Monday, September 10, 2012

బాంకాక్‍లోని వాట్ అరుణ్, వాట్ ఫో బౌద్ధ దేవాలయాలు: వనం జ్వాలా నరసింహారావు


బాంకాక్‍లోని వాట్ అరుణ్, వాట్ ఫో 
బౌద్ధ దేవాలయాలు
వనం జ్వాలా నరసింహారావు

సింగపూర్‌లో వున్నప్పుడు, కాంబోడియాలోని సయాం రీప్‍కు వెళ్లొచ్చిన తరువాత, థాయ్‍లాండ్ రాజధాని నగరం బాంకాక్ వెళ్లాలని ఆలోచన చేశాం. అనుకున్న ప్రకారం సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ లో ప్రయాణం చేసి, బాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయం "సువర్ణభూమి" కి సెప్టెంబర్ 8, 2012 న చేరుకున్నాం. బాంకాక్‍లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఇదొకటి. ఆసియా ఖండంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ విమానాశ్రయాన్ని జాన్ ఆర్కిటెక్టులకు చెందిన హెల్మెట్ జాన్ డిజైన్ చేశాడు. విశాలమైన భూమిపై నీరుంటే ఎలా వుంటుందో ఊహించుకునే రీతిలో, ఈ విమానాశ్రయం ఒక ఓడలాగా వుండే తరహాలో డిజైన్ చేశాడు జాన్. సువర్ణభూమిలోకి అడుగిడుతూనే మనకు కనిపించే అద్భుత దృశ్యం భారతీయ హిందువుల పురాణాలలోని సముద్ర మధనం. దేవతలు, రాక్షసులు ఉమ్మడిగా చెరోవైపున వాసుకిని కవ్వంగా చేసుకుని అమృతం కొరకు సముద్ర మధనం చేస్తున్న దృశ్యాన్ని చక్కగా అమర్చారక్కడ. 


 సువర్ణభూమి విమానాశ్రయం
సువర్ణభూమి విమానాశ్రయం-సముద్ర మధనం 

థాయ్‍లాండ్ కు వెళ్లే భారతీయులకు విమానాశ్రయంలోనే వీసా పొందే ఏర్పాటుంది. ఐదారు నిమిషాలలోనే ఆ తతంగం ఐపోయింది. విమానాశ్రయం నుంచి నేరుగాముందుగానే రిజర్వ్ చేయించుకున్న "అనంతార బాంకాక్ రివర్ సైడ్ రిసార్ట్" హోటెల్‍కు, కారులో చేరుకున్నాం. చక్కటి విశాలమైన బాంకాక్ రోడ్లు ఎప్పుడూ బిజీగానే, ట్రాఫిక్ తో కనిపించాయి. దాదాపు ప్రతి రోడ్డు పేరు, ఆ దేశం రాజు "రాముడు" పేరు మీదే వున్నాయి. మొదటి రాముడి రోడ్డు అని, లేదా రెండవ రాముడి రోడ్డని, అలా ఇప్పటి తొమ్మిదవ రాముడి పేరు వరకూ వున్నాయి. చాలా వీధుల పేర్లు సంస్కృత భాషకు దగ్గరగా, థాయ్ భాషకు అనుగుణంగా అనిపించాయి. బాంకాక్ నగరంలోని సుప్రసిద్ధ " ఛావో ఫ్రాయా" నది ఒడ్డున, అతి వైభోగంగా, రకరకాల చెట్లతో అలరారే హోటెల్ మేం దిగిన అనంతార బాంకాక్ రివర్ సైడ్ రిసార్ట్. నది ఒడ్డున కూర్చుంటే అలా పొద్దు తెలవకుండానే గడిచి పోయేది. హోటెల్ నుంచి నదివైపు పోయే మార్గంలో ఎప్పటిదో పాతకాలం నాటి "ఎద్దుల బండి" కనిపించింది. పాత రోజుల నాటి వస్తువులను అలా భద్ర పరిచారు ఆ హోటెల్ వారు. 
 అనంతార బాంకాక్ రివర్ సైడ్ రిసార్ట్

గతంలో "సయాం" గాను, ప్రస్తుతం "థాయ్‍లాండ్ రాజ్యం" గాను పిలవబడుతున్న థాయ్‍లాండ్, ఇండో చైనా నట్టనడిమధ్యన వున్న ఆగ్నేసియా దేశం. నైరుతి దిశగా, అండమాన్ సాగర ఒడ్డున భారత దేశం కూడా థాయ్‍లాండ్ దేశానికి ఒకవైపు సరిహద్దు ప్రాంతమే. 1946 నుండి థాయ్‍లాండ్ రాజుగా వ్యవహరిస్తున్న తొమ్మిదవ రాముడు, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం దేశాధినేతగా వున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆరున్నర కోట్ల జనాభా వున్న థాయ్‍లాండ్ రాజధాని నగరం బాంకాక్ ఆ దేశం మొత్తానికి రాజకీయంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా కేంద్ర బిందువు. ఆగ్నేసియాలోని ఇతర దేశాల తరహాలోనే, థాయ్‍లాండ్ కూడా, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలకు, మతాలకు ప్రభావితమయింది. శతాబ్దాల అసలు-సిసలైన రాచరిక పాలన నుంచి, 1932 నాటి రక్తరహిత విప్లవం ఫలితంగా, అలనాటి రాజు ప్రజాధిపోక్, ఆ దేశ ప్రజలకు విముక్తి ప్రసాదించి, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికాడు. ఇక ఇప్పుడు రాచరిక వ్యవస్థ కేవలం నామ మాత్రమే! రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, జపాన్ దాడికి గురైన థాయ్‍లాండ్, ఆ దేశంతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. దరిమిలా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలపై యుద్ధం ప్రకటించింది. కాకపోతే, యుద్ధం ఆగిపోయిన అనంతరం, అమెరికా మిత్ర దేశంగా మారిపోయింది. అడపదడప రాజకీయ ఆటుపోట్లకు గురైన థాయ్‍లాండ్, 1980 నాటికల్లా, ఒక ప్రజాస్వామ్య దేశంగా స్థిరపడింది. రాజ్యాంగ బద్ధమైన రాచరిక ప్రజాస్వామ్య పాలన కింద వుంది ప్రస్తుతం థాయ్‍లాండ్. ఎన్నికైన ప్రధాని, వారసత్వ మొనార్క్ ల పాలనలో ప్రభుత్వం కొనసాగుతోందిప్పుడు. కార్యనిర్వాహక వ్యవస్థకు, చట్ట సభల వ్యవస్థకు అతీతంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తుందీ దేశంలో.


 విశాలమైన బాంకాక్ రోడ్లు
రాజధాని బాంకాక్ థాయ్‍లాండ్ దేశంలోని పెద్ద నగరం. కోటి మంది జనాభా కలిగిన బాంకాక్‍ను థాయ్ భాషలో "దేవతల నగరం" గా పిలుస్తారు. 15 వ శతాబ్దంలో, అయుధ్య రాజ్యంలో, ఛావో ఫ్రాయా నది ఒడ్డున వున్న ఒక చిన్న వాణిజ్య కేంద్రం బాంకాక్. కాలక్రమేణా పెద్ద నగరంగా మార్పు చెందింది. ప్రాచీన కాలం నాటి బాంకాక్ పేరులో రెండు భారతీయ భాషలు-పాళి, సంస్కృతం-వున్నాయి. ఆ భాషలలో బాంకాక్‍ను, "క్రన్-దేవ మహానగర అమరరతనకొసింద్ర మహీంద్రాయుధ్య మహాతిలకభవ నవరతన రాజధాని పురీ రమ్య ఉత్తమరాజనివేసన మహా స్థాన అమరవిమాన అవతారస్థిత్య శక్రస్దత్తియ విష్ణు కర్మ ప్రసిద్ధి" అని అంటారు. "దేవతల నగరం, గొప్ప నగరం, అజరామరమైన మణి హార నగరం, జయించనలవికాని దేవేంద్రుడి నగరం, నవరత్నాలతో కూడిన యావత్ ప్రపంచానికే అద్భుతమైన రాజధాని నగరం, ఆనందమైన నగరం, అత్యద్భుతమైన రాజప్రాసాదం కలిగిన మహానగరం, విష్ణు కర్మ నిర్మించి ఇంద్రుడిచే ఇవ్వబడిన మహానగరం" అని దీనర్ధం. థాయ్‍లాండ్-బాంకాక్ పాఠశాల విద్యార్థులకు చిన్నప్పుడే ఈ పూర్తిపేరును కంఠతా నేర్పుతారిక్కడ. ప్రపంచంలో అత్యంత పొడవైన పేరు కలిగిన నగరంగా గిన్నీస్ ప్రపంచ రికార్డులలో ఇది నమోదైంది. చారిత్రాత్మక "గ్రాండ్ పాలెస్", "వాట్ అరుణ్", "వాట్ ఫో" బాంకాక్‍లోని చూడతగ్గ పర్యాటక స్థలాలో ముఖ్యమైనవి. ఏడాది పొడుగూ, పర్యాటకులు అధిక సంఖ్యలో  వచ్చే నగరాలలో, లండన్ నగరం తరువాత స్థానం బాంకాక్‍దే. 


పడవను అద్దెకు తీసుకుని, ఛావో ఫ్రాయా నదిలో

బాంకాక్ చేరుకున్న మొదటి రోజు, ఒక పడవను అద్దెకు తీసుకుని, ఛావో ఫ్రాయా నదిలో అరగంట ప్రయాణం చేసి, అరుణ్ వాట్ దేవాలయానికి చేరుకున్నాం. నదికి పశ్చిమ ఒడ్డున వున్న ఈ బౌద్ధ (వాట్) దేవాలయాన్ని, "సూర్యోదయ దేవాలయం" అని కూడా పిలుస్తారు. థాయ్‍లాండ్‍లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశాలలో ఒకటైన ఈ వాట్, భారతీయుల ఆరాధ్య దైవమైన "సూర్యుడు" పేరు మీద నిర్మించారట. సూర్యోదయం సమయాన, ఆ కాంతి దేవాలయ శిఖరంపై పడి, ఇంద్ర ధనస్సు ఆకృతిలో రంగులు కనిపిస్తాయిక్కడ. అవి కనిపించినప్పుడు ఒక దేవత అక్కడ తిరుగాడుతున్నదా అన్న భ్రమ కలుగుతుంది. అందుకే అరుణ్ వాట్ అని దీన్ని పిలుస్తారు. దేవాలయ సముదాయంలో వున్న కేంద్ర శిఖరం దీని ప్రత్యేక ఆకర్షణ. చక్కటి ఆకృతులలో, అత్యంత ఆకర్షణీయంగా, వివిధ భంగిమలో చెక్కబడి, పోర్సిలీన్ కింద కప్పబడిన బొమ్మలు కనిపిస్తాయిక్కడ. ఖ్మేర్ రాజ్యంలో, హిందు-బౌద్ధ దేవాలయాలలో ఈ చెక్కడాలు సర్వసాధారణంగా వుండేవే. అయుధ్య రాజ్యంలో, థాయ్‍లాండ్‍లో కూడా, బౌద్ధ దేవాలయాలు నిర్మించినప్పుడు, ఇదే తరహా ఆర్కిటెక్చర్‌ను వాడకంలోకి తెచ్చారు. ఎత్తైన ఈ శిఖరాలనే స్థూపాలని, పగోడాలని, ప్రాంగ్‍లని ఇక్కడ పిలుస్తారు. థాయ్‍లాండ్‍లో, ప్రముఖ బౌద్ధ దేవాలయాలన్నింటిలో ఇవి కనిపిస్తాయి. 
 అరుణ్ వాట్
ప్రధాన "ప్రాంగ్" ఎత్తును ఇంతవరకు ఎవరూ సరిగ్గా నిర్ధారించలేదు. 219-282 అడుగుల మధ్య వుండవచ్చని అంచనా. ప్రధాన ప్రాంగ్ మూలలలో మరో నాలుగు చిన్న పగోడాలున్నాయి. సముద్రంలో దొరికే ముత్యపు చిప్పలతో, పోర్సిలీన్ ముక్కలతో ఈ పగోడాలను అలంకరించారు. దేవాలయంలోని ప్రధాన బుద్ధ విగ్రహాన్ని స్వయంగా అలనాటి రాజు రెండవ రాముడు తీర్చి దిద్దాడని అంటారు. ఆ విగ్రహం కిందనే, ఆయన చితాభస్మాన్ని పాతిపెట్టారట. రకరకాల దేవతల, కోతుల బొమ్మలతో రూపుదిద్దుకోబడిన ఆకృతులు పగోడాకు అన్ని వైపులా కనిపిస్తాయి. తిరుపతి మోకాళ్ల పర్వతం మోస్తారు ఎత్తైన మెట్లను ఎక్కి పోగలిగితే, ప్రధాన స్థూపం అంచుకు చేరుకోవచ్చు. ఈ నిర్మాణం కింది భాగం చుట్టుకొలత సుమారు 234 మీటర్లుంటుంది. 

 అరుణ్ వాట్

ప్రధాన స్థూపం పైభాగాన ఏడు మొలకల పొడగాటి ఆయుధం అమర్చబడి వుంది. దీన్ని అక్కడి వారు, భారత దేశంలోని శివాలయాలలో కనిపించే "త్రిశూలం" తో పోలుస్తున్నారు. ఆగ్నేసియా దేశాలలోని పలు ఆలయాలలో ఇలాంటివి కనిపిస్తాయి. హిందువుల-బౌద్ధుల మత ప్రమేయమైన గుర్తుగా దీన్ని భావిస్తారిక్కడ. పగోడా-స్థూపం కింది భాగంలో, చైనా దేశపు సైనికుల, జంతువుల బొమ్మలు రక-రకాల ఆకృతిలో చిత్రించబడి వున్నాయి. రెండో అంతస్తులో ఐరావతాన్ని ఎక్కిన ఇంద్రుడి నాలుగు విగ్రహాలు కనిపిస్తాయి. ప్రధాన పగోడా మూడు అంతస్తులు, సృష్టి-స్థితి-లయల గుర్తుగా చెప్పుకుంటారక్కడ.

 బుద్ధ విగ్రహం దగ్గర
 ప్రధాన స్థూపం పైభాగాన "త్రిశూలం"

మరుసటి రోజు ఉదయం వాట్ ఫో చూడడానికి వెళ్లాం. "నిదురిస్తున్న బుద్ధుడి దేవాలయం" గా కూడా పిలువబడే వాట్ ఫో, చారిత్రాత్మక గ్రాండ్ పాలెస్ పక్కనే వుంటుంది. ఇక్కడి నుంచి మేం అక్కడికి వెళ్లాం. సాంప్రదాయ బద్ధంగా-అనాదిగా ఆచరణలో వున్న "థాయ్‍లాండ్ మసాజ్" జన్మస్థలంగా కూడా ఈ దేవాలయానికి గుర్తింపు వుంది. బుద్ధుడు నివసించిన భారతదేశంలోని మొనాస్ట్రీ పేరు మీద వాట్ ఫో నిర్మించారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన భారతదేశంలోని బోధి వృక్షానికి చెందిన ఒక మొక్కను తెచ్చి ఇక్కడి దేవాలయ ప్రాంగణంలోని స్థలంలో నాటగా ఇప్పుడది పెద్ద చెట్టయింది. 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న ఈ దేవాలయ ప్రాంగణంలోని వాట్ ఫో, బాంకాక్‍లోని అత్యంత పురాతనమైన-అతి పెద్దదైన వాట్‍గా చెప్పుకుంటారు. 
 వాట్ ఫో - "నిదురిస్తున్న బుద్ధుడి దేవాలయం"

ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా-160 అడుగుల నిడివిగల నిదురిస్తున్న బుద్ధుడి విగ్రహంతో పాటు, వేయికిపైగా బుద్ధుడి ఒకే రకమైన విగ్రహాల నిలయం వాట్ ఫో దేవాలయం. వాట్ ఫో రెండు భాగాలుగా-తూర్పు, పడమరలుగా పోతున్న రోడ్డుకు ఇరువైపులా, వుంటుంది. ఉత్తరపు వైపు "రిక్లయినింగ్ బుద్ధ దేవాలయం", మసాజ్ విద్యాలయం వున్నాయి. దక్షిణం వైపు, బౌద్ధ బిక్షువులుండే నివాస స్థలం వుంది. దేవాలయ ముందు భాగంలో 91 చిన్నా-పెద్దా స్థూపాలున్నాయి. ఒక ప్రధాన ప్రార్థనా మందిరం, నాలుగు విహారాలు-హాల్స్ వున్నాయి. చిన్న సైజులో వున్న 71 స్థూపాల కింద రాజుల కుటుంబాలకు చెందిన వారి చితాభస్మాలున్నాయి. మిగిలిన 21 పెద్ద స్థూపాల కింద బుద్ధుడి చితాభస్మం వుంది. నాలుగు స్థూపాలు, నలుగురు చక్రి రాజులకు అంకితం చేశారు. రాతితో తయారుచేసిన భారీ చైనా దేశపు రాక్షస విగ్రహాల రక్షణలో, దేవాలయానికి చెందిన పదహారు గేట్లున్నాయి. ఐదవ రాజు రాముడు కొని తెచ్చిన 1200 బుద్ధ విగ్రహాలలో 400 బయట ఆవరణలో ఒకదాని వెంట మరొకటి పేర్చబడి-కూర్చబడి వున్నాయి. అన్ని విగ్రహాలు కంచుతో చేసినవే ఐనా, అందులో ఓ పాతిక విగ్రహాలు బంగారంతో తయారైనవని, అవేవో ఎవరికీ తెలియని విధంగా అక్కడక్కడా వున్నాయని చెప్పుకుంటారు. రామాయణ గాధల నుంచి విశేషాలతో చెక్కడాలు కూడా దేవాలయ గోడల మీద కనిపిస్తాయి.
 Standing Buddha
Sitting Buddha

నిదురిస్తున్న ఆకారంలో వున్న బుద్ధుడి విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 43 మీటర్ల పొడ వుంటుంది. కుడి చేయి కింద, రెండు తలగడలపైన, తల పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో వుంటుంది. ముత్యాలు పొదిగిన పెట్టెలపై, విగ్రహం 3 మీటర్ల ఎత్తు-4.5 మీటర్ల పొడవున్న విగ్రహం కాళ్లుంటాయి. విగ్రహంపైన థాయ్‍లాండ్ అధికార ప్రతినిధిగా ఏడంతస్తుల గొడుగు అమర్చబడి వుంటుంది. పక్క కారిడార్‌లో బుద్ధుడి గుణ-గణాలుగా చెప్పుకునే 108 చిప్పలుంటాయి. అక్కడ నివసిస్తున్న బౌద్ధ భిక్షువుల పోషణ కొరకు, సందర్శకులు తమకు తోచిన విరాళాలను ఆ చిప్పల్లో వేస్తారు. అలా చేయడం తమకు మంచి జరుగుతుందని కూడా వీరి నమ్మకం. 
 రిక్లయినింగ్ బుద్ధ


Monday, September 3, 2012

గతితార్కిక భౌతిక వాదానికీ, కర్మ సిద్ధాంతానికీ పోలిక: వనం జ్వాలా నరసింహారావు


గతితార్కిక భౌతిక వాదానికీ,  
కర్మ సిద్ధాంతానికీ పోలిక
 వనం జ్వాలా నరసింహారావు

సాహిత్యానికీ-మానవ విలువలకూ, ఛాందసత్వానికీ-కమ్యూనిజానికీ, గతితార్కిక భౌతిక వాదానికీ-కర్మ సిద్ధాంతానికీ ఏదో ఒకరకమైన-అనిర్వచనీయమైన-విడదీయరాని అనుబంధం వుందేమో అనిపిస్తుంది. హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం. అలాగే, ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం". హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం, ఈ సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ ఒక్కడే. ఏ పనిని, ఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో-లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ అనుకుంటాం. బహుశా అది నిజంకాదేమో. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అయుండాలి. ఆ ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డి పోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే, సృష్టికొక అధికారినీ (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారినీ (రుద్రుడు) నియమించాడు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే. అంటే, ఎవరో ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి-నిర్మించి-దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాయి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-ఆగమన్నప్పుడు ఆగి, జీవితం చాలించాలి. ఆ తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదలాలి.

నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయి. ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ-ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనవచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో-వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం-అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా


"ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగేయుగే" అన్న వేదవాక్కు ప్రకారం, కార్ల్ మార్క్స్ లాంటి మహా మహానుభావులు-కారణజన్ములు-గొప్ప ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత వాదం సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.

ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.

మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమే, వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడు. వాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది-అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదా. రామాయణంలోని పాత్రలను-చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకి. శ్రీరామచంద్రమూర్తిని దైవంగా, మహావిష్ణువు అంశగా, జరగబోయే దాన్ని వివరంగా-రామాయణ గాధగా లోకానికి తెలియచెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి, దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా-భక్తుడిగా-కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురై, శ్రీరాముడికి శత్రువుగా-రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాసాడు వాల్మీకి.

మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినా, రష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్, మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రుడిలాంటివారే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తి, చైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులు. మార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గం" లాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమి పాలయ్యాడు. కూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడు. ఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడు, ఆచార్య లక్షణాలున్న హనుమంతుడిని ఏంగెల్స్ తో పోల్చవచ్చు. మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే: మావో, లెనిన్, చౌ-ఎన్-లై, స్టాలిన్ శ్రీరామచంద్రుడు కోవకు చెందినవారు. మార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చు. మార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక" రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు. వాల్మీకైనా, మార్క్సైనా వారి-వారి సాహిత్యాలలో దేశ కాల పరిస్థితులకనుకూలమైన మానవ విలువల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు.

మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడాడనేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, మనలాంటి వారు అంధకారంలో పడి, దురాచార పరులమైపోయి, మానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో. మానవ విలువలను పరిరక్షించగలవాడికి కొన్ని గుణగణాలుండాలి. నాయకత్వ లక్షణాలుండాలి. అందరికీ అన్నీ సాధ్యపడవు. రామాయణ రచనకు పూనుకొమ్మని వాల్మీకిని ప్రేరేపించేందుకు ఆయనదగ్గరకొచ్చిన నారదుడిని వాల్మీకి అడిగిన ప్రశ్న-సమాధానం రూపంలో ఆ గుణగణాలను తెలియచేస్తాడు రచయిత. "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు" ఎవరో వారే మానవ విలువలను కాపాడగలవారని అర్థంచేసుకోవాలి.

శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరని చెప్పుకున్నాం. అలాంటిదే ఇది. శ్రీరాముడలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వాల్మీకి విశ్వామిత్రుడితో చెప్పిస్తాడు. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా తాటకను చంపాడు. వాల్మీకి రామాయణంలోని "వశిష్ట విశ్వామిత్ర యుద్ధం", బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. "ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు" మధ్య జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మవిద్య అన్నీ నేర్చుకున్నప్పటికీ, వాడు, ఆత్మవంతుడిని గెలవలేడని స్పష్టమవుతుంది. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్టుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. వర్గపోరాటంలో కూడా, కార్మికవర్గ నియంతృత్వానికి పూర్వ రంగంలో, తమ హక్కులకొరకు శ్రామికులు పోరాడుతారని మార్క్స్ అంటాడు. "సంకెళ్లు తప్ప కార్మికులు కోల్పోయేదేమీలేదు" అంటాడు మార్క్స్. దానర్థం: ఎదుటివారిని దెబ్బతీసేందుకన్నా, తమను తాము రక్షించుకోవడమే ప్రధానమని. ఇదీ మానవ విలువలనే సూచిస్తుంది.

మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. విజ్ఞాన సముపార్జనకవసరమైన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలకు సంబంధించిన ప్రతి అంశం, సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీదనే ఆధారపడి వుండే రీతిలోనే మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. ఎన్నో వందల-వేల పర్యాయాలు యుగాలు మారతాయంటారు. అందుకే, పరిణామక్రమంలో ఏం జరిగిందోననో-జరుగుతుందోననో చెప్పేకన్నా, ఏ యుగానికి సంబంధించిన కథలను ప్రామాణికంగా తీసుకోవాలన్న విషయంలో పరిశోధనలు జరిగితే మంచిదేమో. ఏదేమైనా, మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. అందులో సందేహం లేదు.

మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.