చిన్న జీయర్ వ్యాఖ్యలపై ఓ వైష్ణవుడి ధర్మాగ్రహం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-02-2026)
{నా వయస్సు 78 సంవత్సరాలు. ఈ
వయోభారం నా మీద ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తుచేస్తూంటుంది. జాగ్రత్తగా ఆలోచించి
మరీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నదన్న సూచన...}– సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య.
నా వయస్సు 78 సంవత్సరాలు. ఈ
వయోభారం నా మీద ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తుచేస్తూంటుంది. కోపానికి ఆస్కారం
లేకుండా, మతపరమైన వర్గీయ ఉద్రేకం కలగకుండా, అత్యంత జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నదన్న సూచన
చేస్తుంది. చిన్ననాటి నుంచే వైష్ణవ సంప్రదాయానికి అంకితభావంతో ఉన్న సామాన్యుడిని. తత్త్వవేత్తనేమీ
కాలేదు. నాన్నగారి నుండి సంక్రమించిన ఆధ్యాత్మిక వారసత్వం జీవన మార్గమధ్యంలో
ఒకప్పుడు దారితప్పినా, మహానుభావుల సాంగత్యం లభించడంవల్ల
తిరిగి సరైన బాటలోకి వచ్చాను.
ఆధ్యాత్మిక ప్రపంచంలో మార్గదర్శకుడు, ప్రేరణకర్త, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి
పెద శ్రీమన్నారాయణ జీయర్ స్వామి ఆశీస్సుల కింద ‘సమాశ్రయణం’ (పంచ సంస్కారం) పొందే
సదవకాశం కలిగినవాడిని. ఈ దీక్షలో భుజాలపై శంఖం, చక్రం,
గద, పద్మం అనే దివ్య చిహ్నాలను ఆచారపూర్వకంగా
ముద్రించడం (చక్రాంకితాలు) జరుగుతుంది. ఎప్పుడూ హిందూమతాన్ని కేవలం వైష్ణవ
సంప్రదాయంగా మాత్రమే పరిమితం చేసి చూడలేదు, ఆచరించనూలేదు. ఆ అనుభవమే, నా ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని, నియమశీలతను
జీవితాంతం నిలిచేలా మలిచింది.
శైవ, వైష్ణవ, శాక్త, స్మార్త తదితర అనేక ధారలు కలిసి ప్రవహించే ఒక
విశాలమైన నాగరిక, ఆధ్యాత్మిక పరంపరగా, సజీవ
వాహినైన ‘సనాతన ధర్మం’గా వైదిక తత్త్వాన్ని భావించాను. వైష్ణవ సంప్రదాయానికి
కట్టుబడి ఉన్నప్పటికీ, హిందూ సంప్రదాయాలన్నిటినీ సమాన
గౌరవంతో భావిస్తూ వచ్చాను. అందుకే, ఇటీవలి పరిణామాలు ఒక
మౌనమైన విరక్తికి దారితీశాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే అనాల్సి వస్తున్నది. ఇది కోపం
కాదు, శత్రుత్వం కానేకాదు లోతైన ఒక విషాదం. ఒక అంతర్గత
అసౌకర్యం మాత్రమే. దీనికి తక్షణ కారణం, త్రిదండి
శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామీజీ అలవోకగా, జగద్గురు
ఆదిశంకరాచార్యుల గురించి చేసిన వ్యాఖ్యలు. ఇవి పలువురు చరిత్రకారులను, పండితులను, వివిధ సంప్రదాయాలకు చెందిన నిష్ఠాగరిష్ఠ
భక్తులను కలవరపరిచాయి.
ఆదిశంకరాచార్యులు ఘనమైన వైష్ణవ భక్తుడని, ఆయన నాలుగు శంకర పీఠాలను స్థాపించనేలేదని, శతాబ్దాల
తరువాత విద్యారణ్యులు స్థాపించారని, చినజీయర్ స్వామి
వ్యాఖ్యలుగా సామాజిక మాధ్యమాలలో విమర్శలతో సహా చక్కర్లు కొడుతున్నాయి. అద్వైత
వేదాంతాన్ని ప్రచారం చేసిన తరువాత ఆదిశంకరులు చిన్న వయస్సులోనే హిమాలయాలకు పోయి
సమాధి పొందారని ప్రతీతి. ఆ ఆచార్యోత్తముడితో అనుసంధానించబడే శంకర పీఠాల వ్యవస్థకు
ఆయనకు సంబంధంలేదనేది జీయర్ స్వామి వ్యాఖ్యల సారాంశం. ఒక నాగరిక దృష్టికోణంలో ఆయన
వ్యాఖ్యలను పరిశీలన చేసి విశ్లేషిస్తేనే నా ఆవేదన అవగతమౌతుంది. ఈ వ్యాఖ్యలు సత్యమా,
అసత్యమా అన్నది పక్కనపెడితే, ఆదిశంకరాచార్యుల
పట్ల అపార భక్తి కలిగిన అనేకమంది మనోభావాలను అవి గాయపరిచాయన్నది మాత్రం వాస్తవం.
ఆదిశంకరాచార్యులు దక్షిణంలో శృంగేరి, పశ్చిమంలో ద్వారక, తూర్పున పూరీ, ఉత్తరంలో జ్యోతిర్మఠం అనే నాలుగు పీఠాలను స్థాపించిన జగద్గురువుగా
గుర్తింపు పొందిన మహనీయుడు. ఇవి భారత ఉపఖండమంతటా వేదాధ్యయనాన్ని, ఆధ్యాత్మిక క్రమశిక్షణను, ఐక్యతను కాపాడే ఆధ్యాత్మిక
మౌలిక స్తంభాలుగా భావితమయ్యాయి. ఆదిశంకరుల జీవన కాలానికి సంబంధించిన వివరాలలో
చరిత్రకారుల అభిప్రాయాలు ఒకింత భిన్నంగా ఉన్నాయి. అయితే అద్వైత చింతనాభివృద్ధిలో
ఆదిశంకరుల ప్రాథమిక కీలక పాత్రను గానీ, శంకర పీఠాల వ్యవస్థతో
ఆయన అనుసంధానాన్ని గానీ చరిత్రాధ్యయనం ఎప్పుడూ గంభీరంగా ప్రశ్నించలేదు.
ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలపై
ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటికీ హిందూ ధర్మానికి కేంద్ర స్తంభాలు.
మధ్య యుగాలలో హిందూ ధార్మిక సంస్థలను
పునరుజ్జీవింపజేసిన మహనీయుడిగా విద్యారణ్యులను గౌరవిస్తారు. కానీ శంకర పీఠాలను
ఆదిశంకరాచార్యులు కాదు, విద్యారణ్యులే స్థాపించారన్న వాదన సాధారణంగా
అంగీకృతమైన చారిత్రక లేదా సంప్రదాయ కథనంలో భాగంగా కనిపించదు. అయితే, ఆ వాదన కంటే ఎక్కువగా కలవరపెట్టే అంశం: అలాంటి వ్యాఖ్యల ధోరణి, దిశ. సంప్రదాయ భేదాల ముసుగులో ఒక మహత్తర సామూహిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని,
వర్గీయ వ్యాఖ్యానాల ద్వారా తగ్గించినట్టు అనిపించినప్పుడు, సనాతన ధర్మంలో అనవసర విభేదాలు పుట్టే ప్రమాదం ఉంటుంది. అవసరమా?
జగద్గురువుగా ప్రసిద్ధికెక్కిన ఆదిశంకరాచార్యులు
వైష్ణవులు, శైవులు, స్మార్తులు తదితర అన్ని
సంప్రదాయాల వారిచే సమరీతిలో గౌరవింపబడుతూ వచ్చిన ఐక్యతా ప్రతీక. వైష్ణవ
క్రమశిక్షణలో పెరిగినవాడినైనా, విశాలమైన హిందూ నాగరిక
దృష్టికోణానికి కట్టుబడి ఉన్నవాడిగా, ఈ పరిణామం ఒక అసహజమైన
అశాంతిగా భావన కలుగుతున్నది. తరతరాల ముందు, మన పూర్వీకులు,
వేదవేదాంత విజ్ఞానులు, ఎంతో జాగ్రత్తగా నిర్మించి, పదిలపరచి, కాపాడుకుంటూ వచ్చిన ఒక వంతెన, విభిన్న
మార్గాలు పరస్పరం తమ న్యాయబద్ధతను నిరాకరించకుండా సహజీవనం చేయడానికి వీలైన పటిష్టమైన
వంతెన, ఇప్పుడు బలహీనపడుతున్నట్టుగా అనిపిస్తోంది.
ఈ ఆలోచనలు ఎలాంటి దాడి కాదు. పోటీ భావంతో పుట్టిన
ప్రతివాదనా కానేకాదు. ఇవి ఒక నిబద్ధ వైష్ణవుడి ధార్మిక ధర్మాగ్రహం మాత్రమే. వయస్సు, అనుభవం, విశ్వాసం నుంచి పుట్టిన ఒక వినయపూర్వక
విజ్ఞప్తి మాత్రమే. ఆధ్యాత్మిక చరిత్రను ఆడంబరమైన వ్యాఖ్యానాలతో కాకుండా వినయ
విధేయతలతో చూసే ఒక సామూహిక వారసత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలన్న తపన, ఆవేదన మాత్రమే.అభిప్రాయభేదాలకు ఆస్కారం ఇస్తూనే, సాధారణ
తత్త్వజ్ఞానాన్ని చెరిపేయని పరంపర కారణానే సనాతన ధర్మం సజీవ వాహినిగా నిలిచింది. ఆ
సున్నితమైన సమతౌల్యాన్ని మనం కోల్పోకూడదు.
అద్వైత, విశిష్టాద్వైత,
ద్వైత... ఈ మూడు ప్రధాన వేదాంత సంప్రదాయాల వర్తమాన ప్రతినిధులను,
ఆచార్యులను సందర్శించే, ఆశీస్సులు పొందే
భాగ్యం నాకు పలుమార్లు లభించింది. అద్వైతానికి చెందిన జగద్గురు శృంగేరి విదుశేఖర
భారతి స్వామి, కంచి కామకోటి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి
స్వామి, విశిష్టాద్వైతానికి చెందిన త్రిదండి చిన్న జీయర్ స్వామి, ద్వైతానికి
చెందిన మంత్రాలయ సుబుధేంద్ర తీర్థ స్వామి:
ఈ నలుగురు మహనీయులతో కలయిక సాధారణ సమావేశాల్లా కాకుండా, సజీవమైన
ఆధ్యాత్మిక సాధన పరంపరలోకి మెల్లగా ప్రవేశింప చేసిన అనుభూతిలా అనిపించాయి.
ఆ అనుభవాల ద్వారా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే, భారత తత్వశాస్త్రం గతానికి చెందిన ఒక అవశేషం కాదు, అనాది
నుంచి నేటిదాకా ప్రవహిస్తున్న సజీవధార. ఆ ధారను ముందుకు తీసుకువెళ్తున్న మహనీయులు
తమ విజ్ఞానాన్ని గంభీరతతోనే కాకుండా, కృపతో, సంయమంతో జీవింపజేస్తున్న ప్రతినిధులు. వారితో మాట్లాడుతుంటే, సజీవమైన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా అనుభవించినట్లుగా భావన
కలగడం సహజం. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఆదిలో కానీ, కాలగమనంలో కానీ, వారివారి తత్త్వ జ్ఞానాన్ని నలుదిక్కులా ప్రసరింపజేశారే కానీ, పరస్పర ప్రత్యర్థులుగా వ్యవహరించలేదు.
ఈ ముగ్గురు మహా ఆచార్యులు తమ తమ కాలాల ఆధ్యాత్మిక
అవసరాలకు స్పందనగా అవతరించారు. విభజన, అయోమయం వ్యాప్తిలో
ఉన్న కాలంలో శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించి ఆత్మజ్ఞానాన్ని
వెలిగించారు. అదే ఏకత్వ దర్శనం. ఉపనిషత్తుల ఆత్మజ్ఞానంపై, అంతర్గత
మేల్కొలుపుపై ఆయన పునఃప్రాధాన్యాన్ని నెలకొల్పారు. వివిధ దేవతారూపాలను, క్రమబద్ధమైన తర్కాన్ని, ఆధ్యాత్మిక సాధనను
సమన్వయపరిచే ఒక విశాల సమ్మేళనాన్ని ఆయన తత్వం అందించింది. వేదజ్ఞానాన్ని
సంరక్షించి, తరతరాలకు అందించే స్థిరమైన పీఠాల ఆవిర్భావానికి
అది దారితీసింది. అద్వైత తత్వహృదయంలో, సర్వసత్త్వంలో
నిగూఢంగా ఉన్న ఏకత్వ ప్రకటన ఉంది.
రామానుజాచార్యులు విశిష్టాద్వైతం ద్వారా భక్తి, ప్రపత్తి మార్గాలను ప్రజలందరికీ అందించారు. భక్తి భూమికను పూర్తిగా
పునర్నిర్మించారు. బ్రహ్మన్ ఏకత్వాన్ని అంగీకరిస్తూనే, జగత్తు
యథార్థతను, జీవాత్మ వ్యక్తిత్వాన్ని ఆయన సమర్థించారు. ఈ
రెండింటినీ పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడితో గాఢమైన సంబంధంలో బంధించారు. ఆయన
వారసత్వం తత్వశాస్త్రంలో మాత్రమే కాదు, సమర్పణ, సమావిష్కరణతో
ఆకారమొందిన సముదాయాల్లోనూ నిలిచింది. ఏకత్వం అనేది భేదాన్ని సౌమ్యంగా
ఆమోదించగలదన్న సత్యాన్ని స్పష్టంగా తెలియజేసింది. ఫలితంగా భక్తి, ప్రపత్తి మార్గాలు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. సామాజిక అడ్డంకులను
దాటుతూ, భక్తిని జీవనంలో ఆచరించే కరుణగా మారుస్తూ, ఆయన దృక్కోణం విస్తరించింది.
మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించారు.
దేవుడు, జీవుడు, పదార్థం మధ్య నిత్యమైన
భేదాన్ని స్థాపిస్తూ, భేదం లోపం కాదు, భక్తిని
అర్థవంతం చేసే దైవ సంకల్పం అనే విషయాన్ని బోధించారు. ‘పంచభేద’ సిద్ధాంతం ద్వారా
విశ్వాసంలో వ్యక్తిత్వాన్ని కాపాడుతూ, విష్ణువుకు నిత్య
సేవనే కేంద్రంగా కలిగిన ఒక దృఢమైన, వాస్తవోన్ముఖ భక్తిని అది
ప్రేరేపించింది. రాఘవేంద్రస్వామి మఠం ద్వారా, ఈ సంప్రదాయం
కొనసాగుతోంది. ఈ సంప్రదాయాలన్నింటి ద్వారా స్పష్టమయ్యేది ఒకే ఒక్క విషయం. అద్వైతం,
విశిష్టాద్వైతం, ద్వైతం పరమసత్యంపై పరస్పర
పోటీ వాదనలు కావు. ఒకే పరమసత్యానికి మూడు సంపూర్ణ వ్యక్తీకరణలు మాత్రమే.
అవి కలిసినప్పుడు జ్ఞానం, భక్తి, సేవ, కృప అనే సంపూర్ణ
సాధన వలయం ఏర్పడుతుంది. నేటి కాలంలో ఈ ధారలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహనీయ పీఠాధిపతులు,
మఠాధిపతులు వేదాంతం వాదన కోసం కాదు, జీవించడానికి
ఉద్దేశించబడినదని తమ జీవితం ద్వారా నిరూపించి చూపిస్తున్నారు. ఈ దృష్టికోణంలో
చూసినప్పుడు, విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వర్గీయ ప్రకటనలు చేస్తే, అవి ఏ ప్రయోజనాన్నీ
అందించవు. సనాతన ధర్మం బలమంతా సౌహార్దంలో వున్నది.
అవగాహనను విస్తరించగలిగే ఒక కొత్త దృక్కోణాన్ని
ప్రతిపాదించాల్సిన చోట, ఆదిశంకరాచార్యుల గురించి చినజీయర్ స్వామి చేసిన
వ్యాఖ్యలు వినూత్న భావాలు, ఆలోచనలుగా కాకుండా అసందర్భంగా
అనిపించాయి. వ్యాఖ్యల భావన ఏదైనా, సనాతన ధర్మానికి
నిబద్ధులైన అనేకమంది భక్తుల్లో, వేదనను, కలవరాన్ని కలిగించాయి. సమతామూర్తి రామానుజాచార్యులు, మధ్వాచార్యులతో పాటు జగద్గురువు ఆదిశంకరాచార్యులు భారతదేశంలో జన్మించిన
అత్యుత్తమ మహాత్ముల సరసన అగ్రభాగాన నిలుస్తారు. వారి ఆధ్యాత్మిక మహత్తు, తాత్విక ప్రతిభ, నాగరికతకు చేసిన సేవ,
వివాదరహితమైనవి. నిస్సందేహ గౌరవానికి అవి ప్రతీకలు.
సనాతన ధర్మంపై విశ్వాసం కలిగిన వ్యక్తిగా, నేను కోరుకునేది ఒక్కటే. అద్వైత, విశిష్టాద్వైత,
ద్వైత సంప్రదాయాల వర్తమాన ఆచార్యులు చినజీయర్ స్వామీజీ, శంకర పీఠాధిపతులు, మంత్రాలయ పీఠాధిపతి ఒకే వేదికపై
ఆసీనులై, విశ్వహిందూ ధర్మాన్ని ప్రపంచానికి మరింత బలంగా
పరిచయం చేయాలి. సనాతన ధర్మానికి కాపలాదారులుగా నిలవాలి. ఆ క్షణం వర్తమాన, భావి తరాలకు, తరతరాలకూ మార్గదర్శక దీపంగా
నిలుస్తుంది. సనాతన ధర్మానికి తాము సంరక్షకులమన్న భావన ఈ మహానుభావులు కలిగించాలి.


No comments:
Post a Comment