మథురా పట్టణం మీద దండెత్తి కృష్ణుడి చేత ఓడిన జరాసంధుడు
శ్రీ మహాభాగవత కథ-66
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-12-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
మథురకు చేరుకున్న ఉద్ధవుడు వ్రేపల్లె సంగతులన్నీ కృష్ణుడికి వివరించాడు. అటు
పిమ్మట ఉద్ధవుడితో కలిసి శ్రీకృష్ణమూర్తి తనను కలవాలనుకున్న కుబ్జ ఇంటికి
వెళ్లాడు. ఆ లతాంగి మన్మథుడిని కూడా మోహపెట్టేవిధంగా అలంకరించుకుని వున్నది.
కృష్ణుడు వచ్చాడనే సంతోషంతో ఆయన్ను తగివిధంగా మర్యాదలు చేసిందామె. ఆమె మనస్సు
ఉత్సాహంతో ఉవ్విళ్ళూరింది. పుండరీకాక్షుడైన శ్రీకృష్ణమూర్తిని కలయకోరింది.
మద్యపానం చేసి ఉత్సాహం హెచ్చుకాగా కృష్ణుడిని సమీపించింది. కృష్ణుడు కూడా సరసపు
చూపులతో ఆమెను చూసి, కుబ్జ హృదయాన్ని కదిలించాడు. పద్మాల లాంటి తన చేతులతో ఆమెను
దగ్గరకు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు సర్వ విధాలుగా ఆమె మనస్సు కరిగించి రమించాడు.
కుబ్జ తన మదన తాపాన్ని పోగొట్టుకుంది.
దివ్యమునులకైనా దుర్లభమైన శ్రీకృష్ణమూర్తిని మనుపు తాను చందనం ఇచ్చిన ఫల
విశేషం వల్ల పొందగలిగింది. మేలైన మోక్ష పదవి కావాలని కృష్ణుడిని అడగకుండా, కొన్నాళ్లు తన ఇంట్లోనే వుండి, మన్మథ క్రీడలో ఆనందింప చేయమని ప్రార్థించింది. ఆమె
కోరుకున్న వరాన్ని ఇచ్చాడు కృష్ణుడు. ఉద్ధవుడితో కలిసి ఆమె ఇంటి నుండి బయటకొచ్చాడు
కృష్ణుడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు, ఉద్దవ, బలరామ సహితంగా అక్రూరుడి ఇంటికి వెళ్లాడు. ఆయన రాకతో తన గృహం పావనమైందని, తన
మొహాన్ని పోగొట్టి, బంధాలను తొలగించి తనను రక్షించమని అన్నాడు అక్రూరుడు. ఆయన
కోరినట్లే అతడికి సంసార సంబంధమైన మోహాన్ని తొలగేలా చేశాడు కృష్ణుడు. అక్రూరుడిని
హస్తినాపురానికి పంపదలచి వచ్చానని చెప్పాడు కృష్ణుడు. హస్తినకు వెళ్లి తనకు
ఇష్టులైన కుంతీదేవిని, ఆమె పుత్రులైన ధర్మరాజాదులను, చూసి ఆదరించి రావాలని అన్నాడు అక్రూరుడితో కృష్ణుడు. ఇలా చెప్పి ఉద్ధవుడితో, బలరాముడితో కలిసి తన ఇంటికి పోయాడు కృష్ణుడు.
అక్రూరుడు వెంటనే బయల్దేరి హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ ధృతరాష్ట్రుడిని,
పాండవులను, కుంతీదేవిని, ఇతర బంధువులను కలిశాడు. వారు అతడికి తగు మర్యాదలు చేశారు. కొన్ని
దినాలు హస్తినలోనే వుండిపోయాడు. ఒకనాడు కుంతీదేవి, అక్రూరుడిని, హస్తినకు పంపేటప్పుడు ఏమని చెప్పి మథురలోని
తమ బంధువులు అతడిని హస్తినకు పంపారని ప్రశ్నించింది. వారంతా సుఖమేనా అని అడిగింది.
తాము ఇక్కడ కుత్సిత బుద్ధి కల కౌరవుల మధ్యన తోడేళ్ల గుంపులో ఆడ లేడి లాగా
చిక్కుకుని ఉన్నామని అన్నది. దుర్యోధనుడు తన కొడుకుల విషయంలో చేసిన దుర్మార్గాలను
వివరించింది. తన కొడుకులకు భూమండలంలో న్యాయంగా రావాల్సిన భాగాన్ని శ్రీకృష్ణుడు
ఇప్పిస్తాడా? అని కూడా అడిగింది. ఇలా అంటూ తన
మనస్సులో శ్రీకృష్ణుడిని ధ్యానించి మొక్కి స్తోత్రం చేసింది. ఆమెను తన ప్రియ
వచనాలతో దుఃఖోపశమనం చేశాడు అక్రూరుడు.
కుంతీదేవి దగ్గర సెలబు తీసుకుని ధృతరాష్ట్రుడి వద్దకు పోయి, ఆయనతో తన
అభిప్రాయాలను పంచుకున్నాడు. పాండురాజు కుమారులనూ, ఆయన కుమారులనూ, సమానంగా చూడాలని అన్నాడు. రకరకాల హితభోదలు చేశాడు. మంద బుద్ధితో మెలగ వద్దని
సలహా ఇచ్చాడు. విచక్షణతో కళ్ళుతెరిచి పాండవులకు భూభాగాన్ని సందేహించకుండా,
న్యాయంగా పంచి ఇవ్వమని చెప్పాడు.
జవాబుగా, ధృతరాష్ట్రుడు, తొలుత కృష్ణుడికి నమస్కారాలు చెప్పాడు. ఈశ్వరాజ్ఞను ఎవరూ తప్పించలేరన్నాడు.
మానవుడు ఎంత తెలివికలవాడైనా దైవయత్నాన్ని తప్పించలేడన్నాడు. కృష్ణుడి మనస్సులో ఎలా
వుంటే అలాగే జరుగుతుందని అన్నాడు. ఆయన మాటలు అర్థం చేసుకున్న అక్రూరుడు ‘నీ ఇష్టం
వచ్చినట్లు ప్రవర్తించు’ అని పలికి, తిరిగి మథురకు వచ్చి హస్తిన
వృత్తాంతమంతా బలరామకృష్ణులకు వివరించాడు.
ఇదిలా వుండగా కంసుడి భార్యలైన ఆస్తి, ప్రాస్తి భర్త మరణించినందున దుఃఖిస్తూ తండ్రి జరాసంధుడి దగ్గరికి వచ్చారు.
వచ్చి, కృష్ణుడి వల్ల తమకు వైధవ్యం
వచ్చిందని చెప్పడంతో జరాసంధుడికి కోపం వచ్చింది. యదువంశాన్ని దహించివేస్తానని అంటూ
యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధభేరి మోగించి మథురమీదికి 23 అక్షౌహిణుల సైన్యంతో
దండయాత్రకు వెళ్లాడు. మథురా పట్టణం సమీపానికి వచ్చి, పట్టణం చుట్టూ సేనను నింపి, మొత్తం పట్టణాన్ని ముట్టడించాడు జరాసంధుడు. వాది మదం అణచి
భూభారాన్ని తగ్గించాలని నిశ్చయించాడు కృష్ణుడు. ప్రస్తుతానికి వాడిని చంపకుండా,
వాది సకల సైన్యాన్ని చంపి, భూభారం తగ్గాక అప్పుడు వాడిని చంపవచ్చని ఆలోచన చేశాడు. ఇలా అనుకుని
బలరామకృష్ణులు యుద్ధానికి బయల్దేరారు.
శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే తన శంఖాన్ని శత్రువులు భయపడేట్లుగా పూరించాడు.
దాంతో యుద్ధ భూమిలో వున్న జరాసంధుడి సైన్యం దిగాలు పడ్డది. గొల్లవాడికి యుద్ధం
వద్దని, మరలి పొమ్మని జరాసంధుడు కృష్ణుడికి
చెప్పాడు. తన బాణాలకు తట్టుకోలేడని అన్నాడు. జరాసంధుడికి, కృష్ణుడికి కాసేపు మాటల యుద్ధం జరిగింది. తన సేనా సమూహంతో
జరాసంధుడు బలరామకృష్ణులను చుట్టుముట్టాడు. అప్పుడు కృష్ణజరాసంధ సేనలు భీకరంగా
పోరాడాయి. జరాసంధుడి సైన్యం నాశనం కాసాగింది. బలరాముడు ముందుకు లంఘించి
జరాసంధుడిని సంహరించాలనే ఉద్దేశంతో బంధించి పట్టుకున్నాడు. వీడివల్ల ఇంకా
భవిష్యత్తులో కొంత పని వున్నదని, ప్రస్తుతానికి వదిలిపెట్టమని శ్రీకృష్ణుడు అన్నకు చెప్పాడు. మళ్లీ సైన్యాన్ని
సమకూర్చుకుని యుద్ధానికి రమ్మని, ప్రస్తుతానికి ప్రాణాలతో విడిచి పెట్టుతున్నామని
జరాసంధుడికి చెప్పాడు కృష్ణుడు. అని పలికి విడిచి పెట్టాడు. జరాసంధుడు మరలిపోయాడు.
యుద్ధం ముగిసి బలరామకృష్ణులు మథురా పట్టణం ప్రవేశించారు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


No comments:
Post a Comment