Monday, September 10, 2012

బాంకాక్‍లోని వాట్ అరుణ్, వాట్ ఫో బౌద్ధ దేవాలయాలు: వనం జ్వాలా నరసింహారావు


బాంకాక్‍లోని వాట్ అరుణ్, వాట్ ఫో 
బౌద్ధ దేవాలయాలు
వనం జ్వాలా నరసింహారావు

సింగపూర్‌లో వున్నప్పుడు, కాంబోడియాలోని సయాం రీప్‍కు వెళ్లొచ్చిన తరువాత, థాయ్‍లాండ్ రాజధాని నగరం బాంకాక్ వెళ్లాలని ఆలోచన చేశాం. అనుకున్న ప్రకారం సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ లో ప్రయాణం చేసి, బాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయం "సువర్ణభూమి" కి సెప్టెంబర్ 8, 2012 న చేరుకున్నాం. బాంకాక్‍లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఇదొకటి. ఆసియా ఖండంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ విమానాశ్రయాన్ని జాన్ ఆర్కిటెక్టులకు చెందిన హెల్మెట్ జాన్ డిజైన్ చేశాడు. విశాలమైన భూమిపై నీరుంటే ఎలా వుంటుందో ఊహించుకునే రీతిలో, ఈ విమానాశ్రయం ఒక ఓడలాగా వుండే తరహాలో డిజైన్ చేశాడు జాన్. సువర్ణభూమిలోకి అడుగిడుతూనే మనకు కనిపించే అద్భుత దృశ్యం భారతీయ హిందువుల పురాణాలలోని సముద్ర మధనం. దేవతలు, రాక్షసులు ఉమ్మడిగా చెరోవైపున వాసుకిని కవ్వంగా చేసుకుని అమృతం కొరకు సముద్ర మధనం చేస్తున్న దృశ్యాన్ని చక్కగా అమర్చారక్కడ. 


 సువర్ణభూమి విమానాశ్రయం
సువర్ణభూమి విమానాశ్రయం-సముద్ర మధనం 

థాయ్‍లాండ్ కు వెళ్లే భారతీయులకు విమానాశ్రయంలోనే వీసా పొందే ఏర్పాటుంది. ఐదారు నిమిషాలలోనే ఆ తతంగం ఐపోయింది. విమానాశ్రయం నుంచి నేరుగాముందుగానే రిజర్వ్ చేయించుకున్న "అనంతార బాంకాక్ రివర్ సైడ్ రిసార్ట్" హోటెల్‍కు, కారులో చేరుకున్నాం. చక్కటి విశాలమైన బాంకాక్ రోడ్లు ఎప్పుడూ బిజీగానే, ట్రాఫిక్ తో కనిపించాయి. దాదాపు ప్రతి రోడ్డు పేరు, ఆ దేశం రాజు "రాముడు" పేరు మీదే వున్నాయి. మొదటి రాముడి రోడ్డు అని, లేదా రెండవ రాముడి రోడ్డని, అలా ఇప్పటి తొమ్మిదవ రాముడి పేరు వరకూ వున్నాయి. చాలా వీధుల పేర్లు సంస్కృత భాషకు దగ్గరగా, థాయ్ భాషకు అనుగుణంగా అనిపించాయి. బాంకాక్ నగరంలోని సుప్రసిద్ధ " ఛావో ఫ్రాయా" నది ఒడ్డున, అతి వైభోగంగా, రకరకాల చెట్లతో అలరారే హోటెల్ మేం దిగిన అనంతార బాంకాక్ రివర్ సైడ్ రిసార్ట్. నది ఒడ్డున కూర్చుంటే అలా పొద్దు తెలవకుండానే గడిచి పోయేది. హోటెల్ నుంచి నదివైపు పోయే మార్గంలో ఎప్పటిదో పాతకాలం నాటి "ఎద్దుల బండి" కనిపించింది. పాత రోజుల నాటి వస్తువులను అలా భద్ర పరిచారు ఆ హోటెల్ వారు. 
 అనంతార బాంకాక్ రివర్ సైడ్ రిసార్ట్

గతంలో "సయాం" గాను, ప్రస్తుతం "థాయ్‍లాండ్ రాజ్యం" గాను పిలవబడుతున్న థాయ్‍లాండ్, ఇండో చైనా నట్టనడిమధ్యన వున్న ఆగ్నేసియా దేశం. నైరుతి దిశగా, అండమాన్ సాగర ఒడ్డున భారత దేశం కూడా థాయ్‍లాండ్ దేశానికి ఒకవైపు సరిహద్దు ప్రాంతమే. 1946 నుండి థాయ్‍లాండ్ రాజుగా వ్యవహరిస్తున్న తొమ్మిదవ రాముడు, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం దేశాధినేతగా వున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆరున్నర కోట్ల జనాభా వున్న థాయ్‍లాండ్ రాజధాని నగరం బాంకాక్ ఆ దేశం మొత్తానికి రాజకీయంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా కేంద్ర బిందువు. ఆగ్నేసియాలోని ఇతర దేశాల తరహాలోనే, థాయ్‍లాండ్ కూడా, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలకు, మతాలకు ప్రభావితమయింది. శతాబ్దాల అసలు-సిసలైన రాచరిక పాలన నుంచి, 1932 నాటి రక్తరహిత విప్లవం ఫలితంగా, అలనాటి రాజు ప్రజాధిపోక్, ఆ దేశ ప్రజలకు విముక్తి ప్రసాదించి, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికాడు. ఇక ఇప్పుడు రాచరిక వ్యవస్థ కేవలం నామ మాత్రమే! రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, జపాన్ దాడికి గురైన థాయ్‍లాండ్, ఆ దేశంతో సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. దరిమిలా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలపై యుద్ధం ప్రకటించింది. కాకపోతే, యుద్ధం ఆగిపోయిన అనంతరం, అమెరికా మిత్ర దేశంగా మారిపోయింది. అడపదడప రాజకీయ ఆటుపోట్లకు గురైన థాయ్‍లాండ్, 1980 నాటికల్లా, ఒక ప్రజాస్వామ్య దేశంగా స్థిరపడింది. రాజ్యాంగ బద్ధమైన రాచరిక ప్రజాస్వామ్య పాలన కింద వుంది ప్రస్తుతం థాయ్‍లాండ్. ఎన్నికైన ప్రధాని, వారసత్వ మొనార్క్ ల పాలనలో ప్రభుత్వం కొనసాగుతోందిప్పుడు. కార్యనిర్వాహక వ్యవస్థకు, చట్ట సభల వ్యవస్థకు అతీతంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తుందీ దేశంలో.


 విశాలమైన బాంకాక్ రోడ్లు
రాజధాని బాంకాక్ థాయ్‍లాండ్ దేశంలోని పెద్ద నగరం. కోటి మంది జనాభా కలిగిన బాంకాక్‍ను థాయ్ భాషలో "దేవతల నగరం" గా పిలుస్తారు. 15 వ శతాబ్దంలో, అయుధ్య రాజ్యంలో, ఛావో ఫ్రాయా నది ఒడ్డున వున్న ఒక చిన్న వాణిజ్య కేంద్రం బాంకాక్. కాలక్రమేణా పెద్ద నగరంగా మార్పు చెందింది. ప్రాచీన కాలం నాటి బాంకాక్ పేరులో రెండు భారతీయ భాషలు-పాళి, సంస్కృతం-వున్నాయి. ఆ భాషలలో బాంకాక్‍ను, "క్రన్-దేవ మహానగర అమరరతనకొసింద్ర మహీంద్రాయుధ్య మహాతిలకభవ నవరతన రాజధాని పురీ రమ్య ఉత్తమరాజనివేసన మహా స్థాన అమరవిమాన అవతారస్థిత్య శక్రస్దత్తియ విష్ణు కర్మ ప్రసిద్ధి" అని అంటారు. "దేవతల నగరం, గొప్ప నగరం, అజరామరమైన మణి హార నగరం, జయించనలవికాని దేవేంద్రుడి నగరం, నవరత్నాలతో కూడిన యావత్ ప్రపంచానికే అద్భుతమైన రాజధాని నగరం, ఆనందమైన నగరం, అత్యద్భుతమైన రాజప్రాసాదం కలిగిన మహానగరం, విష్ణు కర్మ నిర్మించి ఇంద్రుడిచే ఇవ్వబడిన మహానగరం" అని దీనర్ధం. థాయ్‍లాండ్-బాంకాక్ పాఠశాల విద్యార్థులకు చిన్నప్పుడే ఈ పూర్తిపేరును కంఠతా నేర్పుతారిక్కడ. ప్రపంచంలో అత్యంత పొడవైన పేరు కలిగిన నగరంగా గిన్నీస్ ప్రపంచ రికార్డులలో ఇది నమోదైంది. చారిత్రాత్మక "గ్రాండ్ పాలెస్", "వాట్ అరుణ్", "వాట్ ఫో" బాంకాక్‍లోని చూడతగ్గ పర్యాటక స్థలాలో ముఖ్యమైనవి. ఏడాది పొడుగూ, పర్యాటకులు అధిక సంఖ్యలో  వచ్చే నగరాలలో, లండన్ నగరం తరువాత స్థానం బాంకాక్‍దే. 


పడవను అద్దెకు తీసుకుని, ఛావో ఫ్రాయా నదిలో

బాంకాక్ చేరుకున్న మొదటి రోజు, ఒక పడవను అద్దెకు తీసుకుని, ఛావో ఫ్రాయా నదిలో అరగంట ప్రయాణం చేసి, అరుణ్ వాట్ దేవాలయానికి చేరుకున్నాం. నదికి పశ్చిమ ఒడ్డున వున్న ఈ బౌద్ధ (వాట్) దేవాలయాన్ని, "సూర్యోదయ దేవాలయం" అని కూడా పిలుస్తారు. థాయ్‍లాండ్‍లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రదేశాలలో ఒకటైన ఈ వాట్, భారతీయుల ఆరాధ్య దైవమైన "సూర్యుడు" పేరు మీద నిర్మించారట. సూర్యోదయం సమయాన, ఆ కాంతి దేవాలయ శిఖరంపై పడి, ఇంద్ర ధనస్సు ఆకృతిలో రంగులు కనిపిస్తాయిక్కడ. అవి కనిపించినప్పుడు ఒక దేవత అక్కడ తిరుగాడుతున్నదా అన్న భ్రమ కలుగుతుంది. అందుకే అరుణ్ వాట్ అని దీన్ని పిలుస్తారు. దేవాలయ సముదాయంలో వున్న కేంద్ర శిఖరం దీని ప్రత్యేక ఆకర్షణ. చక్కటి ఆకృతులలో, అత్యంత ఆకర్షణీయంగా, వివిధ భంగిమలో చెక్కబడి, పోర్సిలీన్ కింద కప్పబడిన బొమ్మలు కనిపిస్తాయిక్కడ. ఖ్మేర్ రాజ్యంలో, హిందు-బౌద్ధ దేవాలయాలలో ఈ చెక్కడాలు సర్వసాధారణంగా వుండేవే. అయుధ్య రాజ్యంలో, థాయ్‍లాండ్‍లో కూడా, బౌద్ధ దేవాలయాలు నిర్మించినప్పుడు, ఇదే తరహా ఆర్కిటెక్చర్‌ను వాడకంలోకి తెచ్చారు. ఎత్తైన ఈ శిఖరాలనే స్థూపాలని, పగోడాలని, ప్రాంగ్‍లని ఇక్కడ పిలుస్తారు. థాయ్‍లాండ్‍లో, ప్రముఖ బౌద్ధ దేవాలయాలన్నింటిలో ఇవి కనిపిస్తాయి. 
 అరుణ్ వాట్
ప్రధాన "ప్రాంగ్" ఎత్తును ఇంతవరకు ఎవరూ సరిగ్గా నిర్ధారించలేదు. 219-282 అడుగుల మధ్య వుండవచ్చని అంచనా. ప్రధాన ప్రాంగ్ మూలలలో మరో నాలుగు చిన్న పగోడాలున్నాయి. సముద్రంలో దొరికే ముత్యపు చిప్పలతో, పోర్సిలీన్ ముక్కలతో ఈ పగోడాలను అలంకరించారు. దేవాలయంలోని ప్రధాన బుద్ధ విగ్రహాన్ని స్వయంగా అలనాటి రాజు రెండవ రాముడు తీర్చి దిద్దాడని అంటారు. ఆ విగ్రహం కిందనే, ఆయన చితాభస్మాన్ని పాతిపెట్టారట. రకరకాల దేవతల, కోతుల బొమ్మలతో రూపుదిద్దుకోబడిన ఆకృతులు పగోడాకు అన్ని వైపులా కనిపిస్తాయి. తిరుపతి మోకాళ్ల పర్వతం మోస్తారు ఎత్తైన మెట్లను ఎక్కి పోగలిగితే, ప్రధాన స్థూపం అంచుకు చేరుకోవచ్చు. ఈ నిర్మాణం కింది భాగం చుట్టుకొలత సుమారు 234 మీటర్లుంటుంది. 

 అరుణ్ వాట్

ప్రధాన స్థూపం పైభాగాన ఏడు మొలకల పొడగాటి ఆయుధం అమర్చబడి వుంది. దీన్ని అక్కడి వారు, భారత దేశంలోని శివాలయాలలో కనిపించే "త్రిశూలం" తో పోలుస్తున్నారు. ఆగ్నేసియా దేశాలలోని పలు ఆలయాలలో ఇలాంటివి కనిపిస్తాయి. హిందువుల-బౌద్ధుల మత ప్రమేయమైన గుర్తుగా దీన్ని భావిస్తారిక్కడ. పగోడా-స్థూపం కింది భాగంలో, చైనా దేశపు సైనికుల, జంతువుల బొమ్మలు రక-రకాల ఆకృతిలో చిత్రించబడి వున్నాయి. రెండో అంతస్తులో ఐరావతాన్ని ఎక్కిన ఇంద్రుడి నాలుగు విగ్రహాలు కనిపిస్తాయి. ప్రధాన పగోడా మూడు అంతస్తులు, సృష్టి-స్థితి-లయల గుర్తుగా చెప్పుకుంటారక్కడ.

 బుద్ధ విగ్రహం దగ్గర
 ప్రధాన స్థూపం పైభాగాన "త్రిశూలం"

మరుసటి రోజు ఉదయం వాట్ ఫో చూడడానికి వెళ్లాం. "నిదురిస్తున్న బుద్ధుడి దేవాలయం" గా కూడా పిలువబడే వాట్ ఫో, చారిత్రాత్మక గ్రాండ్ పాలెస్ పక్కనే వుంటుంది. ఇక్కడి నుంచి మేం అక్కడికి వెళ్లాం. సాంప్రదాయ బద్ధంగా-అనాదిగా ఆచరణలో వున్న "థాయ్‍లాండ్ మసాజ్" జన్మస్థలంగా కూడా ఈ దేవాలయానికి గుర్తింపు వుంది. బుద్ధుడు నివసించిన భారతదేశంలోని మొనాస్ట్రీ పేరు మీద వాట్ ఫో నిర్మించారు. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన భారతదేశంలోని బోధి వృక్షానికి చెందిన ఒక మొక్కను తెచ్చి ఇక్కడి దేవాలయ ప్రాంగణంలోని స్థలంలో నాటగా ఇప్పుడది పెద్ద చెట్టయింది. 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న ఈ దేవాలయ ప్రాంగణంలోని వాట్ ఫో, బాంకాక్‍లోని అత్యంత పురాతనమైన-అతి పెద్దదైన వాట్‍గా చెప్పుకుంటారు. 
 వాట్ ఫో - "నిదురిస్తున్న బుద్ధుడి దేవాలయం"

ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా-160 అడుగుల నిడివిగల నిదురిస్తున్న బుద్ధుడి విగ్రహంతో పాటు, వేయికిపైగా బుద్ధుడి ఒకే రకమైన విగ్రహాల నిలయం వాట్ ఫో దేవాలయం. వాట్ ఫో రెండు భాగాలుగా-తూర్పు, పడమరలుగా పోతున్న రోడ్డుకు ఇరువైపులా, వుంటుంది. ఉత్తరపు వైపు "రిక్లయినింగ్ బుద్ధ దేవాలయం", మసాజ్ విద్యాలయం వున్నాయి. దక్షిణం వైపు, బౌద్ధ బిక్షువులుండే నివాస స్థలం వుంది. దేవాలయ ముందు భాగంలో 91 చిన్నా-పెద్దా స్థూపాలున్నాయి. ఒక ప్రధాన ప్రార్థనా మందిరం, నాలుగు విహారాలు-హాల్స్ వున్నాయి. చిన్న సైజులో వున్న 71 స్థూపాల కింద రాజుల కుటుంబాలకు చెందిన వారి చితాభస్మాలున్నాయి. మిగిలిన 21 పెద్ద స్థూపాల కింద బుద్ధుడి చితాభస్మం వుంది. నాలుగు స్థూపాలు, నలుగురు చక్రి రాజులకు అంకితం చేశారు. రాతితో తయారుచేసిన భారీ చైనా దేశపు రాక్షస విగ్రహాల రక్షణలో, దేవాలయానికి చెందిన పదహారు గేట్లున్నాయి. ఐదవ రాజు రాముడు కొని తెచ్చిన 1200 బుద్ధ విగ్రహాలలో 400 బయట ఆవరణలో ఒకదాని వెంట మరొకటి పేర్చబడి-కూర్చబడి వున్నాయి. అన్ని విగ్రహాలు కంచుతో చేసినవే ఐనా, అందులో ఓ పాతిక విగ్రహాలు బంగారంతో తయారైనవని, అవేవో ఎవరికీ తెలియని విధంగా అక్కడక్కడా వున్నాయని చెప్పుకుంటారు. రామాయణ గాధల నుంచి విశేషాలతో చెక్కడాలు కూడా దేవాలయ గోడల మీద కనిపిస్తాయి.
 Standing Buddha
Sitting Buddha

నిదురిస్తున్న ఆకారంలో వున్న బుద్ధుడి విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 43 మీటర్ల పొడ వుంటుంది. కుడి చేయి కింద, రెండు తలగడలపైన, తల పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో వుంటుంది. ముత్యాలు పొదిగిన పెట్టెలపై, విగ్రహం 3 మీటర్ల ఎత్తు-4.5 మీటర్ల పొడవున్న విగ్రహం కాళ్లుంటాయి. విగ్రహంపైన థాయ్‍లాండ్ అధికార ప్రతినిధిగా ఏడంతస్తుల గొడుగు అమర్చబడి వుంటుంది. పక్క కారిడార్‌లో బుద్ధుడి గుణ-గణాలుగా చెప్పుకునే 108 చిప్పలుంటాయి. అక్కడ నివసిస్తున్న బౌద్ధ భిక్షువుల పోషణ కొరకు, సందర్శకులు తమకు తోచిన విరాళాలను ఆ చిప్పల్లో వేస్తారు. అలా చేయడం తమకు మంచి జరుగుతుందని కూడా వీరి నమ్మకం. 
 రిక్లయినింగ్ బుద్ధ


No comments:

Post a Comment