Saturday, May 12, 2018

కాళిదాసు గొప్ప వాడు కావడానికి రామాయణమే కారణం.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-8: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-8
కాళిదాసు గొప్ప వాడు కావడానికి రామాయణమే కారణం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (13-05-2018)
వాల్మీకి రామాయణంలో, సాధారణంగా, సర్గ మొదట్లో- చివర్లో, మొదలు చెప్పిన కథనే సంగ్రహంగా తిరిగి చెప్పడం జరిగింది. ఇది కాకుండా, యజ్ఞాలు-శకునాల లాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు, వర్ణించిన విషయాన్నే మరల వర్ణించాల్సి వస్తే, పూర్వోక్త శ్లోకాలనే మళ్లీ చెప్పడం జరిగింది. వీటినే పునరుక్తులు అనవచ్చు. ఇలాంటిది ఆ కవి కవితా విశేషమే గాని మరొకటి కాదు. రావణుడు రాముడిని గురించి అనుకున్న శ్లోక పాదంలో, రాముడు తనను అదే విషయం గురించి అనుకున్న శ్లోకంలో ".. .. మానుషం మన్యే రామం దశరథాత్మజం" అన్న పదాలుంటాయి. "విదితం", "ఆత్మానం" అన్న పదాలు మారతాయి. రావణుడు మనుష్యుడి చేతిలో చావడం విధి. కాబట్టి తన విరోధి (రాముడు) మనిషి అని అనుకోకుండా భగవంతుడని నమ్మితే చావు రాదు. ఇక సమర్థుడైన నర్తకుడు తాను ధరిస్తున్న పాత్రను ఉచిత రీతిగా నటించడానికి, తన్ను-తాను మరిచినట్లు, మనుష్య వేషం వేసి నటిస్తున్న రాముడు చేయాల్సిన పనిమీదున్న ఆసక్తితో తనను తాను మరిచి పోయాడు. ఉభయుల అభిప్రాయం ఒకటే కావడంతో రాముడి చేతిలో రావణుడు చచ్చాడు-రాముడు రావణుడిని చంపగలిగాడు. ఇలాంటివే ఒకే తరహాలో వున్న, సుగ్రీవుడు రాముడితో-లక్ష్మణుడితో చెప్పిన వాక్యాలు.

కొన ఊపిరితో వున్న జటాయువుని, శ్రీరాముడు సీతాదేవి వార్తను అడుగుతుండగానే అతడు ప్రాణాలను విడిచాడు. ఇలాంటి సందర్భంలో ఎవరికైనా, బతికుంటే ఏం చెప్పేవాడో కదా అనిపిస్తుంది. ఇలాంటిది నివారించేందుకు, సంపాతి అంగదాదులతో, రావణుడి వృత్తాంతాన్ని చెప్పే సందర్భాన్ని ఎంచుకున్నాడు వాల్మీకి. అక్కడా-ఇక్కడా ఉమ్మడి వాక్యాలున్నాయి. అర్థం మారింది. జటాయువు చెప్పని రావణుడి వూరు-పేరు ఇక్కడ సంపాతితో చెప్పించాడు కవి. వాల్మీకి మహర్షి "కవితౌత్కృష్ట్యానికి" వేరే దృష్టాంతం అవసరమా? శ్రీరాముడు శరభంగుడితోను, సుతీక్ష్ణుడితోను ".. నీ వనమున వాసయోగ్య మగు పట్టెది చెప్పుము" అని భగవంతుడిలా పలికి, వెంటనే మనుష్య భావంతో మాట్లాడే చమత్కారం వాల్మీకి రామాయణం ప్రత్యేకత. ఇలాంటివెన్నో వున్నాయిందులో. చదివే పాఠకులు, ఈ అద్భుత విశేషాలను స్వయంగా ఆస్వాదించవచ్చు.

శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. వాళ్లు రామాయణాన్ని ఎన్ని సార్లు చదివారో గాని, వారి కవితా వల్లి "వాల్మీకి వాక్సుధాసేచనం" లో జీవించి, వృద్ధి పొందిందనడం నిర్వివాదం. శ్రీ విశిష్టాద్వైతం మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది పర్యాయాలు గురు ముఖంగా రామాయణాన్ని పఠించి వ్యాఖ్య రాశారు. ఒక్కసారి కూడా గ్రంథమంతా చదవకుండా, సంస్కృత భాష తెలియకపోయినా, "పూర్వ పక్షం" రాసేవారెందరో వున్నారు ! వారెలాంటి ప్రాజ్ఞులో కదా !


"ఒక్క ఏరునో-నదినో చూసిన మాత్రాన అదెంత గొప్పగా వుందో అనుకుంటాం. అలానే కాళిదాసు లాంటి వారిని గొప్ప కవులంటాం. అలాంటప్పుడు అన్ని నదులకు ఆధారమైన సముద్రాన్ని ఏమనాలి? అలానే, కాళిదాసాదులకు జీవనదమైన రామాయణాన్ని ఏమని వర్ణించాలి? మన మతంలో వున్న ఏదో ఒక సుగుణాన్ని గ్రహించి, దాన్నే విస్తరించి చెప్పుతూ, అన్య మతాలు ప్రసిద్ధికెక్కినట్లే, ఉపమా విషయం, కాళిదాసుని వలె ఇతర కవుల ఇతర గుణాలను ఒక్కొక్కదానిని ఇందుండి గ్రహించి, దానిని తమ చిన్న కావ్యాలలో విశేషంగా చొప్పించి ప్రసిద్ధులయ్యారు". ఆర్య మతంలా, వాల్మీకి రామాయణం గొప్పదై, పామరులకు ఇందులోని అన్ని విషయాలను అర్థం చేసుకోవడం దుస్సాధ్యం కావడంతో, పిల్ల మతాల లాగా ఇతర గ్రంథాలు ప్రసిద్ధికెక్కాయి. మహర్షైన-మహా యోగైన వాల్మీకెక్కడ? ఇప్పటి (అప్పటి) కవులెక్కడ?

కాళిదాసు రచనలోని "అస్మాన్ సాధు విచిం త్యేత్యాది" శ్లోకాలలోని విశేషాలను, వాల్మీకి రామాయణం "అహం వేద్మి మహాత్మానం...., ఇయం సీతా మమ సుతా...." (ఏ నెరుంగుదు రాజేంద్ర !......, ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి, దీనినిం గైకొనుమా....") శ్లోకాలలోని, ప్రతి పద సారస్యాన్ని నిశితంగా పరిశీలించితే, కాళిదాసు వాల్మీకి శిష్యుడని తెలియడమే కాకుండా, గురు శిష్యుల తారతమ్యం స్పష్టంగా బయట పడుతుంది. కాళిదాసు "విక్రమోర్వశీయం" నాలుగో అంకం శ్లోకంలోని ఒక్క పదం తప్ప మిగతా దంతా, వాల్మీకి రామాయణంలో ఇంతకుముందు రాసిందే. ఇరువురి శ్లోకాలలోని ఉమ్మడి వాక్యాలిలా వున్నాయి: "... .... క్షితిభృతాంనాథ ! దృష్టా సర్వాంగసుందరీ రామా! రమ్యవనోద్దేశే, మయా విరహితా త్వయా". "కచ్చిత్" కు బదులుగా "సర్వక్షితి" అన్న ఒక్క పదాన్ని చొప్పించాడు కాళిదాసు. ఇలా వాల్మీకి రామాయణం నుంచి కాళిదాసు లాంటి వారు గ్రహించినవి ఎన్నో వున్నాయి. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా లేంది, వేరేవారి సంగతి చెప్పాలా !

ఎవరికైనా సత్కవి కావాలని కోరికుంటే, వారు వాల్మీకి రామాయణాన్ని అనేక పర్యాయాలు, శ్రద్ధగా-భక్తితో పఠించాల్సిందే.

No comments:

Post a Comment