Sunday, November 24, 2024

దేవహూతి-కర్దములకు కపిలుడుగా జన్మించిన విష్ణువు ... శ్రీ మహాభాగవత కథ-12 : వనం జ్వాలా నరసింహారావు

 దేవహూతి-కర్దములకు కపిలుడుగా జన్మించిన విష్ణువు 

శ్రీ మహాభాగవత కథ-12

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-11-2024) 

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

స్వాయంభవ మనువు తన కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇచ్చి వివాహం చేసి తన రాజ్యానికి వెళ్లిపోయిన తరువాత, దేవహూతి, పతిభక్తితో అనునిత్యం భర్తకు సేవచేయ సాగింది. ఆమె పతిభక్తికి, సేవకు మెచ్చి ఆమెకు అంతులేని భోగాలు కలుగుతాయనీ, ఆమెకు దివ్యదృష్టిని కూడా ఇస్తున్నాననీ కర్దముడు చెప్పాడామెకు. ఆ దివ్యదృష్టి వల్ల ఆమెకు సర్వం కనిపిస్తుందన్నాడు. అయితే, సంతానం కావాలనుకున్న ఆమె, గతంలో ఆయన అన్న మాటలను గుర్తు చేసింది. సంతానం కలిగేటంత వరకు శరీర సంగమం కలిగి ఉంటానని కర్దముడు చెప్పాడనీ, కాబట్టి తనను అనుగ్రహించి రతిరహస్యాన్ని చెప్పే కామశాస్త్రాన్ని నేర్పమనీ కోరింది. అప్పుడాయన ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. దానిలో అందమైన గదులు, సన్నని వస్త్రాలు, పట్టు చీరెలు, పట్టె మంచాలు....ఇలా ఎన్నెన్నో సకల భోగ్యాలకు అనుకూలమైనవి ఉన్నాయి. సరోవర జలాలలో స్నానం చేసి విమానాన్ని ఎక్కమన్నాడు.

ఆమె స్నానికి సరోవరంలోకి దిగగానే, అందులోంచి వేలాది కన్యకామణులు ఆమె చెంతకు చేరి, నలుగుపెట్టి స్నానం చేయించారు. అలంకరించారు. కర్దముడు స్నానంచేసి కూచున్న దేవహూతిని చూసి మురిసిపోయాడు. ఇద్దరూ విమానం ఎక్కి మేరుపర్వత గుహ దగ్గరకు చేరి విహరించారు. ఆ తరువాత భూమండలమంతా వాయువేగంతో చుట్టారు. కర్దముడు భార్యకు ధరామండలం అంతా చూపించి, తిరిగి వాళ్ళుండే చోటుకు తీసుకువచ్చాడు. భార్య మనస్సు అర్థం చేసుకుని శృంగారంలో మునిగి తేలాడు ఆమెతో. అలా నూరు సంవత్సరాలు ఒక ముహూర్తంలాగా గడిపారు. అలా గడుపుతూ కర్దముడు ఒకనాడు, తొమ్మిది విధాలైన దేహాలను ధరించి, మృదువుగా తన వీర్యాన్ని తన భార్య గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు. ఆ కారణంగా దేవహూతి తొమ్మిదిమంది కూతుళ్లను కన్నది. అనంతరం సన్న్యసించడానికి సిద్ధపడుతున్న భర్తను చూసి, కుమార్తెల వివాహం జరిగినదాకా ఆగమనీ, కొడుకును కూడా ప్రసాదించి కటాక్షించమనీ వేడుకుంది దేవహూతి. కర్దముడికి శ్రీహరి తనకు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. శ్రీహరి ఆమె గర్భంలో జన్మిస్తాడని, విచారించవద్దనీ, భగవంతుడిని ధ్యానించమనీ చెప్పాడు.

కర్దముడి మాటలకు సంతోషించిన దేవహూతి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కొన్ని సంవత్సరాలు గడిపింది. అప్పుడు హరి ఒకనాడు కర్దముడి తేజస్సు ధరించి, జమ్మిచెట్టు తొర్రలో నుండి వచ్చిన అగ్నిలాగా దేవహూతి గర్భంలో జన్మించాడు. ఆ సమయంలో దేవహూతికి తత్త్వ జ్ఞానాన్ని బోధించడం కోసం, గర్భస్త నారాయణుడిని దర్శించడం కోసం, బ్రహ్మ వచ్చాడు. కర్దముడి, దేవహూతి జన్మలు సాఫల్యమైనాయని అన్నాడు బ్రహ్మ. వారి కుమార్తెలను శ్రేష్టులైన మునులకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. అప్పుడు అనేక రకాలైన ప్రజా సృష్టి జరుగుతుంది అని చెప్పాడు. దేవహూతి గర్భంలో ఉన్న శ్రీమన్నారాయణుడు వారికి తత్త్వబోధ చేస్తాడని కూడా చెప్పాడు. అతడు కపిలుడు అనే పేరుతో విరాజిల్లుతాడని అన్నాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడు.

బ్రహ్మ ఆజ్ఞానుసారం కర్దముడు తన కుమార్తెలకు పెళ్లి చేశాడు. కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసుడికి, హవిర్భువును పులస్త్యుడికి, గతిని పులహుడికి, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్టుడికి, శాంతిని అధర్వుడికి ఇచ్చాడు. 

కర్దముడు, భగవంతుడైన శ్రీహరి దేవహూతికి కపిలుడుగా జన్మించాడన్న విషయం గుర్తుకు తెచ్చుకుని ఆయన్ను స్తుతించాడు పలువిధాలుగా. కర్దముడి మాటలు విన్న భగవంతుడైన కపిలుడు, తాను కేవలం ముని వేషం ధరించడం కోసం పుట్టలేదనీ, మహాత్ములైన మునులకు భగవత్సంబంధమైన తత్త్వజ్ఞానాన్ని బోధించడం కొరకు మాత్రమే ఈ దేహాన్ని ధరించానని అన్నాడు. మోహాన్ని విడిచి, మోక్షం కోసం యోగామార్గాన్ని అనుసరించమని కర్దముడికి చెప్పాడు కపిలుడు. భగవంతుడు చెప్పినట్లే ఆయన చేసి, భక్తియోగంలో భాగవతులు పొందే స్థానాన్ని పొందాడు. 

కర్దముడు అరణ్యాలకు పోయిన తరువాత దేవహూతి కపిల మహర్షిని చూసి తనకు మోహాంధకారం నుండి బయటపడే ఉపాయం చెప్పమని అడిగింది. తల్లి వాక్యాలను విన్న కపిలుడు సమాధానంగా దేవహూతికి తత్త్వజ్ఞానం, భక్తియోగం తెలియ చేశాడు

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 


No comments:

Post a Comment