Tuesday, May 1, 2018

రాజ్యాంగ వ్యవస్థలకూ లక్ష్మణరేఖ : వనం జ్వాలా నరసింహారావు


రాజ్యాంగ వ్యవస్థలకూ లక్ష్మణరేఖ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (02-05-2018)

         తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ సభ్యుల సభ్యత్వం రద్దు చేసింది. వారు సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అలా రద్దు చేయడానికి వీల్లేదనీ, వారి సభ్యత్వం పునరుద్ధరించాలనీ దరిమిలా ఉమ్మడి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సింది శాసన సభా? కార్యనిర్వాహక వ్యవస్థ అయిన ప్రభుత్వమా? అనేది చర్చనీయాంశం. కోర్టు తీర్పు సభాపతి కాని, శాసనసభ కార్యదర్శి కాని అమలు చేయకపోతే అమలు చేయించాల్సిన బాధ్యత ఎవరిదనేది కూడా చర్చనీయాంశమే! ఇంతకూ, శాసనసభ తనకున్న న్యాయాధికార పరిధిలో ఒక తీర్పు ఇచ్చిన తరువాత దానిని కాదనే అధికారం రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాలకు వుందా? లేదా? అనేది కూడా చర్చనీయాంశమే. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన కార్యనిర్వాహక, న్యాయ, చట్ట సభల వ్యవస్థలు కొన్ని అదుపులు-అన్వయాలకు లోబడి పనిచేయాలి. ఒకదానిపై మరొక దానికి ఆధిక్యత కాని, ఆధిపత్యం కాని, పెత్తనం కానీ వుండకూడదనేది మన రాజ్యంగ మౌలిక సూత్రం. ఈ లోపుల తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుమీద డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసారు. ఇంకా తుది తీర్పు రావాల్సి వుంది దాని మీద. ఆ తరువాత ఇది ఇంతటితో ఆగక పోవచ్చు కూడా. సుప్రీం కోర్ట్ రాజ్యంగ ధర్మాసనం దాకా ఈ సున్నిత అంశం పోయినా పోవచ్చు. ఈ నేపధ్యంలో ఇప్పుడేం జరగబోతుంది?

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటినుంచే, చట్ట సభల, న్యాయవ్యవస్థల మధ్య ఎవరిది ఆధిపత్యం అనే అంశం మీద వాడి-వేడి చర్చ నిరంతరం సాగుతూ వస్తున్నది. ఈ చర్చ మన భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా చట్టసభల సభ్యులు, న్యాయకోవిదులు, రాజకీయ వేత్తలు, స్వచ్చంద సంస్థల నాయకులు, ఇంకా పలువురు ఈ విషయంలో సుదీర్ఘంగా చర్చిస్తూ వస్తున్నారు. నిష్పాక్షిక, తటస్థ, సర్వసత్తాక, సార్వభౌమిక న్యాయవ్యవస్థ వుంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమని కొందరి వాదన. చట్టసభల ఆధిపత్యం కావాలనుకునేవారి వాదన మరొక రీతిగా వుంటుంది. మెజారిటీ ప్రజల తీర్పు ద్వారా ఎన్నికైన ప్రజా ప్రభుత్వ ప్రతినిధులున్న చట్టసభే అన్నిటికీ అధికం అని వారి భావన. న్యాయ వ్యవస్థకు చెందిన న్యాయమూర్తులను కార్యనిర్వాహక ప్రభుత్వం ఎంపిక చేయగా, చట్ట సభల సభ్యులను నేరుగా మెజారిటీ ప్రజలే ఎన్నుకుంటారు. ప్రజాబాహుళ్యానికి వారంతా అసలు-సిసలైన ప్రతినిధులు. 

           ప్రజాస్వామ్య మనుగడకు న్యాయ వ్యవస్థ ఎంత ముఖ్యమో చట్టసభల ప్రాముఖ్యత కూడా అంతే ముఖ్యం. ఆ రెండింటిలో ఏది కూడా ఇంకొకదానికంటే ఎక్కువకాదు. అలాంటప్పుడు చట్ట సభ తీసుకున్న ఒక నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ తప్పు పట్టా వచ్చా? ఎవరి పాత్ర వారు, వారి-వారి పరిధిలో అవధులు మించకుండా మాత్రమే పోషించాలని రాజ్యాంగం చెప్పినప్పుడు ఒకదానిమీద మరొకటి ఆధిపత్యం వహించ వచ్చా? ఒక వ్యవస్థ చేసినదానిని మరొక సమాంతర, సమాన స్థాయి వ్యవస్థ తప్పు పట్టవచ్చా? ఇదీ చర్చనీయాంశమే తప్పకుండా.

          న్యాయ వ్యవస్థకు చట్ట సభల తీర్పు-నిర్ణయం కాదనే అధికారం వుందా? ఉదాహరణకు, కాలానుగుణంగా, ప్రజల అవసరాల దృష్ట్యా వారి సామాజిక-ఆర్ధిక బాగోగులకు రాజ్యంగ పరిధికి లోబడి, ఒక విప్లవాత్మక నిర్ణయం చట్టసభలు తీసుకుంటే దాన్ని కోర్టులు కొట్టేయవచ్చా? అలా చేస్తే, మెజారిటీ ప్రజల మనోభావాలు దేబ్బతీసినట్లే కదా? ఇది ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారదా? మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక అయిన బ్రిటీష్ సాంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న దేశం. అక్కడ పార్లమెంట్ ఆధిపత్యం నిర్వివాదాంశం. ఎవరూ కాదనే నగ్న సత్యం. అక్కడ రాజ్యాంగం అంటే పార్లమెంట్ నిర్ణయాలే! దీనికి హేతుబద్ధమైన కారణం కూడా వుంది. ఉదాహరణగా తెలంగాణ శాసనసభ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిన అంశమే తీసుకుందాం. 119 శాసనసభ సభ్యులున్న చట్ట సభ ఏకగ్రీవంగా, కోట్లాది మంది ఓటర్ల మనోభిప్రాయంగా తీసుకున్న నిర్ణయం అది. దాన్ని ఒకే ఒక్క న్యాయమూర్తి తప్పు పట్టవచ్చా? శాసనసభ సభ్యత్వ రద్దు సహజ న్యాయ సూత్రాలకు భంగం అని తీర్పు చెప్పినప్పుడు, ఒకే ఒక్క న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు, అదీ మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఇచ్చిన తీర్పు, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం కాదా? లోతుగా ఆలోచించాల్సిన అంశం.

           చట్ట సభల ఆధిపత్యం అంటే ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను గౌరవించడమే. ఎందుకంటే చట్ట సభలు మెజారిటీ ప్రజలెన్నుకున్న పవిత్ర ఆలయాలు. చట్ట సభలు సమాజావసరాల దృష్ట్యా అది సబబని భావించిన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు.

          ఈ నేపధ్యంలో ఒక్క సారి గతంలోకి తొంగి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి. డిసెంబర్ 12, 2005, పదకొండు మంది ప్రధాన రాజకీయపార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులను ఒక స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా, “ఆజ్ తక్” అనే టీవీ చానల్, పార్లమెంట్ లో ప్రశ్న వేయడానికి వారు లంచం తీసుకున్నట్లు చూపించడం జరిగింది. పార్లమెంట్ దానికి వెంటనే స్పందించి, వారందరినీ సభ నుండి బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఉభయ సభలు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందర ప్రత్యేక విచారణ కమిటీలను నియమించాయి. దరిమిలా ఉభయ సభలు వారి సభ్యత్వాలు రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశాయి. శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 23, 2005 న సభల్లో ఈ విషయంపై తీర్మానం చేయడం జరిగింది.

సభ్యత్వం రద్దైన వారిలో ఒకరు లోక్ సభాపతి నిర్ణయాన్ని తప్పు పట్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్ట్ లోక్ సభాపతికి జనవరి 16, 2006 న నోటీసులిచ్చింది. అదనంగా, ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి పంపింది. అప్పటి లోక్ సభ సభాపతి సోమ్నాథ్ చట్టర్జీ జనవరి 20, 2006 న ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి సుప్రీం కోర్టు నోటీసుపై చర్చించారు. తప్పు చేసిన సభ్యులపై క్రమ శిక్షణ చర్య తీసుకునే అధికారం సభకు వుందని, అది సభ హక్కని, అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంతే కాకుండా, లోక్ సభ సభాపతికి సభ హక్కులు, సభ్యుల హక్కులు పరిరక్షించే విషయంలో సంపూర్ణ అధికారాలు వుంటాయనీ, వాటికి ఆయనే ధర్మకర్త అనీ, పదవి రీత్యా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన ఎవరికీ, ఏ న్యాయవ్యవస్థకూ జవాబుదారీ కాదనీ, అఖిల పక్షం నిర్ణయించింది. అప్పుడు సోమ్నాథ్ చట్టర్జీ అన్న మాటలు అక్షర సత్యాలు...”ప్రజాస్వామ్య మూలస్తంబాల విషయంలో, వాటి పరిధుల విషయంలో, రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. మన లక్ష్మణ రేఖ పరిధిల్లో మనముందాం” అని ఆయన చెప్పారు. ఏదేమైనా రాజ్యాంగంలోని 105, 122 అధికరణాలు చాలా స్పష్టంగా, చట్ట సభల విషయంలో న్యాయ వ్యవస్థకున్న హద్దుల గురించి వివరంగా పేర్కొన్నాయి.


ఈ నేపధ్యంలో సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఒకానొక తీర్పులో అది గతంలో చేసిన తప్పును ప్రస్తావించి దాన్ని ఎలా సరిదిద్దుకున్నదో వివరిస్తుంది. దీనర్థం, అత్యున్నత న్యాయస్థానమే తప్పుచేసే పరిస్తితులుంటే, మరి మిగతా కోర్టులు అలా చేయకూడదని ఎలా చెప్పగలం? వివరాల్లోకి పోతే...

పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, తీర్పిచ్చిన 35 ఏళ్లకు అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం కూడా వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం జనవరి 2011 మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా న్యాయమూర్తులు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రికరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. కాకపోతే ఎల్లవేళలా అది జరగడం లేదనేది వాస్తవం. అలాంటప్పుడు చట్టసభల నిర్ణయాన్ని ఒకే ఒక సింగిల్ బెంచ్ న్యాయమూర్తి రాగ ద్వేషాలకు అతీతంగా, ముమ్మూర్తులా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తప్పుపట్ట గలడని ఎలా అనగలం? అది సాధ్యమేనా?

ఏదేమైనా సుపరిపాలన సాగాలంటే, ప్రజాస్వామ్యం మనుగడ సాఫీగా వుండాలంటే, పదికాలాలపాటు వర్ధిల్లాలంటే, న్యాయవ్యవస్థ, చట్ట సభలు రాజ్యంగా బద్ధమైన అదుపు-అన్వయాలకు లోబడి పరస్పర సహకారంతో పనిచేయాలేకాని, ఒకరు చేసినదానికి మరొకరు తప్పుపట్టడం భావ్యం కాదు. 

1 comment:

  1. Your arguments are skewed and biased. Reason is obvious. How can you say that an impulsive harsh decision taken by assembly is collectively endorsed by crores of people. Sorry sir. Everyone should be accountable including legislature and judiciary.

    ReplyDelete