Sunday, September 2, 2012

సింగపూర్‌లో ఒక వారం: వనం జ్వాలా నరసింహారావు


సింగపూర్‌లో ఒక వారం
వనం జ్వాలా నరసింహారావు

కొడుకు ఆదిత్య, కోడలు పారుల్, మనుమరాలు కనక్ తో ఒక నెల రోజులు గడిపేందుకు, మా శ్రీమతి విజయలక్ష్మితో సహా, ఆగస్ట్ 16, 2012 న సింగపూర్ చేరుకున్నాం. సిల్క్ ఎయిర్లో ప్రయాణం చేసి ఆ ఉదయం, సింగపూర్ ప్రధాన విమానాశ్రయం చాంగి ఎయిర్ పోర్ట్ కు వచ్చాం. సింగపూర్ ప్రధాన వాణిజ్య సముదాయాల కూడలికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో, 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న, ఈ విమానాశ్రయం, ఆగ్నేయాసియా మొత్తానికి ప్రధాన వైమానిక కేంద్రం. వందకు పైగా వివిధ దేశాలకు చెందిన ఎయిర్ లైన్లకు ఉపయోగపడుతున్న ఈ విమానాశ్రయం నుంచి, ప్రపంచవ్యాప్తంగా 60  దేశాలలోని 220  నగరాలకు-పట్టణాలకు 6,100 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఏటా సుమారు ఏడు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఈ ఎయిర్ పోర్ట్ లో నాలుగు టర్మినల్స్ వున్నాయి. 1981 నుంచి ఇప్పటిదాకా 2011 లో లభించిన 23 ఉత్తమ బహుమతులతో పాటు, 390 ఆవార్డులొచ్చాయి ఈ విమానాశ్రయానికి. సింగపూర్ సెంటోజా కౌవ్ లో వుంటున్న మా అబ్బాయి ఆదిత్య, మా ఇద్దరినీ తీసుకుపోయేందుకు, స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు. సాధారణంగా సింగపూర్‌లో వుంటుండేవారు, సొంత కార్లకన్నా, టాక్సీలో తిరగడానికే ప్రాధాన్యం ఇస్తారు. కాకపోతే రెండేళ్ల వాళ్ల పాపాయిని ప్లే స్కూల్లో దింపడానికి ఉపయోగపడుతుందని కారు కొన్నారు వీళ్లు. 

 ఏక్ థా టైగర్
కారులో వెళ్తున్నప్పుడు, రోడ్ల గురించి, టోల్ టాక్స్ గురించి వివరించాడు ఆదిత్య. సింగపూర్‌లో కారులో ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు వెళ్లాలంటే, ఎంపిక చేసిన కొన్ని సెంటర్లలో టోల్ వసూలు చేస్తారు. అదే విధంగా కారు ఎక్కడన్నా పార్క్ చేయాల్సి వస్తే ఫీజు వసూలు చేస్తారు. కాకపోతే అది డబ్బు రూపేణా వుండదు. కారులో మొదలే డబ్బు కట్టి కొనుక్కున్న ఒక ప్రి-పెయిడ్ కార్డు పెట్టుకోవాలి. ఆ కార్డునుంచి ఆయా ప్రదేశాలకు కాని, పార్కింగ్ స్థలానికి కాని పోయినప్పుడు, తిరుగు ప్రయాణంలో, కొంత రుసుం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఆ కార్డులో కొంత బాలన్స్ వుండేటట్లు జాగ్రత్త పడాలి. సింగపూర్‌లోని చాలా రోడ్లకు, ఏదో ఒకరకంగా, ఆ బజారుకు అతికేటట్లు ఒక పేరుంటుంది. "సూర్యోదయం రోడ్డు" అని ఒక చోట వుంటే, "సూర్యాస్తమయం" అని మరో చోట వుంది. పండ్ల పేరు మీదో, అరటి పేరు మీదో, పప్పు దినుసుల పేరు మీదో, రాచరిక వ్యవస్థకు గుర్తుగానో, రచయితల పేరుమీద, స్థలాల పేరు మీదో, మనిషి హావ-భావాల మీదో, నంబర్ల మీదో రోడ్ల పేర్లుంటాయి. చిన్న-చిన్న సందుల్లో-గొందుల్లో అసలే పేరు వుండకపోవచ్చు. ట్రాఫిక్ రెగ్యులేషన్ కు, వేగం పరిమితం చేయడానికి చక్కటి వ్యవస్థ వుంది. ఎక్కడికక్కడ నియంత్రణ చేసేందుకు గోప్యంగా కెమెరాలుంటాయి. తెలిసి-తెలిసి ఎవరూ తప్పుచేయడానికి సాహసించరు. తప్పు చేస్తే (ఏ విషయంలో నైనా) శిక్షకూడా కఠినమే! సింగపూర్‌లో ఎక్స్ ప్రెస్ మార్గాలని, ఆర్చర్డ్ రోడ్లని, పాద చారుల మార్గమని, భవిష్యత్‍లో నిర్మించనున్న మార్గాలని నాలుగు రకాల రహదారులుంటాయి. ఎక్స్ ప్రెస్ మానిటరింగ్ సలహా వ్యవస్థ, ప్రమాదాలను పసిగట్టడంతో పాటు మార్గమధ్యంలో వాహనాలు చెడిపోతే సహాయం అందించేందుకు దోహదపడుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ సులభంగా నియంత్రించడానికి, ఇబ్బందులు కలగకుండా కొనసాగించడానికి వీలవుతుంది. రహదారులకు ఇరువైపులా, భారీ వృక్షాలు, రకరకాల ఆర్నమెంటల్ చెట్లు, పూల చెట్లు దర్శనమిస్తాయి. ఒక క్రమ పద్ధతిలో వాటిని పరిరక్షించుకుంటూ వస్తోంది సింగపూర్ ప్రభుత్వం. రోడ్లన్నీ చూడ ముచ్చటగా వుంటాయి. వాహనం ముందు సీట్లో కూచున్నవారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి.


 
సింగపూర్ ఓషియన్ డ్రైవ్ లోని అత్యంతాధునికమైన "ద కోస్ట్ ఎట్ సెంటోజా కోవ్" పాష్ లొకాలిటీలో ఒక మూడు పడకగదుల అపార్ట్ మెంట్‌లో ఆదిత్య వుంటున్నాడు. పార్కింగ్‌లో కారు పెట్టి మా ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లాడు ఆదిత్య. ఎలివేటర్‍ చేరడానికి తెరవాల్సిన తలుపు దగ్గర నుంచి, ఎలివేటర్ డోర్ ఓపెన్ చేయడం వరకు, వాడుంటున్న ఐదో అంతస్తు చేరుకోవడం దాకా, అంతా డిజిటల్ ఆపరేషనే! ఆ మాటకొస్తే సెంటోజా కోవ్ రెసిడెన్షియల్ ప్రాంతానికి రావడం కూడా అంత తేలికైన విషయం కాదు. అక్కడ నివసించే వారెవరో ఒకరు వెంట వుంటేనే అపార్ట్ మెంట్ కాని, విల్లాకు కాని ఇతరులు చేరుకోవడం సాధ్యపడుతుంది. ఇక ఎలివేటర్ డోర్ సరాసరి ఆదిత్య వుంటున్న అపార్ట్ మెంటులోకి తెరుచుకుంటుంది. ఆ అంతస్తులో ఆ లిఫ్ట్ వాడి ఒక్కడికే పరిమితం. అంత సేఫ్టీ వ్యవస్థ సింగపూర్ మొత్తం వుంటుందలా. ఉత్తర ద్వారం ద్వారా అపార్ట్ మెంట్ లోపలికి వెళ్లాం. తూర్పు వైపు విశాలమైన బాల్కనీ వుంది. అందులోనే డైనింగ్ టేబుల్, దివాన్ కాట్, కూర్చునే బాల్కనీ కుర్చీలు...అన్నీ. బాల్కనీ ఎదురుగా సుమారు 150 గజాల దూరంలో విశాలమైన దక్షిణ చైనా సాగరం అహర్నిశలూ దర్శనమిస్తుంటుంది. అక్కడే మా భోజనం, కాసేపు మధ్యాహ్నం పడక, కూర్చోవడం...అన్నీ అక్కడే! ఉదయం సముద్రం పైనుంచి సూర్యోదయం, రాత్రి వేళ చంద్రోదయం కనులకు విందుగా కనిపిస్తుంది. అక్కడ కూచుంటే సమయం ఇలా గడిచిపోతుంది. రాత్రి వేళ సుదూరంలో, సుమారు 20 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేసేంత దూరంలో, ఇండోనేషియా దేశంలోని బాటమ్‌ పట్టణం లైట్ల వెలుగులో అత్యంత సుందరంగా కనిపిస్తుంది.

సముద్ర తీరంలోని భూమిలో, నిర్మాణం చేపట్టిన, సింగపూర్‌లోని ఒకే ఒక భవన సముదాయం సెంటోజా కోవ్ ప్రాంతం. ప్రభుత్వ రంగ సంస్థ సెంటోజా డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఐన సెంటోజా కోవ్ ప్రయివేట్ లిమిటెడ్ దీని నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తున్నది. సింగపూర్ లాండ్ అథారిటీ నుంచి 80 కోట్ల సింగపూర్ డాలర్లకు ఈ భూమిని సెంటోజా కోవ్ కొనుగోలు చేసింది. ఉత్తర-దక్షిణ కోవ్‍లుగా సెంటోజా విభజించబడింది. రెండు భాగాలలోను కొన్ని విల్లాలు, కొన్ని అపార్ట్ మెంటులు నిర్మించడం జరిగింది. ప్రతి విల్లా, అపార్ట్ మెంట్ సముద్రానికి అభిముఖంగానో, సముద్రం బాక్ వాటర్స్ కు అభిముఖంగానో వుండే రీతిలో డిజైన్ చేయడం విశేషం. ఉత్తర కోవ్ ను కోరల్ ఐలాండ్, పారడైజ్ ఐలాండ్, ట్రెజర్ ఐలాండ్ లుగా మూడు భాగాలు చేశారు. దక్షిణ కోవ్ లో నిర్మాణం 2006 లో మొదలై ఇంకా కొనసాగుతోంది. నిర్మాణం పనులు అక్కడుండేవారికి ఏ విధంగాను ఆటంకం కలిగించవు. ఆదిత్య అపార్ట్ మెంట్ దక్షిణ కోవ్ లో వుంది.

ఓ రోజు రాత్రివేళ సింగపూర్‌లోని ఒక కెసినోకు వెళ్లాం. అభిరుచిగలవారెవరైనా కొన్ని నియమ నిబంధనలకు లోబడి జూదం అడేందుకు అనువైన ప్రదేశాన్నే కెసినో అంటారు. సాధారణంగా ఏదైనా హోటల్‌కు కాని, రిసార్ట్ కు కాని, పెద్ద-పెద్ద రెస్టారెంట్లకు కాని, షాపింగ్ సముదాయానికి కాని, ప్రయాణీకుల ఓడలకు కాని, ఇతర రకాల పర్యాటక అభివృద్ధి కేంద్రాలకు కాని అనుబంధంగా, ప్రభుత్వ నియంత్రణలకు అనుగుణంగా, కెసినో లను నిర్వహిస్తుంటారు. జూదం-పందెం కాయడం, ఒక ఆటగా ఎప్పుడు ఆరంభమైంది ఇదమిద్ధంగా చెప్పలేం కాని, క్రీస్తుపూర్వం 2300 సంవత్సరంలో, చైనాలో మొట్టమొదటి సారిగా జూదం ఆడినట్లు అధికారికంగా నమోదైందట. వాస్తవానికి జూదం-పందెంకాయడం అనే ప్రక్రియ, ప్రతి దేశంలోను, ప్రతి సమాజంలోను, ఏదో ఒక రూపంలో అనాదిగా వాడుకలో వుందనేది చరిత్ర చెప్తున్న సత్యం. రక-రకాల ఆటలతో, పందేలతో, ప్రాచీన గ్రీకు సమాజం నుంచి రోమన్ల వరకు, నెపోలియన్ ఏలిన ఫ్రాన్స్ నుంచి ఎలిజబెత్ ఏలికలోని ఇంగ్లాండ్ వరకు, చరిత్రలో వీటికి సంబంధించిన అనేకానేక కథలు వెలుగుచూశాయి. కెసినో లకు అనుమతి వున్న ప్రతి దేశంలోను ఫలానా వయసుపైబడిన వారికి మాత్రమే అందులోకి ప్రవేశం అన్న నిబంధన వుంటుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో వున్న "మకావో" లోని సుమారు 33 కెసినోలు, ఆదాయపరంగాను-ఆహ్లాదపరంగాను-నిర్వహణ పరంగాను ప్రపంచంలో మొదటి స్థానంలో వున్నాయి. ఆ తరువాత స్థానంలో అమెరికా దేశంలోని లాస్ వేగాస్ కెసినోలున్నాయి. అక్కడ 122 కెసినోలున్నాయి. సింగపూర్ ది మూడో స్థానం. అక్కడున్నవి కేవలం రెండే! కెసినోకు వెళ్లిన వారు వారికిష్టమొచ్చిన ఆట ఎంపిక చేసుకోవచ్చు. పందెం కాయడం మాత్రం తప్పనిసరి. ఉదాహరణకు "రౌలె" తీసుకుందాం. ఈ గేం ఆడదల్చుకున్నవారు, ఎరుపు-నలుపు రంగులపైన కాని, సరి-బేస్ సంఖ్యలపైన కాని, ఒక నంబర్ పైన కాని-ఎక్కువ నంబర్లపైన కాని పందెం కాయవచ్చు. ఒక చిన్న చక్రంలో ఒక గోలీని వేసి కెసినో నిర్వాహకుడు గిర-గిరా తిప్పతాడు. ఆ గోలీ ఏ నంబర్ వద్ద ఆగితే ఆ నంబర్ పైన పందెం కాసిన వాడు గెల్చినట్లు లెక్క. ఒక్కో నంబర్‌పైన-కలర్ పైన ఇన్ని రెట్లు ఇవ్వాలని వుంటుంది. ఆ విధంగానే గెలిచిన వారికి ఇచ్చి ఓడిన వారి దగ్గరనుంచి కెసినో తీసుకుంటుంది. ఇలానే బక్కారట్ అని, బ్లాక్ జాక్ అని, వీడియో పోకర్ అని రకరకాల ఆటలుంటాయి. పందెం కాసిన వాళ్లలో ఒకరిద్దరు గెలిచినప్పటికీ, సర్వ సాధారణంగా గెలుపు కెసినోదే అవుతుంది. మేం వెళ్లిన కెసినో పేరు "మెరీనా బే సాండ్స్". సింగపూర్‌లోని మరో కెసినో పేరు "రిసార్ట్స్ వరల్డ్ సెంటోజా". 

 మెరీనా బే సాండ్స్
సింగపూర్‍ కెసినో లకు, అక్కడి పౌరులు కాని, శాశ్వతంగా నివసిస్తున్న ఇతర దేశాల వారు కాని వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. సరైన పాస్‌పోర్ట్ కలిగి వున్న విదేశీయులకు ఎంట్రీ ఫీజు లేదు. 24 గంటలు కెసినోలో గడపాలంటే వంద సింగపూర్ డాలర్ల టికెట్ కొనుక్కోవాలి. ఏడాదికి ఒక్క సారే తీసుకునేవారికి 2,000 డాలర్లు చెల్లించాలి. ఒకవిధంగా చెప్పుకోవాలంటే, సింగపూర్ పౌరులు కెసినోలో జూదం ఆడడాన్ని, డబ్బు వృధా చేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు వారికి ఎంట్రీ ఫీజు నిబంధన విధించింది ప్రభుత్వం. విదేశీయులక్కడకు భారీ సంఖ్యలో రావాలని, వారి డబ్బు సింగపూర్ కెసినోల ద్వారా ప్రభుత్వ ఆదాయంగా మారాలని వారికి టికెట్ లేకుండా ప్రోత్సహిస్తున్నారు కెసినో నిర్వాహకులు. మేం పాస్‌పోర్ట్ చూపించి ఉచితంగా కెసినో లోపలికి వెళ్లాం. ప్రపంచంలోని మిగతా కెసినోలకన్నా అధిక సంఖ్యలో-దాదాపు 2500 ఎలెక్ట్రానిక్ మెషిన్లను ఏర్పాటు చేయడం ద్వారా, మాన్యువల్‌గా నడపడం ద్వారా, అత్యంత అధునాతన పద్ధతుల్లో, మూడు అంతస్తులలో, మెరీనా బే స్టాండ్స్ కెసినో జూదాన్ని నిర్వహిస్తోంది. సుమారు 250  రకాల ఆటలున్నాయక్కడ. కెసినోకు చెందిన సిబ్బంది స్నేహపూర్వకంగా, అత్యంత మర్యాదగా వచ్చినవారితో మెలుగుతారు. మేం కొంత సేపు మాకు తెలిసిన రెండు-మూడు రకాల ఆటలు ఆడాం. మొదట్లో బాగానే డబ్బులొచ్చాయి కాని చివరకు లాభ-నష్టాలు లేకుండా, ఓ మూడు గంటల సమయం గడిపి, రాత్రి రెండు గంటల ప్రాంతంలో బయటపడ్డాం. ఇంటికి చేరుకున్నాం.

సింగపూర్ సెంటోజా కౌవ్
రెండు-మూడు రోజుల తరువాత సింగపూర్ బాంబే సినిమాహాలులో "ఏక్ థా టైగర్" అనే హిందీ సినిమా చూశాం. ఈ 2012 బాలీవుడ్ ప్రేమకథ-సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలో ప్రధాన భూమికలను సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ పోషించారు. సినీ నిర్మాత ఆదిత్య చోప్రా కాగా, దర్శకుడు కబీర్ ఖాన్. ఉత్తర ఇరాక్‌లో ఒక స్పై మిషన్ మీద వెళ్లిన టైగర్ (సల్మాన్ ఖాన్), శత్రువులను వెంటాడడం, తరిమి-తరిమి కొట్టి మరీ చంపడం, తుపాకీ చప్పుళ్లతో వారిని అదరగొట్టడంతో సినిమా ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ లో చేరిన సొంతమనిషిని చంపడంతో సహా, పలువురు పాకిస్థానీ ఏజంట్లను టైగర్ హతమారుస్తాడు. ఒక ప్రభుత్వ కాలనీలో నివసిస్తున్న టైగర్ వివరాలు ఇరుగు-పొరుగు వారికి తెలియదు. పగా టైగర్ ఆయన అసలు పేరు కూడా కాదు. దానికి తోడు టైగర్ పనిచేసేది భారత దేశంలోని అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఇంటెలిజెన్స్ సంస్థ "రా" లో. ఇక టైగరే మో ఒక ప్రముఖ సీక్రెట్ ఏజెంట్. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లోని రా కార్యాలయంలో పనిచేస్తున్న టైగర్ పై అధికారి పేరు షెనాయ్ (గిరీష్ కర్నాడ్). టైగర్ షెనాయ్ కి రిపోర్ట్ చేయాలి. ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ కిద్వాయ్ (రోషన్ సేథ్)  అనే ఒక భారతీయ శాస్త్రవేత్తను జాగ్రత్తగా కనిపెట్టి-ఒక కన్ను ఆయనపై వేసి వుంచాలని టైగర్‌ని పురమాయించాడు షెనాయ్. ట్రినిటీ కళాశాలలో పనిచేస్తున్న ఆ శాస్త్రవేత్త తన పరిశోధనలను పాకిస్థానీ శాస్త్రవేత్తలకు అందచేస్తున్నాడని అనుమానంతో అలా చేయాల్సి వచ్చింది. గోపి (రన్వీర్ షోరే) అనే మరో ఏజంటును టైగర్ తో పంపుతారు. డబ్లిన్‌లోని ఒక డాన్స్ అకాడమీలో చదువుకుంటున్న జోయా (కత్రినా కైఫ్) ను కలుస్తాడు తన మిషన్ లో భాగంగా. ప్రొఫెసర్‌ను కలవడం కష్టమవుతుంది. క్రమేపీ జోయాతో ప్రేమలో పడిపోతాడు. పలుమలుపులు తిరిగిన సినిమా కథ, జోయా-టైగర్ ప్రపంచ ప్రేమ యాత్రతో మరిన్ని మలుపులు తిరుగుతుంది. పలుమార్లు ఆయనను వెంటాడినా టైగర్ తప్పించుకుంటాడు. 

 చాంగి ఎయిర్ పోర్ట్

 ఆదిత్య టిస్ బాచ్ మేట్ మోనికా ఇంట్లో చక్కటి డిన్నర్‌తో సింగపూర్‌లో మా మొదటి వారం గడిచింది.

No comments:

Post a Comment