Monday, May 28, 2018

నాలుగేళ్ల నవనవ్య పాలన-2...సంక్షేమంతో బాటు వృద్ధి : వనం జ్వాలా నరసింహారావు


నాలుగేళ్ల నవనవ్య పాలన-2...సంక్షేమంతో బాటు వృద్ధి
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (29-05-2018)

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కేసీఆర్, ఆయన సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం “ఒకటి వెంట మరొకటి” అనేలా పెనుసవాళ్లను ఎదుర్కొని, ఒక్కొక్కదాన్నే అధిగమించుకుంటూ అభివృద్ధిపథాన దూసుకుపోతుంది. వాటిల్లో కొన్ని చెప్పుకోవాలంటే: తెలంగాణ బడ్జెట్ రూపురేఖలు, స్వరూప స్వభావాలు, ఆదాయ వనరుల సమీకరణ విషయంలో కొరవైన అవగాహన; వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చేసిన ఎన్నికల వాగ్దానం ఎలా అమలు చేయాలన్న ఆందోళన; ఫీజు రీ-ఇంబర్స్మెంట్ ఎలా చేయాలన్న ఆలోచన; కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యాబోధన ప్రవేశపెట్టే అంశంపై కసరత్తు; ఒక ప్రాధాన్యతా అంశంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైనింగ్; కోతల్లేని విద్యుత్ సరఫరా; పేదవారికి ఇళ్ళ నిర్మాణం; ఉద్యోగ-ఉపాధి కల్పన; ఏక గవాక్ష పారిశ్రామిక విధానం ఎలా తేవాలి; హైదరాబాద్  బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే అంశం; భారీ ఎత్తున చెట్ల పెంపకం; మన ఊరు-మన ప్రణాళిక; దళితులకు భూమి పంపకం.....ఇలా ఎన్నెన్నో పథకాలు, కార్యక్రమాలు ఎలా రూపొందించాలి, అమలు చేయాలి, అనే సవాళ్లు ఎదుర్కొంది ప్రభుత్వం. జూన్ 2, 2014 న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, ఆ తరహాలో మున్నెన్నడూ లేదన్న భావనతోనూ, దీన్ని పూర్తిగా ఒక కొత్త రాష్ట్రంగా చూడాలన్న ఉద్దేశంతోనూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి-సంక్షేమానికి ఒక చారిత్రకమైన ఆరంభం జరగాలన్న పట్టుదలతో-నిబద్ధతతో అభివృద్ధికి బీజాలు వేయడం ఒక పెద్ద సవాల్.

ఈ నేపధ్యంలో, అతి తక్కువ సమయంలో, రాష్ట్రం ఏర్పాటైన కొన్నాళ్లకే, నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి వారసత్వంగా లభించిన, అస్త-వ్యస్త ఆర్ధిక పరిస్థితి-దుస్థితి నుండి వృద్ధి దిశగా, ప్రజలే కేంద్ర బిందువుగా, సంక్షేమమే ధ్యేయంగా పయనించే పాలనకు శ్రీకారం చుట్టడం జరిగింది.  “సమానత్వానికీ-సమధర్మానికీ వ్యతిరేకంగా వృద్ధి” అనే ధోరణిలో రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఆలోచనతో కాకుండా, వృద్దీ, సమానత్వం అనే రెండూ కూడా సామరస్యంగా-కలిసికట్టుగా జరగాలనే దృక్ఫదంతో పాలన జరుగుతోంది. అణగారిన, అట్టడుగు, బీద-పేద, దళిత, గిరిజన, వెనుకబడిన, అసహాయ వర్గాలను పట్టించుకోకుందా, వారి సంక్షేమానికి పథకాలు రూపకల్పన చేసి అమలు చేయకుండా, కేవలం వృద్ధి సాధించుకుంటూ పోతే దానికి అర్థం లేదనీ, అది న్యాయ సమ్మతం కాదనీ, అందుకే ఆ దిశగానే సంక్షేమ కార్యక్రమాలు అమలుకావాలనీ సీఎం త్రికరణశుద్ధిగా నమ్మారు. సంఘటిత అభివృద్ధి అంటే కేవలం లబ్దిదారులకు ఆర్థికపరమైన లాభాలు-అవకాశాలు చేకూర్చడమే కాకుండా, వారికి సాధికారత కలిగిస్తూ, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనె లక్ష్యంతో పనిచేస్తున్నదీ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ, చేపట్టి అమలు పరుస్తున్న అనేకానేక పథకాలు ఈ లక్ష్య సాధన దిశగానే వున్నాయి. ఇలా చేయడాన్ని ఒక సవాలుగా తీసుకున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.


పథకాల రూపకల్పన-అమలుకు చొరవ: రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్నీ ఒక సవాలుగా తీసుకున్న సీఎం, ఆయన సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలుపరుస్తున్న పథకాలు కొన్న చెప్పుకోవాలంటే: మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వున్న గొలుసుకట్టు చెరువుల పునర్నవీకరణ-పునరుద్ధరణ; ప్రతి గ్రామానికీ, పట్టణానికీ, ఇంటింటికి పరిశుభ్రమైన నల్లా నీరు సరఫరా చేసే మిషన్ భగీరథ; ఉచితంగా పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించడం; మహిళల రక్షణకు షి-బృందాల ఏర్పాటు; ఆసరా పించన్లు ఇవ్వడం ద్వారా సాంఘిక భద్రత సమకూర్చడం; కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుకు ఆర్ధిక సహాయం; భారతదేశంలోనే అతిపెద్ద పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమమైన తెలంగాణాకు హరితహారం; సాగునీటి ప్రాజెక్టుల పునఃరూపరచన, త్వరితగతిన పూర్తయ్యే విధంగా పథకం; రైతులకు అందుబాటులోకి సోలార్ విద్యుత్; వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు పథకం; గొర్రెల పంపకానికి సబ్సిడీ పథకం; సరికొత్త ఏకగవాక్ష పారిశ్రామిక విధానం, వ్యాపార సరలీకరణకు చర్యలు...ఇలా ఎన్నో వున్నాయి. పాలనలో రోజులు, నెలలు గడుస్తున్నాకొద్దీ, అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ, వాటిని అధిగమిస్తూ, ఆ బాటలో మరిన్ని సంక్షేమ-అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేస్తూ, అమలుపరుస్తూ, తెలంగాణా సమాజంలోని అన్ని వర్గాలవారింకి లబ్దిచేకూరుస్తున్నదీ ప్రభుత్వం.

2014-15 & 2015-16 బడ్జెట్లు...: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరానికి, అంటే, 2014-2015 కు, బడ్జెట్ రూపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి రకమైన “క్లూ” లభించలేదు. అదో పెద్ద సవాల్ ప్రభుత్వానికి. రాష్ట్ర ఆదాయ వనరుల విషయంలో కానీ, వ్యయానికి సంబంధించి కానీ, ఏ మాత్రం అంచనా ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల కల్పనకు దర్పణం పట్టే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు వుండాలి కానీ, కేవలం ఆదాయ-వ్యయ లెక్కల పట్టికగా ఉండరాదని ప్రభుత్వ ఉన్నత అధికారులకు స్పష్టం చేసారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రంగాలలో ధర్మమైన, సమధర్మ-న్యాయ సమ్మతమైన  అభివృద్ధిని చేకూర్చి, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేయడం నాటి ప్రభుత్వం ముందున్న సవాల్. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, వికేంద్రీకరణ నమూనా అభివృద్ధికి పీటవేసి, “మన వూరు-మన ప్రణాళిక” కార్యక్రమం ద్వారా, గ్రామీణ స్థాయిలో అట్టడుగు వర్గాల ప్రజల అవసరాలెలా వుంటాయో అనే విషయంలో సూచనలు-సలహాలు రాబట్టింది.

అదనంగా, దేశంలో-ప్రపంచంలో ఎక్కడా అంతవరకు జరగని రీతిలో, ఆగస్ట్ 19, 2014 న, ఒకే ఒక్క రోజున రాష్ట్రవ్యాప్తంగా “సమగ్ర కుటుంబ సర్వే” చేపట్టి పూర్తి చేసింది. దీనికి ఒక రికార్డు స్థాయిలో దేశవ్యాప్త మన్ననలు, ప్రసంశలు వచ్చాయి. బడ్జెట్ తయారీకొరకు, ఒక్కో రంగంలో ప్రాదాన్యతాంశాలను గుర్తించడానికి, వనరుల సమీకరణకు అవలంభించాల్సిన విధానాల రూపకల్పనకూ, సూచనలు-సలహాలు ఇచ్చేందుకు 14 టాస్క్ బృందాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వీటన్నింటి నేపద్యంలో, టాస్క్ బృందాల సిఫార్సుల మేరకు, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ను నవంబర్ 5, 2015 న రాష్ట్ర శాసనసభకు సమర్పించడం జరిగింది. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ విధంగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సరిగ్గా లేకుండానే, గతంకంటే పూర్తి భిన్నంగా, అందుబాటులో వున్నా అంశాల ఆధారంగా, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. 2014-15 బడ్జెట్ వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు మాత్రమే. అంటే, ఈ ఏడాది 12 నెలల ఆదాయ-వ్యవ వివరాల అంచనాలు పూర్తిస్థాయిలో లేని నేపధ్యంలో ఆ తరువాతి సంవత్సరం అంటే 2015-16 బడ్జెట్ తయారుచేయాల్సి వచ్చింది.

2015-20 మధ్యన ఐదేళ్ళ కాలానికి 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచినప్పటికీ, ఆ లాభం తెలంగాణాకు చేకూరలేదు. దీనికి కారణం జాతీయ సగటు పర్ కాపిటా ఆదాయంకంటే తెలంగాణా పర్ కాపిటా సగటు ఆదాయం ఎక్కువగా వుండడమే! పర్ కాపిటా ఆదాయానికి సంబంధించి జిల్లాలకు-జిల్లాలకు మధ్యనున్న భారీ వ్యత్యాసాలు కూడా రాష్ట్ర పర్ కాపిటా సగటు ఆదాయంలో భాగమే. కేంద్ర పన్నుల్లోనుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గినప్పటికీ (2014-15 లో వాటాగా ఇచ్చిన 2.893 శాతం నుంచి 2015-20 మధ్య ఐదేళ్ళ కాలంలో 2.437 శాతానికి తగ్గుదల) రాష్ట్రం విత్త సంబంధమైన ప్రమాణాలను పటిష్టంగా నిలబెట్టుకోగలటమే కాకుండా, అదనంగా జీఎస్డీపీ మీద 0.5% ఎఫ్ఆర్బీఎం పొందగలిగి, అప్పుతెచ్చుకోగల సామర్థ్యం సంపాదించుకోగలిగింది.

No comments:

Post a Comment