"మన
సింగపూర్ సంభాషణ"
సింగపూర్
ప్రభుత్వం చేపట్టిన అపురూపమైన కార్యక్రమం
వనం జ్వాలా నరసింహారావు
ఈ ఏడాది ఆగస్ట్ 26 న నిర్వహించిన
"సింగపూర్ జాతీయ ర్యాలీ డే" సందర్భంగా, ఆ దేశ ప్రధాని లీ సయాన్
లూంగ్, దేశ ప్రజలంతా కలిసి కట్టుగా వుండాలని, జాతీయ జీవన స్రవంతిలో ఐకమత్యంగా ఆలోచన చేయాలని పిలుపిచ్చారు. ఇది మామూలుగా
అందరు నాయకులు, అన్ని దేశాలలో, చెప్పే
మాటే అనిపించినా, కొంత భిన్నంగా వుందనాలి. రాబోయే 20 సంవత్సరాల కాలంలో, సింగపూర్,
విజయపథాన పయనించే, అరుదైన దేశంగా వుండేందుకు,
ప్రభుత్వం చే పట్టబోతున్న అపురూపమైన ఒక ప్రణాళికా బద్ధ కార్యక్రమంలో
అందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా
నిలబడాలని ప్రధాని కోరారు. ప్రధాని ఈ సందేశానికి పునాదులు, అంతకు
మునుపు పక్షం రోజుల క్రితం ఆగస్ట్ 8 న ఆయన చేసిన "జాతీయ దినం" సందేశంలో ప్రస్ఫుటంగా
కనిపించాయి. ఆయన ఆనాటి సందేశంలో, విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్ ను
సంబోధిస్తూ, వర్తమానంలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలపై సమూల
సమీక్ష జరగాలనీ, కొంగొత్త ఆలోచనలతో ముందుకు సాగాలనీ, దాని కొరకు, మంత్రి మండలిలోని యువ మంత్రులతో ఒక
కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆయన అధ్యక్షుడుగా వుండాలని కోరారు. భవిష్యత్‍లో
విజయపథంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగిపోవడానికి, పౌరులను
భాగస్వాములను చేసే దిశగా అడుగులు వేయాలనీ, సింగపూర్ ప్రజలను
తమ ప్రభుత్వం గుండెల్లో దాచుకునే రీతిలో వారిని భాగస్వాములను చేయాలనీ, అదే తమ నూతన ప్రభుత్వ విధానమనీ ఆయన చెప్పారు. "మన మార్గాలను రాబోయే 20 సంవత్సరాలను
దృష్టిలో వుంచుకుని ఎంచుకోవాలి, ప్రతి ఏడాది మెరుస్తున్న ఒక
నక్షత్రం లాగా మనం కనిపించాలి, నూతన ఆలోచనలకు శ్రీకారం
చుట్టాలి. రాబోయే కాలంలో మార్పు ఎలా వుండబోతుందో అనేది ముందుగానే పసిగట్టి,
దానికి అనుగుణంగా మన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి" అని ప్రధాని
లీ సయాన్ లూంగ్ అంటూ, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజల సంపూర్ణ
మద్దతు కావాలని కోరారు.
విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్
"సింగపూర్ జాతీయ ర్యాలీ డే" అనేది ఏటేటా జరిగే ఒక నిర్దుష్ట కార్యక్రమం. ఆ
ర్యాలీలో జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించడం ఆనవాయితీ. ప్రతి ఏడు ఆగస్ట్ 9 న జరిగే జాతీయ దినోత్సవం పరేడ్ ముగిసిన తరువాత, వచ్చే రెండో ఆదివారం
నాడు, ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. 1966 నుంచి
నిర్విఘ్నంగా సాగుతున్న ఈ ర్యాలీ నాడు, జాతిని ఉద్దేశించి
చేసే తన ప్రసంగంలో ప్రధాని, సింగపూర్ ఎదుర్కొన బోయే సమస్యలను,
భవిష్యత్ దర్శినిని, ప్రజల ముందుంచుతారు.
అమెరికా అధ్యక్షుడు ఏటేటా చేసే, "స్టేట్
ఆఫ్ ద యూనియన్" ప్రసంగం లాంటిదే ఇది.
జాతీయ దినోత్సవం నాడు చేసే ప్రసంగంలోని వాడి-వేడి అంశాల నుంచి ప్రజలు
వారికి తోచిన అర్థాలను ఆకళింపుచేసుకునే పక్షం రోజుల లోపలే, జాతీయ
ర్యాలీ డే ప్రసంగం ప్రజల ముందుంటుంది. సర్వసాధారణంగా ప్రధాని ఉపయోగించే ఆనవాయితీ
పదాలు ఎలాగూ ఉంటాయని ప్రజలు ముందుగానే ఊహించుకుంటారు. ప్రధాని తన ప్రసంగంలో ఒక్క
మాట కూడా చెప్పక ముందే, టెలివిజన్ సెట్ల ముందు కూచున్న
లక్షలాది మంది ప్రజలు, ప్రధాని తప్పకుండా, ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య నిరంతర సత్సంబంధాల గురించి మాట్లాడుతారని
అర్థం చేసుకుంటారు. "ఇన్‍క్లూజివ్" అనే ఆంగ్ల పదాన్ని-అంటే ప్రజల
భాగస్వామ్యం అతి పెద్ద మోతాదులో వుండాలి-అన్న భావం స్ఫురించే రీతిలో పదే-పదే
ప్రధాని ఉచ్చరించనున్నారని కూడా ప్రజలు పసికడతారు. ప్రతి ఏడాది కంటే భిన్నంగా,
ఈ సంవత్సరం, కేవలం ప్రధాని మాత్రమే కాకుండా,
మరో ముగ్గురు మంత్రులతో ఆయన ప్రసంగం చేయించారీ సందర్భంగా. ప్రధాని
ప్రసంగానికంటే ముందే, విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్,
కమ్యూనిటీ డెవలప్‌మెంట్-యువజన-క్రీడల శాఖ మంత్రి హలిమా యాకోబ్,
కమ్యూనికేషన్ల శాఖ సీనియ మంత్రి లారెన్స్ వాంగ్, ప్రసంగించారు. "నేషనల్ కన్వర్జేషన్" గురించిన ప్రస్తావన,
దానికి సంబంధించిన వాగ్దానాలు చేయడం జరిగింది. సింగపూర్ ప్రజలను
జాతీయ జీవన స్రవంతిలో మరింత చేరువగా భాగస్వాములను చేయాలన్న సంకల్పానికి నాంది
పలకడం జరిగింది. ఇక భవిష్యత్ మీ చేతుల్లోనే వుందని ప్రధాని పదే-పదే చెప్పారు. మీ భవిష్యత్‌ను
మీరే సరి దిద్దుకోవాలి అన్న సూచన కూడా చేశారు.
"సింగపూర్ జాతీయ ర్యాలీ డే" సందర్భంగా ప్రధాని లీ సయాన్
లూంగ్
విద్యా శాఖ మంత్రి హెంగ్ స్వీ కిఎట్, ప్రధాని చెప్పిన దానిని
మరో మారు పునరుద్ఘాటించారు. "అవర్ సింగపూర్" అన్న నినాదం లోతుపాతులను
గురించి మరింత వివరణ ఇచ్చారాయన. ప్రధాని తనకు సూచించిన ప్రణాళికా బద్ధ
కార్యక్రమంలో మూడు ప్రధానమైన లక్ష్యాలు-ధ్యేయాలు వుంటాయని విశదీకరించారు. మొదటిది:
ఇప్పటికే ప్రభుత్వం రూపొందించి అమలు పరుస్తున్న పథకాలలో దేశాభివృద్ధికి పని కొచ్చే
వాటి విషయంలో సంపూర్ణమైన నమ్మకాన్ని ప్రకటించడం; రెండోది:
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుకూలంగా, ప్రభుత్వ ఆలోచనా
విధానంలో కూడా ఎలాంటి మార్పు రావాలి; మూడోది: నూతన ఆలోచనల
దిశగా ఎలా అడుగులు వేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సింగపూర్ ప్రజలకు
ఇస్తున్న ఒక చక్కటి అవకాశమని, "అన్నింటికన్నా నా
దేశానికి ప్రధానమైంది ఏంటి? ఒక దేశంగా, ఈ దేశ ప్రజలుగా మనం ఎక్కడకు-ఎలా పయనించాలి?" అని
ప్రతి పౌరుడు ప్రశ్నించుకోవాలి అన్నారు విద్యాశాఖ మంత్రి. ఉదాహరణగా మంత్రి,
తన శాఖనే పేర్కొన్నారు. పాఠశాలల్లో గ్రేడింగ్ పద్ధతి మంచిదేనని,
ప్రమాణాలను పాటించడానికి ఉపయోగపడుతుందని అంటూనే, యావత్ విద్యావిధానానికే ఇది తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదముందని
హెచ్చరించారు. విద్యార్ధులలో "అతి" మెరిట్ విధానం, పోటీ దనం అంత మంచిది కాదేమో అన్నారు. మెరిట్ విద్యార్ధి భవిష్యత్‍లో అంతా
తనకే తెలుసు అన్నట్లుగా వ్యవహరించే అవకాశాలను గురించి చర్చ జరగాలని మంత్రి
సూచించారు. కష్టపడే వారికి, మెరిట్ వున్నవారికి మధ్య ఒక
సమతుల్యం పాటించాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు. ఇలాంటి వాటి విషయంలో ఒక
అవగాహనకు రావాలంటే, సుదీర్ఘమైన చర్చ జరగాలనీ, అందుకే, "నేషనల్ కన్వర్జేషన్" ప్రతిపాదనను ప్రభుత్వం ప్రజల ముందుంచిందని ఆయన తెలిపారు.
దరిమిలా, 26 మంది సభ్యులతో
కూడిన "మన సింగపూర్" కమిటీ, విద్యాశాఖ మంత్రి హెంగ్ స్వీ
కిఎట్ అధ్యక్షతన రూపు దిద్దుకుంది. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను కమిటీ
సభ్యులుగా చేసింది ప్రభుత్వం. ఒక టాక్సీ డ్రైవర్, సామాజిక
కార్యకర్తలు, కళాకారులు, విద్యార్థులు,
విద్యావేత్తలు, పాత్రికేయులు, రాజకీయ వాదులు, ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు.
ఒక్కో సెషన్‌లో 50 నుండి 150 మంది వ్యక్తులు
పాల్గొనే విధంగా, 30 డైలాగ్ కార్యక్రమాలను
నిర్వహించాలని, ఆ విధంగా ప్రజలను భాగస్వాములను చేయాలనీ, డైలాగ్ వివిధ భాషలలో జరపాలనీ, కమిటీ నిర్ణయించింది.
ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల కల్లా, సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు ఈ డైలాగ్‌లలో పాల్గొనే అవకాశం వుంది.
ఫేస్ బుక్ లాంటి సామాజిక మీడియాలో కూడా, సింగపూర్
ప్రధాని ప్రకటించిన "నేషనల్ కన్వర్జేషన్" ప్రతిపాదన బహుళ ప్రాచుర్యం పొందుతోంది. "అవర్ ఎస్ జి
కన్వర్జేషన్" అనే పేరుతో, అధికారిక పేజీని, ఫేస్ బుక్‌లో తెరవడంతో అనేకమంది అందులోని అంశాలకు స్పందిస్తున్నారు.
సింగపూర్ ప్రజల అసలు-సిసలు మనోభావాలను ప్రతిబింబించే వేదికగా "నేషనల్ కన్వర్జేషన్" పని చేస్తుందన్న
ఆశాభావాన్ని కరు వ్యక్త పరిచారు. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను బడికి పంపుతున్న ఒక
తల్లి ఆవేదన మరో విధంగా వుంది. తన పిల్లలు పాఠశాలలోని పోటీ దనానికి తట్టుకోవడం ఎలా
అన్న ప్రశ్న తనను వేధిస్తున్నదని, పోనీ తాను వారికి చదువు
చెపుదామంటే తన ఉద్యోగ బాధ్యతలు అడ్డొస్తున్నాయని, దీనికి
సమాధానం "నేషనల్ కన్వర్జేషన్" లో దొరకవచ్చని ఆమె అభిప్రాయ పడ్డారు. ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు
చెప్పారు. అన్ని రంగాల ప్రజల నుంచి అభిప్రాయాలు వస్తూనే వున్నాయింకా.
"నేషనల్ కన్వర్జేషన్"
కొరకు రంగం సిద్ధమౌతోంది. నిర్వహించ తలపెట్టిన 30 డైలాగ్‌లలో మొదటి
దానికి అపూర్వ స్పందన వచ్చింది. ఇప్పటికే సుమారు వంద మందికి పైగా వ్యక్తులు తమ
పేర్లను నమోదు చేసుకున్నారు. వచ్చే అక్టోబర్ నెలలో మొదటి సెషన్ జరగవచ్చని మీడియా
వర్గాలు ప్రకటించాయి. ప్రతి సెషన్‌లో 50
నుంచి 150 వ్యక్తులుంటారు. వారిని 8 నుంచి 10 బాచ్‍లుగా
విభజించుతారు. ప్రతి బాచ్‍కు ఒక ఫెసిలిటేటర్ వుంటారు. దేశ భవిష్యత్ విషయంలో ఎలా
ముందుకు సాగాలి అనే అంశాన్ని విపులంగా చర్చించేందుకు సంబంధిత ఫెసిలిటేటర్ డైలాగ్లో
పాల్గొంటున్న వ్యక్తులను ప్రోత్సహిస్తారు. సామాజిక బృందాలు, ట్రేడ్
యూనియన్లు, అట్టడుగు స్థాయి వ్యవస్థలు, అనేక రకమైన టీంలు, డైలాగ్‌లలో పాల్గొనేందుకు
ఆసక్తిని వ్యక్త పరుస్తున్నారు. బీజింగ్‌లో నివాసముంటున్న సింగపూర్ వాసులు కొందరు
కలిసి, అక్కడే వేదిక చేసుకుని, డైలాగ్‌లో
పాల్గొనాలనే ఆలోచన చేస్తున్నారు. దీనికి కమిటీ అంగీకారం తెలిపింది కూడా. డైలాగ్
ఆరంభం చేయడానికంటే ముందర, సింగపూర్ గురించిన ఛాయా చిత్రం
పాల్గొనేవారికి చూపుతారు. అందులో భూత-భవిష్యత్-వర్తమానంలో సింగపూర్ గురించి అనేక
విశేషాలుంటాయి. డైలాగ్‌లో పాల్గొనే వ్యక్తులకు, ఉన్నత
స్థాయిలో వున్న వారితో కలిసి, ఒకే వేదిక మీద వాదోపవాదాలు
చేసే అవకాశం వుంటుంది. అలాంటి వారిలో మంత్రులు కూడా వుంటారు. ఏఏ డైలాగ్‌లో ఎవరెవరు
పాల్గొనాలనే అంశాన్ని కమిటీ నిర్ణయించినప్పటికీ, ప్రజల నుంచి
కూడా ప్రతిపాదన రావచ్చు. ప్రజలకు ఈ కార్యక్రమం మరింత చేరువ కావడానికి ఒక టోల్ ఫ్రీ
నంబర్‌ను, ఈ-మెయిల్‌ను ప్రకటించింది ప్రభుత్వం. డైలాగ్
విశేషాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో పెట్టే ఏర్పాటు కూడా చేసింది.
ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు మన ముఖ్య మంత్రి చేపట్టకూడదు?