సుప్రీం హద్దులు విస్తరిస్తున్నాయా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (03-05-2025)
{భారత రాజ్యాంగంలో న్యాయసమీక్షకు విశేష ప్రాధాన్యమున్నది. అలాగే రాష్ట్రపతి పదవికి, అధికారాలకు, బాధ్యతలకు కూడా విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. న్యాయసమీక్ష అనే సూత్రాన్ని స్వేచ్ఛతో నిర్వర్తిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత రాజ్యాంగ పదవికి ఏ మేరకు పరిమితులు విధించవచ్చు? రాజ్యాంగ పరిరక్షణలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య స్పష్టమైన హద్దులు అవసరం అన్న సందేశాన్ని ఈ వ్యాసం ఇస్తోంది. సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నర్ల నిర్ణయాలకు గడువు విధించడం రాజ్యాంగ పరిధులు దాటి వ్యవస్థల మధ్య సంఘర్షణకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు} – సంపాదకుడు
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యంత ఆమోదయోగ్యమైన, నిలకడైన, పరిపాలనా విధానంగా కొనసాగడానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాదే కారణం. అది మరింత బలోపేతం కావాలంటే, రాజ్యాంగ మూలస్థంబాలైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాలనే మూడు వ్యవస్థలు, పరస్పర గౌరవం, పరిమితి పాటించే ఆత్మ నియంత్రణ, స్పష్టమైన అధికార పరిధుల ఆధారంగా పనిచేయడం తప్పనిసరి. దీనికి విరుద్ధంగా, ఇటీవల శాసన (రాష్ట్రపతి)-న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ చోటుచేసుకోవడం ఇబ్బందికరం, ఆందోళనకరం. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య శాశ్వత మనుగడే ప్రశ్నార్థకం కాగలదు.
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు నెల రోజుల నిర్ణీత గడువు, రాష్ట్రపతికి మూడు నెలల నిర్ణీత గడువును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని రాజ్యంగ, రాజకీయ, పాత్రికేయ, న్యాయశాస్త్ర విశ్లేషకులు విమర్శిస్తున్నారు. విమర్శనాభిప్రాయాలను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల మధ్య సుస్పష్టమైన హద్దులు ఉన్నప్పటికీ, ఈ విధమైన ఆదేశాలతో న్యాయవ్యవస్థ తన పరిధిని అధిగమించాలనో, విస్తరించాలనో చూస్తున్నదా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కూడా అయిన జగదీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందిస్తూ, చట్టసభలుగా, కార్యనిర్వాహక శక్తిగా, లేదా ‘సూపర్ పార్లమెంట్’గా న్యాయస్థానాలు వ్యవహరించాలనే ఉద్దేశం భారత రాజ్యాంగ నిర్మాతలకు ఏనాడు లేనేలేదని అన్నారు. దీన్ని బట్టి, ఇలా ఆదేశించడం వల్ల, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా, న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను సంపూర్ణంగా కాపాడుకునేలా, శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థల మధ్య వ్యవస్థాపకమైన సమతుల్యత వుండేలా, అధ్యయనపరమైన, మేదఃపరమైన చర్చకు, విశ్లేషణకు సమయం ఆసన్నమైందనవచ్చు. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయంగా ‘రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఏ అధికార వినియోగమైనా, న్యాయసమీక్షకు అతీతం కానే కాదు’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భాన్ని రాజ్యాంగ పరిరక్షణగా చూడాలా, లేక వ్యవస్థలు తమ పరిమితులు దాటే ప్రయత్నంగా చూడాలా అనే చర్చ అంతటా మొదలైంది.
సుప్రీంకోర్టు ఈ గడువు విధించే విషయంలో గవర్నర్ వ్యవస్థను రాష్ట్రపతి స్థాయితో సమానంగా భావించడం తగునా అన్నది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రపతి, గవర్నర్ ఈ రెండు రాజ్యంగ వ్యవస్థలను వారి వారి పరిధులలో ‘సమాన అధికారాలున్న అసమానులు’ గా చూడాలి. భారత రాజ్యాంగం ప్రకారం సంపూర్ణమైన ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే అత్యున్నత, ఏకైక అధికార పీఠం కేవలం రాష్ట్రపతిది మాత్రమే. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల-కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యుల ఎలెక్టోరల్ కాలేజీ, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మిగతా వారంతా రాష్ట్రపతి విచక్షణాధికారం ద్వారా నియమించబడడమో, లేదా నామినేట్ చేయబడడమో జరుగుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. రాష్ట్రపతి చేసే ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులు ఉంటారు.
గవర్నర్ వ్యవస్థ ఆదినుండీ తటస్థ వ్యవస్థగా పేరు తెచ్చుకోలేదు. గవర్నర్, రాష్ట్రపతుల తటస్థతలపై తేడాలు స్పష్టంగా, పూర్తిగా భిన్నంగా ఉంటాయి. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్నగవర్నర్ల నియామకం ఎప్పుడూ వివాదాస్పదమే. గవర్నర్ తనకు సంక్రమించిన అధికారాలను, విధులను సహకార సమాఖ్య స్ఫూర్తితో, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. దురదృష్టవశాత్తూ దీనికి పూర్తి భిన్నంగా, అందరూ కాకపోయినా మెజారిటీ గవర్నర్లు, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏజంట్లుగా పదవిని దుర్వినియోగం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్‌లకు గడువు విధించడం సమంజసమే కావచ్చు. కానీ రాష్ట్రపతిని గవర్నర్లతో సమానంగా భావిస్తూ గడువు విధించడం చర్చించాల్సిన అంశం!
సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ద్వారా, బాధ్యతలు చేపట్టే ముందర, రాష్ట్రపతితో తన పదవిని విశ్వాసంగా నిర్వహిస్తానని, సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని, చట్టాలను ‘కాపాడతానని, రక్షిస్తానని, పరిరక్షిస్తానని’ భారత ప్రజల సేవ, శ్రేయస్సు కోసం తనను తాను అంకితం చేసుకుంటానని ప్రమాణం చేయిస్తారు.
ఏదైనా మౌలికమైన అంశంలో రాష్ట్రపతి సరైన ఆలోచన కోసం తీసుకునే సమయంతో సహా, అనేక అంశాల్లో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడమన్నది ఆ పదవికి వన్నె తెచ్చే రాజ్యాంగపరమైన అధికారం. ఈ బాధ్యత పరిమితం చేయబడకూడదు. అటువంటి విషయంలో, సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించడం గౌరవభరిత రాజ్యాంగ కర్తవ్యంలో జోక్యం చేసుకోవడంగానే భావించాలి.
భారత రాజ్యాంగంలో న్యాయసమీక్షకు విశేష ప్రాధాన్యమున్నది. అలాగే రాష్ట్రపతి పదవికి, అధికారాలకు, బాధ్యతలకు కూడా విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. న్యాయసమీక్ష భారత రాజ్యాంగ వ్యవస్థకు మూలస్తంభం. అలాగే రాష్ట్రపతి పదవికి, అధికారాలకు, బాధ్యతలకు కూడా విశేషమైన ప్రాధాన్యత వున్నది. వ్యవస్థల స్వతంత్రత కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన మూల్యమే. ఇది మౌలికమైన అంతర్మథనాన్ని సూచిస్తోంది. న్యాయసమీక్ష అనే సూత్రాన్ని స్వేచ్ఛతో నిర్వర్తిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం అత్యున్నత రాజ్యాంగ పదవికి ఏ మేరకు పరిమితులు విధించవచ్చో, ఆలాగే న్యాయసమీక్షను వర్తింపచేయవచ్చో అనేది చర్చనీయాంశమే. రాష్ట్రపతి, గవర్నర్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఒకేలా మార్గనిర్దేశం ఇవ్వడం చట్ట, న్యాయపరమైన తేడాను సరిగ్గా పరిగణలోకి తీసుకోక పోవడమేమో. ఒకవేళ రాష్ట్రపతి లేదా గవర్నర్ కార్యచరణలో మలినమైన ఉద్దేశం లేదా రాజ్యాంగ ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తే తప్ప, సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై మార్గనిర్దేశాలు ఇవ్వడం అనేది అతి జోక్యమే అవుతుంది.
అసలు రాష్ట్రపతి, గవర్నర్ల ఆలస్యాలపై తీర్పు చెప్పే ముందు న్యాయస్థానాలు స్వయంస్థితిని గుర్తించకపోవడం తగునా? వివిధ స్థాయి న్యాయస్థానాలలో వేలాది కేసులు దశాబ్దాలుగా పెండింగులో కొనసాగుతున్నాయి. అయోధ్య, ఎన్నికల అనర్హత కేసులు, పౌర వివాదాలు వంటి అనేక గుణాత్మక కేసులు సంవత్సరాల తరబడి కోర్టులలో కొట్టుమిట్టాడాయి. ముందు ఈ అంశంపై సమగ్రంగా ఆలోచన చేయకుండా, సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతికి గడువు విధించడంపై రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు చర్చ జరపాలి. ‘ఆలస్యమైన న్యాయం అన్యాయమే’ అనే సూత్రానికి అనుగుణంగా, న్యాయస్థానాలు సహితం నిర్ణీత గడువులో కేసుల పరిష్కారం విషయంలో సమయపాలన పాటించేటందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రపతి, గవర్నర్‌కి రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన బిల్లుపై అంగీకారం ఇవ్వడం, నిరాకరించడం, లేదా పునర్విచారణకు తిరిగి పంపే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం ఉన్నది. ఎంత కాలంలో ఇది చేయాలి అనే అంశంపై రాజ్యాంగం స్పష్టత ఇవ్వలేదు. సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతికి మూడు నెలల గడువు విధించడం ద్వారా ఆ రాజ్యాంగ మౌనాన్ని పూరించేందుకు యత్నించడం మంచిదే. కాని, ఈ చర్య ప్రజాస్వామ్య రాజ్యాంగ నిర్మాణ శిల్పాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదేమో అన్న అనుమానం వ్యక్తమవుతున్నది.
భారత రాష్ట్రపతులందరూ ఇప్పటివరకు తమ బాధ్యతలను గౌరవంగా, నిగ్రహంతో, రాజ్యాంగ పరిమితుల్లో నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిమండలి సలాహాకు భిన్నంగా బహిరంగంగా సంఘర్షణలోకి వెళ్లిన సందర్భాలు (బిల్లుల విషయంతో సహా) అరుదే. కానీ గవర్నర్ల వ్యవహారంలో మాత్రం ఇది అలా ఉండడంలేదు. అనేక సందర్భాల్లో బిల్లులపై ఆమోదాన్ని ఆలస్యం చేయడం, నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం, రాష్ట్ర ప్రభుత్వాల మీద బహిరంగ విమర్శలు చేయడంలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్యాంగపరమైన రాజకీయ సంక్షోభాలకు ఇది దారితీసింది. కాబట్టి గవర్నర్లకు గడువు విధించడం అవసరమే. విధించాల్సిందే!
కొన్ని సందర్భాల్లో న్యాయం తిరస్కరణ వల్ల కాకుండా, వాయిదాల వల్లే లభించకుండా పోయింది. రాజ్యాంగ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో కోర్టుల ఆలస్యం, గడువులు విధించే స్థాయిలో ఉన్న న్యాయవ్యవస్థ నైతిక ఆధిక్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తి, సాంస్కృతిక స్థిరత్వం కేవలం లిఖిత చట్టపరమైన నియమాలపై మాత్రమే ఆధారపడలేదు. ఆరోగ్యకరమైన సాంప్రదాయాలు కూడా కారణమే. గతంలో భారత రాష్ట్రపతులు గవర్నర్లు పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో దీర్ఘకాలిక జాప్యం జరిగిన దాఖలాలు అంతగాలేవు. కాకపోతే రోజులు మారుతున్నాయి.
సానుకూల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పావనమైన రాజ్యాంగ సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవస్థలన్నిటినీ ఒకే కొలమానంతో కొలవడం, సమర్థ ప్రజాస్వామ్యానికి తగదేమో. గవర్నర్లు బిల్లులను ఆలస్యంగా పరిష్కరించడమో, పార్టీ విధేయంగా వ్యవహరించడమో చేస్తే, రాజ్యాంగ సంప్రదాయాలను ఉల్లంఘించినవారే అవుతారు. అలాంటి పరిస్థితుల్లో పరిష్కారం, న్యాయస్థానాల ఆదేశాలు మాత్రమే కాదు. పరిపక్వమైన రాజకీయ ప్రవర్తన పునరుద్ధరణ, స్ఫుటమైన సమాఖ్య స్ఫూర్తి పట్ల గౌరవం, నియామకాల్లో పారదర్శకత, వ్యవస్థాపక నిగ్రహం వంటి విలువల పునఃప్రతిష్ఠే నిజమైన మార్గం. రాజ్యాంగ నియమ నిబంధనలు పూర్తి కథ కాదు. ప్రజాస్వామ్య పరిపక్వత అనే విస్తృత కథనాన్ని సంప్రదాయాలే పూర్తి చేస్తాయి.
బిల్లులపై నిర్ణయాలను గడువుల్లో తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తీర్పు వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కావచ్చు. అధికార స్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలు ఆలస్యం కావటం లేదా వాటికి రాజకీయ ఆటలు అడ్డం రావటం... ఇంతవరకు మాత్రమే న్యాయశాస్త్రం పట్టించుకోవాల్సిన అంశం. రాజ్యాంగ విలువలను నిలబెట్టే బృహత్తర ప్రయత్నంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి. నిజమైన మార్పు రావాలంటే రాజ్యాంగపరమైన నియామకాల్లో రాజకీయ ముసుగు తొలగాలి. రాష్ట్రపతి, గవర్నర్లు రాజ్యాంగంలోని అక్షరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా గౌరవించాలి. అదే విధంగా, న్యాయవ్యవస్థ కూడా ఇతరులపై ప్రమాణాలు విధించే ముందు తనదైన ఆలస్యాలపై స్వయంగా ఆలోచించాలి.
రాజ్యాంగం స్పష్టతతో, విశ్వాసంతో నియంత్రణలు, సమతుల్యతా పద్ధతులను పొందుపరిచింది. న్యాయవ్యవస్థ సమకాలీన సవాళ్లను ఎదుర్కొని, అధిగమించడం తప్పనిసరే. అది స్వీయనిగ్రహంతో, రాజ్యాంగ నిబద్ధతతో కూడినదై ఉండాలి. రాజ్యాంగాన్ని ‘కాపాడడం, పరిరక్షించడం, నిలుపుకోవడం’ అన్న రాష్ట్రపతి ప్రమాణ వాక్యాలు కేవలం పదాలలోనే కాక, ఆచరణలోనూ ప్రతిఫలించాల్సిన అవసరం ఉంది. దానికి న్యాయవ్యవస్థ సహకారం పరిపూర్ణంగా వుండి తీరాలి. ప్రజాస్వామ్య త్రిమూర్తులు (న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు) పరిమితులకు లోబడి, పోటీ తత్త్వం లేకుండా వ్యవహరించడంలోనే ప్రజాస్వామ్య స్థిరత్వం ఆధారపడి ఉంది.
This is a one-sided argument. You didn't touch the downside of these institutions (Gov and Pres) impeding the state govts by not allowing their bills to become acts. Yes, there should be a time limit to anything. Either you approve or reject but in a timely manner. You know that time is the essence. What is the use of an act if it is not timely. Please leave your biases and be more objective in your analysis.
ReplyDelete