Friday, February 22, 2013

హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల సంఘటనలో ఎవరు తప్పు చేశారు?: వనం జ్వాలా నరసింహారావు


హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల సంఘటనలో 
ఎవరు తప్పు చేశారు?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (24-02-2013)

          రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘా సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే పదే-పదే ఎందుకు చెప్తున్నారు? గురువారం నాడు జంటపేలుళ్ళు జరిగిన దిల్‌షుక్‌ నగర్‌ ప్రాంతాన్ని,  హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చిన షిండే ఆ మర్నాడు సందర్శించారు. ఆ తరువాత ప్రయివేట్-ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌, ముంబాయి, గోవాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు కేంద్ర నిఘా విభాగానికి పక్కా సమాచారం అందిందని, తమకందిన సమాచారం ఆధారంగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలను-పోలీసులను హెచ్చరించామని చెప్పారు. గురువారం ఉదయం కూడా హెచ్చరికలు జారీ చేశామని ఆయన చెప్పారు. కాకపోతే, పేలుళ్లు జరిగే అవకాశం మాత్రమే ఉందంటూ తాము హెచ్చరించాం కాని, ఫలానా ప్రాంతాలలో జరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పలేదని ఆయన అన్నారు. కేంద్రం హెచ్చరికలు రాష్ట్ర పోలీసులు పట్టించుకోలేదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. రాష్ట్ర పోలీసుల వైఫల్యంపై కూడా ఆయన ఆచి-తూచి స్పందించడమే కాకుండా, ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణలో బయటపడుతుందని అన్నారు. ఐతే పార్లమెంట్ ఉభయ సభలలో షిండే ప్రకటన చేస్తూ, పరోక్షంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని-పోలీసులను తప్పు బట్టారు.

          పార్లమెంట్ ఉభయ సభలు హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల విషయంలో పలుమార్లు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌లోని ఘటన స్థలాన్ని, ఆసుపత్రులను ఉదయాన్నే సందర్శించిన హోంశాఖ మంత్రి షిండే, మధ్యాహ్నానికల్లా ఢిల్లీకి చేరుకుని, రెండు గంటల ప్రాంతంలో పార్లమెంటుకు హాజరయ్యారు. ఉభయ సభల్లో ప్రకటన చేశారు. నిఘా సంస్థల సమాచారం విషయం, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్న విషయం సభ్యులకు తెలియచేశారాయన. పనిలో పనిగా మరికొన్ని మాటలు చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో మరింత దృఢ నిశ్చయంతో మరిన్ని కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 16 మంది మరణానికి, 117 మంది గాయపడటానికి కారణమైన హైదరాబాద్ పేలుళ్ల దోషులను పట్టుకునేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారాలు లభించాయన్నారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు ఉరితీతల నేపథ్యంలో పాకిస్థాన్ కేంద్రంగా గల ఉగ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడవచ్చని తమకు ముందస్తు సమాచారం వుందన్నారు. తమ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో ఉగ్రవాద గ్రూపులు దాడి చేయవచ్చంటూ ఫిబ్రవరి 16, 19, 20 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం అని కూడా హోంమంత్రి చెప్పారు. ఇంటెలిజెన్స్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ తేలికగా తీసుకుంటుంటారు అని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు బడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని ముగించారు తన ప్రకటనను.

          ఇంతకీ తప్పెవరిది? ఒప్పెవరిది? ఆరేడేళ్లగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోక పోవడానికి మన పోలీసులను అభినందించాలా? నిఘా సంస్థల సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి-పోలీసులకు కేంద్రం చేరవేసినా, బాంబు పేలుళ్లను నిరోధించడంలో విఫలమై నందుకు  వారిని అభిశంసించాలా? ఏదేమైనా అమాయకుల ప్రాణాలు పోయాయి. మరెందరో క్షతగాత్రులయ్యారు. మామూలుగా, ఎప్పటి లాగానే, ప్రభుత్వం సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఆరేడు లక్షల రూపాయలు, గాయ పడినవారికి లక్ష రూపాయల వరకు, నష్ట పరిహారం ప్రకటించడంతో తన బాధ్యతను కొంతవరకు తీర్చుకున్నట్లు ప్రభుత్వం భావించింది. దానికి తోడు ఆసుపత్రులలో చికిత్స కయ్యే వ్యయమంతా భరిస్తామని కూడా ప్రభుత్వం చెపుతోంది. కాకపోతే, గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు, ఇలానే ప్రకటించిన నష్టపరిహారం ఇంతవరకూ ఎవరికీ అందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి అదనంగా ప్రధాన మంత్రి కూడా కొంత ఇస్తామని పార్లమెంటులో షిండే ప్రకటన చేయడం కొస మెరుపు.
            ఇలాంటి సందర్భాలలో ఎవరైనా కాని, ముఖ్యంగా, బాధ్యతాయుతమైన వ్యక్తులు ఆచి-తూచి మాట్లాడడం మంచిది. ఎవరికి తోచింది వారు మాట్లాడితే, ఘటనలో గాయపడ్డవారు, మృతుల కుటుంబీకులు ఆవేదనకు గురయ్యే ప్రమాదముంది. ఘటన జరిగీ-జరగక ముందే, ఫలానా వారు దీనికి బాధ్యులంటూ అధికార వర్గాలు తమ దగ్గర సమాచారం వుందని అంటున్నారు. అంత తొందరగా సమాచారం సంపాదించగలిగిన వారు, పేలుళ్లను నిరోధించడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాల్సిన బాధ్యత వుంది. మీడియా కూడా తక్కువేమీ తినలేదు. ఫలానా వ్యక్తులు దీనికి సూత్రధారులంటూ, వారి ఫొటోలతో సహా బయట పెట్తున్నారు. ఒక విధంగా, అదే నిజమైతే, దర్యాప్తుకు విఘాతం కలగవచ్చని వారు ఆలోచించడం లేదు. ఫలానా వ్యక్తి కొన్నాళ్ల క్రితం రెక్కీ నిర్వహించారని తమ దగ్గర సమాచారం వున్నట్లు కొన్ని పత్రికలలో కధనాలొచ్చాయి. అలాంటి సమాచారం ఇప్పుడే వచ్చిందా? ఇంతకు ముందే వారి దగ్గర వుందా? వుంటే ఎందుకు బయట పెట్ట లేదు? తప్పొప్పులను ఎంచడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం కాదు కాని, తప్పొప్పుల బాధ్యత పంచుకోవడంలో బాధ్యతాయుతమైన అధికారులు తప్పటడుగు వేస్తున్నారని చెప్పక తప్పదు. ఆ దిశగా కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

            దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో లోగడ ఒక సారి ఇలాంటి దుర్ఘటన జరిగింది. మళ్లీ జరిగే అవకాశాలను పోలీసులు ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? సర్వసాధారణంగా రద్దీ ప్రాంతాలైన దిల్ షుక్ నగర్ లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగే వీలుంది కనుక, కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగం తమకు హెచ్చరికలు జారీ చేసిన పిదప, ఇలాంటి స్థలాలలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారా? ఉదాహరణకు, దుండగులు సీసీ కెమేరాల తీగలను కత్తిరించి అవి పని చేయకుండా చేశారని వార్తలొచ్చాయి. అదే నిజమైతే, అవి పని చేయకపోవడమనే విషయం పోలీసులకు ఎందుకు తెలియదు? తెలుసుకోలేక పోయారా? అసలు, సీసీ కెమేరాల పనిని పర్యవేక్షించే అధికారి బాధ్యతలేంటి? మహా వుంటే హైదరాబాద్ మొత్తంలో ఒక వంద వరకు అలాంటివి వుండవచ్చు. వాటిలోంచి నాలుగైదు రోజులుగా ఫుటేజీ రాకపోతే, వాటిని పర్యవేక్షిస్తున్న అధికారికి ఆ విషయం తెలుసుకునే మార్గం లేదా? పోనీ, ఇలాంటి సౌకర్యాన్ని వికేంద్రీకరించి స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోకి తెచ్చి వుండవచ్చు కదా? సరే ఇదంతా జరగక ముందు జాగ్రత్త. అందులో విఫలమైతే, సంఘటన జరిగిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నా సక్రమంగా తీసుకున్నారా? అంటే, అదీ సరిగ్గా లేదు.

          వార్తా పత్రికల్లో వచ్చిన కధనాల ప్రకారం, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ప్రాంతం ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందన్న మీమాంస వచ్చిందట. అదే నిజమైతే, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. జరిగిందొక దుర్ఘటన. ఉగ్రవాద చర్య. దానికి గురైనవారు అన్ని ప్రాంతాల వారున్నారు. ముందు సహాయక చర్యలు ప్రారంభం కావాలి. అది అన్నింటికన్నా ప్రాముఖ్యత వున్న అంశం. అంతే కాని, ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి ఆ ప్రాంతం వస్తుందన్న విషయం అంత ముఖ్యమైంది కానే కాదు. అసలింతకీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ నిమిషంలో ఏం చేయాలి అన్న "బ్లూ ప్రింట్" అంటూ ఒకటే మన్నా వుందా? ఉదాహరణకు, ట్రాఫిక్ నియంత్రణే తీసుకుందాం. దిల్ షుక్ నగర్ జాతీయ రహదారిలో ఒక ప్రధాన కూడలి. నిత్యం-ఇరవై నాలుగు గంటలూ, వందలాది వాహనాలు అటు వైపునుంచి విజయవాడ దిక్కుగా, హైదరాబాద్ దిక్కుగా పోతుంటాయి. వీటన్నిటినీ తక్షణమే ఎలా దారి మళ్లించాలి అన్న విషయంలో ఏదన్నా ఒక బ్లూ ప్రింట్ ట్రాఫిక్ పోలీసుల దగ్గర వుందా? వుంటే దానిని ఎందుకు సరిగ్గా అమలు చేయలేదు. ఎవరి పని వారు సక్రమంగా అలాంటి సమయాల్లో చేయాల్సిన బాధ్యత అందరి పైనా వుంటుంది. అసలు వాళ్లేమీ చేయలేదని ఆరోపించడం లేదు కాని, చేయాల్సినంత వేగంగా చేశారా? లేదా? అనేదే ప్రశ్న!

          ఇదిలా వుంటే కొందరు బాధ్యతాయుతమైన వ్యక్తుల ప్రకటనలు అతి జుగుప్సాకరంగా వున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వీరిలో ప్రముఖుడు. ఈ దారుణమైన సంఘటనను అత్యంత స్వల్పమైన విషయంగా పోల్చి చూపే ప్రయత్నం చేశారాయన. అలా మాట్లాడడం వలన దెబ్బ తిన్న వారి మనోభావాలు మరింతగా దెబ్బ తింటాయన్న ఆలోచన కూడా ఆయనకు రాకపోవడం శోచనీయం. అలానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన కూడా. ఇలాంటి సంఘటనలు జమ్ము-కాశ్మీర్‌లో నిత్యం పరిపాటని, తాను ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడు ఎన్నో చూశానని ఆయన అనడం హాస్యాస్పదం. చారిత్రకంగా-భౌగోళికంగా జమ్మూ-కాశ్మీర్ పరిస్థితి వేరు. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి వేరు. అక్కడ తీవ్రవాదం వేళ్లూనుకుని పోయింది. దానిని అంతమొందించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తుంది. ఇక్కడ చోటు చేసుకున్న సంఘటన దాదాపు ఏడేళ్ల తరువాత మొదటిది. దీనికి-దానికీ లంకె పెట్టి పోల్చి చూపడం ఆజాద్ లాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న వారు చేయాల్సిన పని కాదు.

          ఏదేమైనా, ఇది తప్పొప్పులు ఎంచుకునే సమయం కాదు. షిండే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి వుండవచ్చు. కాని దానిని ఆయన పదే పదే ఉచ్చరించడం భావ్యం కాదు. అలానే రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును కప్పి పుచ్చుకోవడమూ సమంజసం కాదు. తమ బాధ్యతలను తాము గుర్తుంచుకోవడం బాధ్యతాయుతమైన స్థానాల్లో వున్న ప్రతి వారికీ మంచిది!

No comments:

Post a Comment