ఆచి తూచి...అసలైన నిర్ణయం
నమస్తే తెలంగాణ (01-08-2015)
వనం జ్వాలా నరసింహారావు
తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్
పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద, అనర్హులుగా ప్రకటించమని శాసన సభాపతికి, గవర్నర్‌కు విజ్ఞప్తులు చేశారు కొందరు
ప్రతిపక్ష నాయకులు. తెలుగుదేశం
పార్టీ టికెట్‌పై గెలిచి, రాష్ట్ర
మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాకు సంబంధించి, సమాచార హక్కు చట్టం కింద వివరాలను సేకరించి ఆ
విషయాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం కూడా జరిగింది. టిఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని
స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించిందని వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై
హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా శాసన సభ సభాపతికి కూడా వ్యక్తిగతంగా నోటీసులు
జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
గతంలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ
నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఆక్షేపిస్తూ, వారు
పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించినా స్పీకర్ ఎందుకు మిన్నకుండిపోయారనీ,
వెంటనే సమాధానం చెప్పాలనీ హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను
కోరారు. అలాగే
ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి ఛైర్మన్ ను అనర్హతపై తేల్చి చెప్పాలని హైకోర్టు అంది.
పార్టీ ఫిరాయింపుల
నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా
అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, సత్ సాంప్రదాయాలే
మన్నా నెలకొన్నాయంటే, అలా
ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం
తప్పని సరి. దాదాపు రాజకీయ
పార్టీలన్నీ కూడా, వారి
వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల
ఆధారంగా, నడచుకుంటారన్న
అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ బహుశా భారత దేశంలో ఏ ఒక్కటి కూడా లేదంటే
అతిశయోక్తి కాదేమో! తప్పొప్పుల సంగతి వేరే విషయం.
అనర్హత విషయంలో
నిర్ణయాధికారం పూర్తిగా సభాపతిదే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయ
స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్
నిబంధనలను అమలు పరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ
పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి
వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ
ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత
అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది
సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి
ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల
నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, హఠాత్తుగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్ట
సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన
ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిపిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం
తీసుకుంటారు. సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే
అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు
పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగ
పరంగా, న్యాయ మూర్తులకు వుంది. పార్టీలు మారడం
వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. చట్టం తేవడం
జరిగినప్పటికీ,ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. అవసరార్థం
ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ
పార్టీలు చేస్తూనే వున్నాయి.
పార్టీ
ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన
వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోను, ఎన్నికల
సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుండాలి. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని
పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇచ్చి తీరాలి. ఒక పార్టీ, ఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు
నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం
చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారు వుండే అవకాశాలున్నాయి. అదే విధంగా, పదవ
షెడ్యూల్ అమలు విషయంలోను,కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల
సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన
బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.
భారత రాజ్యాంగ
నిర్మాణ స్వరూపం చాలా వరకు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్దతితోనే రూపు దిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లాండ్ దేశాలకు, దాదాపు ఒకే రకమైన
సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ నియమ-నిబంధనలు, సంప్రదాయాలు భారత దేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీ, అ దేశంలో ఎన్నికైన
పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా
చేయాలనుకున్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన
రాజ్యాంగంలో పొందుపరచక పోవడం బహుశా పొరపాటే మో!
అసలా మాటకొస్తే వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో
ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడటానికి దోహదపడతాయి. ఉదాహరణకు, ఆ దేశంలో లాగా, ఇక్కడి లోక్ సభ-రాష్ట్ర శాసన సభల స్పీకర్లు, చట్ట సభల
కాలపరిమితి తర్వాత జరిగే ఎన్నికలలో, ఏ పార్టీకి చెందని అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కలిగించాలి.
ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒక సారి ఎన్నికైన వ్యక్తికి, పదవీ కాలం పూర్తవకుండా-లేదా మళ్లీ ఎన్నిక లొచ్చే వరకైనా, రాజీనామా చేసే
అవకాశం లేనే లేదు. పదిహేడవ
శతాబ్దంలో, రాచరిక వ్యవస్థ నేపధ్యంలో, బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం, సభ్యులుగా వుండడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవ చేసే
గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యా, ఎన్నికైన
పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండా, మార్చ్ 2, 1623 న సభ ఒక తీర్మానాన్ని
ఆమోదించింది. మన దేశంలో
పరిస్థితి వేరు. చట్ట సభలకు గెలిచిన అభ్యర్థి తన ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఉప
ఎన్నికలొచ్చిందాకా వేచి వుండి తిరిగి పోటీకి దిగవచ్చు. బహుశా ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన
సమయం ఆసన్నమైందనాలి.
ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
దేశాలలో, చట్ట
సభలకు ఎన్నికై నవారు, రాజీనామా చేయదల్చు కుంటే, ఆ విషయాన్ని ఫార్మాట్ లో, స్పీకర్ కు తెలియ చేస్తే సరిపోతుంది.
స్పీకర్ తక్షణం రాజీనామాను ఆమోదించవచ్చు, లేదా,నిర్ణయం వాయిదా వేయడమో, రాజీనామాలను
తిరస్కరించడమో చేయవచ్చు. ఇలా
చేశాం అని చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ అందుబాటులో
లేకపోతే, రాజీనామా చేయదల్చుకున్న
వ్యక్తి డిప్యూటీ స్పీకర్ కు కాని, కార్యాలయంలో సిబ్బందికి కాని ఇచ్చి పోవచ్చు. ఎంత వేగంగా వారు రాజీనామాలను సమర్పించుకుంటారో, అంతే మోతాదులో, అత్యంత నెమ్మదిగా, నిర్ణయాన్ని వాయిదా
వేయవచ్చు. ఇంగ్లాండులో
సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినా, సభ్యత్వం నుంచి తొలగడానికి
రాజ్యాంగం ఒక వెసులుబాటు కలిగించింది.
"రాజీనామా" కు బదులుగా "పదవీ విరమణ" చేసే అవకాశం పార్లమెంట్ కలిగించింది.
పార్లమెంటు సభ్యులుగా వున్న వారు "ఆదాయం లభించే"
పదవులను అంగీకరించ రాదన్న నిబంధన వున్నందున, సభ్యులు ఆ నిబంధన
ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేందుకు, ప్రభుత్వ పరంగా, ప్రత్యేకంగా దీని కొరకే
ఉద్దేశించబడిన ఒక పదవి కావాలంటూ అభ్యర్థన చేసుకోవాలి. దాన్ని మన్నించి, బ్రిటీష్ రాణి (లేదా రాజు), ఆర్థిక మంత్రి (ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్) ద్వారా ఆ పదవిలో వారిని నియమించడం, తక్షణమే, సభ్యత్వం రద్దు
కావడం జరుగుతుంది. అలాంటి
వారు, తాము ఖాళీ చేసిన
సీటుకు ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సాధారణంగా సాహసించరు. పార్టీ టికెట్ కూడా లభించదు. ఆశ్చర్యకరమైన విషయం... దీని కొరకు కేటాయించిన పదవులు
కాగితం పై మాత్రమే వుంటాయి. ఎప్పుడో, మాంధాతల కాలంలో, రాచరిక వ్యవస్థ పూర్తిగా
వేళ్లూనుకున్న రోజుల్లో, ఏర్పాటైన ఆ పదవులు, ప్రస్తుతం "చట్టపరమైన
కల్పితాలు" గా మిగిలి పోయాయి.
న్యాయ శాస్త్ర
పరమైన నియమ-నిబంధనల నేపధ్యంలో
రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయ స్థానాల తీర్పులు వుండి తీరాలి.
సంప్రదాయాలకు ఇదమిద్ధమైన నిబంధనలంటూ ఏదీ వుండాల్సిన అవసరం లేదు.
చట్ట ప్రకారం నడచుకోక పోతే దాని పరిణామాలు ఒక విధంగా వుంటాయి.
సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను
సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ వుంటుంది.
చట్టం స్పష్టంగా వుంటే, స్పీకర్ కు సరైన
మార్గదర్శకాలుంటే, ఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చట్టంలో స్పష్టత లేనప్పుడు, సంప్రదాయాల ఆసరా
దొరకనప్పుడు, స్పీకర్ అత్యంత
జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొందరపడి
నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు.
అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? అన్ని రాజకీయ పార్టీల వారు
ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిదే మో!
>స్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు.
ReplyDeleteఅవునండీ. 5 సంవత్సరాల సమయం చేతిలో ఉండగా స్పీకర్ తొందరపడి ఏ నిర్ణయాన్ని ఐనా ఎందుకు తీసుకోవాలి?
అసలు స్పీకర్‍ను నిర్ణయం ప్రకటించమని అడగటానికి న్యాయస్థానాలే మీనమేషాలు లెక్కించవలసి వస్తున్నప్పుడు రాజకీయపార్టీలు (ముఖ్యంగా ప్రతిపక్షాలు) కాని, ఒకసారి ఓటు వేసేసిన తరువాత పేపరు చదువుకోవటం, టీవీ చూడటం, డైనింగ్ టేబుల్ దగ్గర చర్చించుకోవటం మించి పౌరులకు కూడా ఏమీ హక్కు లేదు - ఎంత ప్రజాస్వామ్యం అన్న పేరుమీద ప్రభుత్వాలు నడుస్తున్నా సరే.