Sunday, May 6, 2018

శ్రీరాముడి విరహ బాధ, స్వవిషయం సీతకు చెప్పిన హనుమ ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి విరహ బాధ, స్వవిషయం సీతకు చెప్పిన హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (07-05-2018)

మొదట రాముడి అవయవ సౌందర్యం, ఆ తర్వాత సొమ్ముల విషయం చెప్పిన హనుమంతుడు, నగలు చూసినప్పుడు, రాముడి ప్రవర్తన ఎలా వుందో వివరించి చెప్పాడు ఈ విధంగా:

"ఆభరణాలను చూసిన రాముడు, వాటిని తిరిగి సుగ్రీవుడికిచ్చాడు. నీ ఎడబాటుతో, నీమగడు, ఎల్లప్పుడు లోలోన కుములుతుంటే, అగ్నిని కలిగిన అగ్నిపర్వతంలాగా కనిపించాడు. లోపలున్నది నాకెట్లా తెలుసంటే....తెలుసు. శోకంలో మునిగి వున్నప్పుడు, నిద్రాభంగం కలిగి, చింతిస్తూ, దుఃఖిస్తున్న రామచంద్రమూర్తి, అగ్నులతో తపిస్తున్న అగ్నిహోత్రంలాగా వున్నాడమ్మా సీతమ్మా! నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణుల ఇళ్లల్లో, అగ్నిని సంరక్షించేందుకు, ప్రత్యేకంగా ఓ గది వుంటుంది. ఆ గదిలో, అగ్ని ఆరకుండా వుండడం వల్ల, గదెప్పుడూ సెగలు కక్కుతుంటుంది. అలానే నీ మగడు విరహాగ్నితో నిండి వుండడం వల్ల, శరీరమంతా పెనం కాలినట్లు కాలుతుండేది".

"నిన్ను చూడలేకపోతినేనన్న తాపంతో, సుఖాన్నెంత మాత్రం ఎరుగడు. తాపమూ వీడడు. నీవియోగాగ్ని దహిస్తుంటే, భూకంప వేగానికి వణికే కొండలాగా వణకుతున్నాడు. నీ ఎడబాటు కారణాన, రమ్యమైన పూపొదలెన్ని కనపడినా సంతోషించడు. అందర్నీ ఆహ్లాద పరిచే అడవులూ, పారుతున్న సెలఏళ్లూ, నిన్నుచూడని కారణం వల్ల రాముడిని సంతోషపర్చ లేకపోతున్నాయి. రావణుడిని, వాడి కొడుకులను, స్నేహితులను, యుద్ధంలో చంపి, నీ భర్త, నిన్ను త్వరలోనే తీసుకెళ్తాడు. వాలిని చంపుతానని రాముడు, నిన్ను వెతికిన్చి నీవార్త తెప్పిస్తానని సుగ్రీవుడు ప్రమాణం చేసారు. సుగ్రీవుడితో కిష్కిందకు పోయి, వాలిని చంపి, సుగ్రీవుడిని రాజుగా చేసాడు రాముడు. ఇలావారిద్దరికీ స్నేహం కుదిరింది. నేను వారి దూతను, నిన్ను వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు రాజై, తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి, నిన్ను వెతికేందుకు వానరులను పది దిక్కులకు పంపాడు".

"వాలికొడుకు అంగదుడనేవాడు శూరాతి శూరుడు. యువరాజై ఇంట్లో వుండాల్సిన వాడు, సైన్యంలో మూడవ భాగాన్ని వెంటేసుకుని, స్వయంగా వెతుకుతున్నాడు. మేము వింధ్య పర్వత ప్రాంతంలో చాలారోజులు వెతికి, తోవతప్పడంవల్ల, ఇక్కడకు రావడం ఆలస్యమయింది. చెట్టూ, పుట్టా, గుట్టా, చేనూ, అన్నీ వెతికినా నీ జాడ తెలియలేదు. సుగ్రీవుడిచ్చిన నెలరోజుల గడువూ అయిపోయింది. నీ జాడ తెలియదని సుగ్రీవుడికి చెప్తే చంపుతాడని భయ పడ్డాము. భయపడి మేమందరం ప్రాణాలు విడుద్దామనుకున్నాం". 


"ఆసమయంలో అంగదుడు: నీవు అపహరించబడిన సంగతి, జటాయువు మరణం, వాలి వధ, నిన్ను వెతికేందుకు మేం తిరగడం, చివరకు దిక్కులేని చావు చావాల్సి రావడం, చెప్పుకుంటూ ఏడ్వసాగాడు. ఇదివిన్న జటాయువు సోదరుడు సంపాతి అనేవాడు మాదగ్గరకొచ్చాడు. కోపంతో, కళ్లెర్రచేసిన సంపాతి, తనతమ్ముడిని చంపిన వాడెవరని అడిగాడు. సీతనెత్తుకుపోయిన రావణుడు, జటాయువును చంపిన విషయాన్ని, సంపాతికి చెప్పాడు అంగదుడు. అంతావిన్న సంపాతి, దుఃఖిస్తూ, నువ్వు రావణుడి అంతఃపురంలో వున్న వార్త మాకు చెప్పాడు. వానరులందరం సంతోషించి, వింధ్య పర్వత శిఖరం వదిలి, సముద్రపు ఉత్తరపుటొడ్డుకు చేరాం. నిన్ను చూడాలని మాకెంత తొందరున్నా, సముద్ర దర్శనం వానరులకు భయం కలిగించిం. నేనప్పుడు ధైర్యం, సాహసం చేసి, నూరామడల సముద్రాన్ని దాటి, రావణుడి నగరం లంక ప్రవేశించి, రాత్రి సమయంలో రావణుడినీ, నిన్నూ చూశాను".

"సాధ్వీరత్నమా! వాస్తవం చెప్పాను. భయం లేకుండా, ధైర్యంగా నాతో మాట్లాడు. నన్ను నమ్ము. నాలో మాయలేదు. రామకార్యం చేసేందుకు నీ కొరకై వచ్చాను. వానర రాజు మంత్రిని, వాయుదేవుడి కొడుకును, సూర్యవంశం రాజు రామచంద్రమూర్తి దూతను. ఆయుధ ధారులలో శ్రేష్టుడైన రామచంద్రమూర్తి కులాసాగా వున్నాడు. లక్ష్మణుడు అన్నసేవలో సుఖంగా వున్నాడు. నీభర్త మేలుకోరి, సుగ్రీవుడి మాటప్రకారం, దక్షిణ దిక్కుగా వెతుక్కుంటూ వచ్చాం. నా పూర్వ పున్యంవల్ల, నిన్ను, నేను చూడగలిగాను. నిన్ను చూడలేకపోయామే అని, దుఃఖంతో భయపడ్తున్న వానర సమూహానికి, నీవు కనిపించిన వార్త చెప్పి, సంతోషం కలిగిస్తాను. నా సముద్రయానం సఫలమయింది. నా పుణ్యభాగ్యం వల్ల, హనుమంతుడొక్కడే సీతాదేవిని చూడగలిగాడన్న కీర్తిని సంపాదించాను. వీరుడగు రాముడు, పరివారంతో, మిత్రులతో, చుట్టాలతో వున్న రావణుడిని యుద్ధంలో చంపి, నిన్ను స్వీకరిస్తాడు".

(ఇది సుందరకాండ కద! ఆద్యంతాలూ సౌందర్యాన్ని నింపుకున్న కాండ ఇది. ఇంతవరకు జరిగిన కథ అంతా హనుమంతుడు సీతమ్మకు చెప్పాడు. ఏమి జరగబోతుందో త్రిజట తాను కన్నకలను వివరిస్తూ చెప్పింది. జరుగుతున్నదీ, జరిగినదీ సీతమ్మ చెప్పింది. భూత, భవిష్యత్, వర్తమానాలను ధ్వనింప చేస్తున్న ఈ నాటకీకరణం నిజంగా సౌందర్యోపేతం! )

ఇంతవరకు తాను రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన హనుమంతుడు, తన జన్మ వృత్తాంతాన్ని చెప్పుతాడు సీతాదేవితో, ఇలా:

"మాల్యవంతమనే పెద్ద పర్వతముంది. అక్కడ నాతండ్రి కేసరి అనే వానర రాజున్నాడు. దేవ ఋషుల ఆజ్ఞానుసారం, గోకర్ణమనే పర్వతానికి పోయి, శంభసాధనుడనే దైత్యుడిని చంపాడొకసారి. ఇట్లా మాతండ్రి కాలం నుండే, రాక్షసులకు, మాకూ విరోధముంది. ఆయన భార్యకు, వాయుదేవుడికీ, నేను జన్మించాను. నా స్వశక్తితో, స్వకార్యంతో, హనుమంతుడన్న పేరు తెచ్చుకున్నాను. నీ నమ్మకం కొరకు నీ భర్త గుణ-గణాలన్నీ చెప్పాను".

(సీతమ్మ హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే అడిగింది. దానితోపాటు తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడు చెప్పాడు. అడగనిదే చెప్పడం దేనికి? అని అనిపించవచ్చు. కానీ హనుమంతుడు ఆంజనేయుడు కదా! అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యర్థంగా ఏదీ మాట్లాడడు. అసలు కారణమేమిటంటే, తాను రామదూతను అనీ, సామాన్యమైన సగటు వాడిని కాదనీ, సమర్ధుడననీ సీతమ్మను నమ్మించ చేయడం. నమ్మదగిన వాడినీ, విశ్వాసపాత్రుడినీ అని సీతమ్మకు రూఢి చేయాలని భావించడం! తనను ఈ మహాకష్టం నున్చి తప్పించగలవాడని, రాముడిని రప్పించి తనను ఆయనతో కూర్చగల సమర్ధుడనీ విశ్వాసాన్ని పాదుకొల్పటానికే తన వైనం చెప్పాడు. రామాయణం ధ్వని కావ్యం. అంతరాంతరాలలో దాగి వున్న పరమార్థాలను వాల్మీకి-ఆంధ్రవాల్మీకి ఎంతో సులభంగా, సుందరంగా మనకు అందించారు, మన అదృష్టం వల్ల!)

ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత హనుమంతుడు, శ్రీరామచంద్రమూర్తి దూతన్న విషయం నమ్మింది సీతాదేవి. కళ్లనుండి సంతోషంతో ఆనందభాష్పాలు ప్రవహించాయి. రాహువు పట్టి విడిచిన చంద్రుడిలాగా ప్రకాశించింది ఆమె ముఖారవిందం. సీతాదేవి తనమాటలు నమ్మడంతో ఆనందించిన హనుమంతుడు, తాను తిరిగి ఆమె కుశలవార్తను రాముడికి తెలపాల్సి వుందన్నాడు. సీతకేమి సహాయం కావాలో చెప్పమనీ, చేస్తాననీ అంటాడు. ఊరడిల్లమని కోరతాడు. తను వాయుపుత్రుడైనందున, వేగాతిశయంలోనూ, బలంలోనూ, తండ్రికి సమానమైన వాడినంటాడు. తాను ఓ సామాన్యమైన వానరుడననీ, ఏంచేయలేడనీ, సందేహించవద్దని చెప్పాడు.

(రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన తర్వాత, ఆమె నమ్మిందని నిర్ణయానికి వచ్చిన తర్వాత, తనజన్మ వృత్తాంతాన్ని, తనను గురించిన విషయాల్నీ కూడా వివరించి చెప్తాడు హనుమంతుడు సీతాదేవికి. ఇలా చెప్పడంలో కూడ ఎంతో అర్ధం వుంది. స్నేహం చేయడానికి, కలసిమెలసి వుండడానికి, కులహీనుడితో, ఆచారహీనుడితో, సదాశ్రయం లేనివాడితో కుదరదు కాబట్టి, తనవిషయం చెప్పుకున్నాడు. కులం, గుణం, ఊరు, నిజమైన పేరు దాచేవాడు, ఆచార్యుడిగా పనికిరాడు. శిష్యుడు కూడా గురువు వంశాదులను, పుట్టుపూర్వోత్తరాలను విచారించాలని కూడా దీని భావన."ఆచార్య కృత్యం" కూడా హనుమంతుడి మాటల్లో వ్యక్తమౌతుంది. శిష్యుడికి భగవంతుడి విషయమంతా వివరంగా చెప్పి, భయపడొద్దనీ, భగవంతుడే స్వయంగా వచ్చి తీసుకుపొతాడనీ, ఆ సమయానికై వేచి వుండాలనీ అంటాడు. శిష్యుడు మాత్రం సదాచారం, భక్తి విశ్వాసాలు మానవద్దని కూడ ఆయన మాటల్లో స్ఫురిస్తుంది. గురు పరంపర కూడా చెప్తాడు. శిష్యులు కాదల్చుకున్న వారు ఆచార్యులమని వచ్చేవారిని, పరీక్షించు కోమని అర్థం కూడా వుంది).

No comments:

Post a Comment