బ్రాహ్మణులంటే ఎందుకింత
ద్వేషం?
వనం జ్వాలా నరసింహారావు
నవ
తెలంగాణ దినపత్రిక (26-10-2015)
నవ తెలంగాణ పత్రిక "వేదిక" లో, రామాయణంపై నేను ఇంతవరకూ రాసిన
వ్యాసాలకు సరైన అర్థం చెప్పలేక విపరీతార్థాలతో, వక్ర
భాష్యంతో, తోకలు-తొండాలంటూ
వివేచనా రహితంగా మాట్లాడటం సంస్కారం కాదు. ఆ విధంగా స్పందించటం కూడా నాకు చేతకాదు....అది నా సంస్కారమూ కాదు. ఇంతవరకూ నేను రాసినా వ్యాసాలలో
ఇతరులను ప్రత్యక్షంగా కాని,
పరోక్షంగా కాని చెడు భావనతో
ఒక్క విమర్శ కూడా చేయలేదు.
ఏది ఆర్య ధర్మమో, ఏది కాదో నిర్ణయించే గొప్పవాళ్లం మనం
ఔనో కాదో, మనకా అర్హత ఎంతవరకుందో ఆలోచించు కోవడం
మంచిదేమో! ఉదాహరణకు సృష్టి రహస్యం పరిపూర్ణంగా
సమగ్రంగా విప్పగలవారెవరైనా వున్నారా? పోనీ
తమకు తెలుసని ఇంతవరకు ఎవరైనా అనగలిగారా? సైన్స్
ఎంతగానో అభివృద్ధి చెందింది కదా?
ఐనప్పటికీ రోబోట్ లను తయారు
చేయగలిగారే కాని మానవ శరీర నిర్మాణానికి అసలు సిసలు నమూనా ఎవరైనా చేయగలిగారా? టెస్ట్ ట్యూబ్ బేబిని పుట్టించగలిగారు
కాని, మానవ వీర్యం, అండం కలయిక లేకుండా దానిని
సాధించగలిగారా? నేను చెప్పదల్చుకున్నది
ఒక్కటే...సృష్టి ఆదినుంచీ కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, ఆచరణలు, మంచీ-చెడులు...ఇలా
ఎన్నో సాంప్రదాయాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వాటిలోంచి ఈకకు ఈక, తోకకు తోకా లాగి, పాండిత్య ప్రదర్శన చేసి, సనాతన పద్ధతులను, సంస్కృతీ సంప్రదాయాలను, ఈసడించడం సమంజసం కాదేమో ఆలోచించు
కోవడం మంచిది. ఇక్కడ రాముడు,
రావణుడు, లేదా మరొకరు బ్రాహ్మణులా, క్షత్రియులా, శూద్రులా మరొకరా అనేది కాదు సమస్య.
ఎవరెవరు ఎటువంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాల వారు ఎలా అర్థం
చేసుకోవాలనేది ముఖ్యం. రామాయణం నిజమా, పుక్కిటి
పురాణమా అని వాదించే కన్న అందులోని ధర్మాలను, అధర్మాలను
అవగాహన చేసుకోవడం కూడా ముఖ్యం. రామాయణంలో ఎక్కడా ఫలానా కులం వారే అధికులని
చెప్పబడలేదు. ఎన్నో పాత్రల ద్వారా ఎన్నో ధర్మాలను వివరించడం జరిగింది.
ఇదిలా
వుండగా, ఇటీవల కాలంలో ఐన దానికీ-కాని దానికీ
బ్రాహ్మణులను ఆడిపోసుకోవడం ఒక పరిపాటి అయింది కొందరికి. రామాయణంలో అశ్వమేధ
యాగానికి ఒక సందర్భం,
సహేతుకమైన కారణం వుంది. అది
గమనించకుండా ఆ సంఘటనను "ఆర్య బ్రాహ్మణుల అ నైతిక ధర్మం” గా అభివర్ణించడం దురదృష్టం. సత్యకామ
జాబాలిని వెనకేసుకొచ్చి రాముడిని అధర్మ పరుడిని చేయడం, దశరథుడిని వెనకేసుకొచ్చి బ్రాహ్మణులను
అవమానకరంగా చిత్రీకరించడం,
వాళ్లకు వ్యవసాయం చేయడం ఇష్టం
లేదని ఆరోపణ చేయడం తప్పు. కాళ్లు మొక్కడం తప్పని మరో వాదన లేవదీస్తున్నారు.
పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్థపూరిత ప్రేమ, సమాజం కోసం చేసే త్యాగాలకు గుర్తుగా ఈ
పాదాభివందనాన్ని చేస్తాం.
ఇలా పాదాభివందనాలను నిత్యం
కానీ, లేదా ముఖ్యమైన కొన్ని సందర్భాలలో
చేయడం కానీ భారతీయ సంస్కృతి-సంప్రదాయం. కుటుంబంలో, సమాజంలో ప్రజల మధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ
సంప్రదాయం సృష్టించగలదని గుర్తించాలి. జ్ఞాన
వృద్ధులైన వారి పాదాలకు చేసే నమస్కారమే పాదాభివందనం. వయస్సుచే
కాని, విద్యచేత కాని అధికు లైనవారికి
ఎదురుగా వెళ్లి నమస్కరిస్తే,
వారికి ఆయువు, విద్య, కీర్తి, బలం, వృద్ధి
లభిస్తాయని మను ధర్మశాస్త్రంలో ఉంది.
ఇవన్నీ
పక్కన పెట్టి మొత్తం వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ
కులంతో ముడిపెట్టి విమర్శలు చేయడం తగని పని. "వ్యాసకర్త పూర్వీకులు" అంటూ బ్రాహ్మణులను పరోక్షంగా నిందించడం
కూడా సరైంది కాదు. అలానే "బ్రాహ్మణాధిక్యత" అనే పదాలను కూడా తరచూ వాడడం
మంచిది కాదు. రావణుడి కుల నిర్ణయానికి పని కొచ్చే బ్రాహ్మణ శాస్త్రాలు, బ్రాహ్మణ్యం మిగిలిన విషయాలకు ఎందుకు పనికి
రాదో అర్థంకాదు.
బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ
నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడడం సమంజసం కాదు. వాల్మీకి రామాయణం రాసే కాలంలో
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర
అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని
శంకరాచార్యులవారు వివరించారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం
ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. లోతుగా పోతే, బ్రాహ్మణులని పిలిపించుకోవాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం తప్పని సరి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, నాలుగు కాదు-నలబై తరగతులుగా మనమందరం
మనమన విధులను నిర్వహించడం లేదా?
ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం
నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని
పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో "పిస్త్రీ" అనే నాలుగు వర్ణాలుండేవి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో వున్న
వర్తమాన కాలంలో కూడా మనిషికి-మనిషికి మధ్య వ్యత్యాసాలు కొన్ని
విషయాలలో లేవా? ప్రభుత్వ ప్రయివేట్ సర్వీసులలో ఒకటవ
తరగతి, రెండవ తరగతి....మూడు, నాలుగు
తరగతుల ఉద్యోగులని విభజన లేదా?
ఐఏఎస్ అధికారికీ, అటెండర్ కూ రాజ్యాంగ పరంగా ఒకే రకమైన
హక్కులిచ్చినప్పటికీ,
వారిరువిరికీ మధ్య
వ్యత్యాసాలు లేవా?
ఇంజనీరునూ, డాక్టరునూ, గుమాస్తాను, దినసరి కూలీని, ఒకే రకంగా అన్ని విషయాలలోనూ
చూస్తున్నామా? దీనికి కారణం, ఇప్పటి మూలాలు ఆర్థికమైనవైతే, ఆ నాటి కాలంలో మూలాలు మరో రకంగా
వున్నాయి. దేశ కాలమాన పరిస్థితులకనుగుణంగా
మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఆ మార్పులో మంచి వుందీ, చెడు వుంది. కమ్యూనిజం వచ్చిన చైనా, రష్యా దేశాలలో కూడా ఈ తేడాలున్నాయి. ఇక "కులం"
అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే "నివాసం". వర్ణాలు వేరు,
జాతులు వేరు. వర్ణం అనే మాట "వర్గం" ను సూచిస్తే,
జాతి అనేది "కులం" ను సూచిస్తుంది.
ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే "క్లాస్", "కాస్ట్"
అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ
వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే
వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో
పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ
పడాల్సిన అవసరమూ లేదు.
ఒక కులంలో పుట్టినందుకు వేరే
కులం వారిని తక్కువగా కాని,
ఎక్కువగా కాని చూడాల్సిన
అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను
బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. బ్రాహ్మణులు
కులవ్యవస్థకు కారకులు కాదు.
వారు కుల వ్యవస్థను పెంచి
పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం
సృష్టించుకున్నవే ఇవన్నీ.
"బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే "యజ్ఞం" అనే అర్థం కూడా వుంది. అంటే
యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. జన్మించిన తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా
పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణులు పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ
ప్రపత్తులు లభించేవి.
ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ
పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు
పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక
లక్ష్యాలలో వూళ్లో బ్రాహ్మణుడు వుండడం కూడా ఒకటి. సమాజాన్ని
మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు
గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన
కులంగా బ్రాహ్మణులను అభివర్ణించి,
ప్రాచీన పవిత్ర గ్రంథాలలో
లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని
విలువ అపారమని పేర్కొన్నారు.
ఇలాంటి
నేపధ్యంలో తమ
బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ
వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర
వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?
ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా
కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ
క్షీణించి పోతున్నాయి.
బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు
చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో
ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్
పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర
ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ
ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర
పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని
అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం,
భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని
భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన
విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి
ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో
పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని
మరింత ధృఢ పరిచింది.
అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, బ్రాహ్మణులకు ఇప్పటికీ గౌరవం
లభిస్తున్నప్పటికీ,
అప్పట్లో వారికి దక్కిన
హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని కనీసం కొన్ని
పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం
చాలావరకు ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర
వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ
పడి నెగ్గుకొస్తున్నప్పటికీ,
సాంప్రదాయిక వైదిక విద్యా
సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం
వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న
విద్య వల్ల నైతేనేమి,
బ్రాహ్మణులు మత పరమైన
వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం
బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం
జ్ఞానార్జన చేస్తూ,
వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ
అభ్యున్నతికి పాటుపడాలి.
దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ
మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై
చక్కటి అవగాహన కలిగి ఉంటారు.
ఆంగ్లేయుల
పాలనలో, బ్రాహ్మణులు, జాతీయోద్యమంలో కీలక నాయకత్వం చేపట్టడం
దాకా పోయింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన
తరువాత చాలా రోజుల వరకు
అధికారంలో వున్న భారత జాతీయ
కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు
పొందడంలోను, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక
పోషించడంలోను బ్రాహ్మణులే ముందుండే వారు. వీరి
ఈ ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో-ముఖ్యంగా
దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు
మొదలయ్యాయి. ఆ ఉద్యమాల ప్రభావం వారి హక్కులను
హరించడం వరకే పరిమితమైనాయి తప్ప,
పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా
కొనసాగే విషయంలో పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా
వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ.
క్రమేపీ, వీటికే పరిమితమై పోవడంతో, గతంలో మాదిరి రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన
పరిస్థితి ఎదురైంది చాలామందికి.
భారత దేశ చరిత్రను తిరగ రాసే
ప్రయత్నంలో, బ్రాహ్మణులను, ఇతర వర్ణాల వారికి వ్యతిరేకులుగా, పీడించే వారిగా, దుర్మార్గులుగా చిత్రించే ప్రయత్నం
కూడా చేసింది. భారత సమాజాన్ని అభివృద్ది పరచడంలో
బ్రాహ్మణులు వహించిన పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది.
సమాజాన్ని
ఐక్యంగా, సమైక్యంగా వుంచడానికి బ్రాహ్మణులు
అనాదిగా చేసుకుంటూ వస్తున్న అవిరళ కృషిని, మరుగుపర్చి, బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రోత్సహించింది
నాటి బ్రిటీష్ ప్రభుత్వం.
ఆ వ్యతిరేకతే దరిమిలా కొనసాగి, అరవై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో
మరింత బలపడి, చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో, బ్రాహ్మణులను అణగ దొక్కే స్థాయికి
తీసుకుపోయింది. వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి
చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు
బదులుగా కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక
వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల
వ్యతిరేకతకు దారితీసింది.
ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే
పరిస్థితులొచ్చాయి.
అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది. చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి
పోయారు. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు
తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది.
ఎప్పుడో,
వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న
నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు
గురి చేయడం భావ్యమా?
దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన
హక్కులు కలవారే అంటున్నాం.
అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని
బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? End