Thursday, August 27, 2020

నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన పురంజనోపాఖ్యానం .... శ్రీ మహాభాగవత కథ-18 : వనం జ్వాలా నరసింహారావు

 నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన పురంజనోపాఖ్యానం

 శ్రీ మహాభాగవత కథ-18

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

         ఒకనాడు, ఏదైనా గొప్ప మహత్కార్యం చేయాలన్న తలంపుతో వున్న మహారాజు ప్రాచీనబర్హి దగ్గరికి నారదుడు వచ్చాడు. వచ్చి, ఏ శుభాన్ని కోరి మహత్కార్యం చేయాలనుకుంటున్నాడని ప్రాచీనబర్హిని ప్రశ్నించాడు. మోక్షస్థితిని తెలుసుకోవడానికి తనకు జ్ఞానోపదేశం చేయమని నారదుడిని అడిగాడు ప్రాచీనబర్హి. సంసార చక్రంలో పరిభ్రమించే తన లాంటివాడు మోక్షపదాన్ని పొందలేడు అని కూడా అంటాడు. అప్పుడు నారదుడు, యజ్జాలలో ఆయన చంపిన జంతువులు వేలసంఖ్యలో వున్నాయనీ, అవన్నీ ఆయన కసాయితనాన్ని స్మరిస్తూ, ఆయన ఎప్పుడైతే పరలోకం చేరుతాడో అప్పుడు ఆయన్ను హింసించడానికి ఎదురుచూస్తున్నాయనీ, ఆ ఆపద నుండి దాటడానికి ఒక ఇతిహాసాన్ని చెప్తాననీ అంటూ పురంజనోపాఖ్యానం చెప్పాడు.

         పూర్వకాలంలో పురంజునుడనే రాజుండేవాడు. అతడికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన కల విజ్ఞాతుడనే స్నేహితుడున్నాడు. తనకు అనుకూలమైన పురం కొరకు స్నేహితుడితో కలిసి పురంజనుడు భూమండలమంతా తిరిగాడు. భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు ఒకనాడు. అది గోపురాలతో, ప్రాకారాలతో, బురుజులతో, కందకాలతో.....ఇలా రకరకాల సౌకర్యాలతో, సర్వలక్షణాలు కల నాగుల నివాస పట్టణమైన భోగవతి లాగా వున్నది. ఆ పురానికి వెలుపల అందమైన ఒక ఉద్యానవనం వున్నది. అందులో సరస్సులున్నాయి. ఆ ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన యువతిని అనుచరగణంతో సహా చూశాడు. ఆమె ఎవరని, ఆమె పేరేమిటని, తండ్రి ఎవరని, ఆమెను అనుసరిస్తున్న వున్న పదకొండు మంది సేవకులు ఎవరని, ఆమె ఈ వనంలోకి రావడానికి కారణం ఏమిటని, ఆమె ముందు నడుస్తున్న పాము ఎవరని ప్రశ్నించాడు పురంజనుడు. తనను ప్రేమించమని కూడా అడిగాడు.      

తనకు తన తండ్రి ఎవరో, తన కులం ఏమిటో, పేరేమిటో, తానున్న ఈ పురం పేరేమిటో, దాన్ని నిర్మించిన వాడెవరో తెలియదనీ, తన వెంట వున్నవాళ్లు తన సఖులని, చెలికత్తెలని, ఆ పాము తను నిద్రించేటప్పుడు  పురాన్ని పాలిస్తుందని అన్నది ఆ యువతి జవాబుగా. తన భాగ్యవశాన పురంజనుడు అక్కడికి వచ్చాడని, ఆ పురాన్ని స్వీకరించి పాలించమని, తాను సమకూర్చే కోరికలన్నిటినీ నూరేళ్లు అనుభవించమని అన్నది. పురంజనుడు లాంటివాడిని తనలాంటి కన్య తప్పక వరిస్తుందని చెప్పింది. ఆ పద్మాక్షిని పురంజనుడు తక్షణమే వరించాడు. ఆ పురంలోకి ప్రవేశించి ధన్యుడయ్యాడు. వంద సంవత్స్రరాలు సమస్త సౌక్యాలను అనుభవించాడు. ఆ పురానికి వున్న మొత్తం తొమ్మిది ద్వారాల అధిపతులకు, తూర్పున వున్న అయిదు ద్వారాల అధిపతులకు మహాధిపతి పురంజనుడే. ఆయా ద్వారాల ద్వారా రకరకాల విషయాలను పొందుతాడు.

అతడి నగరంలో నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరు గుడ్డివాళ్లున్నారు. వాళ్ల సాయంతో ఆయన గమనం, కరణం అనే పనుల్ని నెరవేర్చుకుంటాడు. అంతఃపురంలోకి వెళ్లేటప్పుడు విషూచీ అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహప్రసాద హర్షాలను పొందుతాడు. ఇలా పురంజనుడు కామాసక్తుడై, ’బుద్ధ’ అనే పట్టమహిషి వల్ల వంచించ బడ్దాడు. ఆమె పురంజనుడు ఏది చేస్తే అది చేస్తుంది. తింటే తింటుంది, తాగితే తాగుతుంది, నడిస్తే నడుస్తుంది. అలా పురంజనుడు తన నిజస్వరూపాన్ని ఎడబాసి, పట్టమహిషి వల్ల మోసపోయి, జ్ఞానం కోల్పోయి, ఆ పురంలో కాపురం వున్నాడు. అలా కొన్నాళ్లు గడిచాక ఒకనాడు ధనస్సు, బాణాలు ధరించి సైన్యంతో కలిసి వేగంగా బయల్దేరి, పురాన్ని వదిలి, పంచవ్రస్తం అనే అడవికి వెళ్లి, పట్టమహిషిని విడిచి, మదంతో సంచరించాడు. మృగాలను దయాహీనుడై వధించాడు. వేటాడింది తన ఆహారం కోసం కాదు, కేవలం వినోదం కోసం చేసిన రాక్షస క్రీడ. జ్ఞానియైన విద్వాంసుడు చేయతగని హింసను చేసి, నియమాన్ని ఉల్లంఘించి, దుస్సహంగా వేటాడి, అలసిపోయి మందిరానికి వెళ్లాడు.

బడలిక తీరేదాకా నిద్రపోయాడు పురంజనుడు.

మళ్లీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసుపడ్డాడు. భార్య కనిపించక పోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు. కిందపడి పొర్లాడుతూ, ప్రణయ కోపం నటిస్తూ పడుకున్న భార్యను చూపించారు వారు. ఆమెను దగ్గరికి తీసి ఓదార్చాడు. అనునయించాడు. ఆమె కోపాన్ని వీడి అలంకరించుకుని భర్తను చేరింది. ఇద్దరూ శృంగారంలో రాత్రిపగలు అనే తేడా లేకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి గడిపి, ఆయువు క్షీణిస్తున్నదన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు. పురంజనుడు ఒళ్లు మరిచిపోయి జీవితాన్ని గడిపాడు. అతడి నవయవ్వన కాలమంతా అరక్షణం లాగా గతించి పోయింది. పదకొండు వందలమంది కొడుకులను, నూటపదిమంది కూతుళ్లను కన్నారు వారిద్దరు. అతడి ఆయుష్షులో సగభాగం తరిగిపోయింది. కుమారులకు, కుమార్తెలకు వివాహం చేశాడు. వారికి ఒక్కొక్కరికి వందమంది చొప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది.

ఆ తరువాత నిష్ఠగా యజ్ఞదీక్ష వహించి, అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు. ప్రాచీనబర్హి లాగానే యజ్ఞాలకోసం వేలాది పశువులను చంపాడు. తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. అప్పుడు చండవేగుడు అనే గంధర్వ రాజు పురంజనుడి పురాన్ని చుట్టుముట్టాడు. అతడు ఏమీ చేయలేక చింతాక్రాంతుడై పోయాడు. ఇదిలా వుండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవడంతో కోపించి శపించింది. యవన దేశాధిపతైన భయుడు కూడా ఆమెను తిరస్కరించాడు. ఆమెకు భర్త ఎవరో చెప్తానని అంటూ, తమ్ముడు ప్రజార్వుడుతో కలిసి పురంజనుడి పురాన్ని ముట్టడించాడు.  కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది. పురంజనుడు ఇష్టం లేకపోయినా ఆ పురాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధపడ్దాడు. శక్తిహీనుడైపోయాడు. తన సంతానాన్ని తలచుకుని తపించాడు. తాను మరణిస్తే భార్య అనాథై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు. అలా దుఃఖిస్తున్న పురంజనుడిని తీసుకుపోవడానికి భయుడు వచ్చాడు. అతడిని పశువును కొట్టినట్లు కొట్టి ఈడ్చుకుపోయాడు. అనుచరులంతా ఆయన వెంట వెళ్లారు. ఆయన వున్న పురం పంచభూతాలలో కలిసిపోయింది. చనిపోయి పరలోకం చేరిన పురంజనుడిని యజ్ఞపశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి. చాలాకాలం పరలోక బాధలు అనుభవించాడు. మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు.   

మలయకేతనుడనే పాండ్యరాజు విదర్భ రాకుమారిని వీర్యశుల్కంగా పొంది వివాహమాడాడు. వారిద్దరికి ఒక కూతురు, ఏడుగురు కొడుకులు జన్మించారు. కొడుకులు ద్రావిడ దేశాధిపతులయ్యారు. ఒక్కొక్కరికి కోటానుకోట్ల కొడుకులు పుట్టారు. మలయకేతుడి కుమార్తె అగస్త్యుడిని పెళ్లిచేసుకుంది. మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్లి వెయ్యి దివ్య సంవత్స్రాలు తపస్సు చేశాడు. చివరకు ప్రాణాలు త్యజించాడు. వైదర్భి విలపించింది. సహగమనం చేయడానికి సిద్ధపడింది. అప్పుడొక విజ్ఞానస్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి, ఆమెతో, పూర్వ జన్మలో తామిద్దరం హంసలమని, స్నేహితులమని చెప్పాడు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తికలిగి వైదర్భి కామినీ నిర్మితమై, ఆయిదు ఆరామాలు, తొమ్మిది వాకిళ్లు, ఒకే పాలకుడు, మూడు చావళ్లు, ఆరు గుంపులు, అయిదు అంగళ్లు, పంచ ప్రకృతులు, స్త్రీయే నాయికా కలిగిన ఒక పురాన్ని చూశావని చెప్పాడు. అలాంటి పురంలో ప్రవేశించినవాడు స్త్రీలమీద ఆధారపడే అజ్ఞాని అనీ, దాంట్లో వైదర్భి ప్రవేశించి, కామినికి చిక్కి, ఆమెతో ఆనందిస్తూ, ఈశ్వరుడిని విస్మరించి, చివరకు వైదర్భిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా తన మాయతో కలిపించబడిందని, తామిద్ద్రరం పూర్వం హంసలమని, అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు.

ఇదంతా చెప్పిన నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మ తత్త్వాన్ని ప్రాచీనబర్హికి తెలియచెప్పాను అని అన్నాడు. ప్రాచీనబర్హి దర్భలను భూమండలమంతా పరచి, అహంకారంతో, అవినయంతో ఎన్నో పశువులను చంపాడని, కానీ, కర్మస్వరూపాన్ని, విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడని అదేంటో చెప్తాను వినమని అన్నాడు. "ఆ సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదయితే వుందో అదే విద్య. ఆ పరమాత్మయే దేహధారులకు అత్మ. ఈశ్వరుడు. కాబట్టి క్షేమకరమైన ఆశ్రయం నారాయణుడి పాదమూలాలే. ఆ శ్రీమహావిష్ణువే ప్రియాతిప్రియమైన వాడు, సేవించతగ్గవాడు. ఆయనను ఆశ్రయించి సేవించే వారికి అణుమాత్రమైనా దుఃఖం కలగదు. ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరిస్వరూపం. కాబట్టి సకల జీవులకు ఆశ్రయమైన ఈశ్వరుడిని భజించు. సర్వ విధాలా విరక్తిని పొందు. మనస్సే జీవులందరికీ సంసార కారణం. అటువంటి కర్మ వశం వల్ల ఇంద్రియాలలో సంచరించడం జరుగుతుంది. దాన్నే అవిద్య అంటారు. అవిద్య వల్లే అనేక జన్మలు, కర్మ బంధాలు కలుగుతున్నాయి. కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు. సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుడిని, పద్మనేత్రుడిని, ఈశ్వరుడిని ధ్యానించు. సర్వజగత్తును భగత్ స్వరూపంగా అర్థం చేసుకుని అతడి పాదపద్మాలను ఆరాధించు".

ఈ విధంగా, జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన వెళ్లిపోయాడు. ఆ తరువాత ప్రాచీనబర్హి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. అవ్యయానందమైన విష్ణుపదాన్ని పొందాడు.            

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Wednesday, August 26, 2020

పృథుచక్రవర్తి, విజితాశ్వుడు, ప్రాచీనబర్హి .... శ్రీ మహాభాగవత కథ-17 : వనం జ్వాలా నరసింహారావు

 పృథుచక్రవర్తి, విజితాశ్వుడు, ప్రాచీనబర్హి 

శ్రీ మహాభాగవత కథ-17

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

         యజ్ఞ యాగాదులు చేస్తే విశేష ఫలం లభిస్తుందని భావించిన పృథుచక్రవర్తి వంద అశ్వమేధయాగాలను చేయాలని దీక్షబూని యాగాలు చేయసాగాడు. ఆయన చేస్తున్న యజ్ఞకర్మలో సాక్షాత్తు నారాయణుడు విచ్చేశాడు. పృథుచక్రవర్తికి కావాల్సిన హవిస్సులు మొదలైన వాటిని భూమాత సమకూర్చింది. ప్రకృతిలో వున్న సమస్త జీవరాశులు తమ దగ్గరున్నవన్నీ సమకూర్చాయి. సమస్త జనులు కానుకలిచ్చారు. అలా పృథుచక్రవర్తి 99 యాగాలను వైభవంగా నిర్వహించాడు. నూరవ యజ్ఞంలో పుండరీకాక్షుడిని పూజ చేస్తున్న సమయంలో, ఇంద్రుడు అక్కసుతో యజ్ఞపశువును అపహరించి ఆకాశ మార్గంలో మాయమయ్యాడు. ఇది గమనించిన అత్రి మహాముని పృథుచక్రవర్తి కొడుక్కు సమాచారం ఇచ్చాడు. అతడు దేవేంద్రుడి వెంట బడ్దాడు. అతడిని పట్టుకుని మీద దూకే సమయానికి తన మాయావేషాన్నీ, గుర్రాన్నీ వదిలి అంతర్థానమయ్యాడు. పృథుచక్రవర్తి కుమారుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చాడు. మరోమారు దేవేంద్రుడు అదే పని చేశాడు. మళ్లీ పృథు కుమారుడు ఆయన వెంటబడేసరికి అశ్వాన్ని వదిలి పారిపోయాడు. ఇదంతా తెలుసుకున్న పృథుచక్రవర్తి ఇంద్రుడిని చంపడానికి పూనుకోగా ఋత్విక్కులు వారించారు.

పృథుచక్రవర్తి యజ్ఞం కొనసాగిస్తుండగా బ్రహ్మదేవుడు వచ్చి, 99 యజ్ఞాల ఫలం లభించాలని ఆయన్ను దీవించి, మోక్షధర్మం తెలిసిన పృథుచక్రవర్తిని ఇక ఇంతటితో యజ్ఞాలు చేయడం చాలించమనీ, దేవేంద్రుడికి కోపం రాకుండా ప్రవర్తించమనీ సలహా ఇచ్చాడు. ఆయన ఎవరివల్ల ఎందుకు సృష్టించబడ్డాడో గ్రహించి, తదనుగుణంగా, పరబ్రహ్మ సంకల్పానుసారం ధర్మాన్ని పాలించమని కూడా చెప్పాడు. ఇంద్రుడు కల్పించిన ప్రచండ పాషండ మార్గమైన మాయను జయించమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞను పాటించి, పృథుచక్రవర్తి దేవేంద్రుడితో సఖ్యత పెంచుకున్నాడు. యజ్ఞదీక్షను విరమించి అవభృత స్నానం చేశాడు. అక్కడున్న వారంతా ఆయన్ను దీవిస్తున్న సమయంలో, యజ్ఞభోక్త, యజ్ఞకర్త, భగవంతుడూ అయిన సర్వేశ్వరుడు ఇంద్రుడితో సహా వచ్చాడు. నూరవ అశ్వమేధ యాగానికి భంగం కలిగించిన ఇంద్రుడు పృథుచక్రవర్తిని క్షమాపణ కోరడానికి వచ్చాడనీ, ఆయన్ను క్షమించమనీ అన్నాడు శ్రీహరి. ఇంకా ఇలా అన్నాడు ఆ సర్వేశ్వరుడు పృథుచక్రవర్తితో:

"నువ్వు సుఖదుఃఖాల పట్ల సమానమైన చిత్తం కలవాడిగా ఉండాలి. అందరిపట్ల సమానంగా ప్రవర్తించు. ఈ సమస్త లోకాన్నీ రక్షించాల్సిన బాధ్యత నీదే. విప్రుల అనుమతితో, సంప్రదాయ సిద్ధమైన ధార్మిక మార్గాన్ని స్వీకరించి, అర్థకామాల పట్ల ఆసక్తి లేకుండా, ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాల పట్ల సమాన దృష్టిని కలిగి ఉండు. ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలించు". ఇలా చెప్పి, ఆయనకొక వరమిస్తాననీ, కోరుకొమ్మనీ అన్నాడు. జవాబుగా పృథుచక్రవర్తి, నిర్మలమై ప్రకాశించే భగవంతుడి కీర్తిని వినడం కోసం తనకు పదివేల చెవులను ప్రసాదించమని, అదే తన అభిమతమని అన్నాడు. అలాగే తత్త్వ జ్ఞానాన్ని మరిచిపోయిన అజ్ఞానులకు వెంటనే తత్త్వమార్గాన్ని చూపగలిగే వరాన్ని కూడా అనుగ్రహించమని, అంతకంటే తనకేవరం అక్కరలేదని అన్నాడు. ఆయన కోరిన వరాలను ఇచ్చి నారాయణుడు ఆయన చేసిన పూజలను స్వీకరించి బయల్దేరి, దేవతలు కీర్తిస్తుండగా, వైకుంఠానికి చేరుకున్నాడు. పుణ్యభూమి (యజ్ఞశాల) నుండి బయల్దేరి పృథుచక్రవర్తి నగరానికి చేరి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత భూమండలాన్ని పరిపాలించి, స్వఛ్చమైన తన కీర్తిని భూమండలమంతా నెలకొల్పి, పరమానందంతో పరమపదాన్ని చేరుకున్నాడు పృథుచక్రవర్తి.             

పృథుచక్రవర్తి భార్య, పరమ పతివ్రత, అయిన అర్చి మహాదేవి భర్తతో పాటి సహగమనం చేయడానికి సిద్ధమైంది. మహానదిలో స్నానం చేసి భర్తకు ఉదక తర్పణాలు వదిలింది. ఆ తరువాత సహగమనం చేసింది. అలా సహగమనం చేస్తున్న అర్చి మహాదేవిని చూసి దేవతాస్త్రీలు పులకించిపోయారు. అప్సరకాంతలు నృత్యం చేశారు. అర్చి మహాదేవి మహిమను కొనియాడారు. దేవతాస్త్రీలు అలా కీర్తిస్తుండగా పృథువు పొందిన విష్ణులోకాన్ని సాటిలేని వైభవంతో ఆమె కూదా పొందింది.

పృథు మహారాజుకు, అర్చి మహాదేవికి జన్మించిన విజితాశ్వుడు పృథువు తరువాత రాజయ్యాడు. తండ్రి లాగానే కీర్తి ప్రతిష్తలు సంపాదించాడు. పృథుచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించుకుని అంతర్థానమైనప్పుడు, విజితాశ్వుడు కూడా అంతర్థాన విద్యతోనే ఇంద్రుడిని వెంబడించి, యాగాశ్వాన్ని వెనక్కు తెచ్చాడు. అందువల్ల అతడికి అంతర్థానుడు అనే బిరుదు వచ్చింది. అశ్వాన్ని జయించాడు కాబట్టి విజితాశ్వుడు అన్నారు. రాజ్యాన్ని పాలిస్తున్న విజితాశ్వుడు స్థిరబుద్ధి, సమచిత్తం కలవాడని పేరు తెచ్చుకున్నాడు. తన తమ్ములకు నలుదిక్కులను పంచి ఇచ్చాడు. త్రేతాగ్నులకు మానవులుగా జన్మించమని వశిష్టుడి శాపం ఉన్నందున, విజితాశ్వుడి భార్య శిఖండిని ద్వారా త్రేతాగ్నులు జన్మించారు. అతడి రెండవ భార్య సభస్వతి ద్వారా హవిర్ధానుడు అనే కొడుకు కలిగి, రాజ్యాన్ని చక్కగా పాలించాడు.

విజితాశ్వుడు ఆత్మజ్ఞుడై, పరమాత్మను యజ్ఞంలో అర్చించి, యోగ సమాధి ద్వారా ముక్తిని పొందాడు. ఆయన పరలోకగతుడైన తరువాత, ఆయన కొడుకు హవిర్ధానుడు ఆరుగురు కొడుకులను కన్నాడు. అందులో ఒకడైన బర్హిష్మదుడు యజ్ఞదీక్షాశాలియై, భూతలమంతా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, ప్రజలచేత యోగసమాధి నిష్టుడు అనీ, ప్రజాపతి అనీ కీర్తించబడ్డాడు. ’ప్రాచీనబర్హి’ గా కూడా పేరుపొందాడు. సముద్రుడి కూతురైన శతధృతి అనే కన్యను మోహించి వివాహమాడాడు. వారి వివాహం వాస్తవానికి బ్రహ్మ ఆదేశానుసారం జరిగింది. ఆ దంపతులకు పదిమంది కొడుకులు కలిగారు. వాళ్లనే ప్రచేతసులు అని అంటారు. తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టిని కొనసాగించడానికి అడవికి బయల్దేరే సమయంలో రుద్రుడు సాక్షాత్కరించాడు వారికి. ఆయన ఆదేశానుసారం ప్రచేతసులు నారాయణుడిని పదివేల దివ్య సంవత్సరాలు పూజించారు.

పదివేల దివ్య సంవత్సరాలు నారాయణుడిని పూజించడానికి పూర్వరంగంలో, జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు, తండ్రి అజ్ఞానుసారం పడమటి దిక్కుగా వెళ్తున్న సమయంలో సముద్రం కంటే విస్తారమైన ఒక మనోహరమైన సరస్సును చూశారు. అందులో ఒక దివ్య పురుషుడిని చూశారు. అతడు సరోవరంలో నుండి వెలుపలికి వచ్చాడు. అతడే సాక్షాత్తు పరమ శివుడు. పరమేశ్వరుడి పాదపద్మాలకు నమస్కరించారు. హరుడు ప్రీతిచెంది, వాళ్ల మనస్సులో వున్న సంకల్పం తనకు తెలుసనీ, వారికి క్షేమం కలుగుగాక అనీ, వారిని అనుగ్రహించాలన్న బుద్ధితో దర్శనం ఇచ్చాననీ అన్నాడు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు, తన కుమారులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని వారికి తెలియచేస్తానని, మోక్షప్రదమై, మంగళకరమైన తన ఉపదేశాన్ని వినమని, ఆస్తోత్రాన్ని వివరంగా చెప్పాడు. యోగాదేశమనే ఆ స్తోత్రాన్ని మళ్లీ, మళ్లీ జపిస్తూ, సర్వేశ్వరుడిని కీర్తిస్తూ, ధ్యానశీలురై పూజించమని చెప్పాడు శివుడు ప్రచేతసులకు. ఈ స్తోత్రాన్ని భగవంతుడైన బ్రహ్మ సృష్టిని చేయగోరి కొడుకులైన తమకు, భృగువు మొదలైన మునీంద్రులకు ఉపదేశించాడని, తాము దాని మహిమతో సృష్టి చేయగలిగామని కూడా చెప్పాడు. రుద్రుడు ఉపదేశించిన విష్ణు స్తోత్రాన్ని జపిస్తూ, పదివేల సంవత్సరాలు భయంకరమైన తీవ్ర తపస్సు చేశారు ప్రచేతసులు.  

అప్పుడు పద్మనాభుడు ప్రత్యక్షమయ్యాడు వారికి. వాళ్ల శరీరాలను స్పృశించాడు. వారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారనీ, రుద్రుడు గానం చేసిన తన స్తోత్రాన్ని నిత్యం పఠించమనీ అన్నాడు. వారికి పరబ్రహ్మ లక్షణాలతో కుమారుడు కలుగుతాడని చెప్పాడు. కండు మహామునికి, ప్రమ్లోచ అనే అప్సరసకు పుట్టిన మారిష అనే కన్యను తండ్రి ప్రాచీనబర్హి ఆజ్ఞతో పెళ్లి చేసుకోమని చెప్పాడు. వారంతా వెయ్యి సంవత్సరాలు తన మీద భక్తితో భూలోక సుఖాలు అనుభవించి, తన స్థానాన్ని చేరుకుంటారని అన్నాడు. అలా చెప్పిన శ్రీహరికి ప్రచేతసులు నమస్కరించి స్తుతించారు. ఆయన వారు చూస్తుండగా వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత బ్రహ్మ అజ్ఞానుసారం ప్రచేతసులు విధివిధానంగా మారిషను పెళ్లి చేసుకున్నారు. దక్షుడు దైవప్రేరితుడై, మారిష కడుపున, ప్రచేతసులకు పుత్రుడై జన్మించాడు. బ్రహ్మ ద్వారా ప్రజాసృష్టిని చేయడానికి నియమించబడ్దాడు.

ప్రచేతసులు భార్యను కొడుకు దగ్గర వుంచి, జాబాలి ముని ఆశ్రమానికి ఆత్మవిచారాన్ని చేయడానికి వెళ్లారు. అక్కడికి నారదుడు వచ్చాడు. ఈశ్వరుడు ఉపదేశించిన ఆత్మతత్త్వాన్ని ప్రసాదించమని ఆయన్ను కోరారు. ఆయన వారు కోరిన విధంగానే పద్మనాభుడి సచ్చరితాన్ని వినిపించి, బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. ప్రచేతసులు శ్రీమహావిష్ణువు సత్కీర్తిని భక్తితో పొగిడి శాశ్వతమైన శ్రీహరి పదాన్ని పొందారు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Tuesday, August 25, 2020

భూమి నుండి ఓషధులను పితికిన పృథుచక్రవర్తి .... శ్రీ మహాభాగవత కథ-16 : వనం జ్వాలా నరసింహారావు

 భూమి నుండి ఓషధులను పితికిన పృథుచక్రవర్తి

శ్రీ మహాభాగవత కథ-16

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

         ధ్రువుడి వంశ పరంపరలో అంగుడనే రాజుకు వేనుడు అనే కొడుకు పుట్టాడు. అంగుడు అధర్మ మార్గంలో సంచరిస్తున్న తన కొడుకు దుశ్శీలాన్ని చూసి రాజ్యాన్ని వదిలి ఒంటరిగా ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పుడు మునీశ్వరులు కోపించి, వేనుడిని చావమని శపించారు. లోకం రాజులేని రాజ్యమైంది. అప్పుడు హరి భక్తులు, మహావీరులు, మునులు మొదలైనవారు ప్రాణాలు కోల్పోయిన వేనుడి కళేబరం వద్దకు వచ్చి,  అతడి ఊరువులను మథించగా, అందులోనుండి ఒక నిషాదుడు జన్మించాడు. దరిమిలా అతడి వంశంలో జన్మించిన వారంతా నిషాదులై అడవులలో, కొండలలో తిరుగుతూ, వేనుడి దుష్కీర్తిని సూచించే ప్రతీకలయ్యాయి. మునులు వేనుడి బాహువులను మథించగా, స్త్రీ-పురుషుల జంట జన్మించింది. మళ్లీ బాహువులను మథించగా నారాయణాంశతో ’తొలిచక్రవర్తి’ గా ప్రసిద్ధికెక్కిన పృథుడు జన్మించాడు. లక్ష్మీదేవి అంశతో అర్చి అనే ఒక దేవతా స్త్రీ జన్మించింది. ఆమె ఆ పృథు చక్రవర్తినే వరించింది. వివాహం చేసుకుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మాదిదేవతలు నారాయణాంశ సంభూతుడైన పృథుచక్రవర్తికి శాస్త్రబద్ధంగా రాజ్యాభిషేకం చేశారు.

         పృథుచక్రవర్తి ఆజ్ఞ ఎదురులేనిద్గా లోకాలోక పర్వతం దాకా విస్తరించింది. యావత్ భూమిని తన గుణాలతో లోకాలను రంజింప చేశాడు. ప్రజలను కన్నతండ్రిలాగా ప్రేమిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అలా ఉందగా ఒకనాడు, తన రాజమందిరానికి సమీపంలో ఉద్యానవనానికి వెళ్లి, అక్కడ మహనీయుడు సనత్కుమారుడిని చూశాడు. ఆయన్ను భక్తితో పూజించాడు. ఆ మహర్షి దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆయనతో పాటు అక్కడున్న బ్రహ్మవేత్తలంతా సనత్కుమారుడి ఉపదేశాన్ని పొందారు. పృథుచక్రవర్తి పరాక్రమం గురించి ప్రజలు కథలు-కథలుగా చెప్పుకునేవారు.   

అలా పృథుచక్రవర్తి రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు ఒకనాడు ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లి తాము ఆకలి బాధతో పీడించబడుతున్నాం అని అన్నారు. దయతో తమకు అన్నం పెట్టి రక్షించమని నమస్కరించారు. రాజు వెంటనే, ప్రజల బాధను పరిష్కరించడానికి ధనస్సున బాణాన్ని ఎక్కుపెట్టాడు. పృథుచక్రవర్తిని చూసిన భూమాత, ఆవురూపాన్ని ధరించి, పరుగెత్తింది. ఇది చూసిన పృథుచక్రవర్తి కళ్లు ఎర్రబడ్డాయి. భూమాత ఎక్కడికిపోతే అక్కడికి వెంబడించాడు. అప్పుడామె ఏ దిక్కూ కనబడక చక్రవర్తిని రక్షించమని వేడుకుంది. జీవకోటికి నౌకలాగా ఆధారభూతమైన దృఢమైన శరీరం తనదనీ, అలాంటి తనను చంపితే భూమ్మీద ఉన్న ప్రజలందరినీ నీటిలో మునగకుండా ఎలా రక్షిస్తావనీ చక్రవర్తిని ప్రశ్నించింది.

జవాబుగా పృథుచక్రవర్తి ఇలా అన్నాడు: "ఓ భూదేవీ! నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు. నువ్వు ధాన్యాన్ని వృద్ధి చేయకుండా ఆవు రూపాన్ని ధరించి గడ్డి మేస్తూ, పాలను పితకకుండా నీలోనే దాచుకుంటున్నావు. నీలో వున్న ఓషధీబీజాలు బ్రహ్మ సృష్టించినవే! వాటిని నీలోనే పెట్టుకుని లోకానికి బహిర్గతం చెయ్యని మూర్ఖురాలివి నువ్వు. దురాత్మురాలివైన నిన్ను నా బాణాలతో సంహరిస్తాను. నీలాంటి దాన్ని చంపడం పాపం కాదు. నీ శరీరంలోని మాంసంతో ప్రజల ఆకలి బాధ తీరుస్తాను. ప్రాణికోటిని ఉద్ధరిస్తాను". అప్పుడు ఆ పృథుచక్రవర్తిని చూసి గోవు రూపంలో వున్న భూదేవి వణకుతూ ఆయన్ను అనేక విధాలుగా కీర్తించసాగిందిలా:

"ఓ కరుణాభరణా! నీకంటే వేరెవ్వరిని శరణు వేడుకుంటాను? నీ మాయామహిమతో ఈ చరాచర సృష్టిని నిర్మించావు. బ్రహ్మను సృష్టించి, ఆయనతో సమస్త లోకాలను సృజింప చేస్తావు. ఈ లోకాల సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడవైన నీకు నమస్కరిస్తున్నాను. నాకు అభయం ప్రసాదించు. నీకోపాన్ని ఉపశమించి, కరుణించి, నా విన్నపాన్ని విను. బ్రహ్మ సృష్టించిన ఓషధులను పాపపత్ములు తినడం చూసి ఎవ్వరూ అడ్డుకోకపోతే బాధపడ్దాను. యజ్ఞానికి సంబంధించిన కర్మకాండలు లేకపోవడంతో నేను అనాదరణకు గురయ్యాను. కాబట్టి, కావాలనే ఆ ఓషధీ సమూహాన్ని మింగాను. అవి నాలో జీర్ణమై పోయాయి. నాకొక దూడను ఇస్తే, నీ ప్రజలకు కావాల్సిన వాటిని అనుగ్రహిస్తాను. మిట్టపల్లాలుగా వున్న నన్ను (భూమిని) సమతలంగా చెయ్యి".

అప్పుడు పృథుచక్రవర్తి స్వాయంభవ మనువును దూడగా చేసి, తన చేతిని పాత్రగా అమర్చి, స్వయంగా తానే సకల ఓషధులను భూమి నుండి పితికాడు. ఋషులంతా ఒకచోట చేరి బృహస్పతిని దూడగా చేసి తమ ఇంద్రియాలు అనే పాత్రలో ఛందోమయమైన క్షీరాన్ని పిండుకున్నారు. దేవతలు ఇంద్రుడిని దూడగా చేసి, అమృతమయమైన క్షీరాన్ని పొందారు. దైత్య-దానవులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకుని, ఇనప పాత్రలో పుల్లటి కల్లు రూపంలో పాలను పితికి పొందారు. అప్సరసలు, గంధర్వులు గాంధర్వమనే క్షీరాన్ని పిండుకున్నారు. ఇలా పృథుచక్రవర్తి మొదలుకొని, ఒక్కొక్కరు, తమ-తమ అవసరాలకు అనుగుణంగా తగిన క్షీరాన్ని వేర్వేరు దూడలతో భిన్న-భిన్న పాత్రలలో పిండుకున్నారు. అప్పుడు పృథుచక్రవర్తి సంతోషించి భూమాతను తన కుమార్తెగా స్వీకరించాడు. భూమండలాన్నంతా చదును చేసి శాశ్వత కీర్తి పొందాడు. భూమండలాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడు.

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

Monday, August 24, 2020

సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం .... శ్రీ మహాభాగవత కథ-15 : వనం జ్వాలా నరసింహారావు

 సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం

శ్రీ మహాభాగవత కథ-15

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై

     బ్రహ్మదేవుడి కుమారుడు స్వాయంభవ మనువుకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు. వాళ్లలో ధ్రువుడిని కన్న సునీతి అంటే రాజుకు అంతగా ప్రేమ లేదు. సురిచి మీద విపరీతమైన ప్రేమ. ఒకనాడు సురుచి కొడుకు ఉత్తముడిని తన తొడలమీద కూచోబెట్టుకుని ముద్దులు చేస్తున్న సమయంలో దగ్గరకు వచ్చిన ధ్రువుడిని పట్టించుకోలేదు. తన కొడుకులాగా అతడిని కూడా తండ్రి ముద్దాడాలంటే, విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించాలని సవతి తల్లి చెప్పింది ధ్రువుడికి. ఇదంతా ధ్రువుడి తల్లికి తెలిసి బాధపడింది. సవతి తల్లి చెప్పిన విధంగా శ్రీహరి పాదాలను ఆశ్రయించమని చెప్పింది. వెంటనే పట్టణాన్ని వదిలి బయల్దేరాడు ధ్రువుడు.   

ఈ వృత్తాంతమంతా తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న నారదుడు ధ్రువుడి దగ్గరకు వచ్చాడు. శ్రీహరిని, శ్రీమహావిష్ణువును యోగీంద్రులు కూడా చూడలేక పోతున్నారనీ, అతడిని చేరే మార్గాన్ని తెలుసుకోలేక పోతున్నారనీ, అతడు ఆరాధించడానికి దుర్లభుడనీ, కాబట్టి వ్యర్థ ప్రయత్నాలు మానుకోమనీ నారదుడు ధ్రువుడికి చెప్పాడు. మోక్షం మీద కోరిక వుంటే తను చెప్పే మాటలు వినమని అన్నాడు. వాస్తవానికి ధ్రువుడిని మోక్షమార్గానికి ప్రేరేపించిన వాడు వాసుదేవుడే అని కూడా అన్నాడు. ఇలా చెప్పి, యమునా నది ఒడ్డున, శ్రీహరి సాన్నిధ్యంలో, పుణ్యమైన మధు వనానికి వెళ్లమనీ, అక్కడ అతడికి శుభం కలుగుతుందనీ అన్నాడు నారదుడు. యమునానదీ పుణ్యజలాలలో స్నానం చేసి, నిష్ఠతో నారాయణుడికి నమస్కారం చేసి, యమనియమాదులను పాటిస్తూ, ఆత్మవికాసం కొరకు సాధన చెయ్యమని సూచించాడు. పురుషోత్తముడిని ఏకాగ్రతతో ధ్యానం చేయమన్నాడు. అప్పుడు పూజలందుకున్న దేవుడు, మానవులకు కొర్కెలను ప్రసాదిస్తాడని అన్నాడు. నారదుడి మాటలు విన్న ధ్రువుడు మధువనానికి వెళ్లాడు. అక్కడ నగరంలో ధ్రువుడిని అరణ్యాలకు పంపినందుకు విచారిస్తున్న అతడి తండ్రి ఉత్తానపాదుడిని ఓదార్చి విషయమంతా చెప్పాడు నారదుడు. అతడి కుమారుడు శ్రీహరిని భజించి, ఎవరికీ సాధ్యంకాని శాశ్వతపదాన్ని పొంది, మళ్లీ తిరిగి వస్తాడనీ, అతడి కొరకై శోకించవద్దనీ చెప్పాడు. 

         మధువనాన్ని సమీపించిన ధ్రువుడు యమునానదిలో స్నానం చేశాడు. సర్వేశ్వరుడిని గురించి ధ్యానం చేయసాగాడు. మొదట్లో తన శరీర స్థితిని బట్టి మూడు రోజులకు ఒక సారి ఆహారం, తరువాత నెలలో ఆరు రోజులకోసారి, నాల్గవ నెలలో పన్నెండు రోజులకోసారి ఆహారాన్ని తీసుకున్నాడు. తరువాత ఒంటి కాలు మీద ధ్యానం చేస్తూ వాయువును మాత్రమే బక్షించాడు. మొదటి నెలలో శ్రీహరిని, రెండవ నెలలో విష్ణువును, మూడో నెలలో మాధవుడిని, నాల్గవ నెలలో పుండరీకాక్షుడిని, అయిదో నెలలో పర్మాత్మను ధ్యానం చేషాడు. ఆ తరువాత ఆ శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని సమాయత్తం చేశాడు. ఆ స్థితికి ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు ఏకాగ్ర చిత్తంతో ప్రాణవాయువును నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే లోకాలన్నీ కంపించాయి. దీన్నుండి కాపాడమని లోకపాలకులంతా శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. ఇదంతా ధ్రువుడి ధ్యానం వల్ల జరిగిందనీ, భయపడవద్దనీ చెప్పి శ్రీహరి తక్షణమే మధువనానికి వెళ్లాడు. ధ్రువుడు ఆయన్ను చూసి, మధురానుభూతి పొందుతూ, సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఆయన అనుగ్రహంతో, భగవంతుడిని ప్రతిపాదించే వేదమయమైన వాక్కులతో స్తుతించాడు శ్రీహరిని పరి-పరి విధాలుగా. అది విన్న భగవానుడు మనస్సులో సంతోషించి ధ్రువుడి మదిలో మెదిలే కోరిక తనకు తెలుసని అంటూ, దాన్ని ప్రసాదిస్తున్నానని అంటూ, ఈ విధంగా చెప్పాడు.

         "గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర రూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సపర్షులు, తారకలతో కూడి నీ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు తిరుగుతారు. ఇతరులు చేరడానికి వీలుకానిది, అధిష్టించడానికి సాధ్యం కానిది, ముల్లోకాలు ప్రళయంలో నశించినా కూడా నశించకుండా ప్రకాశించే "ధ్రువక్షితి" (ధ్రువపదం) ని ఇరవై ఆరు వేల సంవత్స్రాల తరువాత నువ్వు పొందుతావు. అప్పటిదాకా నీ తండి రాజ్యాన్ని పాలించు. ఇహలోక సుఖాలను అనుభవించు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ, అన్నిలోకాలు నమస్కరించేది, పునర్జన్మ లేనిదీ, సప్తర్షి మండలంకన్న పైనున్న నా పదాన్ని పొందుతావు" అని చెప్పి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయాడు.

         ఇదంతా జరిగిన తరువాత ధ్రువుడు తన రాజ్యానికి పయనమయ్యాడు. కొడుకు వస్తున్నాడని విన్న తండ్రి ఉత్తానపాదుడు సంతోషించాడు. ఎదురుగా వెళ్లి ప్రేమతో కౌగలించుకున్నాడు. ఆశీర్వదించాడు. ధ్రువుడు తండ్రి పాదాలకు మొక్కాడు. ఆ తరువాత తల్లులకు నమస్కరించాడు ధ్రువుడు. తల్లి చిరాయువుగా జీవించమని ఆశీర్వదించింది. పౌరులతో, బంధుజనులతో, అమాత్యులతో, స్నేహితులతో కలిసి పురంలోకి ప్రవేశించాడు. కొంతకాలానికి ఉత్తానపాదుడు ధ్రువుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఆ తరువాత, శింశుమారుడు అనే ప్రజాపతి కుమార్తె భ్రమిని వివాహం చేసుకున్న ధ్రువుడికి కల్పుడు, వత్సరుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అలాగే, వాయుదేవుడి కుమార్తె ఇల అనే ఆమెను వివాహం చేసుకుని ఉత్కలుడు అనే కొడుకును, మరో కూతురును కన్నాడు.

         తన సోదరుడు ఉత్తముడు వేటకై పోయి యక్షుడి చేతిలో హతం కావడం పట్ల కోపంతో కుబేరానుచరులైన గుహ్యకుల మీదికి యుద్ధానికి పోయాడు ధ్రువుడు. అతడి బాణాల ధాటికి యక్షులు తట్టుకోలేక పరాజితులయ్యారు. వారు రోషంతో విజృంభించినా ప్రయోజనం లేకపోయింది. ధ్రువుడు చిటికలో వారిని జయించసాగాడు. అప్పుడు రాక్షసులు రాక్షస మాయను ప్రయోగించారు. దాని ప్రభావం వల్ల ఆయన మీద ఆయుధాలు కురిసాయి. అప్పుడు ధ్రువుడు ఆచమనం చేసి, లక్ష్మీనాథుడి పాదపద్మాలకు నమస్కరించి, స్మరించి, శత్రుభయంకరమైన నారాయణాస్త్రాన్ని సంధించాడు. వెంటనే గుహ్యకుల మాయ చెడిపోయింది. నారాయణాస్త్రం నుండి పుట్టిన వేలాది బాణాలు యక్షులను ఢీకొన్నాయి. యక్షుల పిక్కలను, తొడలను, మెడలను, చేతులను ఖండించాడు ధ్రువుడు. అప్పుడు ధ్రువుడి తాతగారైన స్వాయంభవ మనువు ఆయన దగ్గరకు వచ్చి, యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకొమ్మని సలహా ఇచ్చాడు. సర్వ శుభాలకు హాని కలిగించే రోషాన్ని విడిచి పెట్టమని కూడా అన్నాడు. ధ్రువుడు తన సహోదరుడిని చంపారని భావించి, ఎంతో మంది యక్షులను చంపాడని, కుబేరుడి పట్ల అపరాధం చేశాడని, కాబట్టి అతడిని ప్రసన్నం చేసుకోమని అన్నాడు. ధ్రువుడు యుద్ధం మానాడు. వెంటనే కుబేరుడు వచ్చాడక్కడికి. ఆయనకు అంజలి ఘటించాడు ధ్రువుడు. తాను ధ్రువుడి పట్ల ప్రసన్నుడినయ్యానని చెప్పి అంతర్థానమయ్యాడు కుబేరుడు. అప్పుడు ధ్రువుడు యక్ష, కిన్నర, కింపురుషాది గణాలతో కీర్తించబడుతూ మహావైభవంగా తన నగరానికి తిరిగొచ్చాడు.

         నగరానికి తిరిగొచ్చిన ధ్రువుడు రాజ్యపాలన చేస్తూ ఈశ్వరుడిని ధ్యానిస్తూ జీవితం గడిపాడు. అలా ఇరవై ఆరువేల సంవత్స్రాలు రాజ్యపాలన చేసాడు. తరువాత తన కొడుకుకు రాజ్య పట్టం కట్టాడు. వైరాగ్య చిత్తంతో పట్టణాన్ని వదిలి, పుణ్యాలకు పుట్టినిల్లయిన బదరికాశ్రమానికి చేరుకున్నాడు. విశాలా నదీ జలాలలో స్నానం చేశాడు. పద్మాసనం వేసుకుని శ్రీహరిని నిత్యం ఆరాధించాడు ధ్రువుడు. కొన్నాళ్లకు ఆకాశం నుండి ఒక దివ్య విమానం వచ్చింది. అందులో ఇద్దరు దేవతా శ్రేష్టులున్నారు. వాళ్లు విష్ణు కింకరులు. వాళ్లు ధృవుడిని చూసి, ఆయన చేసిన మహా తపస్సు మధుసూధనుడిని సంతృప్తి పరిచిందనీ, ఆయన పంపగా తాము వచ్చామనీ, విష్ణుమూర్తి నివాసమైన పరమపదానికి ఆయన్ను తీసుకుపోతామనీ అన్నారు. విష్ణువు పంపిన దివ్య విమానం ఎక్కడానికి ఆయనకు అర్హత ఉందనీ చెప్పారు. ధ్రువుడు స్నానం చేసి వచ్చి, అక్కడున్న మునులకు మొక్కి, వారి ఆశీర్వాదాలు తీసుకుని, విమానాన్ని ఎక్కడానికై హిరణ్మయమైన తేజో రూపాన్ని ధరించాడు. అతడి విమానానికి ముందర మరో విమానంలో అతడి తల్లి కూడా వున్నదని విష్ణు కింకరులు చెప్పారు. అది చూసిన తరువాత ధ్రువుడు విమానాన్ని ఎక్కి బయల్దేరాడు. గ్రహ మండలాన్నీ, సప్తర్షి మండలాన్నీ దాటి ఆపైన విష్ణుపదాన్ని చేరుకున్నాడు.

సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం జీవితానికి ధన్యత చేకూరుస్తుంది. స్వ్రర్గప్రదాయకమైనది. కీర్తికరమైనది. ఆయుష్షును కలగ చేస్తుంది. పుణ్య ప్రదాయకమైనది. శుభకరమైనది. మంచి మనస్సునిస్తుంది. ఫ్రశంసా యోగ్యమైనది. పాపాన్ని హరిస్తుంది.  

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)