"ఆన్గ్
కార్ వాట్"
ప్రపంచంలోనే
అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయం
వనం జ్వాలా నరసింహారావు
ఆసియా-పసిఫిక్ దేశాల గూగుల్ సంస్థల మానవ
వనరుల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, సింగపూర్‌లో వుంటున్న మా
కుమారుడు ఆదిత్య, కోడలు పారుల్, రెండేళ్ల
మనుమరాలు కనక్‍తో గడిపేందుకు శ్రీమతి విజయలక్ష్మితో సహా ఇక్కడికొచ్చాను. అక్కడినుంచి
ఆగస్ట్ 24 న బయలుదేరి
మూడురోజుల పాటు కాంబోడియా దేశంలోని సయాం రీప్‍కు వెళ్లొచ్చాం. కాంబోడియా దేశానికి
వెళ్లే భారతీయులకు విమానాశ్రయంలో దిగిన తరువాత వీసా పొందే వీలుంటుంది. ఆ తతంగం
కేవలం ఐదు నిమిషాల్లోనే ముగిసింది. కాకపోతే అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరు
ఇమ్మిగ్రేషన్ అధికారులు మమ్మల్ని లంచం అడిగారు. అది వేరే విషయం. మేమివ్వకపోయినా
బలవంతం చేయలేదు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం: ప్రపంచం మొత్తంలో అవినీతిలో కనీసం 170 దేశాలకంటే
కాంబోడియా ముందుందని! అక్కడి పౌరులు మాత్రం అత్యంత మర్యాదస్తులు.
"నమస్తే" అంటూ స్వాగతం పలకడం, వీడ్కోలు చెప్పడం
తప్పనిసరిగా చేస్తారు. మేం ముందుగానే రిజర్వ్ చేయించుకున్న "బోరీ ఆన్గ్ కార్ రిసార్ట్"
నుంచి మా కోసం వచ్చిన కారులో సాయంత్రం నాలుగు గంటలకు హోటెల్ కు చేరుకున్నాం.
బోరీ ఆన్గ్ కార్ రిసార్ట్ ఒక ఫైవ్ స్టార్
హోటెల్. ఐదు లక్షల జనాభా కలిగిన సయాం రీప్ నగరం నడి బొడ్డులో వుంది.
విమానాశ్రయానికి, "ఆన్గ్ కార్ వాట్" కు ఏడు కిలోమీటర్ల
దూరంలో, నగరంలోని షాపులకు-నైట్ మార్కెట్‌కు ఐదు నిమిషాల లోపు
చేరుకునే వెసలుబాటున్న ఈ హోటెల్, సయాం రీప్‍లోని మంచి
హోటెళ్లలో ప్రధానమైంది. ఆ సాయంత్రం రెండు "టుక్-టుక్" లను తీసుకుని
దగ్గరలో వున్న నైట్ మార్కెట్‌కు వెళ్లొచ్చాం. "టుక్-టుక్" చాలా గమ్మత్తుగా వుంటుంది. ఒక మోటార్ సైకిల్
కో, లేక, మోపెడ్ కో, ఆటో వెనుక భాగాన్ని తగిలించి ప్రయాణీకులను తిప్పుతారు. లోపల కూర్చనున్నవారికి
వాన-ఎండ తగలకపోయినా నడిపే వారికి మాత్రం ఏ ఆసరా వుండదు. మేం నైట్ మార్కెట్‌కు
వెళ్లడానికి 8000 కాంబోడియా
రియల్స్ ఇచ్చాం! రాత్రి భోజనం చేసిన చోట 90, 000 ఇచ్చాం! ఆ తరువాత అర్థం ఐంది మాకు. కాంబోడియా కరెన్సీ విలువ చాలా
తక్కువ అని. ఒక అమెరికన్ డాలర్‌కు 4000 రియల్స్ మారకం రేట్. ప్రస్తుతం చలామణిలో వున్న ‘రియల్’ ఏప్రిల్ 1,
1980 నుంచి అమల్లోకొచ్చింది. ఐతే ఇంతవరకూ రియల్‌కు ప్రజామోదం పూర్తిగా
లభించలేదు. ఇప్పటికీ కాంబోడియన్లకు విదేశీ మారక ద్రవ్యం అంటేనే మోజు. దానికి కారణం
లేకపోలేదు. 1993 లో ఐక్య
రాజ్య సమితి శాంతి సేనలు కాంబోడియాలో వుంటున్నప్పుడు పెద్ద మొత్తంలో అమెరికన్ డాలర్‌లను
వాడకంలోకి తెచ్చింది. దాని ఫలితంగా ఎక్కువమంది డాలర్లే ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ
లావాదేవీలలో కూడా డాలర్‌లను వాడుతుంటారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు కూడా
అమెరికన్ డాలర్‌లలోనే లెక్క కడతారు.
ఆ తరువాత రెండు రోజులు ప్రపంచ ప్రఖ్యాతి
గాంచిన, అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయమైన, "ఆన్గ్
కార్ వాట్" ను చూద్దామనుకున్నాం. హోటెల్ హాస్పిటాలిటీ విభాగం దానికి
కావాల్సిన ఏర్పాట్లు చేసింది. 45 డాలర్లకు అక్కడికి వెళ్లి రావడానికి కారు, 35 డాలర్లకు
గైడ్, నలుగురికి కలిపి 80 డాలర్ల
ఎంట్రీ ఫీజు-మొత్తం ఒక్క రోజుకు 160 డాలర్ల ఖర్చుతో అన్నీ సమకూరాయి. మొదటి రోజు దినమంతా,
రెండో రోజు ఉదయం పూట అక్కడ గడిపాం. అదో చెప్పరాని అనుభూతి.
తెలియకుండానే నాలుగైదు కిలోమీటర్లు అలసట లేకుండా తిరిగాం.
కాంబోడియన్ల ఖ్మేర్ రాచరిక వ్యవస్థలో, దేశ
అధికారిక దేవాలయంగా, అలనాటి రాజధాని నగరమైన యశోధరపురంలో,
పన్నెండవ శతాబ్ది ఆరంభంలో, రెండవ సూర్యవర్మన్
రాజు "ఆన్గ్ కార్ వాట్" దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వీకుల ఆచారమైన
శైవిజాన్ని దూరం పెట్టి, ఆన్గ్ కార్ వాట్ దేవాలయాన్ని విష్ణు
దేవుడికి అంకితమిచ్చాడు సూర్యవర్మన్. నాటినుంచి నేటిదాకా
అత్యంత జాగ్రత్త కట్టడంగా కాపాడబడుతూ వస్తున్న కాంబోడియాలోని ఈ ఆన్గ్ కార్ వాట్
దేవాలయ సముదాయం, మొదలు హిందువుల ఆలయంగా, ఆ తరువాత బౌద్దుల ఆరామంగా వుంటూ
వచ్చింది. సాంప్రదాయిక ఖ్మేర్ ఆర్కిటెక్చర్‍కు ముమ్మూర్తులా ప్రాతినిధ్యం వహించే
విధంగా మలిచిన ఈ దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు అడవిలో ఎవరికీ కానరాని
విధంగా చెట్ల మధ్య-పుట్టల మధ్య దాగి వుందంటారు. దేశ విదేశాల పర్యాటకులను
ఆకర్షించేది మాత్రమే కాకుండా, ఆన్గ్ కార్ వాట్, కాంబోడియా
సంస్కృతీ-సాంప్రదాయాలకు ప్రతీకగా, ఆ దేశ జాతీయ జండాపై
దర్శనమిస్తుంది. హిందువుల పురాణాలలోని దేవతల నిలయమైన మేరు పర్వతం తరహాలో దీనిని
డిజైన్ చేశారు. దేవాలయ సముదాయం చుట్టూతా ఎల్లప్పుడూ నీటితో నిండి వుండే వెడల్పాటి
కందకం తవ్వబడింది. సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవైన ప్రహారీ గోడ కూడా చుట్టూతా
వుంది. వీటికి అదనంగా దీర్ఘ చతురస్రాకారంలో వున్న మూడు గాలరీలు-ఒకదానికంటే మరొకటి
ఎత్తుగా వుండే విధంగా-ఆన్గ్ కార్ వాట్ చుట్టూ వున్నాయి.
ఆంగ్లంలో ఆన్గ్ కార్ వాట్ అంటే
"టెంపుల్ సిటీ" అని, ఖ్మేర్ భాషలో "దేవాలయాల నగరం" అనీ
కాంభోడియన్లు సంబోధిస్తారు. లోగడ ఈ దేవాలయాన్ని ఖ్మేర్ లో "ప్రేహ్ పిష్ణులోక్"
అని, సంస్కృతంలో "వర విష్ణులోక" అని అనే వారు. ఈ
నాటి ఆధునిక పట్టణమైన సయాం రీప్ కు సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరంలో వున్న ఆన్గ్
కార్ వాట్, పురాతన రాజధానికి సమీపంలో తూర్పు భాగాన వుంది.
అతి సమీపంలోనే పదకొండవ శతాబ్దిలో హిందువుల దేవుడు శివుడికి అంకితం చేసిన "బాఫువాన్"
దేవాలయం కూడా వుంది. అదీ చూడతగ్గ స్థలమే. ఆన్గ్ కార్ వాట్‍ను సందర్శించాలనుకునే
వారు, ముందుగా, దానికి సుదూరంలో వున్న
"అప్సర అథారిటీ" కార్యాలయం నుంచి, ఒక్కో వ్యక్తికి
రోజుకు 20 డాలర్ల
చొప్పున చెల్లించి, ఫొటో ఐడెంటిటీతో సహా ఎంట్రీ పాస్
కొనుక్కోవాలి. ఒకే సారి కన్సెషన్ ధరలో మూడు రోజులకు, వారం
రోజులకు కూడా కొనవచ్చు. దేవాలయాల సముదాయం మొత్తం చూడాలంటే, సుమారు
ఐదారు కిలోమీటర్ల పాటు ఎత్తు-పల్లాల బాటలో నడవాలి. కూలిన రాళ్ల మీద, కూల బోయే ప్రమాదమున్న గోడల మధ్య నుంచి నడవాలి. చీకటి పడితే చేతిలో బాటరీ
లైట్ తప్పని సరిగా వుండాలి. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. మేం వెళ్లిన మొదటి రోజున చెదరు-ముదురుగా
వర్షం కురిసింది. గొడుగుల సహాయంతో నడవ గలిగాం. రెండో రోజున ఉదయం నాలుగున్నర కే
చేరుకున్నాం. ఆన్గ్ కార్ వాట్ దేవాలయం గోపురాల మధ్య నుంచి, ఎదురుగా
వున్న నీటిలో నీడ పడుతూ కనిపించే సూర్యోదయాన్ని వీక్షించడానికి మాతో పాటు
వేలాదిమంది దేశ విదేశీ పర్యాటకులున్నారక్కడ. తెల్లవారే వరకు పూర్తి చీకటే. అడుగులో
అడుగు వేసుకుంటూ, బాటరీ కాంతిలో నెమ్మదిగా సూర్యోదయం
కనిపించే స్థలానికి చేరుకున్నాం. అదో అద్భుతమైన దృశ్యం!
ఆన్గ్ కార్ వాట్ దేవాలయ నిర్మాణం ఇంకా
కొంచెం మిగిలి వుండగానే, రాజా సూర్యవర్మన్ చనిపోవడంతో, అక్కడ
పని నిలిచి పోయింది. కొన్నేళ్లు అలానే గడిచాక, ఏడవ జయవర్మన్
రాజయ్యాడు. "ఆన్గ్ కార్ థాం" పేరుతో సమీపంలో అన్గ్ కార్ వాట్‍కు ఉత్తర
దిక్కుగా నూతన రాజధానిని, అధికారిక దేవాలయంగా
"బాయాన్" ను నిర్మించారాయన. పదమూడవ శతాబ్దంలో ఆన్గ్ కార్ వాట్ క్రమేపీ
హిందువుల ఆధీనంలోంచి థెరవాడ బౌద్ధుల చేతుల్లోకి పోయింది. నేటికీ ఒక విధంగా అలానే
వుందనాలి. ఆ మాటకొస్తే ఏ దేవుడికీ పూజా-పునస్కారాలు లేనే లేవక్కడ. ఒకనాడు జరిగిన
దాఖలాలు కూడా లేవు. ఆన్గ్ కార్ వాట్‍ను పూర్తిగా ఉపయోగించుకోవడం కానీ, నిరుపయోగంగా చేయడం కానీ ఏనాడూ జరగలేదు. దాని చుట్టూతా వున్న వెడల్పాటి
కందకం అటవీ ప్రాంత అక్రమ ఆధీనంలోకి పోకుండా కాపాడిందనాలి. ఇరవయ్యో శతాబ్దంలో దీని
ఆచూకీ తెలుసుకున్న వారికి దానిని ఎలాగోలో పునరుద్ధరించాలని అనిపించింది. దేవాలయ
సముదాయాన్ని కప్పి వేసిన ఆకులు-చెట్లు-పుట్టలు-మట్టి తొలగించాల్సి వచ్చింది. 1970-1980 లలో
చోటు చేసుకున్న అంతర్యుద్ధం వల్ల పనిలో అంతరాయం కలిగింది. ఒక బలీయమైన సాంస్కృతిక
శక్తిగా కాంబోడియన్ ప్రభుత్వం, విదేశాలతో-ముఖ్యంగా ఫ్రాన్స్,
అమెరికా, థాయ్‍లాండ్ లతో, దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఆన్గ్ కార్ వాట్ ఉపయోగపడింది.
ఆన్గ్ కార్ వాట్‍తో సహా ఇతర కట్టడాల
సౌందర్యానికి అబ్బురపడిన ఫ్రాన్స్ దేశం ఆగస్ట్ 11, 1863 న కాంబోడియాను
ఆక్రమించుకుని, తన ప్రొటెక్టరేట్‌గా ఏర్పాటు చేసుకుంది. సయాం రీప్
ను అధీనంలోకి తెచ్చుకుంది. చివరకు కాంబోడియా నవంబర్ 9, 1953 న
స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచీ ఆన్గ్ కార్ వాట్ ను తన స్వాధీనంలో నే
వుంచుకుంది. వియత్నాం యుద్ధం జోరుగా కొనసాగుతున్న రోజుల్లో, అలనాటి
కాంబోడియా అధినేత ప్రిన్స్ నోరోడం సిహనౌక్, అమెరికా
అధ్యక్షుడు కెన్నెడీ సతీమణి జాక్విలిన్ కెన్నెడీ జీవితాభిలాషైన ఆన్గ్ కార్ వాట్‍ను
చూడడం కొరకు, ఆమెకు ప్రత్యేకంగా కాంబోడియాలో విందు ఏర్పాటు
చేశాడు!
భారత దేశానికి చెందిన ఒరిస్సా, చోళుల
కాలానికి చెందిన తమిళనాడు దేవాలయాల సాంప్రదాయాలను అక్కడక్కడా పుణికి పుచ్చుకుంది.
దేవుళ్ల నివాస స్థలమైన మేరు పర్వతాన్ని పోలిన విధంగా దీని డిజైన్ వుంటుంది. మేరు
పర్వతానికి వున్న విధంగానే, వాటి శిఖరాల స్థానంలో, నాలుగు దిక్కులా చతురస్రాకారంలో నాలుగు గోపురాలు, మధ్యలో
మరో గోపురం వుంటాయి. మేరు పర్వతం చుట్టూతా వున్నట్లు, నీరు
ప్రవహించడానికి వెడల్పాటి కందకం తవ్వడం జరిగింది. ఖ్మేర్ శైలి ఆర్కిటెక్చర్ తో
డిజైన్ చేయబడిన ఆన్గ్ కార్ వాట్ కట్టడానికి ఇసుక రాళ్లు, లాటరైట్
ఖనిజం ఉపయోగించారు. ప్రహారీ గోడ పొడవు 1024 మీటర్లు. వెడల్పు 802 మీటర్లు.
ఎత్తు 4.5 మీటర్లు. 30 మీటర్ల
పొడవు-వెడల్పు వున్న పచ్చిక బయలు నేల చుట్టూతా వుంటుంది. అదనంగా 190 మీటర్ల వెడల్పున్న
కందకం కూడా వుంది. దేవాలయానికి వెళ్లడానికి తూర్పు-పశ్చిమ దిక్కులలో మట్టి వంతెన
లాంటిది వుంటుంది. మధ్య మధ్యలో కట్టెలతో తయారు చేసిన వంతెనలుంటాయి. తూర్పు, పడమర,
ఉత్తర, దక్షిణ దిక్కుల్లో వరుసగా నాలుగు
ఎత్తైన గోపురాలున్నాయి. పడమట భాగాన వున్నది అన్నిటికన్నా ఎత్తైనదే కాకుండా
పడిపోవడానికి సిద్ధంగా వున్న మూడు స్థంబాలున్నాయి.
దక్షిణ భాగాన వున్న టవర్ కింది భాగంలో
విష్ణుమూర్తి భారీ విగ్రహం ఒకటి వుంది. సుమారు పదిహేను అడుగుల ఎత్తున్న ఈ
విగ్రహానికి ఎనిమిది చేతులున్నాయి. ఖ్మేర్ భాషలో ఆ మూర్తిని "టా రీచ్" అంటారు.
బహుశా ఆన్గ్ కార్ వాట్ దేవాలయం ప్రధాన పూజా విగ్రహం ఇదే అయ్యుండాలి. ఈ విగ్రహానికి
పూజా-పునస్కారాలు లేవు. కొద్ది దూరంలో తల-చేతులు నరికేసిన లక్ష్మీదేవి భారీ
విగ్రహం కనిపిస్తుంది. బహుశా ఏదో దండయాత్రలో అలా జరిగుండాలి. టవర్ల మధ్య
గాలరీలున్నాయి. గోపురానికి రెండు వైపులా "ఏనుగు ద్వారాలు" గా పిలువబడే
రెండు మార్గాలున్నాయి. వాటిలో ఏనుగులు పట్టేంత సందుంటుంది. ఈ గాలరీలకు (వెలుపలి)
పశ్చిమభాగాన చతురస్రాకార స్థంబాలు, (లోపలి) తూర్పు భాగాన పెద్ద గోడ
వున్నాయి. స్థంబాల మధ్యన వున్న పైకప్పు తామర పూల ఆకారంలో అలంకరించబడి వున్నాయి.
గోడ పశ్చిమ భాగంపై నాట్యం చేస్తున్న ఆకృతిలో బొమ్మలున్నాయి. శిథిలావస్థలో వున్న
కిటికీలు, నాట్యం చేస్తున్న మగవారి బొమ్మలు, దేవతల బొమ్మలు, తూర్పు భాగం గోడపై దర్శనమిస్తాయి.
ద్వారం దక్షిణ భాగంలో కూడా దేవతల బొమ్మలు కనిపిస్తాయి. ఇలా గాలరీలు, గోపురాలు అడుగడుగునా కనిస్పిస్తుంటాయి. నగరం కన్నా ఎత్తైన ప్రదేశంలో
దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయంలోని మూడు దీర్ఘ చతురస్రాకార గాలరీలు, ఒకటికంటే మరొకటి ఎత్తుగా వుండడం విశేషం. ఈ గాలరీలను రాజుకు, బ్రహ్మ దేవుడికి, చంద్రుడికి, విష్ణుమూర్తికి
అంకితమివ్వడం మరో విశేషం. దేవాలయం పశ్చిమ ముఖంగా వుండడంతో, మిగిలిన
అన్ని తూర్పు దిక్కుగా ఏర్పాటు చేయడం జరిగింది.
వెలుపల వున్న గాలరీ 215 మీటర్ల
పొడవు, 187 మీటర్ల
వెడల్పు వుండడంతో పాటు, మూలలలో స్థంబాలకు మారుగా విశాలమైన
మైదానం మాదిరి కనిపిస్తుంది. ఒక విధంగా ప్రధాన కట్టడానికి నిర్మాణ పరంగా సపోర్టుగా
వుండడమే కాకుండా, ఈ గాలరీలు, దేవాలయం బయట
వైపున ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. వెలుపలి గాలరీ నుంచి లోపలి మరో భాగానికి కలిపే
ప్రదేశాన్ని "వేయి దేవుళ్ల హాల్" అని పిలుస్తారు. శతాబ్దాల తరబడి
అక్కడికి వచ్చే యాత్రీకులు బుద్ధుడి విగ్రహాలను అక్కడికి తెచ్చి వేసి పోయేవారట.
దురదృష్టవశాత్తు వాటిలో చాలావరకు దుండగుల దాడుల్లో దొంగిలించబడడమో, లేక తల భాగం తీసేసి మొండేలుగా చేయడమో జరిగింది. అక్కడి దృశ్యం అతి
జుగుప్సాకరంగా కనిపిస్తుందిప్పుడు. ఈ ప్రదేశంలోని గోడల మీద అక్కడకు వచ్చిపోయిన
యాత్రీకులకు సంబంధించిన విషయాలు రాయడం జరిగింది. ఇవన్నీ ఖ్మేర్ భాషలో ఎక్కువగా
వున్నాయి. కొన్ని చోట్ల బర్మా భాషలో, మరి కొన్ని చోట్ల
జపనీస్ భాషలో కనిపిస్తాయి. ఇక వెలుపలి గాలరీలోని లోపలి గోడలపైన హిందువుల పురాణాలైన
రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో గాధలను చెక్కడం జరిగింది.
వాయువ్య మూల నుంచి మొదలెట్టి, అ ప్రదక్షిణంగా, పశ్చిమ భాగాన వున్న గాలరీ గోడలపైన రామ రావణ యుద్ధం, అందులో
రావణుడిని రాముడు వధించడం, కురుక్షేత్రం సంగ్రామం-అందులో
కౌరవ, పాండవులు ఒకరినొకరు చంపుకోవడం లాంటివి చెక్కబడ్డాయి.
గాలరీ దక్షిణ భాగంలో, రాజా సూర్యవర్మన్ కాలం నాటి ఒక
ఊరేగింపును చిత్రంగా గీయడం జరిగింది. హిందువుల పురాణ గాథలలోని 32 నరకాలను,
37 స్వర్గాలను చిత్రాలుగా గీశారు. తూర్పు
వైపున వున్న గాలరీ గోడపై చక్కటి దృశ్యం కనిపిస్తుంది. సముద్ర మధనానికి సంబంధించిన
ఆ దృశ్యంలో, 92
మంది అసురులు, 88 మంది దేవతలు, వాసుకి
అనే సర్పాన్ని తాడుగా చేసుకుని, కవ్వంగా మందర పర్వతాన్ని
విష్ణుమూర్తి సలహాపై సముద్రంలో చిలకడం కనిపిస్తుంది. విష్ణువు అసురులను ఓడించడం
కూడా చెక్కబడింది. ఉత్తర వైపున గాలరీ గోడలపై, శ్రీకృష్ణుడు
పూతనను వధించడం, హిందు దేవతలు అసురులను సంహరించడం దృశ్యాలుగా
మలిచారు. అలానే వాయువ్య, నైరుతి దిక్కుల గోడలపై కూడా
చెక్కబడి వుంది. అవన్నీ హిందూ గాధలే!
ఈజిప్ట్ "ఖాఫ్రే" పిరమిడ్
కట్టడానికి ఎంత కంకర రాయి అవసరమైందో-అంటే సుమారు ఏబై లక్షల టన్నుల మోతాదు-అంతే
రాయిని అన్గ్ కార్ వాట్ నిర్మాణానికి ఉపయోగించారని అర్థమౌతోంది. యశోధర పురానికి
ఈశాన్యంగా సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్న కుల్లెన్ పర్వతాలనుంచి రాయిని
కొట్టి ఇక్కడకు రవాణా చేశారట. బహుశా సయాం రీప్ నదిలో భారీ బల్ల కట్టుల ద్వారా రాయిని
రవాణా చేసి వుండవచ్చు. ఎంతో శ్రద్ధ వహించి ఆ పని చేసి వుండకపోతే ఆ కట్టడం
పూర్తయ్యేదే కాదు. ఆన్గ్ కార్ వాట్ ను ఇప్పుడు-ఈ అధునిక యుగంలో నిర్మించాలంటే, సుమారు
300 సంవత్సరాలు
పట్టవచ్చని ఒక ఇంజనీరింగ్ నిపుణుడు అంచనా వేశారు. భారత దేశానికి చెందిన పౌరాణిక
గాధల నుంచి, కిలోమీటర్ల పొడవైన గోడలపై, కమనీయమైన చెక్కడాలను, చిత్రాలను చేయడం చాలా గొప్ప
విషయం. గోడలలో ఇప్పుడు కనిపిస్తున్న ఖాళీ జాగాలలో ఒకప్పుడు విలువైన ఇత్తడితో
బొమ్మలను చేసి పెట్టారట. అవన్నీ దొంగిలించబడ్డాయి.
భారత పురా తత్వ శాఖ వారు ఓ పాతికేళ్ల క్రితం
ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి కొంత కృషి చేసినప్పటికీ, పెద్దగా
పరిస్థితిలో మార్పు లేదనే అనాలి. ఆన్గ్ కార్ వాట్ ప్రాంగణాన్ని,
పోయే దారిని, అక్కడున్న పరిసరాలను చూస్తే చాలా
బాధ కలుగుతుంది. దేశ-విదేశ యాత్రీకుల-పర్యాటకుల ఆసక్తి మేరకు వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి, ఒక పర్యాటక స్థలంగా మార్చడమై తే చేసింది ప్రభుత్వం కాని, అంతకు మించి శ్రద్ధ కనిపరుస్తున్న దాఖలాలు లేవు. వాస్తవానికి
ఈ దేవాలయాన్నే కనుక బాగు చేయించ గలిగితే, తిరుపతి కంటే ఎక్కువ
సంఖ్యలో యాత్రీకులు వస్తారనడంలో సందేహం లేదు. భారత ప్రభుత్వం-తిరుమల తిరుపతి దేవస్థానాలు కలిసి, ప్రపంచ ప్రఖ్యాతమైన
ఈ హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో! హిందూ మతోద్ధరణకు కంకణం కట్టుకున్నామని చెప్తున్న భారత దేశ మత పెద్దలు ఎంతమంది
ఇక్కడకు వచ్చారో తెలియదు కాని, వారు ప్రపంచ వ్యాప్తంగా వున్న
హిందూమతాభిమానులలో ఉత్తేజాన్ని కలిగించి, వారి దగ్గరనుంచి వచ్చే
విరాళాలతోనైనా, ఆన్గ్ కార్ వాట్‍లోని విష్ణుమూర్తి విగ్రహాన్ని
పునఃప్రతిష్టించాలి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి నారాయణ చినజీయర్
స్వామి లాంటి వారు ముందుకొచ్చి, భారత-కాంబోడియాల మధ్య ఒక అవగాహన
కుదిర్చే ప్రయత్నం చేసి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచి నేడు శిథిలావస్థలో
వున్న ఈ అతి పెద్ద హిందూ దేవాలయాల సముదాయాన్ని పునరుద్ధరించేందుకు నడుం బిగిస్తే మంచిదేమో
అలోచించాలి.End
నరసిమ్హా రావు గారికి నమస్కారం... అంగ్కోర్ వాట్ గురించి మంచి విశేషాలు చెప్పారు. సంతోషం. మీ వ్యాసం చదువుతున్నంత సేపూ నాకు ఒకటే ఆలోచన వచ్చింది. వ్యాసం పూర్తయ్యే సరికి మీరు కూడ అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. అక్కడి విగ్రహాల్ని పునః ప్రతిష్ట చేసి పూజాధికాలు మొదలు పెడితే, ప్రపంచ వ్యాప్తంగా అది దర్శనీయ, పూజనీయ స్తలం అవుతుందనడంలో సందేహం లేదు. ఆ దిశగా పడే ఎటువంటి అడుగుకయినా మా అందరి సహకారం తప్పకుండా వుంటుంది..
ReplyDeleteచాలాచక్కగా వివరించారు.ఫోటోలు కూడా జతచెసి ఉంటే ఇంకా బాగుండేది స్వామీ
ReplyDeleteThere is some problem in loading photos. I will do it later. Till then you may see the photos from my English article. Jwala
ReplyDeleteFrom Tirapati Gundu:
ReplyDeletePlease enjoy the links in video & still pictures
AngKor Wat Temple_National Geographic Ancient Megastructures
http://www.youtube.com/watch?v=hgkK5Qqpy98&feature=fvwrel
http://www.youtube.com/watch?v=hgkK5Qqpy98
good pictures link
http://www.youtube.com/watch?v=pSOs9Z3LuzU&feature=related
From Tirapati Gundu:
ReplyDeleteAnother video that makes one believe the King could be mightier than Vishnu
http://www.youtube.com/watch?v=A8d_MsLNz4M&feature=related