Tuesday, November 12, 2019

కాళోజీ యాదిలో ఆ “ఇద్దరు” : వనం జ్వాలా నరసింహారావు


కాళోజీ యాదిలో ఆ “ఇద్దరు”
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి బుధవారం దినపత్రిక (13-11-2019)
స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ "ఇదీ నా గొడవ" ను నేను గత పది-పదిహేను సంవత్సరాలలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో? లేదో? తెలియదు. మొన్నీ మధ్య  ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి, తనకా పుస్తకం చదవాలని ఎన్నేళ్లగానో వున్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు. అప్పుడనిపించింది...ఎందుకు అందులోని విషయాలను కనీసం కొన్నైనా, పంచుకోకూడదని. అందుకే ఇది.. ఆసక్తి గల వారికి ఇదొక అవకాశం. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...

సర్దార్ జమలాపురం కేశవరావు గారంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు ఆయనకెంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో వున్నప్పుడు జరిగిన సంఘటనను, ఆయన వుదాత్తతను వివరించడంతో పాటు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనప్పుడు తను రాసిన గేయాన్ని ఆత్మ కథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఎలా ఓడిన విషయం కూడా చెప్పారు.

"నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నప్పుడు నిజాం మీద అంతిమ పోరాటం జరుగుతుండె. కాంగ్రెస్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నయి. అట్టనె వాటితో పాటు ప్రభుత్వ నిర్బంధం కూడా పెచ్చు పెరిగి పోయింది.......నా మీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర శిక్ష. ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్ల నుంచీ నేను జైల్ల వున్న. చిన్న కట్టెపుల్లకి జండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నా మీద కేసు. నిజానికి నేను నిలబడ్డనె గాని వందనమైతె చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష ఖాయం చేసి నన్ను బారక్ ల వేసిన్రు. జమలాపురం కేశవ రావు, హీరాలాల్ మోరియా, వల్లభి (అయితరాజు) రామా రావు, పాల్వంచ రంగారావు, ఊటుకూరు నారాయణ రావు, సి. వెంకట రావు, అప్పి వెంకట రాజయ్య-ఇలా పది, పదిహేను మంది వున్నం లోపట. వాండ్లతో పాటు నన్నూ పెట్టిన్రు......ఈ పదిహేను మందితోనె గడపాలె....బాగా తినెటోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు చదువుకునెటోండ్లం. అప్పి రాజయ్య గారు ప్రహ్లాద చరిత్ర బాగా చదివి వినిపించేటిది. మోతుకూరి నారాయణ రావుగారు కూడా పురాణాలు బాగా చదివెటోడు. అందరికంటె పెద్దవాడు, మొదటి నుంచీ ఉద్యమంల వున్నవాడు కష్ట నష్టాలు ఓర్చినవాడు జమలాపురం కేశవ రావుగారు. వల్లభాయ్ పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి బదులు తనొక్కడే పని చేస్తుండేవాడు. ఆయన తీరే అంత. చెత్తగిన పడివున్నప్పుడు ఎవరికి చెప్పినా వూడుస్తరు. కాని ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు. ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూడుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన కూచుని వున్నడు. ’ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల వూడుస్తుంటే నువ్వు కూచున్నవ్?’ అని అడిగిన. ’ఆ! అన్ని పనులూ తనే చేస్తున్నననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీ’ అని ఆయన అనగానే. ఈడ్చి చెంప మీద కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవ రావుగారు. అదీ ఆయన వుదాత్తత!"

"కందిలో సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది. నేనందులో పాల్గొన నందువల్ల కేశవరావు గారి గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ చదవమని చెప్పి పంపిన. ఆ గేయం: ’ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీ కేమి లేదన్నా...మొండి చేతుల అంగి మోకాలు దాక నీ మొలగుడ్దతోటి తిరుగు కేశన్న!...పల్లె బాటల బాధ ప్రజలతో బాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళ్లు) బాగ గురుతన్నా!...సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు కేశన్నా!...దిద్ది తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి లోటు కావన్నా!...జబ్బులేని ఒళ్లు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా!’. జమలాపురం కేశవరావు గారికి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరి శిష్యులుండెటోళ్లు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణాలో ఊరూరా తిరుగుతూ, (అటుకులో, బొంగు పేలాలో, బుక్కుకుంటూ, బెల్లం నములుకుంటూ) ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. వాండ్లు తిరగని వూరు లేదని చెప్పవచ్చు. జమలాపురం కేశవరావు  గారు ఆజానుబాహుడు. ధోతి పైకి చెక్కుకునెటోడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే అది తిని, నేలమీద పడుకునీ, బండలమీద పడుకునీ, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని తిరిగినవాడు....ప్రహ్లాదునిది హరి భక్తి. వీండ్లది ప్రజా భక్తి. ప్రజాసేవకు సర్వం అంకితం చేసిచేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషి వల్లనే ఈ ప్రజా వుద్యమాలు నడిచినై.....అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటి వాళ్లే".


"జమలాపురం కేశవరావు ఉత్తమోత్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 13 వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్ లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా వున్న చోట, తన సహచరులతో పాటు పదేసి రోజులు కాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం, పందిళ్లు వేయడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ ప్రతిదీ తాను కూడా చేసెటివాడన్న మాట. అతన్ని ‘పెద్దన్నా’ అని పిల్చెటోన్ని.....1952 లొ వరంగల్లులో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పార్లమెంటరీ నియోజక వర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి సర్దార్ జమలాపురం కేశవరావు పోటీ చేసిండు - కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహానుభావుడు, త్యాగి, ఉద్యమ శక్తిగలవాడు, కాంగ్రెస్ లోపట ఉండేటువంటి కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్ట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది వుంచుకుని అసెంబ్లీ సీటు రిజైన్ చేసిండు....వర్ధన్నపేట బై ఎలక్షన్ లలో కేశవరావు గారు మళ్లీ నిలబడి ఓడిపోయిండు. కాంగ్రెస్ లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు....కేశవరావు స్థానికుడు కాదు. ఆయనకి మధిర లోనో, ఎర్రుపాలెంలోనో టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. హయగ్రీవా చారికి, బొమ్మకంటి సత్యనారాయణకి టికెట్లు రాకపోవడం గమనించాలె. కేశవరావు గారు మంచి నడి వయసులోనె చచ్చిపోయిండు".

ఎవరైనా తమకు అవమానం జరిగినప్పుడు ఏ విధంగా తమ కింద వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారో తెలిపే విషయాన్ని సోదాహరణంగా వివరించారు కాళోజీ. అదే విధంగా కలిమి లేముల తేడా పాటించే విధానాన్ని కూడా చెప్పారు.

“నా షష్టి పూర్తి హైద్రాబాదులో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగింది. పి. వి. నరసింహారావు అప్పుడు మాజీ మంత్రి. కాంగ్రెస్ లో వున్నడు. సంచికకో గేయం రాసిండు. ఆ సభలో మాట్లాడుతూ...’కాళోజీ నాకంటె వయసులో ఆరు సంవత్సరాలు పెద్ద. చదువులో మాత్రం మూడు సంవత్సరాలె. చదువుకుంటున్నప్పుడు సీనియర్స్ కీ, జూనియర్స్ కి కూడా ఆయన నడవడి వుత్సాహం, వుత్తేజం కలిగించేటివి. అయితే మా పెద్దలు (పి. వి. భూస్వామి వర్గానికి చెందిన వాడు) కాళోజీ దగ్గరకు పోకండి, ఆయనతో మాట్లాడకండి, సావాసం పట్టకండి, అతను ఖతర్ నాక్ మనిషి అని చెప్పేవాండ్లు’ అన్నడు. ఇదన్నదెవరు? ముస్లిములు కాదు. ప్రభుత్వాధికారులు కాదు. పి. వి. నరసింహారావు గారి పెద్దలు. వారు భూస్వాములు, పట్వారీలు, పెత్తందార్లు. తమ పిల్లల్ని స్నేహితానికైనా కాళోజీ దగ్గరకు పోవద్దు, అతను ఖతర్ నాక్ మనిషి అనెటోళ్లన్నమాట......ఇక్కడ నైజాం సర్కార్, స్థానిక ముస్లిములు కాక మూడో ప్రమాదం పెత్తందార్ల నుంచీ కూడా వుండేది.......హిందువుల్లో కాపువాడు, రెడ్డి వాడు ఒకే దిక్కున కూర్చుని భోంచేయరు. దేశ్ ముఖ్ రెడ్డి, మామూలు రెడ్డిని పక్కన కూర్చో పెట్టుకోడు గద! బ్రాహ్మణ దేశ్ ముఖ్ తన పక్కన కరణాన్ని (బ్రాహ్మణ) కూర్చో బెట్టుకు భోంచేయడు. రాచ వెలమ వేరు, మామూలు వెలమలు వేరు. పెదకమ్మ వేరు, చిన కమ్మ వేరు. గద్వాల రాజావారూ, వనపర్తి రాజావారూ వేర్వేరు. ఒకే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులం వాండ్లల్లో కూడా కలిమి లేముల తేడా పాటించేటప్పుడు, వేరే కులాల వాండ్లతో కలిసి మెలిసి వుండడం కలలో మాట. హిందువులలో ప్రతివారూ కూడ కొందర్ని గొప్ప వాండ్లని వాండ్లకి లొంగిపోవడం, కొందర్ని చిన్నవారని వాండ్లని లొంగదీసుకోవడం పరిపాటి. ఒకనితో తన్నులు తినేటోనికి ఇంకొకరిని తంతేగాని తృప్తిగాదు. దీనికో కథ చెప్తరు. ఒక తాశీల్దారు పేష్కారును తిట్టిండట. ఆ పేష్కారు గిర్దావరును తిట్టిండట. గిర్దావరు పటేలు, పట్వారీలను తిట్టిండట. వాండ్లు సుంకరివాడిని కొట్టి వాడి మీద విరుచుకు పడ్డరట. అతను ఇంటికి పోయి భార్యను కొట్టిండట, ఆ భార్య ఏం చేసిందీ? కుండలు బద్దలు కొట్టి తానే ఏడ్చిందట. అంటే ఎవరైనా సరే తమకు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తమ కింది వాని మీద తీర్చుకుంటరన్న మాట. తరతమ బేధాలు సమసిపోతే తమ పెత్తనం పోతుందని ఈ పెత్తందార్ల భయం".

No comments:

Post a Comment