Thursday, October 3, 2019

బతుకమ్మ, దసరా పండుగలు ఆహ్లాదం, సహజీవనం కొరకే : వనం జ్వాలా నరసింహారావు


బతుకమ్మ, దసరా పండుగలు ఆహ్లాదం, సహజీవనం కొరకే
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (04-10-2019)
         రకరకాల హిందువుల పండుగలకు తెలంగాణ పుట్టిల్లు. తెలంగాణాలోని ప్రతిపండుగకూ ఒక చారిత్రిక నేపధ్యముంది. ప్రతి పండుగా సంప్రదాయాల నిలయమే. ఇతిహాసాల్లో, పురాణాల్లో ఏం చెప్పినా, ఆచరణలో మాత్రం, తెలంగాణాలో జరుపుకునే ప్రతి పండుగ స్థానిక ఆచారాలకు అనుగుణంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రుల మధ్య గడుపుకోవడం అనాదిగా వస్తున్నదే. అలాంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న దసరా, బతుకమ్మ పండుగలు ఒకటివెంట మరొకటి ఈ నెలలో రావడం ఆడా-మగా అందరికీ ఆనందదాయకమే. ఏక కాలంలో చేసుకునే ఈ పండుగలకు మధ్య ఒక అవినాభావ సంబంధం వుందనే అనాలి.

         ఊరూ-వాడా ఏకమై, ఊరి బయట జమ్మి వృక్షం కింద గుమికూడి, “శమీ శమయతే పాపం...శమీ శతృ వినాశనం...అర్జునస్య ధనుర్థారీ...రామస్య ప్రియదర్శనం” అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మిచెట్టు కొమ్మకు గుచ్చి, రామచిలుక దర్శనం చేసుకుని, జమ్మి ఆకు చేతబట్టుకుని, స్నేహితులకు ఇవ్వడం దసరా విశేషం. అలాగే, రంగు-రంగుల పూలతో, అందచందంగా అలంకరించిన బతుకమ్మలను ఉరేగింపుగా తీసుకుపోతూ, భక్తీ శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ, ఊరిబయట వున్న నది ఒడ్డుకో, ఏటి ఒడ్డుకో, చెరువు ఒడ్డుకో పోయి, మహిళలంతా గుమికూడి జరుపుకునేదే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ ఆఖరి రోజు పండుగ సద్దుల బతుకమ్మ. ఒకప్పుడు పల్లెటూళ్లతో సహా బస్తీలలో కూడా అట్టహాసంగా జరుపుకున్న ఈ పండుగలు, క్రమేపీ వాటి సహజ శైలిలో జరగకపోవడం, కొన్ని చోట్ల దాదాపు కనుమరుగవడం జరిగినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో, వాటి పునఃప్రాభవం సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పండుగలు మళ్లీ అట్టహాసంగా జరుపుకోవడం చూస్తున్నాం. అన్ని పండుగాలలాగే వీటికీ చారిత్రిక నేపధ్యం వున్నది.

         పండుగలన్నింటిలోకి పెద్ద పండుగగా చెప్పుకునే దసరాను శరన్నవరాత్రి అని కూడా అంటారు. నవరాత్రులుగా జరుపుకునే ఈ పండుగలో భాగమే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ పండుగకు కొత్త అల్లుళ్లను, ఆడపడుచులను ఆహ్వానిస్తారు. అందరూ కలిసి-మెలిసి ఆనందంగా గడుపుతారు. ఈ పండుగ జరుపుకునే రోజుల్లోనే, మన తెలంగాణా ప్రాంతంలో, తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుని తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ చేసుకుని ఆడపిల్లను అత్తారింటికి పంపినట్లే బతుకమ్మ-గౌరమ్మను నీటిలో కలిపి అత్తారింటికి సాగనంపుతారు.

         విజయదశమి అంటే విజయం అని అర్థం. పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేసే పూర్వరంగంలో, అక్కడికి చేరుకునే ముందు, తమ అస్త్ర-శస్త్రాలను ఒక జమ్మిచెట్టుమీద వుంచి అవి తమకు తప్ప ఇతరులెవరికీ కనిపించకుండా ఏర్పాటు చేస్తారు. వారికి మాత్రమే అవి అస్త్ర-శస్త్రాలుగా కనిపించి, ఇతరులకు శవాకారంలో కనిపిస్తాయి. వారి అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ఉత్తర గోగ్రహణం సందర్భంగా, ప్రగల్భాలాడుతూ యుద్ధానికి వచ్చిన ఉత్తరకుమారుడు కౌరవ సైన్యాన్ని చూసి భయపడి వెనుదిరిగి పారిపోతుంటే, ఆయనకు సారథిగా వచ్చిన బృహన్నల (అర్జునుడు) జమ్మిచెట్టుమీద వున్న అస్త్రాలను బయటకు తీసి యుద్ధం చేసి, కౌరవులను ఓడించి విరాటరాజుకు విజయం చేకూరుస్తాడు. యుద్ధంలో అలా కౌరవులను జయించిన రోజునే “విజయదశమి” అని “దసరా” అని అంటారని ఒక కథ ప్రచారంలో వుంది.

         దీన్ని గురించే మరో కథ ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో బహుళ ప్రచారంలో ఎప్పటినుండో వుంది. ఆ మండలంలో మా గ్రామం వనంవారి కృష్ణాపురానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో బాణాపురం అనే గ్రామం వుంది. దానికి దగ్గరలోనే భక్తరామదాసు జన్మించిన నేలకొండపల్లి అనే గ్రామం వుంది. ఇది కూడా మండల కేంద్రమే. బౌద్ధుల కాలంనాటి ఎన్నో చారిత్రిక అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. పాండవులు శస్త్రాస్త్రాలను వుంచిన జమ్మిచెట్టు వున్నవూరుకే బాణాపురం అన్న పేరొచ్చింది అంటారు. బాణాపురం నుండి నేలకొండపల్లికి వెళ్ళే మార్గమధ్యంలో, నేలకొండపల్లికి ఆనుకుని, పది-పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మట్టిగద్దె వుంది. దీన్ని విరాటరాజు గద్దె అని ఇక్కడి స్థానికులు పిలుస్తారు. ఇదిప్పుడు పురాతత్వశాఖ వారి అధీనంలో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ ఆరామంలాగా వుంది. ఈ గద్దె నుండే విరాటరాజు పరిపాలన చేశాడని ఈ ప్రాంతంవారు నమ్ముతారు. గద్దెకు అతిసమీపంలో పెద్ద-పెద్ద గాడిపొయ్యిలు వున్నాయి. వలలుడుగా విరాటరాజు కొలువులో పనిచేసిన భీముడు వంటచేసిన స్థలం ఇదని చెప్పుకుంటారు.

         దసరా పేరులోనే వున్నట్లు ఇది పదిరాత్రుల పండుగ. దక్షిణ భారతదేశంలో మొదటి తొమ్మిది రాత్రులను నవరాత్రులనీ, పదవరోజును విజయదశమి అనీ అంటారు. ఈ పదిరోజులు ప్రతిరోజూ లలితా సహస్రనామాల పారాయణం చేస్తుంటారు అంతా ఒక చోట చేరి. అయితే పురాతన సంస్కృత గ్రంథాలలో కానీ, పౌరాణిక ప్రామాణికాలలో కానీ దసరాను పండుగ దినంగా పేర్కొన్న దాఖలాలు లేవు. క్రీస్తుపూర్వం నాటి ప్రథమ, మధ్య శతాబ్దాల కాలం నాటి సూత్ర గ్రంథాలలో దసరాను ఏటేటా ఆనవాయితీగా జరుపుకునే ఒక రకమైన సత్యనిష్టా కార్యక్రమంగా మాత్రమే దీనిని అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో దసరా జరుపుకునే పదిరోజులు మట్టిబొమ్మలను, వివిధ ఆకృతులతో సేకరించి, బొమ్మల కొలువుగా ఇంటింటా తీర్చిదిద్దే ఆచారం ఎప్పటినుండో వస్తున్నది. బొమ్మలకొలువు పెట్టుకున్న ప్రతి ఇంటికీ పేరంటాళ్ళు రావడం, సంగీత కార్యక్రమాలు చేసుకోవడం, పండుగ వాతావరణంలో కాలక్షేపం చేయడం ఆనవాయితీ. పదిరోజుల బొమ్మల కొలువు తరువాత బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా తీసి, భద్రపరచి, మరుసటి సంవత్సరం మరికొన్ని కొత్త బొమ్మల సరసన వీటిని చేర్చి, ఆ ఏడాదికూడా బొమ్మలకొలువును ఏర్పాటుచేసుకోవడం జరుగుతుంటుంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆరాధించే, పూజించే సంరక్షిత దేవతల్లో, తెలంగాణవారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. జీవితాన్ని ప్రసాదించి, రక్షించే దేవత బతుకమ్మ అని నమ్ముతారు చాలామంది. నవరాత్రుల్లోనూ, దసరా పండుగ దినాల్లోనూ, ఆ దేవతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మూడొందల సంవత్సరాల క్రితం, ఇప్పటి వరంగల్ జిల్లాలోని, మొగిలిచర్ల గ్రామానికి చెందిన భట్ట నరసింహా అనే ఓ జానపద కవి తన కవితలో బతుకమ్మ ఆవిర్భావాన్ని వర్ణించారు. అందుకనేమో వరంగల్ వాసులకు బతుకమ్మ మీద ఇతరుల కంటే ఎక్కువ భక్తి. ఓ రకమైన స్థానిక ప్రత్యేకత సంతరించుకున్న ఈ పండుగను చారిత్రాత్మక వరంగల్ ఖిల్లా సమీపంలో ఉన్న భద్రకాళి (పద్మాక్షి) గుడి ప్రాంగణంలో, జనం గుమిగూడి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. గిరిజన సంప్రదాయ నేపథ్యంలో, కాకతీయ రాజులు ఈ పండుగ ఆవిర్భావానికి వికాసానికి కారకులై ఉండొచ్చు. జనాదరణ పొందిన పలు పండుగలను ప్రచారంలోకి తెచ్చిన ఘనత కూడా కాకతీయులదే.


         మొగిలిచెర్ల జానపద కవి రాసిన పాటలో బ్రతుకమ్మను గురించిన వివరాలున్నాయి. చోళ దేశంలో ధర్మాంగ అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య సత్యవతి. ఆ దంపతులకు నూరుగురు పుత్రుల సంతానం. అందరూ ధైర్యసాహసాలు కలవారైనప్పటికీ, ఓ యుద్ధంలో శతృవుల చేతిలో మరణిస్తారు. దుఖంతో కృంగిపోయిన ధర్మాంగ-సత్యవతి దంపతులు లక్ష్మీదేవి కటాక్షం కోరకు అడవుల్లోకి పోయి తపస్సు చేస్తారు. ఫలితంగా సాక్షాత్ లక్ష్మీదేవే ఆ దంపతులను ఆశీర్వదించి, పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని నామకరణం చేస్తుంది. అంద చందాలతో యవ్వనవతి అయిన బతుకమ్మను విష్ణుమూర్తి చక్రాంక పేరుతో వివాహమాడుతాడు. వారికి ఆరువేల మంది అతి చక్కని ధైర్యసాహసాలు గల పిల్లలు పుడతారు. సుఖసంతోషాలతో వీరంతా ఉంటుండేవారు. అది బతుకమ్మ పుట్టి పెరిగిన విధం. చోళరాజు ధర్మాంగకు కానీ, ఆయన కుటుంబానికి కానీ వరంగల్, తెలంగాణ ప్రాంతానికున్న సంబంధం గురించిన వివరాలు చరిత్రలో అంతగా లేవు.

         చరిత్రలో ఏం చెప్పినా ఇప్పటికీ ఎవరైనా దంపతులకు పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుంటే ఆ తరువాత పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని నామకరణం చేసే సంప్రదాయం తెలంగాణలో చాలాచోట్ల ఉంది. బతుకమ్మను ఆరాధిస్తూ కొలుస్తూ పాడే పాటల్లో కేవలం లక్ష్మీదేవి వర్ణనే కాకుండా గౌరి, సరస్వతుల వర్ణన కూడా ఉండడమంటే బహుశా ఆమెను త్రిమూర్తిణి గా భావించడమేమో. బతుకమ్మను కొలుస్తూ ఆ పండగప్పుడు ఆడుతూ ఎన్నోపాటలు పాడుతుంటారు స్త్రీలు. ప్రతి పాట చివర చరణంలో చివరగా ‘కోలు’ అనో, ‘ఉయ్యాల’ అనో, ‘చందమామ’ అనో, ‘గౌరమ్మా’ అనో ఉంటుంది. బతుకమ్మను కొలిచే విధానం, దానికి కావలసిన సన్నాహాలు ఎలా చేసుకోవాలి ఒకటి-రెండు పాటల్లో వివరంగా ఉన్నాయి.

         బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూ ఆడతుంటారు. కోలాటం, కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మచెక్కలాడడం బతుకమ్మ పండుగలో భాగం. పాటల్లో-కథలోని ప్రధానాంశం ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో మొగుడితో ఎలా ఉండాలో, మెట్టినింటి గౌరవ మర్యాదలు ఎలా కాపాడుకోవాలో ఉంటుంది. ఈ రీతిగా ఆడపిల్లలకు బుద్దులు నేర్పడం పూర్వాకాలం సంప్రదాయం. బతుకమ్మ బొమ్మను ఉంచాల్సిన పళ్లెం ఆకులతో కానీ, వెదురుతో కానీ చేయాలంటారు. గుమ్మడిపూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి పసుపుతో తయారుచేసిన బతుకమ్మను (గౌరమ్మ) ఉంచుతారు. ఈ మొత్తం బతుకను ఒక స్థలంలో ఉంచి సంప్రదాయ రీతిగా పూజిస్తారు. ఇలాంటి మరికొందరు తయారుచేసిన బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ లయబద్దంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు. ఓ గుడి ముందో, ఎవరైనా ఇంటి ముందో దీనికి అనువుగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు.

ఎనిమిది రోజుల పాటు.. అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలుపెట్టి ఇలా ఎవరో ఒకరింటి ముందర చేసి తొమ్మిదో రోజున సమీపంలోని ఏటి ఒడ్డునో, నది ఒడ్డునో, చెరువు దగ్గరో చద్దుల బ్రతుకమ్మగా ఆడి నీటి ఒడిలో ఆమెను చేరుస్తారు. అంటే అత్తగారింటికి సాగనంపుతారన్నమాట. కంటికీ చెవికీ విందు కలిగించే పండుగ బతుకమ్మ.  చక్కటి చీరలు ధరించి అతి చక్కగా తయారయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుకుంటూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళతారు. మంచి కంఠమున్న ఓ పెద్ద ముత్తయిదువ పాటను ఆరంభిస్తే మిగిలిన వారందరూ ఆమెతో గొంతు కలుపుతుంటారు. పురుషులు వారికి తోడుగా పోయి ఆ పాటలను ఆస్వాదిస్తారు.

         ప్రసాదం లేకుండా పండుగే లేదు. ఐదు రకాల ప్రసాదాలను (పెసరపప్పు, గోధుమపిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో తయారుచేసినవి) ఈ పండుగలో పంచిపెడతారు. లోగడ జగడాలాడి మాటలు కలవని స్త్రీలు కూడా అవన్నీ మర్చిపోయి బతుకమ్మ పండుగలో మళ్లీ స్నేహితులవుతారు. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది.

         ఏ పండుగయినా, పబ్బమయినా జరుపుకునేది ఆహ్లాదం కొరకే. మానవాళి అంతటికీ దైనందిన, యాంత్రిక, మార్పులేని జీవితంతో విసుగెత్తడం సహజం. ఇటువంటి జీవితానికి ఎప్పుడో అప్పుడు ఎడంగా ఉంటాలంటే పండుగల లాంటివి అవసరం. ప్రతిరోజు శలవుదినమైనా జీవితం దుర్భరమవుతుంది. అందుకే వారంలోని కొన్ని రోజులు శలవుదినాలని, కొన్ని పనిదినాలని భావిస్తాం. కొన్ని రోజులు ప్రార్థనకు పరిమితమయితే మరికొన్ని రోజులు ఆనందంతో గెంతులు వేయాలి కదా. అడప దడప పదిమందితో కలసి మెలసి ఆనందించాలంటే పండుగలు కావాలి. తరాలు, అంతరాలు అనే భేదం లేకుండా కులమతాలకతీతంగా ఆస్తులు, అంతస్తులకు దూరంగా డాబు, దర్పం, హక్కులకు తావీయకుండా సమాజంలో అందరు వ్యక్తులు ఏదో ఒక కార్యక్రమంలో సహజీవనం చేయాలి. అదే పండుగ. అలాంటి పండుగలలో అతి ప్రధానమైనవి దసరా, బతుకమ్మ. దేవతారాధన పేరుతో మనం ఇస్తున్న నైవేద్యం స్వర్గంలో ఉన్న దేవుళ్లకు చేరాలంటే దసరా, బతుకమ్మ లాంటి పండుగలు జరుపుకుని సమాజంలో కలసి మెలసి బతకాలి. అది కొంతసేపే కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, అయినా తప్పనిసరి.

No comments:

Post a Comment