Saturday, February 26, 2011

కల్నల్ గడాఫి-"మధ్య ప్రాచ్య ప్రాంతపు పిచ్చి కుక్క"?: వనం జ్వాలా నరసింహారావు

కల్నల్ గడాఫి-"మధ్య ప్రాచ్య ప్రాంతపు పిచ్చి కుక్క"?
వనం జ్వాలా నరసింహారావు
అలనాటి సామ్రాజ్య వాద-వలస పాలన నుంచి విముక్తి చెందిన అత్యధిక దేశాల-అందునా మధ్య ప్రాచ్య దేశాల పౌరుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడవేసినట్లయింది. పాలనా పగ్గాలు తొలుత రాజుల-రారాజుల చేతుల్లోకి, ఆ తర్వాత రాచరిక వ్యవస్థను కూల దోసామని చెప్పిన సైనిక నియంతల చేతుల్లోకి మారింది. దరిమిలా నియంతల మార్పిడి జరిగినా, ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు జరిగిన దాఖలాలు దాదాపు లేనట్లే. సైనిక నియంతలు, ఏక పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడం, అత్యధిక మెజారిటీతో గెలవడం, ప్రజాభిమానాన్ని చూరగొన్న వ్యక్తిగా చరిత్ర పుటల్లో ప్రసిద్ధికెక్కడం ఆనవాయితీగా మారింది. ఆయా దేశాల్లోని నియంతలను, తమ ప్రచ్చన్నయుద్థ అవసరాల కొరకు, ఆధిపత్యం చెలాయించేందుకొరకు, అగ్రరాజ్యాలు వ్యూహాత్మకంగా ఎత్తులకు పైయెత్తులు వేయడంతోనే వర్తమాన చరిత్ర కొనసాగుతూ వస్తుంది. మార్పు కోరుకుంటున్న ఆ ప్రాంత ప్రజల్లో ప్రజాస్వామ్య కాంక్ష బలీయంగా బయటకొచ్చినప్పుడు, ఈజిప్టు తరహా ప్రజా ఉద్యమాలు చోటు చేసుకోవడం జరిగినా, వాటి వెనుక మరో నియంత అదృశ్య హస్తం వుండే అవకాశాలే ఎక్కువనాలి. అందుకే, ప్రజాస్వామ్యం అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోతోంది.

లిబియా ఉత్తర ఆఫ్రికా లోని ఒక దేశం. దీనికి ఉత్తరాన మధ్య ధరా సముద్రం, తూర్పున ఈజిప్టు, ఆగ్నేయాన సూడాన్, దక్షిణాన చాద్-నైగర్, పశ్చిమాన అల్జీరియా-టునీషియా దేశాలున్నాయి. 18 లక్షల చదరపు కిలోమీటర్ల లిబియా విస్తీర్ణంలో సుమారు 90% ప్రాంతం ఎడారి ప్రదేశమే. జనాభా సుమారు 60 లక్షలు. 17 లక్షల జనాభా గల ట్రిపోలి నగరం లిబియా రాజధాని. అధికారంలో ఉన్న గడాఫికి వ్యతిరేకంగా ఇటీవలే మొదలైన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటోంది.

ఇరవై మూడేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన లిబియా సరిహద్దు దేశం తునీషియా అధ్యక్షుడు జినే బెన్ అలీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. మరో సరిహద్దు దేశం ఈజిప్టును సుమారు ముప్పై సంవత్సరాలు ఏలిన సైనిక నియంత హోస్నీ ముబారక్ పదవి వదిలి పలాయనం చిత్తగించాడు. బహరైన్ లో పరిస్థితి రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మరో అరబ్ దేశం యెమెన్ లో కూడా ప్రభుత్వ మార్పిడి కోరుతూ ప్రజలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. తునీషియా, బహరైన్, ఈజిప్టు, యెమెన్ దేశాల ప్రజల మార్గాన్నే ఇప్పుడు లిబియా పౌరులూ ఎంచుకున్నారు. 41 సంవత్సరాల కల్నల్ గడాఫి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడుతున్నాయి. పెట్రోలియం నిల్వలతో-ఉత్పత్తులతో సంపన్న దేశాల జాబితాలో చేరిన లిబియా దేశాన్ని తన ఉక్కు పిడికిలిలో బంధించి తిరుగులేని నాయకుడుగా చెలామణి అవుతున్న గడాఫి, ఫిబ్రవరి నెలలో పెల్లుబుకిన ప్రజాందోళనలో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ప్రజల తిరుగుబాటులను కర్కశంగా అణచి వేసే చర్యలెన్ని చేపట్టినా, పరిస్థితిని అదుపు చేయలేక పోవడంతో, ఆ దేశ ప్రధాన నగరమైన బెన్ ఘాజి తిరుగుబాటు దారుల వశమైంది. అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపధ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి వుందనాలి.

అతి చాకచక్యంగా, నెత్తురు చిందకుండా, సెప్టెంబర్ 1969 లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న గడాఫి "నియంతల్లో అతి పెద్ద నియంతగా" గుర్తింపు తెచ్చుకున్నాడనాలి. తన పాలనలో, అంతా తానే అయిపోయి, తన "వ్యక్తి పూజకు" బాటలు వేసి, పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయంతో తనకూ-తన బంధువులకూ, అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గడాఫి. తర తరాలకు సరిపోయే సంపదను దేశం వెలుపల భద్రపరచుకున్నాడు. మహిళా అంగరక్షకులను తోడుంచుకుని పయనిస్తూ, ఎడారి దేశదిమ్మరులు నివసించే పెద్ద టెంటు హౌజ్ లాంటి స్థలంలో వుండడానికి ఇష్టపడే ఒక తరహా "నియమ రహిత", "అవాస్తవిక" వ్యక్తిగా గడాఫి ప్రసిద్ధికెక్కాడు. ప్రతి విషయంలోనూ, తనకు తానే సాటి అనిపించుకోవాలనే తపన వున్న మనిషి గడాఫి.

స్వతంత్ర లిబియా దేశపు ఆధునిక చరిత్ర 1951 లో ఆరంభమైంది. జనవరి 1952 కల్లా లిబియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ, నవంబర్ 21, 1949 న ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశం తీర్మానం ఆమోదించింది. రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు, మిత్ర రాజ్యాల ఉమ్మడి సైన్యం 1943 లో ఇటలీ సైన్యాన్ని పారదోలేంతవరకు, లిబియా ఇటలీ వలస పాలనలో వుండేది. లాంఛనంగా ఇటలీ పాలన నుంచి విముక్తి పొందిన లిబియా, ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో, 1947 లో ఫ్రాన్స్-బ్రిటన్ దేశాల ఆధీనంలోకి వచ్చింది. డిసెంబర్ 24, 1951 న లిబియా సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించుకుని, ఇద్రిస్ రాజుగా, "యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ లిబియా" గా మార్పు చెందింది. దరిమిలా, రెండు సంవత్సరాల అనంతరం, మార్చ్ 28, 1953 న అరబ్ లీగ్ లో చేరింది లిబియా. స్వతంత్రం వచ్చిందన్న మాటే కాని, లిబియా కష్టాల్లో కూరుకు పోయింది. అదృష్టవశాత్తు, ఏప్రియల్ 1955 లో పెట్రోలియం ఉత్పత్తులు ఊపందుకోవడంతో, లిబియా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే పరిస్థితులు రాజు ఆధీనంలోంచి జారిపోసాగాయి. ఇద్రిస్ వైద్య పరీక్షల కోసం, చికిత్స కోసం టర్కీ దేశంలో వుండగా, గడాఫి నాయకత్వంలో సైన్యం తిరుగుబాటు చేయడం, రాచరిక పాలన అంతరించడం, సెప్టెంబర్ 1, 1969 న కేవలం పాతిక సంవత్సరాల వయసులోనే గడాఫి గద్దె ఎక్కడం జరిగింది. ఇక నాటి నుంచీ, లిబియా ప్రజలు నియంతృత్వ పాలనలోనే మగ్గి పోతున్నారు.

మధ్య ప్రాచ్య ప్రాంతంలోని ఈజిప్టు, తునీషియా, బహరైన్, యెమెన్ దేశాలలో జరిగిన-జరుగుతున్న విధంగానే, కనీ వినీ ఎరుగని రీతిలో లిబియా పౌరులు, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, గడాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమం చేపట్టారు. రోజు-రోజుకు ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. అణచివేత కార్యక్రమం కూడా అదే మోతాదులో కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లిబియాలో జరుగుతున్న మారణ కాండను ఖండించడానికి నాలుగు రోజులు పట్టింది. ఆచి-తూచి మాట్లాడిన ఒబామా, గడాఫి పేరెత్తకుండా, అధికారులను తప్పు పడుతూ ప్రకటన చేశారు. కాకపోతే, దరిమిలా, లిబియాపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులో కొచ్చే దిశగా కదలడం లేదు.

ప్రపంచ చరిత్రలో, రాచరికానికి సంబంధం లేని పాలకుల్లో, ఒక దేశాధినేతగా, అత్యధిక కాలం అధికారంలో వున్న వ్యక్తిగా గడాఫి రికార్డు నెలకొల్పాడు. అలానే లిబియాను ఇంత ఎక్కువ కాలం పాలించిన వారు కూడా ఎవరూ లేరు. అధికారంలో వుంటూనే, ఆస్తులు-అంతస్తులు లెక్కకు దొరకనంత మోతాదులో సమకూర్చుకున్నాడు గడాఫి. యుక్త వయసులో వుండగా, అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు నాజర్ అన్నా, ఆయన అరబ్ సోషలిస్టు-జాతీయ విధానమన్నా గడాఫికి విపరీతమైన అభిమానం వుండేది. 1956 నాటి సూయజ్‌ కాలువ సంక్షోభంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలలో చురుగ్గా పాల్గొనేవాడు గడాఫి. లిబియా రాజు ఇద్రిస్ ను పదవీచ్యుతుడు చేసిన గడాఫి, "లిబియన్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించి, తనను తానే మరో "చి గు వేరా" గా పిలుచుకున్నాడు. పాశ్చాత్య దేశాల వ్యతిరేక భావాల తీవ్రవాదులకు కేంద్ర స్థావరంగా లిబియాను రూపుదిద్ద సాగాడు గడాఫి. అమెరికన్లకు సింహ స్వప్నమయ్యాడు. లిబియాను పాలించడానికి, కొత్త తరహాలో, గడాఫి అధ్యక్షుడుగా "రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్" ను ఏర్పాటైంది. ఇతర సైనిక నియంతలు అనుసరించిన విధంగా కాకుండా, తన పేరు ముందర "జనరల్" బిరుదుకు బదులు, కేవలం "కల్నల్" అని మాత్రమే తగిలించుకున్నాడు. ఇప్పటికీ కల్నల్ గడాఫి గానే కొనసాగుతున్నాడు. లిబియా సమాజం "ప్రజలచే పాలించబడే" సమాజం అనీ, తనకు అత్యున్నతమైన సైనిక బిరుదులొద్దని అంటుండేవాడు.

"అరబ్ నేషనలిజం", "సంక్షేమ రాజ్యం", "ప్రత్యక్ష లోక ప్రియ ప్రజాస్వామ్యం", అన్న నినాదాల ప్రాతిపదికగా తన ప్రభుత్వ పాలన వుంటుందని చెప్పుకునేవాడు గడాఫి. తాను అనుసరిస్తున్న విధానం "ఇస్లాం సామ్యవాదం" అని అంటూ, ఒక వైపు చిన్న కంపెనీల అజమాయిషీ ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టుతూనే, భారీ సంస్థలను మాత్రం ప్రభుత్వ పరంగా అధికారుల ఆధిపత్యంలో నడిపేవాడు. 1977 లో తన పంధా మార్చుకున్నాడు. రిపబ్లిక్ ప్రభుత్వం పేరు మార్చి, "ప్రజల ప్రభుత్వం" గా ప్రకటించాడు. "స్థానిక ప్రజాదరణ మండళ్ల" ద్వారా, "సహజీవన వ్యవస్థల" ద్వారా, నేరుగా ప్రజలచే పాలించబడే "ప్రత్యక్ష ప్రజాస్వామ్యం" అమల్లోకి వచ్చిందని ప్రకటించాడు గడాఫి. దేశ వ్యాప్తంగా వుండే ఈ మండళ్ల-వ్యవస్థలపై, జాతీయ స్థాయిలో, గడాఫి "సెక్రటరీ జనరల్" గా "పీపుల్స్ కాంగ్రెస్" ఏర్పాటైంది. 2008 లో మరో విప్లవాత్మక ప్రకటన చేశాడు. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లభించే ఆదాయం నేరుగా దేశ ప్రజలకు పంచుతానన్నాడు. పొరుగు దేశాలకు సంబంధించి, నాజర్ విధానాలనే పాటించాడు. అరబ్ దేశాల ఐక్యతకు, "ఐక్య అరబ్ జాతి" కొరకు పోరాడుతున్నాననేవాడు. నాజర్ మరణం తర్వాత, అరబ్ జాతి సైద్ధాంతిక నాయకత్వం ఆశించాడు. పాలస్తీనా విమోచన సంస్థకు గట్టి మద్దతిచ్చాడు. 1979 శాంతి ఒప్పందం దరిమిలా, ఆయన ఇజ్రాయెల్ వ్యతిరేకత, లిబియా-ఈజిప్టు మధ్య సంబంధాలు తెగిపోవడానికి దారి తీసింది. తక్షణమే సోవియట్ యూనియన్ తో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.

దక్షిణాఫ్రికా దేశాల్లోను, ముస్లిం దేశాల్లోను, తిరుగుబాటు వుద్యమాలను-విముక్తి పోరాటాలను ప్రోత్సహించే విధంగా తన అంతర్జాతీయ రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాడు గడాఫి. 1980 దశకం చివరికల్లా, అంతర్జాతీయ-సీమాంతర ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే ప్రధాన వ్యక్తిగా, పాశ్చాత్య దేశాలు గడాఫిని అనుమానించసాగాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విముక్తి పోరాటాలను ప్రోత్సహించడం వల్ల, సద్దాం హుస్సేన్ ఇరాక్ కు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో ఇరాన్ దేశానికి మద్దతివ్వడం వల్ల, అలనాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఆగ్రహానికి గురయ్యాడు గడాఫి. "మధ్య ప్రాచ్య ప్రాంతపు పిచ్చి కుక్క” గా రీగన్ ఆయనను అభివర్ణించాడు అప్పట్లో. దరిమిలా చోటుచేసుకున్న సంఘటనలు, అమెరికా, లిబియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు చెడిపోవడానికి దారితీశాయి. సద్దాం హుస్సేన్ పతనం అనంతరం, తన దేశంలో "భారీ విధ్వంసక రసాయన అణు ఆయుధాలను" తనిఖీ చేయమని, అంతర్జాతీయ సంస్థలకు తనంతట తానే విజ్ఞప్తి చేశాడు. వాటిని కనుగొని, ధ్వంసం చేసిన అంతర్జాతీయ పర్యవేక్షక దేశాల ప్రతినిధుల ద్వారా ఆయా దేశాల పాలకులతో సంబంధాలను మెరుగు పరచుకున్నాడు గడాఫి. నాటి బ్రిటీష్ ప్రధాని టోనీ బ్లెయిర్ లిబియా పర్యటించడానికి, ఆయన గడాఫిని ప్రశంసించడానికి, సీమాంతర ఉగ్రవాదం అణచివేతలో లిబియా పాల్గొనాలని బ్లెయిర్ కోరడానికి ఆ సంబంధాలు తోడ్పడ్డాయి. క్రమేపీ, అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగవడం, ఫ్రాన్స్ అధ్యక్షుడు లిబియాలో పర్యటించడం జరిగింది. ఒబామా అధ్యక్ష పదవికి పోటీలో వున్నప్పుడు గడాఫి ఆయనను తీవ్రంగా విమర్శించాడు.

ఒకానొక సందర్భంలో గడాఫి భారతదేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటనను చేశారు. ఎన్నాళ్లగానో నలుగుతున్న కాశ్మీరు అంశంపై మాట్లాడుతూ... కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రం హోదాను ఇచ్చేసి భారత్- పాక్‌లు అక్కడ నుంచి శాశ్వతంగా వైదొలగాలని, కాశ్మీరు ఆ రెండు దేశాలకు చెందని దేశంగా పరిగణించాలని అన్నారు. ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో గడాఫి పలు అంశాలపై సుదీర్ఘమైన ప్రసంగం చేస్తూ, సుమారు గంటన్నర పాటు కాశ్మీరు అంశంతోపాటు అమెరికా, ఐక్య రాజ్య సమితిలపైనా మండి పడ్డాడు. భద్రతామండలిని తీవ్రవాద మండలిగా అభివర్ణించాడు. ప్రపంచాన్ని శాసించేటటువంటి కొన్ని కీలక అధికారాలను భద్రతామండలికి కట్టబెట్టడంపై తన అసంతృప్తిని వెల్లడి చేశాడు.

ఈ నేపధ్యంలో, కారణాలే వైనా, ఫిబ్రవరి 17, 2011 న గడాఫి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజల నిరసనలు-ప్రదర్శనలు మొదలయ్యాయి. గడాఫి సైన్యం బెదిరింపులను ఖాతరు చేయకుండా, తుపాకీలకు ఎదురు నిల్చి, ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు ప్రజలు. ఇతర అరబ్ దేశాల నాయకుల మాదిరిగా కాకుండా, గడాఫి తీవ్ర స్థాయిలో అణచివేతకు దిగాడు. తన ప్రాణాలున్నంతవరకు పోరాడుతానని ప్రతిన చేశాడు. తనపై తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ కారకుడని కూడా అంటున్నాడు. అయినా, లాడెన్ ప్రధాన శత్రువు, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, లిబియా పై ఆంక్షలు విధించేందుకు సన్నద్ధమౌతున్నాడు.

కారణేలేవైనా, ఇటీవలి కాలంలో అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న తిరుగుబాటులకు, గతంలో సైనిక తిరుగుబాటులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అప్పూడూ-ఇప్పుడూ, తిరుగుబాటుల వల్ల నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశాలు లేవు. ఆ దేశాల్లోని, ఈ కాలం సైనికులు ప్రభుత్వాలను పడగొట్టడానికి నూతన మార్గాలను ఎంచుకున్నట్లు కనబడుతున్నది. ఉన్న నియంతకు వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పి, వారిని గద్దె దింపి, ఆ స్థానంలో అధికారం పొందడమనే వ్యూహం వుందా అన్న ధోరణిలో అక్కడి తిరుగుబాటులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నెలకొననంత వరకు తిరుగుబాటు చేసిన ప్రజలకు వారు కోరుకున్నది లభించనట్లే. ఇదిలా వుండగా, అరబ్ ప్రపంచాన్ని అస్థిర పరచడానికి, అమెరికా పన్నిన కుట్రలో భాగంగానే, ఆయా దేశాల్లో తిరుగుబాటులు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యమైనా-నియంతృత్వమైనా, రాబోయే ప్రభుత్వాలు తన కనుసన్నల్లోనే మెలగాలని అమెరికా పన్నాగమని విశ్లేషకులనుకుంటున్నారు.

1 comment:

  1. Agree, he looks like a old circus buffoon with his stupid cap, 101 medals and dress.

    He can irritate even Buddha, no wonder you too lost your cool temper. :))

    ReplyDelete