Saturday, November 7, 2026

వెన్నెలకంటి సుందరరామశర్మ విశిష్టతను పేర్కొన్న గరికిపాటి : వనం జ్వాలా నరసింహారావు

 వెన్నెలకంటి సుందరరామశర్మ 

విశిష్టతను పేర్కొన్న గరికిపాటి

వనం జ్వాలా నరసింహారావు (నవంబర్ 8, 2026)

ఇటీవల నేను నా దినచర్యలో భాగంగా రాత్రి నిద్రపోవడానికి ముందు, ప్రతిరోజులాగే, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు యోగవాశిష్టం మీద చేసిన అద్భుతమైన ప్రవచనం వింటున్నప్పుడు, స్వర్గీయ బ్రహ్మశ్రీ వెన్నెలకంటి సుందరరామశర్మ రాసిన అపూర్వమైన పుస్తకం తన తండ్రిగారి నుండి తనకు చేరిన విషయం గురించి, అది చదివి ఎన్నో విషయలాను తాను తెలుసుకోవడం గురించి, అదింకా తనదగ్గర ఉన్న విషయంతో పాటు ఆ మహనీయుడి విశిష్టతను గురించి, తెలుసుకున్నాను. అత్యద్భుతంగా గరికిపాటి చేసిన పరిచయ వాక్యాలు నా హృదయాన్ని తీవ్రంగా కదిలించాయి. బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు దైవం కళ్ళు ఇవ్వకపోయినా, అంతర్నేత్రంతో పరమాత్మ తత్వాన్ని దర్శించి ఆ దివ్య జ్ఞానాన్ని లోకానికి పంచిన మహా, మహా మనీషి బ్రహ్మశ్రీ వెన్నెలకంటి సుందరరామశర్మ జీవితం ఒక అద్భుత ఆధ్యాత్మిక మహాకావ్యం.  

లౌకికమైన చూపు లేకపోవడం అనేది సాధారణ మానవులకు శాపం కావచ్చు. సుందరరామశర్మ విషయంలో అది అలౌకికమైన వేదాంత రహస్యాలను ఆకళింపు చేసుకోవడానికి, ఏకాగ్రతతో పరమ సత్యాన్ని శోధించడానికి ఒక మహామహనీయ దివ్య వరంలా మారింది. ఆయన్ను గురించిన మరిన్ని విశేషాలను ఆధునిక సమాచార సాధనల ద్వారా సేకరించి, స్నేహితులతో, హితులతో, సన్నిహితులతో పంచుకోవాలనుకున్నాను. ఇది సమగ్ర సమాచారం కాకపోయినా, అసమగ్రం మాత్రం కాదు. ఆ జ్ఞాన సాగరంలోంచి సేకరించిన క్లుప్తసుందరమైన పరిచయమనేది వాస్తవం. పుట్టు గుడ్డి అయిన ఒక వ్యక్తి, అక్షర రూపాలనే చూడలేని స్థితిలో ఉండి, హిందూ తత్వశాస్త్రంలోనే అత్యంత కఠినమైనవిగా భావించే వేదాంత గ్రంథాలపై అపారమైన పట్టు సాధించడం అనేది కేవలం మానవ ప్రయత్నం వల్ల సాధ్యమయ్యేది కాదు.

అది హిందూ ధర్మ శాస్త్రాలలో చెప్పిన విధంగా, ఖచ్చితంగా, నూటికి నారు పాళ్లు పూర్వజన్మ సుకృతం. ఈశ్వరకృపల సంగమం. ఆయన నిరంతరం చీకటిలోనే జీవిస్తున్నట్లు బాహ్య ప్రపంచానికి అనిపించినా, ఆయన హృదయంలో మాత్రం బ్రహ్మజ్ఞాన భానుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నాడనేది నిర్వివాదాంశం. శబ్ద తరంగాలనే తన గురువుగా చేసుకుని, అదనంగా గురువులైన సచ్చిదానాంద్ర సరస్వతి, మహాదేవాచార్యుల అనుగ్రహంతో ఇతరులు గ్రంథాలను చదువుతుంటే ఏకాగ్రత కూడిన శ్రద్ధతో వింటూ, శ్రుతి జ్ఞానంతో వాటన్నింటినీ తన మస్తిష్కంలో భద్రపరుచుకున్న శ్రుతధరుడు ఆయన.

వెన్నెలకంటి సుందరరామశర్మ జీవితం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, అపజయాన్ని ఒప్పుకోని ఒక అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. భౌతికమైన కళ్ళు లేకపోవడం అనేది సాధనకు ఆటంకం కాదని, పట్టుదల, అంకితభావం ఉంటే భగవత్ తత్వాన్ని సైతం దర్శించి, దానిని ఇతరులకు పంచవచ్చని ఆయన నిరూపించారు. బాహ్య ప్రపంచపు రంగులను చూడలేకపోయినా, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అనంత కోటి వెలుగులను చూసిన ఆ పుట్టు గుడ్డి మహాజ్ఞాని పాదపద్మాలకు తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మిక లోకం ఎప్పటికీ రుణపడి ఉంటాయి. ఆయన అందించిన సాహిత్య సంపద, చూపిన మోక్ష మార్గం తరతరాలకూ మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంటాయి.

ఆయన నిరంతరం చీకటిలోనే జీవిస్తున్నట్లు బాహ్య ప్రపంచానికి అనిపించినా, ఆయన హృదయంలో మాత్రం బ్రహ్మజ్ఞాన భానుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నాడు. శబ్ద తరంగాలనే తన గురువుగా చేసుకుని, ఇతరులు గ్రంథాలను చదువుతుంటే శ్రద్ధగా వింటూ, శ్రుతి జ్ఞానంతో వాటన్నింటినీ తన మస్తిష్కంలో భద్రపరుచుకుని, వ్యాస మహర్షి సృష్టించిన అత్యంత క్లిష్టమైన ‘బ్రహ్మసూత్రాలను’ సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేలా వచన రూపంలోకి తీసుకురావాలనే సంకల్పం ఆయనలో కలగడమే ఒక అద్భుతం. ఆ సంకల్ప బలం నుంచే 'బ్రహ్మసూత్ర రహస్యము' అనే మహత్తర వచన కావ్యం జన్మించింది. అద్వైత వేదాంతానికి మూలస్తంభాల లాంటి ఆ సూత్రాలను, వాటి అంతరార్థాలను ఏ విధమైన దృష్టి సహాయం లేకుండా, కేవలం తన మేధోశక్తితో, ఇతరులతో రాయించి గ్రంథస్థం చేయడం అక్షరాలా ఒక యజ్ఞం.

బాహ్య ప్రపంచపు చీకట్లను దాటి, అంతఃచేతనలోని అద్వైత కాంతిని ఆవాహన చేసుకున్న బ్రహ్మశ్రీ వెన్నెలకంటి సుందరరామశర్మ అంతరంగిక వేదాంత ప్రయాణాన్ని, ఆయన గ్రంథాలలోని నిగూఢ తత్వ విచారణను పరిశీలిస్తే మానవ మేధస్సుకు అందని ఎన్నో దివ్య రహస్యాలు గోచరిస్తాయి. భౌతిక చక్షువులు లేని ఒక సాధకుడు కేవలం వినికిడి ద్వారా సమస్త ఉపనిషత్తులను, వేదాంత సారాన్ని జీర్ణించుకోవడం వెనుక ఒక మహా తపస్సు దాగి ఉంది. ఆయన గ్రంథ రచన కేవలం అక్షరాల కూర్పు కాదు, అది నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వానికి, సగుణోపాసన భక్తి మార్గానికి మధ్య ఆయన నిర్మించిన అద్భుత సమ్మేళన సేతువు.

ఆయన తత్వ విచారణలో మొదటిది, అత్యంత క్లిష్టమైనది వ్యాస ప్రణీత బ్రహ్మసూత్రాల విశ్లేషణ. 'అథాతో బ్రహ్మజిజ్ఞాస' అంటూ మొదలయ్యే బ్రహ్మసూత్రాల అంతరార్థాన్ని సుందరరామశర్మ దర్శించిన తీరు అద్వితీయం. జగత్తు మిథ్య అని, జీవుడు పరబ్రహ్మకంటే వేరు కాదని చాటిచెప్పే అద్వైత సిద్ధాంతాన్ని ఆయన శోధించారు. కంటికి కనిపించే ఈ నామరూపాత్మక జగత్తు అంతా ఒక భ్రమ మాత్రమేనని, కళ్ళు లేకపోవడం వల్లనే ఆయనకు ఈ ప్రపంచపు మాయా రూపాలు మనస్సును భ్రమింపజేయలేకపోయాయని భావించవచ్చు. ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం పరిమితమైనదని, కేవలం బుద్ధి, ఆత్మ సాక్షాత్కారం ద్వారానే పరమ సత్యాన్ని తెలుసుకోగలమని ఆయన తన 'బ్రహ్మసూత్ర రహస్యము' వచన కావ్యంలో నిరూపించారు.

చక్షురింద్రియం లేకపోవడమే ఆయనకు అంతర్ముఖత్వానికి, నిధిధ్యాసనకు (ధ్యాన ఏకాగ్రతకు) పరమ సాధనంగా మారింది. బ్రహ్మశ్రీ వెన్నెలకంటి సుందరరామశర్మ గ్రంథాల అంతర్వాహినిని, వాటిలోని నిగూఢ వేదాంత రహస్యాలను పరిశీలిస్తే, ఆయన కేవలం గ్రంథాలను అనువదించిన భాషా కోవిదుడు మాత్రమే కాదని, స్వానుభవపూర్వకంగా జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని పొందిన పరమ సిద్ధపురుషుడని స్పష్టమవుతుంది. ఆయన గురువులైన సచ్చిదానందేంద్ర సరస్వతి, మహాదేవాచార్యుల అనుగ్రహంతో పొందిన ఆత్మానుభూతిని తన గ్రంథాల ద్వారా సమాజానికి పంచారు. బాహ్య ప్రపంచానికి అంధుడైనప్పటికీ, ఆధ్యాత్మిక జగత్తులో ఆయన సృష్టించిన నిర్దిష్టమైన తత్వ విచారణ సనాతన ధర్మంలోని అత్యున్నత యోగ, వేదాంత సాధనల చుట్టూ తిరుగుతుంది.

ఆయన 'బ్రహ్మసూత్ర రహస్యము' వచన కావ్యంలో చేసిన తత్వ విచారణ జీవుడి బంధము, విముక్తి అనే ప్రాథమిక సత్యాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఉపనిషత్తుల సారాన్నంతటినీ వ్యాస మహర్షి సూత్రాలుగా మలిస్తే, వాటి వెనుక ఉన్న కఠినమైన 'అద్వైత అన్వయాన్ని' సుందరరామశర్మ సులభతరం చేశారు. ఇందులో ఆయన చేసిన ప్రధాన శోధన ‘అవిద్య (అజ్ఞానం)’ ఎలా తొలగిపోతుందనేది. కంటికి కనిపించే ఈ జగత్తు కేవలం ఒక రజ్జు-సర్ప భ్రాంతి (తాడును చూసి పాము అనుకోవడం) లాంటిదని, బుద్ధి అంతర్ముఖమైనప్పుడు భ్రాంతి తొలగి కేవలం సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే మిగులుతుందని ఆయన నిరూపించారు. చక్షురింద్రియం లేకపోవడమే ఒక వరంగా మారి, దృశ్య ప్రపంచపు వికారాలకు లోనుకాకుండా నిశ్చలమైన 'సాక్షి చైతన్యాన్ని' హృదయంలో ఎలా నిలుపుకోవాలో ఈ గ్రంథంలో తార్కికంగా వివరించారు.

ఇక ఆయన విశిష్ట రచన అయిన 'సీతారామాంజనేయ సంవాదము' తాత్పర్యంలో ఆయన చేసిన తత్వ విచారణ భక్తి, యోగ, జ్ఞానాల త్రివేణీ సంగమం. ఇందులో ఆయన ప్రధానంగా స్పృశించినది 'తారక యోగము, సంఖ్యా యోగము'. కేవలం భక్తితో ప్రారంభమయ్యే సాధన, యోగ సాధన ద్వారా పరమ జ్ఞానంగా ఎలా మారుతుందో ఇందులో వివరించబడింది. ప్రణవార్థ ధ్యాన రూపమైన తారక యోగం ద్వారా జీవుడు ప్రాణాపాన వాయువులను నియంత్రించి, మనస్సును భ్రూమధ్యంలో నిలిపి, నాదబిందు కలాతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా పొందాలో ఆయన స్వానుభవపూర్వకంగా వివరించారు. ఆంజనేయస్వామి వంటి ఉత్తమ సాధకుడికి సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీరామచంద్రుడు బోధించిన ఉపదేశాల నెపంతో, సుందరరామశర్మ జీవాత్మ-పరమాత్మల ఐక్యతకు (జీవబ్రహ్మైక్యానికి) దారితీసే రహస్య మార్గాలను ఆవిష్కరించారు.

భౌతిక చక్షువులు లేకపోయినా, కుండలినీ శక్తి యొక్క జాగృతిని, షట్చక్ర భేదనాన్ని సహస్రార కమలంలోని అమృత వర్షాన్ని ఈ సంవాదం ద్వారా వివరించడం ఆయన యోగ నిష్ఠకు పరాకాష్ఠ. ఈ విధంగా వెన్నెలకంటి సుందరరామశర్మ గ్రంథాలలోని నిర్దిష్టమైన తత్వ విచారణ అనేది కేవలం గ్రంథ పఠనం కాదు; అది అనాత్మ పదార్థాలైన శరీరం, ఇంద్రియాలు, మనస్సుల నుండి ఆత్మను వేరు చేసి చూసే 'వివేక చూడామణి'. బాహ్య నేత్రాలు లేని ఆ పుట్టు గుడ్డి మహాత్ముడు తెలుగు జాతికి అందించిన ఈ తాత్విక సంపద, భౌతికమైన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ కూడా అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడే మానవాళికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించే ఒక అద్భుత దివ్యౌషధం.

ఈ అద్వైత అనుభూతి యొక్క చరమాంకమే ఆయన రచించిన 'శ్రీమదాంధ్ర వచన జ్ఞానవాశిష్ఠము'. బ్రహ్మశ్రీ వెన్నెలకంటి సుందరరామశర్మ సులభ శైలిలో అందించిన 'శ్రీమదాంధ్ర వచన జ్ఞానవాశిష్ఠము' ఒక అద్భుత వేదాంత నిధి. వాల్మీకి మహర్షి రచించినట్లుగా చెప్పబడే ‘యోగ వాశిష్టం’ గ్రంథం, రామాయణ కథా కాలంలోనే జరిగినా, ఇందులో రామకథ కంటే కూడా పరమాత్మ తత్వ విచారణే ప్రధానాంశం. వశిష్ట మహర్షి శ్రీరాముడికి అందించిన ఈ బోధనలో సంసార వైరాగ్యమే మోక్షానికి మొదటి మెట్టుగా వర్ణించబడింది. సుందరరామశర్మ ఈ గ్రంథంలోని తత్వాన్ని సామాన్యులకు సైతం అనుభవంలోకి వచ్చేలా మలిచారు. జగత్తు అనేది ఒక స్వప్నం లాంటిదని, నిద్ర లేచిన వెంటనే స్వప్న జగత్తు ఎలా మాయమవుతుందో, జ్ఞానోదయం కలిగిన వెంటనే ఈ సంసార బంధాలు అలాగే పటాపంచలైపోతాయని యోగవాశిష్టం చెబుతుంది.

బాహ్య ప్రపంచాన్ని ఎన్నడూ చూడని సుందరరామశర్మకు లోకంలోని రంగులు, రూపుల పట్ల ఎటువంటి ఆకర్షణా ఉండే అవకాశం లేదు. అందువల్లనే కాబోలు, యోగవాశిష్టంలో చెప్పబడిన 'దృశ్య వివేకం' (కనిపించేదంతా అనిత్యం అనే భావన) ఆయన హృదయంలో సహజంగానే రూఢి అయింది. మనస్సును శూన్యం చేయడం ద్వారా, వాసనలను క్షయం చేయడం ద్వారా ఆత్మారాముడిగా ఎలా వెలగాలో ఆయన తన సరళ సుబోధక వచన శైలిలో మార్గదర్శనం చేశారు. యోగవాశిష్ఠం లేదా 'శ్రీమదాంధ్ర వచన జ్ఞానవాశిష్ఠము' లో ఆయన ప్రతిపాదించిన తత్వ విచారణ మరింత గంభీరమైనది.

ఇందులో ఆయన 'మనో నాశనము' (మనస్సును లయం చేయడం), 'వాసనా క్షయము' అనే అత్యున్నత వేదాంత సూత్రాలను విశ్లేషించారు. వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి బోధించిన ఏడు జ్ఞాన భూమికలను (శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థాభావిని, తురీయగ) ఆయన వివరించిన తీరు అద్భుతం (గరికిపాటి మాటల్లో). మనస్సే బంధానికి, మోక్షానికి కారణమని; దృశ్య ప్రపంచం మనస్సు యొక్క సంకల్ప వికల్పాల సృష్టి మాత్రమేనని సుందరరామశర్మ నొక్కి చెప్పారు. ఈ జగత్తు అంతా శూన్యమని, ఆత్మ ఒక్కటే సత్యమని నిరూపించే క్రమంలో ఆయన ప్రతి వచనంలోనూ వైరాగ్య భావన ఉట్టిపడుతుంది. ఏ బాహ్య ఆకర్షణలూ లేని ఒక యోగి మాత్రమే రాయగల నిర్మలమైన, నిశ్చలమైన ఆత్మజ్ఞాన దర్శనం ఈ గ్రంథంలోని ప్రతి పేజీలోనూ గోచరిస్తుంది. వివరాలలోకి పోతే:

యుక్తవయస్సులోకి అడుగుపెట్టిన శ్రీరాముడు దేశాటన (తీర్థయాత్రలు) ముగించుకుని అయోధ్యకు తిరిగి వస్తాడు. లోకాన్ని చుట్టివచ్చిన రాముడిలో తీవ్రమైన వైరాగ్యం ఆవహిస్తుంది. ఈ సంసార జీవితం, ఐశ్వర్యం, రంగుల ప్రపంచం అన్నీ అనిత్యమైనవని, మనుషులు సుఖం అనుకునేవన్నీ దుఃఖభాజనాలని భావించి నిరాశతో, మౌనంగా ఉండిపోతాడు. సరిగ్గా అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షణ కోసం రాముడిని తనతో పంపవలసిందిగా దశరథుడిని కోరడానికి వస్తాడు. రాముడి వైరాగ్య స్థితిని గమనించిన విశ్వామిత్రుడు, రాముడి మనసులోని వేదన కేవలం అజ్ఞానం కాదు, అది పరమ జ్ఞానానికి తలుపు అని గ్రహించి, కులగురువైన వశిష్ఠ మహర్షిని రామునికి తత్వబోధ చేయవలసిందిగా ప్రార్థిస్తాడు. ఆ విధంగా రాజాస్థానంలో మహర్షులు, పండితుల సమక్షంలో వశిష్ఠ-రామ సంవాదం ప్రారంభమవుతుంది.

జ్ఞానవాశిష్ఠం ఆరు ప్రకరణలుగా (భాగాలుగా) సాగుతుంది: వైరాగ్య ప్రకరణం (సంసారం, దేహం, సంపదల పట్ల రాముడు వ్యక్తపరిచిన తీవ్ర విరక్తి), ముముక్షు వ్యవహార ప్రకరణం (మోక్షాన్ని కోరే సాధకుడికి ఉండవలసిన లక్షణాలు, పురుష ప్రయత్నం ప్రాధాన్యత), ఉత్పత్తి ప్రకరణం (ఈ జగత్తు ఎలా పుట్టింది? మనస్సు యొక్క సంకల్పాల నుంచే ఈ సృష్టి ఎలా వ్యక్తమైందో వివరించే భాగం), స్థితి ప్రకరణం (పుట్టిన జగత్తు భ్రమ రూపంలో ఎలా నిలిచి ఉందో చెప్పడం), ఉపశమ ప్రకరణం (మనస్సును, వాసనలను అణచివేసి ప్రశాంతతను ఎలా పొందాలో వివరించడం), నిర్వాణ ప్రకరణం (మోక్ష స్థితి లేదా జీవన్ముక్తి యొక్క పరమానంద స్థితిని ఆవిష్కరించడం). వశిష్ఠ మహర్షి కేవలం పొడి వేదాంత సూత్రాలు చెప్పకుండా, పాఠకుడికి సులభంగా అర్థమవడానికి లీలా-పద్మనాభుల కథ, చూడా మార్క్ కథ, ప్రహ్లాద వృత్తాంతం, భగీరథుడి కథ వంటి ఎన్నో చిన్న చిన్న వైరాగ్య, ఉపమాన కథల ద్వారా పరమ సత్యాన్ని బోధిస్తారు.

వశిష్టుడికి - రాముడికి మధ్య జరిగిన సంభాషణ ఒక ఉత్తమ గురువుకు, ఒక ఉత్తమ శిష్యుడికి (సాధకుడికి) మధ్య జరిగిన తాత్విక చర్చ. ‘స్వామీ! ఈ ప్రపంచం కనిపిస్తోంది కానీ శాశ్వతం కాదు కదా? కోరికలు ఎండమావుల లాంటివి. ఈ మనస్సు క్షణం కూడా కుదురుగా ఉండదు. దేహమే నేననే భ్రమ నుండి విముక్తి పొంది, శాశ్వతమైన ప్రశాంతతను పొందే మార్గం ఏమిటి?’ అని రాముడు అడుగుతాడు. జవాబుగా, ‘రామా! సముద్రంలో తరంగాలు పుట్టి లయమైనట్లు, పరబ్రహ్మము అనే అనంత చైతన్య సముద్రంలో ఈ జగత్తులు పుడుతూ లయమవుతుంటాయి. జగత్తు అనేది మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే. నిద్రలో స్వప్నం ఎంత సత్యంగా అనిపిస్తుందో, అజ్ఞానంలో ఈ ప్రపంచం అంత సత్యంగా కనిపిస్తుంది. మేల్కొన్న వాడికి స్వప్నం లేనట్లే, ఆత్మజ్ఞానం కలిగిన వాడికి జగత్తు భ్రమ తొలగిపోతుంది. నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు; నువ్వు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవు’ అని వశిష్టుడు బోధిస్తాడు.

వశిష్ఠ మహర్షి యొక్క సుదీర్ఘమైన, అమూల్యమైన బోధన ముగిసేసరికి శ్రీరాముడి మనసులోని సంశయాలన్నీ పటాపంచలైపోతాయి. రాముడు సంపూర్ణమైన 'ఆత్మసాక్షాత్కారాన్ని' పొంది, పరమ ప్రశాంత స్థితికి (జీవన్ముక్తుడిగా) చేరుకుంటాడు. ఈ గ్రంథం ఇచ్చే అత్యున్నత ముగింపు సందేశం: జ్ఞానం వచ్చినంత మాత్రాన కర్మలను వదిలిపెట్టకూడదు. వశిష్టుడు రాముడితో ‘రామా! నువ్వు ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నావు. కాబట్టి నిర్లిప్తతతో, అంటీఅంటకుండా ఉంటూనే నీ బాధ్యతలను, లోకకల్యాణార్థం నీవు చేయవలసిన ధర్మాన్ని నెరవేర్చు’ అని ఆదేశిస్తారు. రాముడు గురువు పాదాలకు నమస్కరించి, తన వైరాగ్య భారాన్ని వీడి, లోక రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం కార్యోన్ముఖుడవుతాడు.

బాహ్య ప్రపంచపు చూపు లేని వెన్నెలకంటి సుందరరామశర్మ, లోపలి కాంతితో ఈ మహత్తర సంభాషణలోని ప్రతి అక్షరాన్ని ఆకళింపు చేసుకుని, ఇంతటి గంభీరమైన గ్రంథాన్ని తెలుగు వచనంలోకి అనువదించడం నిజంగా ఒక దివ్య విస్మయం. (వెన్నెలకంటి గారి మూడు పుస్తకాలు ‘వావిళ్ల రామశాస్త్రులు & సన్స్’ నాగార్జున సాగర్ రోడ్, హైదరాబాద్, 98495 69921 దగ్గర లభ్యమవుతాయి)

>>>>మహాసహస్రావధాని, పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారికి ధన్యవాదాలతో.

No comments:

Post a Comment