Friday, November 11, 2011

డాక్టర్ వై.ఆర్.కె "అనుభవాలను - జ్ఞాపకాలను గ్రంధస్థం చేసిన నేపధ్యం": వనం జ్వాలా నరసింహారావు

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో రెండవది ఆయన "అనుభవాలను-జ్ఞాపకాలను గ్రంధస్థం చేసిన నేపధ్యం"

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: Part-2

యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి

అనుభవాలను-జ్ఞాపకాలను గ్రంధస్థం చేసిన నేపధ్యం

వనం జ్వాలా నరసింహారావు

కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధనస్వామ్య వ్యవస్థ" కు వ్యతిరేకంగా శ్రామిక వర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందని-ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని జోస్యం చెప్పాడు. సోవియట్, చైనా దేశాల్లో శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేంతవరకు చాలావరకు ఆయన చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాత కారణాలేవైనా, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ సిద్ధాంతపరమైన అధికారానికి దూరమైంది. చైనాలో కొనసాగుతున్న కమ్యూనిజం, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు అదనంగా మావో ఆలోచనా విధానం చేర్చింది.

భారత దేశంలోని (ఉమ్మడి) కమ్యూనిస్టులు సోవియట్-చైనా భావాలకు అనుకూల-ప్రతికూల-మధ్యేవాద మార్గంలో ప్రస్థానం మొదలెట్టి, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా పయనించడం జరిగింది. సిద్ధాంతపరంగా ఉమ్మడి పార్టీలో మొదలైన చీలిక, దరిమిలా, పేరుకే సిద్ధాంతపరంగా మారి, మితవాద-అతివాద-తీవ్రవాద-భావాలలో ముక్క చెక్కలైంది. పార్లమెంటరీ పంథా కోరుకున్న వర్గాలు ఏదో ఒక జాతీయ-ప్రాంతీయ పార్టీతో ఎన్నికల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని, అర-కొర స్థానాలను చట్టసభల్లో సంపాదించుకోవడంతో సరిపుచ్చుకుంటున్నాయి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజల సమస్యలకు దూరమై, ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి దిగిపోయారు. చివరకు పరిస్థితి ఎలా మారిందో అంచనా వేయడానికి ఉదాహరణలుగా సీపీఐ నాయకుల దైవ దర్శనాలు, సీపీఎం నాయకుల దిద్దుబాటు చర్యల చొరవలు, చెప్పుకోవాల్సి వచ్చింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది సీపీఎం.

దిద్దుబాటు ప్రక్రియను పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంతో ఆరంభించి, జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో సిపిఎం కేంద్ర కమిటీ తీర్మానించింది. ఆ నిర్ణయం అమలుకు సంబంధించిన సమాచారం లేదు. సీపీఎం పార్టీలో అవకాశవాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్రప్రదేశ్‍లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవనశైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

కార్ల్ మార్క్స్ లాంటి మహా-మహానుభావులు, కారణజన్ములు, ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధనస్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒక వైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశదపర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు.

హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగస్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.

ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూలదోసి, శ్రామిక రాజ్యస్థాపన, వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తోంది.

ఈ నేపధ్యంలో, ఇప్పటికీ, అలనాడు మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, గత పాతికేళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను నెరవేరుస్తున్న ఎనభై రెండేళ్ల కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ తలపెట్టిన "దిద్దుబాటు" కార్యక్రమంలో భాగంగా స్పందించని వారు తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే మరి.

తీపి గుర్తులు - చేదు అనుభవాలు

గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగనివాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కలవాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించిన "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి. "సహస్ర చంద్ర దర్శనం" చేసుకున్న ఆయనను గురించి తెలిసిన వారు-తెలియని వారు, తెలుసుకోవాల్సిన విషయాలెన్నో... ఎన్నెన్నో! (కాకపోతే, ఆయన్నీ విషయం గురించి అడిగినప్పుడు: "ఎన్ని వేల పూర్ణ చంద్ర బింబాలను చూశామన్నది కాదు: ఎన్ని వందల, వేల బ్రతుకుల్లో వెలుగులు నింపామన్నది ముఖ్యం" అని అన్నారు). "వైఆర్‍కె"గా, "డాక్టర్ గారు"గా అందరూ పిలిచే ఈ మనిషి చిన్నతనం ‍నుండే నిరీశ్వరవాది. గోరా ప్రభావంతో హేతువాదం కూడా జోడైంది ఆయనలో. సహధర్మచారిణి కూడా, ఆయన బాటలోనే, వివాహమైన కొద్ది కాలంలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. ముగ్గురు పిల్లలకూ ఆయన అలవాట్లే అబ్బాయి. ఇంటికొకరు అన్నట్లు, పెద్ద కోడలు మాత్రం మంచి భక్తురాలైంది. అయితే, సాహిత్యాభిలాషైన వైఆర్‍కె పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.

1985లో పార్టీ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ వైఆర్కె, పాతికేళ్లు సీపీఎం రాష్ట్ర కమిటీలో, కార్యదర్శి వర్గంలో వున్నప్పటికీ, ఎన్నడూ ఆర్థికపరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండుసార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. 1996 ఫిబ్రవరి నెలలో హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు, మోటూరు హనుమంతరావు విజయవాడ నుంచి ఫోన్ చేశారు రాధాకృష్ణమూర్తిగారికి. తెలుగు దేశం పార్టీతో అప్పట్లో వున్న అవగాహన ప్రకారం సీపీఎం కు కేటాయించే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రతిపాదించనున్నందున, దానికి ఆయన అంగీకారం తెలపాల్సిందిగా కోరారు మోటూరి. తనకెందుకన్న వైఆర్‍కెతో, "రాజ్యసభకు పంపుతామంటే వద్దంటారేంటి" అని ప్రశ్నించారాయన. చివరకు భార్యా పిల్లలను సంప్రదించి, సంకోచంగానే సమ్మతి తెలియ చేశారు డాక్టర్.

రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడంతో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 1985 కు పూర్వం, అదీ సభ్యత్వం తీసుకోక ముందు, డాక్టర్ గారు సంపాదించిన ఆస్తిని ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరు కుమారులకు బదిలీ చేసి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారాయన. పిల్లలు సమకూర్చిన పైకంతో ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడుపుతున్న ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే!.

ఈ నేపధ్యంలో, అనేకానేక విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసి, అలవోకగా ఆచరణలో చేసి చూపించి, పలువురికి ఆదర్శప్రాయుడైన యలమంచిలికి వృత్తిపరమైన స్నేహితులు, ప్రవృత్తిపరమైన మితృలు, పార్టీపరమైన అభిమానులు, రాగద్వేషాలకు అతీతంగా నడచుకునే వ్యక్తిగా గుర్తించి రాజకీయాలతో సంబంధం లేకుండా గౌరవించే పలువురు, ఆయన అనుభవాలను-జ్ఞాపకాలను గ్రంధస్థం చేయమని అడుగుతుంటారు. ఆయనకు అలా చేయాలని వున్నా, రాసే సాహసం చేయలేదు చాలా కాలం వరకు. తన జీవితం గ్రంధస్థం చేసి, ఇతరులతో చదివించేటంత గొప్పదేమీ కాదని ఆయన భావన. ఒక వేళ తాను కాగితం మీద పెట్టగలిగినా, వాస్తవాలను జరిగినవి జరిగినట్లు చెప్పగలనా అన్న సందేహం కూడా ఆయనలో వుండేది. తానెన్నో-ఎంతమందివో జీవిత చరిత్రలు చదివానని, అందులో ఎన్ని, నిష్పక్షపాతంగా-తటస్థంగా-వాస్తవిక దృక్ఫదంతో వున్నవో చెప్పజాలనని అనేవారు. గాంధీ లాంటి వారి జీవిత చరిత్రలే విమర్శలకు లోనైనప్పుడు, యలమంచిలి లాంటి వారివి, చదువరులు సానుకూలంగా విశ్లేషిస్తారో, వ్యతిరేకంగా విమర్శిస్తారో చెప్పడం కష్టమైనా, ఆయన అనుభవాలు పదిమంది తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా వుంది. అందుకే ఆయనను కదిలించాను. ఆయనలోని అధ్యయనం, ఆదర్శం, సేవా దృక్ఫధం, వృత్తి, ప్రవృత్తి, స్నేహ భావం, ఇతరులపై అభిమానం నన్ను కాదన లేకపోయాయి. నా వెంట వున్న బాబాయి, ఆయన అభిమాని వనం నరసింగరావు ప్రేరణ మా ప్రయత్నానికి ఊతమిచ్చాయి. ఫలితంగా డాక్టర్‍గారి అనుభవాలను, జ్ఞాపకాలను పదిమందితో పంచుకునే వీలు ఇలా కలిగింది.

మరి, నాకెందుకీ ఆలోచన కలిగిందన్న ప్రశ్న వేసుకుంటే, మొదటగా చెప్పాల్సిన సమాధానం, బహుశా అనుకోకుండా వచ్చిందనడం సమంజసమేమో! అలా వరుస వెంట సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే, కారణాలు చాలానే వున్నాయి. ఆ కారణాల పర్యవసానమే, ఆయన జీవన యానం గ్రంధస్థం చేయాలన్న ఆలోచనకు పునాది.

నేను పుట్టి బాల్యంలో పెరిగింది, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, వనంవారి కృష్ణా పురం (ముత్తారం రెవెన్యూ గ్రామం). హైస్కూల్, కాలేజీ ఆరంభ చదువు ఖమ్మం పట్టణంలో. వ్యవసాయం, కరిణీకం వృత్తిగా పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యంకూడా లేని ఆ కుగ్రామంలో నివసిస్తుండే, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజుల్లో పుట్టాను. కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రం కూడా భారత దేశంలో విలీనం కావడంతో మా కుటుంబం సొంత గ్రామానికి తిరిగొచ్చింది. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. అయిదో తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నాను.

మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, బాల్యంలో నా వరకు నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ-కరిణీకం చేస్తున్న అమ్మ పేట గ్రామ పెద్దలతో నూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని-నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మ పేట-ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్నగారు చెప్తే తెలుసుకున్నాను-కొన్ని స్వయంగా చూసాను.

సాహిత్యానికీ-మానవ విలువలకూ, ఛాందసత్వానికీ-కమ్యూనిజానికీ విడదీయని అనుబంధం వుందనొచ్చు. పుట్టి-పెరిగిన గ్రామ పరిసరాల భౌగోళిక-చారిత్రక నేపథ్యంలో, సాహిత్యం గురించి-మానవ విలువల గురించి, కొన్ని ప్రాథమిక పాఠాలను-మౌలికాంశాలను అనుభవంతో నేర్చుకున్నాను. మా నాన్నగారు, బాల్యంలో నాకు నేర్పిన తొలి పాఠాలలో, చెరిపినా చెరగని నమ్మకాలున్నాయి. అందులో ఎన్నో గుడ్డి నమ్మకాలూ వున్నాయి. నాన్నగారు చదివింది ఆరో తరగతి వరకే అయినా, జీవితం నేర్పిన అనుభవంతో, పురాణాలనుండి-ఇతిహాసాలనుండి-భారత,భాగవత, రామాయణాలనుండి-వర్తమాన చారిత్రక గాధలనుండి-ఆయన పెరిగిన నైజాం నవాబుల పరిపాలనా నేపధ్యం నుండి, ఎన్నో విషయాలను నాకు చెప్పేవారు. మానవ విలువలకు మారుపేరైన బుద్ధుడు, ఆరునూరైనా అసత్యమాడని యుధిష్టరుడు, స్వధర్మ నిర్వహణే తన విధి అని తలచిన శ్రీరామచంద్రమూర్తి, కర్తవ్య బోధన చేసిన శ్రీకృష్ణుడు, అహింసే తన మతమన్న గాంధీ మహాత్ముడు, నాన్న గారు చెప్పిన పాఠాల్లో నాకు తరచుగా వినిపించిన పేర్లు. బాల్యంలోనే, "కర్మ సిద్ధాంతం" అంటే కొంచం-కొంచం అర్థం చేసుకున్నాను.

హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన గతితార్కిక భౌతికవాద కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను. ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం" చిన్నతనంలోనే కొంత మేరకు అవగాహనకొచ్చిందంటే అతిశయోక్తి కాదేమో!.

నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధనస్వామ్య వ్యవస్థ"కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ-ముందున్న వ్యవస్థ కూలిపోతుందనీ, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనీ, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగిన దానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనొచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో-వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం-అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా.

కుగ్రామమైన మా వూళ్లో హైస్కూల్ చదువుకు అవకాశం లేకపోవడంతో, ఖమ్మం రికాబ్-బజార్ హైస్కూల్లో చేరాను. బహుశా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు సొంత ఇంటికి మారిన సంవత్సరానికి ఒక రెండేళ్ల ముందర, నేను ఖమ్మం చదువుకు వచ్చి వుండవచ్చు. వారు ఇప్పుడున్న ఆసుపత్రికి మారిన మరుసటి సంవత్సరం హెచ్.ఎస్.సీ పూర్తి చేశాను. పియుసి చదువుతుండగా, కాలేజీకి (అప్పట్లో ఎస్. ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ కళాశాల) ప్రతిరోజూ డాక్టర్‍గారి ఆసుపత్రి పక్కనుంచే వెళ్లే వాళ్లం. అలా వారి గురించి వినడం మొదలైంది. ఆ మాటకొస్తే, మా నాన్నగారు డాక్టర్‍గారి గురించి చాలా సార్లు చెప్పేవారు. మా గ్రామం పటేల్ తుల్లూరి రామయ్య (మా వూళ్లో మా ఇంటికి ఎదురుగానే వాళ్ల ఇల్లు) కుటుంబానికి ఫామిలీ డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారే. రామయ్య జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే వున్నప్పటికీ, కమ్యూనిస్ట్ డాక్టర్‍గారి దగ్గరే వైద్యం చేయించుకునే వారు. ఆయనే కాదు, మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది డాక్టర్‍గారి దగ్గరే వైద్యానికి వెళ్లేవారు. అలా కూడా వై.ఆర్.కెగారి గురించి కొంత తెలుసు నాకు.

నేను కాలేజీలో పియుసి చదువుతున్న సంవత్సరమే భారత-చైనా యుద్ధం వచ్చింది. "చైనా దురాక్రమణ"ను నిరసిస్తూ కాలేజీ విద్యార్థుల వూరేగింపు జరిగింది. ఐతే, ఊరేగింపులో "కమ్యూనిస్ట్ పార్టీకి" వ్యతిరేకంగా నినాదాలు చేయరాదని ఒక అంగీకారం కుదిరింది. అప్పుడు కాలేజీ విద్యార్థి సంఘం కార్యదర్శి ఖాదర్ అలీ, ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్నాడు. డాక్టర్‍గారింటి దగ్గరికి ఊరేగింపు చేరబోతున్న సమయంలో ఖాదర్ అలీ వ్యతిరేక గ్రూప్‍కు చెందిన కొందరు విద్యార్థులు "కమ్యూనిస్ట్ చైనా దురాక్రమణ"ను ఖండిస్తున్నాం ఆంటూ నినాదాలు చేయడానికి పూనుకోవడం, కొంత ఘర్షణ తరువాత వారు విరమించుకోవడం జరిగిన విషయం నాకింకా గుర్తుంది. బాబాయి వనం నరసింగరావు కాలేజీలో (ఎన్నడూ పోటీ చేయని "కింగ్ మేకర్" లాంటి నాయకుడు) బి.ఎస్.సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడప్పుడు. అప్పటికే ఆయన కాలేజీలోని కమ్యూనిస్ట్ అనుకూల విద్యార్థి సంఘం నాయకులలో ప్రముఖుడు. అలా డాక్టర్ గారి గురించి మరింత తెలుసు అప్పటికే. అలా క్రమేపీ, డాక్టర్‍గారి మార్క్సిస్ట్ ఫోరం, ఇతర రాజకీయ పాఠాల వ్యవహారం కొంత తెలుసుకునే అవకాశం కలిగినప్పటికీ, మా నాన్నగారి భయం (ఆయనకు రాజకీయాలంటే గిట్టదు) వల్ల, ఎక్కువగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొన లేకపోయే వాడిని. ఆ తరువాత డిగ్రీ చదువుకు హైదరాబాద్ వెళ్లడం జరిగింది. పూర్తైన తరువాత రెండు-మూడేళ్లు మా వూళ్లో వుండాల్సిన పరిస్థితులు కలిగాయి. ఆ మూడేళ్లు మా గ్రామంలో, వనం నరసింగరావు స్ఫూర్తితో కమ్యూనిస్ట్ రాజకీయాలలో, ఒక విధంగా చెప్పాలంటే, చాలా చురుగ్గా పాల్గొన్నాననే అనాలి. మా గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయకుండా (నాకింకా అప్పటికి ఓటింగ్ వయసు రాలేదు), మొట్ట మొదటిసారిగా, మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా, కాంగ్రేసేతర అభ్యర్థిని సర్పంచ్ చేయగలిగాం. ఆ రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాలలోని పలువురు కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయాలు, వారి ద్వారా డాక్టర్‍గారిని గురించి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.

మూడేళ్ల విరామం తరువాత, 1969-1971 లో (అప్పట్లో చోటు చేసుకున్నా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కారణంగా) నాగ్‍పూర్ విశ్వవిద్యాలయంలో ఎం. ఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివేందుకు వెళ్లాను. అక్కడ వున్న రెండేళ్లలో ఎక్కువ భాగం లైబ్రరీలో గడిపేవాడిని. కమ్యూనిజం, మార్క్సిజం, పెట్టుబడికి సంబంధించిన సాహిత్యం చదివాను. కమ్యూనిజం అన్నా, ఆ పార్టీకి చెందినవారన్నా, ఒక రకమైన గౌరవ భావం పెరిగింది. ఎం.ఏ పాసై తిరిగి ఖమ్మం వచ్చి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, గ్రామ రాజకీయాలతో, జిల్లా కమ్యూనిస్ట్ నాయకులతో సంబంధాలు-పరిచయాలు కొనసాగిస్తూనే వుండేవాడిని. కాకపోతే, డాక్టర్ గారిని నేరుగా కలిసే అవకాశం ఎక్కువగా కలగలేదు. నేనూ ప్రయత్నం చేయలేదు. ప్రత్యేకమైన కారణమంటూ ఏదీ లేదు. ఇక ఆ తరువాత హైదరాబాద్ ఉద్యోగరీత్యా వెళ్లడం గత నాలుగు దశాబ్దాలుగా అక్కడే వుంటున్నప్పటికీ, జిల్లాతో-గ్రామంతో రాజకీయ-రాజకీయేతర పరిచయాలు కొనసాగించుకుంటూనే వున్నాను. ఎక్కడ వున్నా, ఏ ఉద్యోగం చేసినా, చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి (డాక్టర్ మర్రి చెన్నారెడ్డి) కి పౌర సంబంధాల అధికారిగా పనిచేసినా, గవర్నర్ (ఆమె వున్నంత కాలం రాజ్‍భవన్‍ను "గాంధీభవన్" అని అనేవారు) కుముద్ బెన్ జోషి దగ్గర ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసినా, కమ్యూనిస్ట్ నాయకులతో (ముఖ్యంగా మార్క్సిస్టు) పరిచయాలు కొనసాగుతూనే వుండేవి. ఆ క్రమంలోనే, డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారి పౌర హక్కుల ఉద్యమం, వారు జైలుకు వెళ్లడం, ఎన్నికలలో పోటీ చేయడం, రాజ్య సభ సభ్యులు కావడం లాంటివి ఆసక్తిగా గమనిస్తూనే వుండేవాడిని. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు, పౌర హక్కుల గురించి ఒక శిక్షణా కార్యక్రమానికి డాక్టర్‍గారిని ఆహ్వానించాను కూడా. వారు రావడం కుదరలేదప్పుడు.

అలా నాకు ఖమ్మం జిల్లాలో బాగా పరిచయమున్న కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) నాయకులలో మంచికంటి రాంకిషన్‍రావు‍గారు, కె.ఎల్.నరసింహారావుగారు, పర్సాగారు, రావెళ్ల సత్యంగారు, గండ్లూరి కిషన్‍రావుగారు, చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారు, బోడేపూడి వెంకటేశ్వరరావుగారు, తమ్మినేని వీరభద్రంగారు, మరి కొందరున్నారు. సిపిఐ నాయకులు రజబ్ అలీతో, పువ్వాడ నాగేశ్వరరావుగారితో కూడా మంచి పరిచయమే వుంది. రాష్ట్రస్థాయిలో కూడా పరిచయాలున్నాయి. పుచ్చలపల్లి సుందరయ్యగారిని, మోటూరు హనుమంతరావుగారిని, లావు బాలగంగాధరరావుగారిని, మాకినేని బసవపున్నయ్యగారిని, అలాంటి మరికొందరు ప్రముఖ నాయకులను కలిసి మాట్లాడే అవకాశం కలిగింది. జాతీయ స్థాయి నాయకులైన ఏ.కె.గోపాలన్‍గారిని కలిసానొక సారి. ప్రకాశ్‍కరత్‍గారి తోనూ సంభాషించాను. ఇటీవల కాలంలో ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు డాక్టర్ విఠల్‍గారితో చాలా సార్లు అభిప్రాయాలు మార్చుకునే అవకాశం కలిగింది. పశ్చిమ బెంగాల్, బర్ద్వాన్ జిల్లా, బోర్సల్ లో 1969లో జరిగిన. అఖిల భారత కిసాన్ మహా సభలకు వెళ్ళే అవకాశం కూడా కలిగింది. హరే కృష్ణ కోనార్, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‍ల ఉపన్యాసాలు విన్నానక్కడ. సిపిఐ జాతీయ స్థాయి నాయకుడు శ్రీపాద అమృత డాంగే అంటే చాలా అభిమానం. మొహిత్ సేన్‍గారితో బాగా పరిచయం పెంచుకున్నాను ఒకానొక రోజుల్లో. ఢిల్లీలోని ఆయన నివాసానికి కూడా వెళ్లాను. నేను నిర్వహించిన ఒక సభలో ఆయనతో ప్రధానోపన్యాసం ఇప్పించాను.

ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత, ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, గతంలో కంటే కొంచెం ఎక్కువగా తీరు బడి లభించడం మొదలైంది. లోగడ కంటే ఎక్కువ సార్లు ఖమ్మం, పక్కనున్న మా గ్రామం వెళ్లి వచ్చే వీలు కలుగుతోంది. అలా రాకపోకలు సాగిస్తున్న అనేక సందర్భాలలో, డాక్టర్ గారిని కలిసే అవకాశం కూడా పలు సందర్భాలలో కలిగింది. ఆయన కలిసిన ప్రతి సందర్భంలోనూ, అనేక కొత్త విషయాలు తెలుసుకునే వీలు కలగ సాగింది. దానికి తోడు, ఖమ్మంలో కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ పరంగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నాకు, ఎక్కడో అక్కడ ఏదో ఒక లోటు కనిపించ సాగింది. తప్పొప్పులెవరివైనా, ఎందుకిలా జరుగుతుందా అని ఆందోళన చెందేవారిలో నేనూ ఒకడినైనాను. నాకెంతోకాలంగా పరిచయమున్న బంధువులను, మిత్రులను, వారు పార్టీకి చేసిన సేవలు మరిచి, బహిష్కరణకు గురిచేయడమో, వారంతట వారే పార్టీని వీడిపోవడమో గమనిస్తున్నాను. ఈ నేపధ్యంలో, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ రాజకీయాలపైనా, ప్రత్యేకించి డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారికి ఆ పార్టీతో అరవై దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంపైనా, ఈ రెండింటికి ఏదైనా సంబంధం వుండవచ్చా అన్న అంశంపైనా ఆసక్తి కలిగింది. బాబాయ్ నరసింగరావును, ఇద్దరం కలిసి డాక్టర్ వై.ఆర్.కేగారిని, కదిలించాను.

"క్రమశిక్షణ, నిబద్ధత" లకు లోబడి అన్ని విషయాలను మాట్లాడడానికి డాక్టర్‍గారు అంగీకరించినట్లు భావించాను. ఆయన చెప్పిందంతా రికార్డు చేయడానికి డాక్టర్‍గారు అంగీకరించారు. మొదట్లో, ఏవో కొన్ని విషయాలే అనుకున్నాను. పోను-పోనూ పరిధి విస్తరించ సాగింది. పరిమిత విషయాలకంటే, ఆయన జీవిత చరిత్ర లాగా రాస్తే బాగుంటుందనిపించింది. ఆయన కూడా అంగీకరించారు. అందులో భాగంగానే సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలతో పాటు డాక్టర్‍గారి అనుభవాలను, పార్టీతో ఆయన అనుబంధాన్ని గ్రంధస్థం చేస్తే మంచిదనిపించింది.

డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారు ఒక రచయితగా ఆయన అనుభవాలను నేరుగా రాయకపోయినా, వాటిని అన్వయించుకుంటూ, కొన్ని పుస్తకాలు రాశారు. ఆయన వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఉపన్యాసాల ప్రాతిపదికగా "పదం-దృక్ఫదం", "పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు”, “అమెరికాలో ఆయన అనుభవాలు” పుస్తక రూపంలో వచ్చాయి. వాటిలో చెప్పిన విషయాలకు "పూరక-అను పూరక" అంశాలుగా చెప్పిన మరికొన్ని ఇందులో రాయడం జరిగింది. "ఆలోచన" మకుటంతో వివిధ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం, 2008లో వచ్చింది. "ప్రజారోగ్యం -వివిధ దేశాల అనుభవాలు" పేరుతో, కేవలం ఆరోగ్యంపై రాసిన వ్యాసాల సంకలనం 2010లో వచ్చింది. అదే సంవత్సరం ఆ పుస్తకం మూడుసార్లు ప్రచురింపబడడం ఒక విశేషం. తన పుస్తకాలను గురించి వివరిస్తూ, ఒక్కసారిగా యలమంచిలి ఆలోచనలు ఆయన 1993 లో చేసిన అమెరికా పర్యటన దిక్కుగా పయనించాయి. అమెరికా వెళ్లిన అందరిలా కాకుండా ఆయన విభిన్న కోణంలో అక్కడున్న కొన్ని ప్రదేశాలను సందర్శించారు. కమ్యూనిస్టు అభిమానిగా, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే మే దినోత్సవంతో అనుబంధం వున్న "హే మార్కెట్"ను చూడడానికి పనిగట్టుకుని వెళ్లారు. అక్కడ మే దినోత్సవానికి గుర్తుగా మిగిలిందేమిటో చూశారు. ప్రాణత్యాగం చేసిన కార్మికుల గుర్తుగా అక్కడే ఏమీ లేకపోగా, ఇల్లినాయిస్ రాష్ట్రాన్ని "కార్మికుల దాడి నుంచి కాపాడిన సైనికుల జ్ఞాపకార్థం" వేసిన స్మారక చిహ్నం వుండడం ఆయనను నిరాశకు గురి చేసింది. డాక్టర్‍గారు అక్కడకు వెళ్లి-వచ్చిన సంగతులను "అమెరికా వెలుగు నీడలు" పేరుతో యాత్రావర్ణన రూపంలో పుస్తకంగా రాశారు.

అలానే ఆయన జ్ఞాపకాలు చైనా వైపు మళ్లాయి. ఒక సారి ఆయన ఒక ప్రతినిధి బృందానికి నాయకుడుగా చైనా పర్యటించారు. అప్పటి కేరళ గవర్నర్ అసలా బృందానికి నాయకుడుగా వెళ్లాల్సి వుండగా, ఆఖరు క్షణంలో విరమించుకోవడంతో రాధాకృష్ణమూర్తికి ఆ బాధ్యత అప్ప చెప్పారు. బహుశా తన పెద్ద వయసు దృష్ట్యా‍నో, లేదా, తాను కమ్యూనిస్టు అయినందున చైనా ప్రభుత్వం సూచించడం వలనో, తనకు ఆ అవకాశం వచ్చి వుండవచ్చని అన్నారు. అప్పట్లో కేంద్ర విదేశాంగ మంత్రిగా వున్న జస్వంత్ సింగ్ ప్రతినిధి బృందంలో ఒక సభ్యుడు కాదు కాని, వీరు పర్యటన చేస్తున్న సందర్భంలోనే ఆయన కూడా చైనా వచ్చారు. ప్రతినిధి బృందం చైనాలో వెళ్ళిన ప్రతి స్థలంలోను, ఉన్నత స్థాయి చైనా నాయకత్వానికి చెందిన వారే వీరికి స్వాగతం పలికారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ విభాగానికి చెందిన ప్రధాన నాయకుడు వీరిని కలిసి విందు కూడా ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఆయన చిన్న పుస్తక రూపంలో "చైనా డైరీ" పేరుతో చైనా నాయకత్వం గురించి రాశారు.

ఇలా మొదలెట్టి, ఆయన అనుభవాలను చెప్పిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, తానెందుకు ఐదు పర్యాయాలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఎలా ఐదు సెంట్రల్ జైళ్లను చూసింది, ఎలా తాను రాజ్యసభకు నామినేట్ కాబడింది, రాజ్యసభ సభ్యుడుగా ఏం చేసింది, ఎలా ఎంపీ నిధులను సద్వినియోగం చేసింది, ఎలా జీవితంలో ఎదిగింది, ఎలాంటి కష్ట-సుఖాలను అనుభవించింది, వైద్య విద్యను అభ్యసించినప్పుడు ఏం జరిగింది... లాంటి విషయాలెన్నో చెప్పారు.

నేననుకున్న విధంగా, జిల్లాలో కాని, రాష్ట్రంలో కాని, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో కాని, ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల విషయంలో, వివరాలలోకి లోతుగా వెళ్లడానికి డాక్టర్‍గారు అంతగా ఇష్టపడలేదు. "ఔను.. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పరంగా సంతోషం కలిగించని కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న మాట వాస్తవమే. వాటికి కారణాలు, ఫలితాలు, తలెత్తనున్న పర్యవసానాలు భవిష్యత్ నిర్ణయిస్తుంది. నేనింకా పార్టీలో-పార్టీ సభ్యుడుగానే వున్నాను. సిపిఎం పార్టీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా చర్చించడం సమంజసం కాదు." అని స్పష్టంగా చెప్పారు. కాకపోతే, డాక్టర్ గారు చెప్పిన విషయాలలో కొన్నిటిని నా అభిప్రాయానికి-ఆలోచనా సరళికి అన్వయించుకుంటూ పాఠకులకు అందించే ప్రయత్నమే ఇది. ఎక్కడా, ఎవరి మనోభావాలను నొప్పించాలన్న ఉద్దేశం లేదు.

"వెయ్యి పున్నములు చూసిన వాళ్లు చాలామందే వుండవచ్చు. చుట్టూ వుండే వాళ్లకు, నూరు వసంతాలను అందివ్వగలిగిన వారు మాత్రం అరుదుగా వుంటారు. అలాంటివారే ధన్యులు"

తీపి గుర్తులు - చేదు అనుభవాలు (Part-1) : వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు (Part-1)

వనం జ్వాలా నరసింహారావు

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో మొదటిది "డాక్టర్‍గారి నామాట" ఇది. వనం జ్వాలా నరసింహారావు

నా మాట

వయస్సు 84 నడుస్తోంది. ప్రస్తుతం పూర్తి వానప్రస్థం. బతుకుదెరువు కోసం చాలా ఏళ్లు వైద్య వృత్తి చేశాను. ఆసక్తి కొద్దీ చాలా కాలం రాజకీయ కార్య కర్తగా పని చేశాను. సాదా సీదా మధ్య తరగతి జీవితంలో, అందరి లాగానే ఎత్తు పల్లాలు, పువ్వులూ-రాళ్లూ-రెంటి రుచీ చూశాను. మెచ్చుకున్న వారు కొందరైతే, నొచ్చుకున్న వారు మరికొందరు. నా గొప్ప, అదృష్టం ఇటు విస్తృత కుటుంబంలోనూ, బయట సమాజంలోనూ చాలా మంది అభిమానులు వుండడం.

వారిలో కొద్దిమంది అడుగుతూ వచ్చిన ప్రశ్న: ఖాళీగానే వున్నారు గదా...జ్ఞాపకాలూ, అనుభవాలూ ఎందుకు రాసి వుంచకూడదు? అని. నా అనుభవాలు రాసి వుంచదగ్గంత ప్రత్యేకమైనవా? అన్న శంక ఒక వైపు వుండేది. ఎవరికి కావాలి ఇవన్నీ? చదివే ఓపిక ఎందరికి? చదివి ఏం నేర్చుకుంటారు? సమయం వృధా చేసుకోవడం తప్ప అనే నిర్వేదం-నిర్లిప్తత మరోవైపు వుండేది. అసలు కుదురుగా కూర్చుని రాసే శక్తీ-ఆసక్తీ లేక మరికొంత అనుకుంటూనే ఆ ఆలోచన పక్కన పెట్టేశాను.

ఒక శుభోదయాన మిత్రుడు జ్వాలా నరసింహారావు, మామూలుగానే-ముందుగా ఫోన్ చేసే వచ్చారు. ఆయన చిరకాల స్నేహితుడు. ప్రదర్శించని పాండిత్యం ఆయనది. జర్నలిజంలో పట్టా లేకపోయినా, విశేష అనుభవం, వృత్తిగత నైపుణ్యం వున్న వ్యక్తి. మార్క్సిజంపై విశ్వాసం, కమ్యూనిస్ట్ పార్టీలపై కించిత్తు అసంతృప్తి, కొందరు నాయకులపై వ్యక్తిగత గౌరవం-ఇదీ నాకు తెలిసిన "జ్వాలా". ఈ సారి తన వెంట ఒక "వాయిస్ రికార్డర్", "లాప్ టాప్ కంప్యూటర్" వగైరా ఎక్విప్‌మెంటుతో సహా వచ్చారు. "మీ జ్ఞాపకాలు చిన్నప్పటి నుండి ఈ నాటి వరకూ చెబుతూ పొండి. నేను రికార్డు చేసుకుంటాను" అంటూ పక్కనే కూర్చుని మొహమాట పెట్టేశారు.

అలా మొదలైందిది.

తీపి గుర్తులు - చేదు అనుభవాలు

ఒక వరస, పద్దతీ లేకుండా, గుర్తున్నంతవరకు చెప్పుకుంటూ పోయాను. ధార (ఫ్లో) ఆగిపోతుంటే, ఆయన ప్రశ్నలతో కదిలిస్తూ రావడం జరిగేది. కొన్ని ప్రశ్నలు గతాన్ని ఇంకా తవ్వేవి. ఇబ్బంది పెట్టేవి కొన్ని. మూసివుంచిన తలుపులు తెరిపించేవి కొన్ని. పాత్రికేయుడు కదా! అలా మూడు-నాలుగు రోజులు సాగింది.

రెండు మాసాల తరువాత, నీట్‍గా కంప్యూటర్‍పై టైప్ చేసిన ప్రతి-స్పైరల్ బైండ్‍తో వచ్చారు. చూసి ఇవ్వమన్నారు. నేను చెప్పినది ఒద్దికగా Chronological Order లో వుంచి, అధ్యాయాలుగా విభజించి, ఎడిట్ చేసిన పద్ధతి ముచ్చటగా వుంది. విషయాన్ని ఎక్కడా వక్రీకరించలేదు. వదిలి పెట్టలేదు.

కాని.... ...... ఆయన తన వ్యాఖ్యలూ-వ్యాఖ్యానాలూ జోడించారు. అందులో పొగడ్తల మోతాదు కాస్త ఎక్కువగానే వుంది. శతాబ్దాల నాటి ప్రఖ్యాత సాహితీవేత్త Johnson జీవిత చరిత్ర రాసిన Boswell గుర్తు వచ్చాడు. బహుశా ఇది, జీవిత చరిత్రకారుల తరతరాల సంప్రదాయ మేమో అనిపించింది! రెండోది.... కమ్యూనిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు కొన్ని తీసుకుని Precept కూ Practice కూ వున్న తేడాను సున్నితంగా విశ్లేషించారు. అవి వారి అభిప్రాయాలు. ఏమైనా, ఆ లోతుల్లోకి వెళ్లి, చర్చించి, తిరగరాయించే ఓపిక నాకు లేదనిపించింది.

నేను చేసిన ఒకే ఒక సూచన .... నా కథనంలోని రాజకీయ పరిణామాల అంశాలకు సంబంధించి Documentary Evidenceను అనుబంధంలో చేర్చితే, విశ్వసనీయత చేకూరుతుందని. నా ఫైల్ లో వున్న వాటిని అందించాను. పేజీలు పెరిగిపోవచ్చన్న భయంతో కొన్ని వదిలేశారు. దానికి తుది రూపం తీసుకు వస్తానని వెళ్లారు. ఆ తుది రూపమే ఈ పుస్తకం.

అలా ముగిసింది కథ.... ... చదివే అలవాటు, ఓపిక వున్న వారు చదవండి.

కొండంత అభిమానంతో, నిష్కామంగా, ఇంత విలువైన-బరువైన కృషి చేసిన మిత్రుడు "జ్వాలా" కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపకుండా ఈ వంట పూర్తి కాదు.

జ్ఞాపకాలు రాయమని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి, మిత్రుడు తెలకపల్లి రవి. ఆ నాడు నా వల్ల కాదనేశాను. ఇప్పుడు మరో విధంగా సాకారమైంది. Thank You Comrade Ravi.

తరువాత స్నేహపూర్వకంగా ఒత్తిడి చేస్తూ, గుర్తుచేస్తూ వచ్చిన వారూ-ఇతరత్రా సహాయ పడిన వారూ వున్నారు. వారందరికీ ధన్యవాదాలు.

వై.ఆర్.కె

Saturday, November 5, 2011

పౌరహక్కులను హరించి వేసేందుకు నాంది పలికిన ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు

ఈ అరెస్టులు సూచిస్తున్నదేమిటి?

ఆంధ్ర జ్యోతి దినపత్రిక (8-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అధిష్టానంకు చెందిన ఒక్కో కాంగ్రెస్ నాయకుడు ఒకరోజొక మాట, మర్నాడొక మాట, ఒకదానికి మరొకటి పొంతన లేకుండా మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒకానొక రోజుల్లో, రాజకీయ పార్టీల నాయకులు, "స్పష్టత" తో మాట్లాడడమే విశ్వసనీయతకు గీటు రాయిగా భావించేవారు. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నేపధ్యంలో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేది లేదని (ఆమె నిర్ణయం మనకు నచ్చినా నచ్చకపోయినా) స్పష్టంగా తేల్చి చెప్పింది ఇందిరాగాంధి. ఈ రోజుల్లో, ఎంత "అస్పష్టత" వుంటే అంత విశ్వసనీయత అనుకుంటున్నారు (ముఖ్యంగా కాంగ్రెస్) రాజకీయ నాయకులు. ఆరంభంనుంచీ నేటి వరకూ ఒక్క మాట మీద నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే, ఏ రాజకీయ పార్టీలో కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో స్పష్టత అనేది నూటికి నూరుపాళ్లు వుందా అని ప్రశ్నిస్తే "లేదు" అనే సమాధానమే వస్తుంది. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలని నినాదమిచ్చిన భారతీయ జనతా పార్టీకి "ఇచ్చే స్థితి” లో వున్నప్పుడు స్పష్టమైన విధానం కొరవడినందున, "అడిగే స్థాయి" కి వచ్చిందాకా "స్పష్టత" రాలేదు. ఇక కమ్యూనిస్టులలో సగం మందికి ఒక రకమైన అస్పష్టత వుంటే, ఇంకో సగం మందికి వేరే విధమైన అస్పష్టత. అలానే మిగతా పార్టీలు కూడా.

డిసెంబర్ తొమ్మిది (2009) న చెప్పిన మాట మార్చిన "కాంగ్రెస్ పార్టీ-యూపీఏ కేంద్ర మంత్రి" చిదంబరం, బక్రీద్ తరువాత తెలంగాణపై ప్రకటన చేస్తామని చెప్పి రోజన్న తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై "పిడి" ని ప్రయోగించింది. ఇది శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని అమలు చేయడానికా? ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పోరాడుతున్నవారిని అణగదొక్కే చర్యలకు శ్రీకారం చుట్టడానికా? ఇవేవీ కాకపోతే టిఆర్ఎస్ పొలిట్‌ బ్యూరో సభ్యుడిని అర్థ రాత్రి దాటిన తర్వాత పిడి చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన ఆగత్యం ఏమిటి? అరెస్టు చేయబడిన వ్యక్తికి గతంలో మావోయిస్టు కార్యకర్తలతో సంబంధాలు వుండవచ్చు. జనశక్తి, మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని వుండవచ్చు. కానిప్పుడు అందరిమధ్యా, ప్రజాస్వామ్య ఉద్యమాల మధ్యా వుంటూ, గుర్తింపు పొందిన ఒక ప్రాముఖ్య తెలంగాణ రాజకీయ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా వున్నాడే! అంటే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఐన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులపై పిడి చట్టం ప్రయోగించడం, పౌరహక్కులను ఉల్లంఘించడం మొదలైందనుకోవాలా?

ఇలా పౌరహక్కులను అణచి వేయడం గమనిస్తుంటే, గతం గుర్తుకొస్తోంది. భారత చైనా యుద్ధం నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ చీలిపోవడం, పిడి చట్టం కింద చైనా వాదులుగా ముద్రపడిన సిపిఎం పోలిట్‌ బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు వేయి మందికి పైగా, అర్థరాత్రి అరెస్ట్ కావడం జరిగింది. అలనాటి కేంద్ర హోం శాఖ మంత్రి గుల్జారిలాల్ నందా పిడి చట్టానికి రూపకర్తంటారు. ఏదేమైనా అప్పుడు అరెస్టు కాబడింది కమ్యూనిస్టులే కాబట్టి, అందునా అతివాద గ్రూపుకు చెందిన (ఇంకా నక్సల్‍బరీ ఉద్యమం రాలేదు) వారు కాబట్టి, పిడి చట్టాన్ని కాని, అరెస్టులను కాని ఖండించిన రాజకీయ పార్టీలు ఒక్కటీ కూడా లేవు. చట్టాన్ని తమ పార్టీ కార్యకర్తలమీద ఉపయోగించలేదన్న సంతృప్తితో వున్నారు వారంతా!

దశాబ్దంన్నర తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన దరిమిలా, అన్ని రాజకీయ పార్టీలకు అరెస్టులు స్వానుభవంలోకొచ్చ్చాయి. అప్పుడు గుర్తుకువచ్చింది వారందరికీ. భారత చైనా యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న సిపిఎం నాయకుల అరెస్టును అప్పుడే ఖండించి వుంటే, తమకీ గతి పట్టి వుండేది కాదని! వాస్తవానికి, ఆ రోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐపై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, ఖమ్మం జిల్లాకు చెందిన అలనాటి పౌరహక్కుల ఉద్యమ ఆద్యులు-"మేధావి త్రయం" గా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు కె.వి.సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణలు చెప్పారు. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించినా, ఇతరులు తమకెందుకులే అని నిర్లిప్తతతో వున్నారు. ఆ నిర్లిప్తత పర్యవసానమే ఎమర్జెన్సీ అరెస్టులు, ఈనాటి తెలంగాణ ఉద్యమ నేతల పిడి అరెస్టులు.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు ("పిడి", "మీసా", "ఎస్మా" లాంటివి) ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో (ఇప్పుడు ఎమర్జెన్సీ కాకపోయినా-తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో) పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జెళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లోనే ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డి. యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.

ఐతే ఎన్ని రకాల పౌరహక్కుల సంఘాలు ఆవిర్భవించినా, ఎన్ని ఉద్యమాలు నడిచినా, జరిగే నష్టం జరుగుతూనే వుంది. పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుందనీ, భవిష్యత్‍లో జరగదన్న నమ్మకం లేదనీ, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే అభిప్రాయపడిందంటే అంతకంటే ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంటుంది? కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే(సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ ఏడాది, జనవరి 2011 మొదటి వారంలో, ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో, అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం . 1976 లో, ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి (ఇందిరాగాంధీ) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009 న, ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రికరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. జబల్పూర్ అదనపు మెజిస్ట్రేట్-శివ కాంత్ శుక్లాల హెబియస్ కార్పస్ కేసు సుప్రీం కోర్టు ముందుకు విచారణకొచ్చింది. తీర్పిచ్చిన ఐదుగురిలో, నలుగురు న్యాయమూర్తులు ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. అదే జరిగిందిప్పుడు.

ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.

అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ నాడు, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యమకారులతో సహా ఎవరి పౌరహక్కుల ఉల్లంఘన జరగడానికి వీలులేదని ఘంటాపథంగా నొక్కి చెప్పాలి. అరెస్టులు ఇంతటితో ఆగిపోవాలి. అరెస్టు ఐన వారి పౌరహక్కులు తక్షణమే పునరుద్ధరించబడాలి.

తెలంగాణ-సమైక్యాంధ్ర అన్న విషయాన్ని కాసే పన్నా మరిచిపోయి, పౌరహక్కుల ఉల్లంఘన జరిగిందని ఎలుగెత్తి చాటడమే మేధావుల (ఆంధ్రా మేధావులతో సహా) కనీస కర్తవ్యం. పౌరహక్కుల కొరకు పోరాడే మీడియా కనీస ధర్మం. End

Wednesday, November 2, 2011

జై తెలంగాణ - జై ఆంధ్ర - జై సమైక్యాంధ్ర : కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి? - వనం జ్వాలా నరసింహారావు

జై తెలంగాణ - జై ఆంధ్ర - జై సమైక్యాంధ్ర :

కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణి?

సూర్య దినపత్రిక (4-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ పై సిపిఎం అస్పష్ట వైఖరి; పార్టీలో సహజమైన మిలిటెన్సీ లోపించడమే కారణమా?; సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామన్న ప్రకటనకే పరిమితం; సిపిఎం గతాన్ని మరచిందా?; ఆందోళన చెందుతున్న అసలైన మార్క్సిస్టులు; ఎవరిని సంతోషపెట్టడానికి ఇదంతా అనే అనుమానాలు - ఎడిటర్ సూర్య (4-11-2011)


1930వ దశకంలోనే భారత దేశాన్ని భాషా ప్రాతిపదికన పునర్విభజించి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, జాతీయోద్యమం తీర్మానించింది. దక్షినాదిన, విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహా కర్నాటక, బృహన్మహారాష్ట్రలు ఏర్పాటు చేయాలనీ, అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా భావించింది. ఆ ఆలోచనతోనే, 1946లో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య, "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న పేరుతో ఒక పుస్తకం రాశారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరిచే అనేక సూచనలు ఆ పుస్తకంలో ఆయన చేశారు. 1946లో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో తెలంగాణా జిల్లాల నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు నరసింహా రెడ్డి, భీమిరెడ్డి నరసింహా రెడ్డి, ఆరుట్ల దంపతులతో పాటు, ఆంధ్ర జిల్లాల నుండి సుందరయ్య, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, లావు బాల గంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి తదితర నాయకులతో సహా వేలాదిమంది ఇరు ప్రాంతాల కార్యకర్తలు భుజం-భుజం కలిపి 1951 వరకు వీరోచిత పోరాటం చేశారు. నాలుగువేల మందికి పైగా ప్రాణాలను అర్పించారు. సెప్టెంబర్ 17, 1948 న నిజాం హైదరాబాద్ రాష్ట్రం - హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం, 1953లో భాషా ప్రాతిపదికన విభజన జరగడం, 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడం తెలియని వారెవరూ లేరు.

1953లో తెలంగాణ కోసం కొందరు గొంతు విప్పిన నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ "సమైక్యాంధ్ర సదస్సు" ను ఏర్పాటు చేసి, దానికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ సదస్సుకు శ్రీశ్రీ ప్రధాన ఆకర్షణ. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైంది. ఖమ్మం లో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహారదీక్షకు పూనుకోవడం ఉద్యమానికి నాందిగా చెపుతారు. అతని కుటుంబం వెంగళరావుకు అనుచర వర్గమన్నది అప్పట్లో అందరికీ తెలిసిన వాస్తవం. ఉద్యమానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. హైదరాబాద్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమం గ్రామ సీమల్లోకి పాకక పోయినా, నగర - పట్టణ ప్రాంతాలలో విద్యావంతులను ఆకట్టుకుంది. నగరంలో విధ్వంసం చోటు చేసుకుంది. ఆంధ్ర జిల్లాల వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లు కూడా మార్చుకున్న ఉదంతాలున్నాయి. హైదరాబాద్ నగర గోడలపై ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై, ఆయన భార్యపై అశ్లీల రాతలు వెలిశాయి.

ఖమ్మంలో జులై నెల 6, 1969న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) - సిపిఎం ఆధ్వర్యాన సమైక్యతా సభ జరిగింది. నాటి మునిసిపల్ చైర్మన్ స్వర్గీయ చిర్రావూరి లక్ష్మీనరసయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ సభలో, శ్రీ శ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్య, గోరా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావు, నాటి సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, సమైక్యతను సమర్థిస్తూ ఉపన్యసించారు. సదస్సు తరువాత, సాయంత్రం నాలుగు గంటలకు మూడువేల మందితో ఊరేగింపు మొదలైంది. ఊరేగింపును అడ్డుకున్న వారికి బి.ఎన్. నాయకత్వాన ఎర్ర జెండా కర్రతో దుండగులను తరిమి కొట్టిన సంగతి అప్పట్లో పలువురి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలోని మొత్తం జిల్లాలలో సమైక్యత కోసం సిపిఎం చేసిన మొదటి ప్రయత్నం ఇది. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా సమైక్యతా వాద సదస్సులు జరిగాయి.

సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెపుతూ, ప్రజలలో అవగాహన కలిగించడానికి సిపిఎం అనేక కరపత్రాలను వేసిందా రోజుల్లో. సిపిఎం నాయకుడు స్వర్గీయ మోటూరి హనుమంతరావు అనేక వివరాలతో రాసిన "విశాలాంధ్రలో విషాదచ్ఛాయలు" పుస్తకం వేల కాపీలు రాష్ట్రం మొత్తం పంచబడింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా పార్టీ ఆధ్వర్యాన సదస్సులు, సభలు జరిగాయి. 1973 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర జిల్లాలలో "జై ఆంధ్ర ఉద్యమం" ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలోను, మార్క్సిస్టు పార్టీ దానికి వ్యతిరేకంగా తిరిగి పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం వెలువరించింది. సభలు నిర్వహించింది. ఆ సభలకు నాటి కృష్ణా జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి మానికొండ సుబ్బారావు, ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (మాజీ రాజ్యసభ సభ్యుడు) ఉపన్యాసకులుగా వెళ్లారు. ఆ సందర్భంలో కృష్ణా జిల్లా జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు (1983-1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రి), వారి శిష్య గణం సభా ప్రాంగణం చుట్టూ రాళ్లు పేర్చుకుని తెలంగాణ ప్రతినిధి డాక్టర్ యలమంచిలి ప్రసంగిస్తుండగా రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. బందోబస్తులో వున్న పోలీసు బృందం తగు రక్షణలు కలిగించింది. ప్రత్యేక వాదం ఉద్యమాలపట్ల, ఆ నాడు భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ తీసుకున్న క్రియాశీల వైఖరికి ఇవి కొన్ని ఉదాహరణలు.

2001-2010 మధ్య సాగిన - తరువాత సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎడల పార్టీ వైఖరికి, 1969-73 మధ్య తీసుకున్న వైఖరికి చాలా తేడా కనిపిస్తుంది. ఈ వైఖరికి బహుశా కారణం, ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో పెద్ద ఎత్తున లేకపోవడమైనా కావచ్చు, లేదా, అది కేవలం మాటల యుద్ధంగా వుండడం వల్ల కావచ్చు, లేక వివిధ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ 2004 లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడం వల్ల కావచ్చు, తిరిగి 2009 ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితితో కూడిన గ్రాండ్ అలయెన్స్ లో భాగస్వామి కావడం వల్ల కావచ్చు. ఏదేమైనా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించింది. 2004 లో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సిపిఎం ఎందుకు ప్రాతినిధ్యం నిరాకరించింది? తాము సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం వరకే ఎందుకు పరిమితం అవుతోంది? కొంత మంది నాయకులు "తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే శక్తి లేదనీ" అనడం భావ్యమేనా? బాధ్యత కాంగ్రెస్ ది కాగా తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేయడం "తమ పార్టీ భుజాన తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం తప్పు" అనడం సిపిఎంకు సమంజసమేనా? చివరకు "కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే మేం వద్దన్నామా?" అనడం, "మేం వ్యతిరేకించమనీ" ఇచ్చే ప్రకటనలు తప్పు దోవ పట్టించే విగా లేవా? మార్క్సిస్టు పార్టీయే తరులు - అటు తెలంగాణ ప్రాంతం వారైనా, ఇటు ఆంధ్ర ప్రాంతం వారైనా - అపహాస్యం చేసే పరిస్థితికి సిపిఎం చేరుకోవడం అసలుసిసలైన మార్క్సిస్టులను ఆందోళనకు గురిచేస్తుందనక తప్పదు. ఎందుకీ అస్పష్ట వైఖరి? ఎవరిని సంతోషపెట్టడానికి ఇదంతా? ఇటీవల కాలంలో ఆ పార్టీకి సహజమైన "మిలిటెన్సీ" కూడా లోపించిందనక తప్పదు.

ఈ అంశాన్ని ఒకరిద్దరు ప్రముఖ మార్క్సిస్టు నాయకుల దగ్గర ప్రస్తావించినప్పుడు సైద్ధాంతిక కోణంలో సమాధానాలు కొంత మేరకు లభించినా, సంతృప్తికరంగా లేవనే అనాలి. 2011 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సమర్థన అస్తిత్వం వుందన్నారు కొందరు సిపిఎం నాయకులు. ప్రాంతీయ అస్తిత్వ వాదం అనీ, ఈ సిద్ధాంతానికి మూలాలు పోస్టు మోడర్నిజంలో వున్నాయనీ, విజ్ఞులందరికీ తెలుసు. పోస్టు మోడర్నిజం అనేది సైద్ధాంతికంగా "యాంటీ మార్క్సియన్" అని చాలామందికి తెలుసు. ఇది ప్రాంతీయ కుల-జెండర్ వాదాలకు దారితీస్తుంది. ఈ నేపధ్యంలో ఆంగ్ల భాషలో వచ్చే మార్క్సిస్టు త్రైమాసిక పత్రికలో రెండు చక్కటి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఒకటి ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి ఇంతియాజ్ అహ్మద్ రాసిన ఇరవై పేజీల విపులమైన వ్యాసం. అదే సంచికలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వ్యాసం కూడా ఆ అంశంపైనే వుందన్నారు. ఆ రెండు వ్యాసాలు, ప్రస్తుత వేర్పాటు ఉద్యమ వాతావరణంలో, వామపక్ష ఆలోచనలు వున్నవారికి ఉపయోగకరంగా వుంటాయి. సమైక్యత నినాదానికి కట్టుబడే వుంటే, సిపిఎం వాటిని తెలుగులోకి అనువదించి, ప్రచారంలోకి తీసుకురావడంలో ఎందుకు వెనుకాడుతున్నదో అర్థం కావడం లేదని కూడా కొందరు సిపిఎం నాయకులు అభిప్రాయపడ్డారు.

"ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐదీ, సిపిఐ (న్యూ డెమాక్రసీ)దీ అత్యుత్సాహంగా వుంటే, మాది నిరుత్సాహంగా, నిర్లిప్తంగా వున్నట్లు తోస్తుంది” అని ముగించారు సిపిఎం పార్టీకి చెందిన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు.

అసలింతకీ మనముందున్న సమస్య, కేవలం సమైక్యమా? విభజనా? లేక మరింత లోతుగా పరిశీలించ వచ్చా? తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇది జాతుల, అంతర్జాతీయాల సమస్యను రంగంమీద కి తెస్తోంది. జాతి అంటే ఒక స్పష్టమైన అవగాహన లేకుండానే ఏ ప్రాంతానికి బడితే ఆ ప్రాంతానికి జాతి అనే ముద్ర తగిలించేవాళ్లున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వాళ్లూ-మద్దతిచ్చిన వాళ్లూ వున్నారు. అంతర్జాతీయ పౌభాతృత్వం పేరిట అనలు జాతుల ఉనికినే ప్రశ్నించేవారూ వున్నారు. రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఒకే భాష వుంటేమాత్రం రెండు గాని అంతకుమించి సంఖ్యలోగాని రాష్ట్రాలుంటే నష్టమేమిటని, తప్పేంటి? అని ప్రశ్నించేవారూ వున్నారు. వివిధ భాషలు గల ప్రాంతాలను ఒకే ఉమ్మడి రాష్ట్రంగా, ఇంగ్లీషు వాళ్లకాలంలోవలె చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందని సవాలు చేసేవారూ లేకపోలేదు. అందుకే జాతి అంటే ఏమిటన్న విషయంలో, అదీ మార్క్సిస్టు ఆలోచనా ధోరణితో, కొంత స్పష్టమైన అవగాహనకు రావడం సమస్యను అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుందేమో!

మన దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అవి కేవలం పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే ఏర్పడినవిగావు. భాషా ప్రయుక్తంగా ఏర్పడినవి. పేరుకు భాషా ప్రయుక్తం అంటున్నా నిజానికి అవి వివిధ జాతులు గానూ కూడా వున్నాయి. భారతదేశం (అంటే "ఇండియన్ యూనియన్") ఒక్కటే అయినా అది వివిధ జాతుల కూటమి కూడాను. ఈ జాతుల సమైక్యతే మన దేశపు ఏకత్వాన్ని, ఔన్నత్యాన్నీ కాపాడుతుంది. ప్రపంచంలో ఏక జాతి దేశాలూ వున్నాయి. బహుళ జాతి దేశాలూవున్నాయి. చైనా, ఇండియా వంటివి బహుళ జాతి దేశాలు. సకల జాతి, సకల దేశ సమైక్యతే విశ్వ మానవ కళ్యాణానికి దోహదం చేస్తుంది. అది కేవలం భౌగోళికంగా సమైక్యంగా వుండాలని లేదు. ఒక మనిషి వేరొకమనిషినీ, ఒక జాతి వేరొక జాతినీ దోపిడీ చేయడం అంతమవ్వాలి. అందుకు ఆర్ధిక వ్యత్యాసాలూ జాతి విచక్షణలూ పోవాలి. అప్పుడు వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది. సోషలిస్టు వ్యవస్థే వర్గ రహిత సమాజాన్ని తీర్చిదిద్దగలదు. కాని అది మనదేశంలో జరగడం లేదే? జరిగే సూచనలు కూడా లేవే?

సమైక్యత అనేది సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యం గనుక ఈలోగా ఏ జాతీ ఒక్కటి గా వుండవలసిన అవసరంలేదని కానీ, వుండి తీరాలని కానీ, ఎన్ని ముక్కలుగా చీల్చినా పరవాలేదని కానీ, అసలు విభజన ఆలోచనే తప్పనీ, ఎవరికి నచ్చిన భాష్యం వారు చెప్పడం సరైంది కాదు. ఇవన్నీ దారితప్పిన వాదనలు తప్ప మార్క్సిస్టు వాదనలు కనే కావు. ఒక జాతిగా వున్న వాళ్లు అవకాశమున్న చోట ఒకే రాష్ట్రంలో వుండటం ఎంత మంచిదో-అదెంత జాతి అభివృద్ధికి దోహద కారి అవుతుందో, అదే విధంగా అవసరమైతే-ప్రజలు కోరుకుంటే, ఒక జాతి విభిన్న భాగాలుగా చీలడం, విభిన్న జాతులకు చెందిన భాగాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం అంతే దోహద కారి అవుతుంది.

జాతి అన్న దానికి సరైన నిర్వచనాన్ని లెనిన్ - స్టాలిన్ లు ఇచ్చారు. “ఒకే భాష, ఒకే భూభాగం, ఒకే ఆర్ధిక వ్యవస్థ ఒకే సాంఘిక సంస్కృతీ సముదాయంగా గలదీ, స్థిరమైన సమాజంగా చారిత్రక పరిణామం పొందినదీ ఒక జాతిగా పరిగణించబడుతుంది”. చైనా, ఇండియా లాంటి దేశాల్లో వున్న వారంతా ఒకే జాతి వారా? భాష ఒకటే అయినా ఒకే దేశంలో వున్న వారందరూ ఒక జాతి వారు కాజాలరు. ఇంగ్లండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇంగ్లీషు భాషే మాతృ భాషగా వున్నది. అయినా వారంతా విభిన్న జాతులుగా రూపొందారు. ఇంగ్లండు, ఐర్లాండు లలో మాట్లాడేది ఒకే భాష. సన్నిహిత భూ భాగంకూడా వున్నది. అయినా అవి రెండూ రెండు జాతులుగా పరిణామం చెందాయి. ఆలాగే కెనడా, అమెరికాలు సన్నిహితంగా వున్నా ఒకే జాతిగా పెంపొందలేదు. అందుకనే భాష, భూభాగం, సంస్కృతీ, చరిత్రా, ఆర్ధిక వ్యవస్థ, స్థిరమైన మనుగడ వంటి లక్షణాలన్నీ కలిసి వుంటేనే సమైక్యత సాధ్యమవతుందేమో! సాధ్యంకాకపోవడానికీ అవకాశాలున్నాయి కూడా!

ఈ లక్షణాలన్నీ తెలుగు జాతి కలిగివుందా? సమాధానం "అవును" కావచ్చు, "కాదు" కావచ్చు. పూర్తి ఫ్యూడల్ వ్యవస్థలో, ఉర్దూ భాష పెత్తనం క్రింద కొన్నేళ్లు తెలంగాణా నలిగింది. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీషు భాష పెత్తనం క్రింద కొంత పెట్టుబడి దారీ ప్రభావంలో ఆంధ్ర ప్రాంతం కొన్నేళ్లు నడిచింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నేపధ్యంలో విశాలాంధ్రగా ఏర్పడ్డాయి. విడివిడిగా, కలిమిడిగా దేని అస్తిత్వం దానికే వుంది. మరిప్పుడు కలిసున్నా, విడిపోయినా లాభనష్టాలు ఒకటేగా? ఒకరు విడిపోతా మన్నప్పుడు మరొకరికి అభ్యంతరం ఎందుకుండాలి? సమాధానం దొరకని ప్రశ్నలు.

కమ్యూనిస్టు పార్టీలలో సగ భాగం కలిసి వుండాలంటుంటే, మరో సగ భాగం విడిపోవాలని ఉద్యమిస్తున్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పిన సూక్తులు ఎవరికి వర్తిస్తా యో వారే తేల్చాలి! END