Saturday, November 16, 2019

మాజీ ఐఏఎస్ స్వర్గీయ చంద్రమౌళితో అనుబంధం .... వనం జ్వాలా నరసింహారావు


మాజీ ఐఏఎస్ స్వర్గీయ చంద్రమౌళితో అనుబంధం  
వనం జ్వాలా నరసింహారావు

“చంద్రమౌళి స్పీకింగ్....యీజ్ జ్వాలా దేర్?” అని ఫోన్లో కంచు గొంతుకతో అడిగే  మాజీ ఐఏఎస్ అధికారి శాశ్వతంగా కన్నుమూశారు. బుధవారం నవంబర్ 13 న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారాయన. ఆయన మృతికి గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం తెలియచేశారు. ఎనబైరెండు సంవత్సరాలు జీవించిన ఆ బడుగుజన బాంధవుడు, బలహీనవర్గాల పెన్నిధి చివరి రోజుల్లో ఆనారోగ్యానికి గురైనందున ఆయన్ను కలవడానికి వెళ్లే నాలాంటి ఆయన సన్నిహితులతో ఎక్కువగా సంభాషణ చేయలేకపోయేవారు. చివరిసారిగా ఆయన్ను నేను ఏడాది క్రితం స్వర్గీయ డాక్టర్ ఏపీ రంగారావు (రంగారావుకు కాన్సర్ రావడంతో ఇక ఎక్కువకాలం బతకనని చంద్రమౌళి గారిని కలవడానికి వెళ్లాడు) తో కలసి వెళ్ళినప్పుడు ఒకింత బాధ కలిగింది. ఉద్యోగం చేసినంత కాలం, అది ఏ ఉద్యోగం అయినా సరే, ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా సహాయ పడాలనే ఆర్భాటంతో, నవ్వుతూ-నవ్విస్తూ, వివిధ రకాలుగా ప్రతివార్నీ ప్రోత్సహిస్తూ వుండే చంద్రమౌళి ఆయనేనా అని బాధకలిగింది.

   డాక్టర్ వి చంద్రమౌళి 1937 సంవత్సరంలో తమిళనాడులో జన్మించారు. ఎంఏ ఆర్థికశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్. హిస్టరీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. సోషల్ యాంత్రపాలజీలో డాక్టరేట్ పొందారు. రెండు సంవత్సరాలు మద్రాస్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిగా 33 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేశారు. వాటిలో రెవెన్యూ పాలన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, ఆహార-పౌర సరఫరాల శాఖ, కార్మిక సంక్షేమ శాఖలున్నాయి. గవర్నర్ కార్యదర్శిగా శంకర్ దయాళ్ శర్మ దగ్గర, కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేశారు. అదే రోజుల్లో భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి చైర్మన్ గా కూడా వున్నారు. ఆంగ్లంలో తొమ్మిది పుస్తకాలు రాశారు. వాటిలో మూడు పుస్తకాలకు (హైదరాబాద్, చెన్నై, గోవా) నేను సహరచయితను. అప్పట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గా వ్యవహరించబడ్డ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిసంస్థలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో డైరెక్టర్ జనరల్ గా ఆయన 1995 లో పదవీ విరమణ చేశారు.

చంద్రమౌళి గారిని మా బంధువు డాక్టర్ రంగారావు ద్వారా 1984-85 సంవత్సరంలో మొదటిసారిగా కలిశాను. అప్పట్లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా, డాక్టర్ రంగారావు వికలాంగుల కార్పోరేషన్ ఎండీగా పనిచేసేవారు. ఎన్టీరామారావు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో అప్పట్లో నెలకొల్పిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీకాప్డ్’ (ఎన్ఐఎంహెచ్) కు చంద్రమౌళి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ప్రత్యేక అధికారిగా, డాక్టర్ రంగారావు తాత్కాలిక ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఎంహెచ్ లో ఒక ‘డాక్యుమెంటేషన్ కమ్ లైబ్రరీ’ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో దానికి అవసరమైన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయమని అప్పట్లో బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నన్ను అడిగారు చంద్రమౌళి, రంగారావులు. నేను తయారు చేసిన తరువాత బాగుందని అంటూ, ఆ ఉద్యోగం నాకిస్తామని చెప్పారు. తర్వాత పత్రికలో ప్రకటన చేయడం, నాకన్నా ఎక్కువ అర్హతలున్న నా లైబ్రరీ సైన్స్ క్లాస్మేట్ హరికృష్ణరెడ్డికి ఆ ఉద్యోగం రావడం జరిగింది. అలా చంద్రమౌళి గారితో ఐన పరిచయం ఆయన చనిపోయేదాకా కొనసాగింది.

నాకు ఎన్ఐఎంహెచ్ లో ఉద్యోగం ఇవ్వలేకపోయాననే భావన చంద్రమౌలిగారిలో వుండేది. నవంబర్ 1985 లో శంకర్ దయాళ్ శర్మ స్థానంలో కుముద్ బెన్ జోషి గవర్నర్ గా నియామకం కావడంతో చంద్రమౌళి బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నాకు రాజ్ భవన్లో ఉద్యోగం ఇప్పించడానికి నిర్ణయించుకున్నారు. కుముద్ బెన్ జోషి, అంతకు ఏడేళ్ళ ల్రితం శారదా ముఖర్జీ గవర్నర్ గా వున్నప్పుడు స్థాపించిన చేతన స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పలు కార్యక్రమాలను చేపట్టారు. చేతన స్వచ్ఛంద సంస్థలో నన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించారు చంద్రమౌళి. వాస్తవానికి నాకు అప్పగించిన పనుల్లో రాజ్ భవన్ లైబ్రరీ పునరుద్ధరణ కూడా వుంది. చంద్రమౌళి గారు నన్ను తక్షణమే రిలీవ్ చేయాలని, నా సేవలు అత్యంత ముఖ్యమని బీహెచ్ఇఎల్ అధికారులకు చెప్పడంతో నేను అక్కడ రిలీవ్ అయి రాజ్ భవన్లో జనవరి 1, 1986 న కొత్త ఉద్యోగంలో చేరాను. చేరిన కొద్దిరోజులకే రాజ్ భవన్ క్వార్టర్స్ లో నాకు ఇల్లు కూడా కేటాయించారు. కారణాంతరాల వల్ల నన్ను ఆ ఇల్లు ఖాళీ చేయమని కుముద్ బెన్ జోషి తరువాత వచ్చిన గవర్నర్ కృష్ణకాంత్ నన్ను అదేశించినప్పుడు ఆయన ఆదేశాలను నేను హైకోర్టులో సవాలు చేసిన సందర్భంలో చంద్రమౌళి నాకు ఎంతగానో సహాయ పడ్డారు. నా అఫిడవిట్ మొత్తం ఆయన సూచనతోనే రూపొందించుకున్నాను. 


చంద్రమౌళి రాజ్ భవన్లో అన్నీ ఆయనే. గవర్నర్ కుముద్ బెన్ జోషికి ఆయన సలహాలు, సూచనలు చాలా ఇష్టం. ఆమె చంద్రమౌళికి అమితమైన గౌరవం ఇచ్చేది. ‘నీసా’ స్వచ్ఛంద సంస్థ ఆరంభించడంలో, ‘చేతన’ స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంలో ఆయన పాత్ర కీలకం. ఆ రెండు సంస్థల ద్వారా చేసిన కొన్ని కార్యకలాపాలు ఇప్పటికీ గుర్తున్నాయి. జోగినీ వ్యవస్థ రూపుమాపడానికి నీసా ద్వారా చేసిన కృషిలో భాగంగా చంద్రమౌళి చొరవతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ణిలో లవణం, హేమలతా లవణంల తోడ్పాటుతో “చెల్లి నిలయం” కార్యాచరణ వ్యవస్థ ఏర్పాటు, దరిమిలా రాజ్ భవన్ దర్బార్ హాలులో నాటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర మంత్రి జలగం వెంగళరావు,  గవర్నర్ కుముద్ బెన్ జోషి సమక్షంలో ముగ్గురు జోగిన్ల వివాహం, ధిల్లీలో జోగిన్ల సంక్షేమం మీద జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వరద బాధితులకు సహాయం, వయోధికాశ్రామం ఏర్పాటు, ఉద్యమంలాగా మొక్కలు నాటడం, భారత-పాకిస్తాన్ బెనిఫిషరీ క్రికెట్ మాచ్ లాంటివి చంద్రమౌళి చొరవతోనే జరిగాయి. అలాగే ‘చేతన’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం చంద్రమౌళి పుణ్యమే. అప్పటి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరోకాదు, నేటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ క్రికెట్ మాచ్ నిర్వహణలో మాజీమంత్రి గీతారెడ్డి, నేను చురుగ్గా పాల్గొన్నాం.

ఒకసారి ‘చేతన’ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఒక డ్రైవర్ రాజ్ భవన్ క్వార్టర్లలో నివసిస్తున్నప్పటికీ, తనకు 24 గంటలు పని వున్నందున అదనంగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్స్) ఇవ్వమని అభ్యర్థించాడు. దానికి ఆమోదిస్తూ చంద్రమౌళి హెచ్ఆర్ఏ అంటే “హార్డ్షిప్ రెమ్యూనరేటివ్ అలవెన్స్” అని భాష్యం చెప్పారు. సహాయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలనేవారాయన. ఆయన వ్యక్తులకే కాకుండా ఎన్నో సంస్థలకు సహాయం అడక్కుండా చేశాడు. ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ కు చంద్రమౌళి అంటే చాలా ఇష్టం.

చంద్రమౌళి ఎక్కడ ఉద్యోగం చేసినా నన్ను అక్కడికి ఎదో ఒక కారణంతో డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళేవారు. రాజ్ భవన్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడే డిప్యుటేషన్ మీద మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేసి, టర్మ్ అయిన తరువాత వెనక్కు వస్తే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పుణ్యమా అని నా ఉద్యోగం పోతే, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా వున్న చంద్రమౌళి తన శాఖ పరిధిలోని హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ గాయత్రి రామచంద్రన్ కు చెప్పి సీనియర్ మానేజర్ గా ఉద్యోగం ఇప్పించారు. ఇండస్ట్రీస్ కార్యదర్శిగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సుమారు మూడెకరాల భూమిని హస్తకళల అభివృద్ధి సంస్థకు కేటాయించారు ఆయన. అక్కడే ఇప్పుడు మనకు కనిపిస్తున్న (ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం) సుమారు వంద కోట్లకు పైగా విలువ చేసే గోల్కొండ హస్తకళల ఎంపోరియం కట్టడం జరిగింది.

హస్తకళల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడే నాలుగేళ్ల తరువాత ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు డీజీగా వెళ్లడం, వెళ్ళిన కొన్నాళ్ళకే నన్ను అక్కడికి ఫాకల్టీ మెంబర్ గా డిప్యుటేషన్ మీద తీసుకుపోవడం జరిగింది. ఆ సంస్థ అభివృద్ధికి ఆయన రోజుల్లోనే అంకురార్పణ జరిగింది. ఇప్పుడున్న హాస్టల్, గెస్ట్ హౌజ్ భవనాల శంఖుస్థాపన ఆయన హయాంలోనే జరిగింది. అలాగే ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్నతాధికారిగా వున్నప్పుడు ప్రస్తుతం వున్న ఆ కార్యాలయ భవన సముదాయాన్ని కట్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా కట్టించాడని ఆయన్ను ఆక్షేపించిన వారు కూడాలేకపోలేదు. కడప కలెక్టర్ గా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారు.

నిబద్ధతకు, నిజాయితీకి, సామర్థ్యానికి, నైపుణ్యానికి, బడుగు-బలహీన వర్గాలవారికి అండగా వుండడానికి స్వర్గీయ చంద్రమౌళి పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో!     

లక్ష్మీ యుక్తుడు దుఃఖం ఎరుగడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-4 : వనం జ్వాలా నరసింహారావు


లక్ష్మీ యుక్తుడు దుఃఖం ఎరుగడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-4
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (17-11-2019)
లక్ష్మణుడితో శ్రీరాముడు ఇంకా ఇలా అంటాడు.
"పూలవాసనలతో కూడిన ఈ గాలి ఎంతో సుఖం కలిగిస్తూ చల్లదనం ఇస్తున్నప్పటికీ, సీత నా దగ్గర లేని కారణాన అగ్నిహోత్రంలాగా అమితమైన బాధ కలిగిస్తున్నాడు. ఇది వాయువు స్వభావ గుణం అందామా అంటే, సీతాదేవి నా దగ్గర వున్నప్పుడు అమితమైన సుఖం కలిగించేది కాని, ఇప్పుడిలా కాలుస్తున్నాడు. ఏం పాపమో? అప్పుడు నేను రాముడినే కాని ఇప్పుడు కాదా? అప్పటి గాలి ఇదికాదా? సీతాదేవి నా దగ్గర వున్నప్పుడు కష్టాలు కూడా సుఖంగానే వుండేవి. ఇఫ్పుడేమో, సుఖమైనవి కూడా దుఃఖంగానే అనిపిస్తున్నాయి. కాబట్టి, నా సుఖ, దుఃఖాలకు సీతాదేవే కారాణం. (దీని వాస్తవార్థం: లక్ష్మీ యుక్తుడు దుఃఖం ఎరుగడు...అలక్ష్మీ యుక్తుడు సుఖం ఎరుగడు). ఈ నీచమైన కాకి, నేను సీతాదేవితో పంచవటిలో వున్నప్పుడు మా వియోగాన్ని సూచిస్తూ ఆకాశం నుండి మా చెవులు కాల్చేట్లు కఠోరంగా కూస్తుండేది. ఇప్పుడేమో మళ్లీ మా సంయోగాన్ని సూచిస్తూ చెట్టు కొమ్మ మీద వాలి రెక్కలు విదిలిస్తూ మరీ-మరీ కూస్తున్నది. ఈ పక్షే పంచవటిలో వున్నప్పుడు సీతావియోగాన్ని సూచించింది. అదే ఇప్పుడు ఆ స్త్రీరత్నం సంయోగాన్ని సూచిస్తున్నది".

"పూల కొనలున్న చెట్ల మీద మనోహరంగా కూర్చొని పక్షుల సమూహాలు నా ధైర్యం చెడిపోయేట్లు, కామం పెరిగేట్లు, నానా రకమైన ధ్వనులు చేస్తున్నాయి విన్నావా లక్ష్మణా? కామ మదంతో కంపించి పోతున్న ప్రియురాలిని, దాని మగడు వెంటబడి పోయిన విధంగా గాలివల్ల కదులుతున్న తిలకపు పూలగుత్తిని మగ తుమ్మెద వెంటబడి తిరుగుతున్నది చూశావా? పేరుకు ఇది అశోక వనమే కాని, వాస్తవంగా కామక జనుల శోకాన్ని వృద్ధి చేసేది ఇది. ఇప్పుడు అది ఏం చేస్తున్నదంటావా? గాలి వల్ల కదిలించబడిన పూలగుత్తులతో అనేక పర్యాయాలు నన్ను కొట్టేదానిలాగా భయపెట్తున్నాయి. అశోకం ఆహారం తిననియ్యదు. మల్లెలు వాడిపోయేట్లు చేస్తుంది. మామిడి వన్నె మారుస్తుంది. కమలాలు ఆలోచనలను పెంచుతాయి. కలువలు చంపడానికి ప్రయత్నం చేస్తాయి. శృంగార చేష్టలతో, గర్వం కలిగిన మనసులతో, నిర్మలమైన చందనం లాంటివి పూసుకున్న మనుష్యులలాగా నిండార పూసిన మామిడిచెట్లు కాంతిగా ప్రకాశిస్తున్నాయి. లక్ష్మణా! పంపాతీరంలోని అడవుల్లో విలాసంగా అక్కడక్కడా కిన్నరులు తిరుగుతున్నారు....చూశావా? నీటి అలల్లో ప్రతిఫలించిన ఉదయకాలంలోని సూర్యుడిలాగా వున్న ఈ ఎర్రకమలాలను చూశావా? సంతోషకరములైన కహ్లారాలు, ఎర్రకలువలు, హంసలు, బెగ్గురులతో నిండిన నీళ్లను చూసావా? లేత సూర్యుడితో సమానమైన తుమ్మెద రెక్కలతో కొట్టబడిన అకరువులున్న మడుగును చూశావా? చక్రవాకాలతో కూడి మనోహరమైన వనం అనే వస్త్రాన్ని కప్పుకుని దప్పిక తీర్చుకోవడానికి వచ్చిన లేళ్లతో, ఏనుగులతో పంప ఎంతో ఆనందకరంగా వుంది".


"తామరపూలు గాలివాటానికి విజృంభించిన అలలతో తాకబడి, ఊయలమీద ఊగుతున్నట్లుగా, ఇంపుగా వున్నాయి చూశావా లక్ష్మణా? తామరరేకుల్లాంటి కళ్లు, కమలాలంటే ప్రీతి, కమలగంధి అయిన సీతను చూడలేక బతకడం వల్ల నేలకు భారమే కాని మరే ప్రయోజనం లేదు. లక్ష్మణా! ఈ మన్మథుడి కుటిల బుద్ధిని గురించి నేనేమని చెప్పాలి? ఎంతో దూరంగా వున్న నా ప్రాణంతో సమానమైన దానిని, కష్టంగా మాత్రమే సాధించవీలయ్యేది, శ్రేష్ఠమైన గుణాలు కలదానిని, ప్రియమైన శుభకర వాక్యాలు చెప్పేదానిని, నా స్మృతికి వచ్చేట్లు చేశాడు కదా? లక్ష్మణా! మన్మథుడు నన్నేమీ చేయలేడు. వాడివల్ల నాకు భయం లేదుకాని, ఈ వసంతుడు వాడికి తోడుగా వచ్చి నన్ను బాధిస్తున్నాడు. శత్రు బాహుళ్యం ఏర్పడింది. అందగత్తె అయిన సీతాదేవి సాంగత్యం వల్ల అందమైనవేవైనా నాకు అనురాగం కలిగించాయో, అవే ఆమెను ఎడబాయడం వల్ల అందం చెడి నాకు వైరాగ్యం కలిగించాయి. తక్కినవన్నీ ఎందుకు? తామరమొగ్గల రేకులను చూసైనా సంతోషిద్దామంటే సీతాదేవి కంటిరెప్పలతో అవి పోలినట్లుండడం వల్ల ఆమె స్మృతికి వస్తున్నది. అది పోనీయ్...కమ్మటి గాలిని చూసైనా సంతోషిద్దామంటే సర్వ ప్రాణాధారకమైన ఆ గాలి నన్ను బాధపెట్తూ, తామరపూలను తాకి, అలా వచ్చిన వాసన, పుప్పొడి, తీసుకుని చెట్లలోనుండి బయటకు వచ్చి సీతాదేవి విడిచే నిశ్వాసాన్ని పోలి నా మనస్సును ఆకర్షిస్తున్నాడు".

“లక్ష్మణా! పంపానదీ తీరంలో దక్షిణ తీరాన విస్తారంగా పూచిన గోగుకాడలు ఎంత ప్రకాశవంతంగా వున్నాయో చూశావా? లక్ష్మణా! కావిరాలు లాంటివాటితో ఘనంగా అలంకరించబడిన ఈ పర్వతరాజు వాయువేగంతో ఎగురగొట్టబడిన దుమ్మును చిత్ర విచిత్రంగా, సంతోషకరంగా లేవదీస్తున్నాడు. మనోహరంగా చెట్ల ఆకులు కనపడకుండా పూచిన అందమైన మోదుగులతో కొండచరియలు ప్రకాశిస్తున్నాయి. పూచిన కొనలుకల తీగెల గుంపులు తమను చుట్టుకోగా పంపా ఒడ్డున పూచిన చెట్లు దట్టమైన కాంతులను ప్రసరింపచేస్తూ, తమ కొమ్మలను ఊపుతున్నాయి. వృక్షాలు గాలికి కదులుతున్న కొమ్మలతో సంతోషంతో తమను సమీపిస్తుంటే కామ మదం కల యువతుల్లాగా తీగలు కౌగలించుకున్నాయి. వాయువు నానారసంకల జ్ఞానం కలవానిలాగా చెట్టు-చెట్టు, కొండ-కొండ, అడవి-అడవి తిరుగుతున్నాడు. పూచిన పూలతో కొన్ని వృక్షాలు తియ్యటి వాసన ఇస్తున్నాయి. కొన్ని పూలు ఆకులు కనపడకుండా మొగ్గలతో కప్పబడి వున్నాయి. కొన్ని ఆకులు నీలంగా వున్నాయి. కొత్త పూలంటే అనురాగం కల మదించిన తుమ్మెదలు, ఇది ఇంపనీ, ఇది తీపనీ, ఇది ఇపుడే వికసించినదనీ, భావిస్తూ, సంతోషంగా ఝంకారాలు చేస్తూ, పూలమీద పడిపోయాయి. ఒక తుమ్మెద తేనెమీది ఆశతో చెట్లలోని పూల చాటునుండి తటాలున దాన్ని విడిచి, బయటకు వచ్చి, వేరే చెట్లమీద ఎక్కువగా తేనె వుండడంతో అక్కడికి పోయింది. పూలు తమంతట తామే విశేషంగా రాలడం వల్ల అందమైన నేలలు సుఖంగా, మనుష్యులు పరచని పూలపాన్పుల్లాగా ప్రకాశిస్తున్నాయి".

Tuesday, November 12, 2019

కాళోజీ యాదిలో ఆ “ఇద్దరు” : వనం జ్వాలా నరసింహారావు


కాళోజీ యాదిలో ఆ “ఇద్దరు”
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి బుధవారం దినపత్రిక (13-11-2019)
స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ "ఇదీ నా గొడవ" ను నేను గత పది-పదిహేను సంవత్సరాలలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో? లేదో? తెలియదు. మొన్నీ మధ్య  ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి, తనకా పుస్తకం చదవాలని ఎన్నేళ్లగానో వున్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు. అప్పుడనిపించింది...ఎందుకు అందులోని విషయాలను కనీసం కొన్నైనా, పంచుకోకూడదని. అందుకే ఇది.. ఆసక్తి గల వారికి ఇదొక అవకాశం. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...

సర్దార్ జమలాపురం కేశవరావు గారంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు ఆయనకెంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో వున్నప్పుడు జరిగిన సంఘటనను, ఆయన వుదాత్తతను వివరించడంతో పాటు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనప్పుడు తను రాసిన గేయాన్ని ఆత్మ కథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఎలా ఓడిన విషయం కూడా చెప్పారు.

"నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నప్పుడు నిజాం మీద అంతిమ పోరాటం జరుగుతుండె. కాంగ్రెస్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నయి. అట్టనె వాటితో పాటు ప్రభుత్వ నిర్బంధం కూడా పెచ్చు పెరిగి పోయింది.......నా మీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర శిక్ష. ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్ల నుంచీ నేను జైల్ల వున్న. చిన్న కట్టెపుల్లకి జండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నా మీద కేసు. నిజానికి నేను నిలబడ్డనె గాని వందనమైతె చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష ఖాయం చేసి నన్ను బారక్ ల వేసిన్రు. జమలాపురం కేశవ రావు, హీరాలాల్ మోరియా, వల్లభి (అయితరాజు) రామా రావు, పాల్వంచ రంగారావు, ఊటుకూరు నారాయణ రావు, సి. వెంకట రావు, అప్పి వెంకట రాజయ్య-ఇలా పది, పదిహేను మంది వున్నం లోపట. వాండ్లతో పాటు నన్నూ పెట్టిన్రు......ఈ పదిహేను మందితోనె గడపాలె....బాగా తినెటోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు చదువుకునెటోండ్లం. అప్పి రాజయ్య గారు ప్రహ్లాద చరిత్ర బాగా చదివి వినిపించేటిది. మోతుకూరి నారాయణ రావుగారు కూడా పురాణాలు బాగా చదివెటోడు. అందరికంటె పెద్దవాడు, మొదటి నుంచీ ఉద్యమంల వున్నవాడు కష్ట నష్టాలు ఓర్చినవాడు జమలాపురం కేశవ రావుగారు. వల్లభాయ్ పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి బదులు తనొక్కడే పని చేస్తుండేవాడు. ఆయన తీరే అంత. చెత్తగిన పడివున్నప్పుడు ఎవరికి చెప్పినా వూడుస్తరు. కాని ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు. ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూడుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన కూచుని వున్నడు. ’ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల వూడుస్తుంటే నువ్వు కూచున్నవ్?’ అని అడిగిన. ’ఆ! అన్ని పనులూ తనే చేస్తున్నననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీ’ అని ఆయన అనగానే. ఈడ్చి చెంప మీద కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవ రావుగారు. అదీ ఆయన వుదాత్తత!"

"కందిలో సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది. నేనందులో పాల్గొన నందువల్ల కేశవరావు గారి గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ చదవమని చెప్పి పంపిన. ఆ గేయం: ’ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీ కేమి లేదన్నా...మొండి చేతుల అంగి మోకాలు దాక నీ మొలగుడ్దతోటి తిరుగు కేశన్న!...పల్లె బాటల బాధ ప్రజలతో బాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళ్లు) బాగ గురుతన్నా!...సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు కేశన్నా!...దిద్ది తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి లోటు కావన్నా!...జబ్బులేని ఒళ్లు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా!’. జమలాపురం కేశవరావు గారికి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరి శిష్యులుండెటోళ్లు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణాలో ఊరూరా తిరుగుతూ, (అటుకులో, బొంగు పేలాలో, బుక్కుకుంటూ, బెల్లం నములుకుంటూ) ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. వాండ్లు తిరగని వూరు లేదని చెప్పవచ్చు. జమలాపురం కేశవరావు  గారు ఆజానుబాహుడు. ధోతి పైకి చెక్కుకునెటోడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే అది తిని, నేలమీద పడుకునీ, బండలమీద పడుకునీ, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని తిరిగినవాడు....ప్రహ్లాదునిది హరి భక్తి. వీండ్లది ప్రజా భక్తి. ప్రజాసేవకు సర్వం అంకితం చేసిచేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషి వల్లనే ఈ ప్రజా వుద్యమాలు నడిచినై.....అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటి వాళ్లే".


"జమలాపురం కేశవరావు ఉత్తమోత్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 13 వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్ లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా వున్న చోట, తన సహచరులతో పాటు పదేసి రోజులు కాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం, పందిళ్లు వేయడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ ప్రతిదీ తాను కూడా చేసెటివాడన్న మాట. అతన్ని ‘పెద్దన్నా’ అని పిల్చెటోన్ని.....1952 లొ వరంగల్లులో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పార్లమెంటరీ నియోజక వర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి సర్దార్ జమలాపురం కేశవరావు పోటీ చేసిండు - కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహానుభావుడు, త్యాగి, ఉద్యమ శక్తిగలవాడు, కాంగ్రెస్ లోపట ఉండేటువంటి కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్ట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది వుంచుకుని అసెంబ్లీ సీటు రిజైన్ చేసిండు....వర్ధన్నపేట బై ఎలక్షన్ లలో కేశవరావు గారు మళ్లీ నిలబడి ఓడిపోయిండు. కాంగ్రెస్ లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు....కేశవరావు స్థానికుడు కాదు. ఆయనకి మధిర లోనో, ఎర్రుపాలెంలోనో టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. హయగ్రీవా చారికి, బొమ్మకంటి సత్యనారాయణకి టికెట్లు రాకపోవడం గమనించాలె. కేశవరావు గారు మంచి నడి వయసులోనె చచ్చిపోయిండు".

ఎవరైనా తమకు అవమానం జరిగినప్పుడు ఏ విధంగా తమ కింద వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారో తెలిపే విషయాన్ని సోదాహరణంగా వివరించారు కాళోజీ. అదే విధంగా కలిమి లేముల తేడా పాటించే విధానాన్ని కూడా చెప్పారు.

“నా షష్టి పూర్తి హైద్రాబాదులో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగింది. పి. వి. నరసింహారావు అప్పుడు మాజీ మంత్రి. కాంగ్రెస్ లో వున్నడు. సంచికకో గేయం రాసిండు. ఆ సభలో మాట్లాడుతూ...’కాళోజీ నాకంటె వయసులో ఆరు సంవత్సరాలు పెద్ద. చదువులో మాత్రం మూడు సంవత్సరాలె. చదువుకుంటున్నప్పుడు సీనియర్స్ కీ, జూనియర్స్ కి కూడా ఆయన నడవడి వుత్సాహం, వుత్తేజం కలిగించేటివి. అయితే మా పెద్దలు (పి. వి. భూస్వామి వర్గానికి చెందిన వాడు) కాళోజీ దగ్గరకు పోకండి, ఆయనతో మాట్లాడకండి, సావాసం పట్టకండి, అతను ఖతర్ నాక్ మనిషి అని చెప్పేవాండ్లు’ అన్నడు. ఇదన్నదెవరు? ముస్లిములు కాదు. ప్రభుత్వాధికారులు కాదు. పి. వి. నరసింహారావు గారి పెద్దలు. వారు భూస్వాములు, పట్వారీలు, పెత్తందార్లు. తమ పిల్లల్ని స్నేహితానికైనా కాళోజీ దగ్గరకు పోవద్దు, అతను ఖతర్ నాక్ మనిషి అనెటోళ్లన్నమాట......ఇక్కడ నైజాం సర్కార్, స్థానిక ముస్లిములు కాక మూడో ప్రమాదం పెత్తందార్ల నుంచీ కూడా వుండేది.......హిందువుల్లో కాపువాడు, రెడ్డి వాడు ఒకే దిక్కున కూర్చుని భోంచేయరు. దేశ్ ముఖ్ రెడ్డి, మామూలు రెడ్డిని పక్కన కూర్చో పెట్టుకోడు గద! బ్రాహ్మణ దేశ్ ముఖ్ తన పక్కన కరణాన్ని (బ్రాహ్మణ) కూర్చో బెట్టుకు భోంచేయడు. రాచ వెలమ వేరు, మామూలు వెలమలు వేరు. పెదకమ్మ వేరు, చిన కమ్మ వేరు. గద్వాల రాజావారూ, వనపర్తి రాజావారూ వేర్వేరు. ఒకే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులాల వాండ్లతో కలిసి మెలిసి వుండడం కలలో మాట. హిందువులలో ప్రతివారూ కూడ కొందర్ని గొప్ప వాండ్లని వాండ్లకి లొంగిపోవడం, కొందర్ని చిన్నవారని వాండ్లని లొంగదీసుకోవడం పరిపాటి. ఒకనితో తన్నులు తినేటోనికి ఇంకొకరిని తంతేగాని తృప్తిగాదు. దీనికో కథ చెప్తరు. ఒక తాశీల్దారు పేష్కారును తిట్టిండట. ఆ పేష్కారు గిర్దావరును తిట్టిండట. గిర్దావరు పటేలు, పట్వారీలను తిట్టిండట. వాండ్లు సుంకరివాడిని కొట్టి వాడి మీద విరుచుకు పడ్డరట. అతను ఇంటికి పోయి భార్యను కొట్టిండట, ఆ భార్య ఏం చేసిందీ? కుండలు బద్దలు కొట్టి తానే ఏడ్చిందట. అంటే ఎవరైనా సరే తమకు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తమ కింది వాని మీద తీర్చుకుంటరన్న మాట. తరతమ బేధాలు సమసిపోతే తమ పెత్తనం పోతుందని ఈ పెత్తందార్ల భయం".

Sunday, November 10, 2019

సీతను ఎడబాసి ప్రాణాలతో వున్నా ఏమి ప్రయోజనం? ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-3 : వనం జ్వాలా నరసింహారావు


సీతను ఎడబాసి ప్రాణాలతో వున్నా ఏమి ప్రయోజనం?
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-3
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (10-11-2019)
పంపా పుష్కరిణిని ఇంకా ఇలా వర్ణిస్తాడు శ్రీరాముడు.
"కొండల్లో, కోనల్లో, పుట్టిన నిండారు పూలగుత్తులతో నిండిన చెట్లు ఒకదానితో మరొకటి కలిసికొనగా కొండలన్నీ పూలకుప్పల్లాగా కనపడుతున్నాయి. పూలతో కప్పబడిన కొనలు కలిగి, ఎగురకొట్టడం వల్ల, భ్రమరం పైభాగం తలమీద పూలను ధరించి, నల్లగుడ్ద ముసుగువేసుకుని, ఆడుతూ-పాడుతూ వున్న స్త్రీలలాగా చెట్లున్నాయి. బంగారపు సొమ్ములు ధరించి, సరిగ వస్త్రాన్ని వల్లెవాటుగా పైన వేసుకున్న జనుల లాగా నిండా పూచిన గోగులున్నాయి చూశావా? వసంతం కొత్త-కొత్త పక్షుల ధ్వనులతో ఆక్రమించి భార్యలేని నాకు సహించలేని మనోవేదన కలిగిస్తున్నది. భార్యను ఎడబాసిన తీవ్ర దుఃఖం అనుభవిస్తున్న నన్ను మన్మథుడు చాలా బాధిస్తున్నాడు. కోవెలలు జయఘోషతో నన్ను సంతోషంగా పిలుస్తున్నాయి. రమ్యమైన అడవి వంకలలోని నీటికోళ్లు, మిక్కిలి సంతోషంతో మనొహరమైన ధ్వనులు చేస్తూ, సహించలేని పరితాపం నాకు కలిగిస్తున్నాయి”.

"లక్ష్మణా! మనం పంచవటి ఆశ్రమంలో వున్నప్పుడు ఇటువంటి మనోహరమైన ధ్వనులు వినపడినట్లయితే, జానకి సంతోషంగా నన్ను పిలిచి, ఆ ధ్వనులెంత రమ్యంగా వున్నయో వినమని నాకు చెప్పి సంతోషించేది. తనకు సంతోషమైనా, నాకు సంతోషం అయితేనేకాని ఆమెకు సంతోషకరం కాదు కదా? అనేకమైన పక్షుల గుంపులు నానావిధాలైన మనోహర ధ్వనులు చేస్తూ తీగెల పొదలమీద వాలుతున్నాయి చూడు. ఇంపైన ధ్వనులు చేస్తూ, అతిశయించిన ఆశతో, తమ జాతికి చెందిన పోతు పక్షులతో కూడి ఆడు పక్షులు తుమ్మెదలు పాట పాడుతుంటే ఆడుతున్నాయి. నీటికోళ్ల గుంపుల ధ్వనులతో, కోయిలల ఇంపైన స్వరాలతో, చెట్లు నాకు మన్మథ తాపాన్ని ఎక్కువ చేస్తున్నాయి. అందమైన అశోక పుష్పాల గుత్తులు నిప్పులుగా, తుమ్మెదల ధ్వనులు మంటల చిట-పట ధ్వనులుగా, ఎర్ర చిగుళ్లు జ్వాలల్లాగా, వసంతాగ్ని నన్ను కాలుస్తున్నది. వినపడుతున్న ఇంపైన కోయిలల ధ్వనులు, చక్కగా పూసిన వనాలు, ఈ వసంతకాలం సీతకు చాలా సంతోషమైనవి. అందమైన కళ్లు, ఇంపైన వాక్కులు, తుమ్మెదల్లాంటి ముంగురులు కలదైన సీతను ఎడబాసి తమ్ముడా! నేను ప్రాణాలతో వున్నా ఏమి ప్రయోజనం? సగం శరీరం పోగా తక్కిన సగం శరీరం ఏ పని చేయగలదు?"

"విస్తారంగా పూసిన పూపొదలు అన్ని చోట్లా కనబడుతున్నాయి. చకోరాల్లాంటి కళ్లు కల సీత మాత్రమే కళ్లారా చూద్దామంటే కనబడడం లేదు. అనురాగం కారణాన మన్మథుడితో పుట్టి, వసంతుడితో పెంచబడిన ఈ శోకాగ్నితో కమ్ముకున్న మనస్సు శుష్కిస్తుంటే నేనెలా సహించి వుండగలను? సీతాదేవి కనబడక నాకు శోకం కలిగించింది. ఈ వసంతుడు కనబడి చెమట బిందువులను ఆర్పివేస్తున్నాడు. సీతాదేవిని వదిలి తాపంవల్ల మాడుతున్న నన్ను, నిర్దయుడైన గాలి దహిస్తున్నాడు. రెప-రెప గాలి వీస్తుంటే, స్ఫటికపు గవాక్షాలలాగా విచ్చుకున్న పురులు ప్రకాశిస్తుంటే, ఆడ నెమళ్లు తమను చుట్టుకుని సేవిస్తుంటే, మత్తుతో పరవశించి మగనెమళ్లు సీతావియోగంతో మన్మథ పీడితుడనైన నన్ను, మరింత మన్మథార్తికి పాల్చేసి నాట్యం చేస్తున్నాయి. ఆడుతున్న మగ నెమలిని చూసి, ఆడ నెమలి సంభోగ ఇచ్చ ఎక్కువవుతుంటే, మగ నెమలితో అదీ ఆడుతుంటే, వదలని మదన తాపంతో రెక్కలు విచ్చి ఆడుతూ, ఆడ పక్షిని చేరబోతూ, మెల్లగా ధ్వనులు చేస్తూ మగ నెమలి భార్యలేని నన్ను పరిహాసం చేసేదానిలాగా, నా వంక చూసింది లక్ష్మణా! చూశావా ఇది?"


"ఈ మగనెమలి ప్రియురాలిని, రాక్షసుడు, అడవుల్లో అపహరించి దాచిపెట్టలేదు కాబట్టి, ఇది ప్రియురాలితో వేడుకగా వినోద క్రీడలు చేస్తున్నది. అవురా! ఈ వసంతకాల మహిమ గొప్పదనం? దాని మహిమ వల్లే కదా! పక్షిజాతుల్లో పుట్టినా, ఆ ఆడ నెమలి అనురాగాతిశయంతో మగనెమలి దగ్గరనే వుంది. రావణాసురుడు హరించకపోతే నా సీత కూడా ఈ విధంగా నన్ను చేరేది కదా! అలాంటి నా ప్రియురాలు జానకిని వదలిపెట్టి ఈ వసంతాన్ని ఎలా దాటుతాను? తేనెలు కారుతున్న పూల గుంపులతో అడవులు నిండినా, నా పూలు సంతోషం కలిగించలేక నా పాలిట వ్యర్థమయ్యాయి. ఈ పూలు మంచి కాంతిగా వున్నప్పటికీ, తేనె కోసం తుమ్మెదలు వస్తున్నా నా విషయంలో వ్యర్థమై నేలరాలుతున్నాయి. పక్షుల గుంపులు నాకు కామాన్ని పెంచడానికా అన్నట్లు మనోహర, అవ్యక్త ధ్వనులు చేస్తూ ఒకదానిని మరొకటి పిలుస్తూ సల్లాపాలు ఆడుతున్నాయి. నా ప్రియురాలు సీతాదేవి ఎక్కడ వుందో అక్కడ కూడా ఈ వసంతకాలం వుంటే, ఆమెకూడా నాలాగే మదనతాపాతిశయంతో వియోగ కారణాన బాధపడుతుండవచ్చు”.

"జానకి వున్నచోట వసంతకాలం లేదు. రావణుడెక్కడో రహస్య స్థలంలో దాచిపెట్టితే అక్కడ వసంత కాలం ఎలా వస్తుంది? అక్కడ కూడా ఇలాగే వుంటే ఆమె ఈ విరహతాపం ఎలా సహించగలదు? ఒకవేళ ఇలాగే అక్కడకూడా వసంత కాలం వుంటే, రాక్షసులు చుట్టుముట్టి, "చంపుతాం..కోస్తాం...నిన్ను పీక్కు తింటాం..." అని బెదిరించే మాటలు అంటుంటే ముఖం వెల-వెలపోయి ఆమె ఏం చేయగలదు? శృంగార రసానుభవం ఎలా కలుగుతుంది? మధ్య వయస్కురాలు, మెల్లగా మృదువుగా మాట్లాడే కోమల హృదయం కలది. సౌందర్యానికి స్థానమైనది. కొత్తగా వికసించే తామర రేకుల్లాంటి కళ్లు కలది. కాబట్టి ఈ వసంత సమయంలో కామం అతిశయించగా సహించలేక శరీరం వదులుతుందా? సీతాదేవి వయసులో వుంది. అందునా పతివ్రత కాబట్టి కామం తీర్చుకునే వీలులేక నా వియోగాన్ని సహించలేదు. లోకంలో భార్యాభర్తలు లేరా? ఎందుకు ఇంత తపిస్తున్నావు భార్యకై అంటావా? సీతాదేవి మనస్సు ఎల్లప్పుడూ నామీదే నిలిచి వుంటుంది. ఏ దశలోనూ దానికి విరుద్ధంగా జరగదు. ఆ కారణాన స్మరణకు రాకుండా ఎలా వుంటుంది? నన్ను నేను మరువగలనా? స్నేహం దూరమైనా కొద్దీ దగ్గరవుతుంది. సమీపిస్తే తగ్గుతుంది".

Saturday, November 2, 2019

సౌందర్య లక్ష్మితో కూడిన పంపా పుష్కరిణి ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-2 : వనం జ్వాలా నరసింహారావు


సౌందర్య లక్ష్మితో కూడిన పంపా పుష్కరిణి
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-2
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (03-11-2019)
అరణ్యకాండలో దీనసంరక్షణ అనే ధర్మాన్ని రామచంద్రమూర్తి అనుష్టించి చూపించాడు. కిష్కింధా కాండలో మిత్ర రక్షణ, అనుష్టించి చూపుతున్నాడు. పూర్వకాండలో జటాయువు లాంటివారికి మోక్షమిచ్చి తన పరాత్పరత్వాన్ని వెల్లడి చేశాడు. ఈ కాండలో ఆయన అసంఖ్యాకమైన కళ్యాణ గుణాలు చెప్పడం జరుగుతుంది. ప్రథమ కాండలో శరణాగతి మంత్రం అందులోని సీతాకళ్యాణం ద్వారా వివరించబడింది. అయోధ్యాకాండలో సర్వజన వ్యామోహ విషయత్వం చెప్పి నారాయణ శబ్దార్థం వివరించడం జరిగింది. అరణ్యకాండలో పంచవటీ వాసపర్యంత వృత్తాంతంతో మునిజనులు చేసిన కైంకర్యం చెప్పడం వల్ల "నారాయణాయ" అనే పదంలోని చతుర్థీ విభక్తి అర్థం చెప్పడం జరిగింది. ఖరాది రాక్షసుల వధతో మంత్రంలోని ఉత్తరార్థంలో "నమ" అనే మూడో పదం అర్థాన్ని విశదీకరించి మారీచ దర్శనం మొదలు జీవుడు ఉజ్జీవించే ఉపాయం చెప్పడం జరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి సీతను వెతికాడు అనే కథ వల్ల భగవంతుడు జీవుడిని ఉజ్జీవింప చేసే ఉపాయ చింతన చెప్పడం జరిగింది.

కిష్కింధాకాండలో ఆ జీవుడి దగ్గరకు ఆచార్యుడు పంపంపడం జరిగిందని చెప్పబడింది. శ్రీరామచంద్రమూర్తి విలాపం పేరుతో, నిత్య కైంకర్యపరులైన నిత్య శూరులను చూసి, అయ్యో! జీవులందరూ వీరిలాగానే భోగానికి అర్హులై కూదా ఎందుకు కొందరు నన్ను చేర రావడం లేదనే భగవంతుడి క్లేశం ప్రథమ సర్గలో వర్ణించడం జరిగింది. కమలాల, కలువల, మీనాల సమూహంతో మిక్కిలి ప్రకాశించే సౌందర్య లక్ష్మితో కూడిన పంపా పుష్కరిణిని చూసి రామచంద్రమూర్తి తమ్ముడైన లక్ష్మణుడితో తన దుఃఖం చెప్పుకొని ఇలా పలికాడు.

(ఇక్కడ పంపను పుష్కరణి అని అనడం జరిగింది. అరణ్యకాండలో చెప్పిన దాన్ని బట్టి, ఇది పోల్చుకుంటే, పంప అనేది సరస్సా? నదా? అనే సందేహం కలగవచ్చు. ఏదేమైనా, ఇప్పుడిది ఎక్కడ వుందనేది తెలుసుకోవాలి. దీనికి దగ్గరలోనే కిష్కింధ వుండాలి. పంప నదా? సరస్సా? అనే విషయం రామాయణాన్ని బట్టి పరిష్కరించడం సాధ్యపడకపోవచ్చు. బహుశా అది కొంత భాగం నదనీ, కొంత భాగం సరస్సనీ నిశ్చయించవచ్చు. స్థలం పరిశీలించితే కాని ఈ ఊహకు బలం చేకూరుతుంది. పంప హంపి కూడా కావచ్చు. ఈ హంపి ఇప్పుడు బళ్లారి దగ్గర హాస్పేటలో వుంది. ఇప్పుడు తుంగభద్ర అని పిలిచే నదినే ఒకప్పుడు పంప అని పిలిచారంటారు కొందరు. తుంగభద్రా నదీ తీరంలో వున్న ఒకానొక శివ క్షేత్రంలో వున్న ఈశ్వరుడిని పంపాపతి అని పిలుస్తారు. హంస సందేశంలో శ్రీరామచంద్రమూర్తి తానుండేది మాల్యవంతమనే పర్వతం అనిచెప్పాడు. మాల్యవంతం బళ్లారి దగ్గరలోనే వుంది. ఇది చూసుకుంటూ తూర్పు పర్వతాల వెంట పోతే వేంకటాద్రి కనపడుతుందని హంసతో చెప్పినట్లు కథ వుంది).


పంపను చూసిన సంతోషంతో శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి జ్ఞాపకానికి వచ్చింది. సీతాదేవి కోసం తానెంత శోకిస్తున్నాడో, వెలవెలబోయి వున్నాడో అనే విషయాన్ని తనలాగే ముఖ చిహ్నాలున్న తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. "వికసించిన కమలాలు, ఎర్ర కలువలు, వైడూర్యకాంతి కల నిర్మల జలాలు, ఆ నీటి ఒడ్డున నానా విధాలైన వృక్షాలు కల పంపను చూశావా సౌమిత్రీ ? శిఖరాలతో కొండలుండే రీతిగా ఎత్తైన కొమ్మలతో పంప చుట్టూ వున్న అడవుల్లోని చెట్లు పొగిడేవిధంగా వున్నాయి. ఊరి బయట కుటీరంలో ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ కృషిస్తున్న భరతుడి కొరకు, సీత రాక్షసుల చేతికి చిక్కి బాధపడుతున్నందుకు, శోకపీడితుడనైన నన్ను వసంతుడు అధిక దుఃఖంలో ముంచాలని చూస్తున్నాడు. దుఃఖించే వాడికి సర్వం అసహ్యంగా కనిపించినట్లే, సీతాభరతులకై ఏడ్చే నాకు కూడా ఈ కొలను విచిత్ర వనంతో చుట్టబడి, తాపం హరించి, ధేహకాంతి కలిగించి, చల్లటి నీటితో, మిక్కిలి సంతోషంగా వుంది.  పాములతో చుట్టబడి, మృగాలతో-పక్షులతో కూడి, కమలాలు, కలువలతో కప్పబడిన కొలను కనపడుతుంది చూశావా? లక్ష్మణా! అవే పచ్చిక పట్టులు. నీలం, పసుపు రంగుతో వుండడంతో, వాటిమీద చెట్లనుండి పూలు రాలడంవల్ల రత్న కంబళాల లాగా వున్నాయి”.

"దండిగా పూసిన పూలతో వృద్ధిపొందిన కొనకొమ్మలు కల చెట్లను, వికసించిన పూలుకల కొనలున్న తీగెలు ఆపాదమస్తకం కౌగలించుకున్నాయి చూశావా? సువాసనతో నిండిన వాడై, సుఖం కలిగించే విధంగా స్పృశించే వాయువు కలవాడై, విజృంభించిన మన్మథుడు కలవాడై, ఫలాలతో, పూలతో మనస్సును ఆకర్షించేవాడై, వసంతుడు ప్రకాశిస్తున్నాడు. మేఘాలు నీళ్లు కురిపిస్తున్నట్లే పూల చెట్లు పూల వర్షం కురిపిస్తున్నాయి. చూడు ఈ సౌభాగ్యం. కఠినమైన రాళ్లలో అడవి చెట్లు పూలు రాల్చాయి. గాలి వీస్తుంటే రాలిన, రాలుతున్న పూలతో కలిసి పిల్లగాలి ఆడుకుంటున్నది. గాలి పూలతో అందమైన కొమ్మలను తాకి, వాటి నుండి వచ్చే ధ్వనితో తుమ్మెదల ఝంకారం పేరుతో పాటలు పాడుతున్నది. కోవెలల మనోజ్ఞమైన పంచమధ్వనితో సంతోషంగా చెట్లకొమ్మలను ఆడించే విధంగా కొండగుహ వదిలి బయల్దేరి పాటపాడుతున్న దానిలాగా గాలి కనిపించింది. గాలి రివ్వున వీచడం వల్ల పూచిన కొమ్మలు ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఇంపైన పూలదండలాగా చెట్ల సమూహంలో ప్రకాశిస్తున్నది. మందానిలుడు శ్రీగంధంలాగా చల్లగా, మంచిపరిమళాన్ని అన్నిచోట్లా కలిసేట్లు స్పృశించిన వారికి వేడి పోయేట్లు సుఖ స్పర్శుడై చక్కగా విసిరాడు. తేనెల వాసనలు కొట్తున్న అడవుల్లో మదించిన తుమ్మెదల మనోహర ధ్వనుల వల్ల చెట్ల గాలి అతిశయంతో ఆడింది, పాడింది”.