Friday, October 11, 2019

మల్లికార్జునరావు గారి ఇంట్లో అద్దెకు..... ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల జ్ఞాపకాలు ..... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-10 : వనం జ్వాలా నరసింహారావు


మల్లికార్జునరావు గారి ఇంట్లో అద్దెకు.....
ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల జ్ఞాపకాలు
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-10
వనం జ్వాలా నరసింహారావు
బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉద్యోగంలో చేరిన వెంటనే కాపురం హైదరాబాద్ కు మార్చాం. అశోక్ నగర్ బ్రిడ్జ్ పక్కనున్న పీపుల్స్ హై స్కూల్ దాటిన తరువాత, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టడీస్ వున్న గల్లీలోకి పోయి కుడివైపు తిరిగితే వున్నా మూడో ఇంట్లో అద్దెకు చేరాం. అది భండారు మల్లికార్జున రావు గారి ఇల్లు. ఆ ఇంట్లో ఒక పక్క ఒక గది, వంట ఇల్లు కలిపి నెలకు 90 రూపాయల అద్దె కుదుర్చుకున్నాం. అందులోనే కరెంట్, నీళ్ల బిల్లు కూడా కలిసి వుండేది. ఇప్పుడు ఆ ఇంటిని ఫ్లాట్స్ గా మార్చేశారు. మల్లికార్జున రావు గారు, ఆయన భార్య రామసీతమ్మ గారు, పిల్లలు నాగేశ్వర రావు, భాస్కర్ రావు, డాక్టర్ లక్ష్మణ్ రావు, లక్ష్మి, డాక్టర్ సరస్వతి, అంతా చాలా కలుపుగోలు మనుషులు. మల్లికార్జున రావు గారు సుమారు 86 ఏళ్ల వయసులో 2012 లో చనిపోయారు. ఆయన భార్య  రామసీతమ్మ గారు ఇటీవలే మూడేళ్ల క్రితం తన 81 వ సంవత్సరంలో 2016 లో చనిపియారు. మా పిల్లలను ఒక దాన్ని జిలేబీ అని, మరో దాన్ని గులాబ్ జాం అనీ పిలుస్తూ ముద్దు చేసేవారు దంపతులిద్దరూ.

   మల్లికార్జున రావు గారి ఇంట్లో సొంత మనుషుల్లాగా తిరిగేవాళ్ళం. మాతో పాటే మా ఆవిడ తమ్ముడు ఏవీజీ కుమార్ అలియాస్ వెంకన్న వుండేవాడు. భద్రాచలంలో పనిచేస్తున్న మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే ఆ రెండు గదుల ఇంట్లోనే మాతో పాటు సర్దుకు పోయేవాడు. అప్పటికి నాకు ఇద్దరు ఆడ పిల్లలు బుంటి (ప్రేమ మాలిని), కిన్నెర, ఇంకా ఆదిత్య పుట్టలేదు. ఆ ఇంట్లో దాదాపు ఏడెనిమిది నెలలు వున్నాం. అప్పట్లో స్కూల్ కు సెలవులు ఇవ్వగానే వుంటున్న ఇల్లు ఖాళీ చేసి ఖమ్మం వెళ్లిపోయే వాళ్లం. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి సెలవులు దాదాపు రెండు నెలలు కావడం, రెండోది ఆ రెండు నెలల ఖర్చు తప్పించుకోవడం. ఖమ్మం దగ్గరలోనే వున్న మా గ్రామం వనం వారి క్రుష్ణాపురంలో సెలవులు గడిపేవాళ్ళం. అలాగే, మా వూరికి ఆరేడు మైళ్ల దూరంలో వున్న మా మామగారి వూరు వల్లభికి కొన్నాళ్లు పోయేవాళ్ళం. అప్పట్లో మా వూళ్ళో విద్యుత్ సరఫరా లేకపోయినా కిరోసిన్ లాంతర్ల వెలుతురులోనే రాత్రుళ్ళు గడిపేవాళ్ళం.

నేను ఉద్యోగంలో చేరిన సంవత్సరం స్కూల్ కు వేసవి సెలవులు ఇవ్వడానికి ముందర హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత మా జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు. వెంగళరావు పెద్ద కుమారుడు జలగం ప్రసాద రావు, నేను కలిసి ఖమ్మం రికాబ్ బజార్ స్కూల్లో చదువుకున్నాం. వెంగళరావు జిల్లాపరిషత్ అధ్యక్షుడిగా వున్నప్పుడు వాళ్లింటికి నా చిన్నతనంలో తరచు వెళ్లేవాడిని. 10 డిసెంబర్, 1973 నుండి 6 మార్చి 1978 వరకు జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాడు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.

ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు 1975 వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభోగంగా జరిగాయి. ఆ ఏడు ఉగాది నాడు (ఏప్రియల్ 12) మొదలైన మహాసభలు ఏడురోజులపాటు జరిగి, ఏప్రియల్ 18 న ముగిసాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు భాషాభిమానులు, సాహీతీ-సాంస్కృతిక ఉద్దండ పిండాలు, కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయులు, అవధానులు, మేధావులు, శాస్త్రవేత్తలు.....ఇలా, వీరూ-వారూ అనే భేదం లేకుండా, "కాకతీయ నగర్" గా నామకరణం చేయబడ్డ లాల్ బహదూర్ స్టేడియంలోని ఒకే వేదికపై సమావేశమై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలుగు భాషలోని తీయందనాన్ని, గొప్పతనాన్ని తనివితీరా ఆస్వాదించారు.

ఏడురోజుల పాటు జరిగిన ఆ భాషోత్సవాలలో ప్రతిదినం లక్ష మందికిపైగా ప్రేక్షకులు పాల్గొన్నారని అంచనా. అనునిత్యం సెమినార్లు-గోష్ఠులు జరిగిన ప్రదేశాన్ని "నాగార్జున పీఠం" గా పిలిచారు. 1500 మందికి పైగా పాల్గొన్న ఈ గోష్ఠుల్లో, మొత్తం 28 అంశాలపైన, సుమారు 100 కు పైగా శాస్త్రీయ పేపర్లను సభ ముందుంచడం విశేషం. కాకతీయనగర్ లోని "శ్రీకృష్ణ దేవరాయనగర్" వేదికమీద సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంగీతం, నాటకం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్రకథల్లాంటి వందకుపైగా కార్యక్రమాలకు అది వేదికైంది. ఔత్సాహిక కళాకారులెందరో వీటిలో పాలుపంచుకున్నారు. "శాతవాహన నగర్" ప్రదేశంలో "తరతరాల తెలుగు జాతి" పేరుతో రెండున్నర వేల తెలుగుజాతి చరిత్రా విశేషాలతో కూడిన కళాత్మక ప్రదర్శన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆయిల్ పెయింటింగ్స్, ఫొటోలు, ఛార్టులు, బొమ్మలు లాంటివి ప్రదర్శించారు.

మహాసభలకు దేశ-దేశాలనుండి, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 5000 మందికి పైగా  ప్రతినిధులు హాజరయ్యారు. సభలు ప్రారంభమైన మొదటి రోజున చార్మీనార్ నుండి సభావేదిక వద్దకు ఊరేగింపుగా నాలుగైదు గంటల పాటు నడిచి వేలాదిమంది చేరుకున్నారు. ఊరేగింపుకు సీఎం జలగం వెంగళ రావు నాయకత్వం వహించారు. "మా తెలుగుతల్లికి మల్లెపూదండ..." పాటతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారిలో నేనూ ఒకడిని. మహాకవి శ్రీ శ్రీ తెలుగు మహాసభలను విమర్శిస్తూ పోటీ మహాసభలు పెట్టడం, అరెస్టు కావడం, అప్పటి సీఎం చొరవతో విడుదల కావడం నాకు ఇంకా గుర్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ ల మధ్య ఎంతోకాలంగా వున్న వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం కూడా సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశారు.

అన్నింటికన్నా నాకు ఇంకా బాగా గుర్తుంది అప్పటికి పట్టుమని పాతికేళ్లన్నా నిండని నరాల రామిరెడ్డి అష్ఠావధానం. ఆ అవధానంలో మరీ గుర్తుంది ఆయన పూరించిన ఒక పద్యం. "బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్, అమ్మాయి" లను కలుపుతూ, చెడు అర్థం రాకుండా పద్యం చెప్పమని కోరారొక ప్రేక్షకుడు. దానికి జవాబుగా అవధాని పద్యాన్ని ఇలా "మత్తేభం" వృత్తంలో చెప్పారు:

"అతివా! గుండెల బీరువా తెరచి నీకర్పించు కుంటిన్ గదా!
అతుల ప్రేమ మనోజ్ఞ రత్నమట న భ్రాందీ కృత శ్యామతా
న్విత మౌ నీ కచ సీమ వెల్గు హృదయా విష్కీర్ణ సౌందర్యమౌ
రతివో రంభవొ రాధికా రమణివో రావే జగజ్జిన్నుతిన్"

ప్రేక్షకుల్లో ఒక్క సారి నవ్వులు విరజిల్లాయి. ఇలాంటి సాహిత్య ప్రక్రియలెన్నో జరిగాయప్పుడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే!

తెలుగు మహాసభలు ముగిసిన కొద్ది రోజులకు హయ్యర్ సెకండరీ స్కూలుకు వేసంగి సెలవులు ఇవ్వడంతో ఖమ్మం, దాని సమీపంలో మ వూరికి వెళ్లాను. అప్పటికే మా ఆవిడ కడుపులో మాకు పుట్టబోయే కుమారుడు ఆదిత్య జొరబడ్డాడు.  

Thursday, October 10, 2019

ఐదారు దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో జీవన విధానం : వనం జ్వాలా నరసింహారావు


ఐదారు దశాబ్దాల క్రితం తెలంగాణ పల్లెల్లో జీవన విధానం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (11-10-2019)
          పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక కుగ్రామంలో నివసిస్తుండే మేం, ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, ఇంటి బయట వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. వూళ్లో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే, ఆ కార్యక్రమం కూడా మా వూరి పెద్దల సమక్షంలో, అదే సమయంలో అక్కడే జరిగేది. ఆ రోజుల్లో, గ్రామాల్లో పంచాయతీ తీర్పులు పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. వారు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, ఒకరిద్దరు దళితులు కూడా వుండేవారు.

          బాల్యంలో ఎక్కువగా "అచ్చన గిల్లలు", "వాన గుంటలు" ఆడేవాళ్లం. సాయంత్రాలు "గోలీలు", "బలిగుడు-చెడు గుడు" (కబడ్డీ), "బెచ్చాలు", "పత్తాలు", "జిల్ల గోనె", "దస్తీ ఆట". "తొక్కుడు బిళ్ల" ఆడేవాళ్లం. ఇంట్లో అక్కచెల్లెళ్ళు "పచ్చీసు" ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం. మా చిన్నతనంలో మాకు ప్రధానమైంది "బ్రతుకమ్మ" లేదా "బతుకమ్మ" పండుగ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే సంబరమే! తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లం. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు.

జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. దసరా పండుగ రోజుల్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి మా చిన్నతనంలో "రోలు-రోకలి" అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. ముక్కోటి ఏకాదశి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది. మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు", రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి.

సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. ధాన్యం కొలవడానికి "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" వుండేవి. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది.

అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు.


చిన్నతనంలో ప్రతి ఇంట్లో ఇంకా తెలతెలవారుతుండగానే, పొద్దున్నే లేవడం, విశాలమైన ఇంటి వాకిలి శుభ్రం చేయడం, ఇంటి ముందర కలాపి జల్లడం జరిగేది. వాకిలి శుభ్రం చేయడానికి పొడగాటి కందికట్టె చీపురు (పొలికట్టె) ఉపయోగించేవారు. కలాపి జల్లే నీళ్లలో పశువుల పేడను కలిపేవారు. ఆ తతంగమంతా దాదాపు గంట సేపు జరిగేది. అలానే, ఉదయాన్నే కొందరు "జొన్న తొక్కు" వంపడానికి వచ్చే వారు. బదులుగా "చల్ల" పోయించుకు పోయేవారు. వారొచ్చే వేళ కల్లా, ఇంటి వెనుక వంట ఇంటి పక్కన "చల్ల” చిలికేవారు. ఒక గుంజకు "కవ్వం" కట్టి తాడుతో పెరుగు చిలికి చల్ల చేసేవారు. పెద్ద బానెడు చల్ల, అందులో పెద్ద "వెన్న ముద్ద", చల్లలో చాలా భాగం మునిగి పోయి తయారయ్యేది. ఎండాకాలంలో మేం ఉదయాన్నుంచే చల్ల ముంచుకుని తాగే వాళ్లం. వెన్న పూస కూడా తినే వాళ్లం. వెన్న పూస నుంచి "నెయ్యి" తయారు చేసేవారు. ఇటీవలి కాలంలో నేను చల్ల చిలకడం చూడలేదు…..వెన్న మునగడం కూడా చూడలేదు.

నా చిన్నతనంలో మా వూళ్లో, ఆ మాటకొస్తే జిల్లా కేంద్రం ఖమ్మంలో మేముండే మామిళ్లగూడెంలో విద్యుత్ సరఫరా లేదు. కిరోసిన్ దీపాల వెలుగులోనే వుండేవాళ్లం. 1961 ప్రాంతంలో....విద్యుత్ స్థంబాలు పాతారు. అంతవరకూ, పెట్రోమాక్స్ లైట్లే వీధి దీపాలు. సాయంత్రం కాగానే, చీకటి పడటానికి కొంచెం ముందర, మున్సిపాలిటీ వాళ్లొచ్చి స్తంభాలకు వీధి దీపాలు తగిలించి పోయేవారు. ఇప్పటి లాగా ఆ రోజుల్లో ఫ్లెష్‌ ఔట్ మరుగుదొడ్లుండేవి కావు. సఫాయివాడు (స్కావెంజర్) ప్రతి రోజు వచ్చి శుభ్రం చేసేవాడు. వాడికి, నెలకు అప్పట్లో ఐదు రూపాయలిచ్చినట్లు గుర్తు.

వంటా-వార్పూ అంతా కట్టెల పొయ్యిల మీదే. స్నానానికి నీళ్లు కాగ పెట్టడం కూడా కందికట్టె నిప్పుల మీదే. ఇక ఇంట్లో వుంది "ఓపెన్ బాత్ రూమే"! స్నానాల గదికి పైకప్పు కూడా లేదు.  పనివాడు బావిలోంచి నీళ్లు తోడి పోస్తుంటే అలా...ఒక గంట సేపు స్నానం చేసే వాళ్లం. వారానికోసారి తలంట్లుండేవి (తల మీద స్నానం). దాని కొరకు ప్రత్యేకంగా పని వాళ్లుండే వారు. ఇంటి అవసరాలకు కావాల్సిన "ఇసురు రాయి" తో పిండి (శనగ, బియ్యం, జొన్న) విసరడానికి, రోట్లో కారం-పసుపు దంచడానికి, దోస వరుగులు-మామిడి వరుగులు కోసి ఎండ పెట్టడానికి, మొక్క జొన్నలు వలవడానికి, అలాంటి పనులనేకం చేయించడానికి కూడా పనివాళ్లు వుండే వారు. వారికి సరిపడా కూలిచ్చేవారు. పంటలు చేతి కొచ్చిన రోజుల్లో అలాంటి వారికి కొంత బోనస్ కూడా ఇచ్చేవారు నాన్న గారు.

చిన్నతనంలో ప్రయాణ చేయడానికి కచ్చడం బండి వుండేది. సైజు కొంత చిన్నగా వుంటుంది. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం (దాన్ని "చక్కి" అని పిలిచే వాళ్లం) వేయాలి. ముందర బండి తోలేవాడు కూచోవడానికి "తొట్టి" వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వాళ్లం. ఎక్కువలో-ఎక్కువ ముగ్గురు-నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటిని అందంగా అలంకరించేవాళ్లం. ముఖాలకు “పొన్న కుచ్చులు”, “ముట్టె తాళ్లు”, మెడకు “మువ్వలు-గంటలు”, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి "కాణీ" వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వాళ్లం) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి “టంగు వారు” అలంకరించేవాళ్లం. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో "చండ్రకోల" వుండేది. అది తోలుతో చేసేవాళ్లు. ఎద్దులు బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల చప్పిడి, మువ్వల సందడి, టంగు వారు కదలడం....చూడడానికి బలే సరదాగా వుండేది.

ఇంటి పక్కనే వున్న వడ్రంగి "కొలిమి" లో ఇనుప కడ్డీలను పెట్టి కాల్చడం, వాటిని సమ్మెట పోటుతో కొట్టడం, కొలిమిలో నిప్పు ఆరిపోకుండా ఉపయోగించే "తిత్తులను" వూదడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి వుండడం చూసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. అక్కడ వ్యవసాయ పనిముట్లయిన "అరకలు", "నాగళ్లు", "బురద నాగళ్లు", "దంతెలు", "బండి రోజాలు"....లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. ఆ పనితనానికి ఆశ్చర్యపోయే వాళ్లం. బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి "ఇరుసు" తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది. తొలకరి వర్షాలు పడుతుండగానే వ్యవసాయ పనులు మొదలయ్యేవి. ఆ పనుల్లో మొదటి కార్యక్రమం వ్యవసాయ పనిముట్లను బాగు చేయించుకుని దున్నడానికి సిద్ధంగా వుండడమే.

జిల్లా కేంద్రం ఖమ్మం వెళ్లాలంటే మార్గమధ్యంలో వున్న "మునేరు" దాటాలి. ఏటి దగ్గర కూర్చుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పలహారమో, చద్ది అన్నమో (మామిడికాయ వూరకాయ కలుపుకుని) తింటుంటే బలే మజా వచ్చేది. తిన్నంత తిని, కడుపు నిండా ఆ ఏటి నీళ్లే తాగే వాళ్లం. నేను ఖమ్మం లో చదువుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి మా వూరు గుండా మొదట్లో మట్టి రోడ్డు, తరువాత మెటల్ రోడ్డు, మరి కొంత కాలానికి డాంబర్ రోడ్డు వేశారు. ప్రస్తుతం డబుల్ రోడ్డు వేస్తున్నారు.

ఏబై-అరవై ఏళ్ల కింద గ్రామాలలో నెలకొన్న కొన్ని పరిస్థితులను మననం చేసుకుంటుంటే, ఇప్పటికీ-అప్పటికీ వున్న తేడా కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు, నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" (వంట్లో బాగా లేక పోతే-జ్వరం లాంటిది వస్తే) చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు, ఆయుర్వేదం వారు, పాము-తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు....ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. మా వూళ్లో ఇంతమంది లేరు కాని, అల్లోపతి వైద్యం నేర్చుకున్న ఒక డాక్టర్, ఆయుర్వేదం వైద్యం తెలిసిన మరో డాక్టర్ వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. ఇద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు ఎంజా, మలేరియా-చలి జ్వరం) ఏ.పీ.సీ టాబ్లెట్లు ఇచ్చేవారు. ఒక సీసాలో తయారు చేసిన "రంగు నీళ్లు" కూడా ఇచ్చేవారు. తగ్గితే తగ్గినట్లు, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో. వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే వాళ్లు. ఖమ్మంలో కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు.

          ఒక్కసారి చిన్నతనం రోజులు, ఇప్పటి రోజులు తలచుకుని పోల్చి చూసుకుంటే, ఎంత అభివృద్ధి చెందామో అర్థమవుతుంది. ఆర్.ఎం.పి డాక్టర్ చికిత్సకే పరిమితమైన మేం ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ వైద్యం చేయించుకుంటున్నాం. పలకా-బలపం పట్టిన నేను కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నాను. ఇంత అభివృద్ధి జరిగినా ఇంకా జరగాల్సిందెంతో వుంది.

Sunday, October 6, 2019

Improving standards : Vanam Jwala Narasimha Rao


Improving standards
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (06-10-2019)

For any Civil Society Intelligentsia Team or to that matter for their vociferous supporters across the nation it should be of utmost priority to see that Citizen Charters in all government departments and public sector undertakings are in place as an effective redress mechanism. In fact the importance of these was discussed more than two decades ago itself in the Chief Ministers’ Conference presided over by the then Prime Minister IK Gujral held on May 24, 1997 on the threshold of 50 years’ of Independence. A scheme for drafting them on a priority was also prominently included in the Nine Point Action Plan of CMs Conference. It was made mandatory for all government departments-Center and State-formulating Citizens’ Charters and initiating Effective and Speedy Public Grievance Redress System.

In fact when a feedback was taken 15 years later in January 2011, 24 state Governments and Union Territories were in the process of formulation of charters by then. VK Agnihotri, former Indian Administrative Service Officer of AP cadre and in later days Rajya Sabha Secretary General was responsible for monitoring the implementation of Charters as well as redress mechanism at that time as Secretary to Government of India in the department of Administrative Reforms.

Soon after the CMs meet of 1997, formulation of Citizens' Charters commenced in the departments and offices, to begin with those which had a large public interface. The methodology was based on a consultation process, involving different stakeholders, specifying standards of service and time limits that the public can reasonably expect. This considerably helped in improving the quality of administration and providing a responsive interface between the citizen and the public services from the Government. The process also placed the citizen at the center of administration instead of making him a passive recipient of services rendered indifferently with no concern for quality, timeliness or cost.

The citizen’s charter is a document prepared by the service provider in a clear and precise manner about the quality and method of delivery of services to the users (Citizens) of the service. The purpose of the citizen’s charter is to: Improve the quality of service to the public, give people more choice, tell people what kind of service to expect from the government departments and make sure people know what to do if something goes wrong in the process of service delivery. The six Principles of citizen’s charters are: Published Standards, Openness and Information, Choice and Consultation, Courtesy and Helpfulness, Redress when things go wrong and Value for Money. Provision for independent scrutiny of actual implementation with the involvement of citizen groups is the basic character of Charters. Though the charter is not proposed to be made justifiable it would carry a moral commitment of the government and would provide a framework under which public services could be evaluated.

Implementation of Charters by the respective organizations is a major task, covering vast distances and manpower. It, therefore, needs a monumental and sustained effort at training, orientation, publicity and awareness building, as well as regular and honest evaluation, to transform the Charter from a significant piece of paper into an instrument for changing long-entrenched values and mind-set. Creating a platform of interests between the service provider and its users is the first step, balancing the strengths and constraints of the former against the reasonable expectations of the later are the next.

In the then united Andhra Pradesh, for a while, remarkable work was done in this regard. Formulation of Charters and Grievance Redress Mechanism was a priority item. Dr MCR HRD Institute, the premier training center for capacity and capability building of state government employees was the platform and coordinator to formulate charters to begin with. Dr MCR HRD Institute was entrusted with the work of conducting departmental workshops in the Institute for select departments to familiarize with the Principals and modalities in preparing the Citizens Charter. That was purely the personal initiative of the then Director General PVRK Prasad, a senior IAS officer to put the plan in to Action.


The draft charters prepared in the Institute were considered by the Government and an informal consultation process started by the concerned minister, secretary and Head of Department with the stake holders. A follow up workshop was organized in HRD Institute within a fortnight where in the minister concerned along with his senior officials interacted formally with representatives of stake holders. Keeping in view the deliberations in the follow up workshop, the department firmed up the draft within the next one week. At this stage the concerned department issued a public notification through print and electronic media indicating the contents of the proposed citizen’s charter and inviting suggestions from the general public on the specific points to be covered in the charter. Simultaneously the department (coinciding with the publication for suggestions from public) informally started implementing the contents of the charter to get a feedback on any practical problems faced in the implementation. Keeping in view the suggestions from General Public and the feedback in the trial run of the charter final draft was prepared, approved and issued by the Government, within three months of the original notification calling for suggestions from public.

Citizens Charters were rolled out in several departments to begin with. Among them the Road Transport Authority, the Department of Employment and Training, the Hyderabad Metro Water Supply and Sewerage Board, the TRANSO and 4 DISCOMS, the Department of Registration and Stamps, the Municipal Administration Department, the Commercial Taxes Department and the Municipal Corporation of Hyderabad implemented them in total initially. The Center for Good Governance (CGG) was helping departments in preparing a road map for implementation of the Charters and was building awareness among user groups. It’s better if the process is begun again and charters are in place in all the government departments and public sector undertakings in the state.

The real issue is the need to bring about a total change in the attitude of public servants towards redress of public grievance at all levels and to pinpoint responsibility for action on grievance of the people. This is dependent internally on measures to improve their levels of motivation and morale through rewards for good work and punishment for deliberate negligence. The senior officers should constantly supervise the staff at the cutting-edge level.

 (Jwala Narasimha Rao was associated with formulation of Charters in Dr MCR HRD Institute. He was also one of the two members of the sub-group of the Core-Group constituted by Government of India in March 2002 to evaluate the progress of Charters in various States and Union Territories as part of the Status of Administrative Reforms in India).

సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మని రాముడికి చెప్పిన కబంధుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-81 : వనం జ్వాలా నరసింహారావు


సుగ్రీవుడితో స్నేహం చేసుకొమ్మని రాముడికి చెప్పిన కబంధుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-81
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (06-10-2019)
          కబంధుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు వాడిని దహనం చేయడానికి సన్నాహాలు చేశాడు. అతడి శరీరాన్ని ఒక బిలంలో తోసి, ఎండు కట్టెలను పేర్చి, మండే కొరివి ఆ కట్టెల్లో వుంచి, అగ్నిని పురిగొల్పాడు. కొవ్వుతో నిండి, మాంసం ముద్దలాగా వున్న ఆ దేహాన్ని అగ్నిహోత్రుడు వేగంగా కాల్చకుండా మెల్లగా కాల్చసాగాడు. ఇంతలో రామలక్ష్మణులు చూస్తుండగానే, మండుతున్న ఆ మంటల్లో నుండి నిర్మలమైన వస్త్రాలు ధరించి, తళ- తళలాడే సొమ్ములు అలంకరించుకుని, ఆకాశానికి ఎగిరిన కబంధుడు, తాను సీతాదేవిని చూసిన విధం రాముడితో ఇలా చెప్పాడు.

         “రామచంద్రా! లోకంలో సంధి, విగ్రహ, యానా, సన, ద్వైదీభావ, సమాశ్రయంలనే ఆరు ఉపాయాలను రాజులైన వారు పనులు చక్కబెట్టడానికి ఆలోచిస్తారు. ఈ ఆరింటిలో సంధి తప్ప తక్కినవి నీకు ప్రస్తుతం సరిపడేవి కాదు. విరోధి ఉనికి తెలిస్తేనే కదా, యుద్ధానికి సన్నద్ధం కావడం జరిగేది. కాబట్టి సంధి విషయం ఒకటే ఆలోచించాల్సి వుంటుంది. ప్రత్యక్ష శత్రువు ఎవరైంది నీకు తెలియలేదు కాబట్టి, నువ్వు వాడితో సంధి చేద్దామన్నా కుదరదు. కాబట్టి మొదలు నీ శత్రువు విషయం, సీత ఉనికి తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరివల్ల సాధ్యపడేది కాదు. కాబట్టి అన్యుల సహాయం తీసుకోవాలి. ఇతరులతో సంధి అంటే, ఎలాంటివారితో చేయాలి? కయ్యానికి, నెయ్యానికి, వియ్యానికి సమానత్వం కావాలి. తనకంటే గొప్పవారితో స్నేహం కుదరదు. తక్కువ వారితో స్నేహం చేస్తే లాభం లేదు. తనకంటే ఎక్కువవాడు తనని చులకన చేస్తాడు కాని, నిండు మనస్సుతో ఆదరించడు. ఇప్పుడు మీ అన్నదమ్ములు ఇద్దరూ సమర్థులే అయినా, నీ భార్య కొరకై నీకు కష్టదశ ప్రాప్తించింది. నీ కొరకై నీ తమ్ముడు కష్టదశలో వున్నాడు”.

         “కాబట్టి నీ స్థితిలాంటి స్థితిలో ఉన్నవాడిని చూసి స్నేహం చేసుకో. అలా జరగకపోతే నీ పని అయ్యేట్లు నాకు అనిపించడం లేదు. అలాంటివారు ఎవరైనా వున్నారా అని అడుగుతావేమో? సుగ్రీవుడు అనే వానర రాజు, తన అన్న వాలికి తనమీద కోపం రాగా, నలుగురు వానరులను సహాయంగా తీసుకుని దుఃఖపడుతూ, పంపానది ఒడ్డున వున్న పవిత్ర ఋశ్యమూక పర్వతం మీద సంచరిస్తున్నాడు. అతడు పరాక్రమవంతుడు. ఋజువర్తనం కలవాడు. సత్యం చెప్తాడు. బుద్ధి సంపదకలవాడు. ధైర్యవంతుడు. శౌర్యంలో ప్రసిద్ధుడు. అతడితో నువ్వు స్నేహం చేస్తే నీ భార్యను వెదకడానికి అతడు నీకు సహాయపడతాడు. రామా! నువ్వెందుకు దుఃఖపడతావు? ఏదెలా జరగాలో అలాగే జరుగుతుంది కాని, దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యం? ఎలాంటివారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదుకదా?.

“నిర్మలమైన మనస్సు కలవాడా! నువ్వు అక్కడికి ఇప్పుడే శీఘ్రంగా వెళ్లు. సుగ్రీవుడితో స్నేహం చేయి. వాడు మహాబలవంతుడు. శ్రేష్టమైన గుణాలు కలవాడు. మోసబుద్ధిలేకుండా, వీడొక కోతి...వీడేమి చేయగలడని అలక్ష్యం చేయకుండా అగ్నిసాక్షిగా వానర రాజుతో స్నేహం చేయి. వాడు మిక్కిలి పరాక్రమవంతుడు. ఎవరైనా తనకు సహాయపడతాడా అని వెతుకుతున్నాడు. మీకు ఆయన మేలే చేస్తాడు. నువ్వు చేసిన మేలు ఆయన మరవడు. వానరులందరికీ అతడు ప్రభువు. కోరిన రూపం ధరించగలడు. అతడి కోరిక నెరవేర్చే శక్తి మీకుంది. ఆయన కోరిక మీరు వెంటనే నేరవేర్చినా, లేకున్నా, మీ పని అతడు చేస్తాడు”.

“సుగ్రీవుడు ఋక్షరాజుడు స్త్రీగా వున్న సమయంలో ఆమె శరీరంలో సూర్యుడికి జన్మించాడు. పంపానదీ తీరంలో అన్న వాలికి భయపడి తిరుగుతున్నాడు. వాడు నమ్మేట్లు నువ్వు నీ ఆయుధాలన్నిటినీ తాకి ప్రతిజ్ఞ చేసి అతడితో స్నేహం చేయి. అతడికి తెలియని రాక్షసులు వుండే చోటు భూమ్మీద లేదు. సూర్యకిరణాలు వ్యాపించే భూమ్మీదగల నదులు, నదాలు, కొండలు, అడవులు, వెతికి నీ భార్య ఎక్కడున్నదీ వార్తా తెప్పించగల సమర్థుడు సుగ్రీవుడు. నిన్ను ఎడబాసిన కారణాన దుఃఖిస్తున్న సీతాదేవి రావణుడి బందీగా ఎక్కడ ఉన్నదో కనుక్కోగల సమర్థుడతడు. ఆ రావణుడి ఇల్లు వెతికి, వాడామెను పాతాళంలో దాచినా, మేరువు కొనలో ఉంచినా, రాక్షసుల గుంపును చంపి ఆమెను తీసుకురాగలడు”.

Thursday, October 3, 2019

బతుకమ్మ, దసరా పండుగలు ఆహ్లాదం, సహజీవనం కొరకే : వనం జ్వాలా నరసింహారావు


బతుకమ్మ, దసరా పండుగలు ఆహ్లాదం, సహజీవనం కొరకే
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (04-10-2019)
         రకరకాల హిందువుల పండుగలకు తెలంగాణ పుట్టిల్లు. తెలంగాణాలోని ప్రతిపండుగకూ ఒక చారిత్రిక నేపధ్యముంది. ప్రతి పండుగా సంప్రదాయాల నిలయమే. ఇతిహాసాల్లో, పురాణాల్లో ఏం చెప్పినా, ఆచరణలో మాత్రం, తెలంగాణాలో జరుపుకునే ప్రతి పండుగ స్థానిక ఆచారాలకు అనుగుణంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రుల మధ్య గడుపుకోవడం అనాదిగా వస్తున్నదే. అలాంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న దసరా, బతుకమ్మ పండుగలు ఒకటివెంట మరొకటి ఈ నెలలో రావడం ఆడా-మగా అందరికీ ఆనందదాయకమే. ఏక కాలంలో చేసుకునే ఈ పండుగలకు మధ్య ఒక అవినాభావ సంబంధం వుందనే అనాలి.

         ఊరూ-వాడా ఏకమై, ఊరి బయట జమ్మి వృక్షం కింద గుమికూడి, “శమీ శమయతే పాపం...శమీ శతృ వినాశనం...అర్జునస్య ధనుర్థారీ...రామస్య ప్రియదర్శనం” అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మిచెట్టు కొమ్మకు గుచ్చి, రామచిలుక దర్శనం చేసుకుని, జమ్మి ఆకు చేతబట్టుకుని, స్నేహితులకు ఇవ్వడం దసరా విశేషం. అలాగే, రంగు-రంగుల పూలతో, అందచందంగా అలంకరించిన బతుకమ్మలను ఉరేగింపుగా తీసుకుపోతూ, భక్తీ శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ, ఊరిబయట వున్న నది ఒడ్డుకో, ఏటి ఒడ్డుకో, చెరువు ఒడ్డుకో పోయి, మహిళలంతా గుమికూడి జరుపుకునేదే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ ఆఖరి రోజు పండుగ సద్దుల బతుకమ్మ. ఒకప్పుడు పల్లెటూళ్లతో సహా బస్తీలలో కూడా అట్టహాసంగా జరుపుకున్న ఈ పండుగలు, క్రమేపీ వాటి సహజ శైలిలో జరగకపోవడం, కొన్ని చోట్ల దాదాపు కనుమరుగవడం జరిగినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో, వాటి పునఃప్రాభవం సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పండుగలు మళ్లీ అట్టహాసంగా జరుపుకోవడం చూస్తున్నాం. అన్ని పండుగాలలాగే వీటికీ చారిత్రిక నేపధ్యం వున్నది.

         పండుగలన్నింటిలోకి పెద్ద పండుగగా చెప్పుకునే దసరాను శరన్నవరాత్రి అని కూడా అంటారు. నవరాత్రులుగా జరుపుకునే ఈ పండుగలో భాగమే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ పండుగకు కొత్త అల్లుళ్లను, ఆడపడుచులను ఆహ్వానిస్తారు. అందరూ కలిసి-మెలిసి ఆనందంగా గడుపుతారు. ఈ పండుగ జరుపుకునే రోజుల్లోనే, మన తెలంగాణా ప్రాంతంలో, తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుని తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ చేసుకుని ఆడపిల్లను అత్తారింటికి పంపినట్లే బతుకమ్మ-గౌరమ్మను నీటిలో కలిపి అత్తారింటికి సాగనంపుతారు.

         విజయదశమి అంటే విజయం అని అర్థం. పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేసే పూర్వరంగంలో, అక్కడికి చేరుకునే ముందు, తమ అస్త్ర-శస్త్రాలను ఒక జమ్మిచెట్టుమీద వుంచి అవి తమకు తప్ప ఇతరులెవరికీ కనిపించకుండా ఏర్పాటు చేస్తారు. వారికి మాత్రమే అవి అస్త్ర-శస్త్రాలుగా కనిపించి, ఇతరులకు శవాకారంలో కనిపిస్తాయి. వారి అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ఉత్తర గోగ్రహణం సందర్భంగా, ప్రగల్భాలాడుతూ యుద్ధానికి వచ్చిన ఉత్తరకుమారుడు కౌరవ సైన్యాన్ని చూసి భయపడి వెనుదిరిగి పారిపోతుంటే, ఆయనకు సారథిగా వచ్చిన బృహన్నల (అర్జునుడు) జమ్మిచెట్టుమీద వున్న అస్త్రాలను బయటకు తీసి యుద్ధం చేసి, కౌరవులను ఓడించి విరాటరాజుకు విజయం చేకూరుస్తాడు. యుద్ధంలో అలా కౌరవులను జయించిన రోజునే “విజయదశమి” అని “దసరా” అని అంటారని ఒక కథ ప్రచారంలో వుంది.

         దీన్ని గురించే మరో కథ ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో బహుళ ప్రచారంలో ఎప్పటినుండో వుంది. ఆ మండలంలో మా గ్రామం వనంవారి కృష్ణాపురానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో బాణాపురం అనే గ్రామం వుంది. దానికి దగ్గరలోనే భక్తరామదాసు జన్మించిన నేలకొండపల్లి అనే గ్రామం వుంది. ఇది కూడా మండల కేంద్రమే. బౌద్ధుల కాలంనాటి ఎన్నో చారిత్రిక అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. పాండవులు శస్త్రాస్త్రాలను వుంచిన జమ్మిచెట్టు వున్నవూరుకే బాణాపురం అన్న పేరొచ్చింది అంటారు. బాణాపురం నుండి నేలకొండపల్లికి వెళ్ళే మార్గమధ్యంలో, నేలకొండపల్లికి ఆనుకుని, పది-పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మట్టిగద్దె వుంది. దీన్ని విరాటరాజు గద్దె అని ఇక్కడి స్థానికులు పిలుస్తారు. ఇదిప్పుడు పురాతత్వశాఖ వారి అధీనంలో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ ఆరామంలాగా వుంది. ఈ గద్దె నుండే విరాటరాజు పరిపాలన చేశాడని ఈ ప్రాంతంవారు నమ్ముతారు. గద్దెకు అతిసమీపంలో పెద్ద-పెద్ద గాడిపొయ్యిలు వున్నాయి. వలలుడుగా విరాటరాజు కొలువులో పనిచేసిన భీముడు వంటచేసిన స్థలం ఇదని చెప్పుకుంటారు.

         దసరా పేరులోనే వున్నట్లు ఇది పదిరాత్రుల పండుగ. దక్షిణ భారతదేశంలో మొదటి తొమ్మిది రాత్రులను నవరాత్రులనీ, పదవరోజును విజయదశమి అనీ అంటారు. ఈ పదిరోజులు ప్రతిరోజూ లలితా సహస్రనామాల పారాయణం చేస్తుంటారు అంతా ఒక చోట చేరి. అయితే పురాతన సంస్కృత గ్రంథాలలో కానీ, పౌరాణిక ప్రామాణికాలలో కానీ దసరాను పండుగ దినంగా పేర్కొన్న దాఖలాలు లేవు. క్రీస్తుపూర్వం నాటి ప్రథమ, మధ్య శతాబ్దాల కాలం నాటి సూత్ర గ్రంథాలలో దసరాను ఏటేటా ఆనవాయితీగా జరుపుకునే ఒక రకమైన సత్యనిష్టా కార్యక్రమంగా మాత్రమే దీనిని అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో దసరా జరుపుకునే పదిరోజులు మట్టిబొమ్మలను, వివిధ ఆకృతులతో సేకరించి, బొమ్మల కొలువుగా ఇంటింటా తీర్చిదిద్దే ఆచారం ఎప్పటినుండో వస్తున్నది. బొమ్మలకొలువు పెట్టుకున్న ప్రతి ఇంటికీ పేరంటాళ్ళు రావడం, సంగీత కార్యక్రమాలు చేసుకోవడం, పండుగ వాతావరణంలో కాలక్షేపం చేయడం ఆనవాయితీ. పదిరోజుల బొమ్మల కొలువు తరువాత బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా తీసి, భద్రపరచి, మరుసటి సంవత్సరం మరికొన్ని కొత్త బొమ్మల సరసన వీటిని చేర్చి, ఆ ఏడాదికూడా బొమ్మలకొలువును ఏర్పాటుచేసుకోవడం జరుగుతుంటుంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆరాధించే, పూజించే సంరక్షిత దేవతల్లో, తెలంగాణవారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. జీవితాన్ని ప్రసాదించి, రక్షించే దేవత బతుకమ్మ అని నమ్ముతారు చాలామంది. నవరాత్రుల్లోనూ, దసరా పండుగ దినాల్లోనూ, ఆ దేవతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మూడొందల సంవత్సరాల క్రితం, ఇప్పటి వరంగల్ జిల్లాలోని, మొగిలిచర్ల గ్రామానికి చెందిన భట్ట నరసింహా అనే ఓ జానపద కవి తన కవితలో బతుకమ్మ ఆవిర్భావాన్ని వర్ణించారు. అందుకనేమో వరంగల్ వాసులకు బతుకమ్మ మీద ఇతరుల కంటే ఎక్కువ భక్తి. ఓ రకమైన స్థానిక ప్రత్యేకత సంతరించుకున్న ఈ పండుగను చారిత్రాత్మక వరంగల్ ఖిల్లా సమీపంలో ఉన్న భద్రకాళి (పద్మాక్షి) గుడి ప్రాంగణంలో, జనం గుమిగూడి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. గిరిజన సంప్రదాయ నేపథ్యంలో, కాకతీయ రాజులు ఈ పండుగ ఆవిర్భావానికి వికాసానికి కారకులై ఉండొచ్చు. జనాదరణ పొందిన పలు పండుగలను ప్రచారంలోకి తెచ్చిన ఘనత కూడా కాకతీయులదే.


         మొగిలిచెర్ల జానపద కవి రాసిన పాటలో బ్రతుకమ్మను గురించిన వివరాలున్నాయి. చోళ దేశంలో ధర్మాంగ అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య సత్యవతి. ఆ దంపతులకు నూరుగురు పుత్రుల సంతానం. అందరూ ధైర్యసాహసాలు కలవారైనప్పటికీ, ఓ యుద్ధంలో శతృవుల చేతిలో మరణిస్తారు. దుఖంతో కృంగిపోయిన ధర్మాంగ-సత్యవతి దంపతులు లక్ష్మీదేవి కటాక్షం కోరకు అడవుల్లోకి పోయి తపస్సు చేస్తారు. ఫలితంగా సాక్షాత్ లక్ష్మీదేవే ఆ దంపతులను ఆశీర్వదించి, పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని నామకరణం చేస్తుంది. అంద చందాలతో యవ్వనవతి అయిన బతుకమ్మను విష్ణుమూర్తి చక్రాంక పేరుతో వివాహమాడుతాడు. వారికి ఆరువేల మంది అతి చక్కని ధైర్యసాహసాలు గల పిల్లలు పుడతారు. సుఖసంతోషాలతో వీరంతా ఉంటుండేవారు. అది బతుకమ్మ పుట్టి పెరిగిన విధం. చోళరాజు ధర్మాంగకు కానీ, ఆయన కుటుంబానికి కానీ వరంగల్, తెలంగాణ ప్రాంతానికున్న సంబంధం గురించిన వివరాలు చరిత్రలో అంతగా లేవు.

         చరిత్రలో ఏం చెప్పినా ఇప్పటికీ ఎవరైనా దంపతులకు పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుంటే ఆ తరువాత పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని నామకరణం చేసే సంప్రదాయం తెలంగాణలో చాలాచోట్ల ఉంది. బతుకమ్మను ఆరాధిస్తూ కొలుస్తూ పాడే పాటల్లో కేవలం లక్ష్మీదేవి వర్ణనే కాకుండా గౌరి, సరస్వతుల వర్ణన కూడా ఉండడమంటే బహుశా ఆమెను త్రిమూర్తిణి గా భావించడమేమో. బతుకమ్మను కొలుస్తూ ఆ పండగప్పుడు ఆడుతూ ఎన్నోపాటలు పాడుతుంటారు స్త్రీలు. ప్రతి పాట చివర చరణంలో చివరగా ‘కోలు’ అనో, ‘ఉయ్యాల’ అనో, ‘చందమామ’ అనో, ‘గౌరమ్మా’ అనో ఉంటుంది. బతుకమ్మను కొలిచే విధానం, దానికి కావలసిన సన్నాహాలు ఎలా చేసుకోవాలి ఒకటి-రెండు పాటల్లో వివరంగా ఉన్నాయి.

         బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూ ఆడతుంటారు. కోలాటం, కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మచెక్కలాడడం బతుకమ్మ పండుగలో భాగం. పాటల్లో-కథలోని ప్రధానాంశం ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో మొగుడితో ఎలా ఉండాలో, మెట్టినింటి గౌరవ మర్యాదలు ఎలా కాపాడుకోవాలో ఉంటుంది. ఈ రీతిగా ఆడపిల్లలకు బుద్దులు నేర్పడం పూర్వాకాలం సంప్రదాయం. బతుకమ్మ బొమ్మను ఉంచాల్సిన పళ్లెం ఆకులతో కానీ, వెదురుతో కానీ చేయాలంటారు. గుమ్మడిపూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి పసుపుతో తయారుచేసిన బతుకమ్మను (గౌరమ్మ) ఉంచుతారు. ఈ మొత్తం బతుకను ఒక స్థలంలో ఉంచి సంప్రదాయ రీతిగా పూజిస్తారు. ఇలాంటి మరికొందరు తయారుచేసిన బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ లయబద్దంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు. ఓ గుడి ముందో, ఎవరైనా ఇంటి ముందో దీనికి అనువుగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు.

ఎనిమిది రోజుల పాటు.. అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలుపెట్టి ఇలా ఎవరో ఒకరింటి ముందర చేసి తొమ్మిదో రోజున సమీపంలోని ఏటి ఒడ్డునో, నది ఒడ్డునో, చెరువు దగ్గరో చద్దుల బ్రతుకమ్మగా ఆడి నీటి ఒడిలో ఆమెను చేరుస్తారు. అంటే అత్తగారింటికి సాగనంపుతారన్నమాట. కంటికీ చెవికీ విందు కలిగించే పండుగ బతుకమ్మ.  చక్కటి చీరలు ధరించి అతి చక్కగా తయారయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుకుంటూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళతారు. మంచి కంఠమున్న ఓ పెద్ద ముత్తయిదువ పాటను ఆరంభిస్తే మిగిలిన వారందరూ ఆమెతో గొంతు కలుపుతుంటారు. పురుషులు వారికి తోడుగా పోయి ఆ పాటలను ఆస్వాదిస్తారు.

         ప్రసాదం లేకుండా పండుగే లేదు. ఐదు రకాల ప్రసాదాలను (పెసరపప్పు, గోధుమపిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో తయారుచేసినవి) ఈ పండుగలో పంచిపెడతారు. లోగడ జగడాలాడి మాటలు కలవని స్త్రీలు కూడా అవన్నీ మర్చిపోయి బతుకమ్మ పండుగలో మళ్లీ స్నేహితులవుతారు. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది.

         ఏ పండుగయినా, పబ్బమయినా జరుపుకునేది ఆహ్లాదం కొరకే. మానవాళి అంతటికీ దైనందిన, యాంత్రిక, మార్పులేని జీవితంతో విసుగెత్తడం సహజం. ఇటువంటి జీవితానికి ఎప్పుడో అప్పుడు ఎడంగా ఉంటాలంటే పండుగల లాంటివి అవసరం. ప్రతిరోజు శలవుదినమైనా జీవితం దుర్భరమవుతుంది. అందుకే వారంలోని కొన్ని రోజులు శలవుదినాలని, కొన్ని పనిదినాలని భావిస్తాం. కొన్ని రోజులు ప్రార్థనకు పరిమితమయితే మరికొన్ని రోజులు ఆనందంతో గెంతులు వేయాలి కదా. అడప దడప పదిమందితో కలసి మెలసి ఆనందించాలంటే పండుగలు కావాలి. తరాలు, అంతరాలు అనే భేదం లేకుండా కులమతాలకతీతంగా ఆస్తులు, అంతస్తులకు దూరంగా డాబు, దర్పం, హక్కులకు తావీయకుండా సమాజంలో అందరు వ్యక్తులు ఏదో ఒక కార్యక్రమంలో సహజీవనం చేయాలి. అదే పండుగ. అలాంటి పండుగలలో అతి ప్రధానమైనవి దసరా, బతుకమ్మ. దేవతారాధన పేరుతో మనం ఇస్తున్న నైవేద్యం స్వర్గంలో ఉన్న దేవుళ్లకు చేరాలంటే దసరా, బతుకమ్మ లాంటి పండుగలు జరుపుకుని సమాజంలో కలసి మెలసి బతకాలి. అది కొంతసేపే కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, అయినా తప్పనిసరి.