Saturday, May 26, 2018

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-10 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-10
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం సంచిక 
(27-05-2018)
శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. అందువల్లే, వాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, "అంగన్యాస కరన్యాసాదులతో" యథావిధిగా చదివి, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. సద్భావంతో సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందనివారు ఇంతవరకు లేరు. ఉత్తర కాండలో చెప్పినట్లు, రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది. ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. " తప స్స్వాధ్యాయ నిరతం, తపస్వీ వాగ్విదాంవరమ్, నారదం పరిపప్రఛ్చ, వాల్మీకిర్మునిపుంగవమ్" అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్" అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకి. అంధ్ర వాల్మీకంలో, మూలంలో వున్నట్లు "తపమున స్వాధ్యాయంబున, నిపుణుని...  .....  తమి గావించెన్" అన్న పద్యంతో ప్రారంభించి, "యథావిధి విన్న బఠింప నారయన్" అని ముగించబడింది.

సంస్కృత మూలంలో మాదిరిగానే, ఆంధ్ర వాల్మీకంలో, ప్రణవం-ప్రణవార్థం సముద్ధరించబడి వున్నాయి. ఉదాహరణకు, ఆంధ్ర వాల్మీకంలోని, "అగ్రవర్తియై శ్రీరాము... నువిద తను మధ్య..... మహిత కోదండ..... డోలి....ప్రేమ" అన్న పద్యంలోని మొదటి మూడు పాదాల ప్రథమాక్షరాలు (అవుమ) కలిపితే, నాల్గవ పాదం ప్రథమ-అంత్య అక్షర (ఓమ) స్వరూపం వస్తుంది. ఇలా మంత్రార్థమంతా మూలంలో వలె వుంటుంది. ఇలా, షడక్షరి, అష్టాక్షరి, ద్వయము లాంటి మంత్రాలు కూర్చబడ్డాయి. పరిశోధకులకు ఇవి కనుగొనడం తేలిక.

ఆంధ్ర వాల్మీకంలోని ఈ పద్యం చదువుతే సాంఖ్య శాస్త్ర రహస్యం గురించి కూడా తెలుసుకోవచ్చు.

         "శ్రీమహిజాధవుండు జడ చేతనజీవనధాత సద్గరీ
         యో మరభూరుహంబు సమ దారివిదారణశీలి భక్తవా
         రామృతదాత సంభృతశ రాసకరాంబుజు డొంటిమిట్టశ్రీ
         రాము డమాయవర్తనుడు రక్తి గ్రహించుత మన్నమస్కృతుల్

చివరి పాదంలోని మొదటి అక్షరం "రా" అంటే సంఖ్యా శాస్త్రం ప్రకారం 2కు సమానం. ఈ అక్షరం తర్వాత రెండు అక్షరాలను వదిలి చదివితే "మాయ" వుంటుంది. సాంఖ్య శాస్త్రం ప్రకారం మాయ 15కు సమానం. మొదటి అక్షరం తర్వాత 15 అక్షరాలు వదిలి చదివితే "నమః" వుంటుంది. ఇలా అన్నీ కలిపి చదివితే "రామాయనమః" ఏర్పడుతుంది. ఇలాగే కాండాది పద్యాలలో ద్వయము, షడక్షర నియమం కనిపిస్తాయి. కాండాంత పద్యాలలో "రామషడక్షరి" చొప్పించబడి వుంది. వాస్తవానికి సంస్కృత మూలంలో కొన్ని శ్లోకాలు అభేద్యంగా, వాటి స్వరూపాలు ఊహకందకుండా వుండడంతో తెనిగించడం అంత తేలికైన విషయంగా కనిపించలేదు.


ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించేటప్పుడు "సారధర్మాత్ముడును సత్యసంధుడేని, రామచంద్రుండు దశరథ రాజసుతుడు పౌరుషమునను నప్రతి ద్వంద్వు డేని, శరమ ! ఈ రావణాత్మజు సంహరింపు" అని రాయబడింది. ఇదొక మహా మంత్రం. దీనికి ప్రతి మంత్రం లేదు. దానితోనే, సర్వాస్త్రవేదియై ఏ అస్త్రంతోనూ చావని ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపగలిగాడు. "రామ" అన్న రెండక్షరాలే "తారక మంత్రం" కదా ! దానినే సర్వజ్ఞుడు శివుడు పార్వతికి ఉపదేశించాడు.

కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. ఉదాహరణకు ఒక దృష్టాంతం తీసుకుందాం. సుందర కాండను అందరు పారాయణం చేస్తారు కదా ! అలా చేసినవారి కోరికలు నెరవేరడం కూడా సహజమే కదా ! ఆ కాండంలో ప్రథమాక్షరం "త". చివరి అక్షరం కూడా "త". "తరువాత రావణాసుర...." తో మొదలయ్యి, "తత భవద్దుఃఖమునకు....శాంతి సీత" తో ముగుస్తుంది. సుందర కాండలో ప్రతి సర్గ మొదటి అక్షరం "స" కారంతోనో, "త" కారంతోనో వుంటుంది. అలా కాకపోతే ఆ శ్లోకంలో "సీత" అన్న శబ్దంకాని, దాని పర్యాయ పదం కాని వుంటుంది. అది కూడా కుదరనప్పుడు, రెండో శ్లోకం మొదటి అక్షరం "స" కాని, "త" కాని తప్పకుండా వుంటుంది. ఈ "స", "త" లు "సీత" అన్న పదాన్ని సూచించడం స్పష్టంగా తెలుస్తోంది. సుందర కాండకు అధిష్టాన దేవత సీత. ఈ సకార-తకార మహిమ ప్రకారం సీత అంటే "ఓం" అని అర్థం కూడా. బీజాక్షర మహిమ కూడా వుంది. ఇప్పుడు చెప్పిన దాని కంతా పారాయణం చేస్తున్న వారే సాక్షులు. హనుమంతుడు ఆమె పేరు చెప్పాల్సి వచ్చినప్పుడల్లా, ఆమె వున్న దిక్కుకు నమస్కరించి మరీ ప్రస్తావించేవాడు. ఇలా రామాయణంలో ఎన్ని రహస్యాలున్నాయన్న సంగతి ఎవరికన్నా తెలుసునా?

శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేదమే అయినప్పుడు, వేదంతో సమానమైందని ఎలా అనవచ్చునంటే, వేదంలోని వర్ణాలనే, అనులోమ-విలోమాలుగా మార్చి, వేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. "రామాయణం వేదసమం, శ్రాద్ధేషు శ్రావయే ద్బుధః" అని రామాయణంలోనే చెప్పబడింది.

No comments:

Post a Comment