Thursday, November 5, 2015

ఆయుత చండీ యాగంపై అనవసర రాద్ధాంతం : వనం జ్వాలా నరసింహారావు

ఆయుత చండీ యాగంపై అనవసర రాద్ధాంతం
వనం జ్వాలా నరసింహారావు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయ తలపెట్టిన ఆయుత చండీ యాగంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అలాగే, తెలంగాణాలో అనాదిగా జరుపుకుంటున్న బతుకమ్మ, బోనాలు, దసరా లాంటి పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. వీరి మాటలు మెజారిటీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విగా, వాళ్ల నమ్మకాలకు వ్యతిరేకంగా వున్నాయి. అనాదిగా, సృష్టి ఆరంభం నుంచీ, మనిషి అనే వాడు, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, రకరకాల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, నమ్మకాలను అనుసరిస్తూ రావడం జగమెరిగిన సత్యం. శ్రీరాముడే దేవుడని నమ్మేవాళ్లున్నారు, కాదు శ్రీ కృష్ణుడే అనేవాళ్లున్నారు. వారిద్దరూ కాదు పరమశివుడని మరికొందరంటారు. క్రమేపీ అనేక మతాలు, విధానాలు ఆచరణలోకి రావడంతో మనిషి కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాలను, ఆచారవ్యవహారాలను పాటించే వారు కొందరైతే, ఆస్తికత్వం నుంచి నాస్తికత్వం వరకూ మారిన వారు మరికొందరున్నారు.

ఇంతకీ ఎవరి నమ్మకం వాళ్లది. తమ నమ్మకమే గొప్పదనీ, ఇతరుల నమ్మకాలు తప్పనీ వాదించే ప్రయత్నం మంచిది కాదు. నమ్మకం విషయానికొస్తే యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం కూడా ఒక నమ్మకమే. అది నిజం కావచ్చు-కాక పోవచ్చు. కాని చేసే వాళ్లను తప్పు చేస్తున్న వాళ్లగా చిత్రీకరించడం అంతకన్నా గొప్ప తప్పు. చివరికి విమర్శకుల మాటలు ఎంతవరకు పోయాయంటే, ప్రజలను చంపడానికే యాగాలు అనేంతవరకూ పోయింది. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి  కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావో కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. బాంకాక్ లో రహదారుల పేర్లన్నీ రామ అక్షరంతో మొదలవుతాయి. ఎవరి నమ్మకం వాళ్ల ది.

యజ్ఞయాగాదులనేవి ఈ నాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందిన మన వేదాలలో యజ్ఞాలు ప్రతిపాదించబడ్డాయి. యజ్ఞయాగాదుల విధి-విధానాల గురించి వివరంగా చెప్పడం కూడా జరిగింది. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి కారణం కూడా యజ్ఞ యాగాలే. మానవ జాతి సృష్టే యజ్ఞ సహితంగా జరిగిందంటారు. యజ్ఞం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. జగత్ కళ్యాణానికి కారణం కూడా యజ్ఞయాగాదులే. దేవతార్చనతోనే హిందూ జీవన విధానం ముడిపడి వుంది. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. జీవుడు తల్లి గర్భంలో చేరినది మొదలుకుని, భూమిమీద అడుగుపెట్టినప్పటినుంచి, వివిధ సంస్కారాలతో సంస్కరించబడాలని వైదిక సాంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. అలా సంస్కరించబడడానికి అమూల్యమైన ప్రక్రియ యాగాలు, యజ్ఞాలు చేయడం, చేయించడం. యజ్ఞాలు మహత్వ పూర్ణాలు, అవశ్యం ఆచరణీయాలు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు. అలాంటివాటిలో రుద్ర యాగాలు, సూర్య యాగాలు, గణేశ యాగాలు, చండీ యాగాలు, శాంతి యాగాలు లాంటివి బహుళ ప్రచారంలో వున్నాయి. మనం చేయలేని దాన్ని మరొకరు చేస్తుంటే వారిని ప్రోత్సహించడం మన కనీస ధర్మం. విమర్శించకుండా వున్నా చాలు.

యజ్ఞ యాగాలు చేయడం ఫ్యూడలిజం లక్షణాలుగా కొందరు ఎద్దేవా చేస్తున్నారు. రాజులు-రాజ్యాలు పోయినా పరిపాలన పోలేదు అనే విషయం సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది. రాచరికం పోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ, పాలకులు-ప్రజలు అనే పద్ధతి కొనసాగుతూనే వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారు ప్రజల సంక్షేమ-అభివృద్ధికి బాటలు వేస్తూనే, అనేక రకాలుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత కూడా వుంది. ఉదాహరణకు వర్షాలు కురవకపోతే కృత్రిమంగా వర్షాలు కురిపించడం ఒక పద్ధతైతే, ఆధ్యాత్మిక పద్ధతిలో యజ్ఞ యాగాలు కూడా చేయొచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలొచ్చు, రాలక పోవచ్చు. కాని, ప్రజల నమ్మకాలకు అనుగుణంగా నడచుకుంటే తప్పు లేదు కదా! ఆ బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారిదే.

ఓ మూడేళ్ల క్రితం భద్రాచలంలో అతిరాత్రం అనే ఒక మహా యజ్ఞం నిర్వహించారు కొందరు. నేను కూడా అందులో కొంత పాత్ర పోషించాను. విపరీతంగా ఎండలు కాస్తున్న ఏప్రియల్ చివరి, మే నెల మొదటి వారం రోజులవి. పన్నెండు రోజులు నిర్విఘ్నంగా సాగిన యజ్ఞం ఆరంభం నుంచీ, చివర వరకూ అడపదడప కుండపోతగా వర్షం కురుస్తూనే వుంది. అది కాకతాళీయం కూడా కావచ్చు. కాని భద్రాచలం చుట్టుపక్కల అంత మోతాదులో వర్షాలు ఆ క్రితం పది-పన్నెండేళ్లలో ఎప్పుడూ కురవలేదని ఇప్పటికీ అక్కడి వారు చెప్పుకోవడం జరుగుతోంది. శాస్త్రీయంగా, యజ్ఞం జరిగనన్ని రోజులు, ఆ తరువాత కూడా పరిసర ప్రాంతాలలో పరిశోధనలు చేశారు కొందరు సైంటిస్టులు. అద్భుతమైన ఫలితాలొచ్చాయి. అంతకు ఒక ఏడాది క్రితం, హిందువుల సంప్రదాయాలకు, నమ్మకాలకు, ప్రత్యక్ష సాక్ష్యంగా అద్భుతంగా సాగింది ఇలాంటి అతిరాత్రం పుణ్య యజ్ఞం కేరళలోని పంజాల్ గ్రామంలో. అప్పుడక్కడున్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని వాదించే ప్రబుద్ధులను నిశ్చేష్టులను చేస్తూ యాగం పరి సమాప్తమైన కొద్ది నిమిషాలలోనే, ఆకాశం మేఘావృతమై, కుండపోతగా వర్షం కురిసింది. యజ్ఞాన్ని తిలకిస్తున్న పదిలక్షలమంది జనం పులకించి పోయారు. ఇదొక నమ్మకం. ఫ్యూడలిజం లక్షణం కానేకాదు. భద్రాచలంలో జరిగిన యజ్ఞం తిలకించిన వారిలో అన్ని రకాల నమ్మకస్తులు వున్నారు. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే సారధ్య సంఘం సభ్యుడు కూడా. స్వయంగా ఆయన ఒకరోజు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయనే కాదు అనేక మంది పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల వారు కూడా పాల్గొన్నారు.

మరో సంఘటన కూడా ఈ సందర్భంగా ఉదహరించడం మంచిదేమో! 1979 లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. రిజర్వాయర్లే కాకుండా బావుల్లో కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. యాత్రీకులను కొండ పైకి రావద్దని హెచ్చరించే ఆలోచన కూడా కలిగిందట. పరిష్కార మార్గాలు అన్వేషిస్తూనే అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీవీఆర్‍కె ప్రసాద్ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా వుందా అని శోధన సాగించారు. వేద వేదాంగ పారంగతుడు, భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషన్ గౌరవ పురస్కార గ్రహీత ఉప్పులూరి గణపతి శాస్త్రిని సంప్రదించారు. ఇలాంటి సమస్యలకు వేదాల్లో పరిష్కార మార్గాలున్నాయని, భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో, త్రికరణ శుద్ధిగా యజ్ఞం ఆచరిస్తే ఫలితం తప్పకుండా వుంటుందనీ ఆయన సలహా ఇచ్చారు. వరుణ జపం నిర్వహించి, వరుణ దేవుడి కరుణ పొందాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లోని బంగారు వాకిలిలో, అర్థరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక, తలుపులన్నీ వేశాక, హఠాత్తుగా భారీ గంటలు గణ-గణ మోగాయి. తెల్లవారుతూనే వరుణ జపానికి అన్నీ సన్నాహాలు అప్పటికే జరిగాయి. నవంబర్ 7 న ప్రారంభమైన వరుణ జపం, ఋత్విక్కుల వేద మంత్రోఛ్ఛారణల మధ్య మూడు రోజులు జరిగింది. ఆ సాయంత్రం వరకూ ఏ విశేషమూ జరగలేదు. హేళనలు మొదలయ్యాయి. విమర్శలు పుంజుకున్నాయి. ఇంతలో, క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వర్షం కురిసింది. మర్నాడు ఉదయం ఏడు గంటల సమయంలో సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యే దాకా అలా కురుస్తూనే వుంది. ఇంతలోనే సమాచారం వచ్చింది. రిజర్వాయర్లన్నీ పొంగి పొర్లుతున్నాయని. విచిత్రం ఏంటంటే, ఒక్క తిరుమలలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా వర్షం ఛాయలు కూడా కాన రాలేదు.  ఇదంతా కాకతాళీయమా? వేద మంత్రాల శక్తి ప్రభావమా? భక్తులు నమ్ముకున్న దేవ దేవుడి అనుగ్రహమా? ఈ విషయాలను స్వయంగా పీవీఆర్‍కె ప్రసాద్ గారు తన పుస్తకం (నాహం కర్తా, హరిః కర్తా) లో వివరంగా రాశారు.

యాగాలు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపించిన మహత్తర నేపధ్యంలో, లోక కళ్యాణం కొరకు, విశ్వ శాంతి కొరకు, యాగాలన్నింటిలో శ్రేష్ఠమైన ఆయుత మహా చండీ యాగం చేయడానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పించు కోవడం అభినందించాల్సిన విషయం. శత, సహస్ర చండీ యాగాలు చాలామంది చేశారు, చేయించారు కాని, ఇంతవరకు, ఒక్క శృంగేరి పీఠాధిపతి మినహా మరెవ్వరూ ఆయుత మహా చండీ యాగం చేసిన దాఖలాలు లేవు. బహుశా ఆయుత మహా చండీ యాగ నిర్వహణ కష్టతరమైంది కావడం మూలాన ఎవరూ సాహసించక పోయి వుండవచ్చు. మూడు వేల మందికి పైగా బ్రాహ్మణులు యాగ స్థలంలో వుంటూ నిత్యం పది వేల పర్యాయాలు దుర్గా పారాయణం చేయాలి ఈ యాగం సందర్భంగా. రెల్లు గడ్డితో భారీ యాగ శాల తయారు చేయాలి. వంద యజ్ఞ హోమ గుండాలు ఏర్పాటు చేయాలి.  ఆయుత మహా చండీ యాగం లక్ష చండీ యాగాలతో సమానం. ఆయుత చండీ యాగాన్నే శత సహస్ర చండీ యాగంగా కూడా అంటారు. ఒక చండీ యాగం కోటి యజ్ఞాల ఫలం, ఆయుత మహా చండీ యాగం లక్ష కోట్ల యజ్ఞాల ఫలంగా వేద పండితులు అంటారు. అత్యంత నియమ, నిష్ఠలతో ఈ యాగం చేయాల్సి ఉంటుందని కూడా వేద పండితులు చెపుతారు. యాగ పరిసమాప్తం ఐన తరువాత పూర్ణాహుతి వుంటుంది.

యజ్ఞ-యాగాలకు సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచిన అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇండాలజిస్ట్ స్వర్గీయ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి, గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!". అందుకే, ఇందుకే యజ్ఞ యాగాలు చేయడం అవశ్యం. END 

3 comments:

  1. Anti hindu forces, particularly the left are on the job of propaganda. They are loosing ground in all institutions which they have ruled for the past 60 years. Now they have become jobless as congress is not in a position of come back in near future. They want to degrade India by all means, As a token they are returning awards but not the money they swallowed.

    ReplyDelete
  2. పాలకులు యజ్ఞయాగాదులు చేయటం అనూచానంగా వస్తున్నదే. యజ్ఞఫలితం కలగాలంటే యజ్ఞకర్తల మనస్సుల్లో ఏమూలా దురాశాదులు ఉండరాదు. యజ్ఞాలు కామ్యకర్మలే అనటంలో సందేహం లేదు. కాని కామితం వెనుక కూహకం ఉంటే మాత్రం ఆ యజ్ఞం నిష్ఫలం కావచ్చును దుష్ఫలప్రదమూ కావచ్చును. యుధిష్ఠిరుడి రాజసూయానికి ప్రతిగా దుర్యోధనుడు వైష్టవయాగం చేసినా ఆతడి మనస్సులో ఉన్న దురూహలు కారణంగా అది నిష్ఫలం ఐన విషయం మరువరాదు. తె॥ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు స్వఛ్చహృదయంతో యాగం చేయాలనీ అది ఫలప్రదం కావాలనీ ఆశిద్దాం.

    స్వస్తిరస్తు.

    ReplyDelete
  3. చంద్ర శేఖర్ రావు గారు తలపెట్టిన యజ్ఞం ఫలప్రదం కావాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. అన్నీ తమకే తెలుసుననుకునే "కుహానా మేధావులు", తాము నమ్మిన మతమే గొప్పదనుకునే "దురహంకారులు" ఎన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకఫోవడమే మంచిది. "యతో ధర్మో స్తతో జయహ"

    ReplyDelete