Sunday, May 20, 2018

సీతాదేవికి ధైర్యోక్తులు చెప్పిన హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవికి ధైర్యోక్తులు చెప్పిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (21-05-2018)
ఇతరుల కుశలం గురించి ఆంజనేయుడిని ఇలా అడుగుతుంది సీతాదేవి: "కౌసల్య, సుమిత్ర, భరతుడు క్షేమంగా వున్నారా? వాళ్ల వార్తలేమన్నా తెలుస్తున్నాయా? అన్నపై ప్రేమున్న భరతుడు నన్ను కాపాడేందుకుకు తన వద్దనున్న యక్షౌహిణి సేనను పంపుతాడా? దంతాలు, గోళ్లు ఆయుధాలుగా వున్న వానరసేనతో సుగ్రీవుడు ఈ లంకలో ప్రవేశించగలడా? బలవంతుడైన లక్ష్మణుడు రాక్షసులందరినీ నానా విధాలైన అస్త్రవర్షం కురిపించి నరికేస్తాడా? దశకంఠుడు బందువులతో సహా, భయంకర బాణాల బారినపడి, దేహాలు చీలి నేలబడి మరణించడం నేను చూస్తానా? రామచంద్రమూర్తి నాకింత కష్టం కలిగిందని మధనపడ్తున్నాడా? నా దుఃఖాన్ని తీర్చేందుకు ఏక నిశ్చయంతో వున్నాడా? బంగారం లాంటి మెరుగుతో, పద్మాల వాసనలాంటి వాసనతో, అందంగా, నాకళ్లకు చంద్రబింబంలాగా కనిపించే రాముడి ముఖం, నా ఎడబాటువల్ల కలిగిన దైన్యంతో, నీళ్ళింకిన తామరలాగా వాడిపోలేదుకదా? చెప్పు."

"దయలేకుండా, అడవుల్లో పడిపొమ్మని చెప్పిన సవతితల్లి మాట ప్రకారం నడుచుకోవడం తన ధర్మమనుకున్న రాముడు, పట్టాభిషేకం చేసుకోమన్నప్పుడు ఎట్లా వున్నాడో, అడవులకు వెళ్లేటప్పుడుకూడా ఏకరూపంతో అట్లానే వున్నాడు. కోపం, భయం, వ్యధ, ఏవీ కనపడలేదు ఆయన ముఖంలో. అలాంటి రాముడు పద్దెనిమిదేళ్ళ పిల్లనైన నేను, కారడువుల్లో ముళ్లుగుచ్చుకుంటూ, కాలినడకన తిరుగుతుంటే, మనస్సులో జాలి అనేది లేనట్లుగా, ధీరత చూపిస్తుండే ధైర్యశాలి, ఇప్పుడు సీతపోతే, పోనిమ్మని ధైర్యం వదలకుండా వున్నాడుకదా! నిజం చెప్పు" అంటుంది.

"నాయనా! రామదూతా! రాముడు కఠిన చిత్తుడు, సీతను విడిచి సహించాడని నిష్టూరాలు ఆడుతున్నదేంటి ఈమె? ఆమె మాత్రం తక్కువైందా! ఆడదైనా, చిన్నదైనా, ఇంత ఆపదలో మునిగినా, ప్రాణాలు విడవకుండా, ధైర్యంతో వుందే! ఆమె ధైర్యం ముందర రాముడి ధైర్యం ఏపాటిదంటావా? నేను ప్రాణాలు నిల్పిన కారణం ఏమని చెప్పేది? నాహృదయేశ్వరుడైన శ్రీరాముడికి, నాపైనున్న ప్రేమకంటే ఎక్కువగాని, సమానంగాకాని, తల్లిమీద, తండ్రిమీద, ఆప్తులమీదా లేదు. ఇది నాకు తెలుసు. ఆ ధైర్యంతోనే, ఆయన వార్త తెలిసేవరకు, బొందిలో ప్రాణాలు నిలుపుకున్నాను. నాపైన అంత ప్రేమున్నవాడు, ఎట్లాగైనా ఇక్కడకు వస్తాడు. నేను ప్రాణం విడిచానని తెలిస్తే: ’అయ్యో, తనప్రేమ వ్యర్ధమయిందికదా! తను వచ్చి రక్షిస్తానన్న విశ్వాసం సీతకులేదాయనే! ఎంతటి దయాహీనురాలు?’ అని తపించేవాడు. నాపైన అంత ప్రేమున్నవాడికి, దుఃఖం కలిగించ కూడదు కదా! ఎన్నిబాధలు పడ్డా, అందుకనే ప్రాణం నిలుపుకున్నాను. ప్రాణం పైన తీపితో రక్షించు కోలేదు”.

(ఇప్పుడు దూతా! అని సంబోధిస్తుంది. కారణం: దూతతో చెప్పిన మాటలు, అతని స్వామితో చెప్పినట్లే. ఆ మాటలను అతడు రాముడికి చెప్పాలని కూడా అర్థముంది)

ఈ విధంగా గొప్పగా, తియ్యగా, నర్మగర్భితంగా మాటలు చెప్పిన సీతాదేవికి, రామభక్తుడు, రామపరతంత్రుడూ అయిన, హనుమంతుడు, రామగుణకీర్తన ఎలాచేస్తాడో వినదల్చి మౌనం వహించింది సీత. హనుమంతుడు కూడా ఆమె అభిప్రాయం తెలుసుకున్న వాడిలాగానే, ముకుళిత హస్తాలుంచి, భక్తితో సమాధానం ఇచ్చాడు. (దీనివలన రామభక్తుడు, సీతారాములిరువురిపైనా సమాన భక్తి, అసమాన పారతంత్ర్యం కలిగి వుండాలని తెల్సుకోవాలి. ముకుళితహస్తాలతో అంటే, పెద్దలతో మాట్లాడేటప్పుడు, సేవకులు చేతులు కట్టుకుని నిలబడాలని అర్ధం.) 

"తామర రేకుల్లాంటి దీర్ఘమైన కళ్లున్న నీవు, నీ నేత్ర సౌందర్యాన్నెప్పుడైనా చూసుకున్నావా? తేనెకు తనతీయదనం తెలియనట్లు, నీ సౌందర్య మహాత్మ్యం నీకు తెలియకపొయినా, నీ దృష్టి తనపై పడాలని రాముడే కోరుతున్నాడు. అలా అనుకోవడానికి కారణం నీవు కమలదళాయతాక్షివికావటమే. నీ దృష్టి గురించి ఆయనేమంటాడో తెలుసా? నీవు దగ్గరున్నా, దూరంగా వున్నా, కమలదళాయతాక్షివేనట. దగ్గరున్నప్పుడు, తామర రేకుల్లాగా చల్లబడి తాపం తీరుస్తావట. దూరంగా వున్నప్పుడు, చురకత్తిలాగా మనస్సును చీలుస్తావట. నిన్ను రమింపచేసేవాడేనమ్మా రాముడు! అట్టివాడు నీవిక్కడున్నావని తెలిస్తే రాకుండా వుంటాడా? ఆ సంగతి ఆయనకు ఇంతవరకూ తెలియదు. అందుకే, నిన్ను మరల స్వీకరించడంలో కొంత ఆలస్యమయింది. నేనెప్పుడు పోయి చెప్తానో, ఆ క్షణమే భల్లూక సేనాసమూహంతో బయలుదేరి వస్తాడు".


"నీవు కోతివికనుక సముద్రాన్ని దాటావు. రాముడెట్లా దాటుతాడంటావా? కఠినమైన, పదునైన, బాణాలు ప్రయోగించి, సముద్రాన్ని కట్టేసి, లంకలోని పాపపు రాక్షసులందరినీ చంపుతాడు. ఈ మధ్యలో యముడైనా, దేవతలైనా, దైత్యులైనా, అడ్డుతగిలితే వాళ్ల తలదిమ్ము వదిలిస్తాడు. నిర్దుష్ట పాతివ్రత్యమే అలంకారంగా వున్ననువ్వు నామాట నమ్ము. "

రామచంద్రమూర్తి చిక్కిపోలేదుకదా అని అడిగావు. సింహం బారిన పడ్డ ఏనుగులాగా, నీ ఎడబాటువల్ల కలిగిన తాపంతో బాధపడ్తూ, పూటపూటకు సంతోషం చెడి చిక్కిపోతున్న స్థితిలో వున్నాడాయన. నేను వుత్తుత్తి ఓదార్పు మాటలు చెప్పటానికి రాలేదిక్కడకు. మలయ,  మేరు,  వింధ్య, మంధర, దర్దుర పర్వతాల మీద, మేము తినే పళ్లు, వ్రేళ్లు, గడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. తామర రేకుల్లాంటి కళ్లు, గొప్ప కుండలాలు, ఎర్రనిపెదవుల నీ మగడి అందమైన ముఖాన్ని చంద్రుడిలాగా చూస్తావు త్వరలోనే. నేను చెప్తున్నది అసత్యమనుకుంటే, నువ్వే వచ్చి చూడు....ప్రసవణ పర్వత శిఖరమందున్న రామచంద్రుడిని".

"మాంసాన్ని తాకడు. తేనె అసలే ఆసించడు. సాయంకాలం మటుకు అడవిఫలాలను కొంచెం తింటాడు. రోజుకొక్కసారేకాని రెండోమారు తినడు. నీకూ రెండుపూటలా లేదు. కాకపోతే ఆయన యుద్ధం చేయాలికదా! నిరశన వ్రతం పూనితే యుద్ధం చేయలేడుకదా!"

"ఆయనకొరకే ప్రాణాలు నిలుపుకున్నానన్నావు. ఆయన తనప్రాణాలన్నీ నీమీద నిల్పి వుండడం వల్ల, ఈగలు, దోమలు, పురుగులు, పాములు, ఆయన వంటిమీద మంటలు పుట్టేటట్లు పాకినా ఆయనకు తెలిసేదికాదు. పరకాయ ప్రవేశం చేసిన యోగిలాగా వున్నాడు. నీకు కోపం వస్తున్నది కాని ఆయనకు ఆ స్వభావమేలేదు. నీవు ఆయన్ను నిష్టూరాలాడావు. నిన్నాయన ఒక్క మాటకూడా అనలేదు. ఆయన సమయమంతా సీతా-సీతా! అనడంలోనే సరిపోతున్నది.

(ఇది "మనస్సంగమం" అనే అవస్థ. ఇష్టమైన పదార్థం మీద తప్ప దేనిపైనా మనసు పోకుండడమే ఈ అవస్థ). నీకు నిద్ర రాలేదంటున్నావు. ఆ విషయంలో జ్ఞానమైనా వుంది. రాముడికి ఆ ఆలోచనేలేదు. నిద్రనేది ఒకటుందని కూడా ఆయనెరుగడు".

ఇలా హనుమంతుడు రామచంద్రమూర్తిని పొగడడంతో సీత సంతోషించింది. రాముడికెంత దుఃఖమున్నదో అంతే దుఃఖమున్న సీత, తనంత దుఃఖాన్ని రాముడుకూడా పడుతున్నాడుకదా అనుకుని, తన దుఃఖాన్ని వదిలి, హనుమంతుడితో మాట్లాడుతుంది. 

No comments:

Post a Comment