Thursday, May 31, 2018

పెళ్ళికి ముందు-తరువాత అనూహ్య పరిణామాలు.... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
పెళ్ళికి ముందు-తరువాత అనూహ్య పరిణామాలు
వనం జ్వాలా నరసింహారావు
         మా పెళ్లి అయ్యేనాటికి నా వయసు ఇరవై సంవత్సరాల ఎనిమిదినెలలైతే, కాబోయే శ్రీమతి వయసు పదిహేను సంవత్సరాల ఐదు నెలలు మాత్రమే. అది బాల్య వివాహమా-కాదా అనే సంగతి అటుంచితే, అసలు-సిసలు పెద్దలు కుదిరించిన వివాహమని తప్పకుండా అనాలి. పెళ్ళైన కొన్నాళ్లకే నాగ్ పూర్ లో ఎంఏ చదువుకు పోయాను. 1969 జులై నెలలో అక్కడికి వెళ్ళిన తరువాత ఒకటి-రెండు సార్లు ఖమ్మం వచ్చినా తెలియని ఒక విషయం, మా ఆవిడ కూడా చెప్పలేకపోయిన ఒక విషయం మా బావమరది, అప్పటికింకా వరంగల్ లో ఎమ్బీబీఎస్ చదువుతున్న (డాక్టర్) మనోహర్ రావు నాకు రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. అది మా శ్రీమతి ఆరోగ్యం విషయం కావడాన ఉత్తరం అతి జాగ్రత్తగా, నేను మరోలా భావించకుండా వుండే తరహాలో రాశాడా ఉత్తరం. వివరాల్లోకి పోతే.....

         1968 డిసెంబర్ నెలలో, అప్పటికింకా కేవలం పదిహేనేళ్ల వయసే వున్నప్పుడు, ఇంకా పెళ్లి సన్నాహాలు మొదలు కానప్పుడు, కాబోయే మా శ్రీమతికి (విజయలక్ష్మి) సుస్తీ చేసింది. పొట్ట ఎడమ భాగాన విపరీతమైన నొప్పి రావడంతో, స్థానిక ప్రభుత్వ వైద్యుడు, సర్జన్ డాక్టర్ రోశయ్యను సంప్రదించారు. ఎక్స్-రె తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఎడమ కిడ్నీలో రాయి (కిడ్నీ స్టోన్) వుందనీ, తక్షణమే వైద్యం మొదలెట్టాలనీ సలహా ఇచ్చారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా వున్న కారణాన, వరంగల్ మెడికల్ కాలేజీకి శలవులు ఉన్నందున, మనోహర్ రావు ఖమ్మంలోనే వుండేవాడు. వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చారు తనను. కిడ్నీ స్టోన్ వున్నదని ధృవ పరచడానికి ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ఐవీపీ (అప్పట్లో కిడ్నీ సంబంధిత వ్యాధి నిర్ధారణకు అదే సరైన వైద్య పరీక్ష) వైద్య పరీక్ష చేయించారు. కేవలం స్టోన్ మాత్రమే కాకుండా, ఎడమ కిడ్నీ సరిగ్గా పని చేయడం కూడా లేదని పరీక్షలో బయటపడ్డది. ఆపరేషన్ అవసరం వుందని కూడా అన్నారు.

ఆపరేషన్ కు భయపడి, ఒక నెలరోజులు మనోహర్, ఆయన అన్నయ్య డాక్టర్ రంగారావు క్లాస్మేట్ కాంతారావు (ఆయన కూడా సర్జనే) దగ్గర వైద్యం చేయించారు. తగ్గనందున, పెద్దగా ఫలితం లేనందున, ఇంకా నొప్పి వస్తుండడం వల్ల, విజయవాడలో ప్రముఖ హోమియోపతి వైద్యుడు సీతాపతి దగ్గరకు తీసుకుపోయారు. తాను బాబాయిగారింట్లో (తుర్లపాటి హనుమంతరావు) వుంది. చికిత్స చేయించుకుంది. చికిత్స మాటేమో కాని, అక్కడున్నప్పుడే ఆమె మేనమామ భండారు శ్రీనివాసరావు (నా క్లాస్మేట్), కజిన్ సాయిబాబు (తుర్లపాటి సాంబశివరావు), శ్రీనివాసరావుకు కాబోయే భార్య నిర్మల తదితరులతో సరదాగా కాలక్షేపం చేశానని మా శ్రీమతి ఇప్పటికీ అంటుంది. హోమియోపతి కూడా సరిగ్గా పనిచేయలేదు. నొప్పి అంతగా తగ్గలేదు.

ఇదిలావుండగా పెళ్లి వ్యవహారం మొదలైంది. ఇరుపక్షాల పెళ్లి పెద్దలు మా ఇద్దరికీ పెళ్లి కుదిరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెళ్లి చూపులకని మా కాబోయే మామగారు అయితరాజు రాంరావు గారు కూతురును ఖమ్మం తీసుకుపోవడానికి విజయవాడ వచ్చారు. ఖమ్మం వచ్చిన మర్నాటి ఉదయమే (ఫిబ్రవరి 28, 1969 న) పెళ్లి చూపుల తతంగం, ఆ సాయింత్రానికల్లా ఇరు పక్షాలు పెళ్ళికి అంగీకారం తెలపడం చక-చకా జరిగిపోయాయి. ఆ తరువాత మాటా-మంతీ కూడా అయిపోయాయి. ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగానే తనకు మళ్లీ తీవ్రంగా నొప్పి రావడం, అనుకోకుండా ఖమ్మంలో మనోహర్ వుండడం, ఆమెను వెంటనే వరంగల్ తీసుకెళ్లాలని నిర్ణయించడం, అందరూ వెళ్ళడం జరిగింది. మనోహర్ టీచర్, ప్రముఖ సర్జన్ డాక్టర్ కేఆర్ ప్రసాద్ రావు తనను పరీక్షించి వెంటనే ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం మార్చ్ 15, 1968 న ఆపరేషన్ చేశారు డాక్టర్ ప్రసాద్ రావు గారు. అప్పట్లో అది మేజర్ ఆపరేషన్. కిడ్నీ పనిచేసే అవకాశం ఇంకా ఉన్నందున, కిడ్నీ స్టోన్స్ తీసేసి, పది-పన్నెండు రోజులు ఆసుపత్రిలో వుంచి డిశ్చార్జ్ చేసారు. 28 మార్చ్ కల్లా అంతా ఖమ్మం వచ్చేశారు. ఈ విషయాలేవీ నాకు కాని, మా వాళ్ల దృష్టికి కాని రాలేదు.   


ఇంతలో మా నాన్నగారి దగ్గరనుండి మా కాబోయే మామగారికి కబురొచ్చింది. వాళ్ళిద్దరూ అరేయ్-తురీ అనుకునేంత చనువుంది. ఇద్దరూ స్కూల్ క్లాస్మేట్స్. మార్చ్ 30 న లగ్న నిశ్చయం చేసుకోవాలని మా నాన్నగారి కబురు సారాంశం. ఆపరేషన్ సంగతి చెప్పాల్నా-వద్దా అనేది నిర్ణయించుకోవడం కష్టమైంది. ఎంతైనా ఆడ పిల్ల వాళ్ళు కదా! మొత్తం మీద విషయం అప్పటికి బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం లేదని భావించారు. ఇద్దరి ఇళ్లు ఒకే వీధిలో వున్నాయి కాబట్టి, ఎలాగూ తెలుస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు. ఏప్రియల్ 30, 1969 న మా వివాహం అయింది. కిడ్నీ సంబంధమైన ఆపరేషన్ జరిగి అప్పటికి నెలరోజులన్నా కాకపోయినా, పెళ్లిలో కాని, తదనంతర వివాహ సంబరాలలో కాని ఏ మాత్రం అలసట లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగింది మా శ్రీమతి. ఎవరికీ ఏ అనుమానం రాలేదు. సందేహానికి తావే లేదు. అయితే కథ ఇంతటితో అయిపోతే బాగుండేది. అలా జరగలేదు. ఆమెకు మరొక ఆపరేషన్ జరగాలని భగవంతుడు రాసిపెట్టి వుంటాడు. అదే జరిగింది.

ఇంతకు ముందే రాసినట్లు, మనోహర్ దగ్గరనుండి ఉత్తరం రావడానికి కారణం వుంది. మా పెళ్లయిన ఎనిమిది నెలలకు, ఆపరేషన్ తదనంతర వైద్య పరీక్షలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్ళారు మా శ్రీమతిని. దురదృష్టం...వైద్య పరీక్షల్లో తేలింది...ఆమె కిడ్నీ పనిచేయడం లేదని.... పనిచేయని కిడ్నీ అలాగే వుంచితే మరో కిడ్నీకి ప్రమాదమనీ. తర్జన-భర్జనలు జరిగాయి. ఆపరేషన్ తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఈ విషయాన్ని (అప్పటికి నాకింకా ఆమెకు కిడ్నీ స్టోన్ తీసేసిన విషయం కూడా తెలియదు) నాకెలా తెలియచేయాలో అని చర్చించుకున్నారు. అదే రోజుల్లో మా మామగారికి జాండిస్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. నాకు ఒక “టచింగ్” ఉత్తరం రాసాడు మనోహర్. విషయమంతా తెలియచేసి నిర్ణయం నాకొదిలేశారు. కిడ్నీ తీసేయించడమనే నిర్ణయం అంత తేలిగ్గా తీసుకునేది కాదని అందరూ అనుకున్నారు. నేను ఉత్తరం అందిన వెంటనే హైదరాబాద్ కు వచ్చాను హుటా-హుటిన. ఈ లోపున ఇంగ్లాండులో వున్న మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు దగ్గరనుండి మరో ఉత్తరం. చెల్లెలి కిడ్నీ తీయకుండా ఏదైనా మార్గం వుంటే, అది ఆచరణలో పెట్టడానికి, ఎంత ఖర్చైనా సరే, ప్రపంచంలో ఎక్కడికైనా సరే, తాను తీసుకెళ్ళి చికిత్స చేయిస్తానని ఉత్తరంలో పేర్కొన్నాడు. మొత్తం మీద మరోసారి ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో డాక్టర్ జీపీ రామయ్య సారధ్యంలో మళ్లీ ఐవీపీ పరీక్ష చేసి, కిడ్నీ తీయక తప్పదని నిర్ధారించుకోవడం జరిగింది. నేను మా నాన్న గారికి విషయమంతా వివరించాను. మేమందరం ఆపరేషన్ కే మొగ్గు చూపాం. ఇక్కడో విషయం చెప్పాలి. డాక్టర్ జీపీ రామయ్య మాకు ధైర్యం చెప్తూ తనకు ఒక కిడ్నీలో సగం మాత్రమే పని చేస్తుందనీ, ఒక కిడ్నీ వున్న వాళ్లకు ఏ ఇబ్బందీ వుండదనీ, రెండు కిడ్నీల పని ఒకటే చేస్తుందనీ అన్నారు.

హైదరాబాద్ నుండి మళ్లీ వరంగల్ పోయాం. జనవరి 10, 1970 న ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్ ప్రసాద్ రావు గారు తనకు ఆపరేషన్ చేసి పనిచేయని కిడ్నీ తొలగించారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆసుపత్రిలో వున్న తనను చూడడానికి మా అమ్మా-నాన్న వచ్చిపోయారు. ఆ తరువాత ఆమెను డిశ్చార్జ్ చేసి ఖమ్మం పంపారు. నేను ఒక వారం-పది రోజులుండి నాగ్ పూర్ వెళ్లాను. కథ సుఖాంతం.

ఆపరేషన్ అయ్యి ఇప్పటికి సుమారు ఏబై ఏళ్ళు కావస్తున్నది. భగవంతుడి దయవల్ల ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క కిడ్నీ వున్నవాళ్ళు రెండు కిడ్నీలు ఉన్నవాళ్ళ లాగే ఏ సమస్య లేకుండా జీవించవచ్చనడానికి మా శ్రీమతి ఒక ఉదాహరణ. ఆ తరువాత ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అన్నీ నార్మల్ డెలివరీలే. ఆనాటి నుండి ఈనాటి వరకూ, అందరిలాగే నార్మల్ జీవితం గడుపుతోంది. తనకసలు ఒక కిడ్నీ లేదన్న ఆలోచనే రాదు. గృహ సంబంధమైన ఎంత కష్టమైన పనైనా రెండు కిడ్నీలున్న వాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా చేస్తుంది.

మనల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ భగవంతుడున్నాడు, ఉంటాడు అనడానికి ఇంతకంటే ఏ ఉదాహరణ కావాలి?                       

1 comment: