Monday, May 28, 2018

పెళ్ళైన తరువాత మళ్ళీ చదువు...నాగ్ పూర్ లో రెండేళ్ళు.....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
పెళ్ళైన తరువాత మళ్ళీ చదువు...నాగ్ పూర్ లో రెండేళ్ళు
వనం జ్వాలా నరసింహారావు
         ఏప్రియల్ 1969 లో పెళ్ళైన తరువాత అప్పటికే డిగ్రీ చేతికొచ్చిన నాకు పీజీ చేయాలన్న కోరిక కలిగింది. హైదరాబాద్ లో డిగ్రీ చదువు పూర్తిచేసిన తరువాత సుమారు మూడు సంవత్సరాలు గ్రామీణ వాతావరణంలో, చుట్టుపక్క గ్రామాల్లోని కమ్యూనిస్ట్ స్నేహితుల సాహచర్యంలో, వ్యవసాయమే ప్రవృత్తిగా కాల గడిపిన నాకు మళ్ళీ చదువుకోవాలన్న కోరిక కలగడానికి ప్రధాన కారణం, మా ఆవిడవైపు వారంతా ఉన్నత చదువులు చదువుతూ వుండడమే. బహుశా అలా అందరితో సమానంగా వుంటే మంచిదేమో అని నాకు అనిపించడం  కూడా కావచ్చు. వెంటనే పై చదువులకోసం ఏం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించాను.

         1969 సంవత్సరంలో మొట్టమొదటి తెలంగాణా ఏర్పాటు ఉద్యమం స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సారధ్యంలో ఉధృతంగా సాగుతున్నందున తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయాలంలో బోధనా జరగడం లేదు. దాదాపు మూసివేతకు గురయ్యాయి. ఎలాగైనా చదువు కొనసాగించాలన్న కోరికతో నాగ్ పూర్ ప్రయాణమై పోయాను. మొదటి విడత నేను నాగ్ పూర్ వెళ్ళినప్పుడు నా వెంట మా ఆవిడ పక్షాన బంధువైన ఆమె సోదరుడు మనోహర్ రావు (అప్పట్లో వరంగల్ లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు) కూడా వచ్చాడు. అక్కడికి వెళ్లి వివిధ కోర్సుల గురించి విచారణ చేసి వచ్చాం. రెండో విడత వెళ్ళినప్పుడు మా పిన్ని కొడుకు రమణారావు నా వెంట వున్నాడు. నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (లెక్కలు) కోర్సుకు దరఖాస్తు పెట్టుకుని, రెండు రోజులుండి సీటు సంపాదించుకుని వచ్చాను.

         తరగతులు ప్రారంభం కాగానే నాగ్ పూర్ కు వెళ్లాను. తాత్కాలికంగా అక్కడ చదువుతున్న సీనియర్ల దగ్గర మకాం పెట్టాను. మొదటిరోజు ఎమ్మెస్సీ క్లాసుకు హాజరై పాఠ్యాంశాలు వింటుంటే పూర్తిగా మతిపోయింది. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నేను ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా బీఎస్సేలో చదువుకున్న లెక్కలకు, అక్కడ నాగ్ పూర్ ఎమ్మెస్సీ లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కల సబ్జెక్టుతో పీజీ చేయలేననే నిర్ధారణకు వచ్చాను. కాని ఎలాగైనా పీజీ చేయాలన్న కోరికున్న నాకు ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా నాలాగే ఆలోచిస్తున్న సహాధ్యాయి వడ్డీ జీవ రత్నం అనే తెలుగు స్నేహితుడు (కొత్తగా అయ్యాడు ఆరోజునే) ఒక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం తక్షణమే బయల్దేరి ఆనతి దూరంలో వున్న విశ్వవిద్యాలయం గ్రంథాలయ భవనానికి వెళ్లాం. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెసర్ మూర్తి గారిని కలిసాం. మా అభ్యర్ధన మేరకు మా ఇద్దరికీ ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో సీట్ ఇప్పించాడు. ఆ విధంగా సైన్స్ లో డిగ్రీ చేసిన నేను, హ్యుమానిటీస్ కు మారాను. అదో కొత్త అనుభవం.

         నార్త్ అంబజారీ రోడ్డులోని యూనివర్సిటీ లైబ్రరీ భవనంలోని రెండో అంతస్తులో మా క్లాసులు జరిగేవి. ఉదయమంతా ఖాళీ. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు-ఆరు గంటల వరకు సాగేవి తరగతులు. గోకుల్ పేట్ లో ఒక గది అద్దెకు తీసుకుని మరొకరితో కలిసి వుండేవాడిని. మొదటి సంవత్సరం ఎంకాం చదువుతున్న నందిరాజు వరప్రసాద్, రెండవ సంవత్సరం మా క్లాస్ మేట్ కేరళకు చెందిన ఎబెనజర్ నా రూమ్మేట్స్. సమీపంలో వుండే రెడ్డి మెస్ లో కాని, అయ్యర్ మెస్ లో కాని భోజనం. నాన్న నెలకు రెండొందళ రూపాయలు పంపేవారు. మంచిగా సరిపోయేవి. రెండు కారణాల వల్ల నాగ్ పూర్ లో చదువుతున్న రోజుల్లో ఎక్కువ సమయం అక్కడుండ లేకపోయేవాడిని. ఒకటి ఇంకా మా గ్రామ రాజకీయాల వాసన వదలకపోవడం అయితే, రెండోది కొత్తగా పెళ్ళైన వాళ్లందరిలాగే నాకూ ఎప్పుడూ ఖమ్మం పోవాలనిపించడం. మొత్తం మీద నాగ్ పూర్ రెండేళ్ళ చదువులో నేనక్కడుంది ఐదారుమాసాలే. నాగ్ పూర్ లో వుంటున్నప్పుడు కూడా హోమ్ సిక్ వుండేది. అందుకే కాలేజీకి పొయ్యే సమయం తప్ప మిగతా సమయమంతా లైబ్రరీలో గడిపేవాడిని. ఆపాటికే కమ్యూనిజం వాసన తగిలినందువల్ల లైబ్రరీలో ఎక్కువగా కార్ల్ మార్క్స్ పుస్తకాలే చదివేవాడిని. ఆంగ్లంలో విజ్ఞాన సర్వస్వం ఒకటుంటుందని మొదటిసారి తెలుసుకున్నది ఆ లైబ్రరీలోనే.


         మొదటి సంవత్సరం మా క్లాస్ లో సుమారు 40 మందిదాకా విద్యార్థులుండేవారు. ఫైనల్ యియర్లో ఆ సంఖ్య పన్నెండుకు తగ్గింది. మిగతావాళ్ళు పరీక్ష తప్పారు. తెలుగు వారైన వైకే మోహన్ రావు, ఉమాశంకర్, జీవరత్నం, పీవీఎస్సార్ దాస్ లతో పాటు నాకు గుర్తున్న మరో స్నేహితుడి పేరు అరుణ్ ఉపాధ్యాయ్. అతడు నాగ్ పూర్ నివాసి. ప్రముఖ రాజకీయ నాయకుడు, ముగ్గురు ప్రధాన మంత్రుల దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎన్కేపీ సాల్వే కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య అరుణ కూడా మా క్లాస్మేటే. మేమంతా ఎప్పుడూ కలిసి-మెలిసి వుండేవాళ్ళం. అరుణ్ ఇప్పటికీ కాంటాక్టులో వున్నాడు. ఇతర స్నేహితుల పేర్లు కొన్ని గుర్తున్నాయి. ఉమాశంకర్, పీవీఎస్సార్ దాస్ చనిపోయారు. జీవరత్నం ఎక్కడున్నాడో తెలియదు. వైకే మోహన్ రావు వ్యాపారంలో ఆరితేరి ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నాడు. రూమ్మేట్ గా వుండే వరప్రసాద్ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఎబెనజర్ ఏమయ్యాడో తెలియదు. మా క్లాస్ అమ్మాయిలు పాధ్యా, లోండే, జాలీ, భారతీ భర్వాడా కూడా మాతో సరదాగా వుండేవారు.

         మాకు ప్రోఫెసర్లుగా వీవీ మూర్తి, ఎన్జీఎస్ కిని, దేశ్పాండే, దవే, కులకర్ణి తదితరులుండేవారు. కిని పొలిటికల్ సోషాలజీ చెప్పేవారు. మూర్తి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బోధించేవారు. దేశ్పాండే స్థానిక స్వపరిపాలన చెప్పేవారు. ఈ ముగ్గురూ ఇప్పటికీ గుర్తుండడానికి కారణం వారు మాకు పాఠాలు బోధించిన తీరు. ముఖ్యంగా మూర్తి గారు, కిని గారు. ఒకరిని మించి ఒకరు అన్నట్లు వుండేవారిద్దరూ. నేను అస్తమానం కమ్యూనిస్ట్ కోణంలో క్లాసులో లెక్చరర్లతో వాదన వేసుకునేవాడిని. చివరకోకనాడు కిని నన్ను తన రూమ్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. కాకపొతే ఆయన సబ్జెక్టులోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చేవి.

         మూర్తి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ లో ఏనాడూ పాఠ్యాంశం బోధించలేదు. క్లాసుకు వస్తూనే ఆ రోజు కరెంట్ అఫైర్స్ ప్రస్తావించేవారు. ఆ అంశాన్ని బోర్డు మీద రాసి చర్చ మొదలెట్టేవాడు. వర్తమాన రాజకీయాలు, సామాజిక పరిణామాలు, ఇలా అనేకమైన ఆసక్తికర అంశాలను చర్చించేవాడు. ఇందిరాగాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఎన్జీఎస్ కినికి ఆమె అంటే విపరీతమైన కోపం. వీరిద్దరూ పోటా-పోటీగా వర్తమాన రాజీయాలను అత్యంత ఆసక్తికరంగా చెప్పేవారు-చర్చించేవారు. కిని వస్త్రధారణ చాలా సాదా-సీదాగా వుండేది. వీలున్నప్పుడల్లా బీడీలు తాగేవాడు. మేం ఎంఏ చదువుతున్న తొలినాళ్ళలో ఇందిరాగాంధీ సిండికేట్ నాయకులను ఎదిరించి, తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వరాహగిరి వెంకటగిరిని బలపర్చి, అంతరాత్మ ప్రబోధం అనే నినాదాన్ని లేవనెత్తింది. అలనాటి ఆవర్తమాన రాజకీయాలు అత్యంత ఆసక్తిగా తరగతిలో చర్చించేవాళ్ళం.

         “హోంసిక్” తొ సతమతమయ్యే నాకు ఉరట కలిగించేవి....స్నేహితులతో కాలక్షేపం, లైబ్రరీలో కాలం గడపడం, అడపా-దడపా బీరు తాగడం, చీట్లపేక ఆడడం, వరుసకు బంధువైన తుర్లపాటి సాంబశివరావు (ఆయన నాగ్ పూర్ లో అదే రోజుల్లో ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చదువుతుండే వాడు) తో ముచ్చటించడం, అదే పనిగా క్రమం తప్పకుండా మా శ్రీమతికి ఉత్తరాలు రాయడం, జవాబు కోసం ఎదురుచూడడం.

         ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు యూనివర్సిటీ ఎన్నికలు జరిగాయి. అక్కడ పధ్ధతి ప్రకారం మొదలు యూనివర్సిటీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరంతా కలిసి, వీళ్ళలో ఒకరిని యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. మేమంతా కలిసి మా క్లాస్మేట్ ఉమాశంకర్ ను ఒక అభ్యర్థిగా నిలబెట్టాం. కాకపోతే ఆయన ప్రత్యర్థిలలో ఒకరు యూనివర్సిటీ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్న వ్యక్తి. అతడు అలనాటి మహారాష్ట్ర ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, శివసేన బాల థాకరేను ఎప్పుడూ విమర్శించే చోబే సోదరుడు. పోటీ రసవత్తరంగా సాగి, ఈ ఇద్దరూ ఓడిపోయి మూడో వ్యక్తీ గెలిచాడు. తక్షణమే మా మీదికి దాడికి దిగారు చోబే సోదరుడి అనుయాయులు. మొత్తం మీద ఎదో విధంగా ఆ కష్టం నుండి బయట పడ్డాం. ఆ తరువాత మేమమతా స్నేహితులమయ్యాం.  

మొత్తం మీద ఎంఏ రెండేళ్ళ చదువు పూర్తి చేసుకున్నాను. చదువు పూర్తయిన తరువాత నాకొక టెస్ట్ మోనియల్ కావాలని మూర్తిగారిని అడిగాను. ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఇప్పటికీ అది నాదగ్గర భద్ర పర్చుకున్నాను. “నియమ నిబంధనలను పాటించడం కన్నా తనకు అప్పచెప్పిన, తాను స్వీకరించిన పనిని పూర్తి చేయడం జ్వాలా నరసింహారావు ప్రత్యేకత” అని ఆ సర్టిఫికేట్ సారాంశం.

ఎప్పటిలాగే ఎంఏ థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఖమ్మంలో ఉద్యోగాన్వేషణ మొదలెట్టాను.

No comments:

Post a Comment