సీతను తాను
తీసుకొస్తానని రాముడికి చెప్పిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-11
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
సంచిక (05-01-2020)
సుగ్రీవుడు
రామచంద్రమూర్తితో ఇంకా ఇలా అన్నాడు. “నా మంత్రులలో గొప్పవాడైన హనుమంతుడు మీరు
అడవికి వచ్చిన కారణాన్ని చెప్పాడు. నువ్వు మిథిలానగర రాజు కూతురైన సీతతోను, తమ్ముడు లక్ష్మణుడితోనూ, అడవుల్లో తిరుగుతుండగా క్రూర రాక్షసుడు మీరు దగ్గరలో లేని సమయం కనిపెట్టి, నీ భార్యను అపహరించినాడని చెప్పాడు హనుమంతుడు. సీతను అపహరించి
తీసుకుపోతున్న సమయంలో, దారిలో, గద్దరాజైన
జటాయువును చంపాడని చెప్పాడు. రామచంద్రా! నీకు నీ భార్యను ఎడబాయడం వల్ల కలిగిన
దుఃఖాన్ని నేను తొలగిస్తాను. నువ్వు బాధపడవద్దు. పతివ్రతైన సీతాదేవిని నీచుడైన
రాక్షసుడు ఏ ప్రదేశంలో దాచినప్పటికీ, రాక్షసులు హరించిన
వేదాన్ని హయగ్రీవమూర్తి-మత్స్యమూర్తి తెచ్చినట్లు నేను తెస్తాను. సీతాదేవి
పాతాళంలో వున్నా సరే, ఆకాశాన వున్నా సరే, రామచంద్రా! ఆమెను నేను తేగలను. నువ్వు బాధపడవద్దు”.
“రామచంద్రా నేను సత్యం చెప్తున్నాను. నమ్ము.
రాక్షసులు, దానవులు సైన్యంతో విజృంభించినా
సీతను జీర్ణం చేసుకోలేవు. విషం కలిపిన అప్పచ్చులు తిన్నవారు చస్తారుకాని, జీర్ణం చేసుకుంటారా? అలాగే సీతను హరించినవాడు
చస్తాడు కాని ఆమెను అనుభవించలేడు. రామచంద్రా! నువ్వు దుఃఖం వదులు. నీ భార్యను నేను
తెస్తాను. నా భార్య ముఖం నువ్వెరుగవు. ఆమె ఎక్కడున్నదో తెలియదు. అలా వున్నా నేను
ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం, రావణాసురుడు ఒక స్త్రీని
చంకలో ఇరికించుకుని ఆదరబాదరగా ఆకాశంలో పరుగెత్తాడు. ఆమె గద్గద స్వరంతో రామా! రామా!
అని ఏడుస్తూ వుంది. ఆమె సీతాదేవి అని ఇప్పుడు తెల్సుకున్నాను. రామచంద్రా! ఆకాశంలో
పరుగెత్తి పోతున్న రావణాసురుడి ఒడిలో ఆడపాములాగా వేలాడి భయంతో వణకుతున్న స్త్రీని
నేనొక్కడినే కాదు ఈ నలుగురు కూడా చూశారు”.
సీతాదేవి పడేసిన భూషణాలను శ్రీరాముడికి చూపించిన సుగ్రీవుడు
సుగ్రీవుడు శ్రీరాముడితో ఇంకా ఇలా అన్నాడు. “మేం సీతను
చూడడమే కాదు. ఆమెకూడా మమ్మల్ని చూసి, ఆమె తనమీది ఉత్తరీయంలో సొమ్ములను మూటగట్టి
విసిరివేసింది. వాటన్నింటినీ నేను కొండగుహమీద వున్న హనుమంతుడి చేతికి ఇచ్చి
దాచిపెట్టాను. వాటిని త్వరగా తెప్పిస్తాను. నీ భార్యవేమో చూడు”.
సుగ్రీవుడి
మాటలకు రామచంద్రమూర్తి ఆయన్ను ముచ్చట్లతో కాలయాపన చేయవద్దని, వెంటనే వేగంగా ఆభరణాలను తెప్పించమని
పురమాయించాడు. తక్షణమే సుగ్రీవుడు హనుమంతుడికి చెప్పడం, ఆయన
పోయి వాటిని తెచ్చి రాముడికి చూపించడం జరిగింది. చీరచెరగున కట్టిన సొమ్ములను
రామచంద్రమూర్తి చేతికి తీసుకుని, వాటిని చూస్తూ, కళ్లల్లో కన్నీళ్లు వస్తుంటే, అవి చూపులను
అడ్డగిస్తుంటే, “హా! ప్రియురాలా! రమణీ!” అంటూ ఆరాటంగా ఆ భూషణాలను ఒత్తిపట్టుకుని
పుట్టలోని పాము బుసకొట్టినట్లు పెద్ద శ్వాస విడిచాడు.
రామచంద్రమూర్తి చాలాసేపు మూర్చపోయి, పడిలేచి, తమ్ముడు లక్ష్మణుడిని చూసి, “దయలేని రాక్షసుడు ఆమెను ఎత్తుకుని పోతుంటే తన శరీరంమీద ఆభరణాలను సీత భూమ్మీద
పారవేసింది చూశావా, లక్ష్మణా! వీటిని సీతాదేవి కొండరాళ్ళమీద
వేయలేదు. పచ్చికనేలమీద పడేసింది. కాబట్టి ఇన్ని సొమ్ములు ఆమె శరీరంమీద ఉన్నప్పుడు
ఎలా మంచిగా వున్నాయో ఇప్పుడూ అలాగే ఏమాత్రం చెడిపోకుండా వున్నాయి. లక్ష్మణా, వీటిని నువ్వు చూడు. ఇవి సీతవే కదా?” అని అడిగాడు.
రామచంద్రమూర్తి ప్రశ్నలకు జవాబుగా లక్ష్మణుడు, “అన్నా! ఈ బాహుపురులు, ఈ కమ్మలు, సీతాదేవివి అవునో-కాదో నేను చెప్పలేను.
ప్రతిదినం ఆమెకు పాదాభివందనం చేసేటప్పుడు చూసేవాడిని కాబట్టి ఈ అందియలు సీతాదేవివే
అని చెప్పగలను” అన్నాడు.
సుగ్రీవుడిని రావణుడి వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు
లక్ష్మణుడు
ఇలా చెప్పగానే, సుగ్రీవుడిని చూసి రాముడు
“మిత్రమా! నా ప్రాణాలకంటే ప్రియమైన నాప్రియురాలిని రాక్షసుడు ఎత్తుకుని పోతుంటే
సీతను నువ్వెక్కడ చూశావు? నాకు దుఃఖం కలిగించిన ఆవంచకుడు వుండే ప్రదేశం ఏదో
చెప్పు. వాడిని పరిచారకులతో సహా వధిస్తాను. రామచంద్రా! రావణాసురుడు ఎక్కడ? నువ్వెక్కడ? ఎక్కడో వుండేవాడిని ఇక్కడినుండి ఎలా
చంపుతావు? అని అంటావేమో? చెప్తా విను. జానకిని దొంగిలించి
మాకు కష్టం కలిగించి, పాపాన్ని సంపూర్ణంగా పెంచుకుని, తన గర్వంతో తన మృత్యుదేవతను తన మీదకు తెచ్చుకున్న ఆ రాక్షసుడి కోసం
లోకంలో రాక్షసుడనేవాడు లేకుండా చేస్తాను. మిత్రమా! వాడెక్కడ వుంటాడో చెప్పు.
దొంగలాగా అడవుల్లో వున్నా నాభార్యను బలవంతంగా దొంగిలించిన ఆ దుష్టుడిని ఇప్పుడే
చంపుతాను.
No comments:
Post a Comment