Thursday, July 13, 2017

రాముడు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు : వనం జ్వాలా నరసింహారావు

రాముడు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక 
(14-07-2017) and (15-07-2017)

రాముడు లోకోత్తరుడు. ఆయనలో వున్న మంచి గుణాలు ఎవరిలోనూ కనిపించవు. అటువంటి వ్యక్తి చరిత్రే  రామాయణం. వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు.అలావచ్చిననారదుడిని, "గుణవంతుడు, అతివీర్యవంతుడు,ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు,  ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి. నారదుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు.

చైత్ర మాసం-శుక్లపక్షం-నవమి తిథి నాడు, పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం-కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం అయింది. ఆ ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య,గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్చ స్థలాల్లో (సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్చ స్థానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి రాముడిని కనింది. శ్రీరామావతారానికి ముఖ్యకారణం కౌసల్య తపః ప్రభావమేనని అనవచ్చు. ఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్ల భగవంతుడు నవమి నాడు జన్మించాడు.

సౌమ్య నామ సంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగరక్షణకు తీసుకెళ్తాడు. 27వ రోజు, అంటే, శుక్ల త్రయోదశి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతా కల్యాణం జరిగింది. వివాహం జరిగింది నవమి నాడు కాదు. మరి ఆ 27వ రోజు, నవమి అని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఎందుకు మనవాళ్లందరూ వివాహం జరిగిన తిథి నాడు కాకుండా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం జరుపుతున్నారో సామాన్యులకు అర్థంకాదు-అర్థం చేసుకొని అడగాలని కూడా ఎవరూ అనుకోరు. 

వాల్మీకి శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, రామచంద్రమూర్తి అనే పేరుగలాయన మాత్రమే. అతి వీర్యవంతుడాయన. అసమానమైన, వివిధమైన, విచిత్రమైన శక్తి గలవాడు.  స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందంగలవాడు.  ఇంద్రియాలను, సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. 


 ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహానికి తోడు, ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలు కూడా వున్నాయి. శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. ఋజుస్వభావం గలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు. విష్ణువుతో సమానుడు. శ్రీమంతుడు.లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు.

ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు. ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడు. సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడు. అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగాదర్శనమిచ్చేవాడు. సమస్తభూతకోటికిపూజ్యుడు. అన్నింటా గుణ శ్రేష్ఠుడు. కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడు. గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు.

పంపా తీరంలోని వనంలో హనుమంతుడిని చూసి, ఆయన మాటపై గౌరవం వుంచి, సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడు.తనకథ, సీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు. చెప్పిన తర్వాత, సుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు. రాముడు వానరుడితో స్నేహం చేశాడంటే అది అతడి సౌశీల్యాతిశయం గురించి చెప్పడమే. గుహుడు హీనజాతివాడైనా, పురుషుడైనందున అతనితో స్నేహం చేసినందువల్ల రాముడి సౌశీల్యం చెప్పడం జరిగింది. హీన స్త్రీ అయిన శబరితో స్నేహం చేయడంవల్ల రాముడు మిక్కిలి సౌశీల్యవంతుడయ్యాడు. వానరుడైన సుగ్రీవుడితో స్నేహమంటే మీదుమిక్కిలి సౌశీల్యం చూపడం జరిగింది.


శ్రీ రామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకాని, రోగబాధలుకాని, యీతిబాధలుకాని లేవు. పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదు. స్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు. వారికి వైధవ్య దుఃఖం లేదు. ఎక్కడా అగ్నిభయంలేదు. శ్రీ రామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మణులకు లెక్కపెట్ట లేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తన సుఖాన్ని వదులు కోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు. బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీ,పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి.


రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏమాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా. ఇది వినేవారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవసరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో, మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణించిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న యీ రామాయణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధిపత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగుతుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది. కాబట్టి నాలుగువర్ణాలవారు, స్త్రీ-పురుషులు, దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని-కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి.

1 comment:

  1. ధన్యోస్మి. వనం వారూ నా రాముడి గురించి ఎంతో బాగా వ్రాసారు. అభినందనలు. చాలా చాలా సంతోషం కలిగింది.

    ReplyDelete