ఆకుపచ్చని
తెలంగాణ దిశగా..
వనం
జ్వాలా నరసింహారావు
నమస్తే
తెలంగాణ (02-07-2015)
బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన
అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. కార్యాచరణకు రంగం తయారైంది. "తెలంగాణాకు
హరిత హారం" అనే పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రూపకల్పన
చేసిన మరో ప్రజా యజ్ఞం, ప్రజలే కేంద్రంగా అమలు కానున్న చెట్లు నాటే
బృహత్తర కార్యక్రమం, జులై నెల మూడున (3-7-2015 న) లాంఛనంగా ప్రారంభం కానుంది. తెలంగాణను ఓ హరిత
హారంగా, ఓ ఆకుపచ్చ తోరణంగా మలిచే దిశగా ముఖ్యమంత్రి సరిగ్గా ఏడాది క్రితం ఈ పథకానికి
ఆలోచన చేశారు. ఈ సంవత్సర కాలంగా తన ఆలోచన కార్యరూపం దాల్చడానికి
ఎన్నో రీతులుగా ప్రణాళికలు రూపొందించుకుంటూ వస్తున్నారు. తెలంగాణ అంటే బీడు నేల కారాదని, పచ్చదనం కరువైన పీఠభూమి అనే అపప్రథ తొలగిపోవాలని
ముఖ్యమంత్రి కోరిక. ఒకనాడు దట్టమైన అడవులు వున్న తెలంగాణలో ప్రస్తుతం
వాటి విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. పచ్చదనంతో కళకళ
లాడే రీతిలో అటవీ భూముల విస్తీర్ణం పెంచడం, పర్యావరణ సమతుల్యం
కాపాడడం అనే ద్విముఖ లక్ష్యాలు హరిత హారంలో వున్నాయి. కృష్ణా, గోదావరి వంటి జీవ నదులు
తెలంగాణలో పారుతున్నప్పటికీ, ఈ ప్రాంత రైతులు ఇంకా వర్షాధార పంటలపైనే
ఆధారపడుతున్నారు. అందుకే ఇక్కడ వర్షపాతం పెరగాలి. అది పెరగాలంటే
చెట్ల పెంపకం ఒక్కటే తరుణోపాయం. కోతులు అడవుల్లోకి వాపస్ పోవాలన్నా, వానలు వాపస్ రావాలన్నా చెట్ల పెంపకం ఒక్కటే సరైన మార్గం.
అందుకే
ఈ విషయంలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హరిత హారం పధకానికి
రూపకల్పన చేశారు. ఆయన స్వయంగా రూపొందించిన పధకాల్లో ఇది
చాలా ముఖ్యమైంది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల
శాతాన్ని24
నుంచి 33 శాతానికి పెంచడం ఈ పధకం ప్రధాన
లక్ష్యం. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు తెలంగాణ భూభాగంలో
అదనంగా నాటాలనేది ఈ బృహత్తర కార్యక్రమ లక్ష్యం. ఇందులో
హైదరాబాదు నగర అభివృద్ధి సంస్థ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడంతో సహా, అటవీ
యేతర భూముల్లో 130 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం
పెట్టుకుంది ప్రభుత్వం.
ఇదిగాక అటవీ భూముల్లో మరో వంద
కోట్ల మొక్కలు నాటి అడవులను మరింత సుసంపన్నం చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగం. తెలంగాణలోని ప్రతి శాసనసభ
నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల చొప్పున ప్రతి ఏటా 40 కోట్ల మొక్కలు నాటుతారు. సంకల్ప బలం వున్న ముఖ్యమంత్రి కాబట్టి
కేవలం తన మదిలో ఆలోచన చెప్పి వూరుకోలేదు. ఆ
ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి రాష్ట్రం మొత్తం పంపిణీకి అవసరం అయ్యే మొక్కల్ని
వర్షాకాలాని కంటే ముందుగానే సిద్ధం చేయించి వుంచారు. అడవుల్లో
పెంచడానికి అనువైన అటవీ పండ్ల మొక్కల్ని కూడా సిద్ధం చేయించి పెట్టారు. వాటిల్లో వైద్యానికి అవసరం అయ్యే ఔషధ
మొక్కలు కూడా వున్నాయి.
ఈ మొత్తం పధకాన్ని ప్రజల
భాగస్వామ్యంతో అమలు చేయడం ముఖ్యమంత్రి ఉద్దేశ్యం. "హరితం, శివం, సుందరం" అనే సరికొత్త నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారు
ముఖ్యమంత్రి. ఈ
బృహత్తర హరిత హారం పధకాన్ని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి
కోణం లోను, హైదరాబాదు నగరాన్ని విశ్వ నగరంగా
తయారు చేసే ఉద్దేశ్యంలో భాగంగాను రూపొందించారు. నగర
శోభను ద్విగుణీకృతం చేయడం ఈ పథకం ప్రత్యేకత.
పాత పద్ధతిలో కాకుండా సింగపూర్ తరహాలో
ఒక పథకం ప్రకారం మొత్తం రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చే వినూత్న రీతిలో రూపకల్పన
జరిగింది. మొక్కలు పెరిగింతర్వాత, వాటి పరిసరాల్లో నడిచే పౌరులకు తామొక దట్టమైన ఆకు పచ్చని అడవిలో సంచరిస్తున్నా
మన్న భావన కలిగేలా మొక్కల పెంపకం జరగాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. ఒక్క జనవాసాలే కాకుండా, నదులు, వాగులు, వంకలు చెరువు కట్టలు ఇలా ఎక్కడ చూసినా
పచ్చటి చెట్లు కనబడేలా చేయడం ఈ హరిత హారం పథకంలోని నూతనత్వం. అలాగే,
విద్యాసంస్థలు, పారిశ్రామిక వాటికలు, విశ్వవిద్యాలయాలు మొదలయిన అన్ని ప్రదేశాల్లో హరిత హారం
మొక్కలు పచ్చ-పచ్చగా కనిపించేలా చేయడం మరో ప్రత్యేకత. మొక్కలు పెంచడం అంటే ఏదో మొక్కుబడిగా
చేసే ఓ ప్రభుత్వ కార్యక్రమం కాకూడదని, దీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావజాలానికి
అనుగుణంగా ఈ హరిత హారం రూపుదిద్దుకుంది.
అందుకే
ముఖ్యమంత్రి, దీన్ని కేవలం ఒక సవాలుగానే మాత్రం
కాకుండా ఓ దీర్ఘకాలిక యజ్ఞంలా కొనసాగించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ పధకం రూపకల్పన, అమలు తీరు గురించి పదే పదే సమీక్షా
సమావేశాలు జరపడం ఆయన ఆసక్తికి నిదర్శనం. మంత్రులతోను, మొక్కల పెంపకంతో సంబంధం వున్న అన్ని
శాఖల అధికారులతోను, అటవీ శాఖ కింది స్థాయి సిబ్బందితోను, ఈ సమావేశాలు జరిగిన తీరు గమనించిన
వారికి హరిత హారం పట్ల ముఖ్యమంత్రికి వున్న పట్టుదల అర్ధం అవుతుంది. ఏ ఒక్క చిన్న సమస్య ఎదురుకాకుండా ఈ
పధకం సాఫీగా అమలు జరగడానికి వీలుగా అయన అతి కింద స్థాయి అధికారులతో కూడా మాట్లాడుతూ వారికి తగు సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్స హిస్తూ
వస్తున్నారు. జిల్లా కలెక్టర్లతోను, పోలీస్ సూపరింటెండెంట్ల తోను, అటవీ శాఖ రేంజర్లతోను, డివిజనల్ ఫారెస్ట్ అధికారులతోను, కన్సర్వేటర్లతోను, సమావేశాలు జరిపిన ముఖ్యమంత్రి, పథకం అమలులో వారికి ఎదురు కానున్న
సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించారు. ఇటీవల జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఓ
అటవీ అధికారి, కొందరు కలప వర్తకులు, ఇతర భూకబ్జా దారులు, అటవీ ప్రాంతాన్ని ఆక్రమించిన
విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన
వెంటనే స్పందించి
అలాంటి వారితో కఠినంగా
వ్యవహరించే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. అవసరమైన సందర్భాలలో అటవీ శాఖ సిబ్బంది
తమ విధులను నిర్భయంగా నిర్వహించేందుకు వీలుగా సాయుధ పోలీసు రక్షణ సహితం
కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం విశేషం. అటవీ
భూముల సరిహద్దులను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా
తనిఖీలు జరపాలని సూచించారు.
అలాగే
మరో సమావేశంలో హరిత హారం మరింత విస్తృత పరిచి, మంచి ఫలితాలను సాధించడానికి వీలుగా, నాటే మొక్కల సంఖ్యను 320 కోట్లకు పెంచాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి 60-70 కోట్ల మొక్కలకు పెంచుతూ పోవాలన్నారు. ఏటా జులై నెల మొదటి వారం లేదా రెండో
వారాన్ని హరిత హారం వారంగా పరిగణించి మొక్కలు నాటాలని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక
శ్రద్ధ తీసుకోవాలని ఉద్బోధించారు. తాజాగా మరో సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారులు హాజరయ్యారు. హరిత హారం కార్యక్రమం పట్ల దేశ
వ్యాప్తంగా ఆసక్తి వెళ్ళి విరుస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో మాదిరిగా ఇటువంటి
కార్యక్రమం ముందెన్నడూ ఎవ్వరూ తలపెట్టిన సందర్భం దేశంలో మరెక్కడా లేదని పలువురు
చెబుతున్నారని అన్నారు.
దీన్ని ప్రజా ఉద్యమంగా తయారు
చేసి మరిన్ని సత్ఫలితాలను సాధించి చూపాలన్నారు. మొక్కల
పెంపకం విషయంలో పోలీసు అధికారులు చూపుతున్న శ్రద్ధను ఆయన ప్రత్యేకించి
ప్రస్తావించారు. హరిత హారం అనేది కేవలం అటవీ శాఖకు
మాత్రమే సంబంధించిన వ్యవహారంగా చూడకూడదనీ ఇది ప్రజలందరి పథకం అనీ కేసీఆర్ అన్నారు. జాతీయ రహదారుల పక్కనా, రాష్ట్రంలోని ప్రధాన రహదారుల పక్కనా
కూడా మొక్కలు నాటాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఈ
నేపధ్యంలో, హరిత హారం కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 39 కోట్ల 60 లక్షల మొక్కలు ఇప్పటికే సిద్ధం
చేసింది. జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగానే
కాకుండా, గ్రామ స్థాయిలోను పంపిణీ చేయడానికి మొక్కలు
సిద్ధంగా వున్నాయి.
ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో ఆ
ప్రదేశాలను గుర్తించడం జరిగింది కూడా. హరిత
హారం పధకంలో ఔటర్ రింగు రోడ్డు కూడా పచ్చని చెట్లతో హరితవర్ణం ధరించే రోజులు దగ్గర
లోనే వున్నాయి. ఇందుకోసం అవసరం అయ్యే నిధులు
శాఖలవారీగా విడుదల చేయడం విశేషం. NREGA నిధులు, అటవీ శాఖ నిధులు, పారిశ్రామిక, మునిసిపాలిటీ శాఖల నిధులు, ఇతర రకాల నిధులు పథకానికి
ఉపయోగించనుంది ప్రభుత్వం. గ్రామ స్థాయిలో ఈ
పధకం అమలు కోసం "గ్రామ పంచాయత్ హరిత రక్షణ కమిటీలు" ఏర్పాటయ్యాయి. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన పనిచేసే ఈ
కమిటీలో సభ్యులుగా ఎంపీటీసీ,
పంచాయత్ కార్యదర్శి, ఎస్‍హెచ్‍జీ నాయకుడు, ఏఎన్‍ఎం, అంగన్ వాడీ వర్కర్ ఇతరులు వుంటారు.
హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవడం తో సహా, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత, ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను
చేయడం ఈ కమిటీ ద్వారా జరుగుతుంది. ఈ పధకం
ప్రచారంకోసం, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడం
కోసం ఆకర్షణీయమైన లఘు చిత్రాలను తయారు చేసి టీవీల్లో
ప్రదర్శిస్తున్నారు.
రేడియో శ్రోతలకోసం ప్రత్యేక
ప్రచార కార్యక్రమాలు రూపొందించారు. ఇక
పోస్టర్లు, కరపత్రాలతో హరిత హారం ప్రచారం జోరుగా
సాగుతోంది. సాంస్కృతిక సారధి బృందాలు తమ
కళాకారులతో చక్కటి ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఈ
పధకానికి మద్దతు కోరుతూ,
కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మిలిటరీ అధికారులతో సమావేశాలు జరిగాయి. హరిత హారం డైరెక్టరీలు ముద్రించి
సిద్ధంగా పెట్టారు.
జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారీగా మొక్కల వివరాలను, లభ్యమయ్యే ప్రదేశాలను ఈ డైరెక్టరీల్లో ముద్రించారు. వీటిని ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలకు పంపారు. సవివరమైన మార్గదర్శిక సూత్రాలను తయారు
చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా అన్ని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు బట్వాడా చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి
అధికారి పాత్రను ఈ మార్గదర్శిక సూత్రాలలో పొందుపరిచారు.
రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా హరిత హారం పధకం
పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించింది
ప్రభుత్వం.
తెలంగాణకు హరిత హారం లాంటి భారీ
ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చూస్తుంటే, అప్పుడెప్పుడో,
చైనాలో ఇలాంటి తరహాలోనే చెట్ల
పెంపకం జరిగిన విషయం గుర్తుకొస్తుంది. "గ్రీన్ గ్రేట్ వాల్" గా
పిలువబడిన ఆ కార్యక్రమం కన్నా కూడా, బహుశా తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్నే, రాబోయే రోజుల్లో యావత్ భారత దేశం, ఆ మాటకొస్తే ప్రపంచం కూడా, ఒక అత్యుత్తమ పర్యావరణ పరిరక్షణ
పథకంగా గుర్తిస్తారనడం అతిశయోక్తి కాదేమో! End
వనంవారూ,
ReplyDeleteఈ ప్రక్కన హరితహారం హంగామా మొదలవుతూంటే మరొకప్రక్కన విద్యుత్తు ఉద్యోగులు వైర్లకు అడ్దంవస్తున్నాయన్న వంకతో చెట్ట్లను కొట్టేస్తున్నారు - అడ్డొచ్చే రెమ్మల్ని కాదు - ఏకంగా చెట్లకున్న పెద్దపెద్ద కొమ్మల్నీ, అక్కడక్కడా ఏకంగా చెట్టనీ. ఈ విషయంలో కొంచెం అవసరమైన విచారణ జరిపించగలరా?
వనంవారూ,
ReplyDeleteనా పై వ్యాఖ్యలో 'హంగామా' అన్న పదం వాడాను. అదంత ఉచితం కాదనిపిస్తోంది నాకే. అందుచేత దానిని ఉపసంహరించి 'హడావుడి' అని అ మాట స్థానంలో మరొక మాటను ఉంచి చదువుకోవలసిందిగా విజ్ఞప్తి,
Thank You
Delete