Thursday, May 31, 2018

చిమ్మ చీకటి నుంచి వెలుగులోకి....నాలుగేళ్ల నవనవ్య పాలన-4 : వనం జ్వాలానరసింహారావు


చిమ్మ చీకటి నుంచి వెలుగులోకి....నాలుగేళ్ల నవనవ్య పాలన-4
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (31-05-2018)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం, కేసీఆర్ సీఎం గా ఆధ్యతలు స్వీకరించన తరువాత ప్రభుత్వం ఎదుర్కొన్న ముఖ్యమైన సవాల్, విద్యుత్ కొరతలతో, విద్యుత్ కోతలతో సతమవుతున్న రాష్ట్రాన్ని ఎలా కోతలు లేని రాష్ట్రంగా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనేది. కేసీఆర్ ఎంతో విజయవంతంగా ఈ సమస్యను అధిగమించడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరచడమే కాకుండా ఎలా ఇది సాధ్యమైందని అందరూ ఆరా తీస్తున్నారు.  ఇప్పుడు కోటల్లేని కరెంటును నిరంతరాయంగా వ్యవసాయానికి సహితం అమ్దచేస్తున్నది ప్రభుత్వం. ఇలా చేయడం వల్ల రాష్ట్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. పరిశ్రమలు, పెట్టుబదులు పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. రైతులు ఇక ఏమాత్రం విద్యుత్ సంక్షోభానికి గురికాకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పారిశ్రామిక కార్మికులకు అదనంగా పనిచేసే అవకాసం, తద్వారా అదనంగా ఉపాదిపోమ్డే వెసలుబాటు కలిగింది. కొత్త-కొత్త విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు నెలకొల్పడం జరుగుతున్నది. అదనంగా, సౌర ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలోకి వచ్చింది. భవిష్యత్ లో తెలంగాణ మిగులు విద్యుత్ ఉత్పాదక రాష్ట్రంగా రూపుదిద్దుకోనుంది.

కోటి ఎకరాల సాగుకు అవసరమైన సామర్థ్యం సమకూరుస్తున్న వైనం: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పునః డిజైన్, రీ ఇంజనీరింగ్ మరో పెను సవాల్. ఆ సవాలును సమర్థవంతంగా స్వీకరించి, డిజైన్లు పూర్తీ చేసి, వేగవంతంగా నిర్మాణం చేయడం మామూలు విషయం కాదు. సాలీనా 25,000 కోట్ల రూపాయల నిధులను సాగునీటి రంగానికి బడ్జెట్లో కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరందించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. వేలాదిమంది కార్మికులు చెమటోడ్చి, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. శ్రీరామసాగర్ పునర్వ్యవస్థీకరణ పనులు, భక్తరామదాసు ప్రాజెక్ట్ పనులు పూర్తవుతున్నాయి. భక్తరామదాసు ఎత్తిపోతలపథకం ప్రారంభం కూడా అయింది. కోటి ఎకరాలు సాగులోకి రావడం ఆనతి దూరంలోనే వుంది.

ఆజన్మాంతం అందరికీ సంక్షేమ పథకాలు: దుర్బల, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కొరకు పథకాల రూపకల్పన చేయడం ఒక సవాలుగా తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. తదనుగుణంగా అనేకానేక పథకాలకు రూపకల్పన చేసి, విజయవంతంగా అమలుచేస్తున్నదీ ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రధమ-అగ్ర స్థానంలో ఉన్నదీ రాష్ట్రం. అందరికీ అన్నిరకాల అవకాశాలు కలిగించడం, సమతుల్యంలో సంపద పంపిణీ చేయడం, కనీస అవసరాలకు కూడా ఏ ఆధారం లేనివారి విషయంలో బాధ్యతాయుతంగా వుండడం అనేది సంక్షేమ రాష్ట్రం ఆలోచనా విధానంగా వుండాలి.  సామాన్యుల జీవన స్థితిగతులను, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర సారధ్యంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. మనిషి పుట్టుకనుంచి, చనిపోయేదాకా రక-రకాల సంక్షేమ పథకాలున్నాయి. ఈ పథకాలలో చాలావరకు దేశంలో ఎన్నడూ-ఏనాడూ-ఎవరూ-ఎక్కడా అమలు చేయలేదు. దేశానికి చాలా పథకాలు ఆదర్శంగా నిలిచాయి. గర్బిణీ మహిళలకు అంటే మనిషి ఇంకా పుట్టాక ముందు నుంచి, ఆ తర్వాత బిడ్డ పుట్టాక, పెరుగుతున్నప్పుడు విద్యకొరకు, యుక్తవయసులో ఉపాధి కల్పన, వివాహానికి కల్యానలక్ష్మి-షాదీ ముబారక్...ఇలా ప్రతి స్థాయిలో ఏదో ఒక పథకం అమల్లో వుంది. సుమారు 35 సంక్షేమ పథకాలు ఏటా 40000 కోట్ల రోపాయల వ్యయంతో అమలవుతున్నాయి. సంక్షేమ లబ్దికి ఆదాయ పరిమితి కూడా గ్రామీణ ప్రాంతాలలో రు. 60,000 నుండి రు. 1,50,000 కు, పట్టణ ప్రాంతాలలో రు. 75,000 నుండి రు. 2,00,000 కు పెంచింది ప్రభుత్వం.


మంచినీటి సరఫరా: మిషన్ భగీరథ పేరుతో, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరా చేయడాన్ని ఒక పెద్ద సవాలుగా తీసుకుని పూర్తి చేసిందీ ప్రభుత్వం. రాష్ట్రానికి గర్వకారణం, దేశానికి ఆదర్శమైన ఈ బృహత్తర పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాలలోని ఆవాసాలన్నింటికీ తాగునీరు లభ్యమవుతుంది.

చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ పునరుజ్జీవనం: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలుగెత్తి చేసిన నినాదం, నీళ్ళు, నిధులు, నియామకాలు. పురాతన చిన్న తరహా నీటి పారుదల వ్యవస్థ మొత్తం ఉమ్మడిరాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ వ్యవస్థను పునరుజ్జేవింప చేయడాన్ని ప్రభుత్వం పెద్ద సవాలుగా తీసుకుంది. అనేకమైన గొలుసుకట్టు చెరువులు సంవత్సరాల తరబడి పూడికలు తీసివేనందువల్ల నీతినిలువ సామర్థ్యం దెబ్బతింది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన చెరువుల పునరుజ్జీవనాన్ని సవాలుగా తీసుకున్న ప్రభుత్వం, “మిషన్ కాకతీయ” పేరుతో, అంచెలవారీగా 46531 చెరువులను బాగుచేయడానికి పథకం వేసుకుని మూడోభాగం చెరువులకు పైగా బాగుచేయడం జరిగింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారందరికీ రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణ పథకం: వుండడానికి ఇల్లు లేని పేదవారందరికీ శాశ్వత గృహవసతి కలిగించే ఇళ్ళ పథకం దశాబ్దాలుగా పేరుకు అమల్లో వుంది. ఇదే నిజమైతే, వాస్తవంగా అందరికీ చెప్పినట్లు ఇల్లే ఇచ్చి వుంటే, ఇల్లంటూ లేని కుటుంబమే వుండేది కాదు. అలాంటప్పుడు బీదలకు కొత్తగా ఇల్లు కట్టి ఇచ్చే అవసరం కూడా రాకూడదు. క్షేత్రస్థాయి వాస్తవాలు మరోరకంగా వున్నాయి. ఇళ్ళ నిర్మాణం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితమయ్యాయి. ఇల్లు కట్టకుండానే, లబ్దిదారుడికి ఇవ్వకుండానే, కట్టినట్లు, ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది. బీదవారందరికీ, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలవారికీ, ఇల్లు కట్టించి ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా తయారైంది. పేదల దుస్థితి చూసి, వారుండే అరకొర వసతుల ఆవాసాలు చూసి, వాళ్ళ ఆత్మగౌరవం ఇనుమడించేలా, వాళ్ళందరికీ రెండు పడక గదుల ఇళ్ళను (రెండు గదులు, ఒక హాల్, ఒక వంట ఇల్లు, రెండు టాయిలెట్లు) అర్హత వున్నా ప్రతివారికీ ఉచితంగా కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అంచెలంచలుగా నిర్మించి ఉచితంగా ఇవ్వనున్న ఈ ఇళ్ళకు లబ్దిదారుల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కార్యక్రమం తెలంగాణాలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు.

గ్రామజ్యోతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుసమగ్ర గ్రామీణాభివృద్ధి దిశగా "గ్రామ జ్యోతిఅనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి, దాన్నొక సవాలుగా స్వీకరించి, విజయవంతంగా అమలుపర్చారుతాండాలతో సహా సుమారు పదివేల గ్రామాల సామాజిక అభివృద్ధి ధ్యేయంగా రూపకల్పన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగాప్రాధమిక దశలోగ్రామానికి చెందిన ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగాఆరోగ్యకరంగా వుంచేందుకు కృషి జరిగిందిదీని కొరకు ఒక్కో గ్రామానికి ఒక కోటి రూపాయల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు నిధులు అందుబాటులో వుంచింది ప్రభుత్వంజనాభా ప్రాతిపదికనఆ నిష్పత్తిలో ఒక్కో గ్రామానికి నిధుల కేటాయింపులు జరిగాయి. “మనగ్రామ ప్రణాళిక మనదే, మన గ్రామ పారిశుద్ధ్యం మన బాధ్యతే” అన్న నినాదం గ్రామజ్యోతిలో భాగం. ఆ కార్యక్రమ రూపకల్పన, అమలు ఒక పెద్ద సవాలు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రతినిధులతో సహా ఎన్నికైన ప్రజాప్రతినిదులందరినీ, కలెక్టర్, నుండి జిల్లా స్థాయిలోని చివరి అధికారి వరకూ గ్రామజ్యోతి కార్యక్రమంలో మార్పు కారకులుగా-ప్రేరకులుగా భాగస్వామ్యులను చేయడం గొప్ప సవాల్.

కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఉచిత నిర్బంధ ఆదర్శ విద్యా విధానం: కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత-నిర్బంధ విద్యా విధానాన్ని ఒక ఆదర్సవంతంగా ప్రవేసపెట్టి, అమలు చేయడం ప్రభుత్వం ఎదుర్కున్న మరో పెద్ద సవాల్. దీన్ని దీటుగా అధిగమించి, అందులో భాగంగా, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అల్పసంఖ్యాక వర్గాల వారికి, ప్రత్యేకించి బాలికలకు వందల సంఖ్యలో గురుకులాలను నెలకొల్పి ఉచితంగా విద్యనందిస్తున్నదీ ప్రభుత్వం. ఈ పాఠశాలల్లో విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతుంది. విద్యార్థులకు ఉచితంగా ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం, పుస్తకాలు, దుస్తులు, ఆటవస్తువులు ఇవ్వడంతో పాటు, వారి సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్ లో ఈ గురుకులాల ద్వారా ఒక అసాదారణ వ్యక్తులు తయారై దేశాభివృద్ధికి పాటుపడనున్నారు. ఈ విద్యావ్యవస్థల ద్వారా రూపుదిద్దుకోనున్న మానవవనరులు దేశానికి, యావత్ ప్రపంచానికి ఆదర్శంగా వుండబోతున్నారు. ఇంతకంటే గొప్ప సవాల్ ఇంకేముంటుంది? ఈ తెలంగాణా నమూనాను దేశంలోని ఎవరైనా సులభంగా అనుకరించవచ్చు.

జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ : కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేయడం ఒక పెద్ద సవాలే అయినప్పటికీ సునాయాసంగా, సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రక్రియను సుసాధ్యం చేయడంలో సఫలీకృతమయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఎంత  చారిత్రాత్మకమో, అదనంగా కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేయగలగడం కూడా అంతే చారిత్రాత్మకం. ఏకాభిప్రాయంతో 31 జిల్లాల సమాహారంగా తెలంగాణ నేడు తెలుగునాట భాసిల్లుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదనంగా మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పరిపాలనాపరమైన సంస్కరణలకు ప్రభుత్వం నాంది పలికింది. ఈ యావత్ ప్రక్రియలో, ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రాతిపదికలను, నియమాలను తు.చ. తప్పక ప్రభుత్వం పాటించింది. ఈ పునర్వ్యవస్థీకరణ క్రమంలో యువ ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా పాలనా పగ్గాలను చేపట్టడానికి అవకాశం లబించింది.

No comments:

Post a Comment