బహుముఖ అపూర్వ ప్రగతి....నాలుగేళ్ల నవనవ్య
పాలన-5
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (01-06-2018)
రాష్ట్రంలోని అసైన్డ్ భూములను భేరీజు వేసుకోవడం,
సర్వేక్షణ చేయడం, చక్కగా పరిశీలించడం, సరిదిద్దుకోవడం, అనుసంధానించుకోవడం, అత్యంత క్లిష్టమైన సవాల్. దీన్ని ప్రభుత్వం ప్రధానమైన ఎజెండాగా పెట్టుకుంది.
ఆ బాధ్యతను తలకెత్తుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల
కలెక్టర్లు గ్రామీణస్థాయి నుంచి మొదలుపెట్టి,
భూ పరిపాలనలో ఒక సరికొత్త నూతన అధ్యాయానికి తెరలేపడం
ద్వారా లక్షల సంఖ్యలో పేదలకు, మరీ ముఖ్యంగా దళితులకు లబ్దిచేకూరుస్తున్నది. తెలంగాణలో 90 శాతం మేరకు
వ్యవసాయ భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద, సన్న-చిన్నకారు రైతుల అధీనంలో ఉందని
అంచనా.
గ్రామీణ
ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం: రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడాన్ని ఒక పెద్ద
సవాలుగా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు.
రైతన్నల వెతలు తీర్చేందుకు, వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమగ్రస్థాయిలో
పునరుద్ధరించేందుకు, సాంప్రదాయంగా వస్తున్న గొర్రెల పెంపకం, చేపల పెంపకం, పాల కేంద్రాలను పెంపొందించటం
లాంటివి చేపట్టింది ప్రభుత్వం. 17 వేల కోట్ల రూపాయల పంట రుణాలను నాలుగు విడతల్లో మాఫీ
చేయడం, తద్వారా 35 లక్షల మంది రైతులకు లబ్దిచేకూర్చడం జరిగింది.
వ్యవసాయంలో పెట్టుబడి నిమిత్తం ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున ( రెండు
పర్యాయాలు కలిపి ఎకరాకు రు. 8 వేలు) విత్తనాలు, ఎరువులు, పంటకు క్రిమి సంహారక మందుల
కొనుగోలుకు, వ్యవసాయ కూలీ ఖర్చులకు పంట పెట్టుబడి కింద ఆర్థిక
సహాయం అందజేస్తున్నది. దీని ద్వారా 58 లక్షల మంది రైతులు 1 కోటి 50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్, రబీ కాలాల్లో పంటలు పండించేందుకు వెలుసుబాటు
కల్పించడం అనే ఆలోచనలో భాగంగా 2018 మే నెల 10 వ తేదీనుండి నుంచి ఈ పెట్టుబడికి ఆర్థిక
సాయాన్ని అందజేసేందుకు శ్రీకారం చుట్టడం
జరిగింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలతో
జతపరచి చెక్కుల రూపంలో అందచేసింది. ఈ దిశగా చర్యలు చేపట్టడం వలన రానున్న రోజుల్లో
పెద్ద సంఖ్యలో వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచేందుకు, రైతన్నలకు వెసులుబాటు కల్పించేందుకు, వారిని అప్పుల నుంచి, కష్టాల నుంచి దూరం చేసేందుకు మార్గం
సుగమమైంది. రైతుకు ఐదు లక్షల రూపాయల జీవిత భీమా పథకానికి కూడా చర్యలు చేపట్టడం
జరిగింది.
భూ
సేకరణ చట్టం:
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి భూ సేకరణ అన్నది అనివార్యం అయ్యింది.
ఇది ప్రభుత్వానికి మరో సవాలుగా నిలిచింది. ఎక్కువగా జాప్యం జరగకుండా, భూసేకరణ సత్వరమే పూర్తి చేయడానికి,
భూములు కోల్పోయిన నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించడానికి,
2017 సంవత్సరపు 21వ యాక్ట్ అమలు చేయడం తప్పనిసరి
అయ్యింది. రాష్ట్రంలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో
ఈ చట్టం అత్యంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత రాజ్యాంగంలోని
ఆర్టికల్ 298 సంబంధిత రాష్ట్రాలకు ప్రభుత్వ అవసరాల కొరకు భూసేకరణ
ద్వారా భూమిని కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. దీనికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 123,
190, 191
ఉత్తర్వులను అనుసరించి డిసెంబర్ 18, 2016న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి 2013 నాటి కేంద్ర చట్టాన్ని మార్చింది. తద్వారా కొన్ని
రాజకీయ పార్టీలు వ్యక్తపరిచిన అనుమానాలకు తెరదించడం జరిగింది. మల్లన్నసాగర్
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూసేకరణ అంశాన్ని కొందరు దురుద్దేశంతో రాజకీయం చేయడంతో, చట్టంలో మార్పులు తీసుకురావాలన్న
ఆలోచన కలిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 75శాతం మంది రైతులు తమ భూములను
స్వచ్ఛంధంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మిగిలినవారి విషయంలో రాజకీయాలు
చోటుచేసుకోవాదం మొదలైంది. ప్రాజెక్టు నిలిపి వేయడానికీ కుటిల ప్రయత్నాలు
జరిగాయి. పితలాటకాలు సృష్టించడం కూడా
జరిగింది. ఈ నేపథ్యంలో ఇదొక సవాలుగా తీసుకున్న ప్రభుత్వం చట్టం తప్పనిసరిగా తేవడం
జరిగింది.
ఉద్యోగ అవకాశాల రూపకల్పన: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
కల్పించడం అన్నది ప్రభుత్వం ముందున్న మరో ముఖ్య సవాలు. అందరికీ ఉద్యోగాలివ్వడం
అనేది సాధ్యపడే విషయం కాకపోయినప్పటికీ, ఆ దిశగా మెండుగా-మెరుగైన అవకాశాలు కల్పించే క్రమంలో
తనవంతు క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర, పబ్లిక్ సెక్టార్ రంగాల్లో విరివిగా
అవకాశాలు కలిగించడం ద్వారా నిరుద్యోగ
యువతలో కొత్త ఆశలను చిగురింపజేసింది. కొత్తగా లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడంలో
సఫలీకృతమవడంతోపాటుగా వివిధ స్థాయిలో వారి నియామకాలు చేపట్టడం కూడా జరుగుతోంది.
వినూత్న రీతిలో గొర్రెల పంపిణీ పథకం: రాష్ట్రంలో రానున్న మూడేళ్ల
కాలంలో యాదవులకు, కురుమలకు మూడేళ్ళలో 25 వేల కోట్ల సంపద సమకూర్చాలనే
లక్ష్యంతో ముందుకుపోతూ, దీన్ని ఒక సవాలుగా తీసుకుని, వినూత్న రీతిలో సబ్సిడీ రూపేణా
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా
పశుసంపద ఆర్థిక వ్యవస్థను, సంప్రదాయ వృత్తులను పటిష్ట పరచడం జరిగి, యాదవ, కురుమ కులాల వారిని దేశంలోనే
ఆర్థికంగా అత్యంత ధనవంతులను చేయడానికి సంకల్పించడం జరిగింది. ఈ పథకం ద్వారా
రాష్ట్రంలోని ప్రతి యాదవ, కురుమ కుటుంబానికి
20 గొర్రెలను, ఒక పొటేలును ఇస్తారు. తద్వారా
రెండేళ్లలో రు. 10 వేల కోట్లతో ప్రతి గొల్ల, కురుమ కుటుంబానికి 150 లక్షల గొర్రెలను చేరువ చేయడం
లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఆరోగ్యం: సమగ్రంగా ప్రజారోగ్యాన్ని
పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
చేపట్టడంతోపాటుగా, ప్రస్తుత సౌలభ్యాలను మెరుగుపరచి, ప్రజారోగ్య వసతులను విస్తృతస్థాయిలో
పెంపొందించడానికి ఉపక్రమించింది. ఇటువంటి చర్యలు గతంలో ఎన్నడూ చేపట్టడం జరగలేదు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు అన్నిస్థాయిల్లో
వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ, విస్తృతస్థాయిలో మెరుగైన వ్యవస్థను, సేవలను అందించడంలో ప్రజల నమ్మకాన్ని
పరిపూర్ణంగా చూరగొంది. నూతన పరికరాలను, పునర్ వినియోగ పరచలేని పరికరాలను పంపిణీ చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్
సెంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించదానికి కార్యాచరణ
రూపొందించడం జరిగింది. ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా ప్రతి వ్యక్తి ‘హెల్త్ ప్రొఫైల్’
రూపకల్పనకు పూనుకుంది.
గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ కిట్లు: మరో ప్రతిష్టాత్మక సవాల్ గర్భిణీ
స్త్రీలకోరకు రూపకల్పన చేసిన కెసిఆర్ కిట్లు. జీవనోపాధి కొరకు, గర్భిణీ స్త్రీలు నెలలు
నిండుతున్నా ఎదో ఒక పనిచేయడానికి వెళ్లి ఆరోగ్యాన్ని కాపాడుకోలేక పోవడం బాధాకరమైన
విషయం. ఇది, అటు గర్భిణీ స్త్రీకి, గర్భస్థ శిసువుకూ ప్రమాదకరం. ఈ
నేపథ్యంలో మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ కిట్ల పథకానికి శ్రీకారం చుట్టింది.
గర్భిణులు పనులకు వెళ్లకుండా వుంటే, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తలచి, వారికి మూడు విడతల్లో విడతకు రు.
4000 చొప్పున 12 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకవేళ ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు చెల్లించడానికీ కూడానిర్ణయించింది.
అలాగే, కెసిఆర్ కిట్లలో తల్లీబిడ్డలకు ఉపయోగ పడేలా 16 రకాల వస్తువులు అందజేయడం
జరుగుతుంది.
భూ రికార్డుల సవరణ – ప్రక్షాళన : ప్రభుత్వం మరో ముఖ్యమైన సవాలును
స్వీకరించి, మరో చారిత్రిక ఘట్టానికి తెరతీసింది. భూ రికార్డులను
సమగ్ర ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు
తీసుకుంది. 83 ఏళ్ల క్రితం 1936లో నిజాం పాలనా కాలంలో చివరిసారిగా
భూసర్వే చేపట్టారు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని,
10,800
గ్రామాల్లో సంపూర్ణ భూ రికార్డుల ప్రక్షాళన, సవరణ, నవీకరణ చేపట్టింది. తొలివిడతలో 58
లక్షల రైతులకు సంబంధించి 1 కోటి 42 లక్షల ఎకరాల వ్యవసాయభూమి ప్రక్షాళనకు నోచుకుంది.
రైతుబందు పథకం కింద వీరందరికీ పట్టాదారు పాసుపుస్తాకాలతో పాటు ఎకరానికి ఒక్కోపంటకు
రు 8000 ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత ఎకరాకు రు. 4000 మె నెల 10 వ తేదీనుండి
ఇవ్వడం జరిగింది. దీనికి అదనంగా ధరణి వెబ్ సైట్ ద్వారా నూతన రిజిస్ట్రేషన్
విధానానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతమున్న 141 రిజిస్ట్రేషన్
కార్యాలకు అదనంగా ప్రతి మండలంలో ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ అధికారిగా మొత్తం 443
మండలాలలో (మొత్తం 584 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు) రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగించడం
జరిగింది. ఇదొక విప్లవాత్మకమైన మార్పు.
రైతు సమన్వయ సమితుల ద్వారా వ్యవసాయరంగ
పునరుజ్జీవనం: తెలంగాణ
ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కువమంది ప్రజలు జీవనోపాధికి, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలను ఎంచుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కావడంతో, రాష్ట్ర
ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని వ్యవసాయరంగాన్ని పునరుద్ధరించడానికి, నడుం బిగించి వ్యవసాయాన్ని
లాభసాటిగా చేపట్టడానికి సమగ్రమైన ప్రణాళికలను తయారుచేసింది. రైతులను సమాయత్త పరచడం క్లిష్టమైన పనే
అయినప్పటికీ ఈ సవాలును అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ప్రభుత్వం
విజయవంతమైంది. ఇందుకోసం ప్రధానంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులను
ఏర్పాటు చేసింది. ప్రతి అంశంలో సమన్వయ సమితుల తోడ్పాటుతో విత్తనాల పంపిణీ మొదలు, పంటకు గిట్టుబాటు ధర అందే వరకు
సహకారం అందించేలా అనుసంధానించడం జరిగింది. సమితిలోని సభ్యులు, అటు రైతులకు, ఇటు అధికారులకు మధ్య వారధిగా ఉంటూ
క్రాప్ కాలనీల ఏర్పాటులో, కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో, సరైన సమయంలో విత్తనాలను పంపిణీ
చేయడంలో ఎరువుల పంపిణీలో, దిగుబడి ధర నిర్ధారణలో, మద్దతు ధర నిర్ధారణలో, అధికారులతో సంప్రదింపులు జరపడంలో
సంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ చర్యలు వ్యవసాయరంగ అభివృద్ధికి దోహదపడే
విధంగా రైతు సమన్వయ సమితి సభ్యులు వ్యవహరిస్తూ ఉంటారు.
No comments:
Post a Comment