Friday, August 10, 2012

అంగారకుడిపై రోవర్: వనం జ్వాలా నరసింహారావు


అంగారకుడిపై రోవర్
సూర్య దినపత్రిక (11-08-2012)
వనం జ్వాలా నరసింహారావు

మానవజాతి కొనసాగిస్తున్న మహాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం "నాసా" మరో అడుగు ముందుకు వేసింది. ఆ సంస్థ అంతరిక్షంలోకి పంపిన రోవర్ "క్యూరియాసిటీ" అంగారకుడిపై విజయవంతంగా కాలు మోపడంతో, నాసా మరో కీలక మైలురాయిని అధిగమించినట్లయింది. అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని నాసా కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలలో మందహాసం తొణికిసలాడింది. కరతాళ ధ్వనులు మారుమోగాయట. క్యూరియాసిటీ లాండింగును న్యూయార్క్ లోని టైం స్క్వేర్‌లో నాసా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై లైవ్‍లో వీక్షించిన అమెరికన్ల ఆనందోత్సవాలకు అవధులే లేవంటున్నారు. అంగారకుడిపై కాలుమోపిన క్యూరియాసిటీ అక్కడ జీవ పదార్ధం ఉనికిని కనుగొనే వేటలో మునిగిపోయింది. అంగారకుడి చిత్రాలను భూమికి పంపింది. సుమారు తొమ్మిది వందల కిలోగ్రాముల బరువున్న క్యూరియాసిటీ రోవర్ ముప్పై ఐదు కోట్ల మైళ్ల సుదూర ప్రయాణం చేసి అంగారకుడిని చేరుకుంది. మొత్తం మీద గ్రహాంతర జీవం కోసం మానవుడు జరుపుతున్న శతాబ్దాల అన్వేషణ కీలక దశకు చేరుకుంటుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  ఎన్నో వున్నాయి.

1957 లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. వాస్తవానికి మార్చ్ 3, 1915 న ఆ దేశంలో నెలకొల్పిన "నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎయిరోనాటిక్స్"-"నాకా" సంస్థ నుంచి "నాసా" ఆవిర్భావం జరిగిందనాలి. అంతరిక్ష యానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, తమ దేశంలో అభివృద్ధి చేయడానికి, "నాసా" స్థాపనకు నలభై సంవత్సరాల ముందు నుంచే "నాకా" పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. తోటి అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ సాధించిన ఫలితాలను అధిగమించేందుకు, అంతరిక్ష రంగంలో మరింత పట్టు సాధించేందుకు, ఐసెన్హోవర్ "నాసా" ను స్థాపించాడు. జాన్ కెన్నెడీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, "నాసా" పైనా, అంతరిక్షంలోకి పంపాల్సిన వ్యోమగాముల శిక్షణ-అభివృద్ధి పైనా, ముఖ్యంగా "చంద్ర మండలం" మీద పాదం మోపడం కొరకూ, భారీగా నిధులను కేటాయించింది నాటి అమెరికన్ ప్రభుత్వం. అవి సత్ఫలితాలనిచ్చి, జులై 20, 1969 , అమెరికా అంతరిక్ష నౌక "అపోలో" లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్విన్ అడ్రిన్ లు కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిగా, చంద్రుడి మీద పాదం మోపిన తొలి మానవులయ్యారు. ఆయన వాంఛను నెరవేర్చారు.


"నాసా" ఒక వైపు అంతరిక్ష యానం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే, ఇంకో వైపు, గతంలో "నాకా" చేపట్టిన "అంతరిక్ష పరిశోధన" కు సంబంధించిన ఫలితాలలోను గణనీయమైన పురోగతిని సాధిస్తూ వచ్చింది. "స్పేస్ టెక్నాలజీ" కి సంబంధించిన వాతావరణ-సమాచార రంగాల్లో అభివృద్ధికి అంతరిక్ష నౌకలను అనుసంధానం చేయడంలో కూడా విజయం సాధించింది. వాషింగ్టన్ లోని "నాసా" ప్రధాన కేంద్ర కార్యాలయం, అంతరిక్ష యానానికి సంబంధించిన పరిశోధన-అభివృద్ధి-శిక్షణలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం-అమలుకు చర్యలు తీసుకోవడం తీసుకుంటుంది.

"నాసా" కార్య కలాపాల ప్రధాన అధిపతిని "అడ్మినిస్ట్రేటర్" అంటారు. అమెరికా అధ్యక్షుడు ఎంపిక చేసి, నామినేట్ చేసిన వ్యక్తిని, సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రస్తుతం జులై 17, 2009 నుంచి ఆ పదవిలో వున్న పన్నెండవ అడ్మినిస్ట్రేటర్, మేజర్ జనరల్ ఛార్లెస్ ఫ్రాంక్ బోల్డెన్ జూనియర్ ను, ప్రెసిడెంట్ ఒబామా నామినేట్ చేశాడు. 34 సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవంలో 14 సంవత్సరాలు "నాసా" అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సభ్యుడుగా వుంటూ, 1986-1994 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు అంతరిక్ష నౌకలో స్పేస్ వాక్ చేశాడు.  "నాసా" లో వివిధ కీలక పదవులను గతంలో నిర్వహించిన బోల్డెన్ 1946 సంవత్సరంలో ఆగస్ట్ నెల 19 వ తేదీన జన్మించాడు. బోల్డెన్ హ్యూస్టన్ నగర వాసి.

హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది

హ్యూస్టన్లోని ఈ కేంద్రం. అమెరికా అంతరిక్ష పరిశోధన మొదటి కార్యక్రమమైన జెమిని కార్యకలాపాలు పూర్తయి పోయి, అపోలో కార్యక్రమం ఆరంభమవడంతో, యావత్ ప్రపంచం దృష్టి దానిమీద పడింది. కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా చేపట్టిన చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవజాతి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరుపు రాని సంఘటన.

భూత-భవిష్యత్-వర్తమానాలకు చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధనలు, సాధించిన విషయాలు, మానవజాతి మనుగడకు సాధించనున్న సత్ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చిక్కడ. సాక్షాత్తు అంతరిక్ష యానం చేస్తున్న అనుభూతినీ పొందవచ్చు. ఈ భూమండలంలో-యావత్ ప్రపంచంలో, మరెక్కడా లేని విధంగా, మరో ప్రపంచంలోకి సాహసోపేతమైన ప్రయాణం చేయించగల సౌకర్యమున్న ప్రదేశం కూడా బహుశా హ్యూస్టన్లోని అంతరిక్ష కేంద్రం ఒక్కటేనోమో. ఇక్కడ ప్రదర్శనలో వుంచిన వివిధ అంశాలు, ఆకర్షణలు, ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, చిన్న పిల్లల వినోద కార్య క్రమాలు.. ... ఇలా ఎన్నో ఆసక్తికరమైన వినోద-విజ్ఞాన ప్రదేశం హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

No comments:

Post a Comment