శేషప్ప కవి రచించిన నరసింహ శతకం
ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులు వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు.
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-1
సీII శ్రీ మనోహర ! సురార్చిత ! సింధుగంభీర !
భక్తవత్సల ! కోటి భానుతేజ !
కుంజనేత్ర ! హిరణ్యకశిపు నాశక ! శూర !
సాధురక్షణ ! శంఖచక్ర హస్త !
ప్రహ్లాదవరద ! పాపధ్వంస ! సర్వేశ !
క్షీరసాగరశాయి ! కృష్ణ వర్ణ !
పక్షివాహన ! లసద్భ్రమరకుంతలజాల
పల్లవారుణ పాదపద్మ యుగళ !
తేII చారు
శ్రీ చందనాగరు చర్చితాంగ !
కుందకుట్మలదంత ! వైకుంఠధామ !
భూషణవికాస ! శ్రీ
ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ !
దురితదూర !
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-2
క II పద్మలోచన ! సీసపద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య ! చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణముల జూడగ
లేదు;
పంచకావ్య శ్లోక పఠన లేదు,
అమరకాండత్రయం బరసి చూడగ లేదు,
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,
నీ కటాక్షంబున నే రచించెద
గాని
ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింప.
తే II దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె ?
చెరకునకు వంకపోయిన జెడునె తీపి !
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-3
సీII నరసింహ ! నీ దివ్యనామ మంత్రముచేత
దురితజాలము లెల్ల దోలవచ్చు,
నరసింహ ! నీ దివ్యనామ
మంత్రముచేత
బలువైన రోగముల్ బాపవచ్చు !
నరసింహ ! నీ దివ్యనామ
మంత్రముచేత
రిపు సంఘముల సంహరింపవచ్చు,
నరసింహ ! నీ దివ్యనామ
మంత్రముచేత
దండహస్తుని బంట్ల దరుమవచ్చు,
తేII భళిర !
నే నీ మహామంత్ర బలముచేత
దివ్య వైకుంఠ పదవి
సాధింపవచ్చు !
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-4
సీII ఆదినారాయణా యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణజేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను
నిన్ను గాననివారి నే స్మరింప,
మేము శ్రేష్టుల మంచు మిడుకుచుండెడివారి
చెంత జేరగ బోను శేషశయన !
తేII పరమ
సాత్త్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ ధాత్రిలోన,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన
నరసింహ శతకం-5
సీII ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు,
ద్రవ్య మిమ్మని వెంట దగులలేదు,
కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు !
పల్ల కిమ్మని నోట బలుక లేదు,
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వగ లేదు,
భూము లిమ్మని పేరు పొగడ లేదు,
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు,
పసుల నిమ్మని పట్టుబట్టలేదు
తేII నేను గోరిన దొక్కటే నీలవర్ణ !
చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-6
సీII మందుండనని నన్ను నిందజేసిన నేమి ?
నా దీనతను జూచి నవ్వనేమి ?
దూరభావము లేక తూలనాడిన నేమి ?
ప్రీతిసేయక వంక బెట్టనేమి ?
కక్కసంబులు పల్కి
వెక్కిరించిన నేమి
?
తీవ్రకోపముచేత దిట్టనేమి ?
హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన
నేమి ?
చేరి దాపట గేలి సేయనేమి ?
తేII కల్పవృక్షంబువలె
నీవు కల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల !
పద్మనాభ !
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన
నరసింహ శతకం-7
సీII చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెద గాని,
పుడమిలో జనుల మెప్పులకు గాదు,
జన్మ పావనతకై స్మరణ జేసెద
గాని,
సరివారిలో ప్రతిష్ఠలకు గాదు,
ముక్తికోసము నేను మ్రొక్కి
వేడెద గాని,
దండిభాగ్యము నిమిత్తంబు గాదు,
నిన్ను బొగడ విద్య నేర్చితినే
కాని,
కుక్షి నిండెడు కూటి కొరకు
గాదు,
తేII పారమార్థికమునకు
నే బాటుపడితి,
గీర్తికి నపేక్ష పడలేదు
కృష్ణవర్ణ !
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన
నరసింహ శతకం-8
సీII శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ
లేశమానందంబు లేనివాడు
పుణ్యవంతులు నిన్ను బూజసేయగ జూచి
భావమందుత్సాహ పడనివాడు
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ
దత్పరత్వములేక తలగువాడు
తన చిత్తమందు నీ ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృథా గడుపువాడు
తేII వసుధలోనెల్ల
వ్యర్ధుండు వాడె యగును
మరియు జెడుగాక యెప్పుడు
మమతనొంది,
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-9
సీII గౌతమీ స్నానాన గడతేరుదమటన్న
మొనసి చన్నీళ్లలో మునుగలేను;
దీర్థయాత్రలచే గృతార్థుడౌదమటన్న
బడలి నీమంబులే నడపలేను;
దానధర్మముల
సద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద ధనములేదు;
తపమాచరించి సార్థకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలుపలేను;
తేII కష్టములకోర్వ
నాచేతగాదు; నిన్ను
స్మరణజేసెద నా యథాశక్తికొలది;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-10
సీII అర్థివాండ్రకు నీక హాని జేయుటకంటె
దెంపుతో వసనాభి దినుటమేలు;
ఆడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె
బండ గట్టుక సూత బడుట మేలు;
పరులకాంతల బట్టి బల్మి గూడుట కంటె;
బడబాగ్ని కీలల బడుటమేలు;
బ్రతుకజాలక దొంగపనులు సేయుటకంటె
గొంగుతో ముష్టెత్తు కొనుటమేలు;
తేII జలజదళనేత్ర
! నీ భక్త జనులతోడి
జగడమాడెడు పనికంటె జావుమేలు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర
!
మంచిప్రయతం వనం వారూ.
ReplyDeleteఈ కాలంవారికి అర్థం అవుతాయా పద్యాలు? అందులోనూ గ్రాంధికభాషా ద్వేషం ప్రబలుతున్న రోజులు కదా! ఆసక్తి కలవారిలో కూడా చాలమంది భాషలో తగినంత ప్రావీణ్యత లేక అర్థంచేసుకోవటంలో ఇబ్బంది పడటం అనే ఒక చిక్కు కూడా ఉంది కద. మీరు దయచేసి పద్యాలతో పాటి వాటి అర్థాన్ని కూడా వివరించితే మరింత మంది పాఠకులకు ఉపయోగం ఉంటుందని భావిస్తాను.
ప్రయత్నం బాగుంది.అభినందనీయం. అర్ధం కూడా చెప్పకపోతే నేటి వారు పద్యం అంటే పారిపోతున్నారు. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు కదా! ఎప్పటికి నిత్య నూతనాలే...
ReplyDelete