తీపి గుర్తులు - చేదు అనుభవాలు: Part-2
యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి
అనుభవాలను-జ్ఞాపకాలను గ్రంధస్థం చేసిన నేపధ్యం
వనం జ్వాలా నరసింహారావు
కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధనస్వామ్య వ్యవస్థ" కు వ్యతిరేకంగా శ్రామిక వర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందని-ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని జోస్యం చెప్పాడు. సోవియట్, చైనా దేశాల్లో శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేంతవరకు చాలావరకు ఆయన చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాత కారణాలేవైనా, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ సిద్ధాంతపరమైన అధికారానికి దూరమైంది. చైనాలో కొనసాగుతున్న కమ్యూనిజం, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు అదనంగా మావో ఆలోచనా విధానం చేర్చింది.
భారత దేశంలోని (ఉమ్మడి) కమ్యూనిస్టులు సోవియట్-చైనా భావాలకు అనుకూల-ప్రతికూల-మధ్యేవాద మార్గంలో ప్రస్థానం మొదలెట్టి, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా పయనించడం జరిగింది. సిద్ధాంతపరంగా ఉమ్మడి పార్టీలో మొదలైన చీలిక, దరిమిలా, పేరుకే సిద్ధాంతపరంగా మారి, మితవాద-అతివాద-తీవ్రవాద-భావాలలో ముక్క చెక్కలైంది. పార్లమెంటరీ పంథా కోరుకున్న వర్గాలు ఏదో ఒక జాతీయ-ప్రాంతీయ పార్టీతో ఎన్నికల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని, అర-కొర స్థానాలను చట్టసభల్లో సంపాదించుకోవడంతో సరిపుచ్చుకుంటున్నాయి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజల సమస్యలకు దూరమై, ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి దిగిపోయారు. చివరకు పరిస్థితి ఎలా మారిందో అంచనా వేయడానికి ఉదాహరణలుగా సీపీఐ నాయకుల దైవ దర్శనాలు, సీపీఎం నాయకుల దిద్దుబాటు చర్యల చొరవలు, చెప్పుకోవాల్సి వచ్చింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది సీపీఎం.
దిద్దుబాటు ప్రక్రియను పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంతో ఆరంభించి, జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో సిపిఎం కేంద్ర కమిటీ తీర్మానించింది. ఆ నిర్ణయం అమలుకు సంబంధించిన సమాచారం లేదు. సీపీఎం పార్టీలో అవకాశవాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్రప్రదేశ్‍లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవనశైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.
కార్ల్ మార్క్స్ లాంటి మహా-మహానుభావులు, కారణజన్ములు, ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధనస్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒక వైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశదపర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు.
హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగస్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.
ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూలదోసి, శ్రామిక రాజ్యస్థాపన, వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తోంది.
ఈ నేపధ్యంలో, ఇప్పటికీ, అలనాడు మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, గత పాతికేళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను నెరవేరుస్తున్న ఎనభై రెండేళ్ల కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ తలపెట్టిన "దిద్దుబాటు" కార్యక్రమంలో భాగంగా స్పందించని వారు తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే మరి.
తీపి గుర్తులు - చేదు అనుభవాలు
గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగనివాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కలవాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించిన "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి. "సహస్ర చంద్ర దర్శనం" చేసుకున్న ఆయనను గురించి తెలిసిన వారు-తెలియని వారు, తెలుసుకోవాల్సిన విషయాలెన్నో... ఎన్నెన్నో! (కాకపోతే, ఆయన్నీ విషయం గురించి అడిగినప్పుడు: "ఎన్ని వేల పూర్ణ చంద్ర బింబాలను చూశామన్నది కాదు: ఎన్ని వందల, వేల బ్రతుకుల్లో వెలుగులు నింపామన్నది ముఖ్యం" అని అన్నారు). "వైఆర్‍కె"గా, "డాక్టర్ గారు"గా అందరూ పిలిచే ఈ మనిషి చిన్నతనం నుండే నిరీశ్వరవాది. గోరా ప్రభావంతో హేతువాదం కూడా జోడైంది ఆయనలో. సహధర్మచారిణి కూడా, ఆయన బాటలోనే, వివాహమైన కొద్ది కాలంలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. ముగ్గురు పిల్లలకూ ఆయన అలవాట్లే అబ్బాయి. ఇంటికొకరు అన్నట్లు, పెద్ద కోడలు మాత్రం మంచి భక్తురాలైంది. అయితే, సాహిత్యాభిలాషైన వైఆర్‍కె పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.
1985లో పార్టీ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ వైఆర్కె, పాతికేళ్లు సీపీఎం రాష్ట్ర కమిటీలో, కార్యదర్శి వర్గంలో వున్నప్పటికీ, ఎన్నడూ ఆర్థికపరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండుసార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. 1996 ఫిబ్రవరి నెలలో హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు, మోటూరు హనుమంతరావు విజయవాడ నుంచి ఫోన్ చేశారు రాధాకృష్ణమూర్తిగారికి. తెలుగు దేశం పార్టీతో అప్పట్లో వున్న అవగాహన ప్రకారం సీపీఎం కు కేటాయించే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రతిపాదించనున్నందున, దానికి ఆయన అంగీకారం తెలపాల్సిందిగా కోరారు మోటూరి. తనకెందుకన్న వైఆర్‍కెతో, "రాజ్యసభకు పంపుతామంటే వద్దంటారేంటి" అని ప్రశ్నించారాయన. చివరకు భార్యా పిల్లలను సంప్రదించి, సంకోచంగానే సమ్మతి తెలియ చేశారు డాక్టర్.
రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడంతో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 1985 కు పూర్వం, అదీ సభ్యత్వం తీసుకోక ముందు, డాక్టర్ గారు సంపాదించిన ఆస్తిని ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరు కుమారులకు బదిలీ చేసి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారాయన. పిల్లలు సమకూర్చిన పైకంతో ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడుపుతున్న ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే!.
ఈ నేపధ్యంలో, అనేకానేక విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసి, అలవోకగా ఆచరణలో చేసి చూపించి, పలువురికి ఆదర్శప్రాయుడైన యలమంచిలికి వృత్తిపరమైన స్నేహితులు, ప్రవృత్తిపరమైన మితృలు, పార్టీపరమైన అభిమానులు, రాగద్వేషాలకు అతీతంగా నడచుకునే వ్యక్తిగా గుర్తించి రాజకీయాలతో సంబంధం లేకుండా గౌరవించే పలువురు, ఆయన అనుభవాలను-జ్ఞాపకాలను గ్రంధస్థం చేయమని అడుగుతుంటారు. ఆయనకు అలా చేయాలని వున్నా, రాసే సాహసం చేయలేదు చాలా కాలం వరకు. తన జీవితం గ్రంధస్థం చేసి, ఇతరులతో చదివించేటంత గొప్పదేమీ కాదని ఆయన భావన. ఒక వేళ తాను కాగితం మీద పెట్టగలిగినా, వాస్తవాలను జరిగినవి జరిగినట్లు చెప్పగలనా అన్న సందేహం కూడా ఆయనలో వుండేది. తానెన్నో-ఎంతమందివో జీవిత చరిత్రలు చదివానని, అందులో ఎన్ని, నిష్పక్షపాతంగా-తటస్థంగా-వాస్తవిక దృక్ఫదంతో వున్నవో చెప్పజాలనని అనేవారు. గాంధీ లాంటి వారి జీవిత చరిత్రలే విమర్శలకు లోనైనప్పుడు, యలమంచిలి లాంటి వారివి, చదువరులు సానుకూలంగా విశ్లేషిస్తారో, వ్యతిరేకంగా విమర్శిస్తారో చెప్పడం కష్టమైనా, ఆయన అనుభవాలు పదిమంది తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా వుంది. అందుకే ఆయనను కదిలించాను. ఆయనలోని అధ్యయనం, ఆదర్శం, సేవా దృక్ఫధం, వృత్తి, ప్రవృత్తి, స్నేహ భావం, ఇతరులపై అభిమానం నన్ను కాదన లేకపోయాయి. నా వెంట వున్న బాబాయి, ఆయన అభిమాని వనం నరసింగరావు ప్రేరణ మా ప్రయత్నానికి ఊతమిచ్చాయి. ఫలితంగా డాక్టర్‍గారి అనుభవాలను, జ్ఞాపకాలను పదిమందితో పంచుకునే వీలు ఇలా కలిగింది.
మరి, నాకెందుకీ ఆలోచన కలిగిందన్న ప్రశ్న వేసుకుంటే, మొదటగా చెప్పాల్సిన సమాధానం, బహుశా అనుకోకుండా వచ్చిందనడం సమంజసమేమో! అలా వరుస వెంట సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే, కారణాలు చాలానే వున్నాయి. ఆ కారణాల పర్యవసానమే, ఆయన జీవన యానం గ్రంధస్థం చేయాలన్న ఆలోచనకు పునాది.
నేను పుట్టి బాల్యంలో పెరిగింది, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, వనంవారి కృష్ణా పురం (ముత్తారం రెవెన్యూ గ్రామం). హైస్కూల్, కాలేజీ ఆరంభ చదువు ఖమ్మం పట్టణంలో. వ్యవసాయం, కరిణీకం వృత్తిగా పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యంకూడా లేని ఆ కుగ్రామంలో నివసిస్తుండే, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజుల్లో పుట్టాను. కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రం కూడా భారత దేశంలో విలీనం కావడంతో మా కుటుంబం సొంత గ్రామానికి తిరిగొచ్చింది. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. అయిదో తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నాను.
మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, బాల్యంలో నా వరకు నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ-కరిణీకం చేస్తున్న అమ్మ పేట గ్రామ పెద్దలతో నూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని-నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మ పేట-ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్నగారు చెప్తే తెలుసుకున్నాను-కొన్ని స్వయంగా చూసాను.
సాహిత్యానికీ-మానవ విలువలకూ, ఛాందసత్వానికీ-కమ్యూనిజానికీ విడదీయని అనుబంధం వుందనొచ్చు. పుట్టి-పెరిగిన గ్రామ పరిసరాల భౌగోళిక-చారిత్రక నేపథ్యంలో, సాహిత్యం గురించి-మానవ విలువల గురించి, కొన్ని ప్రాథమిక పాఠాలను-మౌలికాంశాలను అనుభవంతో నేర్చుకున్నాను. మా నాన్నగారు, బాల్యంలో నాకు నేర్పిన తొలి పాఠాలలో, చెరిపినా చెరగని నమ్మకాలున్నాయి. అందులో ఎన్నో గుడ్డి నమ్మకాలూ వున్నాయి. నాన్నగారు చదివింది ఆరో తరగతి వరకే అయినా, జీవితం నేర్పిన అనుభవంతో, పురాణాలనుండి-ఇతిహాసాలనుండి-భారత,భాగవత, రామాయణాలనుండి-వర్తమాన చారిత్రక గాధలనుండి-ఆయన పెరిగిన నైజాం నవాబుల పరిపాలనా నేపధ్యం నుండి, ఎన్నో విషయాలను నాకు చెప్పేవారు. మానవ విలువలకు మారుపేరైన బుద్ధుడు, ఆరునూరైనా అసత్యమాడని యుధిష్టరుడు, స్వధర్మ నిర్వహణే తన విధి అని తలచిన శ్రీరామచంద్రమూర్తి, కర్తవ్య బోధన చేసిన శ్రీకృష్ణుడు, అహింసే తన మతమన్న గాంధీ మహాత్ముడు, నాన్న గారు చెప్పిన పాఠాల్లో నాకు తరచుగా వినిపించిన పేర్లు. బాల్యంలోనే, "కర్మ సిద్ధాంతం" అంటే కొంచం-కొంచం అర్థం చేసుకున్నాను.
హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన గతితార్కిక భౌతికవాద కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను. ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం" చిన్నతనంలోనే కొంత మేరకు అవగాహనకొచ్చిందంటే అతిశయోక్తి కాదేమో!.
నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధనస్వామ్య వ్యవస్థ"కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ-ముందున్న వ్యవస్థ కూలిపోతుందనీ, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనీ, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగిన దానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్, థీసిస్, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనొచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో-వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం-అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా.
కుగ్రామమైన మా వూళ్లో హైస్కూల్ చదువుకు అవకాశం లేకపోవడంతో, ఖమ్మం రికాబ్-బజార్ హైస్కూల్లో చేరాను. బహుశా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు సొంత ఇంటికి మారిన సంవత్సరానికి ఒక రెండేళ్ల ముందర, నేను ఖమ్మం చదువుకు వచ్చి వుండవచ్చు. వారు ఇప్పుడున్న ఆసుపత్రికి మారిన మరుసటి సంవత్సరం హెచ్.ఎస్.సీ పూర్తి చేశాను. పియుసి చదువుతుండగా, కాలేజీకి (అప్పట్లో ఎస్. ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ కళాశాల) ప్రతిరోజూ డాక్టర్‍గారి ఆసుపత్రి పక్కనుంచే వెళ్లే వాళ్లం. అలా వారి గురించి వినడం మొదలైంది. ఆ మాటకొస్తే, మా నాన్నగారు డాక్టర్‍గారి గురించి చాలా సార్లు చెప్పేవారు. మా గ్రామం పటేల్ తుల్లూరి రామయ్య (మా వూళ్లో మా ఇంటికి ఎదురుగానే వాళ్ల ఇల్లు) కుటుంబానికి ఫామిలీ డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారే. రామయ్య జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే వున్నప్పటికీ, కమ్యూనిస్ట్ డాక్టర్‍గారి దగ్గరే వైద్యం చేయించుకునే వారు. ఆయనే కాదు, మా చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది డాక్టర్‍గారి దగ్గరే వైద్యానికి వెళ్లేవారు. అలా కూడా వై.ఆర్.కెగారి గురించి కొంత తెలుసు నాకు.
నేను కాలేజీలో పియుసి చదువుతున్న సంవత్సరమే భారత-చైనా యుద్ధం వచ్చింది. "చైనా దురాక్రమణ"ను నిరసిస్తూ కాలేజీ విద్యార్థుల వూరేగింపు జరిగింది. ఐతే, ఊరేగింపులో "కమ్యూనిస్ట్ పార్టీకి" వ్యతిరేకంగా నినాదాలు చేయరాదని ఒక అంగీకారం కుదిరింది. అప్పుడు కాలేజీ విద్యార్థి సంఘం కార్యదర్శి ఖాదర్ అలీ, ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్నాడు. డాక్టర్‍గారింటి దగ్గరికి ఊరేగింపు చేరబోతున్న సమయంలో ఖాదర్ అలీ వ్యతిరేక గ్రూప్‍కు చెందిన కొందరు విద్యార్థులు "కమ్యూనిస్ట్ చైనా దురాక్రమణ"ను ఖండిస్తున్నాం ఆంటూ నినాదాలు చేయడానికి పూనుకోవడం, కొంత ఘర్షణ తరువాత వారు విరమించుకోవడం జరిగిన విషయం నాకింకా గుర్తుంది. బాబాయి వనం నరసింగరావు కాలేజీలో (ఎన్నడూ పోటీ చేయని "కింగ్ మేకర్" లాంటి నాయకుడు) బి.ఎస్.సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడప్పుడు. అప్పటికే ఆయన కాలేజీలోని కమ్యూనిస్ట్ అనుకూల విద్యార్థి సంఘం నాయకులలో ప్రముఖుడు. అలా డాక్టర్ గారి గురించి మరింత తెలుసు అప్పటికే. అలా క్రమేపీ, డాక్టర్‍గారి మార్క్సిస్ట్ ఫోరం, ఇతర రాజకీయ పాఠాల వ్యవహారం కొంత తెలుసుకునే అవకాశం కలిగినప్పటికీ, మా నాన్నగారి భయం (ఆయనకు రాజకీయాలంటే గిట్టదు) వల్ల, ఎక్కువగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొన లేకపోయే వాడిని. ఆ తరువాత డిగ్రీ చదువుకు హైదరాబాద్ వెళ్లడం జరిగింది. పూర్తైన తరువాత రెండు-మూడేళ్లు మా వూళ్లో వుండాల్సిన పరిస్థితులు కలిగాయి. ఆ మూడేళ్లు మా గ్రామంలో, వనం నరసింగరావు స్ఫూర్తితో కమ్యూనిస్ట్ రాజకీయాలలో, ఒక విధంగా చెప్పాలంటే, చాలా చురుగ్గా పాల్గొన్నాననే అనాలి. మా గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయకుండా (నాకింకా అప్పటికి ఓటింగ్ వయసు రాలేదు), మొట్ట మొదటిసారిగా, మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా, కాంగ్రేసేతర అభ్యర్థిని సర్పంచ్ చేయగలిగాం. ఆ రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాలలోని పలువురు కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయాలు, వారి ద్వారా డాక్టర్‍గారిని గురించి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
మూడేళ్ల విరామం తరువాత, 1969-1971 లో (అప్పట్లో చోటు చేసుకున్నా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కారణంగా) నాగ్‍పూర్ విశ్వవిద్యాలయంలో ఎం. ఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివేందుకు వెళ్లాను. అక్కడ వున్న రెండేళ్లలో ఎక్కువ భాగం లైబ్రరీలో గడిపేవాడిని. కమ్యూనిజం, మార్క్సిజం, పెట్టుబడికి సంబంధించిన సాహిత్యం చదివాను. కమ్యూనిజం అన్నా, ఆ పార్టీకి చెందినవారన్నా, ఒక రకమైన గౌరవ భావం పెరిగింది. ఎం.ఏ పాసై తిరిగి ఖమ్మం వచ్చి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, గ్రామ రాజకీయాలతో, జిల్లా కమ్యూనిస్ట్ నాయకులతో సంబంధాలు-పరిచయాలు కొనసాగిస్తూనే వుండేవాడిని. కాకపోతే, డాక్టర్ గారిని నేరుగా కలిసే అవకాశం ఎక్కువగా కలగలేదు. నేనూ ప్రయత్నం చేయలేదు. ప్రత్యేకమైన కారణమంటూ ఏదీ లేదు. ఇక ఆ తరువాత హైదరాబాద్ ఉద్యోగరీత్యా వెళ్లడం గత నాలుగు దశాబ్దాలుగా అక్కడే వుంటున్నప్పటికీ, జిల్లాతో-గ్రామంతో రాజకీయ-రాజకీయేతర పరిచయాలు కొనసాగించుకుంటూనే వున్నాను. ఎక్కడ వున్నా, ఏ ఉద్యోగం చేసినా, చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి (డాక్టర్ మర్రి చెన్నారెడ్డి) కి పౌర సంబంధాల అధికారిగా పనిచేసినా, గవర్నర్ (ఆమె వున్నంత కాలం రాజ్‍భవన్‍ను "గాంధీభవన్" అని అనేవారు) కుముద్ బెన్ జోషి దగ్గర ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసినా, కమ్యూనిస్ట్ నాయకులతో (ముఖ్యంగా మార్క్సిస్టు) పరిచయాలు కొనసాగుతూనే వుండేవి. ఆ క్రమంలోనే, డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారి పౌర హక్కుల ఉద్యమం, వారు జైలుకు వెళ్లడం, ఎన్నికలలో పోటీ చేయడం, రాజ్య సభ సభ్యులు కావడం లాంటివి ఆసక్తిగా గమనిస్తూనే వుండేవాడిని. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు, పౌర హక్కుల గురించి ఒక శిక్షణా కార్యక్రమానికి డాక్టర్‍గారిని ఆహ్వానించాను కూడా. వారు రావడం కుదరలేదప్పుడు.
అలా నాకు ఖమ్మం జిల్లాలో బాగా పరిచయమున్న కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) నాయకులలో మంచికంటి రాంకిషన్‍రావుగారు, కె.ఎల్.నరసింహారావుగారు, పర్సాగారు, రావెళ్ల సత్యంగారు, గండ్లూరి కిషన్‍రావుగారు, చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారు, బోడేపూడి వెంకటేశ్వరరావుగారు, తమ్మినేని వీరభద్రంగారు, మరి కొందరున్నారు. సిపిఐ నాయకులు రజబ్ అలీతో, పువ్వాడ నాగేశ్వరరావుగారితో కూడా మంచి పరిచయమే వుంది. రాష్ట్రస్థాయిలో కూడా పరిచయాలున్నాయి. పుచ్చలపల్లి సుందరయ్యగారిని, మోటూరు హనుమంతరావుగారిని, లావు బాలగంగాధరరావుగారిని, మాకినేని బసవపున్నయ్యగారిని, అలాంటి మరికొందరు ప్రముఖ నాయకులను కలిసి మాట్లాడే అవకాశం కలిగింది. జాతీయ స్థాయి నాయకులైన ఏ.కె.గోపాలన్‍గారిని కలిసానొక సారి. ప్రకాశ్‍కరత్‍గారి తోనూ సంభాషించాను. ఇటీవల కాలంలో ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు డాక్టర్ విఠల్‍గారితో చాలా సార్లు అభిప్రాయాలు మార్చుకునే అవకాశం కలిగింది. పశ్చిమ బెంగాల్, బర్ద్వాన్ జిల్లా, బోర్సల్ లో 1969లో జరిగిన. అఖిల భారత కిసాన్ మహా సభలకు వెళ్ళే అవకాశం కూడా కలిగింది. హరే కృష్ణ కోనార్, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‍ల ఉపన్యాసాలు విన్నానక్కడ. సిపిఐ జాతీయ స్థాయి నాయకుడు శ్రీపాద అమృత డాంగే అంటే చాలా అభిమానం. మొహిత్ సేన్‍గారితో బాగా పరిచయం పెంచుకున్నాను ఒకానొక రోజుల్లో. ఢిల్లీలోని ఆయన నివాసానికి కూడా వెళ్లాను. నేను నిర్వహించిన ఒక సభలో ఆయనతో ప్రధానోపన్యాసం ఇప్పించాను.
ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత, ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, గతంలో కంటే కొంచెం ఎక్కువగా తీరు బడి లభించడం మొదలైంది. లోగడ కంటే ఎక్కువ సార్లు ఖమ్మం, పక్కనున్న మా గ్రామం వెళ్లి వచ్చే వీలు కలుగుతోంది. అలా రాకపోకలు సాగిస్తున్న అనేక సందర్భాలలో, డాక్టర్ గారిని కలిసే అవకాశం కూడా పలు సందర్భాలలో కలిగింది. ఆయన కలిసిన ప్రతి సందర్భంలోనూ, అనేక కొత్త విషయాలు తెలుసుకునే వీలు కలగ సాగింది. దానికి తోడు, ఖమ్మంలో కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ పరంగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నాకు, ఎక్కడో అక్కడ ఏదో ఒక లోటు కనిపించ సాగింది. తప్పొప్పులెవరివైనా, ఎందుకిలా జరుగుతుందా అని ఆందోళన చెందేవారిలో నేనూ ఒకడినైనాను. నాకెంతోకాలంగా పరిచయమున్న బంధువులను, మిత్రులను, వారు పార్టీకి చేసిన సేవలు మరిచి, బహిష్కరణకు గురిచేయడమో, వారంతట వారే పార్టీని వీడిపోవడమో గమనిస్తున్నాను. ఈ నేపధ్యంలో, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ రాజకీయాలపైనా, ప్రత్యేకించి డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారికి ఆ పార్టీతో అరవై దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంపైనా, ఈ రెండింటికి ఏదైనా సంబంధం వుండవచ్చా అన్న అంశంపైనా ఆసక్తి కలిగింది. బాబాయ్ నరసింగరావును, ఇద్దరం కలిసి డాక్టర్ వై.ఆర్.కేగారిని, కదిలించాను.
"క్రమశిక్షణ, నిబద్ధత" లకు లోబడి అన్ని విషయాలను మాట్లాడడానికి డాక్టర్‍గారు అంగీకరించినట్లు భావించాను. ఆయన చెప్పిందంతా రికార్డు చేయడానికి డాక్టర్‍గారు అంగీకరించారు. మొదట్లో, ఏవో కొన్ని విషయాలే అనుకున్నాను. పోను-పోనూ పరిధి విస్తరించ సాగింది. పరిమిత విషయాలకంటే, ఆయన జీవిత చరిత్ర లాగా రాస్తే బాగుంటుందనిపించింది. ఆయన కూడా అంగీకరించారు. అందులో భాగంగానే సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలతో పాటు డాక్టర్‍గారి అనుభవాలను, పార్టీతో ఆయన అనుబంధాన్ని గ్రంధస్థం చేస్తే మంచిదనిపించింది.
డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారు ఒక రచయితగా ఆయన అనుభవాలను నేరుగా రాయకపోయినా, వాటిని అన్వయించుకుంటూ, కొన్ని పుస్తకాలు రాశారు. ఆయన వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఉపన్యాసాల ప్రాతిపదికగా "పదం-దృక్ఫదం", "పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు”, “అమెరికాలో ఆయన అనుభవాలు” పుస్తక రూపంలో వచ్చాయి. వాటిలో చెప్పిన విషయాలకు "పూరక-అను పూరక" అంశాలుగా చెప్పిన మరికొన్ని ఇందులో రాయడం జరిగింది. "ఆలోచన" మకుటంతో వివిధ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం, 2008లో వచ్చింది. "ప్రజారోగ్యం -వివిధ దేశాల అనుభవాలు" పేరుతో, కేవలం ఆరోగ్యంపై రాసిన వ్యాసాల సంకలనం 2010లో వచ్చింది. అదే సంవత్సరం ఆ పుస్తకం మూడుసార్లు ప్రచురింపబడడం ఒక విశేషం. తన పుస్తకాలను గురించి వివరిస్తూ, ఒక్కసారిగా యలమంచిలి ఆలోచనలు ఆయన 1993 లో చేసిన అమెరికా పర్యటన దిక్కుగా పయనించాయి. అమెరికా వెళ్లిన అందరిలా కాకుండా ఆయన విభిన్న కోణంలో అక్కడున్న కొన్ని ప్రదేశాలను సందర్శించారు. కమ్యూనిస్టు అభిమానిగా, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే మే దినోత్సవంతో అనుబంధం వున్న "హే మార్కెట్"ను చూడడానికి పనిగట్టుకుని వెళ్లారు. అక్కడ మే దినోత్సవానికి గుర్తుగా మిగిలిందేమిటో చూశారు. ప్రాణత్యాగం చేసిన కార్మికుల గుర్తుగా అక్కడే ఏమీ లేకపోగా, ఇల్లినాయిస్ రాష్ట్రాన్ని "కార్మికుల దాడి నుంచి కాపాడిన సైనికుల జ్ఞాపకార్థం" వేసిన స్మారక చిహ్నం వుండడం ఆయనను నిరాశకు గురి చేసింది. డాక్టర్‍గారు అక్కడకు వెళ్లి-వచ్చిన సంగతులను "అమెరికా వెలుగు నీడలు" పేరుతో యాత్రావర్ణన రూపంలో పుస్తకంగా రాశారు.
అలానే ఆయన జ్ఞాపకాలు చైనా వైపు మళ్లాయి. ఒక సారి ఆయన ఒక ప్రతినిధి బృందానికి నాయకుడుగా చైనా పర్యటించారు. అప్పటి కేరళ గవర్నర్ అసలా బృందానికి నాయకుడుగా వెళ్లాల్సి వుండగా, ఆఖరు క్షణంలో విరమించుకోవడంతో రాధాకృష్ణమూర్తికి ఆ బాధ్యత అప్ప చెప్పారు. బహుశా తన పెద్ద వయసు దృష్ట్యానో, లేదా, తాను కమ్యూనిస్టు అయినందున చైనా ప్రభుత్వం సూచించడం వలనో, తనకు ఆ అవకాశం వచ్చి వుండవచ్చని అన్నారు. అప్పట్లో కేంద్ర విదేశాంగ మంత్రిగా వున్న జస్వంత్ సింగ్ ప్రతినిధి బృందంలో ఒక సభ్యుడు కాదు కాని, వీరు పర్యటన చేస్తున్న సందర్భంలోనే ఆయన కూడా చైనా వచ్చారు. ప్రతినిధి బృందం చైనాలో వెళ్ళిన ప్రతి స్థలంలోను, ఉన్నత స్థాయి చైనా నాయకత్వానికి చెందిన వారే వీరికి స్వాగతం పలికారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ విభాగానికి చెందిన ప్రధాన నాయకుడు వీరిని కలిసి విందు కూడా ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఆయన చిన్న పుస్తక రూపంలో "చైనా డైరీ" పేరుతో చైనా నాయకత్వం గురించి రాశారు.
ఇలా మొదలెట్టి, ఆయన అనుభవాలను చెప్పిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, తానెందుకు ఐదు పర్యాయాలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఎలా ఐదు సెంట్రల్ జైళ్లను చూసింది, ఎలా తాను రాజ్యసభకు నామినేట్ కాబడింది, రాజ్యసభ సభ్యుడుగా ఏం చేసింది, ఎలా ఎంపీ నిధులను సద్వినియోగం చేసింది, ఎలా జీవితంలో ఎదిగింది, ఎలాంటి కష్ట-సుఖాలను అనుభవించింది, వైద్య విద్యను అభ్యసించినప్పుడు ఏం జరిగింది... లాంటి విషయాలెన్నో చెప్పారు.
నేననుకున్న విధంగా, జిల్లాలో కాని, రాష్ట్రంలో కాని, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో కాని, ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల విషయంలో, వివరాలలోకి లోతుగా వెళ్లడానికి డాక్టర్‍గారు అంతగా ఇష్టపడలేదు. "ఔను.. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పరంగా సంతోషం కలిగించని కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న మాట వాస్తవమే. వాటికి కారణాలు, ఫలితాలు, తలెత్తనున్న పర్యవసానాలు భవిష్యత్ నిర్ణయిస్తుంది. నేనింకా పార్టీలో-పార్టీ సభ్యుడుగానే వున్నాను. సిపిఎం పార్టీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా చర్చించడం సమంజసం కాదు." అని స్పష్టంగా చెప్పారు. కాకపోతే, డాక్టర్ గారు చెప్పిన విషయాలలో కొన్నిటిని నా అభిప్రాయానికి-ఆలోచనా సరళికి అన్వయించుకుంటూ పాఠకులకు అందించే ప్రయత్నమే ఇది. ఎక్కడా, ఎవరి మనోభావాలను నొప్పించాలన్న ఉద్దేశం లేదు.
"వెయ్యి పున్నములు చూసిన వాళ్లు చాలామందే వుండవచ్చు. చుట్టూ వుండే వాళ్లకు, నూరు వసంతాలను అందివ్వగలిగిన వారు మాత్రం అరుదుగా వుంటారు. అలాంటివారే ధన్యులు"
No comments:
Post a Comment