలో అతికష్టం మీద చూశాను. నా రాకను ఆమెకు తెలియచేసే వుద్దేశంతో, ఇక్ష్వాకు రాజుకీర్తిని ఆమెను నమ్మించేందుకు, ఆమె వినేటట్లు స్మరించాను".


"మహామహిమగల సీతాదేవి నిన్నే మిగుల నిర్మల స్వభావంతో, మనస్సులోనే స్మరిస్తున్నది. సత్పురుషులను ప్రశంసించే భక్తి, స్వభావం,  పాతివ్రత్యం,  తపస్సు,  ఉపవాసం వదలకుండా, అశోకవనంలో వుంది. ఇది వీరెవ్వరూ నాతో చెప్పిందికాదు. స్వయంగా నాకళ్లతో నేనే చూసాను" అంటూ, తనూ, సీతాదేవీ మాట్లాడామనటానికి గుర్తుగా చిత్రకూట పర్వతంపైన జరిగిన కాకాసుర వృత్తాంతాన్ని చెప్పాడు. చెప్పి," అక్కడ చూసిన సర్వస్వం చెప్పమన్నది సీతాదేవి. చెప్పాను. నెలరోజులెట్లాగో ప్రాణాలు నిలబెట్టుకుంటానన్నది. ఎంత శుష్కించి పోయినా, పతివ్రతా ధర్మాన్ని మాత్రం విడువకుండా, రావణుడింట్లో నిర్బంధంగా జీవిస్తున్నది. ఉన్నదున్నట్లు సర్వం నీకుతెలిపాను. నీవెట్లైనా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేయి" అంటాడు. చెప్పదల్చుకున్నది చెప్పిన తర్వాత, అక్కడున్న వారందరూ నమ్మేటట్లు, సీతాదేవి ఇచ్చిన చూడామణి దివ్య రత్నాన్ని తీసి శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు.

సీతను తలచుకుని, ఆమెను కౌగలించుకున్న రీతిలో, దానిని రొమ్మునకు హత్తుకుని, సీతను తలచుకుంటూ, దుఃఖం పొంగిపొర్లి వస్తుంటే, లక్ష్మణసుగ్రీవులతో ఇలా అంటాడు:

"సుగ్రీవా! మనుష్యులకు అసాధ్యమై, కేవలం దేవతలే ధరించగల, ఈ చూడామణిని చూడగానే, లేగదూడను చూసిన, ఆవులాగా అయిపోయింది నామనస్సు. దీన్ని మామామగారు, సీతాదేవికి వివాహ సమయంలో ఆమె శిరస్సు అలంకరించాడు. శిరస్సున చూడామణితో ఆమె కాంతివంతంగా ప్రకాశించింది. దివ్యమై, సత్పురుష పూజితమై, జలంలో పుట్టిన ఈ చూడామణిని, యజ్ఞం చేస్తున్న మా మామగారికి, ఆయన మీద దయతో, సంతోషంతో ఇంద్రుడు ఇచ్చాడు ఆయనకు. దీనిని చూస్తుంటే, మామామ జనకరాజునూ, తండ్రినీ చూసినట్లు అయింది. సీతాదేవి శిరస్సులో ప్రకాశించే దీనిని చూడగానే సీతాదేవే వచ్చినట్లుగా అనిపిస్తున్నది".

దాహంతో అలమటిస్తూ, దప్పిక గొన్నవాడికి మంచినీళ్లు పోసినట్లు, తనకు సీతాదేవి వాక్యాలను వినిపించమని ఆంజనేయుడితోనూ, సీతాదేవి లేని చూడామణిని చూడటమంటే అంతకంటే గొప్ప దుఃఖమేమన్నా వున్నదా అని లక్ష్మణుడితోనూ అంటాడు శ్రీరాముడు.

"నన్ను విడిచి సీత ఇంకొక నెల రోజులు జీవించి వుంటే, ఆమెకు మరణమేలేదు. ఎన్నిరోజులైనా బ్రతికుంటుంది. ఆ కాటుక కంటిని వదిలి ఒక్కక్షణంకూడా బ్రతికుండలేను. నేను బ్రతికుండాలంటే నన్నామెదగ్గరకు తీసుకొనిపొండి. సీత ఇలా వుందని వినికూడా, ప్రాణాలతో వుండడం నా వశం కాదు.

(అమితంగా దుఃఖించిన రాముడు, అంత దుఃఖంలో కూడా, తనను సీత దగ్గరకు తీసుకు పొమ్మంటాడే కాని, ఆమెనెందుకు తీసుకు రాలేదనికానీ, తీసుకు రమ్మని కానీ అనడు).

తన ఆత్మకు నేను ఈశ్వరుడనని సీత చెప్పిందికాని, నా ఆత్మకు ఆమే “ఈశ్వర-ఈశ్వరి” రెండూ! నామనస్సు, ప్రాణాలు, జీవుడు, ఆమె వశంలోనే వున్నాయి. అలాంటి సీత, భయపడే స్వభావమున్న సీత, ఆ దేవి, దిగులు పుట్టించే మాటలు, దిగులు పుట్టించే రాక్షసస్త్రీల మధ్య ఎట్లా జీవిస్తున్నదోకదా! ఇదెంత అసాధ్యమైన కార్యం? ప్రాణాలతో వున్నా, మేఘాలు కమ్ముకున్న శరత్కాల చంద్రుడిలా కాంతిహీనమైపోలేదా?".

తాను వచ్చి సీత దుఃఖం పోగొట్టలేదని, ఆమె కోపంతో వున్నదా? అని ఆంజనేయుడిని అడుగుతాడు.  రోగికి ఔషధం ఎలానో, అలానే తనకు హనుమంతుడి మాటలంటాడు. తేనెవంటి మాటల స్వభావంకల ఆమె, తన్నొదిలి వుండడంవల్ల, తనను ఉద్దేశించి ఏం చెప్పిందో ఆమాటలే చెప్పమని కోరుతాడు శ్రీరాముడు హనుమంతుడిని.

No comments:

Post a Comment