Sunday, May 27, 2018

శ్రీరాముడి దగ్గరకు సీతను తీసుకుపోతానన్న హనుమ ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి దగ్గరకు సీతను తీసుకుపోతానన్న హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (28-05-2018)
రామచంద్రమూర్తి తనను తప్ప మరేదీ తల్చుకోవడం లేదని ఆంజనేయుడు చెప్పడంతో, సీతకు అమృతం తాగినంత సంతోషం కలిగింది. అయితే ఆయన అమితంగా దుఃఖ పడుతున్నాడని కూడా చెప్పినందువల్ల విషం తాగినట్లనిపించింది. "విషం కలిపిన అమృతాన్నిచ్చినట్లున్నాయి నీమాటలు" అంటుంది సీతాదేవి హనుమంతుడితో.

"గొప్ప సంపద విషయంలోనూ, భయంకర దారిద్ర్య, దుఃఖ వ్యవహారంలోనూ, పురుషుడిని దైవం పూర్వజన్మ ఫలమనే తాటితో కదలకుండా ఈడుస్తాడు. భూమిమీద పుట్టిన వారికెవరికైనా స్వాతంత్ర్యం వున్నదా అంటే, లేదనే అనాలి. దైవాజ్ఞను అతిక్రమించి, స్వతంత్రించి, తన ఇష్ట ప్రకారం నడుచుకోగల ప్రాణి ఈలోకంలో లేదు. వానర శ్రేష్టా! ఇది నిజమని తెలిసికూడా, రాముడు, లక్ష్మణుడు, నేను దుఃఖ పడడానికి కారణం లేకపోయినా దుఃఖిస్తున్నాం. దుఃఖ పడడానికి మేం చేసిన తప్పేంటి? పోనీ, రాముడికొరకు నేను, నాకొరకు రాముడు, మేం చేసిన అపరాధాలకు దుఃఖిస్తున్నామనుకుంటే, మానడుమ, మాకొరకై, లక్ష్మణుడు ఎందుకు  దుఃఖించాలి? ఇదంతా దైవ చేష్ట కాక ఇంకేంటి?".

"ఓ మారుతీ! రామచంద్రమూర్తి సూర్య వంశానికే అలంకార ప్రాయమైన వాడే! ఆయన ఈ వ్యధా సముద్రంలో మునగకుండా, తీరానికి ఎప్పుడు చేరుతాడయ్యా? గాలివానకు గిర-గిరా తిరిగే నావలాగా నలిగిపోయాడా? నన్నెప్పుడు తీసుకునిపోతాడో? ఎప్పుడు రావణుడిని చంపుతాడో? ఎప్పుడొస్తాడయ్యా రామచంద్రుడు? ఎప్పుడు చీలుస్తాడయ్యా రాక్షసమూకను? వాళ్లనెప్పుడు తన బాణాలతో ఖండిస్తాడు? పునాదులతో సహా ఎప్పుడీలంకాపురి పాడైపోతుంది? ఎప్పుడు నన్నాయన చూస్తాడు? "

"ఆంజనేయా! రావణుడు నాకొక్క సంవత్సరం గడువిచ్చాడు. అది ముగిసేవరకే నేను బ్రతికుంటాను. ఆ సంవత్సరంలో పదోనెల జరుగుతున్నదిప్పుడు. ఇంకా రెండునెలలే గడువున్నది. అవికాగానే నా చావు సిద్దం. కాబట్టి రామచంద్రమూర్తిని ఈ లోపలే వచ్చేటట్లు తొందరపెట్టు. ఆ తర్వాత వచ్చినా ఫలితం వుండదు".(అది ఫాల్గుణ మాసమైనందున, పదినెలలు గడిచినవని చెప్పినందున, సీతాపహరణం జ్యేష్ట మాసంలో జరిగిందని అనుకోవాలి).  


"ఈలోపల సద్బుధ్ధి కలిగి రావణుడు నన్ను రాముడికి అర్పించే అవకాశం వుందనుకుంటున్నావేమో! వాడికట్టి అభిప్రాయం లేనేలేదు. వాడితమ్ముడు విభీషణుడనేవాడు, సీతను రాముడికిమ్మని ఎన్నోసార్లు, ఎన్నోరీతులుగా బోదించాడు. మూర్ఖుడైన రావణుడు వినలేదు. చావు సమీపిస్తుంటే, దురభిమానం కళ్లు కనిపించకుండా చేస్తుంటే, వాడెందుకు వింటాడు? ఈవిషయం నాకెట్లా తెలుసంటే: విభీషణుడి భార్య, సరమ, భర్తనడిగి, కూతురైన, అనలతో నాకు కబురు చేసింది. నాపతి నన్ను స్వీకరించడంట సత్యం. నా అంతరాత్మ శుధ్ధమై, శుభగుణములు కలదై, నాకీ విషయాన్ని చెప్తోంది. (విభీషణుడు సకుటుంబంగా సీతా పక్షపాతని దీన్ని బట్టి తెలుస్తున్నది. అందుకే శ్రీరాముడు విభీషణుడిని అనుగ్రహించాడు) 

"హనుమంతా! లోకోత్తర కార్యం చేయడం, దానిక్కావాల్సిన ఉత్సాహం, సాధించేందుకు అవసరమైన మహాబలామ్, ఆపని చేసేటప్పుడు కామ, క్రోధాలకు వశం కాకుండా వుండడం, తన దివ్య మహిమను ప్రకాశింప చేయడం, కార్యం చేసేందుకు తోడ్పడ్డ వారిపై కృతజ్ఞతాభావం చూపడం, అనే స్థిరమైన గుణాలన్నీ ఒక్క రామచంద్రుడిలోనే వున్నాయి. ఈ కల్యాణ గుణాలన్నీ ఆయనలో పరిపూర్ణంగా, శాశ్వతంగా వున్నాయి. అట్టివాడు నావిషయంలో పౌరుషంగా వుండడా?"

"ఆంజనేయా! రాముడు రాలేదు, రావణుడిని చంపలేదు, నన్ను తీసుకుని పోలేదు, అని నిష్టూరమాడానంటావేమో! ఒంటరిగాడు, ఆయనేంచేయగలడంటావేమో! జనస్థానంలో, తమ్ముడు కూడా తోడులేకుండా, పధ్నాలుగువేల రాక్షసులను తన భుజ బలంతో అవలీలగా చంపలేదా? అలాంటివాడు, ఇక్కడకు వచ్చాడనగానే, రాక్షసులు భయపడిపోరా? ఆయన శక్తి తెలియక నేను దూషించలేదు. మానధనుడైన ఆయన్ను ఈకష్టాలేవీ కలతపెట్టవు. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుని మానం కాపాడుకోగలడు. సూర్యుడికి తన కిరణాలతో నీటిని ఎండబెట్టినట్లే, రాముడికి రాక్షసులను చంపడం కష్టమా?" అంటుంది సీత. ఇలా కళ్లనిండా నీళ్లు వుంచుకుని మాట్లాడుతున్న సీతాదేవిని చూసి హనుమంతుడు శోకించవద్దని ప్రార్ధిస్తూ, ఇలా అన్నాడు.

"నామాటలు విన్న శ్రీరాముడు కోతులు, భల్లూకాలున్న సేనతో, వెంటనే ఇక్కడకు వస్తాడు. అంతవరకు దుఃఖమెట్లా ఆపుకోవాలంటే, దానికో మార్గముంది. నా వీపుపైనెక్కు...రామచంద్రమూర్తి వున్న చోటుకి నిన్ను తీసుకుని పోతాను. నేను దూతను. నీశీలానికి ఏ హానీలేదు. నిన్ను మోయగలనా అంటావేమో! నిన్నేకాదు  ఈ లంకను, రావణుడిని కూడా మోసుకునిపోగలిగే సమర్ధుడను. అగ్నిహోత్రుడు హోమం చేయబడ్డ హవ్యాన్ని ఇంద్రుడికి చేర్చినట్లు, నిన్ను శ్రీరాముడి దగ్గరకు ఇప్పుడే చేరుస్తాను (ఈ ఉపమానం "స్పర్శదోశశంక"ను తీసేస్తున్నది. ఆంజనేయుడి శుచిత్వాన్నీ తెలియచేస్తున్నది). తల్లీ పూర్వం రాక్షసులను చంపే ప్రయత్నం విష్ణుమూర్తి చేసినట్లే, నీమగడు, తమ్ముడితో కూడి రావణాదులను చంపే ప్రయత్నాన్ని నీకళ్లతో నువ్వే చూడగలవు. నావీపుపైకెక్కు.....నామాట నమ్ము!"

"నిన్ను చూడాలనుకుంటున్న బలశాలి శ్రీరాముడు పర్వత శిఖరం మీదున్నాడు. ఆయన్ను నువ్వు చూడొచ్చు. నామాటలను కొట్టిపరేయకు. రోహిణీ, చంద్రుల కలయికలాగా, నిన్ను, నీమగడితో కలుపుతాను. ఆకాశంలో సూర్యచంద్రులతో ముచ్చటిస్తూ, సముద్రాన్ని, ఆకాశాన్ని అవలీలగా నావీపుమీద కూర్చొని దాటు. రాముడివద్దకు పోయేంతవరకూ నిన్ను దించను. రాక్షసులు మనవెంటపడి పోనీయరేమో అన్న అనుమానం వద్దు. నిన్ను నేను తీసుకుని పోతుంటే, నా వెంట ఈ రాక్షసులలో ఒక్కడైనా రాలేడు. నేనెట్లా ఆకాశమార్గంలో వచ్చానో, అట్లానే, నిన్నూ ఆకాశమార్గంలోనే తీసుకునిపోతాను. సందేహం వదులుకో" అన్న ఆంజనేయుడి మాటలకు, భక్తికి, సంతోషించిన సీత, ఆయన మాటలకు ఆశ్చర్యపోయి ఇలా జవాబిస్తుంది.

No comments:

Post a Comment