Saturday, May 26, 2018

4 ఏళ్ల నవనవ్య పాలన – 1 : వనం జ్వాలా నరసింహారావు


4 ఏళ్ల నవనవ్య పాలన – 1
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (27-05-2018)

అన్యాయానికి, వివక్షతకు, భేదభావానికి వ్యతిరేకంగా దశాబ్దకాలంపాటు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. దేశంలోని 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రమైన తెలంగాణ జూన్ 2, 2014 న ఏర్పాటైంది. తమ భవిష్యత్ ను తామే తీర్చిదిద్దుకుంటామని, తమ అస్తిత్వాన్ని తామే నిరూపించుకుంటామనీ, నినదిస్తూ, నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలపాటు చేసిన అలుపెరుగని పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటుకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా అనేక రకాల అన్యాయానికి, ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో గురైందనేది నగ్న సత్యం. తీవ్రమైన విద్యుత్ సంక్షోభం, అప్రకటిత-ప్రకటిత విద్యుత్ కోతలు, ఫలితంగా పరిశ్రమలు మూసివేయాల్సిన దుస్థితి, సాగునీటి సౌకర్యం కొరవడంతో కరవుపీడిత తెలంగాణాలో వ్యవసాయం తీవ్రమైన ఇబ్బందికి లోనుకావడం,  ఆ కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడం, తెలంగాణా ప్రాంతంలోని దాదాపు అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించడం లాంటి దుష్పరిణామాలు ఉమ్మడి రాష్ట్రం నుండి వారసత్వ సంపదగా రాష్ట్రానికి సంక్రమించాయి. అదనంగా, కొందరు స్వార్థప్రయోజనాభిలాశాపరులు, నిరాశావాదులు అసత్యాలను, వదంతులను ప్రచారం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైతే వారికి పరిపాలన చేతకాదనీ, తెలంగాణాలో నివసిస్తున్న పోరుగురాష్ట్రం వారిని అక్కడినుండి తరిమేస్తారానీ, ఇక్కడున్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయనీ అబద్ధాలు అదేపనిగా చెప్పారు. కొత్త రాష్ట్రం అన్నిరంగాల్లో విఫలమవుతుందని అంచనా వేశారు. వీటికితోడు, రాష్ట్ర ఆర్ధిక వనరుల విషయంలో కొంత అనిశ్చిత స్థితి, అఖిలభారత సర్వీసు అధికారుల కొరత, రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఒక సవాలుగా మారింది. 

రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి అప్పటి వరకు అణచబడిన ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడమెలా అనేది రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో ప్రభుత్వానికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకూ ఎదురైన పెను సవాల్. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పునఃసృష్టించు కోవాలనే విషయంలోనూ, ఎలా పునఃనవీన పర్చుకోవాలనే విషయంలోనూ, అవలంభించాల్సిన పంథాకు సరైన ప్రణాళిక రూపొందించుకోవడమనేది కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొన్న మరో భారీ సవాల్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే చేయాల్సింది ఎంతో వుందని సీఎం భావించారు. ఎలాంటి పట్టుదలతో, ఉత్సాహంతో, ఆతురతతో, దృఢసంకల్పంతో రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, అదే మోతాదులో రాష్ట్రాభివృద్ధి జరగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అప్పటికే దశాబ్దాల తరబడి అనేక వ్యధలపాలైన తెలంగాణ ప్రజలు ఇంకెంత మాత్రం ఏ విషయంలోనూ ఇబ్బందులకు లోనుకాకూడదని ముఖ్యమంత్రి భావించి దాన్నొక సవాల్ గా స్వీకరించారు.

బహుముఖ వ్యూహం: తెలంగాణాను పునఃసృష్టించుకోవడానికీ, పునఃనవీన పర్చుకోవడానికీ, పునఃనిర్మించుకోవడానికి, కేసీఆర్ అవలంభించిన బహుముఖ వ్యూహంలో భాగంగా, రాష్ట్ర ఏర్పాటుకు-అభివృద్ధికి మధ్యనున్న సంధికాలంలో, తన ప్రభుత్వాదికారాన్ని, తన పలుకుబడిని, తన పట్టుదలను రాష్ట్ర రూపాంతరీకరణకు, మార్పుకు తనదైన శైలిలో అన్నివిధాలుగా అనుకూలంగా మలచుకున్నారు. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో అప్పుడున్న పరిస్థితులు, ఎలావున్నాయంటే....

·       ప్రజల ఆకాంక్షలు, ఆశలు ప్రబలంగా పెద్దమొత్తంలో అందనంత ఎత్తులో వున్నాయి.
·       నాలుగు రోడ్ల కూడలిలా సంధికాలంలో వున్న రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా నాయకత్వం మార్పు దిశగా ఎదురయ్యే సవాళ్ళను అధిగమించాల్సిన పరిస్థితులు.
·       అస్పష్టంగా, అందుబాటులో లేని తరహాలో వున్న మౌలికమైన గణాంక వివరాలు, సమాచారం.
·       ఒక సరైన బ్లూ ప్రింట్ కానీ, గతంలో మరెక్కడైనా ఇలాంటి పరిస్థితుల్లో రూపొందించబడిన నమూనా కానీ అందుబాటులో లేకపోవడం.
·       ప్రతిదీ కొత్తగా మొదలెట్టి, నూతనంగా ఆవిర్భవించిన యువ రాష్ట్రానికి ఒక దీర్ఘకాలిక ప్రయోజనకారైన రోడ్ మాప్ రూపొందించుకోవాల్సిన అవసరం.
·       ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతానికి చెందిన వనరులను పూర్తిగా మళ్ళించుకుపోయి, నిర్లక్ష్యానికి గురిచేసిన నేపధ్యంలో వివిధ విధాలుగా నెలకొన్న అసమనాతలను సరి చేయాల్సిన అవసరం.
·       ప్రాదాన్యతాంశాలను, ప్రాధాన్యతలను గుర్తించి వాటిమీద కేంద్రీకరించడం.
·       తీవ్రమైన విద్యుత్ సంక్షోభం-కొరత...అప్రకటిత-ప్రకటిత విద్యుత్ కోతలు 
·       తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమల అవసరాల నీటికీ కటకట, అస్పష్టత.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమ సమయంలో, పెల్లుబికిన ఉత్సాహం ఒక క్రమ పద్ధతిలో రాష్ట్ర అభివృద్ధికి, పునర్నిర్మాణానికి అనువుగా మలచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక నిర్దుష్ట కాలపరిమితిలో సుపరిపాలనకు కావాల్సిన  ప్రణాళికలను రూపకల్పనచేయడం, మేధావీకరణ చేయడం, ప్రారంభించడం, సమీకరించడం, వరుసక్రమంలో మద్దతివ్వడం, అమలుచేయడం కూడా అవసరమైంది. ఇవన్నీ చేయడానికి ఆలోచనలలోనూ, కార్యదక్షత లోనూ, మార్పుతేగల, నైపుణ్యంకల, నిబద్ధతగల, నాయకత్వ లక్షణాలున్న ఆదర్శ అధికారగణం  కావాల్సివచ్చింది. బంగారు తెలంగాణా సాధనే ధ్యేయంగా, లక్ష్యంగా, ప్రజల ఆశయాలు-అవసరాలు-ఆకాంక్షలు ప్రతిబింబించేలా, ఒకదానితో మరొకదానికి సంబంధముండే తరహాలో అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేసే సామర్థ్యం కల దూరదృష్టి అవసరం కూడా ఏర్పడింది. తదనుగుణంగానే, రాష్ట్రం ఏర్పాటైన తొలినాటి నుండే, ఒక క్రమపద్ధతిలో, నిబద్ధతతో, నిర్దుష్ట కాలపరిమితిలో అమలయ్యే రీతిలో ఎన్నో అభివృద్ధి, సంక్షేప పథకాల రూపకల్పన, అమలు జయప్రదంగా జరుక్కుంటూ వస్తున్నది.


         తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు భాగ్యవంతులుగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా జీవనం సాగించే బంగారు తెలంగాణాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కోరుకుంటున్నారు. ఆయన ఊహల్లో బంగారు తెలంగాణా అంటే అదే! బంగారు తెలంగాణా అంటే కేవలం ఒక ప్రకటనో లేక కాగితం మీద చిన్నపాటి వివరణో లేదా మనోగతమే కాకుండా, ఉమ్మడిరాష్ట్రంలో అణచివేతకు గురై, వెలుగులోకి రానివ్వకుండా అడ్డుకున్న తెలంగాణ శక్తి-సామర్థ్యాలను, అపారమైన వనరులను వాస్తవం చేయడం, వెలుగులోకి తేవడం, పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం జరగాలి. రాష్ట్రం ఏర్పాటైన అచిరకాలంలోనే ఈ లక్ష్యసాధన దిశగా గణనీయమైన అభివృద్ధి సాధించింది. చిన్నాభిన్నమైన ఆర్ధిక వ్యవస్థ గాడినపడవేయడమే కాకుండా గణనీయమైన వృద్ధి రేటుకు చేరుకుంది. పేలవమైన పాలన నుండి పటిష్టమైన, ప్రజలే కేంద్రబిందువుగా వుండే పాలన దిశగా అడుగులేసింది. కేవలం శంఖుస్తాపనలకే పరిమితమైన ప్రాజెక్టులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తికావడం, వాటి ఫలాలను ప్రజలందుకోవడం జరుగుతున్నది. 

తెలంగాణాను పునఃసృష్టించుకోవడం, పునఃనవీన పర్చుకోవడం, పునఃనిర్మించుకోవడం: పునఃసృష్టించుకోవడం, పునఃనవీన పర్చుకోవడం, పునఃనిర్మించుకోవడం అంటే, ఒక విప్లవాత్మకమైన, సవాళ్లతో కూడుకున్న, ఆచరణయోగ్యమైన నూతన పంథాలో, మార్పు సాధించడమే. దీనర్థం, నూతనంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని ప్రజల అవసరాలకనుగుణంగా రూపుదిద్దడానికి ఒక సరికొత్త విజన్-దూరదృష్టి కలిగి వుండడమే. తెలంగాణా విషయంలో రాష్ట్రాభివృద్ధికి ఒక దశ-దిశ నిర్దేశించడమే. సహజ, మానవ, ఆర్ధిక, భౌతిక వనరులను సమీకరించుకుని, వాటి సక్రమ ఉపయోగానికి నిబద్ధతతో విజన్ రూపొందించుకోవాలి.

ఉన్నది కొంచెమైనా చేసింది చాలా ఎక్కువే: రాష్ట్రం ఏర్పాటైన రోజుల్లో పాలనా బాధ్యతలు నిర్వహించడానికి ప్రభుత్వానికి అందుబాటులో వున్న అఖిలభారత సర్వీసు అధికారుల సంఖ్య అతితక్కువ. ఉన్నవారితోనే పనిచేయించుకుంటూ, పాలనను ముందుకు తీసుకెళ్లడం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న పెద్ద సవాలప్పట్లో. అలాగే, తీవ్ర విద్యుత్ సంక్షోభంతో, విద్యుత్ కోతలతో సతమయ్యే రాష్ట్రాన్ని, 24 గంటల ఉచిత విద్యుత్ ను వ్యవసాయరంగానికి సరఫరా చేసే దిశగా తీసుకెళ్లడం ఆషామాషీ విషయం కాదు. రైతు దగ్గరనుండి వ్యవసాయ శిస్తు వసూలుచేసే పరిస్థితి నుండి, వ్యవసాయానికి ఎకరాకు రు. 8000 పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రవేశపెట్టడం ఒక అద్భుతమైన చర్య అనాలి. అసంఘిటిత వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో సంఘటితం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేయడం పెద్ద సవాలు. యాదవులకు, కురుమలకు సబ్సిడీ మీద గొర్రెల పంపకం, బెస్తలకు, ఇతర మత్స్యకారులకు చేపల పంపకం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే!

1 comment:

  1. You are eulogizing kcr for obvious reasons. Disappointing to see that you don't even mention fleetingly about the governmen's failures or shortcomings. No doubt kcr and ktr are good leaders and doing a good job .Even so totally one sided article from a senior journalist is disappointing. Do you really support formation of so many unnecessary districts. Did kcr anytime regret the vitriolic language he used against Andhra.

    ReplyDelete