గుండెపోటుకు
సరికొత్త చికిత్సా సేవలు
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (29-01-2020)
అందరికీ అందుబాటులో వుండే విధంగా, స్టెమి (ఎస్టీ-ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్)-తెలంగాణ పేరుతో, ఒక రకమైన అసాధారణ వైద్య ఆరోగ్య సేవలకు అతి త్వరలో మన రాష్ట్రంలో శ్రీకారం
చుట్టడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఏ క్షణాన్నైనా అవి లాంచనంగా ఆరంభం
కావచ్చునని ఆరోగ్య-వైద్య శాఖ అధికారులు, నిపుణులు అంటున్నారు. మయోకార్డియల్
ఇన్ఫార్క్షన్ అంటే, సాధారణ పరిభాషలో, హృద్రోగం, లేదా, గుండె పోటు. వైద్య ఆరోగ్య
శాఖ ప్రారంభించాలనుకుంటున్న ఈ సేవల ద్వారా గుండె సంబంధమైన వ్యాధులను వీలైనంత
త్వరగా నిర్ధారణ చేసే వీలు కలుగుతుంది. ఈ పని కోసం, కింది స్థాయి పెరిఫరీ
ఆసుపత్రిని “స్పోక్” అనే కేంద్రంగా తీర్చిదిద్ది, అక్కడ ఏర్పాటు చేసిన ఇసిజి
(ఎలెక్ట్రో కార్డియోగ్రాం) యంత్రం ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేసి గుండె పోటు
వచ్చే అవకాశాలు ఉన్నదీ, లేందీ నిర్ణయం చేయడం జరుగుతుంది.
స్టెమి-తెలంగాణ సేవల వల్ల రాష్ట్రంలోని యావన్మంది ప్రజలకు, ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాల ద్వారా, 108 అంబులెన్సుల ద్వారా ఇసిజి సౌకర్యం అందుబాటులోకి తేవడానికి
వీలు కలుగుతుంది. హృద్రోగ వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల తక్షణ ధృవీకరణ, ఆ వెంటనే, సంబందిత పేషంట్ల విషయంలో
అవసరమైన నిర్వహణ చేపట్టేందుకు స్టెమి-తెలంగాణ సేవలు దోహద పడతాయి. ప్రభుత్వ పరమైన
అన్ని వైద్య-ఆరోగ్య కేంద్రాలలో గుండె పోటుకు సంబంధించిన కేసులను గుర్తించి,
తక్షణమే నివారణ దిశగా, త్రోమ్బోసిస్ చికిత్స చేయడానికి కావాల్సిన సామర్థ్యం
పెంపొందించుకుంటాయి. ఈ చికిత్స ద్వారా “క్లాట్-బస్టిమ్గ్” అనే ఒక ప్రత్యేక
ఔషదాన్ని (డ్రగ్) రోగి చేయి నరం (ఇంట్రావీనస్) ద్వారా శరీరంలోకి పంపించడం
జరుగుతుంది. అత్యవసర చికిత్స గదిలో, రోగి గుండెను, శ్వాస కోశాలను నిరంతరం
పర్యవేక్షిస్తూ, రోగి మంచం పక్కనే, అత్యంత జాగ్రత్తగా, డ్రగ్ శరీరంలోకి పంపడం
జరుగుతుంది.
రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది టీచింగ్ ఆసుపత్రుల పరిధిలోని 90 స్పోక్స్ లలో,
నిరంతరం, ఇరవై నాలుగు గంటలూ, కాథ్ లాబ్స్ ఏర్పాటు చేసి, యాంజియో ప్లాస్టీ సౌకర్యం
కలిగించడానికి స్టెమి-తెలంగాణ పథకం దోహదపడుతుంది. (రోగి శరీరంలోని ధమనులు, గుండె గదులను నిశితంగా
పరిశీలించడానికి డయాగ్నస్టిక్ ఇమేజింగ్ పరికరాలతో కూడి ఏర్పాటు చేసిన పరీక్షా
కేంద్రాన్ని కాథ్ లాబ్ అని అంటారు). ఈ కాథ్ లాబ్స్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో
సరిసమానమైన వైద్య సీవలకు గుండె పోటుకు గురైన బీద బిక్కీ రోగులు దగ్గరవుతారు.
గుండె పోటులలో స్టెమి తరహా సమస్య చాలా ప్రమాదకరమైనదనీ, ఇది సర్వసాధారణంగా
తెలంగాణాలో సుమారు 17% హృద్రోగ మరణాలకు కారణమనీ, హృద్రోగ నిర్ధారణ నిపుణులు, సీనియర్
కార్డియాలజిస్టులు అంటున్నారు. సరైన సమయంలో, తక్షణ స్పందనలాగా,
“గోల్డెన్ అవర్” (అంటే గుండె పోటుకు రోగి గురైన గంటలో) కాలపరిమితిలో చికిత్స
చేయకపోతే, స్టెమి తరహా
గుండె పోటులు తీవ్ర అనారోగ్యానికి, మరణాలకు దారితీయవచ్చు. ఒక్కసారి గుండె పోటు వచ్చిందని
నిర్ధారణ జరుగుతే, రోగిని స్థిరీకరించి, త్రోమ్బోటిక్ ఏజెంట్ అనే
ఔషధంతో తక్షణ ప్రాధమిక చికిత్స చేసి, “హబ్” గా నిర్ణయించబడిన సమీపంలోని ఆసుపత్రికి
తరలించడం జరుగుతుంది. ఇలా తృతీయ స్థాయి సంరక్షణ ఆసుపత్రికి, ఎక్కడైతే అత్యంత
ఆధునిక ఉన్నత ప్రమాణాల కాథ్ లాబ్ సౌకర్యం వుంటుందో, అక్కడికి సరైన సమయంలో, అదీ
గోల్డెన్ అవర్లో తరలించడం వల్ల, రోగి ప్రాణాలను కాపాడడానికి వీలు కలుగుతుంది.
స్టెమి తరహా గుండె జబ్బుల కేసులతో వ్యవహరించడం ఒక విధంగా పెద్ద సవాలే. దీనికి
కారణం లేకపోలేదు. ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ జరగడం ఒకటైతే, త్రోమ్బోసిస్
ఏజంట్ ఔషధం రోగికి ఇవ్వడానికి అవసరమైన సౌకర్యాలు, పరికరాలు సమకూర్చడం మరొక
సవాల్. హృద్రోగ మరణాల బారిన పడకుండా వుండడానికి తక్షణ త్రోమ్బోసిస్ ఏజంట్ ఔషధ
చికిత్స చేసిన తరువాత, సర్వసాధారణంగా చేసే యాంజియో ప్లాస్టీ చికిత్స అందించడం
జరగాలి. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం ఇవన్నీ చేయడానికి కావాల్సిన పరికరాలు కానీ, సౌకర్యాలు కానీ లేనందున
స్టెమి-తెలంగాణ సేవల కింద ఏర్పాటయ్యే “హబ్-స్పోక్” మోడల్ చాలా ఉపయోగకరంగా
వుంటుంది. సరైన సమయంలో ఏ మాత్రం జాప్యం జరగకుండా ఇసిజి తీయడానికి, వ్యాధి నిర్ధారణ చేయడానికి, త్రోమ్బోసిస్ ఏజంట్ ఔషధ
చికిత్స జరపడానికి, “హాబ్స్”, “స్పోక్స్” లలో పూర్తి స్థాయి సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేయాలి.
ఈ విధంగా చర్యలు కొనసాగుతున్నాయి.
జాతీయ ఆరోగ్య మిషన్-ఎన్హెచ్ఎం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల
వైద్య-ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కొంత మేరకు లభిస్తున్నప్పటికీ, ఇవి చాలా మేరకు ప్రాధమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల
ద్వారా లభించే ప్రాథమిక సౌకర్యాలకే పరిమితం అవుతున్నాయి. దీంతో, గ్రామీణ ప్రాంతాల లోని
పేదప్రజలు కొంచెం హెచ్చు స్థాయి ప్రమాదంలోనే వున్నారని అనాలి. వైద్య సౌకర్యాలకు
పరిమిత సౌకర్యాలు మాత్రమే కలిగి, అవి బాగా వున్న ఆసుపత్రులకు పోవడానికి అధిక సమయం తీసుకునే
గ్రామీణ ప్రాంత రోగులు త్రోమ్బోసిస్ ఫార్మాకో ఇన్వేసివ్ వ్యూహానికి అనుగుణంగా 30
నిమిషాల లోపు ప్రాధమిక స్థాయి వైద్య సదుపాయానికి దగ్గరవ్వాలి. ప్రాధమికి
త్రోమ్బోసిస్ అయిన 3-24 గంటల వ్యవధిలో యాంజియో ప్లాస్టీ జరగడం మంచిది. ఆ సౌకర్యం
వున్న ఆసుపత్రికి రోగిని చేర్చాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టాలనుకుంటున్న స్టెమి
మానేజ్మెంట్ లో భాగమైన “హబ్-స్పోక్” మోడల్ ద్వారా గుండె పోటు రోగుల సంరక్షణ
తేలికవుతుంది. ప్రస్తుతం వున్న లోపాలను అధిగమించడానికి వీలవుతుంది.
జూన్ నెల 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ప్రస్తుతం పెంచిన జిల్లాలు
కలుపుకుని మొత్తం 33 జిల్లాలున్నాయి. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లకు పైగానే. ఒకే ఒక
మెట్రో నగరమైన హైదరాబాద్ జనాభా సుమారు ఒక కోటి ఇరవై రెండు లక్షలు. రాష్ట్ర
వ్యాప్తంగా సుమారు 28 లక్షల మంది ఇస్ఖీమిక్ గుండె వ్యాధి సమస్యలతో బాధపడుతున్నారు.
ప్రతి లక్ష మందిలో ఏటా సుమారు 240 మంది స్టెమి తరహా గుండె జబ్బులకు గురవుతున్నారని
అంచనా. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో నివసించే ప్రజల అవసరార్థం అత్యున్నతమైన తృతీయ
స్థాయి వైద్య సౌకర్యం అందించగల అనేకానేక కార్పోరేట్ ఆసుపత్రులున్నాయి. గుండె
పోటుకు గురైన వారికి తక్షణ చికిత్స, వైద్య సదుపాయం అందించేందుకు ప్రయివేట్ రంగంలో
సుమారు 150 దాకా కాథ్ లాబ్స్ వున్నాయి. ప్రభుత్వ రంగంలో మాత్రం కాథ్ లాబ్ సౌకర్యం
వున్న ఆసుపత్రులు కేవలం రెండే వున్నాయి. ఒకటి ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కాగా
రెండవది గాంధీ ఆసుపత్రి. పేద ప్రజలకు రాష్ట్రం మొత్తం లోనూ కేవలం ఈ రెండింటిలోనే
కాథ్ లాబ్ సౌకర్యం వుంది. నిమ్స్ ఆసుపత్రిలో వున్నప్పటికీ అక్కడ ఎవరైనా ఫీజు
చెల్లించాల్సి వుంటుంది.
హైదరాబాద్ మహానగర జనాభా గత 50 సంవత్సరాలలో రెట్టింపు అయినప్పటికీ, దశాబ్ద కాలం నాటి రెండే
రెండు కాథ్ లాబ్స్ మాత్రమే ప్రభుత్వ రంగంలో వుండడం, అవి కూడా తరచూ సాంకేతిక
లోపాలకు గురికావడం, చెడిపోవడం అందరికీ తెలసిన విషయమే. హైదరాబాద్ నగరాన్ని
మినహాయిస్తే, రాష్ట్రంలోని మూడొంతుల జనాభా నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు
కాథ్ లాబ్ సౌకర్యం అందుబాటులో లేదు. ఇది లేనప్పుడు యాంజియోప్లాస్టీ సౌకర్యం కూడా
లేదు. అసలు హైదరాబాద్ కు ఆవల వున్నవి పది కాథ్ లాబ్స్ మాత్రమే. అవి కూడా ప్రయివేట్
రంగంలోనే. ఈ కారణాన గోల్డెన్ అవర్లో త్రోమ్బోసిస్ చికిత్స చేసి రోగిని స్థిరీకరణ
చేసే అవకాసం లేదు. గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా జిల్లా, ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రులలో
కూడా నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ సౌకర్యాల కొరత కారణాన ఇది జరగడం లేదు. దాదాపు
అన్ని స్టెమి తరహా గుండె పోటు కేసులను ఏరకమైన ప్రాధమిక వైద్య చికిత్స చేయకుండానే
నగరంలో వున్న ప్రయివేట్ ఆసుపత్రులకు పంపడం జరుగుతున్నది. దీని మూలాన అనవసర కాలయాపన
జరగడం, రోగి తీవ్ర
అనారోగ్యానికి, అకాల మరణానికి
దారితీయడం కూడా జరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాలలోని ఏరియా ఆసుపత్రులను, కమ్యూనిటీ కేంద్రాలను
జిల్లా ఆసుపత్రులుగా నామకరణం చేసినప్పటికీ, మౌలిక సదుపాయాల కల్పన ఇంకా
పూర్తి స్థాయిలో జరగనందున, ఇంటెన్సివ్ కేర్ సౌకర్యం దాదాపు మృగ్యం. అందుకే
స్టెమి-మానేజ్మెంట్ లో భాగమైన “హబ్-స్పోక్ మోడల్” గుండె పోటు చికిత్స దిశగా చాలా
సముచితమైన కార్యక్రమంగా భావించాలి.
“హబ్-స్పోక్ మోడల్” గుండె పోటు చికిత్స కార్యాచరణలో భాగంగా, మొదటి దశలో ఉస్మానియా, గాంధి జనరల్ ఆసుపత్రులను
రెండు “హబ్” లుగా చేయడం జరుగుతుంది. 13 జిల్లా ఆసుపత్రులను, కమ్యూనిటీ కేంద్రాలను
ఉస్మానియాకు; 10 జిల్లా ఆసుపత్రులను, కమ్యూనిటీ కేంద్రాలను గాంధీ ఆసుపత్రికి
అనుసంధానం చేయడం జరుగుతుంది. వరంగల్ లోని మహాత్మా గాంధి స్మారక ఆసుపత్రిని క్రమేపీ
మరొక హబ్ గా చేసి, దానికి 9 జిల్లా ఆసుపత్రులను, కమ్యూనిటీ కేంద్రాలను
అనుసంధానం చేయాలని ప్రతిపాదన.
“హబ్-స్పోక్ మోడల్” పూర్తి స్థాయిలో పని చేయడం మొదలైన తరువాత గుండె పోటుకు
గురైన వారికి చికిత్స చేయడం అత్యంత సులభమవుతుందని సంబంధిత వైద్యులు, నిపుణులు అంటున్నారు.