ఫిబ్రవరి 7, 2011 న మల్లు అనంతరాములు 21 వ వర్ధంతి సందర్భంగా....
మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు
వనం జ్వాలా నరసింహారావు
ఫిబ్రవరి 7, 1990 ఉదయం రాజ్ భవన్ ప్రాంగణంలో నివసిస్తున్న మా ఇంటికి "బ్రేక్ ఫాస్ట్ అతిథి" గా వచ్చిన డాక్టర్ మల్లు అనంతరాములు ఎంతో ఉల్లాసంగా-ఉత్సాహంగా కనిపించారు. రాజీనామా చేసిన కుముద్ బెన్ జోషి స్థానంలో నియమితులైన కృష్ణకాంత్, ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా, అదే రోజున, మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజ భవన్ కు మల్లు వస్తున్నందున, నేను ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. డాక్టర్ చెన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడంతో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాజీనామా చేసిన ఆయన స్థానంలో, అధిష్ఠానం మల్లును పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఆ హోదాలో ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడుగా నియామకం కావడానికి రెండు నెలల పూర్వం, 1989 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, రెండో పర్యాయం, మహబూబ్ నగర్ జిల్లా-నాగర్ కర్నూల్ రిజర్వు డు నియోజక వర్గం నుంచి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు మల్లు. ఉదయం బ్రేక్ ఫాస్టులోను, ఆ తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలోను, ఎప్పటిలాగా చురుగ్గా-సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ గడిపిన మల్లు అనంతరాములు, ఆ మధ్యాహ్నమే హఠాత్తుగా మరణించారన్న వార్తను ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారితో సహా ఎవరూ నమ్మలేక పోయారు. మల్లు మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్య మంత్రి చెన్నారెడ్డి స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన సంతాప సందేశాన్ని సీఎం పీఆర్వోగా పత్రికల వారికి, ఆయన కుటుంబ సభ్యులకు పంపాను. రాష్ట్ర శాసన సభకు, దేశ వ్యాప్తంగా లోక్ సభకు, జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మల్లు వహించిన పాత్రను అప్పటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి, ఘనంగా పొగుడుతూ మల్లుకు నివాళులు అర్పించారు.
పెద్దవాళ్ల మధ్య పెద్దవాడి గాను, చిన్న వాళ్ల మధ్య పెద్ద తరహా గాను మలగుతూ, అందరినీ తన వారిగా భావించే మనస్తత్వమున్న అనంతరాములు మల్లు, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అరుదైన దళిత నాయకుడు. పదవిలో వున్నా-లేకపోయినా, సన్నిహితులకు-అంతగా పరిచయం లేని ఇతరులకు, తన చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు మల్లు. ఒకే జిల్లాకు చెందిన మా ఇద్దరికి, రెండు దశాబ్దాల పరిచయం. మొట్టమొదటి సారి, మా జిల్లా నుంచి కాకుండా, మహబూబ్ నగర్ జిల్లానుంచి 1980 లో లోక్ సభ కు ఎన్నికైన తర్వాత, రాజకీయంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఢిల్లీ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాకు-మితృడు భండారు శ్రీనివాస రావుకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, వచ్చిన తర్వాత, ఇక్కడున్నన్ని రోజులు కలిసి మెలిసి వుండడం తప్పని సరిగా జరిగేది. ఒక సాధారణ "వీ ఎల్ డబ్ల్యూ" గా పని చేసి, కాంగ్రెస్ సంస్థలో ఉన్నత పదవులను అలంకరించిన అతి కొద్దిమంది దళితుల్లో మల్లు ఒకరు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడడం ఆయన కార్య దక్షతకు, పట్టుదలకు నిదర్శనం. వీ ఎల్ డబ్ల్యూ యూనియన్ క్రియాశీలక వ్యక్తిగా మల్లులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు, ఖమ్మం జిల్లా నాయకులతో సహా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయనను చేరువ చేసింది. ఆయన ఉపన్యాసాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అధికారం, రాష్ట్ర స్థాయిలో పట్టు కోల్పోయిన ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లు లాంటి వారి అవసరం కలిగింది.
1978 లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నో ఎన్నికల సభల్లో ఆయన ఉపన్యాసాలు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని మెప్పించాయి. అప్పటి ముఖ్య మంత్రి చెన్నారెడ్డి మల్లు నాయకత్వ లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, నాగర్ కర్నూల్ నియోజక వర్గం లోక్ సభ టికెట్ ఇప్పించారు. ఆయన ఘన విజయం సాధించడంతో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఆరంభమయింది. పార్లమెంటు సభ్యుడుగా ఢిల్లీలో అడుగు పెడుతూనే, కేంద్ర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా, నియోజక వర్గం అభివృద్ధికి ఉపయోగించుకుంటూ, ప్రజలకు చేరువయ్యారు. నాటి ఆర్థిక సహాయ మంత్రి జనార్థన్ పూజారి తోడ్పాటుతో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు ప్రదేశాల్లో రుణ మేళాలు ఏర్పాటు చేసి, షెడ్యూల్డు కులాల వారికి-తెగల వారికి-వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో రకాల ఆర్థిక సహాయం అందేలా చూశారు మల్లు. నాగర్ కర్నూలు తో సహా, స్వస్థలమైన ఖమ్మం జిల్లా వాసులకు కూడా సహాయ పడే వారాయన. కార్య శీలతకు, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలూ అంకితమై పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు దొరకడం కష్టం కాదని మల్లు నిరూపించారు. ఖమ్మం జిల్లా స్వంత గ్రామం లక్ష్మీపురంలో, ఆత్మీయుల మధ్య పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్న సందర్భంలో, నాటి ప్రధాని-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాతికేళ్ల క్రితం, దేశ రాజధాని నుంచి కుగ్రామానికి ప్రధాన మంత్రి దగ్గర నుంచి నేరుగా పిలుపు రావడం సాధారణ విషయం కాదు. మల్లు ప్రతిభే దానికి కారణం. పదమూడు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించు తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లును నియమిస్తున్నట్లు రాజీవ్ గాంధి నుంచి సమాచారం అలా చేరింది ఆయనకు.
న్యూ ఢిల్లీలోని మల్లు కార్యాలయం ఎప్పుడూ అత్యంత కోలాహలంగా వుండేది. గత పది-పదిహేనేళ్లలో జాతీయ స్థాయికెదిగిన పలువురు కాంగ్రెస్ నాయకులను మల్లు అనంతరాములు దగ్గర కలిసే అవకాశం కలిగింది. తన దగ్గర కొచ్చిన ప్రతి వారినీ, బయట వరకు వచ్చి పంపడం ఆయన అలవాటు. ఎప్పుడన్నా పని ఒత్తిడుల వల్ల అలా వీలు కాకపోతే తప్ప, సాధారణంగా ఆయన ఆ మర్యాద పాటించేవారు. ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, తన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పడం మల్లు లోని సద్గుణం. అడిగిన పని తనకు సాధ్యం కాదని అనే అలవాటు ఆయనలో లేదు. ప్రయత్న లోపం వుండదని దానర్థం. మల్లు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, రాజీవ్ గాంధి ఆయనను నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడుగా నియమించారు. ఆ పదవిలోనూ మల్లు రాణించారు. రాజీవ్ గాంధీకి మరింత చేరువ కావడానికి ఆ పదవి తోడ్పడింది. పార్టీ ప్రయోజనాలకై చాలా మందికి తెలియని ఎన్నో గురుతర బాధ్యతలను రాజీవ్ గాంధి ఆయనకు అప్ప చెప్పారు. ఎంఏ వరకు చదువుకున్న మల్లు పార్లమెంటు సభ్యుడైన తర్వాత రీసెర్చ్ చేసి, పీ హెచ్ డి తెచ్చుకుని, డాక్టర్ అనంతరాములు మల్లు ఐపోయారు.
ఎన్ టీ రామారావు సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన తెలుగు దేశం పార్టీని ఓడించడానికి చెన్నారెడ్డి నాయకత్వంలో 1989 లో ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ, మరో పర్యాయం, మల్లు అనంతరాములుకు నాగర్ కర్నూలు లోక్ సభ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనకు శాసన సభకు పోటీ చేయాలని మనసులో కోరికగా వుండేది. వీలుంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజక వర్గం నుంచి టికెట్ వస్తే బాగుండేదనుకునేవారాయన. కాకపోతే, ఖమ్మంలోని రిజర్వుడు నియోజక వర్గాల నుంచి గతంలో పోటీ చేసిన వారు కాని, సిట్టింగ్ అభ్యర్థులు కాని పోటీ చేస్తుండడంతో మల్లుకు అవకాశం దొరకడం కష్టమైంది. రాజీవ్ గాంధీ ఆదేశం కూడా లోక్ సభకు పోటీ చేయమనే. తనకు పార్టీ విజయం ముఖ్యమని, రాష్ట్రంలోను-దేశంలోను, ప్రత్యేకించి తనకప్పగించిన పదమూడు రాష్ట్రాలలోను, అభ్యర్థుల విజయానికి తన పూర్తికాలం వినియోగిస్తానని చెప్పినప్పటికీ, రాజీవ్ గాంధీ మల్లును నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. తన నియోజక వర్గంతో పాటు, ఇతర నియోజక వర్గాలలోను మల్లు ప్రచారం చేశారు. లోక్ సభకు మరో మారు గెలిచారు. కాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది. 1989 ఎన్నికల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం కొరకు రాజీవ్ గాంధీ కూడా వచ్చారు.
మర్రి చెన్నారెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం జరిగిన నాటి రాత్రి పది గంటల సమయంలో మర్నాడు హైదరాబాద్ వస్తున్న సంగతి ఫోన్ చేసి మరీ చెప్పారు మల్లు అనంత రాములు స్వయంగా. పీసీసీ అధ్యక్షుడుగా ఆయన నియామకం చేయడానికి బలవత్తరమైన కారణం వుండొచ్చు. బ్రతికున్నట్లయితే, మర్రి చెన్నారెడ్డి తర్వాత, బహుశా మల్లుకు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చి వుండేదేమో! నేను ముఖ్య మంత్రి చెన్నారెడ్డి పీఆర్ వో గా పని చేస్తున్నప్పటికీ, మల్లు పీసీసీ అధ్యక్షుడుగా హైదరాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి పోవడమే కాకుండా, ఆయన వెంట వూరేగింపులో కొంత సేపు ప్రయాణం కూడా చేశాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లు పలువురి మన్ననలను, ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఎన్నో నూతన ఒరవడులకు నాంది పలికారు. ముఖ్య మంత్రికి, ఇతర మంత్రులకు, గాంధీ భవన్ కు మధ్య వారధిగా పని చేశారు. ముఖ్య మంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఇతర సందర్శకులలాగానే వ్యవహరించేవారు తప్ప, తన కంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరేవారు కాదు.
అది యాధృఛ్చికమో, దైవ సంకల్పమో కాని, మల్లు అనంతరాములు హఠాత్తుగా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆయన తమ్ముడి మామగారు, అప్పట్లో రాష్ట్ర కాబినెట్ మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేశారు. అనంతరాములు సోదరుడు మల్లు రవి ఆయన స్థానంలో నాగర్ కర్నూలు లోక్ సభ సభ్యుడుగా రెండు సార్లు ఎన్నికకాగా, మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా, మధిర శాసన సభ సభ్యుడుగా ఎన్నికై ప్రస్తుతం ప్రభుత్వ ఛీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గవర్నర్ ప్రమాణ స్వీకారం, కాబినెట్ మంత్రి రాజీనామా, పీసీసీ అధ్యక్షుడి హఠాన్మరణం అన్నీ ఒక్క నాడే, ఫిబ్రవరి 7, 2011 న సంభవించాయి. మల్లు మరణించి సరిగ్గా 21 సంవత్సరాలైంది. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికై, నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ చైర్మన్ పదవిని పొంది, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా-పదమూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు నిర్వహించిన మల్లును, ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మరిచిపోయినట్లే కనిపిస్తోంది. భావి తరాల వారు-ఆ మాటకొస్తే నేటి తరం వారుకూడా, ఆయన్ను గుర్తుంచుకునే ట్లు, ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టి తే బాగుంటుందేమో!
ఫిబ్రవరి 7, 2011 న ?????
ReplyDelete