Monday, July 17, 2017

జిల్లా కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ లు : వనం జ్వాలా నరసింహారావు

జిల్లా కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ లు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-07-2017)

తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటై, రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 31 జిల్లాలున్నాయి. ఇన్ని జిల్లాల ఏర్పాటు ఒక విధంగా చెప్పుకోవాలంటే విప్లవాత్మకమైన ఒక భారీ పాలనా సంస్కరణ. కొత్త-చిన్న జిల్లాల ఏర్పాటుతో అతి పిన్న వయసులోనే చాలామంది ఐఏఎస్ అధికారులకి కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం కలిగింది. చాలామంది తమకప్పచెప్పిన బాధ్యతలను, బాధ్యతాయుతంగానే నేరవేరుస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపొతే అక్కడా-ఇక్కడా బహుశా అనుకున్న స్థాయిలో, ఆశించిన ఫలితాలు రావడంలేదా అన్న అనుమానం కూడా ఒక్కోసారి కలుగుతోంది. వీటిలో నిజా-నిజాలు ఏ మేరకో బేరీజువేసుకోవాల్సిన అవసరమైతే వుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్ష-సర్వే చేసుకోవాల్సిన అవసరం కూడా వుంది. విధి నిర్వహణలో ఏ మేరకు చిత్తశుద్ధి, నిబద్ధత కనపరుస్తున్నారో కూడా నిర్ధారించాల్సిన అవసరం వుంది. సామాజిక స్థితిగతులు, రాజకీయ ఎత్తుగడలపై కొంతమంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు అవగాహన అంత ఎక్కువగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజం కావచ్చు-కాకపోవచ్చు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పాలనాపరమైన పదవులు అతి పిన్న వయసులోనే కొందరు పొంద గలగినందువల్లనో, అనుక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లో, సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో సత్ సంప్రదాయాలు నెలకొన నందువల్లనో, అనుకోనివి కొన్ని జరుగుతుండవచ్చు.  

"భారత ఉక్కు వ్యవస్థ" గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, ఐఏఎస్-"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్”, భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటి వరకు, బ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ, ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా,  పలు రకాల వడపోత పద్ధతులను అవలంబించి, విస్తృతమైన-కఠినమైన రాత-మౌఖిక పరీక్షా విధానం ద్వారా, రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ  వుంటుంది. కర్తవ్య నిర్వహణలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదేవరికీ. భారతదేశ భవిష్యత్ ఈ వ్యవస్తపైనే ఆధారపడి వుందని అనేవారు సర్దార్ పటేల్.

ఏడాది పాటు ముస్సోరీలో, మరో ఏడాది వారికి కేటాయించిన రాష్ట్రాలలో అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ అనంతరం, ఒక సబ్ డివిజన్ లో, సబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి కావి చూసే అవకాశం అలా లభిస్తుంది మొదటిసారిగా వారికి. దాంతో పాటే ప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్-కలెక్టర్ తరువాత జాయింట్ కలెక్టర్ గా, సమగ్ర గిరిజనాభి వృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, అ తరువాత సుమారు ఏడెనిమిది సంవత్సరాలకు జిల్లా కలెక్టర్  గా నియామకం జరుగుతుంది.  తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరగడం వల్ల, నాలుగైదు ఏళ్ల సర్వీసున్నవారికి కూడా కలెక్టర్ గా పనిచేసే అవకాశo లభించింది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు.

అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్" గా పనిచేయడమే! ఆ పదవిలో వుండగా, కేవలం రెవెన్యూ సంబంధిత బాధ్యతలే కాకుండా, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో, పర్యవేక్షణలో, కలెక్టర్ అంచనాలకు మించిన  బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. అంతులేని ఈ పని భారాన్ని మోసేటప్పుడు, ఎంత విస్తృత స్థాయిలో శిక్షణ పొందినా సహజంగా తప్పులు దొర్లడం సహజం.

కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటు, వివిధ జిల్లాలలో చేపట్టి శాఖాధిపతులుగా నో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగానో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగానో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు వారి-వారి సామర్థ్యాన్ని, చాక చక్యాన్ని, పలుకుబడిని బట్టి. జిల్లా కలెక్టర్లుగా పని చేసినప్పుడు రాజకీయ నాయకులతో పెంపొందించుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి, మరి కొన్ని ప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి.


ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత అటు తరువాత సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో చదువులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ తర్వాత అంత, లేదా, అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానో, కేంద్ర కాబినెట్ కార్యదర్శిగానో, కేంద్ర సర్వీసులలో హోం, విదేశాoగ శాఖ కార్యదర్శిగానో  నియామకం కావడం. ఆ అవకాశo అతికొద్ది మందికి మాత్రమె దక్కుతుంది.

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న బాధ్యతల దృష్ట్యా, ఈ వ్యవస్థలో కొంత మార్పు తేవడం అవసరం. గ్రామీణ అవసరాల మీద పట్టున్న కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమిస్తే బాగుంటుందేమో అని కొందరు భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును క్షేత్రస్తాయిలో తుచ తప్పకుండా చేయాలంటే కొందరు సీనియర్లను జిల్లాలకు పంపడం మంచిదేమో! తప్పదేమో!

రాష్ట్రంలోని కనీసం మూడోవంతు జిల్లా కలెక్టర్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారులనే నియమిస్తే మంచిదేమో!. వారి పాలనానుభువం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగించబడటంతో పాటు అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకొనే అవకాశం వీరికి మరో మారు లభిస్తుంది.  గ్రామీణ భారతాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాంటివి ఇప్పుడు లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయాలి.  రాష్ట్రానికి, ప్రజా సమస్యలకు, గ్రామస్థాయి పధకాల అమలుకు దూరంగా పనిచేస్తున్న అధికారులను సీనియారిటీ పేరుమీదనో, ’మరే కారణంగానో’ అత్యున్నతమైన పదవులకు ఎంపిక చేయడం సమంజసం కాదు. సీనియర్ ఐఏఎస్ కలెక్టర్ల మార్గదర్సకత్వంలో జూనియర్లు పనిచేసే అవకాశం ఇచ్సినట్లవుతుంది.

ఇదిలా వుంటే, సివిల్ సర్వెంట్లకు-మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న చర్చ కూడా వుంది.  మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ.  బ్రిటిష్ సంప్రదాయాలనే చాలావరకు మనం అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం.  ఆచరణలోకి వచ్చేటప్పటికి, కొన్ని సందర్భాల్లో మనదైన శైలిలో నడుస్తున్నాం.  మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్ లో రూపొందించిన "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" లో వివరించారు. రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే మంత్రులు చట్టసభలకు జవాబుదారీ అయినట్లే, సివిల్ సర్వెంట్లు (అధికారులు) మంత్రులకు జవాబుదారీగా ఉండాలి.  మంత్రులకు అంటే, ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అర్ధం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ముఖ్య మంత్రి పదవిలో వున్నా, రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.  తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రధమ కర్తవ్యం.  ప్రభుత్వాలు మారినా వారి ఈ కర్తవ్యం మారదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి-అంటే సంబంధిత మంత్రికి-వారు అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలి. తమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమల్లో ప్రభుత్వానికి అండదండగా ఉండాలి.

ప్రభుత్వమంటే, సమష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న పూర్తి మంత్రి మండలి.  దాని అధినేత ముఖ్యమంత్రి.  సంబంధిత శాఖకు చెందిన పాలన విధానాన్ని నిర్ణయించేది ఆ శాఖ మంత్రే అయినా, అది యావత్ మంత్రి మండలి సమష్టి నిర్ణయమే. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగపరంగా ఏ విధమైన బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అలాంటి బాధ్యతే ఉంటుంది.  పాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖ ముఖ్య అధికారి పూర్తిగా తోడ్పడాలి.  తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి.  మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి. 

          సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, తాను అత్యంత శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా, అది పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది.  ఇదంతా జరిగిన తరువాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, అభిప్రాయభేదాలున్నా, అమలు విషయం వచ్చేసరికి ఎటువంటి అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో పనిచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు.  అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం పెరుగుతాయి.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్లో అమలవుతున్న సత్ సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టి పనిచేయడం మంత్రులకూ, అధికారులకూ మంచిది.


          ఈ నేపధ్యంలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి, వారి అనుభవాన్ని గ్రామీణాభివృద్ధికి, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు, పటిష్టమైన పాలనా వ్యవస్త రూపుదిద్దుకునేందుకు చర్యలు చేపట్టితే మంచిదేమో! END

Sunday, July 16, 2017

లంకను గెలవడం ఎలా అని ఆలోచించిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

లంకను గెలవడం ఎలా అని ఆలోచించిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (16-07-2017)

          లంకను గెలవడానికి దేవతాసమూహాలకైనా సాధ్యం కాదనిపిస్తుంది హనుమంతుడికి. వానరుల సంగతలా వుంచి, అసమానబలుడైన శ్రీరామచంద్రమూర్తి లంకకు వచ్చినప్పటికీ, రావణ రక్షణలో ప్రవేశించనలవికాని లంకానగరాన్ని ఏంచేయగలడన్న అనుమానమేస్తుంది ఆయనకు. పోనీ, మనకు విరోధమెందుకు? సీతను అప్పగించమని మంచితనంగా మాట్లాడేందుకు వీలులేదు. మంచిమాటలు రాక్షసుల చెవికెక్కవు. బలంతో మదించి, మత్తెక్కిన వారికి మంచిమాటలు రుచించవనుకుంటాడు (సామోపాయం కుదరదన్న భావన). ధన కాంక్ష లేని వీరికి లంచమిచ్చి వశపర్చుకోవడం కుదరదు. వీరికే ఐశ్వర్యం పుష్కలంగా వుంది. ఒకరి డబ్బుతో వీరికేంపని? ఒకవేళ ఇద్దామన్నా శ్రీరాముడి దగ్గర అంత ధనంలేదే!(దానోపాయం కూడా కుదరదని అర్ధం). పోనీ వారిలో వారికి కలహం పెట్టడం కూడా అసాధ్యమే. ఆపని చేయాలంటే వారిలో కొందరితోనైనా పరిచయం చేసుకోవాలి. తనను చూడగానే వారందరూ కలిసి కలహానికి వస్తారేకాని, స్నేహం చేయరుకదా!(భేదోపాయం కూడా వ్యర్ధమే). యుధ్ధంలో గెలుద్దామంటే అంతు చిక్కటం లేదు (దండోపాయం కుదరదేమోనన్న భావన). ఇలా పలు ఆలోచనలతో అభిప్రాయం వెంట, వెంట మార్చుకుంటాడు హనుమంతుడు.

          ఏ ఉపాయం చేయటానికైనా లంకకు రాగల వారెంతమందన్న లెక్కలు కూడా వేస్తాడు. నీలుడు, అంగదుడు, తను, సుగ్రీవుడు, నలుగురు మాత్రం సముద్రాన్ని దాటగలరనీ, అయితే, ఈనలుగురితో ఏం సాధించగలమనీ ప్రశ్నించుకుంటాడు. ఇంతకూ అసలిక్కడ సీత వుందో? లేదో? ఆ విషయం తేల్తే అప్పుడు లంకకు వచ్చే ఉపాయం గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు తాను చేయవలసిన పని సీతను వెతకడం, దానికి లంకలో ఎలా ప్రవేశించాలని యోచించడమనుకుంటాడు. తన మొదటి ఆలోచన, ఉపాయం, ఇదేనని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు.

ఎలాంటి ఆలోచనచేస్తే రామకార్యం నెరవేర్తుందో అట్లాంటి ఆలోచనే చేయాలనీ, ఆవిధంగానే నడవాలనీ, అనుకుంటాడు హనుమంతుడు. శిఖరాగ్రాన కూర్చుండి, కొంచెంసేపు ఆలోచిస్తాడు. లంకలోకి పోకతప్పదు...పోయేమార్గమేంటని ఆలోచిస్తాడు. తన భయంకర రూపం చూస్తే, క్రూర రాక్షసులు, రాక్షస సేనలు, వారు రక్షిస్తున్న లంకలోకి ప్రవేశించడం సాధ్యపడనీయరు. లోనికి రానీయరు. జయించి పోవాలంటే వారంతా మహాబలపరాక్రమ సంపన్నులు. కాబట్టి, బహిరంగంగా లోపలికి వెళ్లడం మంచిదికాదు. తెలవకుండా వంచించి, లోపలికి పోయి, కనపడవలసిన చోట కనపడుతూ, కనపడరాని చోట కానరాక వుండే రీతిలో వేషాలు మార్చాలనుకుంటాడు ఆంజనేయుడు. మొత్తం మీద చీకటి మాటున కార్యం చక్కబర్చుకోవాలని కూడా నిర్ణయించుకున్టాడు. (వాలివధ విషయంలో శ్రీరాముడిని అధిక్షేపించిన మహానుభావులు, హనుమంతుడి విషయంలో, ఎందుకో ఆక్షేపించలేదు. లేకపోతే, హనుమంతుడు పిరికి, మోసగాడు, కుట్రాలోచనచేసాడు, పౌరుషంతో బహిరంగంగా ఉన్నరూపంలోనే లంకలోనికి ప్రవేశించలేడా అని ప్రశ్నించేవారే!)

          ఈ ప్రకారం ఆలోచిస్తూ, దుర్భేద్యమై, ప్రవేశించనలవికాని, లంకానగరాన్ని కొంతసేపు రెప్ప వాల్చకుండా చూస్తాడు. చూసి, ప్రవేశిండం కష్టకార్యమని భావిస్తాడు. నిట్టూర్పులు విడుస్తాడు. రావణాసురుడి కళ్లల్లో కారం ఎట్లా కొట్టాలి, ఎట్లా మోసగించాలి అని ఆలోచిస్తాడు. సీతనెట్లు చూడగలననీ, ఎట్లు ఈకార్యం సాధించగలననీ, మధనపడ్తాడు హనుమంతుడు(సముద్రాన్ని దాటినప్పుడు నిట్టూర్పులు విడవనివాడు ఇప్పుడు చేస్తున్నాడంటే, దానికంటే ఇది కష్టతరమైన కార్యమని హనుమంతుడికి తోచుండాలి).


దేశకాల జ్ఞానం లేక, ఏకాలంలో, ఏదేశంలో, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచనలేక, పనిచేసే దూత, అతడి జ్ఞానహీనతవల్ల, సక్రమ ప్రయత్నంతో సాధ్యమని తోచినపని కూడా చేయలేడు. ఈకార్యం ఈప్రకారం చేస్తే తప్పక ఫలితమిస్తుందని బుధ్ధిమంతులు నిశ్చయించినా, పండితమానియగు వాడు, కార్యం చేయ సమర్ధత లేనివాడై, కార్యాన్ని, ప్రాజ్ఞుల ఆలోచనను కూడా విఫలం చేస్తాడు. నేనెలా ఈకార్యాన్ని సాధించగలను? చేయలేదన్న నింద నాకెలా రాకుండా వుండాలి? అని హనుమంతుడు మరీ-మరీ, ఆలోచిస్తాడు. ఐహిక-ఆముష్మిక శాస్త్రాలన్నింటినీ ఎరిగినవాడు, ఇతరుల మనస్సెరిగి మాట్లాడే స్వభావంకల నేర్పరి, ఇతరుల ఆకారం, చేష్టలు, సంజ్ఞలు ఎరిగినవాడు, అర్ధ-దాన-స్త్రీల విషయాలలో పరిశుధ్ధుడు, నేర్పరి, సద్వంశంలో పుట్టినవాడు మాత్రమే దూతగా పనిచేయడానికి అర్హుడు. అందరిమీద అనురాగమున్నవాడు, ధన-స్త్రీ విషయంలో శుచికలవాడు, జ్ఞప్తికలవాడు, దేశకాల స్థితినెరిగినవాడు, చక్కని దేహం కలవాడు, భయంలేనివాడు, మాటలందు నేర్పరితనం కలవాడు దూతగా వుండటానికి అర్హుడు. ఇన్నిగుణాలు హనుమంతుడిలో కలవనే విషయం పలుసందర్భాలలో బోధపడ్తుంది.

          "ఏవిధంగా చేస్తే నా ప్రయత్నం సఫలమౌతుంది? పగటి వేళ ప్రవేశించాలా? రాత్రి వేళా? ఈ రూపంలోనా? రూపం మార్చాలా? వివేకం చెడకుండా ఎట్లా ఈకార్యాన్ని నెరవేర్చగలను? ఎట్లా ప్రవర్తిస్తే సముద్రం దాటివచ్చిన శ్రమ వ్యర్ధంకాదు? ఇంత శ్రమ పడ్డవాడిని ఇక్కడ ఏంచేయకుండా వుండేదెట్లా? ఈక్షణమే ఈ రూపమ్తోనే పోవాల్నా? అలాపోతే, రాక్షసుల కంటబడితే, రామకార్యం, సీతాదేవిని వెతకడం చెడిపోతుందికదా? రాక్షస రూపంలో పోవాలా? లంకలోని వారందరూ ఒకరికొకరు తెల్సినవారేకదా? కొత్తవాడినైన నన్ను గుర్తించరా? ఇంకో రూపంలో పోయినా వారు తెలుసుకోవచ్చుకదా? ఈ రాక్షసులకు తెలియకుండా గాలికూడా లంకలో సంచరించలేదుకదా!" అని హనుమంతుడు పరి-పరి విధాలుగా ఆలోచిస్తాడు.


          "పోనీ ఇప్పుడు లంకలోకిపోవద్దు.... ఇక్కడే వుందామా? అప్పుడుకూడా  ఎవరో ఒకరు నన్ను కనిపెట్టరన్న నమ్మకమేంటి? తనకు వారు కనిపిస్తుంటే, తనెందుకు వారికి కనిపించడు? వారిక్కడికి రావడం నిజం, రామకార్యం చెడటం కూడా నిజం. కాబట్టి ఇదీ సరైన మార్గం కాదు" అనుకుంటాడు హనుమంతుడు. "అంటే ఇప్పుడీరూపంలో లంకలోకి పోవడం తప్పే..... వుండడమూ తప్పే. కాబట్టి చీకటి పడేవరకు ఇక్కడే దాక్కొని, ఆతర్వాత చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతాదేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి. అట్లైతే రామకార్యం చేసినవాడినన్న గౌరవంతో అతిశయించగలను" అని ఆలోచించాడు హనుమంతుడు. చీకటి పడేవరకు ఇక్కడే దాక్కొని, ఆతర్వాత చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతాదేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి అనే ఆలోచనకొచ్చాడో, దాన్ని కార్యరూపం చేయాలని సంకల్పించాడు. ఎప్పుడు సూర్యుడస్తమిస్తాడా, ఎప్పుడు సీతను చూడగల్గుతానా అని ఎదురుచూస్తుండగా, సూర్యుడు పడమటి కొండ పై అస్తమించాడు. సూర్యుడు పద్మినీ బాంధవుడైనందున, పద్మినైన సీత కార్యం తానుంటే నెరవేరదన్న భావంతో అస్తమించాడనుకోవాలి.  END

Thursday, July 13, 2017

రాముడు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు : వనం జ్వాలా నరసింహారావు

రాముడు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక 
(14-07-2017) and (15-07-2017)

రాముడు లోకోత్తరుడు. ఆయనలో వున్న మంచి గుణాలు ఎవరిలోనూ కనిపించవు. అటువంటి వ్యక్తి చరిత్రే  రామాయణం. వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు.అలావచ్చిననారదుడిని, "గుణవంతుడు, అతివీర్యవంతుడు,ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు,  ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి. నారదుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు.

చైత్ర మాసం-శుక్లపక్షం-నవమి తిథి నాడు, పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం-కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం అయింది. ఆ ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య,గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్చ స్థలాల్లో (సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్చ స్థానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి రాముడిని కనింది. శ్రీరామావతారానికి ముఖ్యకారణం కౌసల్య తపః ప్రభావమేనని అనవచ్చు. ఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్ల భగవంతుడు నవమి నాడు జన్మించాడు.

సౌమ్య నామ సంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగరక్షణకు తీసుకెళ్తాడు. 27వ రోజు, అంటే, శుక్ల త్రయోదశి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతా కల్యాణం జరిగింది. వివాహం జరిగింది నవమి నాడు కాదు. మరి ఆ 27వ రోజు, నవమి అని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఎందుకు మనవాళ్లందరూ వివాహం జరిగిన తిథి నాడు కాకుండా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం జరుపుతున్నారో సామాన్యులకు అర్థంకాదు-అర్థం చేసుకొని అడగాలని కూడా ఎవరూ అనుకోరు. 

వాల్మీకి శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, రామచంద్రమూర్తి అనే పేరుగలాయన మాత్రమే. అతి వీర్యవంతుడాయన. అసమానమైన, వివిధమైన, విచిత్రమైన శక్తి గలవాడు.  స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందంగలవాడు.  ఇంద్రియాలను, సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. 


 ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహానికి తోడు, ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలు కూడా వున్నాయి. శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. ఋజుస్వభావం గలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు. విష్ణువుతో సమానుడు. శ్రీమంతుడు.లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు.

ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు. ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడు. సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడు. అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగాదర్శనమిచ్చేవాడు. సమస్తభూతకోటికిపూజ్యుడు. అన్నింటా గుణ శ్రేష్ఠుడు. కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడు. గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు.

పంపా తీరంలోని వనంలో హనుమంతుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు.తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు హీనజాతివాడైనా, పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది.


శ్రీ రామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీ రామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్ట లేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తన సుఖాన్ని వదులు కోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ,పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి.


రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో, మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ-పురుషులు, దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి.

Tuesday, July 11, 2017

గుడ్ షెఫర్డ్ కేసీఆర్ : వనం జ్వాలా నరసింహారావు

గుడ్ షెఫర్డ్ కేసీఆర్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-07-2017)

గొల్లకుర్మల వస్త్రదారణకు ప్రతీకగా గొంగడి ధరించి, తలకు చెంగావి రంగు పాగా చుట్టి, సాక్షాత్తు సంప్రదాయ గొర్రెల కాపరిలా అవతారమెత్తిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్రంలో గొర్రెల అభివృద్ధి-పంపిణీ పథకానికి గజ్వేల్ లో జూన్ 20, 2017న లాంఛనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా, వినూత్నంగా, భారీస్థాయిలో గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టి, రాబోయే మూడేళ్ల కాలంలో రు. 25 వేల కోట్ల సంపద ఆర్జింజడంతో పాటు, తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో అగ్రగామిగా నిలిచేందుకు, యాదవులు తమ కుల వృత్తి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో అందరికంటే ముందు వుండేట్లు ఈ పథకాన్ని అమలు చేయాలని సేఎo సంకల్పించారు.

           రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది గొల్లకురుమలు జనాభా ఉన్నప్పటికీ దేశంలో రాజస్తాన్ మొదలుకొని చుట్టు పక్కల రాష్ట్రాల నుండి రోజుకు దాదాపుగా 650 లారీల నిండా గొర్రెలను దిగుమతి చేసుకునే దుర్గతి మనకు వుండేది. ఈ పరిస్థితి సిగ్గుచేటని, దీనికి చరమగీతం పాడి రాబోయే మూడేళ్లకాలంలో గొర్రెల పెంపకం భారీ స్థాయిలో చేపట్టి, ఆర్ధికాభివృద్ధి సాధించి, రు. 25 వేల కోట్లు నగదురూపేణా ఆర్జించాల్సిన తరుణం ఆసన్నమయ్యిందని సిఎo అన్నారు. ఇందుకు ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన ప్రతిపాదనలను, సూచనలను ప్రతి యాదవ సోదరుడు తుచతప్పక పాటించాల్సిన అవసరం కూడా ఎంతయినా వుంది.

           ఈ వినూత్న ప్రక్రియలో భాగంగా యూనిట్ ఒక్కింటికి 20 గొర్రెలను, ఒక పోతును రాష్ట్రంలోని ప్రతీ గొల్ల కురుమ కుటుంబానికి అందించడం జరుగుతున్నది. ఈ పథకం ద్వారా 150 లక్షల  గొర్రెలను రెండేళ్లలో రు. 10 వేల కోట్ల ఖర్చుతో గొల్లకురుమలకు  చేరువ చెయ్యాలని సంకల్పించారు. ఐతే ఇందుకుగాను, కావలసినన్ని గొర్రెలను అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలనుండి సమీకరించటంతో పాటుగా, 46 లక్షల ఎకరాల భూమిలో గొర్రెల మేత కోసం అవసరమైన గడ్డిని పండించడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పాటుగా 100 సంచార పశువైద్య ‘క్లినిక్’ లను అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాటి ద్వారా ఉచితంగా అత్యవసర సేవలు అందించే విధంగా ‘1962’ నెంబరు ద్వారా అట్టి వెసులుబాటును కల్పిస్తూ వీటన్నింటినీ ఒకే వేదిక నుంచి లాంఛనప్రాయంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా 825 లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమానికి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గమైన కొండపాక గ్రామం నుండి శ్రీకారం చుట్టారు సీఎo.

           గొర్రెల పంపిణీ కార్యక్రమం తొలుత 100 శాసనసభ నియోజకవర్గాల నుండి ఒకే రోజున చేపట్టటం జరుగింది. వాస్తవానికి ప్రభుత్వం ఒక్క రోజులో 4 లక్షల కుటుంబాలకు మాత్రమె గొర్రెల పంపిణీకి పూనుకున్నప్పటికీ, 7.61 లక్షల మంది నుండి దరఖాస్తులు రావడంతో, పరిశీలనా అనంతరం, 7.18 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ క్రమంలో తొలుత లక్షా యాభైవేల గొర్రెల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం ఒక కోటి గొర్రెలు అందుబాటులో ఉండగా 1.5 కోట్ల గొర్రెలను రాబోయే రెండేళ్లలో పంపిణీ చేయటం జరుగుతుందని అంచనా. ఆవిధంగా మొత్తం గొర్రెల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంటుంది. రెండేళ్ల వ్యవధిలో ప్రతి గొర్రె మూడు గొర్రెపిల్లలు అందించగలిగితే ఆ సంఖ్య 7.5 కోట్లకు చేరుతుంది. వాటిలోంచి 2.5 కోట్ల గొర్రెలను సంతానోత్పత్తికి గాను వదిలి పెట్టినట్లయితే మిగిలిన 5 కోట్ల గొర్రెలను తలకు ఒక్కింటికి రూ.5000 లకు అమ్ముకున్న పక్షాన రూ.25 వేల కోట్లు నిధి కురుమయాదవులకు సమకూరుతుంది. ఇది మానవ వనరులను వినూత్న పద్ధతిలో సద్వినియోగపరచుకునే ప్రక్రియగా అభివర్ణించవచ్చని సేఎo అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గరి నుండి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పఠిష్టపరచడమే లక్ష్యం గా పెట్టుకుని, ఆ క్రమంలో అహరహం పరిశ్రమిస్తూ, దిశానిర్దేశాలు జారీ చేస్తూ, బడుగుల ఆశాజ్యోతిగా నిలుస్తూ, చరిత్రలో మరెవ్వరూ తీసుకురాని నూతన విధానాలను అవలంబిస్తూ మెరుగైన పాలన అందించటంలో తనకు తానె సాటి అనిపించుకున్నారు కెసిఆర్.


ఈ దిశగా ముందుకు పోతూ వంశపారంపర్యంగా వస్తున్న కుల వృత్తులను విస్మరించకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆర్ధికాభివృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దేందుకు తగు ప్రణాళికలు తయారుచేస్తూ వచ్చారు. వారు తమకాళ్లపై తాము నిలదొక్కుకునే విధంగా ఎన్నో ఆలోచనలు చేసి వాటిని ఆచరణలోకి తీసుకువచ్చారు. మాంసానికి (ముడిసరుకుగా) ఉన్న గిరాకీని గుర్తించి అది నిత్యంపెరిగేదే కానీ తరిగేదికాదనే సత్యాన్ని గుర్తెరిగి, యాదవులు, కురుమలలో ఉన్న సామర్ధ్యాలను అంచనా వేసి వంశపారంపర్యంగా వారు నిపుణతతో సాగిస్తున్న గొర్రెల పెంపకాన్ని అందునా వారు పాటించే మెళుకువలను దృష్టిలో పెట్టుకుని వారికి చేయూతను అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం సాగించాలని నిర్ణయించారు కెసిఆర్.

ఈ వినూత్న ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ వల్ల మాంసం మన స్థానిక అవసరాలకు సరిపడే విధంగా అందుబాటులోకి రావటంతో పాటు ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు, మనం ఎగుమతి చేసే పరిస్థితికి చేరుకోగలుగుతాం.

ఇందుకు గాను మనం పారదర్శకతతో కూడుకున్న సమగ్ర సూచనలను, ప్రమాణాలను పాటిస్తూ, మార్గదర్శకాలను తుచ తప్పక పాటించాల్సిన తరుణం ఆసన్నమైంది. యాదవ కురుమ కుటుంబాలలో 18 సంవత్సరాలు దాటిన ప్రతీ వ్యక్తిని సంఘంలో సభ్యునిగా నియమించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మించి సభ్యులు ఉన్నా వారిని సంఘంలో చేర్చుకుంటారు. అవసరాన్ని బట్టి సంఘాల సంఖ్యనూ పెంచుకోవడం జరుగుతుంది. సంఘంలోని ప్రతీ సభ్యునికి 20 గొర్రెలు, ఒక్క గొర్రెపోతు చొప్పున అందచేస్టారు. ఈ పాటికే గొర్రెల మంద పోషిస్తున్న కుటుంబాలకు కూడా అదనంగా 21 గొర్రెలను పోతుతో సహా అందజేయడం జరుగుతుంది. ఎవరైనా లబ్ధిదారుల్లో ఉద్యోగులు ఉన్నట్లయితే వారి బదులు ఆకుటుంబంలోని తండ్రినో, అతని తమ్ముడినో సభ్యునిగా చేసి వారికి ఈ మందను అందజేస్టారు.


ఒక్కో మందలో 20 గొర్రెలు, ఒక పోతు ఉండడం వల్ల మందకు రూ. లక్షా 25 వేలు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో ప్రతీ లబ్దిదారుడు 25 శాతం అంటే రూ.31,250 వరకు ఖర్చు భరించాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం అంటే, రూ.93,750 ను ప్రభుత్వం తమ వంతు సబ్సిడీగా అందిస్తుంది. దీనిని బ్యాంకుల ప్రమేయం లేకుండా అందుబాటులోకి తీసుకవస్తారు. గొర్రెలపెంపకం నిమిత్తం ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులకు లోటు లేకుండా సిద్దంగా ఉంది. రూ.4000 కోట్లను ఎన్సీడీఎస్ కింద సమీకరించడానికి ప్రభుత్వ నిర్ణయించింది.

మొదటి సంవత్సరంలో సగం మందికి గొర్రెల మందలను అందిస్తారు. మిగిలిన సగం మందికి ఆపై సంవత్సరం అందజేస్తారు. గొర్రెల పంపకం ఏరాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా, మరే ఇతర వక్రమార్గాలకు పాల్పడనీయకుండా నిస్పక్షపాతంగా వారికి సహాయపడేందుకు లాటరీ పద్దతిలో పంపకాలు జరుగుతున్నాయి. ఒక గ్రామంలో 60 సంఘసభ్యులు నమోదయితే దాదాపు 30 మంది సభ్యుల సమక్షంలో లాటరీ విధానం ద్వారా (తొలివిడతలో) లబ్దిదారులను ఎంపికచేస్తారు.

రాష్ట్ర స్థాయిలో అయితే సంబంధిత కోళ్ల, మాంసాహార అభివృద్ధి సంస్థ నేతృత్వంలో పథకాన్ని అమలు చేస్తారు. జిల్లాలలో అయితే పశుసంవర్దక అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో పథకాన్ని చేపడతారు. మండల రెవెన్యూ అధికారులు, ఎంపిడిఓలు ప్రభుత్వ పశువైద్యులను ఏకంచేసి వారి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసి సమగ్రంగా పథకాన్ని అమలు జరిపించేలా చూస్తారు. వారం రోజుల పాటు సంఘాలలో సభ్యులను నమోదుచేసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న గొర్రెలను నిర్ధారించుకుని సభ్యుల నమోదు కార్యక్రమం చేపడతారు.

తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే గొర్రెల మందలను కొని సమీకరించటం జరుగుతుంది. దీనికి గాను ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ద తీసుకుంటున్నది. సంబంధిత అధికారులు పొరుగురాష్ట్రాలకు వెళ్ళి కావలసిన గొర్రెలను, పోతులను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కొనుగోలుకు, వాటి రవాణాకు, భీమా తదితర ఖర్చులు అన్నింటికీ అయ్యే వ్యయాన్ని భరిస్తుంది. ప్రతీ గొర్రెకు భీమా వర్తింపచేస్తారు. భీమా పథకాన్ని కొత్తగా కొనుగోలు చేసిన వాటికే కాకుండా ఆయా యాదవ, కురుమ లబ్దిదారుల సంఘాల కింద ఇప్పటికే ఉన్న వాటికీ వర్తింపచేస్తారు.

గొర్రెల మేత నిమిత్తం అటవీ ప్రాంతాలను ఆశ్రయించే పద్దతికి గతంలో ఉన్న నిబంధనలను తొలగించి అనుమతులు ఇస్తారు. సంబంధిత అటవీశాఖ అధికారులకు ఈ మేరకు రాష్ట్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తద్వార గొర్రెల, పోతుల గ్రాసం కోసం అటవీ ప్రాంతాలను ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 67.50 లక్షల ఎకరాల భూమి అటవీ ప్రాంతంగా వుంది. దాదాపు 15 లక్షల ఎకరాల భూమి కొండ ప్రాంతాలుగా ఉన్నాయి. వీటిలో వ్యవసాయం సాధ్యం కాదు. అలాగే యాదవుల కింద 15 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఎకాఎకిన రాష్ట్రం మొత్తంగా కోటి ఎకరాల భూమి గొర్రెల గ్రాసానికి గాను అందుబాటులో ఉంది. ‘స్టైలో గ్రాస్’ రకం గడ్డిని ఈ భూముల్లో పెంచి అది ఆరోగ్యకరమైన గ్రాసం కావటం వల్ల దానిని గొర్రెల వృద్ధికి వినియోగిస్తారు. పూలు, మామిడి పండ్లు పండించే ప్రాంతాల్లో గ్రాసం నిమిత్తం గొర్రెల మందలు తిరుగాడినట్లయితే వాటివల్ల అక్కడి రైతులకు మంచి ఎరువు ఈ గొర్రెల ద్వారా లభించడమే కాకుండా వాటికి గ్రాసం కూడా అందుబాటులో ఉంటుంది.

గొర్రెలను కొనుగోలు చేసే సమయంలోనే వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వాటికి కావలసిన టీకాలను సమయానుసారంగా అందిస్తారు. ఆయా యూనిట్లకు వైద్య బృందాలు నేరుగా లబ్దిదారుల ముంగిటకి వెల్లి కావలసిన సేవలు అందిస్తారు. ప్రతీ మండల స్థాయిలో ఒక్కో పటిష్టమైన పశువైద్య బృందాన్ని ప్రభుత్వ పక్షాన ఏర్పాటు కావిస్తారు. అన్ని గ్రామాల శాసన సభ నియోజకవర్గాల్లో సంచార పశువైద్య బృందాలను అందుబాటులోకి తెస్తారు. మండల స్థాయిలో పశువైద్య వ్యవస్థను పరిపుష్టం చేస్తారు. ఇప్పటికే 309 మంది పశువైద్యులను నియమించటం జరిగింది. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో గొర్రెలు, పోతులు వచ్చి చేరుతున్న సందర్భంలో రానున్న రెండు సంవత్సరాలలో మరింత మెరుగైన పశువైద్య బృందాలను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. గొర్రెల క్రయవిక్రయాలకు సంతలను స్థానికంగా ఏర్పాటు చేసి ప్రతీ రెండు మూడు మండలాల్లో నిర్వహిస్తారు.

క్రైస్తవ సోదరులు విశ్వసించే ఏసుప్రభువును “గుడ్ షెఫర్డ్” గా ఆరాధిస్తుంటారు. అదే విదంగా రానున్న రోజుల్లో ఇన్ని వెసులుబాట్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను యాదవులు, కురుమలు సమిష్టిగా తమ పాలిట “గుడ్ షెఫర్డ్” గా కీర్తిస్తారు అనటంలో అతిశయోక్తిలేదు. ఇది సత్యం. ఇదో నూతన అధ్యాయం. 

Sunday, July 9, 2017

ఆకాశాన వున్న స్వర్గంలాగా కనిపించిన లంక ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

ఆకాశాన వున్న స్వర్గంలాగా కనిపించిన లంక 
ఆంధ్రవాల్మీకి వాసుదాసు 
సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (10-07-2017)

ఇతరులకెవరికీ దాటేందుకు సాధ్యపడని సముద్రాన్ని సులభంగా, అవలీలగా దాటి, త్రికూటపర్వత శిఖరమందున్న లంకను చూసిన తర్వాతనే హనుమంతుడి మనస్సు కుదుటపడింది. (హనుమంతుడు సముద్రాన్ని ఆకాశమార్గాన్నే లంఘించాడని రామాయణంలో స్పష్టంగా చెప్పినప్పటికీ, ఎగురలేదు.... ఈదిపోయాడు, అని వాదించే వారు కూడా వున్నారు). బహిరంగంగా తనుతిరిగితే రాక్షసులు చూస్తారేమోనన్న అనుమానంతో, ఉద్యాన వనంలోని చెట్ల చాటున తిరుగుతున్న ఆంజనేయుడిపై వృక్షాలు జల-జలా పూలు రాల్చాయి. ఆ పూల వాసనలను తన మీదుగా వ్యాపింపచేస్తూ హనుమంతుడు ఆపాదమస్తకం పూలతో నిండిపోయాడు (ఇక్కడ పుష్పాభిషేకం శుభసూచకమని అర్ధమవుతోంది). ఈ విధంగా నూరుయోజనాల సముద్రపు నిడివిని, ఎక్కడా మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా, ఓ నిట్టూర్పైనా విడువకుండా, వేగంగా, హనుమంతుడు దాటడం విశేషం.

           (హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటాడని రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. అయినప్పటికీ, ఇప్పుడు సముద్రమంత వెడల్పు లేదుకదా?...రావణాసురుడి లంక ఇదేనా?....అని కొందరు సందేహపడుతుంటారు. అయితే, కొన్ని బౌధ్ధ ప్రామాణిక గ్రంథాలను చదివినవారికి ఈ అనుమానం నివృత్తి చేసుకునే ఆధారాలు లభ్యమవుతాయి. ఇంద్రజిత్ హోమం చేసిన "నికుంభిల", సీతాదేవిని వున్చిన "అశోకవనం" ఇప్పటికీ వున్నాయక్కడ. అక్కడ సీతాదేవి పూజించబడుతున్నదనీ, "రావణకోట" అనే స్థలం కూడా వున్నదనీ, స్పష్టమవుతున్నది. దీన్నిబట్టి సింహళద్వీపమే ఈనాటి శ్రీలంక, ఒకనాటి లంక. అయితే, ఇప్పుడు సింహళద్వీపానికీ, మనదేశానికీ, మధ్యవున్న సముద్రం వెడల్పు అరవై మైళ్లే. నూరుయోజనాలకు, అరవై మైళ్లకు ఎంతోవ్యత్యాసముందని అనుకోవడం సహజం కదా. ఇకపోతే యోజనం కొలత, ఇంత అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎనిమిది మైళ్లని కొందరు, రెండున్నర మైళ్లని కొందరు లెక్కలు చెప్తారు. అదే విధంగా "ఆమడ", "క్రోసు"ల విషయంలో కూడా స్పష్టత లేదు. ఇప్పటిమైలు (1760 గజాలు) పూర్వంలేదు. కావున యోజనం అంటే, ఖచ్చితంగా ఇన్ని మైళ్లని నిర్ధారించలేం . అంతే కాకుండా ఇప్పుడు సముద్రం అరవై మైళ్లే అయినప్పటికీ, రామాయణ కాలంలో, ఎక్కువై వుండవచ్చు. సముద్ర భాగమ్ విశేషంగా పూడిపోయి క్రమేపీ నేలగా మారిందని శాస్త్రవేత్తలు వ్రాసి వున్నారు....వ్రాస్తున్నారు కూడా. ఇప్పటి రఘునాధ పురానికి దక్షిణ భాగమంతా పూర్వం సముద్రంగా వుండేది. అదే విధంగా, పురాణాలలో చెప్పిన దాన్ని బట్టి, ఇప్పటి తిరువాన్‍కూర్ పూర్వం సముద్రంలో మునిగుండేదట. అలాంటప్పుడు నేటి తిరునల్‍వెళ్లి సముద్రంలో మునిగి వుండవచ్చుకదా! రామాయణంలో చెప్పబడ్డ "త్రికూటం", "లంబపర్వతం", "సువేల" అనేవి లంకకు దక్షిణ భాగాన వున్నవేకాని, ఉత్తర భాగంలో లేవు. కాబట్టి ఇప్పటి లంకలోని ఉత్తర భాగం కూడా సముద్రంలో మునిగే వుండాలి. లేదా హనుమంతుడు ఈ ప్రదేశాన్ని వదిలి అక్కడకైనా పోయుండాలి. ఈ పర్వతం చుట్టూ సముద్రమున్నదన్నాడుకాని, గ్రామాలున్నట్లు వాల్మీకి చెప్పలేదు. "సువేల" అన్న పదమే సముద్ర తీరమన్న అర్ధాన్ని చెప్తోంది. లంకలోని ఇప్పటి ఉత్తర రేవుకు, త్రికూటానికి, మధ్య దూరం, నూరు మైళ్లకు పైనే వుంది. కాబట్టి హనుమంతుడు దాటింది రెండొందల ఏభై మైళ్లని తేలుతున్నది. అంటే నూరుయోజనాలు రెండొందల ఏభై మైళ్లకు సమానం కావచ్చు)

           అలుపూ, సొలుపూ లేకుండా, ఎన్ని ఆమడల దూరాన్నైనా దాటగల సత్తా నాకుండగా, నూరు యోజనాలొక లెక్కా! అనుకుంటూ, పరిమళించే తోటలను, నిర్మలమైన పచ్చిక బయళ్లను, చిన్న చిన్న గుట్టలను, పరికిస్తూ హనుమంతుడు కొండ పైనుండి చూస్తాడు. గాలికి కదుల్తున్న రెమ్మలు, కొనకొమ్మలు, వాటిపైనున్న పక్షుల సమూహాలున్న చెట్లను చూసాడు హనుమంతుడు. హంసలు, కన్నెలేళ్లు, తామర, కలువ పూలున్న దిగుడుబావులు, క్రీడాస్థలాలు, మడుగులు, పూచే, కాచే చెట్లు, కమలములతో నిండిన అగడ్తలను కూడా చూసాడు హనుమంతుడు.


          సీతను దొంగిలించి తెచ్చిన రావణాసురుడు, ఆమెకు కాపలాగా విల్లు, బాణాలు ధరించి ఎల్లప్పుడూ తిరుగుతుండే రాక్షస శ్రేష్ఠులుండే సమస్త ప్రదేశాలు కనిపించాయి ఆఝనేయుడికి. బంగారు మయమైన ప్రాకారాలూ, తెల్లని పెద్ద వీధులు, వందలాది అగడ్తలు, వాటిపైనున్న ధ్వజాలు, బంగారు తీగెల తోరణాలతో శోభాయమానంగా వున్న లంకను కొండ శిఖరాన్నుంచే చూసిన హనుమంతుడికది ఆకాశాన వున్న స్వర్గంలాగా గోచరించింది. (అయోధ్యకు "సాకేత"మనే పేరు, లంకకు "సింహళ"మనే పేరు ఇటీవల వచ్చినవే కాని పురాతన కాలంలో లేవు. సింహళం, సిలోన్, శ్రీలంక అయిన కారణం కూడా చెప్పారు చరిత్రకారులు).

లంకను చూసిన హనుమంతుడికది, ఆకాశంలో వ్రేలాడు తున్నట్లుగానూ, అవలీలగా ఎగిరిపోయేదానిలాగానూ, రావణుడి కాపలాదారుల రక్షణ కింద లోపరహితమైన కోటలున్న గొప్ప పట్టణం మాదిరిగానూ కనిపించింది. లంకను మొట్టమొదట విశ్వకర్మ నిర్మించాడు. కుబేరుడికి తొలుత స్థానమైంది. అంద-చందాలలో ఈవిధంగా ఉండవచ్చేమోనని ఉహించనలవికానిది. కోటగోడనే మొల, దాన్ని చుట్టి వున్న అగడ్తల నీళ్లనే చీర, శూలాలు, శతఘ్నులనే కొప్పు, అట్టములనే శిరోభూషణాలతో లంకానగరం స్త్రీలాగా వుంది హనుమంతుడి కళ్లకు.


          విశ్వకర్మ నిర్మితమై పాములతో నిండిన భోగవతి (పాతాళంలోని సర్పాల ముఖ్య పట్టణం) లాగా రాక్షసులతో నిండి, ఉత్తర ద్వారం కైలాస పర్వతం లాగా ఆకాశాన్ని తాకే ఎత్తైన ఇండ్లు కలిగి, భయంకరాకార రాక్షస సేనల గుంపుల కాపలా కిందున్న లంకా నగరాన్ని, దానికి అగడ్తగా చుట్టూ వున్న సముద్రాన్నీ చూసి ఆశ్చర్య పోయాడు హనుమంతుడు. దేవతలను జయించిన రావణాసురుడి పరాక్రమం ఇంతా అనుకుంటాడు. ఈ లంకకు వానరులు ఏవిధంగా రాగలరని, ఇంత సముద్రాన్ని అందరూ ఎట్లా దాటగలరని, ఒకవేళ నిర్బంధంగా రాగలిగినా, వారి ప్రయాణం వ్యర్ధమై తిరిగి పోవాలేమోనని, తనలో తను అనుకుంటాడు హనుమంతుడు.