Wednesday, March 5, 2025

శ్రీరామజయం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామజయం 

వనం జ్వాలా నరసింహారావు

భక్తిపత్రిక (మార్చ్ నెల, 2025)

శ్రీరామ వనవాసంలో 14 సంవత్సరాలకు గాను, 13 ఏళ్లు గడిచిపోయాయి. ఆ ఏడాది మార్గశిర మాసంలో ఒక రోజున శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులతో కూడి గోదావరీ నదీస్నానం చేసి, ముచ్చటించుకుంటున్నారు. ఆ సందర్భంలో, రావణాసురుడి చెల్లెలు శూర్పనఖ అందమైన ఆకారంతో ఆశ్రమంలో ప్రవేశించి, శ్రీరామచంద్రమూర్తిని చేరవచ్చింది. వస్తూనే, మోహావేశంతో శ్రీరాముడిని ‘నువ్వెవరివి? మునీశ్వరుడి వేషం ధరించి భార్యతోనూ, క్షత్రియ రూపంలో విల్లు, బాణాల తోనూ, రాక్షసులు స్వేచ్చగా తిరిగే ఈ స్థలానికి ఎందుకు వచ్చావు?’ అని ప్రశ్నించింది. 

నీచురాలితో పరిహాసం 

శ్రీరాముడు తమ వివరాలను, పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వహించడానికి అరణ్యాలకు రావాల్సిన నేపధ్యాన్ని చెప్పి..... తాము తపోరూప ధర్మాన్ని స్థాపించడానికి వచ్చామని స్పష్టం చేశాడు. అప్పుడు శూర్ఫనఖ తాను కోరిన రూపాన్ని ధరించగలననీ, అడవుల్లో ఒంటరిగా తిరుగుతుంటాననీ, రాక్షసరాజైన రావణాసురుడి తనకు అన్న అనీ, యుద్ధంలో మహాశూరులైన కుంభకర్ణుడు, విభీషణుడు, ఖరదూషణులు కూడా తోడబుట్టిన వారేననీ వివరించింది. శ్రీరాముడి లాంటి చక్కనివాడిని ఇప్పటివరకూ చూడలేదనీ, అతడే తనకు తగిన మగడని, అందుకే అతడిని కావాలని కోరుతున్నాననీ అన్నది. తిరస్కరిస్తే తన అన్నలందరనీ శ్రీరాముడి మీదకు యుద్ధానికి పంపి చంపిస్తానని బెదిరించింది. తనను సీత స్థానంలో భార్యగా చేసుకొమ్మనీ, కాదంటే సీతను లక్ష్మణుడిసహా గుటుక్కున మింగుతాననీ, తేల్చి చెప్పింది శూర్ఫణఖ. 

‘సీతను ముందు పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆమెను విడవడం ధర్మం కాదు. కాబట్టి నామీద భ్రాంతి వదిలిపెట్టు. నా తమ్ముడు లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. యౌవనంలో వున్నాడు. అందగాడు. భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. సవతి పోరులేకుండా అతడిని భజించు.’ అని శూర్పనఖకు సలహా ఇచ్చాడు రాముడు. వెంటనే, నిమిషమైనా ఆలశ్యం చేయకుండా, లక్ష్మణుడితో తనను పెళ్లి చేసుకొమ్మని కోరింది శూర్పనఖ.

శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడు, శూర్పనఖను ఏడిపించడానికి తాను ఆమెకు తగనని, కాబట్టి అన్న శ్రీరాముడి దగ్గరికే పొమ్మని, ఆయనే ఆమెకు తగిన భర్త అని అంటాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీన, నిజమని నమ్మింది. పర్ణశాలలో ఉన్న సీతమీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో ‘లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. శూర్పనఖ ఆయుధం ధరించి యుద్ధానికి రాలేదు కాబట్టి చంపకుండా పట్టుకొని విరూపగా చేయి’ అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు కత్తి దూశాడు. శూర్ఫనఖ ఎదిరించినా వదలక, దాని ముక్కు, చెవులు కోశాడు.

శూర్ఫనఖ చెప్పుడు మాటలు 

శూర్ఫనఖ లబలబ నోరు కొట్టుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, పెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూ, నెత్తురు కారుతుంటే, పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసింది. ధభీలున నేలమీదపడి పెద్దపెట్టున ఏడ్చింది. ఆ విధంగా వున్న శూర్పనఖను చూసి ఖరుడు, ‘ఎవరినీ తరుమకుండా, బెదిరించకుండా, బుసకొట్టకుండా, తనంతట తాను బుట్టలో కదలకుండా వుండే మహా భయంకర, విషంకల నల్ల త్రాచుపామును ఎవడు వేలితో పొడిచాడు? ఎవడీ విషం తాగింది? ఎవడు తనంతట తానే మృత్యుపాశాన్ని తన కంఠానికి తగిలించి బిగించుకున్నాడు? చెప్పు. నేనిప్పుడే వేగంగా పోయి వాడిని చంపి నెత్తురు తాగుతా. దౌర్జన్యంగా ఇలాంటి పెద్ద అపకారం చేయడానికి తెగించిన వాడు ఎవడో చెప్పు’ అని అన్నాడు.  

ఖరుడి ప్రశ్నకు సమాధానంగా శూర్పనఖ ‘దశరథ రాజకుమారులు శ్రీరామలక్ష్మణులు’ అని చెప్తే సరిపోయేది. కాని, వారి సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. తనను ఇలా చేసినవారు యౌవనవంతులని, చక్కటివారని, మునుల వేషంలో వున్నారని, కోమల మహాబల సంపన్నులని, ధర్మ మార్గంలో వుండే అన్నదమ్ములని చెప్పింది. కారణం, ఆమెలో కామం విఘ్నమై కోపంగా మారిందేకాని, కామం చావలేదు. వైరాగ్యం ఇంకా పుట్టలేదు. శ్రీరామలక్ష్మణ మూర్తులే శూర్పనఖ కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. ‘కామాతురాణాం నభయం నలజ్జా’ అనే నానుడి వుంది. అంటే, కామాతురులకు భయం, సిగ్గు వుండదు. అందుకే రామలక్ష్మణుల సౌందర్య వర్ణన చేసింది శూర్పనఖ. శ్రీరామచంద్రమూర్తిని చూసిన అనుకూలురైనా, ప్రతికూలురైనా, ఇలానే మాట్లాడుతారు.  

శూర్పనఖ తన జవాబును కొనసాగిస్తూ, ‘తాము దశరథ రాజకుమారులమని చెప్పారేకాని, వారి తేజస్సు చూస్తే, వాళ్ల మాట నమ్మడం కష్టంగా వుంది. ఆ ఇద్దరిమధ్య ప్రాయంలో వున్న ఒక పడుచును, సమస్తాభరణాలు ధరించిన దానిని, సన్నటి నడుముకల దానిని, తామర రేకుల్లాంటి కళ్లున్న దానిని చూశాను. అలాంటి సుందరిని నేనింతవరకు చూడలేదు. ఆ పడుచుకోసం వారిద్దరూ ఒక్కటై, నన్ను రంకుటాలిలాగా దిక్కులేని దాన్ని చేసి దురవస్థల పాలు చేశారు’ అని అంటుంది. జరగబోయే రామరావణ యుద్ధానికి ఈ విధంగా అంకురార్పణ జరిగిందనాలి ఒక విధంగా.

ఖరదూషణులతో యుద్ధం

శూర్పనఖ చెప్పుడు మాటలకు, ఖరుడు కోపంతో మొదలు పద్నాలుగు మంది రాక్షసులను రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి పంపాడు. వాళ్లను తన బాణాలతో ఎదిరించాడు రాముడు. అందరినీ చంపాడు. అది చూసి గట్టిగా ఏడ్చుకుంటూ, జనస్థానంలో వున్న ఖరాసురుడి దగ్గరకు వచ్చిన ‘రాక్షస నాశనానికి కారకురాలు కాబోతున్న శూర్పణఖ’ను చూసి ఖరుడు మళ్ళా ఎందుకు ఏడుస్తూ వచ్చావని అడిగాడు. ‘నువ్వు పంపిన వారందరూ రాముడి బాణాలకు క్షణకాలంలో నిలబడి చచ్చిపోయారు. అది చూసిన నేను, అక్కడ వుంటే నన్నేం చేస్తారో అన్న భయంతో, గాలి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చానిక్కడికి’ అని అంటుంది. ఖరుడు ఆమెను సమాధాన పరచాడు. 

దూషణుడు అనే సేనానాయకుడిని పిలిచి, భయంకరమైన బలం కలవారిని, పద్నాలుగువేల రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని, యుద్ధానికి సన్నద్ధం కమ్మని అన్నాడు ఖరుడు. కాసేపట్లో దూషణుడు తెచ్చిన రథం మీదకు కోపంతో ఎక్కాడు ఖరుడు. వెంటనే, దూషణుడు పెద్ద సేనతో ఖరుడి పక్కన నిలిచాడు. సైన్యాన్ని కదలమని ఖరుడు ఆజ్ఞాపించాడు. వారి వెంట పద్నాలుగు వేలమంది రాక్షసులు బయల్దేరారు. వారి రాక చూసిన రాముడు, లక్ష్మణుడితో, ‘సీతాదేవి ఇక్కడ వుండకూడదు. ఒంటరిగా ఎక్కడికీ పంపకూడదు. నువ్వు ఆమెను పిల్చుకొని, విల్లు-బాణాలు ధరించి కొండగుహలోకి పొండి. ఆమెను లోపల వుంచి నువ్వు బయట కాపలాగా వుండు.’ అని అంటాడు. (వీటినే ఇప్పుడు ‘సీతమ్మ గుట్టలు’ అని అంటారు). రామచంద్రమూర్తి చెప్పినట్లే చేశాడు లక్ష్మణుడు. 

ఖరుడి సైన్యం రాముడిని చూసింది. సైన్యంతో శ్రీరాముడిని తాకాడు ఖరుడు. మిగిలిన రాక్షసులందరూ రాముడిని చుట్టుముట్టి గుడియలు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు, కత్తులు ఆయన మీదికి విసిరారు. రామభద్రుడు ప్రతిగా, తన బాణ సమూహాలతో వారందరినీ సర్వాయుధాలు లేకుండా చేశాడు. ఖరుడి సైన్యాన్ని హతం చేసాడు శ్రీరాముడు. శ్రీరాముడి చేతిలో దూషణుడు, త్రిశిరుడు, కాలకార్ముకాది సేనాపతులు కూడా చనిపోయారు.  అప్పుడు ఖరునితో యుద్ధం జరిగింది. పదునైన బాణాలతో రాముడుని నొప్పించాడు వాడు. శ్రీరాముడి కవచాన్ని కూడా భేదించాడు. చివరకు శ్రీరాముడి చేతిలో ఖరుడు సహితం మరణించాడు. ఇలా యుద్ధం ముగియగానే, లక్ష్మణుడు సీతాదేవితో సహా వచ్చాడక్కడికి. యుద్ధంలో గెలిచి అపరాజితుడైన  శ్రీరాముడిని అక్కడ వున్నమునులు పూజించారు. 

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తమై శ్రీరాముడు దండకకు వచ్చాడు. దుష్టులను శిక్షించడం ప్రథమ కార్యం. ఖరాది వధకు కారణం, దానివలన ప్రయోజనం ఋషి సంరక్షణేకదా? శ్రీమహాలక్ష్మీదేవి స్త్రీలను బాధించే రాక్షసులను సమూలంగా నాశనం చేయడానికే భర్తను భూమిమీద అవతరించాలని కోరి, తానూ అవతరించింది. తన కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది కదా అన్న సంతోషంతో, తన కార్యాన్ని స్వకార్యంగా భావించిన భర్తకు తన సంతోషం వ్యక్తం చేయడానికి సీతాదేవి గుహనుండి వచ్చి శ్రీరాముడిని కౌగలించుకున్నది. దీనర్థం: ‘హృదయమనే గుహలో వుండే జీవుడు పరతంత్రుడై ఆచార్యులవలన సర్వస్వామిని దర్శించి దానితో సర్వ విరోధి వర్గం నశించగా, అందులోంచి వెలువడిన స్వామిని దర్శించాడని అర్థం. 

‘ఈ ఘట్టాన్ని, శ్రీరామజయాన్ని విన్నవారు పాపబందాల వల్ల, కారాగార గృహ బంధాల వల్ల, ఋణబాధల వల్ల, ఎదుర్కొన్న ఇబ్బందులను విడవబడుతారు.’

మారీచుని ప్రబోధం 

జనస్థానం నుండి అకంపనుడనే రావణుడి వేగులవాడు, లంకకు పోయి, రావణాసురుడితో జనస్థానంలో వున్న ఖరుడుతో సహా రాక్షసులందరూ యుద్ధంలో చంపబడ్డారని చెప్పాడు. ఈ మాటలు విన్న రావణుడు ఎవరా పని చేసారని అడగ్గా జవాబుగా రామచంద్రమూర్తి అని అంటాడు. శ్రీరాముడి పరాక్రమాన్ని కూడా వర్ణించి చెప్పాడు. బ్రహ్మేంద్రాదులు కూడా ఆయన్ను గెలవలేరనీ, రాముడి మీదికి యుద్ధానికి పోతే లాభం లేదని కూడా సలహా ఇచ్చాడు. సీతాదేవి అందాన్ని వర్ణించి చెప్పి, శ్రీరామ వధోపాయంగా సీతాపహరణం చేయమని అకంపనుడు సూచించాడు. రావణుడిని రెచ్చగొట్టాడు. 

వెంటనే మారీచుడిని చూడడానికి పోయాడు రావణుడు. శ్రీరాముడి భార్యను అపహరించాలని అనుకుంటున్నానని, తనకు ఆయన సహాయం కావాలని అంటాడు. అప్పుడు మారీచుడు, ‘పాతాళంలో పడి అక్కడి నుండి మళ్లీ పైకి రాలేనట్లు రామపాతాళంలో నువ్వు పడ్డావా మళ్లా ఊపిరితో వెలుపలికి రాలేవు. రామపాతాళం ఎలాంటిది అంటావా? విల్లే మొసలి. అది నీళ్లలో అడుగు పెట్టీ పెట్టకముందే వాతవేస్తుంది. అది దాటిపోతే భుజ వేగమనే పెద్ద బురద వుంటుంది. దాంట్లో దిగబడితే అంతే సంగతి ఇక. అదీ దాటిపోగలిగితే, బాణపరంపరలనే అలలు మీదమీద వచ్చిపడి లోపలి ఈడ్చుకు పోయి చంపుతాయి. ఇలాంటి యుద్ధ ప్రవాహంకల రామపాతాళంలో పడితే ఇక జీవితాశ లేదు. ఆడవిలో ఆయన భార్యతో రాముడు వుంటాడు. ఆయన భార్యతో ఆయన లేకుండా చేశావా, నీ భార్యలతో నువ్వు సుఖంగా వుండవు’ అని సలహా ఇచ్చాడు.

మారీచుడు చెప్పిన హితోక్తులు విన్న రావణుడు, రాముడితో బలవద్విరోధం ఎందుకని భావించి, లంకకు పోయి సంతోషంగా తన ఇంటికి చేరాడు. ఇప్పటికింకా రావణుడికి శూర్పనఖ ముక్కు-చెవులు కోసిన సంగతి తెలియదు. రావణుడు ఆ వివరాలు అడగలేదు. అకంపనుడు చెప్పనూలేదు. ఖరుడికి, రాముడికి యుద్ధం ఎందుకు జరిగిందని కూడా రావణాసురుడు అడగలేదు. శూర్పనఖ వచ్చి అన్ని సంగతులు చెప్పుకుంటుందిలే, మనకెందుకీ బాధ? అనుకున్నాడు. 

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment